83. ఎనుబది మూడవ అధ్యాయము
కురుక్షేత్ర తీర్థాల మహాత్మ్యము.
పులస్త్య ఉవాచ
తతో గచ్ఛేత రాజేంద్ర కురుక్షేత్రమభిష్టుతమ్ ।
పాపేభ్యో యత్ర ముచ్యంతే దర్శనాత్ సర్వజంతవః ॥ 1
పులస్త్యుడిలా అన్నాడు.
అచటి నుండి ఋషులచే కీర్తింపబడే కురుక్షేత్రానికి వెళ్ళాలి. ఆ క్షేత్ర దర్శనమాత్రం చేతనే పాపాలన్నీ పటాపంచలవుతాయి. (1)
కురుక్షేత్రం గమిష్యామి కురుక్షేత్రే వసామ్యహమ్ ।
య ఏవం సతతం బ్రూయాత్ సర్వపాపైః ప్రముచ్యతే ॥ 2
కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ నివసిస్తాను అని సదా పలికితేనే చాలు పాపాలు తొలగిపోతాయి. (2)
పాంసవోఽపి కురుక్షేత్రే వాయునా సముదీరితాః ।
అపి దుష్కృతకర్మాణం నయంతి పరమాం గతిమ్ ॥ 3
గాలికి ఎగిరి అక్కడి ధూళి శరీరంపై పడితే దుష్టుడైనా ఉత్తమగతిని పొందుతాడు. (3)
దక్షిణేన సరస్వత్యా దృషద్వత్యుత్తరేణ చ ।
యే వసంతి కురుక్షేత్రే తే వసంతి త్రివిష్టపే ॥ 4
దక్షిణాన సరస్వతి, ఉత్తరాన దృషద్వతీనది గల కురుక్షేత్రంలో నివసించేవాడు స్వర్గంలో నివసించినట్లే. (4)
నారద ఉవాచ
తత్ర మాసం వసేద్ ధీరః సరస్వత్యాం యుధిష్ఠిర ।
యత్ర బ్రహ్మాదయో దేవాః ఋషయః సిద్ధచారణాః ॥ 5
గంధర్వాప్సరసో యక్షాః పన్నగాశ్చ మహీపతే ।
బ్రహ్మక్షేత్రం మహాపుణ్యమ్ అభిగచ్ఛంతి భారత ॥ 6
నారదుడు పలికాడు.
యుధిష్ఠిరా! ధీరుడు ఒక్కనెల అయినా సరస్వతీనదీ తీరాన గల కురుక్షేత్రంలో ఉండాలి. బ్రహ్మ, ఋషులు, గంధర్వులు, సిద్ధులు, చారణులు, మొదలగు వారందరూ ఆ బ్రహ్మక్షేత్రానికి వెళతారు. (5,6)
మనసాప్యభికామస్య కురుక్షేత్రం యుధిష్ఠిర ।
పాపాని విప్రణశ్యంతి బ్రహ్మలోకం చ గచ్ఛతి ॥ 7
యుధిష్ఠిరా! మనస్సులో అయినా కురుక్షేత్రం పోవాలి అనే కోరిక ఉంటే అతడు పాపాలు నశించి బ్రహ్మలోకానికి పోతాడు. (7)
గత్వా హి శ్రద్ధయా యుక్తః కురుక్షేత్రం కురూద్వహ ।
ఫలం ప్రాప్నోతి చ తదా రాజసూయాశ్వమేధయోః ॥ 8
కురుశ్రేష్ఠా! శ్రద్ధతో కురుక్షేత్రయాత్ర చేస్తే రాజసూయాశ్వమేధాల ఫలం లభిస్తుంది. (8)
తతో మచక్రుకం నామ ద్వారపాలం మహాబలమ్ ।
యక్షం సమభివాద్యైవ గోసహస్రఫలం లభేత్ ॥ 9
ద్వారపాలకుడుగ అక్కడ ఉన్న మచక్రుడనే యక్షునికి నమస్కరించే వేయిగోవుల దానఫలం దక్కుతుంది. (9)
తతో గచ్ఛేత ధర్మజ్ఞ విష్ణోః స్థానమనుత్తమమ్ ।
సతతం నామ రాజేంద్ర యత్ర సన్నిహితో హరిః ॥ 10
ధర్మజ్ఞా! ఆపైన విష్ణు నివాసమైన సతతక్షేత్రానికి పోవాలి. అక్కడ ఎల్లప్పుడూ హరి నివసిస్తాడు. (10)
తత్ర స్నాత్వా చ నత్వా చ త్రిలోకప్రభవం హరిమ్ ।
అశ్వమేధమవాప్నోతి విష్ణులోకం చ గచ్ఛతి ॥ 11
తతః పారిప్లవం గచ్ఛేత్ తీర్థం త్రైలోక్యవిశ్రుతమ్ ।
అగ్నిష్టోమాతిరాత్రాభ్యాం ఫలం ప్రాప్నోతి భారత ॥ 12
సతతక్షేత్రంలో స్నానం చేసి త్రిలోకభావనుడైన విష్ణునికి నమస్కరిస్తే అశ్వమేధ ఫలాన్ని, చివరకు విష్ణులోకాన్ని పొందుతాడు. భారతా! అక్కడినుండి త్రిలోక ప్రసిద్ధి పొందిన పారిప్లవ తీర్థాన్ని దర్శిస్తే అగ్నిష్టోమాతిరాత్ర ఫలం పొందుతాడు. (11,12)
పృథివీతీర్థమాసాద్య గోసహస్రఫలం లభేత్ ।
తతః శాలూకినీం గత్వా తీర్థసేవీ నరాధిప ॥ 13
దశాశ్వమేధే స్నాత్వా చ తదేవ ఫలమాప్నుయాత్ ।
సర్పదేవీం సమాసాద్య నాగానాం తీర్థముత్తమమ్ ॥ 14
అగ్నిష్టోమమవాప్నోతి నాగలోకం చ విందతి ।
తతో గచ్ఛేత ధర్మజ్ఞ ద్వారపాలం తరంతుకమ్ ॥ 15
తత్రోష్య రజనీమేకాం గోసహస్రఫలం లభేత్ ।
తతః పంచనదం గత్వా నియతో నియతాశనః ॥ 16
కోటితీర్థముపస్పృశ్య హయమేధఫలం లభేత్ ।
అశ్వినోస్తీర్థమాసాద్య రూపవానభిజాయతే ॥ 17
రాజా! పృథివీ తీర్థానికి చేరితే వేయిగోవుల దానఫలం లభిస్తుంది. తీర్థసేవనాభిలాష కలవాడు ఆ ప్రదేశం నుంచి శాలూకినీ తీర్థానికి పోయి దశాశ్వమేధ తీర్థాన స్నానం చేస్తే దశాశ్వమేధ ఫలాన్ని గ్రహిస్తాడు. నాగుల తీర్థం వెళ్ళి సర్పదేవిని సేవిస్తే అగ్నిష్టోమఫలాన్ని, సర్పలోకాన్ని పొంది సుఖిస్తాడు. అక్కడి నుంచి తరంతుకుడనే పేరుగల ద్వారపాలకుని చేరాలి. అక్కడ ఒకరాత్రి ఉంటే సహస్రగోదానఫలాన్ని అందుకొంటాడు. జితేంద్రియుడై నియతాహారంతో పంచనదతీర్థానికి పోయి కోటితీర్థాల్లో మునిగి అశ్వమేధఫలాన్ని పొందుతాడు. అశ్వినీ దేవతల తీర్థానికి చేరితే రూపవంతుడు అవుతాడు. (13-17)
తతో గచ్ఛేత ధర్మజ్ఞ వారాహం తీర్థముత్తమమ్ ।
విష్ణుర్వారాహరూపేణ పూర్వం యత్ర స్థితోఽభవత్ ॥ 18
తత్ర స్నాత్వా నరశ్రేష్ఠ అగ్నిష్టోమఫలం లభేత్ ।
ధర్మజ్ఞా! అటుపైన పూర్వం వరాహరూపంలో విష్ణువు ఉన్న వారాహ తీర్థానికి పోయి, స్నానం ఆచరిస్తే అగ్నిష్టోమఫలం పొంది, సుఖిస్తాడు. (18 1/2)
తతో జయంత్యాం రాజేంద్ర సోమతీర్థం సమావిశేత్ ॥ 19
స్నాత్వా ఫలమవాప్నోతి రాజసూయస్య మానవః ।
రాజేంద్రా! పిమ్మట జయంతిలోని సోమతీర్థానికి చేరుకోవాలి. అక్కడ స్నానం చేస్తే రాజసూయయాగం చేసిన ఫలం అందుకొంటాడు. (19 1/2)
ఏకహంసే నరః స్నాత్వా గోసహస్రఫలం లభేత్ ॥ 20
కృతశౌచం సమాసాద్య తీర్థసేవీ నరాధిప ।
పుండరీకమవాప్నోతి కృతశౌచో భవేచ్చ సః ॥ 21
ఏకహంసతీర్థంలో మునిగితే వేయిగోవుల దానఫలం పొందుతాడు. కృతశౌచతీర్థంలో మునిగిన యాత్రికుడు పుండరీక యాగఫలం దక్కి పరిశుద్ధుడు అవుతాడు. (20, 21)
తతో ముంజవటం నామ స్థాణోః స్థానం మహాత్మనః ।
ఉపోష్య రజనీమేకాం గాణపత్యమవాప్నుయాత్ ॥ 22
అక్కడి నుంచి స్థాణురూపశివ నివాసమైన ముంజవటతీర్థాన ఒక రాత్రి నివాసం ఉంటే గణపతిస్థానాన్ని చేరుకొంటాడు. (22)
తత్రైవ చ మహారాజ యక్షిణీం లోకవిశ్రుతామ్ ।
స్నాత్వాభిగమ్య రాజేంద్ర సర్వాన్ కామానవాప్నుయాత్ ॥ 23
రాజేంద్రా! ఆ స్థానంలో యక్షిణి అనే ప్రసిద్ధక్షేత్రం ఉంది. అక్కడకు చేరి స్నానం చేస్తే కోరికలన్నీ తీరుతాయి. (23)
కురుక్షేత్రస్య తద్ ద్వారం విశ్రుతం భరతర్షభ ।
ప్రదక్షిణముపావృత్య తీర్థసేవీ సమాహితః ॥ 24
సమ్మితం పుష్కరాణాం చ స్నాత్వార్చ్య పితృదేవతాః ।
జామదగ్న్యేన రామేణ కృతం తత్ సుమహాత్మనా ॥ 25
కృతకృత్యో భవేద్ రాజన్ అశ్వమేధం చ విందతి ।
భరతర్షభా! అది కురుక్షేత్రద్వారం అని ప్రసిద్ధి చెందింది. అక్కడ ప్రదక్షిణం చేసి, ఏకాగ్రచిత్తంతో పుష్కరతీర్థంతో తుల్యమైన ఆ తీర్థాన స్నానం చేసి ఋషులను, పితరులను అర్చించాలి. దీనివలన అశ్వమేధఫలాన్ని కృతకృత్యతను సాధించగలడు. జమదగ్నిపుత్రుడు పరశురాముడు ఈ తీర్థాన్ని నిర్మించాడు. రాజా! యక్షిణీ తీర్థంలో కృతకృత్యుడయితే అశ్వమేధఫలం లభిస్తుంది. (24,25 1/2)
తతో రామహ్రదాన్ గచ్ఛేత్ తీర్థసేవీ సమాహితః ॥ 26
తరువాత ఏకాగ్రమనస్కుడై పరశురామకుండాలకు పోవాలి. (26)
తత్ర రామేణ రాజేంద్ర తరసా దీప్తతేజసా ।
క్షత్రముత్సాద్య వీరేణ హ్రదాః పంచ నివేశితాః ॥ 27
రాజేంద్రా! తేజోవంతుడైన పరశురాముడు క్షత్రియ సముదాయాన్ని చంపి, అయిదుకుండాలను కల్పించాడు. (27)
పూరయిత్వా నరవ్యాఘ్ర రుధిరేణేతి విశ్రుతమ్ ।
పితరస్తర్పితాః సర్వే తథైవ ప్రపితామహాః ॥ 28
నరశ్రేష్ఠా! ఆ కుండాలను అతడు క్షత్రియ రక్తంతో నింపి పితృప్రపితామహులకు రక్తతర్పణం చేశాడని వినికిడి. (28)
తతస్తే పితరః ప్రీతా రామమూచుర్నరాధిప ।
ఆ పనికి పొంగిన పితృదేవతలు పరశురామునితో ఇలా పలికారు.
పితర ఊచుః
రామ రామ మహాభాగ ప్రీతాః స్మ తవ భార్గవ ॥ 29
అనయా పితృభక్త్యా చ విక్రమేణ చ తే విభో ।
వరం వృణీష్వ భద్రం తే కిమిచ్ఛసి మహాద్యుతే ॥ 30
రామా! పరశురామా! భృగునందనా! నీ పరాక్రమం, పితృభక్తి మమ్ములను ప్రసన్నులను చేశాయి. నీకు కోరిన వరం ఇస్తాము. నీకు మంగళం జరుగుగాక! (29,30)
ఏవముక్తః స రాజేంద్ర రామః ప్రహరతాం వరః ।
అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం పితౄన్ స గగనే స్థితాన్ ॥ 31
భవంతో యది మే ప్రీతాః యద్యనుగ్రాహ్యతా మయి ।
పితృప్రసాదమిచ్ఛేయం తప ఆప్యాయనం పునః ॥ 32
వారి పలుకులు విని యోధాగ్రేసరుడు పరశురాముడు అంజలి ఘటించి ఆకాశంలో నిలిచిన పితరులతో ఇలా అన్నాడు - మీరు నాపై ప్రసన్నులైతే మీ కృపాప్రసాదాన్ని కోరుతూ ఉన్నాను. నా తపస్సు కొనసాగునట్లు వరం ఇవ్వండి. (31,32)
యచ్చ రోషాభిభూతేన క్షత్రముత్సాదితం మయా ।
తతశ్చ పాపాన్ముచ్యేయం యుష్మాకం తేజసాప్యహమ్ ॥ 33
హ్రదాశ్చ తీర్థభూతా మే భవేయుర్భువి విశ్రుతాః ।
రోషంతో నాచే క్షత్రియులందరు చంపబడ్డారు. మీ తేజంతో ఆ పాపం నుంచి నన్ను విముక్తుని చేయండి. ఈ కుండాలను తీర్థాలుగా అనుగ్రహించండి. (33 1/2)
ఏతచ్ర్ఛుత్వా శుభం వాక్యం రామస్య పితరస్తదా ॥ 34
ప్రత్యూచుః పరమప్రీతాః రామం హర్షసమన్వితాః ।
తపస్తే వర్ధతాం భూయః పితృభక్త్యా విశేషతః ॥ 35
పరశురాముని శుభవచనాలు విన్న పితరులు ఆనందపరవశులై ప్రసన్నతతో ఇలా అన్నారు - చిరంజీవీ! నీతపస్సు మాపై గల పితృభక్తితో అధికం అవుతుంది. (34,35)
యచ్చ రోషాభిభూతేన క్షత్రముత్సాదితం త్వయా ।
తతశ్చ పాపాన్ముక్తస్త్వం పతితాస్తే స్వకర్మభిః ॥ 36
కోపంతో నీవు చేసిన క్షత్రియ సంహారం నుంచి విముక్తిని పొందుతావు. ఆ క్షత్రియులు వారి కర్మలచే నశించారు. (36)
హ్రదాశ్చ తవ తీర్థత్వం గమిష్యంతి న సంశయః ।
హ్రదేషు తేషు యః స్నాత్వా పితౄన్ సంతర్పయిష్యతి ॥ 37
పితరస్తస్య వై ప్రీతాః దాస్యంతి భువి దుర్లభమ్ ।
ఈప్సితం చ మనఃకామం స్వర్గలోకం చ శాశ్వతమ్ ॥ 38
నీచే నిర్మింపబడిన కుండాలు తీర్థాలు అవుతాయి. ఆ కుండాల్లో స్నానం చేసి పితృతర్పణం చేస్తే పితరులు ప్రసన్నులై భూమిపై దుర్లభాలైన కోరికలను తీరుస్తారు. మనోరథాన్ని, శాశ్వత స్వర్గలోకాన్ని ప్రదానం చేస్తారు. (37,38)
ఏవం దత్త్వా వరాన్ రాజన్ రామస్య పితరస్తదా ।
ఆమంత్ర్య భార్గవం ప్రీత్యా తత్రైవాంతర్హితాస్తతః ॥ 39
ఏవం రామహ్రదాః పుణ్యాః భార్గవస్య మహాత్మనః ।
స్నాత్వా హ్రదేషు రామస్య బ్రహ్మచారీ శుభవ్రతః ॥ 40
కామమభ్యర్చ్య రాజేంద్ర లభేద్ బహుసువర్ణకమ్ ।
వంశమూలకమాసాద్య తీర్థసేవీ కురూద్వహ ॥ 41
స్వవంశముద్ధరేద్ రాజన్ స్నాత్వా వై వంశమూలకే ।
కాయశోధనమాసాద్య తీర్థం భరతసత్తమ ॥ 42
శరీరశుద్ధిః స్నాతస్య తస్మింస్తీర్థే న సంశయః ।
శుద్ధదేహశ్చ సంయాతి శుభాన్ లోకాననుత్తమాన్ ॥ 43
ఈవిధంగా వరాలిచ్చి ప్రేమతో అతని అనుమతి పొంది అంతర్ధానం అయ్యారు. రాజేంద్రా! ఇలా రామహ్రదాల్లో స్నానం చేసి బ్రహ్మచారి, నియతవ్రతుడు అయి పరాశురాముని అర్చిస్తే సువర్ణరాశిని పొందుతాడు. పిమ్మట వంశమూలకతీర్థానికి చేరుకోవాలి. అక్కడ స్నానం చేస్తే వంశం తరిస్తుంది. కాయశోధన తీర్థంలో స్నానం చేస్తే శరీరం తప్పక శుద్ధి అవుతుంది. శరీరశుద్ధిని పొందిన మానవుడు శ్రేష్ఠాలు కళ్యాణమయాలు అయిన లోకాలను చేరతాడు. (39-43)
తతో గచ్ఛేత ధర్మజ్ఞ తీర్థం త్రైలోక్యంవిశ్రుతమ్ ।
లోకా యత్రోద్ధృతాః పూర్వం విష్ణునా ప్రభవిష్ణువా ॥ 44
లోకాద్ధారం సమాసాద్య తీర్థం త్రైలోక్యపూజితమ్ ।
స్నాత్వా తీర్థవరే రాజన్ లోకానుద్ధరతే స్వకాన్ ॥ 45
అలా ప్రయాణం చేస్తూ లోకోద్ధారతీర్థాన్ని చేరాలి. ధర్మజ్ఞా! అది ముల్లోకాలలో ప్రసిద్ధం అయింది. అక్కడ స్నానం చేసినవాడు తనవారందరినీ ఉద్ధరించగలడు. (44,45)
శ్రీతీర్థం చ సమాసాద్య స్నాత్వా నియతమానసః ।
అర్చయిత్వా పితౄన్ దేవాన్ విందతే శ్రియముత్తమామ్ ॥ 46
శ్రీ తీర్థంలో మునిగి జితేంద్రియుడై పితృదేవతలను, దేవతలను అర్చిస్తే సంపదను పొందగలడు. (46)
కపిలాతీర్థమాసాద్య బ్రహ్మచారీ సమాహితః ।
తత్ర స్నాత్వార్చయిత్వా చ పితౄన్ స్వాన్ దైవతాన్యపి ॥ 47
కపిలానాం సహస్రస్య ఫలం విందతి మానవః ।
కపిలాతీర్థాన స్నానం చేసి బ్రహ్మచారియై పితరులను, దేవతల్ని పూజిస్తే వేయికపిలగోవులను దానం చేసిన ఫలం వస్తుంది. (47)
సూర్యతీర్థం సమాసాద్య స్నాత్వా నియతమానసః ॥ 48
అర్చయిత్వా పితౄన్ దేవానుపవాసపరాయణః ।
అగ్నిష్టోమమవాప్నోతి సూర్యలోకం చ గచ్ఛతి ॥ 49
సూర్యతీర్థాన్ని చేరి ఏకాగ్రతతో పితృదేవతలను ఆరాధించి ఉపవాసం చేస్తే అగ్నిష్టోమయాగఫలాన్ని పొంది సూర్యలోకం చేరుతాడు. (48,49)
గవాం భవనమాసాద్య తీర్థసేవీ యథాక్రమమ్ ।
తత్రాభిషేకం కుర్వాణః గోసహస్రఫలం లభేత్ ॥ 50
పిమ్మట గోభవన తీర్థానికి పోయి అక్కడ స్నానం చేయాలి. అక్కడ అభిషేకం చేస్తే వేయిగోవులను దానం చేసిన ఫలం దక్కుతుంది. (50)
శంఖినీతీర్థమాసాద్య తీర్థసేవీ కురూద్వహ ।
దేవ్యాస్తీర్థే నరః స్నాత్వా లభతే రూపముత్తమమ్ ॥ 51
కురువంశశ్రేష్ఠా! యాత్రికుడు శంఖినీ తీర్థానికి చేరి అక్కడి దేవతీర్థంలో మునిగితే ఉత్తమసౌందర్యం వస్తుంది. (51)
తతో గచ్ఛేత రాజేంద్ర ద్వారపాలమరంతుకమ్ ।
తచ్చ తీర్థం సరస్వత్యాం యక్షేంద్రస్య మహాత్మనః ॥ 52
తత్ర స్నాత్వా నరో రాజన్ అగ్నిష్టోమఫలం లభేత్ ।
రాజా! సరస్వతీ నదిలోని అరంతుకమనే ద్వారపాల తీర్థానికి పోవాలి. యక్షరాజైన కుబేరుని రేవు అక్కడుంది. అక్కడ స్నానం చేస్తే అగ్నిష్టోమయాగఫలం కల్గుతుంది. (52)
తతో గచ్ఛేత రాజేంద్ర బ్రహ్మావర్తం నరోత్తమః ॥ 53
బ్రహ్మావర్తే నరః స్నాత్వా బ్రహ్మలోకమవాప్నుయాత్ ।
రాజేంద్రా! ఆ ప్రదేశం నుంచి బ్రహ్మవర్తం చేరాలి. అందు స్నానమాచరిస్తే మానవుడు బ్రహ్మలోకాన్ని చేరుతాడు. (53)
తతో గచ్ఛేత రాజేంద్ర సుతీర్థకమనుత్తమమ్ ॥ 54
తత్ర సన్నిహితా నిత్యం పితరో దైవతైః సహ ।
తత్రాభిషేకం కుర్వీత పితృదేవార్చనే రతః ॥ 55
అశ్వమేధమవాప్నోతి పితృలోకం చ గచ్ఛతి ।
ఆ స్థానం నుంచి సాటిలేని సుతీర్థాన్ని చూడాలి. ఆ ప్రదేశంలో పితరులు, దేవతలుఉ కలిసి ఉంటారు. పితృదేవపూజలో భాగంగా అక్కడ స్నానం చెయ్యాలి. దాని వలన అశ్వమేధఫలాన్ని, పిమ్మట పితృలోకాన్ని పొందుతాడు. (54,55)
తతోఽంబుమత్యాం ధర్మజ్ఞ సుతీర్థకమనుత్తమమ్ ॥ 56
అనంతరం శ్రేష్ఠమయిన అంబుమతీతీర్థాన్ని సేవించాలి. (56)
కాశీశ్వరస్య తీర్థేషు స్నాత్వా భరతసత్తమ ।
సర్వవ్యాధివినిర్ముక్తః బ్రహ్మలోకే మహీయతే ॥ 57
భరతశ్రేష్ఠా! కాశీశ్వర తీర్థాల్లో స్నానమాడితే, రోగాలు దూరమై బ్రహ్మలోకానికి పోతాడు. (57)
మాతృతీర్థం చ తత్రైవ యత్ర స్నాతస్య భారత ।
ప్రజా వివర్ధతే రాజన్ న తన్వీం శ్రియమశ్నుతే ॥ 58
అక్కడే మాతృతీర్థం ఉంది. అందుమునిగినవాని సంతానం వృద్ధి పొంది, తగ్గని సంపదను పొందుతాడు. (58)
తతః సీతవనం గచ్ఛేత్ నియతో నియతాశనః ।
తీర్థం తత్ర మహారాజ మహదన్యత్ర దుర్లభమ్ ॥ 59
తరువాత నియమంతో, మితాహారంతో సీతవనం అనే తీర్థానికి వెళ్లాలి. రాజా! అటువంటి మహత్తీర్థం ఇతరత్ర లభించదు. (59)
పునాతి గమనాదేవ దృష్టమేకం నరాధిప ।
కేశానభ్యుక్ష్య వై తస్మిన్ పూతో భవతి భారత ॥ 60
ఆ తీర్థాన్ని ఒక్కసారి చూసినా, మునిగి కేశప్రక్షాళనం చేసుకొన్నా పవిత్రుడు అవుతాడు. (60)
తీర్థం తత్ర మహారాజ శ్వావిల్లోమాపహం స్మృతమ్ ।
యత్ర విప్రా నరవ్యాఘ్ర విద్వాంసస్తీర్థతత్పరాః ॥ 61
ప్రీతిం గచ్ఛంతి పరమాం స్నాత్వా భరతసత్తమ ।
శ్వావిల్లోమాపనయనే తీర్థే భరతసత్తమ ॥ 62
ప్రాణాయామైర్నిర్హరంతి స్వలోమాని ద్విజోత్తమాః ।
వూతాత్మానశ్చ రాజేంద్ర ప్రయాంతి పరమాం గతిమ్ ॥ 63
మహారాజా! అక్కడే శ్వావిల్లోమాపహ తీర్థం ఉంది. తీర్థగాములు, విప్రులు, విద్వాంసులు అచట స్నానం చేసి సాటిలేని ఆనందాన్ని పొందుతారు. శ్వావిల్లోమపహతీర్థాన ప్రాణాయామాది యోగ ప్రక్రియలను పాటించి లో(రో)మాలు తొలగించుకొని పవిత్రులై ఉత్తమగతులను చేరుతారు. (61-63)
దశాశ్వమేధికం చైవ తస్మింస్తీర్థే మహీపతే ।
తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర గచ్ఛేత పరమాం గతిమ్ ॥ 64
ఆ ప్రదేశంలో దశాశ్వమేధిక తీర్థం ఉంది. ఆ తీర్థాన స్నానమాత్రంచే మానవుడు ఉత్తమగతులు పొందుతాడు. (64)
తతో గచ్ఛేత రాజేంద్ర మానుషం లోకవిశ్రుతమ్ ।
యత్ర కృష్ణమృగా రాజన్ వ్యాధేన శరపీడితాః ॥ 65
విగాహ్య తస్మిన్ సరసి మాణుషత్వముపాగతాః ।
తస్మింస్తీర్థే నరః స్నాత్వా బ్రహ్మచారీ సమాహితః ॥ 66
సర్వపాపవిశుద్ధాత్మా స్వర్గలోకే మహీయతే ।
రాజేంద్రా! అక్కడ నుండి లోకప్రసిద్దమైన మానుష తీర్థాన్ని చేరాలి, బోయవాని బాణాల దెబ్బలు తిన్న జింకలు ఆ సరస్సులో స్నానం చేసియే మానుష రూపాన్ని పొందాయి. బ్రహ్మచర్యంతో, ఏకాగ్రచిత్తంతో అక్కడ స్నానం ఆచరిస్తే పాపాలు తొలగి స్వర్గాన్ని చేరుకొంటాడు. (65,66)
మానుష్య తు పూర్వేణ క్రోశమాత్రే మహీపతే ।
ఆపగా నామ విఖ్యాతా నదీ సిద్ధనిషేవితా ।
శ్యామాకం భోజనే తత్ర యః ప్రయచ్ఛతి మానవః ॥ 68
దేవాన్ పితౄన్ సముద్దిశ్య తస్య ధర్మఫలం మహత్ ।
ఏకస్మిన్ భోజితే విప్రే కోటిర్భవతి భోజితా ॥ 69
రాజా! మానుష తీర్థానికి తూర్పున క్రోసుదూరాన ఆపగానది ఉంది. అది సిద్ధులచే సేవింపబడుతుంది. పితృదేవతలకు అచట శ్యామాక అన్నాన్ని అర్పిస్తే గొప్ప ధర్మఫలం కర్తను చేరుతుంది. అక్కడ ఒక్కబ్రాహ్మణునికి భోజనం పెట్టినా అది కోటిబ్రాహ్మణులకు అన్నదానం చెసినట్లు అవుతుంది. (67-69)
తత్ర స్నాత్వార్చయిత్వా చ పితౄన్ వై దైవతాని చ ।
ఉషిత్వా రజనీమేకామ్ అగ్నిష్టోమఫలం లభేత్ ॥ 70
ఆ నదిలో స్నానం చేసి పితరులనుఉ, దేవతలను, ఆరాధిస్తే అక్కడ ఒకరాత్రి నివసిస్తే అగ్నిష్టోమయాగాచరణ ఫలం పొందుతాడు. (70)
తతో గచ్ఛేత రాజేంద్ర బ్రహ్మణః స్థానముత్తమమ్ ।
బ్రహ్మోదుంబరమిత్యేవ ప్రకాశం భువి భారత ॥ 71
రాజేంద్రా! తరువాత బ్రహ్మనివాసస్థానానికి చేరాలి. అది బ్రహ్మోదుంబరమను పేర ప్రసిద్ధి చెందింది. (71)
తత్ర సప్తర్షికుండేషు స్నాతస్య నరపుంగవ ।
కేదారే చైవ రాజేంద్ర కపిలస్య మహాత్మనః ॥ 72
బ్రహ్మాణమధిగమ్యాథ శుచిః ప్రయతమానసః ।
సర్వపాపవిశుద్ధాత్మా బ్రహ్మలోకం ప్రపద్యతే ॥ 73
కపిష్ఠలస్య కేదారం సమాసాద్య సుదుర్లభమ్ ।
అంతర్ధానమవాప్నోతి తపసా దగ్ధకిల్బిషః ॥ 74
నరోత్తమా! అక్కడ సప్తర్షికుండం ఉంది. ఆ కుండాల్లోను కపిష్ఠల కేదార తీర్థంలోను మునిగితే గొప్ప పుణ్యరాశి వశం అవుతుంది. అచటి బ్రహ్మను దర్శిస్తే పాపాలు పోయి, బ్రహ్మలోకంలో స్థిరనివాసం ఉంటాడు. కపిష్టలుని కేదారంలో స్నానమాచరిస్తే పాపం పోయి అంతర్ధాన విద్య తెలుస్తుంది. (72-74)
తతో గచ్ఛేత రాజేంద్ర సరకం లోకవిశ్రుతమ్ ।
కృష్ణపక్షే చతుర్దశ్యామ్ అభిగమ్య వృషధ్వజమ్ ॥ 75
లభేత సర్వకామాన్ హి స్వర్గలోకం య గఛతి ।
రాజేంద్రా! ఆ ప్రదేశం నుంచి ప్రసిద్ధమైన సరక తీర్థానికి చేరాలి. అక్కడ కృష్ణపక్షచట్తుర్దశినాదు శివుని సేవిస్తే అన్ని కోరికలి తీరిన పిదప స్వర్గానికి చేరుతాడు. (75)
తిస్రః కోట్యస్తు తీర్థానాం సరకే కురునందన ॥ 76
ఆ సరక తీర్థంలో మూడుకోట్ల తీర్థాలు ఉన్నాయి. (76)
రుద్రకోట్యాం తథా కూపే హ్రదేషు చ మహీపతే ।
ఇలాస్పదం చ తత్రైవ తీర్థం భరతసత్తమ ॥ 77
తత్ర స్నాత్వార్చయిత్వా చ దైవతాని పితౄనథ ।
న దుర్గతిమవాప్నోతి వాజపేయం చ విందతి ॥ 78
రాజా! ఈ తీర్థాలు రుద్రకోటిలో, నూతిలో, కుండాల్లో కనిపిస్తాయి. అక్కడి ఇలాస్పదతీర్థంలో స్నానం చేసి దేవపితరులను ఆరాధిస్తే దుర్గతులు పోయి వాజపేయయాగఫలం లభిస్తుంది. (77,78)
కిందానే చ నరః స్నాత్వా కింజప్యే చ మహీపతే ।
అప్రమేయమవాప్నోతి దానం జప్యం చ భారత ॥ 79
ఆ స్థలంలో కిందానం, కింజప్యం అనే తీర్థాలు ఉన్నాయి. అక్కడ స్నానం చేస్తే, దాన తపస్సుల అంతులేని ఫలాన్ని పొందుతాడు. (79)
కలశ్యాం వార్యుపస్పృశ్య శ్రద్ధధానో జితేంద్రియః ।
అగ్నిష్టోమస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి మానవః ॥ 80
జితేంద్రియుడు అయి కలశతీర్థంలో స్నానం ఆచరిస్తే అగ్నిష్టోమఫలం దక్కుతుంది. (80)
సరకస్య తు పూర్వేణ నారదస్య మహాత్మనః ।
తీర్థం కురుకులశ్రేష్ఠ అంబాజన్మేతి విశ్రుతమ్ ॥ 81
కురువంశశ్రేష్ఠా! సరక తీర్థానికి తూర్పున నారద తీర్థం ఉంది. దానికి అంబాజన్మ అనిపేరు. (81)
తత్ర తీర్థే నరః స్నాత్వా ప్రాణానుత్సృజ్య భారత ।
నారదేనాభ్యనుజ్ఞాతః లోకాన్ ప్రాప్నోత్యనుత్తమాన్ ॥ 82
భారతా! ఆ తీర్థాన మునిగి మనుజుడు ప్రాణత్యాగంచేస్తే నారదుని ఆజ్ఞానుసారం ఉత్తమలోకాలను పొందుతాడు. (82)
శుక్లపక్షే దశమ్యాం చ పుండరీకం సమావిశేత్ ।
తత్ర స్నాత్వా నారో రాజన్ పుండరీకఫలం లభేత్ ॥ 83
రాజా! శుక్లపక్ష దశమినాడు పుండరీక తీర్థంలో ప్రవేశించాలి. అక్కడ స్నానం చేసినా నరుడు పుండరీక యాగఫలాన్ని అందుకొంటాడు. (83)
తతస్త్రివిష్టపం గచ్ఛేత్ త్రిషు లోకేషు విశ్రుతమ్ ।
తత్ర వైతరణీ పుణ్యా నదీ పాపప్రణాశినీ ॥ 84
తరువాత లోకప్రఖ్యాతి గల త్రివిష్టపతీర్థానికి చేరాలి. అక్కడ వైతరణి అనే పుణ్యనది ఉంది. (84)
తత్ర స్నాత్వార్చయిత్వా చ శూలపాణిం వృషధ్వజమ్ ।
సర్వపాపవిశుద్ధాత్మా గచ్ఛేత పరమాం గతిమ్ ॥ 85
అక్కడ స్నానం చేసి, శూలపాణి, వృషభధ్వజుడు అయిన శంకరుని ఆరాధిస్తే మానవుడు పాపదూరుడై ఉత్తమగతులను చేరుతాడు. (85)
తతో గచ్ఛేత రాజేంద్ర ఫలకీవనముత్తమమ్ ।
తత్ర దేవాః సదా రాజన్ ఫలకీవనమాశ్రితాః ॥ 86
తపశ్చరంతి విపులం బహువర్షసహస్రకమ్ ।
దృషద్వత్యాం నరః స్నాత్వా తర్పయిత్వా చ దేవతాః ॥ 87
అగ్నిష్టోమాతిరాత్రాభ్యాం ఫలం విందతి భారత ।
తీర్థే చ సర్వదేవానాం స్నాత్వా భరతసత్తమ ॥ 88
గోసహస్రస్య రాజేంద్ర ఫలం విందతి మానవః ।
పాణిఖాతే నరః స్నాత్వా తర్పయిత్వా చ దేవతాః ॥ 89
అగ్నిష్టోమాతిరాత్రాభ్యాం ఫలం విందతి భారత ।
రాజసూయమవాప్నోతి ఋషిలోకం చ విందతి ॥ 90
రాజేంద్రా! ఆ ప్రదేశం నుంచి ఫలకీవనానికి యాత్ర కొనసాగించాలి. దేవతలందరు ఎల్లప్పుడు ఆ వనాన్ని ఆశ్రయించి ఉంటారు. వేల సంవత్సరాలు వారక్కడ తపస్సు చేశారు. దృషద్వతీనదిలో స్నానం చేసి పితరులను, దేవతలను అర్చిస్తే అగ్నిష్టోమాతిరాత్రయాగాల ఫలం వస్తుంది. సర్వదేవతీర్థంలో మునిగి వేయుగోవుల దానఫలాన్ని పొందుతాడు. పాణిఖాతతీర్థంలో స్నానం చేసి దేవపితరులకు తర్పణాలు ఇస్తే ముందు అగ్నిష్టోమాతిరాత్రఫలాన్ని పొంది, చివర ఋషిలోకనివాసి అవుతాడు. (86-90)
తతో గచ్ఛేత రాజేంద్ర మిశ్రకం తీర్థముత్తమమ్ ।
తత్ర తీర్థాని రాజేంద్ర మిశ్రితాని మహాత్మనా ॥ 91
వ్యాసేన నృపశార్దూల ద్విజార్థమితి నః శ్రుతమ్ ।
సర్వతీర్థేషు స స్నాతి మిశ్రకే స్నాతి యో నరః ॥ 92
నరోత్తమా! అచటి నుండి మిశ్రకతీర్థానికి చేరాలి. తీర్థాలన్నీ కలియటం చేత మిశ్రకతీర్థం అంటారు. వ్యాసునిచే బ్రాహ్మణుల కొరకు ఈ పని చేయబడింది. ఈ తీర్థస్నానం అన్నితీర్థాల స్నానఫలం ఇస్తుంది. (91,92)
తతో వ్యాసవనం గచ్ఛేత్ నియతో నియతాశనః ।
మనోజవే నరః స్నాత్వా గోసహస్రఫలం లభేత్ ॥ 93
ఆ ప్రదేశం నుంచి వ్యాసవనం చేరి మితాహారియై మనోజవతీర్థంలో మునిగితే సహస్రగోదానఫలాన్ని పొందుతాడు. (93)
గత్వా మధువటీం చైవ దేవ్యాస్తీర్థే నరః శుచిః ।
తత్ర స్నాత్వార్చయిత్వా చ పితౄన్ దేవాంశ్చ పూరుషః ॥ 94
స దేవ్యా సమనుజ్ఞాతః గోసహస్రఫలం లభేత్ ।
మధువటికి పోయి, దేవతీర్థంలో శుద్ధుడై స్నానమాచరిస్తే పితరులను, దేవతలను సేవిస్తే దేవి అనుగ్రహంతో వేయిగోవుల దానఫలాన్ని పొందుతాడు. (94 1/2)
కౌశిక్యాః సంగమే యస్తు దృషద్వత్యాశ్చ భారత ॥ 95
స్నాతి వై నియతాహారః సర్వపాపైః ప్రముచ్యతే ।
కౌశికి, దృషద్వతీ నదుల సంగమంలో మునిగి మితాహారియైతే పాపాలన్నీ తొలగిపోతాయి. (95 1/2)
తతో వ్యాసస్థలీ నామ యత్ర వ్యాసేన ధీమతా ॥ 96
పుత్రశోకాభితప్తేన దేహత్యాగే కృతా మతిః ।
తతో దేవైస్తు రాజేంద్ర పునరుత్థాపితస్తదా ॥ 97
అభిగత్వా స్థలీం తస్య గోసహస్రఫలం లభేత్ ।
రాజేంద్రా! తరువాత వ్యాసస్థలికి పోవాలి. పుత్రశోకంతో శరీరాన్ని విడవాలని వ్యాసుడు భావిస్తే దేవతలు ఆయనను మరలా నిలబెట్టారు. అక్కడకు వెళ్ళడంతోనే వేయిగోవులను దానం చేసిన ఫలం మానవుడికి లభిస్తుంది. (96,97 1/2)
కిందత్తం కూపమాసాద్య తిలప్రస్థం ప్రదాయ చ ॥ 98
గచ్ఛేత పరమాం సిద్ధిమ్ ఋణైర్ముక్తః కురూద్వహ ।
వేదీతీర్థే నరః స్నాత్వా గోసహస్రఫలం లభేత్ ॥ 99
కురుశ్రేష్ఠా! కిందత్తం అనే నూతివద్దకు పోయి 16 పిడికిళ్ళు తిలలు దానం చేస్తే దేవ, పితృ, ఋషి ఋణాలను తీర్చినవాడు అవుతాడు. వేదీతీర్థంలో స్నానమాచరిమ్చి వేయిగోవుల దానఫలాన్ని వశపరచుకొంటాడు. (98,99)
అహశ్చ సుదినం చైవ ద్వే తీర్థే లోకవిశ్రుతే ।
తయోః స్నాత్వా నరవ్యాఘ్ర సూర్యలోకమవాప్నుయాత్ ॥ 100
నరశ్రేష్ఠా! అక్కడ లోకప్రసిద్ధి గల అహస్సు, సుదినం అనే రెండు తీర్థాలు ఉన్నాయి. ఆ రెంటిలో స్నానం చేస్తే సూర్యలోకాన్ని చేరుతాడు. (100)
మృగధూమం తతో గచ్ఛేత్ త్రిషు లోకేషు విశ్రుతమ్ ।
తత్రాభిషేకం కుర్వీత గంగాయాం నృపసత్తమ ॥ 101
రాజశ్రేష్ఠా! పిమ్మట మృగధూమతీర్థానికి వెళ్ళి అక్కడి గంగానదిలో స్నానం చెయ్యాలి. (101)
అర్చయిత్వా మహాదేవమ్ అశ్వమేధఫలం లభేత్ ।
దేవ్యాస్తీర్థే నరః స్నాత్వా గోసహసఫ్రలం లభేత్ ॥ 102
ఆ తీర్థంలో మహాదేవుని పూజిస్తే అశ్వమేధయాగఫలాన్ని పొందవచ్చు. దేవీతీర్థంలో స్నానం చేసిన నరుడు సహస్ర గోదాన ఫలితాన్ని పొందుతాడు. (102)
తతో వామనకం గచ్ఛేత్ త్రిషు లోకేషు విశ్రుతమ్ ।
తత్ర విష్ణుపదే స్నాత్వా అర్చయిత్వా చ వామనమ్ ॥ 103
సర్వపాపవిశుద్ధాత్మా విష్ణులోకం స గచ్ఛతి ।
కులంపునే నరః స్నాత్వా పునాతి స్వకులం తతః ॥ 104
పిమ్మట ప్రసిద్ధి గల వామనకతీర్థానికి చేరి, విష్ణుపద తీర్థంలో స్నానం చేసి, వామనుని అర్చిస్తే పాపముక్తుడై విష్ణులోకం చేరుకొంటాడు. కులంపునతీర్థంలో స్నానమాడి వంశాన్ని ఉద్ధరించుతాడు. (103,104)
పవనస్య హ్రదే స్నాత్వా మరుతాం తీర్థముత్తమమ్ ।
తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర విష్ణులోకే మహీయతే ॥ 105
నరోత్తమా! మరుత్తీర్థాలలో శ్రేష్ఠమైన పవనహ్రదం అక్కడుంటుంది. అక్కడ స్నానమాచరిస్తే విష్ణులోకంలో విరాజిల్లవచ్చు. (105)
అమరాణాం హ్రదే స్నాత్వా సమభ్యర్చ్యామరాధిపమ్ ।
అమరాణాం ప్రభావేన స్వర్గలోకే మహీయతే ॥ 106
అమరహ్రదంలో స్నానం చేసి, ఇంద్రుని పూజించితే అమరుల ప్రభావంచే స్వర్గంలో స్థిరపడతాడు. (106)
శాలిహోత్రస్య తీర్థే చ శాలిసూర్యే యథావిధి ।
స్నాత్వా నరవరశ్రేష్ఠ గోసహస్రఫలం లభేత్ ॥ 107
శాలిహోత్రుని శాలి సూర్యతీర్థంలో యథావిధిగా స్నానం ఆచరిస్తే గోసహస్రదానఫలాన్ని అందుకొంటాడు. (107)
శ్రీకుబ్జం చ సరస్వత్యాః తీర్థం భరతసత్తమ ।
తత్ర స్నాత్వా నరశ్రేష్ఠ అగ్నిష్టోమఫలం లభేత్ ॥ 108
శ్రీకుబ్జం అనే సరస్వతీ తీర్థంలో మునిగి అగ్నిష్టోమాచ రణఫలాన్ని దక్కించుకొంటాడు. (108)
తతో నమిషకుంజం చ సమాసాద్య కురూద్వహ ।
ఋషయః కిల రాజేంద్ర నైమిషేయాస్తపస్వినః ॥ 109
తీర్థయాత్రాం పురస్కృత్య కురుక్షేత్రం గతాః పురా ।
తతః కుంజః సరస్వత్యాః కృతో భరతసత్తమ ॥ 110
కురుశ్రేష్ఠా! అనంతరం నైమిషకుంజ యాత్ర సాగించాలి. నమిశారణ్యాన తీర్థమిషచే ఋషులంతా కురుక్షేత్రానికి వచ్చారు. ఆ సమయాన సరస్వతీ కుంజనిర్మాణం చేశారు. (109,110)
ఋషీణామవకాశః స్యాద్ యథా తుష్టికరో మహాన్ ।
తస్మిన్ కుంజే నరః స్నాత్వా అగ్నిష్టోమఫలం లభేత్ ॥ 111
అది ఋషుల స్థానం. అది వారి సంతోషాన్ని పెంచుతుంది. అందు స్నానం చేస్తే అగ్నిష్టోమఫలాన్ని పొందుతాడు. (111)
తతో గచ్ఛేత ధర్మజ్ఞ కన్యాతీర్థమనుత్తమమ్ ।
కన్యాతీర్థే నరః స్నాత్వా గోసహస్రఫలం లభేత్ ॥ 112
అటుపై కన్యాతీర్థానికి చేరి, స్నానం ఆచరిస్తే వేయిగోవుల దానఫలం దక్కుతుంది. (112)
తతో గచ్ఛేత ధర్మజ్ఞ బ్రహ్మతీర్థమనుత్తమమ్ ।
తత్ర వర్ణావరః స్నాత్వా బ్రాహ్మణ్యం లభతే నరః ॥ 113
బ్రాహ్మణశ్చ విశుద్ధాత్మా గచ్ఛేత పరమాం గతిమ్ ।
అనంతరం పరమోత్తమమైన బ్రహ్మతీర్థం చేరాలి. అక్కడ బ్రాహ్మణేతరుడు స్నానం చేస్తే బ్రాహ్మణత్వం సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడైతే నిర్మల మనస్సుతో ఉత్తమగతుకను సాధిస్తాడు. (113 1/2)
తతో గచ్ఛేన్నరశ్రేష్ఠ సోమతీర్థమనుత్తమమ్ ॥ 114
తత్ర స్నాత్వా నరో రాజన్ సోమలోకమవాప్నుయాత్ ।
నరవరా! పిమ్మట సోమతీర్థయాత్ర సాగించాలి. అక్కడ మునిగి నరుడు సోమలోకాన్ని చేరుతాడు. (114 1/2)
సప్తసారస్వతం తీర్థం తతో గచ్ఛేన్నరాధిప ॥ 115
యత్ర మంకణకః సిద్ధః మహర్షిర్లోకవిశ్రుతః ।
పురా మంకణకో రాజన్ కుశాగ్రేణేతి నః శ్రుతమ్ ॥ 116
క్షతః కిల కరే రాజన్ తస్య శాకరసోఽస్రవత్ ।
స వై శాకరసం దృష్ట్వా హర్షావిష్టః ప్రనృత్తవాన్ ॥ 117
నరాధిపా! ఆ ప్రదేశం నుంచి సారస్వత తీర్థానికి బయలుదేరాలి. అది మంకణకుడనే సిద్ధుడు సిద్ధిపొందిన క్షేత్రం. పూర్వం మంకణకుడు ఒకతాపసి, దర్భకొన అతని చేతికి గాయం చేసింది. దాని నుంచి శాకరసం స్రవించసాగింది. అది చూసిన మంకణకునికి హర్షావేశాలు కలిగి నృత్యం చేయసాగాడు. (115-117)
తతస్తస్మిన్ ప్రవృత్తే తు స్థావరం జంగమం చ యత్ ।
ప్రనృత్తముభయం వీర తేజసా తస్య మోహితమ్ ॥ 118
వీరా! ఆ నృత్యసమయాన అతని తేజంతో మోహితం అయి చరాచర జగత్తు నృత్యం చెయసాగింది. (118)
బ్ర్రహ్మాదిభిః సురై రాజన్ ఋషిభిశ్చ తపోధనైః ।
విజ్ఞప్తో వై మహాదేవః ఋషేరథ నరాధిప ॥ 119
రాజా! బ్రహ్మాదులు, ఋషులు మంకణకుని వృత్తాంతాన్ని మహాదేవునికి నివేదించారు. (119)
నాయం నృత్యేద్ యథా దేవ తథా త్వమ్ కర్తుమర్హసి ।
తం ప్రనృత్తం సమాసాద్య హర్షావిష్టేన చేతసా ।
సురాణాం హితకామార్థమ్ ఋషిం దేవోఽభ్యభాషత ॥ 120
'మీరు ఏదేని ఉపాయం చింతించి అతని నృత్యాన్ని ఆపండి' అని ప్రార్థించారు. వారి హితంకోరి శివుడు మంకణకుని నృత్యప్రదేశాన్ని చేరి అతనిని ఉద్దేశించి అన్నాడు. (120)
భో భో మహర్షే ధర్మజ్ఞ కిమర్థం నృత్యతే భవాన్ ।
హర్షస్థానం కిమర్థం వా తవాద్య మునిపుంగవ ॥ 121
మహర్షీ! మీరెందులకీ నృత్యం చేస్తున్నారు. మీ సంతోషానికి కారణం ఏమిటి? (121)
ఋషిరువాచ
తపస్వినో ధర్మపథే స్థితస్య ద్విజసత్తమ ।
కిం న పశ్యసి మే బ్రహ్మన్ కరాచ్ఛాకరసం స్రుతమ్ ॥ 122
యం దృష్ట్వా సంప్రనృత్తోఽహం హర్షేణ మహతాన్వితః ।
ఋషి అన్నాడు.
ధర్మమార్గాన్ని అనుసరించే తాపసి అయిన నాచేతి నుండి శాకరసం వెలువడుతోంది. మీరు చూడలెదా? అందుచేత నాకు ఆనందం కలిగి నృత్యాన్ని ప్రారంభించాను. (122 1/2)
తం ప్రహస్యాబ్రవీద్ దేవః ఋషిం రాగేణ మోహితమ్ ॥ 123
రాగప్రభావితుడైన ఋషిని చూచి శంకరుడు ఇలా పలికాడు. (123)
అహం తు విస్మయం విప్ర న గచ్ఛామీతి పశ్య మామ్ ।
ఏవముక్త్వా నరశ్రేష్ఠ మహాదేవేన ధీమతా ॥ 124
అంగుల్యగ్రేణ రాజేంద్ర స్వాంగుష్ఠస్తాడితోఽనఘ ।
తతో భస్మ క్షతాద్ రాజన్ నిరతం హిమసన్నిభమ్ ॥ 125
నేనీవిషయాన్ని గమనించినా నాకు ఆశ్చర్యం లేదు. నావైపు చూడండి అని ప్రభావశాలి అయిన శంకరుడు తన వేలికొనతో బొటనవ్రేలిని కొట్టగా అందులో నుండి మంచు రంగుగల భస్మం బయటపడింది. (124,125)
తద్ దృష్ట్వా వ్రీడితో రాజన్ మంకణకుడు శివుని పాదాలను ఆశ్రయించాడు. శివునికంటె గొప్పదైవం లేదని మనస్సులో నిశ్చయించాడు. (126)
సురాసురస్య జగతః గతిస్త్వమసి శూలధృక్ ।
త్వయా సర్వమిదం సృష్టం త్రైలోక్యం సచరాచరమ్ ॥ 127
'దేవాసురులతో కూడిన ఈ లోకానికి నీవే దిక్కు. ఈ ముల్లోకాలు నీవే సృష్టించావు. (127)
త్వమేవ సర్వాన్ గ్రససి పునరేవ యుగక్షయే ।
దేవైరపి న శక్యస్త్వం పరిజ్ఞాతుం కుతో మయా ॥ 128
యుగాంతంలో అందరిని నీవే మ్రింగుతున్నావు. దేవతలకు కూడ నీ స్వరూపం తెలియ వీలుకాదు. నాగురించి వేరుగా చెప్పనవసరం లేదు. (128)
త్వయి సర్వే ప్రదృశ్యంతే సురా బ్రహ్మాదయోఽనఘ ।
సర్వస్త్వమసి లోకానాం కర్తా కారయితా చ హ ॥ 129
బ్రహ్మాదులు, సురలు నీయందే దర్శనమిస్తున్నారు. ఈ లోకాలను చేసేవాడవు, చేయించేవాడవు నీవే. (129)
త్వత్ర్పసాదాత్ సురాః సర్వే మోదంతీహాకుతీభయాః ।
ఏవం స్తుత్వా మహాదేవమ్ ఋషిర్వచనమబ్రవీత్ ॥ 130
నీ అనుగ్రహంచే దేవతలు భయంలేక నిశ్చింతగా ఉన్నారు, అని స్తుతించి మహాదేవునితో తిరిగి ఇలా అన్నాడు. (130)
త్వత్ర్పసాదాన్మహాదేవ తపో మే న క్షరేత వై ।
తతో దేవః ప్రహృష్టాత్మా బ్రహ్మర్షిమిదమబ్రవీత్ ॥ 131
"నీ అనుగ్రహంచేత నా తపస్సు తరిగిపోరాదు'. మహాదేవుడు ప్రసన్నుడై ఆ ఋషితో ఇలా అన్నాడు. (131)
తపస్తే వర్ధతాం విప్ర మత్ర్పసాదాత్ సహస్రధా ।
ఆశ్రమే చేహ వత్స్యామి త్వయా సహ మహామునే ॥ 132
'నా ప్రభావంచే నీ తపస్సు వేయివిధాల వృద్ధి చెందుతుంది. ఈ ఆశ్రమంలో నీతో కలిసి నివసిస్తాను. (132)
సప్తసారస్వతే స్నాత్వా అర్చయిష్యంతి యే తు మామ్ ।
న తేషాం దుర్లభం కించిద్ ఇహలోకే పరత్ర చ ॥ 133
సప్తసారస్వతతీర్థంలో మునిగి నాపూజ చేస్తే అతనికి ఇహపరలోకాల్లో పొందరానిది ఏదీ ఉండదు. (133)
సారస్వతం చ తే లోకం గమిష్యంతి న సంశయః ।
ఏవముక్త్వా మహాదేవః తత్రైవాంతరధీయత ॥ 134
వారు సరస్వతీదేవి లోకాలకు చేరుతారు. సందేహం లేదు, అని పలికి శివుడు మాయం అయినాడు. (134)
తతస్త్వౌశనసం గచ్ఛేత్ త్రిషు ల్కేషు విశ్రుతమ్ ।
యత్ర బ్రహ్మాదయో దేవాః ఋషయశ్చ తపోధనాః ॥ 135
త్రిలోకప్రసిద్ధి గల ఔశనస తీర్థానికి అక్కడి నుంచి వెళ్ళాలి. బ్రహ్మ, ఋషులు, దేవతలు, అక్కడే ఉన్నారు. (135)
కార్తికేయశ్చ భగవాన్ త్రిసంధ్యం కిల భారత 7.
సాన్నిధ్యమకరోన్నిత్యం భార్గవప్రియకామ్యయా ॥ 136
భారతా! శుక్రుని ప్రియం కొరకు కార్తికేయస్వామి మూడు సంధ్యలలో అక్కడనే సన్నిహితుడై ఉంటాడు. (136)
కపాలమోచనం తీర్థం సర్వపాపప్రమోచనమ్ ।
తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర సర్వపాపైః ప్రముచ్యతే ॥ 137
నరశ్రేష్ఠా! కపాలమోచన తీర్థం అన్నిపాపాల్ని పోగొడుతుంది. అక్కడ స్నానం చేస్తే అన్నిపాపాలు పోతాయి. (137)
అగ్నితీర్థం తతో గచ్ఛేత్ తత్ర స్నాత్వా నరర్షభ ।
అగ్నిలోకమవాప్నోతి కులం చైవ సముద్ధరేత్ ॥ 138
తదనంతరం అగ్ని తీర్థానికి యాత్ర సాగించి, స్నానం చేస్తే అగ్నిలోకం చేరడమే కాక అక్కడ వంశాన్ని కూడా ఉద్ధరిస్తాడు. (138)
విశ్వామిత్రస్య తత్రైవ తీర్థం భరతసత్తమ ।
తత్ర స్నాత్వా నరశ్రేష్ఠ బ్రాహ్మణ్యమధిగచ్ఛతి ॥ 139
నరశ్రేష్ఠా! అక్కడే విశ్వామిత్ర తీర్థం ఉంది. ఆ ప్రదేశంలో స్నానం చేస్తే బ్రాహ్మణత్వం పొందుతాడు. (139)
బ్రహ్మయోనిం సమాసాద్య శుచిః ప్రయతమానసః ।
తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర బ్రహ్మలోకం ప్రపద్యతే ॥ 140
పునాత్యాసప్తమం చైవ కులం నాస్త్యత్ర సంశయః ।
నరోత్తమా! బ్రహ్మయోని తీర్థానికి పోయి పవిత్రుడై అక్కడ మునిగితే బ్రహ్మలోకాన్ని చేరుతాడు. తన వంశాన్ని ఏడుతరాల దాకా తరింపచేస్తాడు. (140 1/2)
తతో గచ్ఛేత రాజేంద్ర తీర్థం త్రైలోక్యవిశ్రుతమ్ ॥ 141
పృథూదకమితి ఖ్యాతం కార్తికేయస్య వై నృప ।
తత్రాభిషేకం కుర్వీత పితృదేవార్చనే రతః ॥ 142
రాజేంద్రా! పిమ్మట కార్తికేయనివాసమైన పృథూదక తీర్థం వెళ్ళాలి. అక్కడ స్నానం చేసి పితరుల, దేవతల అర్చన సాగించాలి. (141,142)
అజ్ఞానాత్ జ్ఞానతో వాపి స్త్రియా వా పురుషేణ వా ।
యత్ కించిదశుభం కర్మ కృతం మానుషబుద్ధినా ॥ 143
తత్ సర్వం నశ్యతే తత్ర స్నాతమాత్రస్య భారత ।
అశ్వమేధఫలం చాస్య స్వర్గలోకం చ గచ్ఛతి ॥ 144
భారతా! పృథూదకతీర్థాన స్నానం చెస్తే పురుషుడు, స్త్రీ అనే భేదం లేకుండా, జ్ఞాని, అజ్ఞాని అనే తేడా లేకుండా పాపాలన్నీ తొలగుతాయి. అశ్వమేధఫలం, స్వర్గలోకం కూడ లభిస్తుంది. (143,144)
పుణ్యమాహుః కురుక్షేత్రం కురుక్షేత్రాత్ సరస్వతీ ।
సరస్వత్యాశ్చ తీర్థాని తీర్థేభ్యశ్చ పృథూదకమ్ ॥ 145
కురుక్షేత్రం తీర్థాలన్నింటిలో పవిత్రం. సరస్వతి కురుక్షేత్ర తీర్థం కంటె పవిత్రం. సరస్వతిని మించి ఆ నదీతీర్థాలు పవిత్రాలు. తీర్థాలన్నింటిలో పృథూదకం పవిత్రం. (145)
ఉత్తమం సర్వతీర్థానాం యస్త్వజేదాత్మనస్తనుమ్ ।
పృథూదకే జప్యపరః నైవ శ్వో మరణం తపేత్ ॥ 146
అది అన్ని తీర్థాలలో శ్రేష్ఠం. పృథూదకతీర్థాన జపపరాయణుడై శరీరత్యాగం చేసిన వానికి మృత్యుభయం ఉండదు. (146)
గీతం సనత్కుమారేణ వ్యాసేన చ మహాత్మనా ।
ఏవం స నియతం రాజన్ అభిగచ్ఛేత్ పృథూదకమ్ ॥ 147
ఈ విషయాలన్నింటిని వ్యాసులవారు, సనత్కుమారులు ప్రతిపాదించారు. రాజా! నియమపరుడైనవాడు తప్పక పృథూదక తీర్థం వెళ్లాలి. (147)
పృథూదకాత్ తీర్థతమం నాన్యత్ తీర్థం కురూద్వహ ।
తన్మేధ్యం తత్ పవిత్రం చ పావనం చ న సంశయః ॥ 148
పృథూదకంతో సమానం అయిన తీర్థం మరేదీ లేదు. అది పవిత్రం, పావనం, మేధ్యం అనటంలో సందేహం లేదు. (148)
తత్ర స్నాత్వా దివం యాంతి యేఽపి పాపకృతో నరాః ।
పృథూదకే నరశ్రేష్ఠ ఏవమాహుర్మనీషిణః ॥ 149
నరశ్రేష్ఠా! పాపాత్ములైన మానవులు ఆ తీర్థాన స్నానం చేసి స్వర్గానికి పోతారు అని విద్వాంసులంటారు. (149)
మధుస్రవం చ తత్రైవ తీర్థం భరతసత్తమ ।
తత్ర స్నాత్వా నరో రాజన్ గోసహస్రఫలం లభేత్ ॥ 150
రాజా! అక్కడనే ఉన్న మధుస్రవమనే తీర్థాన్ని సేవించి వేయిగోవుల దానఫలాన్ని అందుకొంటాడు. (150)
తతో గచ్ఛేత రాజేంద్ర తీర్థం మేధ్యం యథాక్రమమ్ ।
సరస్వత్యరుణాయాశ్చ సంగమం లోకవిశ్రుతమ్ ॥ 151
రాజేంద్రా! తరువాత సరస్వతీ అరుణా నదుల సంగమతీర్థానికి యాత్ర కొనసాగించాలి. అదిలోక ప్రసిద్ధతీర్థం. (151)
త్రిరాత్రోపోషితః స్నాత్వా ముచ్యతే బ్రహ్మహత్యయా ।
అగ్నిష్టోమాతిరాత్రాభ్యాం ఫలం విందతి మానవః । 152
ఆసప్తమం కులం చైవ పునాతి భరతర్షభ ।
భరతర్షభా! మూడురాత్రులు ఉపవాసం చేసి, ఆ తీర్థంలో స్నానం చేస్తే బ్రహ్మహత్యాపాతకం పోయి అగ్నిష్టోమాతిరాత్ర యాగాల ఫలం లభిస్తుంది. అది ఏడుతరాలవారిని పవిత్రం చేస్తుంది. (152 1/2)
అర్థకీలం చ తత్రైవ తీర్థం కురుకులోద్వహ ॥ 153
విప్రాణామనుకంపార్థం దర్భిణా నిర్మితం పురా ।
వ్రతోపనయనాభ్యాం చాప్యుపవాసేన వాప్యుత ॥ 154
క్రియామంత్రైశ్చ సంయుక్తః బ్రాహ్మణః స్యాన్న సంశయః ।
క్రియామంత్రవిహీనోఽపి తత్ర స్నాత్వా నరర్షభ ।
చీర్ణవ్రతో భవేద్ విద్వాన్ దృష్టమేతత్ పురాతనైః ॥ 155
అక్కడే అర్ధకీలతీర్థం ఉంది. బ్రాహ్మణులపై దయచే పూర్వకాలంలో దర్భి అనే తాపసి దాన్ని సిద్ధంచేశాడు. అక్కడ వ్రతం, ఉపనయనం, ఉపవాసం చేస్తే కర్మకాండ, మంత్రపరిజ్ఞానం కలిగి బ్రాహ్మణుడు అవుతాడు. సందేహం లేదు. నరోత్తమా! క్రియామంత్ర పరిజ్ఞానం లేకపోయినా ఆ తీర్థంలో మునిగిన ప్రతివ్యక్తి, విద్వాంసుడవుతాడని ప్రాచీనుల అభిప్రాయం. (153-155)
సముద్రాశ్చాపి చత్వారః సమానీతాశ్చ దర్భిణా ।
తేషు స్నాతో నరశ్రేష్ఠ న దుర్గతిమవాప్నుయాత్ ॥ 156
ఫలాని గోసహస్రాణాం చతుర్ణాం విందతే చ సః ।
నరశ్రేష్ఠా! దర్భిముని అక్కడకు నాలుగు సముద్రాల పాయలను తీసుకువచ్చాడు. అక్కడ స్నానం చేసిన నరుడు దుర్గతి పొందడు. నాలుగువేల గోవుల దానఫలం చిక్కుతుంది. (156 1/2)
తతో గచ్ఛేత ధర్మజ్ఞ తీర్థం శతసహస్రకమ్ ॥ 157
సాహస్రకం చ తత్రైవ ద్వే తీర్థే లోకవిశ్రుతే ।
ఉభయోర్హి నరః స్నాత్వా గోసహస్రఫలం లభేత్ ॥ 158
దానం వాప్యుపవాసీ వా సహస్రగుణితం భవేత్ ।
ధర్మజ్ఞా! అక్కడి నుంచి శతసహస్రక, సహస్రక తీర్థాలకు యాత్ర చేయాలి. ఆ రెంటి యందు స్నానం చేస్తే వేయుగోవుల ఫలం దక్కుతుంది. అక్కడ చేసిన దానం, ఉపవాసం వెయ్యిరెట్ల ఫలం ఇవ్వగలదు. (157 158 1/2)
తతో గచ్ఛేత రాజేంద్ర రేణుకాతీర్థముత్తమమ్ ॥ 159
తీర్థాభిషేకం కుర్వీత పితృదేవార్చనే రతః ।
సర్వపాప్విశుద్ధాత్మా అగ్నిష్టోమఫలం లభేత్ ॥ 160
రాజేంద్రా! తరువాత రేణుకా తీర్థానికి పోవాలి. అక్కడ స్నానం చేసి పితరులను, దేవతలను ఆరాధిస్తే పాపాలన్నీ తొలగి అగ్నిష్టోమయాగఫలం వశం అవుతుంది. (159,160)
విమోచనముపస్పృస్య జితమన్యుర్జితేంద్రియః ।
ప్రతిగ్రహకృతైర్దోషైః సర్వైః స పరిముచ్యతే ॥ 161
విమోచనతీర్థస్నానం చేసి కోపాన్ని జయించి జితేంద్రియుడైతే ప్రతిగ్రహదోషఫలం పోతుంది. (161)
తతః పంచవటీం గత్వా బ్రహ్మచారీ జితేంద్రియః ।
పుణ్యేన మహతా యుక్తః సతాం లోకే మహీయతే ॥ 162
పంచవటీ తీర్థానికి వెళ్ళి మితాహారి జితేంద్రియుడై ఉన్నవాడు గొప్పపుణ్యం సంపాదించి సత్పురుషుల లోకంలో చిరకాలం ఉంటాడు. (162)
యత్ర యోగేశ్వరః స్థాణుః స్వయమేవ వృషధ్వజః ।
తమర్చయిత్వా దేవేశం గమనాదేవ సిధ్యతి ॥ 163
అక్కడ వృషభధ్వజుడు, స్థాణువు అయిన శివుడు వెలసి ఉన్నాడు. అక్కడకు పోవుట చేతనే మానవుడు సిద్ధిని పొందుతాడు. (163)
తైజసం వారుణం తీర్థం దీప్యమానం స్వతేజసా ।
యత్ర బ్రహ్మాదిభిర్దేవైః ఋషిభిశ్చ తపోధనైః ॥ 164
సైనాపత్యేన దేవానామ్ అభిషిక్తో గుహస్తదా ।
తైజసస్య తు పూర్వేణ కురుతీర్థం కురూద్వహ ॥ 165
కురుశ్రేష్ఠా! తైజసతీర్థం వరుణునిది. అతని తేజంతో ప్రకాశిస్తుంది. అక్కడే బ్రహ్మాది దేవతలు, తాపసులు, ఋషులు కార్తికేయుని దేవసేనాపతిగా అభిషేకించారు. తైజసతీర్థానికి తూర్పున కురుతీర్థం ఉంది. (164,165)
కురుతీర్థే నరః స్నాత్వా బ్రహ్మచారీ జితేంద్రియః ।
సర్వపాపవిశుద్ధాత్మా బ్రహ్మలోకం ప్రపద్యతే ॥ 166
కురుతీర్థంలో స్నానమాచరిస్తే జితేంద్రియుడు అయి, పాపాలు పోయి బ్రహ్మలోకాన్ని చేరతాడు. (166)
స్వర్గద్వారం తతో గచ్ఛేద్ నియతో నియతాశనః ।
స్వర్గలోకమవాప్నోతి బ్రహ్మలోకం చ గచ్ఛతి ॥ 167
అక్కడి నుంచి స్వర్గద్వారానికి పోయి స్నానం చేసి, స్వర్గానికి చేరి, తరువాత బ్రహ్మలోకం చేరుకొంటాడు. (167)
తతో గచ్ఛేదనరకం తీర్థసేవీ నరాధిప ।
తత్ర స్నాత్వా నరో రాజన్ న దుర్గతిమవాప్నుయాత్ ॥ 168
తత్ర బ్రహ్మా స్వయం నిత్యం దేవైః సహ మహీపతే ।
అన్వాస్తే పురుషవ్యాఘ్ర నారాయణపురోగమైః ॥ 169
రాజా! తీర్థయాత్రికుడు క్రమంగా అనరకతీర్థానికి యాత్ర సాగించాలి. అక్కడ స్నానం చేస్తే దుర్గతి పొందడు. నారాయణాది దేవతలతో బ్రహ్మ ఇక్కడ నివాసం చేస్తాడు. (168,169)
సాన్నిధ్యం తత్ర రాజేంద్ర రుద్రపత్న్యాః కురూద్వహ ।
అభిగమ్య చ తాం దేవీం న దుర్గతిమవాప్నుయాత్ ॥ 170
రాజేంద్రా! రుద్రునిభార్య దుర్గ అక్కడనే స్థిరంగా ఉంటుంది. ఆ దేవిని కొలిచితే దుర్గతిని పొందడు. (170)
తత్రైవ చ మహారాజ విశ్వేశ్వరముపాపతిమ్ ।
అభిగమ్య మహాదేవం ముచ్యతే సర్వకిల్బిషైః ॥ 171
మహారాజా! అది ఉమాదేవి భర్త విశ్వేశ్వరుని స్థానం. అక్కడ శివుని పూజించి సర్వపాపాల నుండి విడివడుతాడు. (171)
నారాయణం చాభిగమ్య పద్మనాభమరిందమ ।
రాజమానో మహారాజ విష్ణులోకం చ గచ్ఛతి ॥ 172
తీర్థేషు సర్వదేవానాం స్నాతః స పురుషర్షభ ।
సర్వదుఃఖైః పరిత్యక్తః ద్యోతతే శశివన్నరః ॥ 173
మహారాజా! శత్రుదమనుడు, నారాయణుడు, అయిన విష్ణువును అక్కడ కొలిచినవాడు విష్ణులోకం చేరతాడు. అన్ని తీర్థాలలో మునిగినవాడు సర్వదుఃఖాలను పోగొట్టుకొని చంద్రుని వలె వెలిగిపోతాడు. (172,173)
తతః స్వస్తిపురం గచ్ఛేత్ తీర్థసేవీ నరాధిప ।
ప్రదక్షిణముపావృత్య గోసహస్రఫలం లభేత్ ॥ 174
రాజా! ఆ ప్రదేశం నుంచి స్వస్తిపురం చేరి ప్రదక్షిణం చేస్తే గోసహస్రదానఫలం లభిస్తుంది. (174)
పావనం తీర్థమాసాద్య తర్పయేత్ పితృదేవతాః ।
అగ్నిష్టోమస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి భారత ॥ 175
పావనతీర్థాన్ని చేరి పితృదేవతలకు తర్పణం చేస్తే అగ్నిష్టోమఫలం దక్కుతుంది. (175)
గంగాహ్రదశ్చ తత్రైవ కూపశ్చ భరతర్షభ ।
తిస్రః కోట్యస్తు తీర్థానాం తస్మిన్ కూపే మహీపతే ॥ 176
భరతర్షభా! అక్కడ గంగానదం అనే నుయ్యి ఉంది. మూడుకోట్ల తీర్థాలు ఆ నూతిలో ఉన్నాయి. (176)
తత్ర స్నాత్వా నరో రాజన్ స్వర్గలోకం ప్రపద్యతే ।
ఆపగాయాం నరః స్నాత్వా అర్చయిత్వా మహేశ్వరమ్ ॥ 177
గాణపత్యమవాప్నోతి కులం చైవ సముద్ధరేత్ ।
అందులో మునిగిన నరుడు స్వర్గానికి చేరతాడు. నదిలో స్నానం చేసి మహేశ్వరుని కొలిచి గణపతిపదాన్ని పొంది వంశాన్ని ఉద్ధరిస్తాడు. (177 1/2)
తతః స్థాణువటం గచ్ఛేత్ త్రిషు లోకేషు విశ్రుతమ్ ॥ 178
తత్ర స్నాత్వా స్థితో రాత్రిం రుద్రలోకమవాప్నుయాత్ ।
అటుపైన స్థాణువట తీర్థానికి పోయి స్నానం చేసి, ఒకరాత్రి ఉంటే రుద్రలోకాన్ని చేరతాడు అనే ప్రసిద్ధి ఉంది. (178 1/2)
బదరీపాచనం గచ్ఛేద్ వసిద్ఠస్యాశ్రమం తతః ॥ 179
బదరీం భక్షయేత్ తత్ర త్రిరాత్రోపోషితో నరః ।
సమ్యగ్ ద్వాదశవర్షాణి బదరీం భక్షయేత్ తు యః ॥ 180
త్రిరాత్రోపోషితస్తేన భవేత్ తుల్యో నరాధిప ।
రుద్రమార్గం సమాసాద్య తీర్థసేవీ నరాధిప ॥ 181
అహోరాత్రోపవాసేన శక్రలోకే మహీయతే ।
ఆ ప్రదేశం నుంచి బదరీపాచనం అనే ప్రసిద్ధి గల వసిష్ఠాశ్రమానికి చేరాలి. అక్కడ మూడు రాత్రులు ఉపవాసమ్ చేసి రేగులను తిని ఉండాలి. నరుడు పన్నెండు సంవత్సరాలు రేగులు తిని, మూడు రాత్రులు ఉపవాసం చేసి వసిష్ఠసమానుడు అవుతాడు. రాజా! రుద్రమార్గానికి పోయి ఒకరాత్రి, పగలు ఉపవాసం చెయ్యాలి. అప్పుడు ఇంద్రలోకంలో స్థిరంగా ఉంటాడు. (179-181 1/2)
ఏకరాత్రం సమాసాద్య ఏకరాత్రోషితో నరః ॥ 182
నియతః సత్యవాదీ చ బ్రహ్మలోకే మహీయతే ।
ఏకరాత్రతీర్థాన్ని చేరి నియమంతో సత్యవాది అయి ఒకరోజు ఉంటే బ్రహ్మలోకాన్ని చేరతాడు. (182 1/2)
తతో గచ్ఛేత రాజేంద్ర తీర్థం త్రైలోక్యవిశ్రుతమ్ ॥ 183
ఆదిత్యస్యాశ్రమో యత్ర తేజోరాశేర్మహాత్మనః ।
తస్మింస్తీర్థే నరః స్నాత్వా పూజయిత్వా విభావసుమ్ ॥ 184
ఆదిత్యలోకం వ్రజతి కులం చైవ సముద్ధరేత్ ।
పిమ్మట త్రిలోకప్రసిద్ధి గల సూర్యుని ఆశ్రమం, ప్రవేశించి, ఆ తీర్థంలో స్నానంచేసి, సూర్యుని కొలిస్తే, సూర్యలోకం చేరతాడు. వంశాన్ని ఉద్ధరిస్తాడు. (183, 184 1/2)
సోమతీర్థే నరః స్నాత్వా తీర్థసేవీ నరాధిప ॥ 185
సోమలోకమవాప్నోతి నరో నాస్త్యత్ర సంశయః ।
రాజా! సోమతీర్థంలో మునిగితే సోమలోకాన్ని చేరటంలో సందేహం లేదు. (185 1/2)
తతో గచ్ఛేత ధర్మజ్ఞ దధీచస్య మహాత్మనః ॥ 186
తీర్థం పుణ్యతమం రాజన్ పావనం లోకవిశ్రుతమ్ ।
యత్ర సారస్వతో జాతః సోఽంగిరాస్తపసో నిధిః ॥ 187
ధర్మజ్ఞా! అటుపైన పరమపావనం, లోకప్రసిద్ధం అయిన దధీచాశ్రమయాత్ర కొనసాగించాలి. ఆ క్షేత్రంలో సరస్వతీపుత్రుడు, తపోనిధి అయిన అంగిరసుడు పుట్టాడు. (186,187)
తస్మింస్తీర్థే నరః స్నాత్వా వాజిమేధఫలం లభేత్ ।
సారస్వతీం గతిం చైవ లభతే నాత్ర సంశయః ॥ 188
ఆ తీర్థసేవనం అశ్వమేధఫలం ఇస్తుంది. సరస్వతీ లోకప్రాప్తిని నిస్సందేహంగా కలిగిస్తుంది. (188)
తతః కన్యాశ్రమం గచ్ఛేత్ నియతో బ్రహ్మచర్యవాన్ ।
త్రిరాత్రోపోషితో రాజన్ నియతో నియతాశనః ॥ 189
లభేత్ కన్యాశతం దివ్యం స్వర్గలోకం చ గచ్ఛతి ।
నియమంతో, బ్రహ్మచర్యపాలన సాగిస్తూ కన్యాశ్రమతీర్థం వెళ్లాలి. అక్కడ మూడురాత్రులు ఉపవసించి, మితాహారియై వందమంది దేవకాంతలను, స్వర్గలోకాన్ని వశం చేసుకొంటాడు. (189 1/2)
తతో గచ్ఛేత ధర్మజ్ఞ తీర్థం సన్నిహతీమపి ॥ 190
ధర్మజ్ఞా! తరువాత సంనిహతీ తీర్థయాత్ర సాగించాలి. (190)
తత్ర బ్రహ్మాదయో దేవా ఋషయశ్చ తపోధనాః ।
మాసి మాసి సమాయాంతి పుణ్యేన మహతాన్వితాః ॥ 191
ఆ తీర్థానికి బ్రహ్మాదిదేవతలు, ఋషులు, తపోధనులు నెలనెలా వచ్చి పుణ్యాన్ని ప్రోగుచేసుకొంటారు. (191)
సన్నిహత్యాముపస్పృశ్య రాహుగ్రస్తే దివాకరే ।
అశ్వమేధశతం తేన తత్రేష్టం శాశ్వతం భవేత్ ॥ 192
సూర్యగ్రహణం రోజున సంనిహతీ తీర్థాన స్నానమాచరిస్తే వంద అశ్వమేధయాగాల ఫలం వస్తుంది. (192)
పృథివ్యాం యాని తీర్థాని అంతరిక్షచరాణి చ ।
నద్యో హ్రదాస్తడాగాశ్చ సర్వప్రసవణాని చ ॥ 193
ఉపదపానాని వాప్యశ్చ తీర్థాన్యాయతనాని చ ।
నిః సంశయమమావాస్యాం సమేష్యంతి నరాధిప ॥ 194
మాసి మాసి నరవ్యాఘ్ర సన్నిహత్యాం న సంశయః ।
తీర్థసన్నిహనాదేవ సన్నిహత్యేతి విశ్రుతా ॥ 195
భూమిపై, ఆకాశంలో ఎన్ని తీర్థాలు, నదులు, హ్రదాలు, చెఱువులు, ప్రవాహాలు, దిగుడుబావులు, మందిరాలు ఉన్నాయో అవి అన్నీ ప్రతీనెలా అమావాస్యనాడు ఈ సంనిహత తీర్థంలో ఉంటాయి. నరోత్తమా! తీర్థసమూహం ఇందులో ఉండటం చేత దీన్ని సంనిహత తీర్థం అంటారు. (193-195)
తత్ర స్నాత్వా చ పీత్వా చ స్వర్గలోకే మహీయతే ।
అమావాస్యాం తు తత్రైవ రాహుగ్రస్తే దివాకరే ॥ 196
యః శ్రాద్ధం కురుతే మర్త్యః తస్య పుణ్యఫలం శృణు ।
అశ్వమేధసహస్రస్య సమ్యగిష్టస్య యత్ ఫలమ్ ॥ 197
స్నాత ఏవ సమాప్నోతి కృత్వా శ్రాద్ధం చ మానవః ।
యత్ కించిద్ దుష్కృతం కర్మస్త్రియా వా పురుషేణ వా ॥ 198
స్నాతమాత్రస్య తత్ సర్వం నశ్యతే నాత్ర సంశయః ।
పద్మవర్ణేన యానేన బ్రహ్మలోకం ప్రపద్యతే ॥ 199
అక్కడ స్నానం చేసి నీరు త్రాగితే స్వర్గంలో స్థిరంగా ఉంటాడు. సూర్యగ్రహణం నాడు శ్రాద్ధవిధిని అక్కడ ఆచరిస్తే వేయి అశ్వమేధయాగాల ఫలం అతనికి సంరమిస్తుంది. స్నానమాత్రం చేత, శ్రాద్ధాచరణం చేత ఎట్టి పాపమైనా, స్తీకైనా, పురుషునికైనా పూర్తిగా నశిస్తుంది. పద్మపురంగుగల విమానంలో బ్రహ్మలోకం చేరుతారు. (196-199)
అభివాద్య తతో యక్షం ద్వారపాలం మచక్రుకమ్ ।
కోటితీర్థముపస్పృశ్య లభేత్ బహుసువర్ణకమ్ ॥ 200
పిమ్మట మచక్రుడనే ద్వారపాలకుడైన యక్షునికి నమస్కరించి, కోటితీర్థంలో స్నానమాచరించి మానవుడు సువర్ణరాశిని గైకొంటాడు. (200)
గంగాహ్రదశ్చ తత్రైవ తీర్థం భరతసత్తమ ।
తత్ర స్నాయీత ధర్మజ్ఞ బ్రహ్మచారీ సమాహితః ॥ 201
రాజసూయాశ్వమేధాభ్యాం ఫలం విందతి మానవః ।
ధర్మజ్ఞా! గంగాహ్రదమనే తీర్థం అక్కడే ఉంది. అందులో స్నానం చెసి జితేంద్రియుడై రాజసూయాశ్వమేధయాగాల ఫలాన్ని పొందుతాడు. (201 1/2)
పృథివ్యాం నైమిషం తీర్థమ్ అంతరిక్షే చ పుష్కరమ్ ॥ 202
త్రయాణామపి లోకానాం కురుక్షేత్రం విశిష్యతే ।
పాంసవోఽపి కురుక్షేత్రాద్ వాయునా సముదీరితాః ॥ 203
అపి దుష్కృతకర్మాణం నయంతి పరమాం గతిమ్ ।
దక్షిణేన సరస్వత్యా ఉత్తరేణ దృషద్వతీమ్ ॥ 204
యే వసంతి కురుక్షేత్రే తే వసంతి త్రివిష్టపే ।
భూమిపై నైమిశం, ఆకాశంలో పుష్కరం ఉన్నాయి.
మూడులోకాల తీర్థాల్లోను కురుక్షేత్రం గొప్పది. కురుక్షేత్రం నుంచి వాయువుచే ఎగురగొట్టబడిన ధూళి చెడ్డవానిని కూడ ఉత్తమగతికి చేరుస్తుంది. సరస్వతీనదికి దక్షిణంగా, దృషద్వతీనదికి ఉత్తరంగా ఉన్న కురుక్షేత్రంలో నివసించినవారు స్వర్గంలో నివసించినట్లే. (202- 204 1/2)
కురుక్షేత్రే గమిష్యామి కురుక్షేత్రే వసామ్యహమ్ ॥ 205
అప్యేకామ్ వాచముత్సృజ్య సర్వపాపైః ప్రముచ్యతే ।
'కురుక్షేత్రానికి పోతాను, కురుక్షేత్రంలో ఉంటాను' అన్న మాటలచేతనే అన్నిపాపాలు పోతాయు. (205 1/2)
బ్రహ్మవేదీ కురుక్షేత్రం పుణ్య బ్రహ్మర్షిసేవితమ్ ॥ 206
తస్మిన్ వసంతి యే మర్త్యాః న తే శోచ్యాః కథంచన ॥ 207
కురుక్షేత్రం బ్రహ్మ వేదిస్థానం. ఈ క్షేత్రాన్ని బ్రహ్మర్షులు సదా సేవిస్తారు. అందులో నివసించేవారు శోకాన్ని ఎన్నడూ పొందరు. (206,207)
తరంతుకారంతుకయోర్యదతరం
రామహ్రదానాం చ మచక్రుకస్య చ ।
ఏతత్ కురుక్షేత్రసమంతపంచకం
పితామహస్యోత్తరవేదిరుచ్యతే ॥ 208
తరంతుక, అరంతుకాల మధ్య భుభాగం; రామహ్రదం, మచక్రుకాల మధ్యభాగం ఏదో అదియే కురుక్షేత్రం, సమంతపంచకం. అది బ్రహ్మ ఉత్తరవేదిస్థానం. (208)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి పులస్త్యతీర్థయాత్రాయాం త్ర్యశీతితమోఽధ్యాయః ॥ 83
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున పులస్త్యతీర్థయాత్ర అను ఎనుబది మూడవ అధ్యాయము. (83)