88. ఎనుబది ఎనిమిదవ అధ్యాయము
ధౌమ్యుడు వర్ణించిన దక్షిన తీర్థాలు.
ధౌమ్య ఉవాచ
దక్షిణస్యాం తు పుణ్యాని శృణు తీర్థాని భారత ।
విస్తరేణ యథాబుద్ధి కీర్త్యమానాని తాని వై ॥
ధౌమ్యుడు ఇలా అన్నాడు.
నేను ఇప్పుడు దక్షిణదిక్కున ఉన్న తీర్థాలను నా బుద్ధికి అనుగుణంగా విస్తారంగా వర్ణిస్తాను. విను. (1)
యస్యామాఖ్యాయతే పుణ్యా దిశి గోదావరీ నదీ ।
బహ్వారామా బహుజలా తాపసాచరితా శివా ॥ 2
దక్షిణదిక్కున ఉన్న నదుల్లో గోదావరి ప్రసిద్ధం అయింది. ఆ నది ఒడ్డున ఎన్నోపూలతోటలు ఉన్నాయి. వాటికి బయట లోతు తెలియని జలరాశి ఉంది. చాలమంది ఋషులు గోదావరిని మంగళమైనదని సేవిస్తారు. (2)
వేణా భీమరథీ చైవ నద్యౌ పాపభయాపహే ।
మృగద్విజసమాకీర్ణే తాపసాలయభూషితే ॥ 3
వేణ, భీమరథినదులు దక్షిణ దిక్కున ఉండి సమస్తపాపాల భయాన్ని పోగొడుతూ ఉన్నాయి. ఆ నదుల ఒడ్డున పశుపక్ష్యాదులు వ్యాపించిన ఋషుల ఆశ్రమాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. (3)
రాజర్షేస్తస్య చ సరిత్ నృగస్య భరతర్షభ ।
రమ్యతీర్థా బహుజలా పయోష్ణీ ద్విజసేవితా ॥ 4
నృగమహారాజు ఏర్పరచిన సుందరం, పవిత్రం అయిన పయోష్ణీనది అక్కడే ఉంది. దానిని బ్రాహ్మణులందరూ ప్రతిదినం సేవిస్తారు. (4)
అపి చాత్ర మహాయోగీ మార్కండేయో మహాయశాః ।
అనువంశ్యాం జగౌ గాథాం నృగస్య ధరణీపతేః ॥ 5
వృగస్య యజమానస్య ప్రత్యక్షమితి నః శ్రుతమ్ ।
అమాద్యదింద్రః సోమేన దక్షిణాభిర్ద్విజాతయః ॥ 6
పయోష్ణ్యాం యజమానస్య వారాహే తీర్థ ఉత్తమే ।
ఉద్ధృతం భూతపస్థం వా వాయునా సముదీరితమ్ ।
పయోష్ణ్యా హరతే తోయం పాపమామరణాంతికమ్ ॥ 7
మహాయోగి, యశస్వి అయిన మార్కండేయ మహర్షిచే రాజైన నృగుని ఎదుట వారి వంశగాథ వివరింపబడినది ఇక్కడే అని పెద్దల ఆశయం. పయోష్ణీనదీ తీరాన వరాహతీర్థాన నృగుని యజ్ఞంలో ఆహుతులను గ్రహించి సోమపానం స్వయంగా చేసి ఇంద్రుడు మదించిపోయాడు. బ్రాహ్మణులకు భూరిదక్షిణలు సమర్పించాడు. పయోష్ణీనదిలోని నీటిని చేతితో గ్రహించినా, ఆ నీరు గాలి వలన ఎగిరి మన తల మీద పడినా మృత్యువు వచ్చేదాకా చేసిన పాపాలు నశిస్తాయి. (5-7)
స్వర్గాదుత్తుంగమమలం విషాణం యత్ర శూలినః ।
స్వమాత్మవిహితం దృష్ట్వా మర్త్యః శివపురం వ్రజేత్ ॥ 8
అక్కడ పూజ్యుడైన శంకరునిచే స్వయంగా చేయబడిన శృంగం అనే వాద్యం స్వర్గంకంటె ఉన్నతమైంది. నిర్మలం అయింది. దానిని దర్శించిన మానవుడు శివపురాన్ని చేరుతాడు. (8)
ఏకతః సరితః సర్వా గంగాద్యాః సలిలోచ్చయాః ।
పయోష్ణీ చైకతః పుణ్యా తీర్థేభ్యో హి మతా మమ ॥ 9
అగాథ జలరాశి గల గంగాది నదులు ఒక వైపు, పయోష్ణీనది రెండవవైపు ఉంచి పరిశీలిస్తే పయోష్ణినదియే ఉత్తమం అయింది అని నా అభిప్రాయం. (9)
మాఠరస్య వనం పుణ్యం బహుమూలఫలం శివమ్ ।
యూపశ్చ భరతశ్రేష్ఠ వరుణస్రోతసే గిరౌ ॥ 10
ఆ షిక్కునే పవిత్రమైన మాఠరవనం ఉంది. అది పుష్పఫలశోభలతో, కళ్యాణస్వరూపం కలిగి ఉంది. వరుణస్రోతం అనే పేరు గల పర్వతాన సూర్యుని పరివారదేవత అయిన మాఠరుని విజయస్తంభం ప్రకాశిస్తోంది. (10)
ప్రవేణ్యుత్తరమార్గే తు పుణ్యే కణ్వాశ్రమే తథా ।
తాపసానామరణ్యాని కీర్తితాని యథాశ్రుతి ॥ 11
ప్రవేణీనదికి ఉత్తరదిక్కున ఉన్నమార్గంలో కణ్వుని పవిత్ర ఆశ్రమం ఉంది. ఈవిధంగా నేను విన్న ఆశ్రమాలను, నదులనూ, మహాత్ములున్న ప్రదేశాలనూ వివరించాను. (11)
వేదీ శూర్పారకే తాత జమదగ్నేర్మహాత్మనః ।
రమ్యా పాషాణతీర్థా చ పునశ్చాంద్రా చ భారత ॥ 12
భారతా! శూర్పారక క్షేత్రాన మహాత్ముడైన జమదగ్ని వేది ఉంది. అది సుందరమై పాషాణతీర్థం, పునశ్చంద్రతీర్థం అను పేర్లతో విరాజిల్లుతోంది. (12)
అశోకతీర్థం తత్రైవ కౌంతేయ బహులాశ్రమమ్ ।
అగస్త్యతీర్థం పండ్యేషి వారుణం చ యుధిష్ఠిరః ॥ 13
కుమార్యః కథితాః పుణ్యాః పాండ్యేష్వేన నరర్షభ ।
తామ్రపర్ణీం తు కౌంతేయ కీర్తయిష్యామి తాం శృణు ॥ 14
అశోకతీర్థంలో మహర్షులు చాలామంది నివసిస్తారు. పాండ్యదేశంలో అగస్త్యతీర్థం వారుణ తీర్థమూ ఉన్నాయి. పాండ్యదేశంలోనే (కన్యా) కుమారీ తీర్థం ఉంది. పాండ్యదేశంలో స్త్రీలు బాల్యానంతరం భర్తలకోసం దేవతలను పూజిస్తారు. తామ్రపర్ణీనదిని గూర్చి వివరిస్తాను. విను. (13,14)
యత్ర దేవైస్తపస్తప్తం మహదిచ్ఛద్భిరాశ్రమే ।
గోకర్ణ ఇతి విఖ్యాతః త్రిషు లోకేషు భారత ॥ 15
మోక్షం కోరి తామ్రపర్ణీనదీతీర్థాన దేవతలు ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేశారు. అక్కడ ఉన్న గోకర్ణతీర్థం ముల్లోకాల్లో సుప్రసిద్ధం. (15)
శీతతోయో బహుజలః పుణ్యస్తాత శివః శుభః ।
హ్రద పరమదుష్ప్రాపః మానుషైరకృతాత్మభిః ॥ 16
గోకర్ణతీర్థం శీతజలాలతో నిండి పవిత్రం, కళ్యాణకరం, శుభప్రదం అయి ఉంది. అంతఃకరణం పరిశుద్ధం కాని వారికి గోకర్ణతీర్థప్రవేశం దుర్లభం. (16)
తత్ర వృక్షతృణాద్యైశ్చ సంపన్నః ఫలమూలవాన్ ।
ఆశ్రమోఽగస్త్యశిష్యస్య పుణ్యో దేవసమో గిరిః ॥ 17
అక్కడ అగస్త్యుని శిష్యుని ఆశ్రమం ఫలపుష్పాలతో, వృక్షాలతో గడ్డితో ప్రకాశిస్తోంది. దేవసమం అనే పర్వతమే అతని ఆశ్రమప్రదేశం. (17)
వైదూర్యపర్వతస్తత్ర శ్రీమాన్ మణిమయః శివః ।
అగస్త్యస్యాశ్రమశ్చైవ బహుమూలఫలోదకః ॥ 18
ఆ ప్రదేశాన ఉన్న మణిమయవైడూర్యపర్వతం శివస్వరూపం అని చెప్పబడుతోంది. అక్కడే అగస్త్యుని ఆశ్రమం ఉంది. అది ఫలమూలాలతో జీవనానికి యోగ్యం అయింది. (18)
సురాష్ట్రేష్వపి వక్ష్యామి పుణ్యాన్యాయతనాని చ ।
ఆశ్రమాన్ సరితశ్చైవ సరాంసి చ నరాధిప ॥ 19
సౌరాష్ట్రదేశంలోని పుణ్యస్థలాలను, ఆశ్రమాలను, నదులను సరోవరాల్ని ఇకపై వర్ణిస్తాను. వినవలసింది. (19)
చమసోద్భేదనం విప్రాః తత్రాపి కథయంత్యుత ।
ప్రభాసం చోదధౌ తీర్థం త్రిదశానాం యుధిష్ఠిర ॥ 20
అక్కడ చమసోద్బేదతీర్థాన్ని గురించి విని ప్రజలు చర్చించుకొంటారు. సురాష్ట్రసముద్రం ఒడ్డుపై ప్రభాసక్షేత్రం దేవతలకు నివాసమై వెలుగుతోంది. (20)
తత్ర పిండారకం నామ తాపసాచరితం శివమ్ ।
ఉజ్జయంతశ్చ శిఖరీ క్షిప్రం సిద్ధికరో మహాన్ ॥ 21
పిండారకతీర్థం కూడ ఋషిగణసేవితం, కళ్యాణకరం అయి అక్కడే ఉంది. ఆ వైపున ఉన్న ఉజ్జయంతం అనే పర్వతాన్ని శీఘ్రసిద్ధిప్రదాయకం అని చెబుతారు. (21)
తత్ర దేవర్షివర్యేణ నారదేనానుకీర్తితః ।
పురాణః శ్రూయతే శ్లోకః తం నిబోధ యుధిష్ఠిర ॥ 22
యుధిష్ఠిరా! ఆ విషయాన నారదునిచే గానం చేయబడిన ప్రాచీన శ్లోకాన్ని నా నుంచి విను. (22)
పుణ్యే గిరౌ సురాష్ట్రేషు మృగపక్షినిషేవితే ।
ఉజ్జయంతే స్మ తప్తాంగః నాకృపష్ఠే మహీయతే ॥ 23
సౌరాష్ట్రాన మృగపక్షి వ్యాప్తం అయిన ఉజ్జయంత పర్వతంపై ఎవరు తపస్సు ఆచరిస్తారో వారికి స్వర్గపూజ లభిస్తుంది. (23)
పుణ్యా ద్వారవతీ తత్ర యత్రాసౌ మధుసూదనః ।
సాక్షాద్ దేవః పురాణొఽసౌ స హి ధర్మః సనాతనః ॥ 24
ఉజ్జయంతపర్వతానికి సమీపాన ద్వారకానగరం ఉంది. అదియే సాక్షాత్తుగా మధుసూదనుని ప్రియతమనివాసం. వారే ప్రాచీన ధర్మస్వరూపులు. (24)
యే చ వేదవిదో విప్రాః యే చాధ్యాత్మవిదో జనాః ।
తే వదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనమ్ ॥ 25
వేదవేత్తలు, అధ్యాత్మకోవిదులు శ్రీకృష్ణుని పరమాత్మ అని, అత్యంత సనాతనుడు అని కీర్తిస్తారు. (25)
పవిత్రాణాం హి గోవిందః పవిత్రం పరముచ్యతే ।
పుణ్యానామపి పుణ్యోఽసౌ మంగలానాం చ మంగలమ్ ।
త్రైలోక్యే పుండరీకాక్షః దేవదేవః సనాతనః ॥ 26
అవ్యయాత్మా వ్యయాత్మా చ క్షేత్రజ్ఞః పరమేశ్వరః ।
ఆస్తే హరిరచింత్యాత్మా తత్రైవ మధుసూదనః ॥ 27
గోవిందుడు పవిత్రం చేసేవారిలో పరమపవిత్రుడు, పుణ్యాత్ములలో పుణ్యుడు, మంగళకరం అయిన వారిలో మంగళకారకుడు, పుండరీకాక్షుడు, దేవాధిదేవుడు, పరమేశ్వరుడు, సనాతుడు, అవినాశి, వినాశి (క్షరపురుషుడు) అయి ముల్లోకాల్లో విరాజిల్లుతున్నాడు. అచింత్యుడు, మధుసూదనుడు ద్వారకానగర వాసి అయి ప్రకాశిస్తున్నాడు. (26,27)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి ధౌమ్యతీర్థయాత్రాయామష్టాశీతితమోఽధ్యాయః ॥ 88 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున ధౌమ్యతీర్థయాత్ర అను ఎనుబది ఎనిమిదవ అధ్యాయము. (88)