89. ఎనుబది తొమ్మిదవ అధ్యాయము

ధౌమ్యుడు పశ్చిమదిక్కున ఉన్న తీర్థాలను వర్ణించుట.

ధౌమ్య ఉవాచ
ఆనర్తేషు ప్రతీచ్యాం వై కీర్తయిష్యామి తే దిశి ।
యాని తత్ర పవిత్రాణి పుణ్యాన్యాయతనాని చ ॥ 1
ధౌమ్యుడు పలికాడు.
పశ్చిమ దిక్కున ఆనర్తదేశాలలో పవిత్రతీర్థాలను, పుణ్యస్వరూపాలయిన దేవమందిరాలన్నింటిని గూర్చి ఇకపైన వివరిస్తాను. (1)
ప్రియంగ్వామ్రవణోపేతా వానీరఫలమాలినీ ।
ప్రత్యక్ర్సోతా నదీ పుణ్యా నర్మదా తత్ర భారత ॥ 2
భారతా! ఈ దిక్కున పవిత్రతమ అయిన నర్మదానది ప్రవహిస్తూ ఉంది. ఆ నదిధార పశ్చిమంగా సాగుతూ ఉంది. దాని ఒడ్డున ప్రియంగులతలు, మామిడి తోపులు, వానీర ఫలవృక్షాల వరుసలు అధికంగా ఉండి శోభిస్తూ ఉన్నాయి. (2)
త్రైలోక్యే యాని తీర్థాని పుణ్యాన్యాయతనాని చ ।
నరిద్వనాని శైలేంద్రాః దేవాశ్చ సపితామహాః ॥ 3
నర్మదాయాం కురుశ్రేష్ఠ సహ సిద్ధర్షిచారణైః ।
స్నాతుమాయాంతి పుణ్యౌఘైః సదా వారిషి భారత ॥ 4
భారతా! ముల్లోకాల్లో ఏ పుణ్యతీర్థాలు, మందిరాలు, నదులు, అరణ్యాలు, పర్వతాలు, బ్రహ్మాదిదేవతలు, సిద్ధులు ఋషులు, పుణ్యాత్ముల సమూహాలు ఉన్నాయో వారందరు నర్మదానదిలో స్నానం చేయటానికి వస్తారు. (3,4)
వికేతః శ్రూయతే పుణ్యః యత్ర విశ్రవసో మునేః ।
జజ్ఞే ధనపతిర్యత్ర కుబేరో నరవాహనః ॥ 5
అక్కడ మునిశ్రేష్ఠుడైన విశ్రవసువు పవిత్రాశ్రమం ఉంది. నరవాహనుడు కుబేరుడు ఈ ఆశ్రమాన పుట్టాడు. (5)
వైదూర్యశిఖరో నామ పుణ్యో గిరివరః శివః ।
నిత్యపుష్ఫఫలాస్తత్ర పాదపా హరితచ్ఛదాః ॥ 6
వైడూర్య శిఖరం అనే మంగళపర్వతం ఈ నర్మదానది ఒడ్డున ఉంది. పచ్చని ఆకులతో, ఎల్లప్పుడు ఫలాలతో ఇక్కడి చెట్లు ప్రకాశిస్తాయి. (6)
తస్య శైలస్య శిఖరే సరః పుణ్యం మహీపతే ।
పుల్లపద్మం మహారాజ దేవగంధర్వసేవితమ్ ॥ 7
మహారాజా! ఆ పర్వతశిఖరాన ఒక పుణ్యప్రదం అయిన సరోవరం ఉంది. దానిలో కమలాలు ఎప్పుడూ వికసించి ఉంటాయి. ఆ సరోవరాన్ని దేవతలు, గంధర్వులు సేవిస్తారు. (7)
బహ్వాశ్చర్యం మహారాజ దృశ్యతే తత్ర పర్వతే ।
పుణ్యే స్వర్గోపమే చైవ దేవర్షిగణసేవితే ॥ 8
మహారాజా! దేవర్షిగణసేవితం ఆ పుణ్యపర్వతం. స్వర్గంతో సమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ ఎన్నో ఆశ్చర్యకర విషయాలు చూస్తాం. (8)
హ్రదినీ పుణ్యతీర్థా చ రాజర్షేస్తత్ర వై సరిత్ ।
విశ్వామిత్రనదీ రాజన్ పుణ్యా పరపురంజయ ॥ 9
యస్యాస్తీరే సతాం మధ్యే యయాతిర్నహుషాత్మజః ।
పపాత స పునర్లోకాన్ లేభే ధర్మాన్ సనాతనాన్ ॥ 10
రాజా! ఆ ప్రదేశాన రాజర్షియైన విశ్వామిత్రుని తపఃఫలంగా ఏర్పడిన పుణ్యనది ఉంది. అది ఒక గొప్ప తీర్థంగా విరాజిల్లుతోంది. ఆ నది ఒడ్డున నహుషుడి కుమారుడు యయాతి సత్పురుషుల మధ్యలో పడి, తిరిగి సనాతన ధర్మలోకాలను వెళ్ళిపోయాడు. (9,10)
తత్ర పుణ్యో హ్రదః ఖ్యాతః మైనాకశ్చైవ పర్వతః ।
బహుమూలఫలోపేతః త్వసితో నామ పర్వతః ॥ 11
అక్కడ ఒక పుణ్యసరోవరం, మైన్కపర్వతం, ఫలపుష్పవంతం అయిన అసితపర్వతం ఉన్నాయి. (11)
ఆశ్రమః కక్షసేనస్య పుణ్యస్తత్ర యుధిష్ఠిర ।
చ్యవనస్యాశ్రమశ్చైవ విఖ్యాతస్తత్ర పాండవ ॥ 12
పాండవ ఆ పర్వతంపై కక్షసేనుని పవిత్రాశ్రమం ఉంది. చ్యవన మహర్షి ప్రసిద్ధాశ్రమం కూడ అక్కడే స్థాపించబడింది. (12)
తత్రల్పేనైవ సిధ్యంతి మానవాస్తపసా విభో ।
జంబూమార్గో మాహారాజ ఋషీణాం భావితాత్మనామ్ ॥ 13
ఆశ్రమః శామ్యతాం శ్రేష్ట మృగద్విజనిషేవితః ।
తక్కువ తపస్సు చేసినా అక్కడ సిద్ధి లభిస్తుంది. పశ్చిమదిక్కున జంబూమార్గం ఉంది. శుద్ధమనస్కులైన ఋషులక్కడ నివసిస్తారు. అది పశుపక్ష్యాదులతో నిండి ఉంది. ( 13 1/2)
తతః పుణ్యతమా రాజన్ సతతం తాపసైర్యుతా ॥ 14
కేతుమాలా చ మేధ్యా చ గంగాద్వారం చ భూమిప ।
ఖ్యాతం చ సైంధవారణ్యం పుణ్యం ద్విజనిషేవితమ్ ॥ 15
రాజా! ఆ ప్రదేశంలోనే తాపసులతో నిండిన పవిత్రక్షేత్రాలు కేతుమాల, మేధ్య, హరిద్వారం ఉన్నాయి. బ్రాహ్మణులచే సేవింపబడే సైంధవారణ్యం కూడ అక్కడే ఉంది. (14,15)
పితామహసరః పుణ్యం పుష్కరం నామ నామతః ।
వైఖానసానాం సిద్ధానామ్ ఋషీణామాశ్రమః ప్రియః ॥ 16
పుణ్యప్రదం అయిన బ్రహ్మదేవుని పుష్కరతీర్థం ఆ దిక్కునే ఉంది. అది వానప్రస్థులు, సిద్ధులు, ఋషులకు ప్రియం అని చెప్పబడుతోంది. (16)
అప్యత్ర సంశ్రయార్థాయ ప్రజాపతిరథో జగౌ ।
పుష్కరేషు కురుశ్రేష్ఠ గాథాం సుకృతినాం వర ॥ 17
పుష్కరనివాసానికై బ్రహ్మ ఈ వృత్తాంతాన్ని చెప్తాడు. (17)
మనసాప్యభికామస్య పుష్కరాణి మనస్వినః ।
విప్రణశ్యంతి పాపాని నాకపృష్ఠే చ మోదతే ॥ 18
మనస్వి అయిన జనుడు మనస్సులోనైనా ఇక్కడ ఉండాలని అనుకొంటేవాని పాపాలన్నీ నాశించి స్వర్గలోకాన ఆనందాలను అనుభవిస్తాడు. (18)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి ధౌమ్యతీర్థయాత్రాయాం ఏకోననవతితమోఽధ్యాయః ॥ 89 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున ధౌమ్యతీర్థయాత్ర అను ఎనుబది తొమ్మిదవ అధ్యాయము. (89)