90. తొంబదియవ అధ్యాయము

ధౌమ్యుడు ఉత్తరదిక్కున గల తీర్థాలను వర్ణించుట.

ధౌమ్య ఉవాచ
ఉదీచ్యాం రాజశార్దూల దిశి పుణ్యాని యాని వై ।
తాని తే కీర్తయిష్యామి పుణ్యాన్యాయతనాని చ ॥ 1
శృణుష్వావహితో భూత్వా మమ మంత్రయతః ప్రభో ।
కథాప్రతిగ్రహో వీర శ్రద్ధాం జనయతే శుభామ్ ॥ 2
ధౌమ్యుడు చెప్పినాడు.
రాజా! ఉత్తరదిక్కున ఉన్న తీర్థాలు, ఆశ్రమాలు, పవిత్రదేవాలయాలు, వీటిని గూర్చి వివరిస్తాను. నీవు సావధానచిత్తుడవు అయి విను. తీర్థయాత్రా ప్రసంగం వాటిపట్ల మంగళప్రదం అయిన శ్రద్ధను పెంచుతుంది. (1,2)
సరస్వతీ మహాపుణ్యా హ్రదినీ తీర్థమాలినీ ।
సముద్రగా మహావేగా యమునా యత్ర పాండవ ॥ 3
పాండవా! తీర్థసముదాయంతో ప్రకాశించే సరస్వతీనది చాలా పుణ్యాన్ని ఇస్తుంది. యమునానది ఉత్తర దిక్కున ఉంది. (3)
యత్ర పుణ్యతరం తీర్థం ప్లక్షావతరణం శుభమ్ ।
యత్ర సారస్వతైరిష్ట్వా గచ్ఛంత్యవభృథైర్ద్విజాః ॥ 4
అక్కడే పుణ్యప్రదం అయిన ప్లక్షావతరణతీర్థం ఉంది. అక్కడ సారస్వతయజ్ఞం చేసి బ్రాహ్మణులు అవభృథస్నానం కోసం ఈ తీర్థానికి వెడుతూ ఉంటారు. (4)
పుణ్యం చాఖ్యాయతే దివ్యం శివమగ్నిశిరోఽనఘ ।
సహదేవోఽయజద్ యత్ర శమ్యాక్షేపేణ భారత ॥ 5
భారతా! దివ్యం, కళ్యాణమయం అయిన అగ్నిశిరస్సు అనే పుణ్యతీర్థం అక్కడే ఉంది. ఆ తీర్థంలో సహదేవుడు శమ్య అనే యజ్ఞపాత్రను విసరిన అది ఎంత దూరంలో పడిందో అక్కడ మండపం నిర్మించి యజ్ఞం చేశాడు. (5)
వి॥సం॥ సహదేవః = ఇతడు సృంజయుని కుమారుడు. (నీల)
ఏతస్మిన్నేవ చార్థేఽసౌ ఇంద్రగీతా యుధిష్ఠిర ।
గాథా చరతి లోకేఽస్మిన్ గీయమానా ద్విజాతిభిః ॥ 6
యుధిష్ఠిరా! ఈ విషయంలో ఇంద్రుడు గానం చేసిన గాధను బ్రాహ్మణులు గానం చేస్తారు. (6)
అగ్నయః సహదేవేన సేవితా యమునామను ।
తే తస్య కురుశార్దూల సహస్రశతదక్షిణాః ॥ 7
కురుశార్దూలా! సహదేవుడు యమునానదీతీరాన లక్షగోవులను దానం ఇచ్చి అగ్నిని ఉపాసించాడు. (7)
తత్రైవ భరతో రాజా చక్రవర్తీ మహాయశాః ।
వింశతిః సప్త చాష్టౌ చ హయమేధానుపాహరత్ ॥ 8
ఇక్కడే గొప్పకీర్తిగల భరత చక్రవర్తి ముప్పది ఐదు అశ్వమేధయాగాలను చేశాడు. (8)
కామకృద్ యో ద్విజాతీనాం శ్రుతస్తాత యథా పురా ।
అత్యంతమాశ్రమః పుణ్యః శరభంగస్య విశ్రుతః ॥ 9
నాయనా! ప్రాచీన కాలాన బ్రాహ్మణుల మనోవాంఛలు తీర్చిన భరతుడు అనే రాజును గూర్చి మనం విన్నాం. ఉత్తరాఖండంలోనే శరభంగుని పవిత్రమైన ఆశ్రమప్రదేశం ఉంది. (9)
సరస్వతీ నదీ సద్భిః సతతం పార్థ పూజితా ।
వాలఖిల్యైర్మహారాజ యత్రేష్టమృషిభిః పురా ॥ 10
మహారాజా! సత్పురుషులు ఎల్లప్పుడు సరస్వతీ నదిని ఉపాసిస్తారు. పూర్వకాలాన ఇక్కడ వాలిఖిల్యులు యజ్ఞం చేశారు. (10)
దృషద్వతీ మహాపుణ్యా యత్ర ఖ్యాతా యుధిష్ఠిర ।
వ్యగ్రోధాఖ్యస్తు పుణ్యాఖ్యః పాంచాల్యో ద్విపదాంవర ॥ 11
దాల్భ్యఘోషశ్చ దాల్భ్యశ్చ ధరణీస్థో మహాత్మనః ।
కౌంతేయానంతయశసః సువ్రతస్యామితౌజసః ॥ 12
ఆశ్రమః ఖ్యాయతే పుణ్యః త్రిషు లోకేషు విశ్రుతః ।
యుధిష్ఠిరా! పరమపవిత్రం అయిన దృషద్వతీనది ఇక్కడ ప్రవహిస్తోంది. ఇక్కడ న్యగ్రోధం, పుణ్యం, పాంచాల్యం, దాల్భ్యఘొషం, దాల్భ్యం అనే అయిదు ఆశ్రమాలు ఉన్నాయి.
ఆంతకీర్తి, తేజోవంతుడు అయిన సువ్రతుని పవిత్ర ఆశ్రమం ఇక్కడే ఉంది. ఇది ముల్లోకాల్లో మిక్కిలి ప్రసిద్ధం. (11,12)
ఏతావర్ణావవర్ణౌ చ విశ్రుతౌ మనుజాధిప ॥ 13
రాజా! ఉత్తరాఖండంలో ప్రఖ్యాతులు అయిన నరనారాయణులు ఉన్నారు. వీరు లేడివర్ణం కలవారయినా వర్ణ (గుణ) రహితులు. (13)
వేదజ్ఞౌ వేదవిద్వాంసౌ వేదవిద్యావిదావుభౌ ।
ఈజాతే క్రతుభిర్ముఖ్యైః పుణ్యైర్భరతసత్తమ ॥ 14
వీరిరువురు వేదజ్ఞులు, వేదమర్మం తెలిసినవారు, వేదవిద్యను చదివినవారు. పవిత్రం అయిన యజ్ఞాలు వీరు చేశారు. (14)
సమేత్య బహుశో దేవాః సేంద్రాః సవరుణాః పురా ।
విశాఖయూపేఽతప్యంత తేన పుణ్యతమశ్చ సః ॥ 15
ప్రాచీనకాలాన ఇంద్రుడు, వరుణుడు మొదలైన దేవతలు కలిసి విశాఖయూపం అనే ప్రదేశంలో తపస్సుచేసి ఆ ప్రదేశాన్ని పవిత్రం చేశారు. (15)
ఋషిర్మహాన్ మహాభాగో జమదగ్నిర్మహాయశాః ।
పలాశకేషు పుణ్యేషు రమ్యేష్వయజత ప్రభుః ॥ 16
మహాబాహుడు, గొప్పకీర్తికలవాడు, ప్రభావశలి అయిన జమదగ్ని సుందరమూ, పుణ్యప్రదమూ అయిన పలాశవనంలో యాగాలు చేశాడు. (16)
యత్ర సర్వాః సరిచ్ర్ఛేష్ఠాః సాక్షాత్ తమృషిసత్తమమ్ ।
స్వం స్వం తోయముపాదాయ పరివార్యోపతస్థిరే ॥ 17
శ్రేష్ఠనదులన్నీ ఆకారాలను ధరించి తమతమజలాలు తీసుకొని ఆ జమదగ్ని వద్దకు వచ్చి అతనికి అన్నివైపులా నిలబడి ఎదురుచూశాయి. (17)
అపి చాత్ర మహారాజ స్వయం విశ్వావసుర్జగౌ ।
ఇమం శ్లోకం తదా వీర ప్రేక్ష్య దీక్షాం మహాత్మనః ॥ 18
మహారాజా! మహాత్ముడై జమదగ్ని యాగాన్ని కన్నులారా చూచిన గంధర్వరాజు విశ్వావసువు స్వయంగా ఈ శ్లోకాన్ని పఠించాడు. (18)
యజమానస్య వై దేవాన్ జమదగ్నేర్మహాత్మనః ।
ఆగమ్య సరితో విప్రాన్ మధునా సమతర్పయన్ ॥ 19
మహాత్ముడైన జమదగ్ని ఏ యజ్ఞంలో దేవతలను ఆరాధించాడో ఆ యజ్ఞంలో నదులన్నీ వచ్చి మధువును సేకరించి బ్రాహ్మణులను తృప్తిపరచాయి. (19)
గంధర్వయక్షరక్షోభిః అప్సరోభిశ్చ సేవితమ్ ।
కిరాతకిన్నరావాసం శైలం శిఖరిణాం వరమ్ ॥ 20
బిభేద తరసా గంగా గంగాద్వారం యుధిష్ఠిర ।
పుణ్యం తత్ ఖ్యాయతే రాజన్ బ్రహర్షిగణసేవితమ్ ॥ 21
పర్వతరాజైన హిమాలయం కిరాతులకు, కిన్నరులకు నివాసస్థానం. గంధర్వులు, యక్షులు, రాక్షసులు, అప్సరసలు ఆ పర్వతాన్ని సదా సేవిస్తారు. యుధిష్ఠిరా! గంగానది మిక్కిలివేగంగా ఆ పర్వతాన్ని చీల్చుకొని బయటకు వచ్చింది. దానికి హరిద్వారం అని పేరు. ఆ తీర్థంలో ఎల్లప్పుడు బ్రాహ్మణులు కొలువు తీరి ఉంటారు. (20,21)
సనత్కుమారః కౌరవ్య పుణ్యం కనఖలం తథా ।
పర్వతశ్చ పురుర్నామ యత్ర యాతః పురూరవాః ॥ 22
కౌరవ్యా! పుణ్యమయం అయిన కనఖలంలో సనత్కుమారులు పూర్వం సంచరించారు.పురువనే పేరు గల ప్రసిద్ధపర్వతం అక్కడే ఉంది. పురూరవుడు ప్రాచీన కాలంలో అక్కడకు యాత్రను సాగించాడు. (22)
భృగుర్యత్ర తపస్తేపే మహర్షిగణసేవితే ।
రాజన్ స ఆశ్రమః ఖ్యాతః భృగుతుండో మహాగిరిః ॥ 23
మహర్షులు సేవించే ఆ ఆశ్రమంలోనే భృగుమహర్షి తపస్సు చేశాడు. అదే భృగు తుంగ మనే మహాగిరి. (23)
యః స భూతం భవిష్యచ్చ భవచ్చ భరతర్షభ ।
నారాయణః ప్రభుర్విష్ణుః శాశ్వతః పురుషోత్తమః ॥ 24
తస్యాతియశసః పుణ్యాం విశాలాం బదరీమను ।
ఆశ్రమః ఖ్యాయతే పుణ్యః త్రిషు లోకేషు విశ్రుతః ॥ 25
భూతభవిష్యత్ వర్తమానకాలరూపుడు, శక్తిమంతుడు, సర్వత్ర వ్యాపించినవాడు సనాతనుడు, పురుషోత్తముడు, నారాయణుడైన శ్రీహరి విశాలాపురప్రదేశం బదరీ వనసమీపంలో ఉంది. అది నరనారాయణుల ఆశ్రమం అని, బదరికాశ్రమం అని కొనియాడుబడుతోంది. (24,25)
ఉష్ణతోయవహా గంగా శీతతోయవహా పురా ।
సువర్ణసికతా రాజన్ విశాలాం బదరీమను ॥ 26
రాజా! పూర్వకాలం నుంచి విశాలాపురిలో బదరికాశ్రమసమీపాన గల గంగానది వేడినీరు, చల్లని నీరు కలిగి ప్రవహిస్తోంది. అక్కడ ఇసుక బంగారంలా మెరుస్తూ ఉంటుంది. (26)
ఋషయో యత్ర దేవాశ్చ మహాభాగా మహౌజసః ।
ప్రాప్య నిత్యం నమస్యంతి దేవం నారాయణం ప్రభుమ్ ॥ 27
యత్ర నారాయణో దేవః పరమాత్మా సనాతనః ।
తత్ర కృత్స్నం జగత్ సర్వం తీర్థాన్యాయతనాని చ ॥ 28
అక్కడకు మహాభాగులు, తేజోవంతులు, అయిన మహర్షులు ప్రతిదినం పోయి నరనారాయణులకు నమస్కరిస్తారు. సనాతన దేవుడైన నారాయణుడు అక్కడ కొలువు తీరాడు. (27,28)
తత్ పుణ్యం పరమం బ్రహ్మ తత్ తీర్థం తత్ తపోవనమ్ ।
తత్ పరం పరమం దేవం భూతానాం పరమేశ్వరమ్ ॥ 29
ఆ బదరికాశ్రమం పుణ్యక్షేత్రం, పరబ్రహ్మస్వరూపం. అక్కడే తీర్థాలు, తపోవనాలు, పరమేశ్వరుడు కూడ ఉన్నారు. (29)
శాశ్వతం పరమం చైవ ధాతారం పరమం పదమ్ ।
యం విదిత్వా న శోచంతి విద్వాంసః శాస్త్రదృష్టయః ॥ 30
తత్ర దేవర్షయః సిద్ధాః సర్వే చైవ తపోధనాః ।
అక్క్డ ప్రాచీనుడు అయిన పరబ్రహ్మ, పరమపదం ఉన్నాయి. దేన్ని తెలిసి శాస్త్రచక్షువులైన విద్వాంసులు దుఃఖింపరో ఆ ప్రదేశం ఇదియే. దేవర్షులు, సిద్ధులు, తపోధనులు ఇక్కడే నివసిస్తారు. (30 1/2)
ఆదిదేవో మహాయోగీ యత్రాస్తే మధుసూదనః ॥ 31
పుణ్యానామపి తత్ పుణ్యమ్ అత్ర తే సంశయోఽస్తు మా ।
ఏతాని రాజన్ పుణ్యాని పృథివ్యాం పృథివీపతే ॥ 32
కీర్తితాని నరశ్రేష్ఠ తీర్థాన్యాయతనాని చ ।
ఏతాని వసుభిః సాధ్యైః ఆధిత్యైర్మరుదశ్విభిః ॥ 33
ఋషిభిర్దేవకల్పైశ్చ సేవితాని మహాత్మభిః ।
చరన్నేతాని కౌంతేయ సహితో బ్రాహ్మణర్షభైః ।
భ్రాతృభిశ్చ మహాభాగైః ఉత్కంఠాం విహరిష్యసి ॥ 34
మహాయోగి, ఆదిదేవుడు అయిన నారాయణుడు ఇక్కడ వెలసియున్నాడు. అది పవిత్రప్రదేశాలలో కెల్ల పవిత్రం. ఈ విషయంలో సందేహం లేదు. రాజా! భూమండలాన పుణ్యతీర్థాలు, ఆశ్రమాలు, అని ప్రసిద్ధమైన వాటిని వసువులు, సాధ్యులు, ఆదిత్యులు మరుద్గణాలు, అశ్వినీదేవతలు, మునులు, ఋషులు అందరూ సేవిస్తారు. నీవు శ్రేష్ఠులైన బ్రాహ్మణులతో, సోదరులతో ఈ ప్రదేశాల్లో సంచరిస్తే అర్జునుని క్లవాలి అనే నీ తపన శాంతిస్తుంది. (31-34)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి ధౌమ్యతీర్థయాత్రాయాం నవతితమోఽధ్యాయః ॥ 90 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున ధౌమ్యతీర్థయాత్ర అను తొంబదియవ అధ్యాయము. (90)