100. నూరవ అధ్యాయము
దేవతలకు దధీచమహర్షి వెన్నెముక ఇచ్చుట. వజ్రాయుధము నిర్మించుట.
యుధిష్ఠిర ఉవాచ
భూయ ఏవాహమిచ్ఛామి మహర్షేస్తస్య ధీమతః ।
కర్మణాం విస్తరం శ్రోతుమ్ అగస్తస్య ద్విజోత్తమ ॥ 1
ధర్మజుడు పలికాడు. నేను అగస్త్యమహర్షి చరిత్రను వివరంగా మరల వినాలని కుతూహలంతో ఉన్నాను. (1)
లోమశ ఉవాచ
శృణు రాజన్ కథాం దివ్యామ్ అద్భుతామతిమానుషీమ్ ।
అగస్త్యస్య మహారాజ ప్రభావమమితౌజసః ॥ 2
లోమశుడు పలికాడు - మిక్కిలి తేజస్సంపన్నుడైన అగస్త్యుని కథ దివ్యం, అలౌకికం, అద్భుతం. ఆయన ప్రభావం చాలా గొప్పది. వినిపిస్తాను విను. (2)
ఆసన్ కృతయుగే ఘోరాః దానవా యుద్ధదుర్మదాః ।
కాలకేయా ఇతి ఖ్యాతాః గణాః పరమదారుణాః ॥ 3
సత్యయుగంలో కాలకేయులు అనే పేరు గల దైత్యగణం ఉంది. వారు స్వభావంచే దయలేనివారు. క్రూరులు. యుద్ధంలో ఆసక్తి కలవారు. (3)
తే తు వృత్రం సమాశ్రిత్య నానాప్రహరణోద్యతాః ।
సమంతాత్ పర్యధావంత మహేంద్రప్రముఖాన్ సురాన్ ॥ 4
వారందరూ అన్ని ఆయుధాలూ గ్రహించి, సంసిద్ధులై వృత్రాసురుడు నాయకుడుగా ఇంద్రాదిదేవతల్ని నాలుగువైపుల నుంచి ఆక్రమించి దాడి చేశారు. (4)
తతో వృత్రవధే యత్నమ్ అకుర్వంస్త్రిదశాః పురా ।
పురందరం పురస్కృత్య బ్రహ్మాణముపతస్థిరే ॥ 5
అప్పుడు దేవతలు అందరు వృత్రుని వధించాలని ప్రయత్నం చేశారు. వారు ఇంద్రుని ముందు ఉంచుకొని బ్రహ్మలోకానికి చేరారు. (5)
కృతాంజలీంస్తు తాన్ సర్వాన్ పరమేష్ఠీత్యువాచ హ ।
విదితం మే సురాః సర్వం యద్ వః కార్యం చికీర్షితమ్ ॥ 6
ఆయన్ని సమీపించి దేవతలు నమస్కరించారు. వారితో బ్రహ్మ ఇలా పలికాడు - మీరు ఏ పని నిమిత్తం ఇక్కడకు వచ్చారో అది నాకు పరిపూర్ణంగా తెలుసు. (6)
తముపాయమ్ ప్రవక్ష్యామి యథా వృత్రం వధిష్యథ ।
దధీచ ఇతి విఖ్యాతః మహానృషిరుదారధీః ॥ 7
తం గత్వా సహితాః సర్వే వరం వై సంప్రయాచత ।
స వో దాస్యతి ధర్మాత్మా సుప్రీతేనాంతరాత్మనా ॥ 8
వృత్రుని వధించగల ఉపాయం చెప్తాను. వినండి. దధీచి అనే ప్రసిద్ధిపొందిన గొప్పహృదయం గల ఋషి ఉన్నాడు. అతని వద్దకు చేరి మీరందరు వరాన్ని కోరండి ధర్మాత్ముడైన అతడు ప్రసన్నమనస్కుడై మీరు కోరిన వరాన్ని ఇస్తాడు. (7,8)
స వాచ్యః సహితైః సర్వైః భవద్భిర్జయకాంక్షిభిః ।
స్వాన్యస్థీని ప్రయచ్ఛేతి త్రైలోక్యస్య హితాయ వై ॥ 9
ఆయన వరాన్ని ఇవ్వటానికి అంగీకరించిన వెంటనే విజయాభిలాషులై మీరు ముల్లోకాల మేలు కోసం " మీ శరీరంలోని ఎముకల్ని దానం చెయ్యండి" అని అడగండి. (9)
స శరీరం సముత్సృజ్య స్వాన్యస్థీని ప్రదాస్యతి ।
తస్యాస్థిభిర్మహాఘోరం వజ్రం సంస్ర్కియతాం దృఢమ్ ॥ 10
మీ కోరికను అనుసరించి ఆ మహర్షి శరీరాన్ని విడచి ఎముకల్ని దానం చేస్తాడు. ఆ ఎముకలతో మీరు భయంకరమయిన వజ్రాయుధాన్ని నిర్మించండి. (10)
మహచ్ఛత్రుహణం ఘోరం షడశ్రం భీమనిఃస్వనమ్ ।
తేన వజ్రేణః వై వృత్రం వధిష్యతి శతక్రతుః ॥ 11
దాని ఆకృతి ఆరు అంచులతో ఉంటుంది. అది శత్రునాశకమూ, భయంకరమూ అయిన ధ్వనిని చేస్తుంది. ఆ వజ్రాయుధంతో ఇంద్రుడు నిశ్చయంగా వృత్రాసురుని సంహరిస్తాడు. (11)
ఏతద్ వః సర్వమాఖ్యాతం తస్మాచ్ఛీఘ్రం విధీయతామ్ ।
ఏవముక్తాస్తతో దేవాః అనుజ్ఞాప్య పితామహమ్ ॥ 12
నారాయణం పురస్కృత్య దధీచస్యాశ్రమం యయుః ।
సరస్వత్యాః పరే పారే నానాద్రుమలతావృతమ్ ॥ 13
ఈ వృత్తాంతం అంతా మీకు తెలియజేశాను. మీరు శీఘ్రంగా ఆచరించండి." బ్రహ్మదేవుని మాటల్ని అనుసరించి ఆయన ఆజ్ఞను తీసుకొన్నారు. నారాయణుని నాయకత్వంలో దధీచి మహర్షి ఆశ్రమం చేరారు. అది సరస్వతీనదీతీరంలో చాలా చెట్లతో, లతలతో వ్యాపించి ఉంది. (12,13)
షట్పదోద్గీతనినదైః విఘుష్టం సామగైరివ ।
పుంస్కోకిలరవోన్మిశ్రం జీవం జీవకనాదితమ్ ॥ 14
బ్రాహ్మణుల సామవేదగానాన్ని పోలిన భ్రమరనాదాలతో ఆ ప్రదేశం మార్ర్మోగుతోంది. పుంస్కోకిలలు, పశుపక్ష్యాదుల కోలాహలధ్వనులతో నిండి ఉంది. (14)
మహిషైశ్చ వరాహైశ్చ సృమరైశ్చమరైరపి ।
తత్ర తత్రానుచరితం శార్దూలభయవర్జితైః ॥ 15
దున్నలు, వరాహాలు, వాలమృగాలు, చమరీమృగాలు వ్యాఘ్ర సింహాదుల భయం వీడి ఆ ఆశ్రమప్రదేశంలో సంచరిస్తున్నాయి. (15)
కరేణుభిర్వారణైశ్చ ప్రభిన్నకరటాముఖైః ।
సరోఽవగాఢైః క్రీడద్భిః సమంతాదనునాదితమ్ ॥ 16
మదధారలు స్రవిస్తూ జలక్రీడలాడే మగ, ఆడ, ఏనుగుల ఘీంకారాలతో నాలుగువైపుల ఆ ఆశ్రమం వ్యాపించి ఉంది. (16)
సింహవ్యాఘ్రైర్మహానాదాః నదద్భిరనువాదితమ్ ।
అపరైశ్చాపి సంలీనైః గుహాకందరశాయిభిః ॥ 17
పర్వతగుహల్లో, కందరాల్లో సింహవ్యాఘ్రాదుల గర్జనలతో ఆశ్రమం ధ్వనిస్తోంది. (17)
తేషు తేష్వవకాశేషు శోభితం సుమనోరమమ్ ।
త్రివిష్టపసమప్రఖ్యం దధీచాశ్రమమాగమన్ ॥ 18
ఆయా ప్రదేశాల్లో చక్కగా ప్రకాశిస్తూ ఇంద్రుని స్వర్గంతో సమానం అయిన దధీచిమహర్షి ఆశ్రమాన్ని దేవతలందరూ చేరారు. (18)
తత్రాపశ్యన్ దధీచం తే దివాకరసమద్యుతిమ్ ।
జాజ్వల్యమానం వపుషా యథా లక్ష్మ్యా పితామహమ్ ॥ 19
సూర్యసమకాంతితో ప్రకశిస్తూ తన దివ్య శరీరకాంతిచే బ్రహ్మను పోలిన దధీచి మహర్షిని వారక్కడ చూశారు. (19)
తస్య పాదౌ సురా రాజన్ అభివాద్య ప్రణమ్య చ ।
అయాచంత వరం సర్వే యథోక్తం పరమేష్ఠినా ॥ 20
అదే సమయంలో దేవతలందరు దధీచి మహర్షి పాదాలకు అభివాదం, నమస్కారం చేసి బ్రహ్మకోరమన్న రీతిలో వరాన్ని ఇమ్మని ఆయన్ని అడిగారు. (20)
తతో దధీచః పరమప్రతీతః
సురోత్ట్తమాంస్తావిదమభ్యువాచ ।
కరోమి యద్ వో హితమద్య దేవాః
స్వం చాపి దేహం స్వయముత్సృజామి ॥ 21
దధీచి ప్రసన్నుడై దేవతాశ్రేష్ఠులతో ఇలా అన్నాడు. "మీకు హితాన్ని నేను ఆచరిస్తాను. ఈ శరీరాన్ని మీకోసం తప్పక విడచిపెడతాను.' (21)
స ఏవముక్త్వా ద్విపదాం వరిష్ఠః
ప్రాణాన్ వశీ స్వాన్ సహసోత్ససర్జ ।
తతః సురాస్తే జగృహుః పరాసో
రస్థీని తస్యాథ యథోపదేశమ్ ॥ 22
జితేంద్రియుడు, మనుజశ్రేష్ఠుడు అయిన దధీచి వారితో అలా పలుకుతూనే తన ప్రాణాలు విడచాడు. ఆ దేవతలు బ్రహ్మ ఆదేశానుసారం ప్రాణాలు పోయిన అతని శరీరం నుండి ఎముకలను గ్రహించారు. (22)
ప్రహృష్టరూపాశ్చ జయాయ దేవాః
త్వష్టారమాగమ్య తమర్థమూచుః ।
త్వష్టా తు తేషాం వచనం నిశమ్య
ప్రహృష్టరూపః ప్రయతాః ప్రయత్నాత్ ॥ 23
చకార వజ్రం భృశముగ్రరూపం
కృత్వా చ శక్రం స ఉవాచ హృష్టః ।
అనేన వజ్రప్రవరేణ దేవ
భస్మీకురుష్వాద్య సురారిముగ్రమ్ ॥ 24
పిమ్మట సంతోషించిన దేవతలు త్వష్టప్రజాపతి వద్దకు చేరి తమ ప్రయోజనాన్ని వివరించారు. దేవతల మాటలతో త్వష్ట ప్రజాపతి మిక్కిలి ప్రసన్నుడయ్యాడు. అతడు ఏకాగ్రచిత్తంతో భయంకర వజ్రాయుధ నిర్మాణం చేశాడు. ఆపై ఇంద్రునితో ఇలా అన్నాడు. " ఈ వజ్రాయుధంతో దేవద్రోహియైన వృత్రాసురుని భస్మం చెయ్యి. (23,24)
తతో హతారిః సగణః సుఖం వై
ప్రశాధి కృత్స్నం త్రిదివం దివిష్ఠః ।
త్వష్ట్రా తథోక్తస్తు పురందరస్తద్
వజ్రం ప్రహృష్టః ప్రయతో హ్యగృహ్ణాత్ ॥ 25
ఈ విధంగా శత్రువును చంపి దేవతలకు సుఖాన్ని కలిగిస్తూ స్వర్గాన్ని పాలించు." త్వష్టృప్రజాపతి పలుకులు విని ఆనందంతో ప్రసన్నుడై ఇంద్రుడు వజ్రాయుధాన్ని అందుకొన్నాడు. (25)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం వజ్రనిర్మాణకథనే శతతమోఽధ్యాయః ॥ 100 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో వజ్రనిర్మాణకథనము అను నూరవ అధ్యాయము. (100)