101. నూట ఒకటవ అధ్యాయము

వృత్రునివధ, జగన్నాశము కొరకు అసురుల దుర్మంత్రణము.

లోమశ ఉవాచ
తతః స వజ్రీ బలిభిః దేవతైరభిరక్షితః ।
ఆససాద తతో వృత్రం స్థితమావృత్య రోదసీ ॥ 1
లోమశుడన్నాడు. పిమ్మట వజ్రధారి దేవతాగణరక్షితుడై వృత్రుని వద్దకు చేరాడు. ఆ వృత్రుడు భూమ్యాకాశాల్ని ఆవరించి ఉన్నాడు. (1)
కాలకేయైర్మహాకాయైః సమంతాదభిరక్షితమ్ ।
సముద్యప్రహరణైః సశృంగైరివ పర్వతైః ॥ 2
కాలకేయులు అనే విశాల శరీరధారులైన దైత్యులు చేతులతో ఆయుధాలు దాల్చి శిఖరాలు గల పర్వతపంక్తివలె ఉండి అతనిని అన్నివైపుల నుంచి రక్షిస్తున్నారు. (2)
తతో యుద్ధం సమభవద్ దేవానాం దానవైః సహ ।
ముహూర్తం భరతశ్రేష్ఠ లోకత్రాసకరం మహత్ ॥ 3
ఇంద్రుడు వస్తుండగనే దేవదానవులకు లోకభయంకరమయిన యుద్ధం జరిగింది. దాని వలన ముల్లోకాలు భయపడ్డాయి. (3)
ఉద్యతప్రతిపిష్టానాం ఖడ్గానాం వీరబాహుభిః ।
ఆసీత్ సుతుములః శబ్దః శరీరేష్వభిపాత్యతామ్ ॥ 4
వీరుల భుజాలతో లేచిన ఆయుధాలు శత్రుయోధుల శరీరప్రహారాలతో కలిసి చూర్ణాలై అత్యంత భయంకర శబ్దం చేశాయి. (4)
శిరోభిః ప్రపతద్భిశ్చాప్యంతరిక్షాన్మహీతలమ్ ।
తాలైరివ మహారాజ వృంతాద్ భ్రష్టైరదృశ్యత ॥ 5
తొడిమనుంచి వీడిన తాటిపండ్లవలె ఆకాశాన్నుంచి జారిపడే యోధుల తలలు భూమిని అంతటినీ కప్పివేశాయి. (5)
తే హేమకవచా భూత్వా కాలేయాః పరిగాయుధాః ।
త్రిదశానభ్యవర్తంత దావదగ్ధా ఇవాద్రయః ॥ 6
కాలకేయులు బంగారుకవచాలు ధరించి పరిఘలను గైకొని దేవతలపై పడ్డారు. అప్పుడు వారు దావాగ్ని కమ్ముకొన్న పర్వతాల వలె శోభించారు. (6)
తేషాం వేగవతాం వేగం సాభిమానం ప్రధావతామ్ ।
న శేకుస్ర్తిదశాః సోఢుం తే భగ్నాః ప్రాద్రవన్ భయాత్ ॥ 7
దర్పంతో వేగంగా ముందుదాడి చేసే ఆ దైత్యుల వేగాన్ని దేవతలు సహించలేక భయంతో పరుగులు పెట్టారు. (7)
తాన్ దృష్ట్వా ద్రవతో భీతాన్ సహస్రాక్షః పురందరః ।
వృత్రే వివర్ధమానే చ కశ్మలం మహదావిశత్ ॥
సహస్రాక్షుడైన ఇంద్రుడు భీతితో పరుగులెత్తే వారిని చూసి, వృత్రుని పెరుగుదలను ఊహించి, మిక్కిలి మోహాన్ని పొందాడు. (8)
కాలేయభయసంత్రస్తః దేవః సాక్షాత్ పురందరః ।
జగామ శరణం శీఘ్రం తం తు నారాయణం ప్రభుమ్ ॥ 9
కాలకేయులకు భయపడిన ఇంద్రుడు వేగంగా శ్రీమన్నారాయణుని శరణు కోరాడు. (9)
తం శక్రం కశ్మలావిష్టం దృష్ట్వా విష్ణుః సనాతనః ।
స్వతేజో వ్యదధాచ్ఛక్రే బలమస్య వివర్ధయన్ ॥ 10
ఆ ఇంద్రుని మోహాన్ని గమనించి, ప్రాచీనుడైన శ్రీమహావిష్ణువు అతని బలాన్ని పెంచడం కోసం తన తేజస్సును అతనిలో నింపాడు. (10)
విష్ణునా గోపితం శక్రం దృష్ట్వా దేవగణాస్తతః ।
సర్వే తేజః సమాదధ్యః తథా బ్రహ్మర్షయోఽమలాః ॥ 1
శ్రీమహావిష్ణువుచే రక్షింపబడ్డ ఇంద్రుని చూచి దేవతలు, పరిశుద్ధమనస్సులు గల బ్రహ్మర్షులు వారి తేజస్సును కూడ ఇంద్రునిలో ప్రవేశపెట్టారు. (11)
స సమాప్యాయితః శక్రః విష్ణునా దైవతైః సహ ।
ఋషిభిశ్చ మహాభాగైః బలవాన్ సమపద్యత ॥ 12
జ్ఞాత్వా బలస్థం త్రిదశాధిపం తు
ననాద వృత్రో మహతో నినాదాన్ ।
తస్య ప్రణాదేన ధరా దిశశ్చ
ఖం ద్యౌర్నగాశ్చాపి చచాల సర్వమ్ ॥ 13
విష్ణువుచే, ఋషులచే, దేవతలచే నింపబడిన తేజస్సుతో ఇంద్రుడు మిక్కిలి బలశాలి అయినాడు. ఇంద్రుని బలసంపన్నునిగా తెలిసికొని వృత్రాసురుడు వికటంగా గర్జనలు చేశాడు. అతని గర్జనలతో అన్ని దిక్కులు, ఆకాశం, భూమి పర్వతాలు అన్నీ కంపించాయి. (12,13)
తతో మహేంద్రః పరమాభితప్తః
శ్రుత్వా రవం గోరరూపం మహాంతమ్ ।
భయే నిమగ్నస్త్వరితో ముమోచ
వజ్రం మహత్ తస్య వధాయ రాజన్ ॥ 14
మహేంద్రుడు ఆ గర్జనలను విని సంతాపంతో భీతుడై వృత్రాసురవధకై తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. (14)
స శక్రవజ్రాభిహతః పపాత
మహాసురః కాంచనమాల్యధారీ ।
యథా మహాశైలవరః పురస్తాత్
స మందరో విష్ణూకరాద్ విముక్తః ॥ 15
ఇంద్రుని వజ్రాయుధం దెబ్బ తగిలి బంగారు మాల ధరించిన వృత్రుడు పూర్వం విష్ణువు చేతినుంచి జారిపడ్డ మందరపర్వతం వలె నేల కూలాడు. (15)
తస్మిన్ హతే దైత్యవరే భయార్తః
శక్రః ప్రదుద్రావ సరః ప్రవేష్టుమ్ ।
వజ్రం స మేనే న కరాద్ విముక్తం
వృత్రం భయాచ్చాపి హతం న మేనే ॥ 16
ఆ వృత్రుడు చనిపోగా భీతినొందిన ఇంద్రుడు సరస్సులో ప్రవేశించటానికి పరుగుపెట్టాడు. భయం వలన ఇంద్రుడు వజ్రాయుధాన్ని చేతి నుంచి జారినట్లు భావించలేదు. వృత్రుడు చనిపోయాడనీ అనుకోలేదు. (16)
సర్వే చ దేవా ముదితాః ప్రహృష్టాః
మహర్షయశ్చేంద్రమభిష్టువంతః ।
సర్వాంశ్చ దైత్యాంస్త్వరితాః సమేత్య
జఘ్నుః సురా వృత్రవధాభితప్తాన్ ॥ 17
దేవతలు, మహర్షులు ప్రసన్నులై ఇంద్రుని స్తోత్రం చేయసాగారు. దేవతలు అందరు కలిసి వృత్రుని వధతో కుమిలిపోతున్న అసురులను చంపివేశారు. (17)
తైస్త్రాస్యమానాస్త్రిదశైః సమేతైః
సముద్రమేవావివిశుర్భయార్తాః ।
ప్రవిశ్య చైవోదధిమప్రమేయం
ఝషాకులం నక్రసమాకులం చ ॥ 18
దేవతలచే భయపెట్టబడిన కాలకేయులు అందరూ భయంతో సముద్రంలో ప్రవేశించారు. పెద్దపెద్ద చేపలు, మొసళ్ళు గల సముద్రంలో ప్రవేశించి... (18)
తదా స్మ మంద్రం సహితాః ప్రచక్రముః
త్రైలోక్యనాశార్థమభిస్మయంతః ।
తత్ర స్మ కేచిన్మతినిశ్చయజ్ఞాః
తాంస్తానుపాయానుపవర్ణయంతి ॥ 19
ముల్లోకాలనూ నశింపజేయటానికి వారు మంత్రాంగం చేయసాగారు. వారిలో కొందరు బుద్ధిమంతులు వారికి తోచిన ఉపాయాలు చెప్పారు. (19)
తేషాం తు తత్ర క్రమకాలయోగాద్
ఘోరా మతిశ్చింతయతాం బభూవ ।
యే సంతి విద్యాతపసోపపన్నాః
తేషాం వినాశః ప్రథమం తు కార్యః ॥ 20
లోకా హి సర్వే తపసా ధ్రియంతే
తస్మాత్ త్వరధ్వం తపసః క్షయాయ ।
యే సంతి కేచిచ్చ వసుంధరాయాం
తపస్వినో ధర్మవిదశ్చ తజ్ జ్ఞాః ॥ 21
తేషాం వధః క్రియతాం క్షిప్రమేవ
తేషు ప్రణష్టేషు జగత్ ప్రణష్టమ్ ।
ఏవం హి సర్వే గతబుద్ధిభావా
జగద్వినాశే పరమప్రహృష్టాః ॥ 22
దుర్గం సమాశ్రిత్య మహోర్మిమంతం
రత్నాకరం వరుణస్యాలయం స్మ ॥ 23
చిరకాలం ఉపాయాల గురించి ఆలోచించి ఆ దైత్యులు ఇలా నిశ్చయించారు - "విద్యాతపస్సులతో కూడిన వారినందరినీ ముందుగా చంపివేయాలి. లోకాలన్నీ తపస్సు కారణంగా నిలబడుతున్నాయి. వారి తపస్సు నాశనం చేయటానికి ప్రయత్నించండి. తాపసులను ధర్మకోవిదులను, ముందుగా మట్టుపెట్టండి. వారివధ అయితే లోకాలన్నీ నశించినట్లే." ఇలా వారందరు బుద్ధితో ఆలోచించి లోకవినాశానికై సంతోషంతో అంగీకరించారు. పెద్దకెరటాలతో, రత్నాలకు నిలయమయిన సముద్రాన్ని ఆశ్రయించి వారందరూ నిర్భయంగా ఉండసాగారు. (20-23)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం వృత్రవధోపాఖ్యానే ఏకాధికశతతమోఽధ్యాయః ॥ 101 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో వృత్రవధ వృత్తాంతము అను నూట ఒకటవ అధ్యాయము. (101)