109. నూట తొమ్మిదవ అధ్యాయము

గంగావతరణము - సగరపుత్రుల ఉద్ధరణము.

లోమశ ఉవాచ
భగీరథవచః శ్రుత్వా ప్రియార్థం చ దివౌకసామ్ ।
ఏవమస్త్వితి రాజానం భగవాన్ ప్రత్యభాషత ॥ 1
ధారయిష్యే మహాభాగ గగనాత్ ప్రచ్యుతాం శివామ్ ।
దివ్యాం దేవనదీం పుణ్యాం త్వత్కృతే నృపసత్తమ ॥ 2
లోమశుడు పలికాడు - భగీరథుని ప్రార్థన విన్న శివుడు దేవతల ప్రీతికై "అలాగే" అన్నాడు. 'రాజశ్రేష్ఠా! ఆకాశం నుంచి జారే దివ్యదేవనది గంగను నీ కోసం తప్పక ధరిస్తాను.' అని పలికాడు. (1,2)
ఏవముక్త్వా మహాబాహో హిమవంతముపాగమత్ ।
వృతః పారిషదైర్ఘోరైః నానాప్రహరణోద్యతైః ॥ 3
ఇలా పలికి శివుడు నానావిధాయుధాలతో సిద్ధమైన, భయంకరులైన శివగణాలతో హిమాలయాన్ని చేరాడు. (3)
తత్ర స్థిత్వా నరశ్రేష్ఠం భగీరథమువాచ హ ।
ప్రయాచస్వ మహాబాహో శైలరాజసుతాం నదీమ్ ॥ 4
(పితౄణాం పావనార్థం తే తామహం మనుజాధిప ।)
పతమానాం సరిచ్ర్ఛేష్ఠాం ధారయిష్యే త్రివిష్టపాత్ ।
అక్కడే ఉండి నరశ్రేష్ఠుడైన భగీరథునితో పలికాడు - ' పర్వత రాజు పుత్రి అయిన గంగను భూతలంపై దిగమని ప్రార్థించు.
నీ పితరులను పావనం చేయటానికి స్వర్గం నుండి జారిపడే గంగను నేను శిరసావహిస్తాను? (4 1/2)
ఏతచ్ర్ఛుత్వా వచో రాజా శర్వేణ సముదాహృతమ్ ॥ 5
ప్రయతః ప్రణతో భూత్వా గంగాం సమనుచింతయత్ ।
తతః పుణ్యజలా రమ్యా గంగా సమనుచింతితా ॥ 6
ఈశానం చ స్థితం దృష్ట్వా గగనాత్ సహసా చ్యుతా ।
తాం ప్రచ్యుతామథో దృష్ట్వా దేవాః సార్ధం మహర్షిభిః ॥ 7
గంధర్వోరగయక్షాశ్చ సమాజగ్ముర్దిదృక్షవః ।
తతః పపాత గగనాద్ గంగా హిమవతః సుతా ॥ 8
శంకరుడు చెప్పిన మాట విని రాజు ఇంద్రియనిగ్రహంతో ఏకాగ్రచిత్తంతో గంగకు నమస్కరించి, ప్రార్థించాడు. రాజుచే ప్రార్థింపబడిన పవిత్రగంగ శంకరుని సంసిద్ధతను చూసి ఆకాశం నుంచి జారిపడింది. ఆమె జారుతుండగా చూచిన మహర్షులతో కూడి దేవతలు, గంధర్వులు, యక్షులు, నాగులు చూడాలని అక్కడకు వచ్చారు. ఆకాశం నుంచి హిమవంతుని పుత్రిక గంగ ఒక్కసారిగా క్రిందకు పడింది. (5-8)
సముద్ధృతమహావర్తా మీనగ్రాహసమాకులా ।
తాం దధార హరో రాజన్ గంగాం గగనమేఖలామ్ ॥ 9
లలాటదేశే పతితాం మాలాం ముక్తామయీమివ ।
పెద్ద పెద్ద సుడులు, చేపలు, మొసళ్ళతో గంగ వ్యాపించి ఉంది. ఆకాశపు మొలనూలు వంటి గంగ శివుని నుదుటిపై ముత్యాల మాల్ వలె ప్రకాశించింది. (9 1/2)
సా బభూవ విసర్పంతీ త్రిధా రాజన్ సముద్రగా ॥ 10
ఫేనపుంజాకులజలా హంసానామివ పంక్తయః ।
క్వచిదాభోగకుటిలా ప్రస్ఖలంతీ క్వచిత్ క్వచిత్ ॥ 11
సా ఫేనపటసంవీతా మత్తేవ ప్రమదావ్రజత్ ।
క్వచిత్ సా తోయనినదైః నదంతీ నాదముత్తమమ్ ॥ 12
ఏవం ప్రకారాన్ సుబహూన్ కుర్వతీ గగనాచ్చ్యుతా ।
పృథివీతలమాసాద్య భగీరథమథాబ్రవీత్ ॥ 13
సముద్రం వైపు ప్రవహించే ఆమె మూడు ధారలు కలిగి ఉంది. నురుగు పంజాలు కలిగి, హంసలబారుల వలె వంకరలు తిరుగుతూ శరీరపుష్టిగల స్త్రీవలె పై నుంచి క్రిందకు జారుతూ ఉంది. తెల్లని వస్త్రాలు దాల్చిన మదించిన స్త్రీవలె నురుగు ఆమెను కప్పింది. జలాల సవ్వడులతో అందమైన ధ్వనిని ఒక వైపు చేస్తూ ఉంది. ఈ ప్రకారంగా చాలా రూపాలను దాల్చి ఆకాశం నుంచి క్రిందికి జారింది. భూమిని చేరి భగీరథునితో అంది. (10-13)
దర్శయస్వ మహారాజ మార్గం కేన వ్రజామ్యహమ్ ।
త్వదర్థమవతీర్ణాస్మి పృథివీం పృథివీపతే ॥ 14
'భగీరథా! వెళ్ళుటకు తగిన మార్గాన్ని చూపించు. నీ కొరకే భూమికి దిగాను. (14)
ఏతచ్ర్ఛుత్వా వచో రాజా ప్రాతిష్ఠత భగీరథః ।
యత్ర తాని శరీరాణి సాగరాణాం మహాత్మనామ్ ॥ 15
ప్లావనార్థం నరశ్రేష్ఠ పుణ్యేన సలిలేన చ ।
ఇది విని అతడు ఏ ప్రదేశంలో సగరపుత్రుల శరీరాలు ఉన్నాయో ఆ శరీరాలపై ప్రవహింపచేయటానికి బయలుదేరాడు. (15 1/2)
గంగాయా ధారణం కృత్వా హరో లోకనమస్కృతః ॥ 16
కైలాసం పర్వతశ్రేష్ఠం జగామ త్రిదశైః సహ ।
సమాసాద్య సముద్రం చ గంగయా సహితో నృపః ॥ 17
పూరయామాస వేగేన సముద్రం వరుణాలయమ్ ।
దిహితృత్వే చ నృపతిః గంగాం సమనుకల్పయత్ ॥ 18
విశ్వవంద్యుడైన శివుడు గంగను శిరస్సుపై ధరించి కైలాసానికి దేవతలతో సహా వెళ్ళాడు. భగీరథుడు గంగతో సముద్రతీరాన్ని చేరి వరుణనిలయమైన సముద్రాన్ని వేగంగా నింపాడు. ఆ రాజు ఆమెను కుమార్తెగా భావించాడు. (16-18)
పితౄణాం చోదకం తత్ర దదౌ పూర్ణమనోరథః ।
ఏతత్ తే సర్వమాఖ్యాతం గంగా త్రిపథగా యథా ॥ 19
పితృదేవతల కోరిక తీర్చినవాడై జలాంజలులు విడచాడు. గంగ ఈ కారణంగా త్రిపథసంచారిణి అయింది (స్వర్గ, పాతాళ, మర్త్య లోకాల్లో ప్రవహించి) (19)
పూరణార్ధం సముద్రస్య పృథివీమవతారితా ।
(కాలేయాశ్చ యథా రాజన్ త్రిదశైర్వినిపాతితాః ।)
సముద్రశ్చ యథా పీతః కారణార్థం మహాత్మనా ॥ 20
వాతాపిశ్చ యథా నీతః క్షయం స బ్రహ్మహా ప్రభో ।
అగస్త్యేన మహారాజ యన్మాం త్వం పరిపృచ్ఛసి ॥ 21
సముద్రాన్ని నింపటానికే ఆకాశం నుంచి క్రిందకి దిగింది. దేవతలు కాలకేయులను చంపిన విధానం, లోకోద్ధరణం కోసం సముద్రజలాన్ని త్రాగిన అగస్త్యుని వృత్తాంతం, అగస్త్యునిచే బ్రహ్మహత్యలు చేసే వాతాపి నాశం ఎలా జరిగిందో అది అంతా నీవు ప్రశ్నించిన ప్రకారం సమాధానం చెప్పాను. (20,21)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయామగస్త్యమాహాత్మ్యకథనే నవాధికశతతమోఽధ్యాయః ॥ 109 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో అగస్త్యమాహాత్మ్యమను నూట తొమ్మిదవ అధ్యాయము. (109)
(దాక్షిణాత్య అధికపాఠం 1 శ్లోకంతో కలిపి మొత్తం 22 శ్లోకాలు)