110. నూట పదియవ అధ్యాయము

నంద, కౌశికల గొప్పతనము, ఋష్యశృంగుని కథ - లోమపాదుడు ఋష్యశృంగుని తీసుకొనివచ్చుట.

వైశంపాయన ఉవాచ
తతః ప్రయాతః కౌంతేయః క్రమేణ భరతర్షభ ।
నందామపరనందాం చ నద్యౌ పాపభయాపహే ॥ 1
వైశంపాయనుడు పలికాడు.
భరతర్షభా! తరువాత ధర్మజుడు క్రమంగా ముందుకు సాగాడు. పాపాలు పోగొట్ట గల నంద అపరనంద అనే నదుల వైపు యాత్ర ప్రారంభించాడు. (1)
పర్వతం స సమాసాద్య హేమకూటమనామయమ్ ।
అచింత్యానద్భుతాన్ భావాన్ దదర్శ సుబహూన్ నృపః ॥ 2
రోగశోకాలు లేని హేమకూటపర్వతాన్ని చేరి అతడు అచింత్యాలు, అద్భుతాలు అయిన విషయాలనెన్నింటినో చూశాడు. (2)
వాతాబద్ధా భవన్మేఘాః ఉపలాశ్చ సహస్రశః ।
నాశక్నువంస్తమారోఢుం విషణ్ణమనసో జనాః ॥ 3
వాయువు సహాయం లేకుండా మేఘాలు ఏర్పడుతున్నాయి. రాళ్ళు వాటంతట అవే పర్వతం నుంచి జారుతున్నాయి. దీనులైన జనులు ఆ పర్వతాన్ని అధిరోహించలేరు. (3)
వాయుర్నిత్యం వవౌ తత్ర నిత్యం దేవశ్చ వర్షతి ।
స్వాధ్యాయఘోషశ్చ తథా శ్రూయతే న చ దృశ్యతే ॥ 4
సాయం ప్రాతశ్చ భగవాన్ దృశ్యతే హవ్యవాహనః ।
మక్షికాశ్చాదశంస్తత్ర తపసః ప్రతిఘాతికాః ॥ 5
నిర్వేదో జాయతే తత్ర గృహాణి స్మరతే జనః ।
ఏవం బహువిధాన్ భావాన్ అద్భుతాన్ వీక్ష్య పాండవః ॥ 6
ప్రతిదినం అక్కడ గాలి సక్రమంగా వీస్తుంది. ప్రతిదినం మేఘాలు వర్షిస్తాయి. వేదస్వాధ్యాయధ్వని వినిపిస్తుంది. కాని చేసేవారు మాత్రం కనిపించరు. సాయంకాలం, ఉదయం సూర్యుడు వెలుగుతూ కనిపిస్తాడు. తపస్సుకు విఘ్నం కలిగించే దోమలు మాటిమాటికి కుడతాయి. జనుడు విరాగియై పదే పదే ఇంటిని గుర్తుచేసుకొంటాడు. ఇలాంటి అద్భుతాలను చాలా వాటిని చూచి ధర్మరాజు లోమశుని అడిగాడు. (4-6)
(యుధిష్ఠిర ఉవాచ
యదేతద్ భగవంశ్చిత్రమ్ పర్వతేఽస్మిన్ మహౌజసి ।
ఏతన్మే సర్వమాచక్ష్వ విస్తరేణ మహాద్యుతే ॥
ధర్మరాజు ప్రశ్నించాడు. 'మహాత్మా! ఈ పర్వతమందున్న చిత్రవిచిత్రాలు అన్నీ వివరంగా చెప్పండి")
లోమశ ఉవాచ
యథాశ్రుతమిదం పూర్వమ్ అస్మాభిరరికర్శన ।
తదేకాగ్రమనా రాజన్ నిబోధ గదతో మమ ॥ 7
అపుడు లోమశుడు చెపుతున్నాడు - మేం ఇది వరకు ఏది విన్నామో దాన్ని పూర్తిగా వివరిస్తాను. ఏకాగ్రచిత్తంతో నాద్వారా విను. (7)
అస్మిన్నృషభకూటేఽభూద్ ఋషభో నామ తాపసః ।
అనేకశతవర్షాయుః తపస్వీ కోపనో భృశమ్ ॥ 8
ప్రాచీనకాలంలో ఈ ఋషభకూటంలో దీర్ఘాయువు, తాపసి, మిక్కిలి క్రోధశీలి అయిన ఋషభుడు అనే ఋషి ఉండేవాడు. (8)
స వై సంభాష్యమాణోఽన్యైః కోపాద్ గిరిమువాచ హ ।
య్ ఇహ వ్యాహరేత్ కశ్చిద్ ఉపలానుత్సృజేస్తథా ॥ 9
వాతం చాహూయ మా శబ్దమ్ ఇత్యువాచ స తాపసః ।
వ్యాహరంశ్చేహ పురుషః మేఘశబ్దేన వార్యతే ॥ 10
ఏవమేతాని కర్మాణి రాజంస్తేన మహర్షిణా ।
కృతాని కానిచిత్ క్రోధాత్ ప్రతిషిద్ధాని కానిచిత్ ॥ 11
అతడు ఇతరులచే పదేపదే పిలువబడి కోపించి పర్వతంతో అన్నాడు - నన్ను ఇక్కడ పిలిచిన వాడిపై రాళ్ళవర్షాన్ని కురిపించు. గాలిని పిలిచి అతనితో అన్నాడు - ఇక్కడ ఏ శబ్దం వినపడకూడదు. అప్పటి నుంచి ఇక్కడ ఎవరైనా మాట్లాడితే మేఘగర్జన వారిని నివారిస్తుంది. ఇలా ఋషభుడు అద్భుతకార్యాలనాచరించాడు. ఇందులో కొన్ని క్రోధంచేత విధింపబడ్డాయి. కొన్ని నిషేధింపబడ్డాయి. (9-11)
నందాం త్వభిగతా దేవాః పురా రాజన్నితి శ్రుతిః ।
అన్వపద్యంత సహసా పురుషా దేవదర్శినః ॥ 12
రాజా! పూర్వకాలంలో దేవతలు నందాతీరానికి చేరారు. అదే సమయంలో దేవదర్శనం కోరి కొందరు మనుష్యులు అక్కడికి వచ్చారు అని వినియున్నాం. (12)
తే దర్శనం త్వనిచ్ఛంతః దేవాః శక్రపురోగమాః ।
దుర్గం చక్రురిమం దేశం గిరిం ప్రత్యూహరూపకమ్ ॥ 13
మనుష్యుల దర్శనాన్ని ఇష్టపడని ఇంద్రాదిదేవతలు విఘ్నరూపం అయిన ఈ పర్వతాన్ని ప్రవేశింప వీలుకాని దుర్గంగా చేశారు. (13)
తదాప్రభృతి కౌంతేయ నరా గిరిమిమం సదా ।
నాశక్నువన్నభిద్రష్టుం కుత ఏవాధిరోహితుమ్ ॥ 14
కౌంతేయా! అప్పటి నుంచి మనుష్యులు ఈ పర్వతాన్ని చూడనే లేరు. ఇంక అధిరోహించటం ఎక్కడిది? (14)
నాతప్తతపసా శక్యః ద్రష్టుమేష మహాగిరిః ।
ఆరోఢుం వాపి కౌంతేయ తస్మాన్నియతవాగ్భవ ॥ 15
కౌంతేయా! తపస్సు చేయనివాడు ఈ పర్వతాన్ని చూడలేడు అధిరోహించలేడు. కావున మౌనవ్రతాన్ని పాటించు. (15)
ఇహ దేవాస్తదా సర్వే యజ్ఞానాజహ్రురుత్తమాన్ ।
తేషామేతాని లింగాని దృశ్యంతేఽద్యాపి భారత ॥ 16
భారతా! ఇక్కడే ఆ రోజుల్లో దేవతలు గొప్ప యజ్ఞాల ననుష్ఠించారు. వాటి చిహ్నాలు ఇప్పటికీ ప్రత్యక్షంగా కనపడతాయి. (16)
కుశకారేవ దూర్వేయం సంస్తీర్ణేవ చ భూరియమ్ ।
యూపప్రకారా బహవః వృక్షాశ్చేమే విశాంపతే ॥ 17
రాజా! ఈ గడ్డి దర్భల ఆకారంలోను, భూమిపై పరిచినట్లూ కనిపిస్తుంది. ఈ వృక్షాలు యజ్ఞంలోని యూపస్తంభాల వలె కనిపిస్తాయి. (17)
దేవాశ్చ ఋషయశ్చైవ వసంత్యద్యాపి భారత ।
తేషాం సాయం తథాఽపాత్రః దృశ్యతే హవ్యవాహనః ॥ 18
భారతా! దేవతలు, ఋషులు ఇప్పటికీ ఇక్కడ నివసిస్తున్నారు. వారికి ఉదయం, సాయంత్రం అగ్ని ప్రజ్వలిస్తూ కనిపిస్తాడు. (18)
ఇహాప్లుతానాం కౌంతేయ సద్యః పాప్మాభిహన్యతే ।
కురుశ్రేష్ఠాభిషేకం వై తస్మాత్ కురు సహానుజః ॥ 19
కౌంతేయా! ఇక్కడ మునిగిన వారి పాపాలు వెంటనే నశిస్తాయి. నీవు నీ సోదరులతో కలిసి ఇక్కడ స్నానం చెయ్యి. (19)
తతో నందాప్లుతాంగస్త్వం కౌశికీమభియాస్యసి ।
విశ్వామిత్రేణ యత్రోగ్రం తపస్తప్తమనుత్తమమ్ ॥ 20
నందానదిలో స్నాన చేసి కౌశికీకనదికి చేరగలవు. విశ్వామిత్రమహర్షి ఇక్కడే కఠోరం, ఉత్తమం అయిన తపస్సు ఆచరించాడు. (20)
వైశంపాయన ఉవాచ
తతస్తత్ర సమాప్లుత్య గాత్రాణి సగణో నృపః ।
జగామ కౌశికీం పుణ్యాం రమ్యాం శీతజలాం శుభామ్ ॥ 21
వైశంపాయనుడు పలికాడు - సోదరులతో కలిసి నందానదిలో స్నానం చేసిన ధర్మరాజు అక్కడి నుమ్చి పవిత్రం, శైత్యం, శుభకరమయిన నీళ్లున్న కౌశికిని చేరాడు. (21)
లోమశ ఉవాచ
ఏషా దేవనదీ పుణ్యా కౌశికీ భరతర్షభ ।
విశ్వామిత్రాశ్రమో రమ్య ఏష చాత్ర ప్రకాశతే ॥ 22
లోమశుడు అన్నాడు - భరతర్షభా! ఈ కౌశికి దేవనది. పవిత్రమైంది. అందమైన విశ్వామిత్రుని ఆశ్రమం ఇక్కడే ప్రకాశిస్తూ ఉంది. (22)
ఆశ్రమశ్చైవ పుణ్యాఖ్యః కాశ్యపస్య మహాత్మనః ।
ఋష్యశృంగః సుతో యస్య తపస్వీ సంయతేంద్రియః ॥ 23
తపసో యః ప్రభావేణ వర్షయామాస వాసవమ్ ।
అనావృష్ట్యాం భయాద్ యస్య వవర్ష బలవృత్రహా ॥ 24
ఇది కశ్యపగోత్రజుడు, మహాత్ముడు అయిన విభాండకుని 'పుణ్య' అనే పేరు గల ఆశ్రమం. అతని కుమారుడు ఇంద్రియ నిగ్రహం కలిగి, తాపసి అయిన ఋష్యశృంగుడు. దేశంలో అనావృష్టి ఆవరించినప్పుడు మునిభయంతో ఇంద్రుడు వర్షాన్ని కురిపించాడు. (23,24)
మృగ్యాం జాతః స తేజస్వీ కాశ్యపస్య సుతః ప్రభుః ।
విషయే లోమపాదస్య యశ్చకారాద్భుతం మహత్ ॥ 25
కశ్యపవంశజుడు, విభాండకుని కుమారుడు అయిన ఋష్యశృంగుడు లేడికి పుట్టాడు. లోమపాదరాజు రాజ్యానికి అతడు ఎంతో మేలు చేశాడు. (25)
నిర్వర్తితేషు సస్యేషు యస్మై శాంతాం దదౌ నృపః ।
లోమపాదో దుహితరం సావిత్రీం సవితా యథా ॥ 26
సస్యాలు వర్షధారలతో సమృద్ధిగా పెరిగాయి. సూర్యుడు బ్రహ్మకు తన కుమార్తె సావిత్రిని అప్పగించినట్లు లోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం చేశాడు. (26)
యుధిష్ఠిర ఉవాచ
ఋష్యశృంగః కథం మృగ్యామ్ ఉత్పన్నః కాశ్యపాత్మజః ।
విరుద్ధే యోనిసంసర్గే కథం చ తపసా యుతః ॥ 27
కిమర్థం చ భయాచ్ఛక్రః తస్య బాలస్య ధీమతః ।
అనావృష్ట్యాం ప్రవృత్తాయాం వవర్ష బలవృత్రహా ॥ 28
యుధిష్ఠిరుడు పలికాడు - ఋష్యశృంగుడు లేడి నుంచి ఎట్లా పుట్టాడు? మనుష్యులు పశువుల నుంచి సంతానాన్ని ఎలా పొందుతారు? పొందినా అతడు తపస్సును ఎలా ఆశ్రయించాడు? అనావృష్టి ఏర్పడితే బల, వృత్రులను చంపిన ఇంద్రుడు ఋష్యశృంగుని భయం వల్ల ఎట్లా వర్షాన్ని కురిపించాడు? (27,28)
లోమపాదశ్చ రాజర్షిః యదాశ్రూయత ధార్మికః ।
కథం వై విషయే తస్య నావర్షత్ పాకశాసనః ॥ 30
లోమపాదుడు రాజర్షి, ధార్మికుడు అని అందరికీ తెలుసు. అయినా అతని రాజ్యంలో ఇంద్రుడు వర్షాన్ని ఏ కారణంగా కురిపించలేదు? (30)
ఏతన్మే భగవన్ సర్వం విస్తరేణ యథాతథమ్ ।
వక్తుమర్హసి శుశ్రూషోః ఋష్యశృంగస్య చేష్టితమ్ ॥ 31
ఇది అంతా నాకు వివరంగా యథాతథంగా వివరించు. నేను ఋష్యశృంగ మహర్షి చరిత్ర వినాలని కుతూహలపడుతున్నాను. (31)
లోమశ ఉవాచ
విభాండకస్య విప్రర్షేః తపసా భావితాత్మనః ।
అమోఘవీర్యస్య సతః ప్రజాపతిసమద్యుతేః ॥ 32
శృణు పుత్రో యథా జాతః ఋష్యశృంగః ప్రతాపవాన్ ।
మహార్హస్య మహాతేజాః బాలః స్థవిరసమ్మతః ॥ 33
లోమశుడు అన్నాడు - బ్రహ్మర్షి అయిన విభాండకుని మనస్సు తపస్సుచే పరిశుద్ధం అయింది. అతడు ప్రజాపతి సమానుడు. అమోఘవీర్యవంతుడు. ప్రతాపవంతుడైన ఋష్యశృంగుడు అతనికి ఎలా జన్మించాడో విను. విభాండకుని వలె అతని కుమారుడు కూడా తేజస్వి. బాల్యంలోనే వృద్ధులచే గౌరవింపబడినాడు. (32,33)
మహాహ్రదం సమాసాద్య కాశ్యపస్తపసి స్థితః ।
దీర్ఘకాలం పరిశ్రాంతః ఋషిః స దేవసమ్మితః ॥ 34
కశ్యప గోత్రీయుడైన విభాండకుడు దేవతల వలె అందగాడు. అతడు ఒకప్పుడు గొప్పకుండంలోకి దిగి చాలకాలం తపస్సుచేసి అలసిపోయాడు. (34)
తస్య రేతః ప్రచస్కంద దృష్ట్వాప్సరసముర్వశీమ్ ।
అప్సూపస్పృశతో రాజన్ మృగీ తచ్చాపిబత్ తదా ॥ 35
సహ తోయేన తృషితా గర్భిణీ చాభవత్ తతః ।
సా పురోక్తా భగవతా బ్రహ్మణా లోకకర్తృణా ॥ 36
దేవకన్యా మృగీ భూత్వా మునిం సూయ విమోక్ష్యసే ।
అమోఘత్వాద్ విధేశ్చైవ భావిత్వాద్ దైవనిర్మితాత్ ॥ 37
తస్యాం మృగ్యాం సమభవత్ తస్య పుత్రో మహానృషిః ।
ఋష్యశృంగస్తపోనిత్యః వన ఏవాభ్యవర్తత ॥ 38
ఒకనాడు విభాండకుడు స్నానం చేస్తుండగా అప్సరస ఊర్వశిని చూచిన అతని రేతస్సు (వీర్యం) స్రవించింది. అదే సమయాన నీటికోసం అక్కడికి వచ్చిన లేడి కడుపులో అది ప్రవేశించింది. నీటితో సహా వీర్యాన్ని త్రాగిన ఆ లేడి గర్భం దాల్చింది. ఆమె పూర్వకాలంలో ఒక దేవకన్య. సృష్టికర్త బ్రహ్మ ఒక మాటను ఆమెకు ఇచ్చాడు. 'దేవకన్యవైన నీవు ఆడులేడిగా మారి ఒక ముని కారణంగా కుమారుని కన్నప్పుడు నీ రూపం నీకు వస్తుంది' అన్నాడు. అమోఘవాణి కల బ్రహ్మమాటలు జరిగితీరవలసిందేకదా! ఆ లేడి నుంచి ఆ విభాండకుని కుమారుడుగా ఋష్యశృంగుడు పుట్టాడు. ఆయన ఎల్లప్పుడూ తపస్సు ఆచరిస్తూ వనంలోనే ఉండిపోయాడు. (35-38)
తస్యర్షేః శృంగం శిరసి రాజన్నాసీన్మహాత్మనః ।
తేనర్ష్యశృంగ ఇత్యేవం తదా స ప్రథితోఽభవత్ ॥ 39
రాజా! ఆ ఋషి శిరస్సుపై ఒక కొమ్ము ఏర్పడటం చేత ఆయన లోకంలో ఋష్యశృంగుడు అను పేరుతో ప్రసిద్ధి పొందాడు. (39)
న తేన దృష్టపూర్వోఽన్యః పితురన్యత్ర మానుషః ।
తస్మాత్ తస్య మనో నిత్యం బ్రహ్మచర్యేఽభవన్నృప ॥ 40
రాజా! తండ్రిని తప్ప మరొక మనిషిని ఆయన ఎన్నడూ చూడలేదు. కావున ఆయన మనస్సు నిత్యం బ్రహ్మచర్యం పాటిస్తూ ఉంది. (40)
ఏతస్మిన్నేవ కాళే తు సఖా దశరథస్య వై ।
లోమపాద ఇతి ఖ్యాతః హ్యంగానామీశ్వరోఽభవత్ ॥ 41
ఇదే కాలంలో దశరథుని మిత్రుడు లోమపాదుడు అనే ప్రసిద్ధరాజు అంగరాజ్యాన్ని పారిపాలిస్తూ ఉండేవాడు. (41)
తేన కామాత్ కృతం మిథ్యా బ్రాహ్మణస్యేతి నః శ్రుతిః ।
స బ్రాహ్మణైః పరిత్య క్తః తతో వై జగతః పతిః ॥ 42
పురోహితాపచారాచ్చ తస్య రాజ్ఞో యదృచ్ఛయా ।
న వవర్ష సహస్రాక్షః తతోఽపీడ్యంత వై ప్రజాః ॥ 43
అతడు స్వేచ్ఛగా ఒక బ్రాహ్మణునితో అసత్య వ్యవహారం చేశాడని వినికిడి. ఈ అపరాధంతో బ్రాహ్మణులందరు ఆయన రాజ్యాన్ని విడచివెళ్ళారు. పురోహితునికి కీడు చేయటం చేత ఆ రాజు రాజ్యంలో ఇంద్రుడు వర్షాన్ని కురిపించలేదు. ప్రజలందరు కరువుతో బాధపడ్డారు. (42,43)
స బ్రాహ్మణాన్ పర్యపృచ్ఛత్ తపోయుక్తాన్ మనీషిణః ।
ప్రవర్షణే సురేంద్రస్య సమర్థాన్ పృథివీపతే ॥ 44
రాజా! ఇంద్రునిచే వర్షం కురిపించటంలో సమర్థులు, తాపసులు, విద్వాంసులు అయిన బ్రాహ్మణులను అతడు సంప్రదించాడు. (44)
కథం ప్రవర్షేత్ పర్జన్యః ఉపాయః పరిదృశ్యతామ్ ।
తమూచుశ్చోదితాస్తే తు స్వమతాని మనీషిణః ॥ 45
'మేఘాలు వర్షించే ఉపాయం చెప్పండి' అని వారిని అడిగాడు. వారు తమ తమ అభిప్రాయాలను అతనికి వివరించారు. (45)
తత్ర త్వేకో మునివరః తం రాజానమువాచ హ ।
కుపితాస్తవ రాజేంద్ర బ్రాహ్మణా నిష్కృతిం చర ॥ 46
వారిలో ఒక మునిశ్రేష్ఠుడు రాజుతో ఇలా అన్నాడు. 'రాజా! నీపై బ్రాహ్మణులకు కోపం కలిగింది. దీనికి ప్రాయశ్చిత్తం చెయ్యి. (46)
ఋష్యశృంగం మునిసుతమ్ ఆనయస్వ చ పార్థివ ।
వానేయమనభిజ్ఞం చ నారీణామార్జవే రతమ్ ॥ 47
రాజా! ఋష్యశృంగుడనే పేరు గల మునికుమారుని పిలిపించు. అతడు వనవాసి, సరళస్వభావం కలవాడు. స్త్రీలంటే తెలియనివాడు. (47)
స చేదవతరేద్ రాజన్ విషయం తే మహాతపాః ।
సద్యః ప్రవర్షేత్ పర్జన్యః ఇతి మే నాత్ర సంశయః ॥ 48
రాజా! ఆ మహాతపస్వి నీ రాజ్యంలో అడుగుపెట్టగానే మేఘాలు వాటంతట అవే కురుస్తాయి. ఈ విషయంలో నాకు సందేహం లేదు.' (48)
ఏతచ్ర్ఛుత్వా వచో రాజన్ కృత్వా నిష్కృతిమాత్మనః ।
స గత్వా పునరాగచ్ఛత్ ప్రసన్నేషు ద్విజాతిషు ॥ 49
ఈ మాటలు విని తన అపరాధానికి తగిన ప్రాయశ్చిత్తం కోసం బ్రాహ్మణుల వద్దకు పోయి వారిని ప్రసన్నం చేసుకొని తిరిగి తన రాజధానికి వచ్చాడు. (49)
రాజానమాగతం శ్రుత్వా ప్రతిసంజహృషుః ప్రజాః ।
తతోఽంగపతిరాహూయ సచివాన్ మంత్రకోవిదాన్ ॥ 50
ఋష్యశృంగాగమే యత్నమ్ అకరోన్మంత్రనిశ్చయే ।
సోఽధ్యగచ్ఛదుపాయం తు తైరమాత్యైః సహాచ్యుతః ॥ 51
శాస్త్రజ్ఞైరలమర్థజ్ఞైః నీత్యాం చ పరినిష్ఠితైః ।
తతశ్చానాయయామాస వారముఖ్యా మహీపతిః ॥ 52
వేశ్యాః సర్వత్ర నిష్ణాతాః తా ఉవాచ స పార్థివః ।
ఋష్యశృంగమృషేః పుత్రమ్ ఆనయధ్వముపాయతః ॥ 53
'రాజు తిరిగి వచ్చాడు' అన్న వార్త విని ప్రజలందరూ మిక్కిలి సంతోషించారు. పిమ్మట అంగరాజైన లోమపాదుడు మంత్రకుశలులు అయిన మంత్రులతో మాట్లాడి ఋష్యశృంగుని రప్పించటానికి ప్రయత్నం చేశాడు. మర్యాదనతిక్రమింపని అతడు శాస్త్రజ్ఞులు, నయకోవిదులు, అర్థశాస్త్రజ్ఞులు అయిన వారితో విచారించి ఒక ఉపాయాన్ని తెలుసుకొన్నాడు. తరువాత లోమపాదుడు ఇతరులను మోసగింపగల కళాకోవిదలయిన వేశ్యలను రప్పించి వారితో పలికాడు. 'మీరందరు ఋష్యశృంగుని ఏదో ఒక ఉపాయంతో ఇక్కడకు తీసుకురండి. (50-53)
లోభయిత్వాభివిశ్వాస్య విషయం మమ శోభనాః ।
తా రాజభయభీతాశ్చ శాపభీతాశ్చ యోషితః ॥ 54
అశక్యమూచుస్తత్ కార్యం వివర్ణా గతచేతసః ।
తత్ర త్వేకా జరద్యోషా రాజానమిదబ్రవీత్ ॥ 55
ప్రలోభపెట్టి, నమ్మించి నా రాజ్యానికి తీసికొనిరండి.' మహారాజ మాటలు విని వారు ఒకవైపు మునిశాపానికి, వేరొకవైపు రాజభయానికి లొంగి ఆ పని అసాధ్యం అని రాజుకు తెలియజేశారు. ఆ సమయంలో వారి ముఖాలు వివర్ణమై, చైతన్యం కోల్పోయి ఉన్నాయి. వారిలో ఒక ముసలి స్త్రీ ఉంది. ఆమె రాజుతో ఇలా పలికింది (54,55)
ప్రయత్నిష్యే మహారాజ తమానేతుం తపోధనమ్ ।
అభిప్రేతాంస్తు మే కామాన్ త్వమనుజ్ఞాతుమర్హసి ॥ 56
తతః శక్ష్యామ్యానయితుమ్ ఋష్యశృంగమృషేః సుతమ్ ।
తస్యాః సర్వమ్ అభిప్రేతమ్ అన్వజానాత్ స పార్థివః ॥ 57
నేను ఆ తపోధనుని తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. నా మనస్సులోని కోరికలు అన్నింటికీ మీరు అంగీకరించాలి.' ఆమె కోరికలను తీర్చడానికి రాజు అంగీకరించాడు. (56,57)
ధనం చ ప్రదదౌ భూరి రత్నాని వివిధాని చ ।
తతో రూపేణ సంపన్నాః వయసా చ మహీపతే ।
స్త్రియ ఆదాయ కాశ్చిత్ సా జగామ వనమంజసా ॥ 58
వెంటనే ఆమెకు ధనరాశులను, వివిధ రత్నాలను ఆమెకు సమర్పించాడు. ఆ ముసలివేశ్య సౌందర్యవతులు, యౌవనవతులు అయిన ఇతర వేశ్యలను కొందరిని తీసుకొని వనానికి బయలుదేరింది. (58)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయామృష్యశృంగోపాఖ్యానే దశాధికశతతమోఽధ్యాయః ॥ 110 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో ఋష్యశృంగునికథ అను నూట పదవ అధ్యాయము. (110)