114. నూట పదునాల్గవ అధ్యాయము
కౌశికి, గంగా సాగరాది నదులలో స్నానమాచరించి ధర్మరాజు మహేంద్రపర్వతమును చేరుట.
వైశంపాయన ఉవాచ
తతః ప్రయాతః కౌశిక్యాః పాండవో జనమేజయ ।
ఆనుపూర్వ్యేణ సర్వాణి జగామాయతనాన్యథ ॥ 1
స సాగరం సమాసాద్య గంగయాః సంగమే నృప ।
నదీశతానాం పంచానాం మధ్యే చక్రే సమాప్లవమ్ ॥ 2
వైశంపాయనుడు చెపుతున్నాడు - ధర్మరాజు కౌశికీనదీతీరంలోని నదులలో స్నానం చేసి, క్రమంగా మందిరాలన్నింటికి యాత్ర సాగించాడు. గంగాసాగరసంగమ తీర్థానికి ఆనుకొని ఉన్న సముద్రతీరాన్నీ చేరి, ఐదువందల నదుల నీటిలో స్నానం ఆచరించాడు. (1,2)
తతః సముద్రతీరేణ జగామ వసుధాధిపః ।
భ్రాతృభిః సహితో వీరః కలింగాన్ ప్రతి భారత ॥ 3
తరువాత సముద్రతీరమార్గం ద్వారా సోదరులతో కలిసి ధర్మజుడు కలింగదేశాన్ని చేరాడు. (3)
లోమశ ఉవాచ
ఏతే కలింగాః కౌంతేయ యత్ర వైతరిణీ నదీ ।
యత్రాయజత ధర్మోఽపి దేవాన్ శరణమేత్య వై ॥ 4
లోమశుడు పలికాడు.
వైతరణీనది కల ఈ దేశమే కలింగదేశం. ధర్మదేవత కూడ దేవతల శరణుకోరి ఇక్కడ యజ్ఞం చేశాడు. (4)
ఋషిభిః సముపాయుక్తం యజ్ఞియం గిరిశోభితమ్ ।
ఉత్తరం తీరమేతద్ధి సతతం ద్విజసేవితమ్ ॥ 5
పర్వతపంక్తులచే శోభించే వైతరణీ నది ఉత్తరతీరం యజ్ఞశాలగా పేరుపొందింది. చాలమంది ఋషులు, బ్రాహ్మణులు ఈ తీరాన్ని సేవిస్తూ ఉంటారు. (5)
సమానం దేవయానేన పథా స్వర్గముపేయుషః ।
అత్ర వై ఋషయోఽన్యేఽపి పురా క్రతుభిరేజిరే ॥ 6
స్వర్గం పొందే పుణ్యాత్ములు అయిన మనుష్యులకు ఇది దేవయానం. ప్రాచీనకాలంలో ఋషులు, ఇతరులు కూడ ఇక్కడ యజ్ఞాల నాచరించారు. (6)
అత్రైవ రుద్రో రాజేంద్ర పశుమాదత్తవాన్ మఖే ।
పశుమాదాయ రాజేంద్ర భాగోఽయమితి చాబ్రవీత్ ॥ 7
రాజేంద్రా! ఈ ప్రదేశంలో రుద్రుడు యజ్ఞంలో పశువును గ్రహించి 'ఇది నాభాగం' అని అందరితో అన్నాడు. (7)
హృతే పశౌ తదా దేవాః తమూచుర్భరతర్షభ ।
మాపరస్వమభిద్రోగ్ధా మా ధర్మాన్ సకలాన్ వశీః ॥ 8
పశువు అపహరింపబడగానే దేవతలు రుద్రునితో ఇలా అన్నారు. మీరు ఇతరుల విభాగాన్ని గ్రహింపవలదు. ధర్మసాధనాలైన యజ్ఞభాగాల నపహరింపరాదు. (8)
తతః కల్యాణరూపాభిః వాగ్భిస్తే రుద్రమస్తువన్ ।
ఇష్ట్యా చైనం తర్పయిత్వా మానయాంచక్రిరే తదా ॥ 9
తరువాత మంగళకరమయిన వచనాలతో దేవతలు రుద్రుని స్తుతించారు. యాగంతో అతనిని తృప్తి పరచి విశేషంగా ఆయన్ని సన్మానించారు. (9)
తతః స పశుముత్సృజ్య దేవయానేన జగ్మివాన్ ।
తత్రానువంశో రుద్రస్య తం నిబోధ యుధిష్ఠిర ॥ 10
ఆ శంకరుడు అదే సమయంలో పశువును వీడి దేవయానంలో వెళ్ళాడు. యజ్ఞంలో రుద్రుని భాగాన్ని తెలియజేసే పరంపరాశ్లోకం ఒకటి ఉంది. విను చెబుతాను. (10)
అయాతయామం సర్వేభ్యః భాగేభ్యో భాగముత్తమమ్
దేవాః సంకల్పయామాసుః భయాద్ రుద్రస్య శాశ్వతమ్ ॥ 11
దేవతలు రుద్రునిభయంతో శీఘ్రంగా, శాశ్వతంగా అందరిభాగాలకంటె ఉత్తమమయిన భాగాన్ని ఆయనకు ఇవ్వ సంకల్పించారు. (11)
ఇమాం గాథామత్ర గాయన్ అపః స్పృశతి యో నరః ।
దేవయానోఽస్య పంథాశ్చ చక్షుషాభిప్రకాశతే ॥ 12
ఈ వృత్తాంతాన్ని స్మరిస్తూ ఎవడు ఈ ప్రదేశంలో వైతరణీ నదిలో స్నానం చేస్తాడో అతని దృష్టిలో దేవయానమార్గం కనిపిస్తుంది. (12)
వైశంపాయన ఉవాచ
తతో వైతరణీం సర్వే పాండవా ద్రౌపదీ తథా ।
అవతీర్య మహాభాగాః తర్పయాంచక్రిరే పితౄన్ ॥ 13
వైశంపాయనుడు పలికాడు - పిమ్మట పాండవులు, ద్రౌపది వైతరణిలో దిగి పితృదేవతలకు తర్పణాలు ఇచ్చారు. (13)
యుధిష్ఠిర ఉవాచ
ఉపస్పృశ్యేహ విధివద్ అస్యాం నద్యాం తపోబలాత్ ।
మానుషాదస్మి విషయాద్ అపేతః పశ్య లోమశ ॥ 14
యుధిష్ఠిరుడు అన్నాడు - మహర్షీ! చూడండి. ఈ వైతరిణీ నదిలో యథావిధిగా స్నానం ఆచరించి, తపోబలాన్ని పొంది, మానుషభావాలను వదిలాను. (14)
సర్వాన్ లోకాన్ ప్రపశ్యామి ప్రసాదాత్ తవ సువ్రత ।
వైఖానసానాం జపతామ్ ఏష శబ్దో మహాత్మనామ్ ॥ 15
నీ అనుగ్రహంతో అన్నిలోకాలానూ చూస్తున్నాను. ఇది జపం, స్వాధ్యాయం చేసే మహాత్ములైన వైఖానసుల శబ్దం. (15)
లోమశ ఉవాచ
త్రిశతం వై సహస్రాణి యోజనానాం యుధిష్ఠిర ।
యత్ర ధ్వనిం శృణోష్యేనం తూష్ణీమాస్స్వ విశాంపతే ॥ 16
లోమశుడు అన్నాడు - రాజా! ఎక్కడి నుంచో వచ్చే ఈ ధ్వని మనకు మూడు వందల యోజనాల దూరంలో ఉంది. నీవు నిశ్శబ్దంగా విను. (16)
ఏతత్ స్వయంభువో రాజన్ వనం దివ్యం ప్రకాశతే ।
యత్రాయజత రాజేంద్ర విశ్వకర్మా ప్రతాపవాన్ ॥ 17
ఇది పరమేష్ఠి అయిన బ్రహ్మ దివ్యవనం, ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుందని ప్రత్యేకత. ఇక్కడ ప్రతాపవంతుడైన విశ్వకర్మ యజ్ఞాన్ని చేశాడు. (17)
యస్మిన్ యజ్ఞే హి భూర్దత్తా కశ్యపాయ మహాత్మనే ।
సపర్వతవనోద్దేశా దక్షిణార్థే స్వయంభువా ॥ 18
ఈ యజ్ఞంలోనే బ్రహ్మ పర్వత, వన సహితమయిన భూమిని కశ్యపునికి దానం చేశాడు. (18)
అవాసీదచ్చ కౌంతేయ దత్తమాత్రా మహీ తదా ।
ఉవాచ చాపి కుపితా లోకేశ్వరమిదం ప్రభుమ్ ॥ 19
న మాం మర్త్యాయ భగవన్ కస్మైచిద్ దాతుమర్హసి ।
ప్రదానం మోఘమేతత్ తే యస్యామ్యేషా రసాతలమ్ ॥ 20
బ్రహ్మచే ఇవ్వబడిన తనదానాన్ని గుర్తించి భూమి కోపించి లోకకర్త, ప్రభువు అయిన బ్రహ్మతో ఇలా పలికింది. 'నన్ను మానవునికి ఎవనికీ దానం ఈయవద్దు. ఈ దానం నిష్ఫలం. నేనిప్పుడే పాతాళానికి పోతున్నాను.' (19,20)
విషీదంతీం తు తాం దృష్ట్వా కశ్యపో భగవానృషిః ।
ప్రసాదయాంబభువాథ తతో భూమిం విశాంపతే ॥ 21
రాజా! దుఃఖితురాలైన భూమిని చూచి కశ్యపముని ఆమెను ప్రార్థనతో ప్రసన్నం చేసుకొన్నాడు. (21)
తతః ప్రసన్నా పృథివీ తపసా తస్య పాండవ ।
పునరున్నహ్య సలిలాద్ వేదీరూపా స్థితా బభౌ ॥ 22
పాండవా! అతని తపస్సు కారణంగా ప్రసన్నురాలు అయిన భూమి వేది రూపంగా నీటి నుంచి పైకి వచ్చి కనపడింది. (22)
పాండవా! అతని తపస్సు కారణంగా ప్రసన్నురాలు అయిన భూమి వేది రూపంగా నీటి నుంచి పైకి వచ్చి కనపడింది. (22)
పైషా ప్రకాశతే రాజన్ వేదీ సంస్థానలక్షణా ।
అరుహ్యాత్ర మహారాజ వీర్యవాన్ వై భవిష్యసి ॥ 23
రాజా! ఆ భూదేవియే వేది రూపంగా ప్రకాశిస్తోంది. దీనిపై అధిరోహిస్తే బలపరాక్రమాలను పొందుతావు. (23)
పైషా సాగరమాసాద్య రాజన్ వేదీ సమాశ్రితా ।
ఏతామారుహ్య భద్రం తే త్వమేకస్తర సాగరమ్ ॥ 24
రాజా! ఈ వేదిరూప అయిన భూమి సముద్రాన్ని ఆశ్రయించి నిలబడి ఉంది. నీకు శుభమగుగాక. నీవు ఒంటరిగా దీన్ని అధిరోహించి, సముద్రాన్ని దాటు. (24)
అహం చ తే స్వస్త్యయనం ప్రయోక్ష్యే
యథా త్వమేనామధిరోహసేఽద్య ।
స్పృష్టా హి మర్త్యేన తతః సముద్రమ్
ఏషా వేదీ ప్రవిశత్యాజమీఢ ॥ 25
నేను నీకోసం మంగళవచనాలు పలుకుతున్నాను. నీవు నేడే ఈ వేదికను ఎక్కు. లేనిచో మనుజునిచే తాకబడిన ఈ భూమి సముద్రంలో కూరుకుపోగలదు. (25)
ఓం నమో విశ్వగుప్తాయ నమో విశ్వపరాయ తే ।
సాన్నిధ్యం కురు దేవేశ సాగరే లవణాంభసి ॥ 26
సముద్రంలో స్నానం చేసే సమయంలో ఇలా ప్రార్థన చెయ్యి. 'ప్రపంచాన్ని రక్షిస్తూ, ప్రపంచం కంటె ఉత్తముడవు అయిన నీకు నమస్కారం. నీవు ఈ లవణ సముద్రంలో నివసించు.' (26)
అగ్నిర్మిత్రో యోనిరాపోఽథ దేవ్యో
విష్ణో రేతస్త్వమమృతస్య నాభిః ।
ఏవం బ్రువన్ పాండవ సత్యవాక్యం
వేదీమిమాం త్వం తరసాధిరోహ ॥ 27
'అగ్ని, సూర్యుడు, దివ్యజలం నీ ఉత్పత్తికి కారణం. నీవు సర్వవ్యాపకుడైన విష్ణువు వీర్యానివి. నీవే అమృతాన్ని పుట్టించావు.' ఇలా అంటూ సత్యవచనం పలుకుతూ నదుల భర్త అయిన సముద్రంలో మునుగు. (27)
అగ్నిశ్చ తే యోనిరిడా చ దేహో
రేతోధా విష్ణోరమృతస్య నాభిః ।
ఏవం జపన్ పాండవ సత్యవాక్యం
తతోఽవగాహేత పతిం నదీనామ్ ॥ 28
'అగ్ని నీకు కారణం. నీశరీరమే యజ్ఞం. విష్ణువు పరాక్రమానికి నీవే ఆధారం, మోక్షసాధనం నీవే' అని జపిస్తూ సత్యవచనం పలుకుతూ నదీపతి అయిన సముద్రంలో మునుగు. (28)
అన్యథా హి కురుశ్రేష్ఠ దేవయోనిరపాం పతిః ।
కుశాగ్రేణాపి కౌంతేయ న స్ర్పష్టవ్యో మహోదధిః ॥ 29
కౌంతేయా! జలస్వామి సముద్రుడు దేవతలకు స్థానం. పైన చెప్పిన క్రమం లేకుండా దర్భకొనతో అయినా సముద్రాన్ని తాకరాదు. (29)
వైశంపాయన ఉవాచ
తతః కృతస్వస్త్యయనో మహాత్మా
యుధిష్ఠిరః సాగరమభ్యగచ్ఛత్ ।
కృత్వా చ తచ్ఛాసనమస్య సర్వం
మహేంద్రమాసాద్య నిశామువాస ॥ 30
తరువాత లోమశునికి శుభం పలుకుతూ రాజు యుధిష్ఠిరుడు ఆయన చెప్పిన నియమాలు పాటిస్తూ సముద్రంలో స్నానం చేశాడు. ఆ రాత్రి మహేంద్రపర్వతంపై కాలం గడిపాడు. (30)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం మహేంద్రాచలగమనే చతుర్దశాధికశతతమోఽధ్యాయః ॥ 114 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో మహేంద్రాచలగమనము అను నూట పదునాలుగవ అధ్యాయము. (114)