113. నూట పదమూడవ అధ్యాయము
ఋష్యశృంగుడు లోమపాదకన్యను గ్రహించుట.
విభాండక ఉవాచ
రక్షాంసి చైతాని చరంతి పుత్ర
రూపేణ తేనాద్భుతదర్శనేన ।
అతుల్యవీర్యాణ్యభిరూపవంతి
విఘ్నం సదా తపసశ్చింతయంతి ॥ 1
విభాండకుడు అన్నాడు.
ఇలాంటి అద్భుతరూపం గల రాక్షసులు వనంలో సంచరిస్తున్నారు. సాటిలేని పరాక్రమమూ, అందమూ కలిగి ఋషుల తపస్సులకు విఘ్నం కలిగించడానికి ఉపాయాన్ని ఆలోచిస్తున్నారు. (1)
సరూపరూపాణి చ తాని తాత
ప్రలోభయంతే వివిధైరుపాయైః ।
సుఖాచ్చ లోకాచ్చ నిపాతయంతి
తాన్యుగ్రరూపాణి మునీన్ వనేషు ॥ 2
అందమైన ఆ రాక్షసులు అనేక ఉపాయాలతో మునులను ప్రలోభ పరుస్తున్నారు. తిరిగి వాళ్లే భయానకరూపంలో వనవాసులు అయిన మునులను ఆనందలోకాలనుంచి క్రింద పడవేస్తున్నారు. (2)
న తాని సేవేత మునిర్యతాత్మా
సతాం లోకాన్ ప్రార్థయానః కథంచిత్ ।
కృత్వా విఘ్నం తాపసానాం రమంతే
పాపాచారాస్తాపసస్తాన్ న పశ్యేత్ ॥ 3
సత్పురుషులలోకాలను కోరే ముని జితేంద్రియుడై రాక్షసులను ఏవిధంగానూ సేవింపకూడదు. ఆ పాపాచారులు రాక్షసులు తాపసుల తపస్సుకు విఘ్నం కలిగించి ఆనందిస్తారు. తాపసి వారి వైపు ముఖాన్ని త్రిప్పి చూడకూడదు. (3)
అసజ్జనేనాచరితాని పుత్ర
పాపాన్యపేయాని మధూని తాని ।
మాల్యాని చైతాని న వై మునీనాం
స్మృతాని చిత్రోజ్జ్వలగంధవంతి ॥ 4
నీవు జలం అనుకున్నది మద్యం. అది తాగరానిది. పాపాన్ని ఇచ్చేది. అది ఎల్లప్పుడూ సేవించరానిది. దుష్టుడు వాటిని సేవిస్తాడు. విచిత్ర సుగంధ భరితమాలలు మునులు సేవింపకూడనివి. (4)
రక్షాంసి తానీతి నివార్య పుత్రం
విభాండకస్తాం మృగయాంబభూవ ।
నాసాదయామాస యదా త్ర్యహేణ
తదా స పర్యావవృతేఽఽశ్రమాయ ॥ 5
ఈ వస్తువులు తెచ్చేవారు రాక్షసులు అని పలికి విభాండకుడు ఋష్యశృంగుని ఆ బ్రహ్మచారితో కలవకుండా అడ్డుకొన్నాడు. మూడు రోజులు ఆమెను వెదకి ఆమె జాడ తెలియక ఆశ్రమానికి తిరిగివచ్చాడు. (5)
యదా పునః కాశ్యపో వై జగామ
ఫలాన్యాహర్తుం విధినాఽఽశ్రమాత్ సః ।
తదా పునర్లోభయితుం జగామ
సా వేశయోషా మునిమృష్యశృంగమ్ ॥ 6
కశ్యపగోత్రజుడైన విభాండకుడు దైనందిన విధికై ఆశ్రమం నుంచి ఫలాలు తేవటానికి వెళ్ళాడు. అప్పుడు ఆవేశ్య ఋష్యశృంగుని ప్రలోభపెట్టడానికి ఆశ్రమానికి చేరింది. (6)
దృష్ట్వైవ తామృష్యశృంగః ప్రహృష్టః
సంభ్రాంతరూపోఽభ్యపతత్ తదానీమ్ ।
ప్రోవాచ చైనం భవతః శ్రమాయ
గచ్ఛావ యావన్న పితా మమైతి ॥ 7
ఆమెను చూచి ఋష్యశృంగుడు ఆనందించి తొందరగా ఆమె సమీపానికి పరుగెత్తి ఇలా అన్నాడు - బ్రహ్మచారీ! నాతండ్రి తిరిగి వచ్చేలోపల మనం ఆశ్రమం వైపు వెడదాం. (7)
తతో రాజన్ కాశ్యపస్యైకపుత్రం
ప్రవేశ్య యోగేన విముచ్య నావమ్ ।
ప్రమోదయంత్యో వివిధైరుపాయైః
ఆజగ్మురంగాధిపతేః సమీపమ్ ॥ 8
అప్పుడు ఆ వేశ్య విభాండకుని ఏకైక కుమారుని యుక్తితో నావలో కూర్చోబెట్టి నావను వదిలింది. మిగిలిన వేశ్యలు అందరు అనేక ఉపాయాలతో అతని మనస్సును రంజింపచేస్తూ అంగరాజ్యానికి చేరాచారు. (8)
సంస్థాప్య తామాశ్రమదర్శనే తు
సంతారితాం నావమథాతిశుభ్రామ్ ।
నీరాదుపాదాయ తథైవ చక్రే
నావ్యాశ్రమం నామ వనం విచిత్రమ్ ॥ 9
నావికులు నడిపిన ఆ నావను నీటి నుంచి బయటకు తీసి, రాజు ఒక ప్రదేశంలో దాన్ని ఉంచి, కనుచూపు మేరలో విస్తృతమైన మైదానంలో ఋష్యశృంగుని ఆశ్రమం వంటి ఆశ్రమాన్ని నిర్మింపజేశాడు. దానిపేరే "నావ్యాశ్రమం" (9)
అంతఃపురే తం తు నివేశ్య రాజా
విభాండకస్యాత్మజమేకపుత్రమ్ ।
దదర్శ దేవం సహసా ప్రవృష్ట
మాపూర్వమాణం చ జగజ్జలేన ॥ 10
లోమపాదరాజు విభాండకముని ఏకైక కుమారుని ఋష్యశృంగుని అంతఃపురంలో ఉంచినాడో లేదో ఇంద్రుడు వర్షం కురిపించడం ప్రారంభించాడు. లోకమంతా నీటితో నిండిపోయింది. (10)
స లోమపాదః పరిపూర్ణకామః
సుతాం దదావృష్యశృంగాయ శాంతామ్ ।
క్రోధప్రతీకారకరం చ చక్రే
గాశ్చైవ మార్గేషు చ కర్షణాని ॥ 11
లోమపాదుడి కోరిక తీరింది. ప్రసన్నుడైన లోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగునకిచ్చి వివాహం చేశాడు. ఆయన వచ్చే మార్గంలో ఆవులు, ఎద్దులు ఉంచాడు. రైతుల ద్వారా వ్యవసాయం ప్రారంభింపచేశాడు. (11)
విభాండకస్యావ్రజతః స రాజా
పశూన్ ప్రభూతాన్ పశుపాంశ్చ వీరాన్ ।
సమాదిశత్ పుత్రగృద్ధీ మహర్షి
ర్విభాండకః పరిపృచ్ఛేద్ యదా వః ॥ 12
స వక్తవ్యః ప్రాంజలిభిర్భవద్భిః
పుత్రస్య తే పశవః కర్షణం చ ।
కింతే ప్రియం వై క్రియతాం మహర్షే
దాసాః స్మ సర్వే తవ వాచి బద్ధాః ॥ 13
మునిమార్గంలో లోమపాదుడు అధికంగా పశువులను, పశురక్షకులను నియమించి పుత్రునిపై ప్రేమ గల విభాండకుడు మిమ్ము ప్రశ్నిస్తే ఇలా సమాధానం చెప్పండి. 'ఇవి అన్నీ మీ పుత్రుని పశువులే. ఇవి అన్నీ వ్యవసాయానికి పోతున్నవి. మీకు ఏ పని చేసిపెట్టాలో ఆజ్ఞాపించండి. మేము మీ దాసులం. మేము మీ ఆజ్ఞను లోబడి ఉన్నాం.' (12,13)
అథోపాయాత్ స మునిశ్చండకోపః
స్వమాశ్రమం మూలఫలం గృహీత్వా ।
అన్వేషమాణశ్చ న తత్ర పుత్రం
దదర్శ చుక్రోధ తతో భృశం సః ॥ 14
కొంతసేపటికి కోపిష్ఠి అయిన విభాండకుడు ఫలాలు, దుంపలు తీసుకొని ఆశ్రమానికి వచ్చాడు. ఎంతవెదికినా తనపుత్రుని కనుగొనలేక చాలా క్రోధంతో నిండిపోయాడు. (14)
తతః స కోపేన విదీర్యమాణః
ఆశంకమానో నృపతేర్విధానమ్ ।
జగామ చంపాం ప్రతి ధక్ష్యమాణః
తమంగరాజం సపురం సరాష్ట్రమ్ ॥ 15
కోపంతో అతని హృదయం బ్రద్దలైంది. అతని మనస్సులో లోమపాదునిపై సందేహం కలిగింది. చంపానగరానికి బయలుదేరి రాష్ట్రాలతో, నగరాలతో సహా అంగరాజ్యాన్ని దహింపదలచాడు. (15)
స వై శ్రాంతః క్షిధితః కాశ్యపస్తాన్
ఘోషాన్ సమాసాదితవాన్ సమృద్ధాన్ ।
గోపైశ్చ తైర్విధివత్ పూజ్యమానః
రాజేవ తాం రాత్రిమువాస తత్ర ॥ 16
అలసి, ఆకలితో విభాండకుడు ఆ గోపాలుకుల కొట్టంలో ప్రవేశించాడు. గోపాలకుడు యథాశాస్త్రంగా ఆయనను పూజించారు. రాజువలె సుఖభోగాలను ఆ రాత్రి అక్కడ అనుభవించాడు. (16)
అవాప్య సత్కారమతీవ తేభ్యః
ప్రోవాచ కస్య ప్రథితాః స్థ గోపాః ।
ఊచుస్తతస్తేఽభ్యుపగమ్య సర్వే
ధనం తవేదం విహితం సుతస్య ॥ 17
వారి నుండి ఆతిథ్యాన్ని, సత్కారాన్ని పొంది "మీరు ఎవరి పశుసంరక్షకులు?' అని అడిగాడు. వారు అందరు ఆయనను సమీపించి 'ఈ ధనమంతా మీ పుత్రునిదే అన్నారు.' (17)
దేశేషు దేశేషు స పూజ్యమాన
స్తాంశ్చైవ శృణ్వన్ మధురాన్ ప్రలాపాన్ ।
ప్రశాంతభూయిష్ఠరజాః ప్రహృష్టః
సమాససాదాంగపతిం పురస్థమ్ ॥ 18
మార్గంలో ప్రతిప్రాంతంలో పూజలను అందుకొని, మధురవచనాలు విని (రజోగుణం వల్ల ఉద్భవించిన) ఆయన కోపం శాంతించింది. ఆయన ప్రసన్నతతో రాజమందిరంలో అంగరాజును కలుసుకొన్నాడు. (18)
స పూజితస్తేవ నరర్షభేణ
దదర్శ పుత్రం దివి దేవం యథేంద్రమ్ ।
శాంతాం స్నుషాం చైవ దదర్శ తత్ర
సౌదామనీముచ్చరంతీం యథైవ ॥ 19
లోమపాదునిచే పూజింపబడిన విభాండకుడు స్వర్గంలోని ఇంద్రునితో సమానం అయిన ఐశ్వర్యం గల తన కుమారుని, మెరుపువలె భాసించే తన కోడలిని చూశాడు. (19)
గ్రామాంశ్చ ఘోషాంశ్చ సుతస్య దృష్ట్వా
శాంతాం చ శాంతోఽస్య పరః స కోపః ।
చకార తస్యైవ పరం ప్రసాదం
విభాండకో భూమిపతేర్నరేంద్ర ॥ 20
అతని పుత్రుని అధీనంలోని గ్రామాలు, పల్లెలు, కోడలు శాంతను చూస్తూనే ఆయన కోపం పూర్తిగా పోయింది. ఆ సమయంలో రోమపాదునిపై ఆయనకు చాలా దయ కలిగింది. (20)
స తత్ర నిక్షిప్య సుతం మహర్షిః
ఉవాచ సూర్యాగ్నిసమప్రభావః
జాతే చ పుత్రే వనమేవావ్రజేథా
రాజ్ఞః ప్రియాణ్యస్య సర్వాణి కృత్వా ॥ 21
సూర్యాగ్నుల తేజం కల ఆ ముని తన పుత్రుని అక్కడే వదలి కొడుకుతో అన్నాడు - పుత్రుడు కలిగిన తరువాత రాజుకి మేలు చేసి, తిరిగి వనానికి రమ్ము. (21)
స తద్వచః కృతవానృష్యశృంగః
యయౌ చ యత్రాస్య పితా బభూవ ।
శాంతాం చైనం పర్యచరన్నరేంద్ర
ఖే రోహిణీ సోమమివానుకూలా ॥ 22
ఋష్యశృంగుడు తండ్రి మాటలు పాటించాడు. తిరిగి మళ్ళీ ఆశ్రమానికి చేరాడు. రోహిణి చంద్రుని కొలిచినట్లు శాంత ఋష్యశృంగుని సేవ చేసింది. (22)
అరుంధతీ వా సుబగా వసిష్ఠం
లోమాముద్రా వా యథా హ్యగస్త్యమ్ ।
నలస్య వై దమయంతీ యథాభూద్
యథా శచీ వజ్రధరస్య చైవ ॥ 23
అరుంధతి వసిష్ఠుని, లోపాముద్ర అగస్త్యుని, దమయంతి నలుని, శచీదేవి ఇంద్రుని సేవించినట్లు శాంత ఆయనను సేవించింది. (23)
నారాయణీ చేంద్రసేనా బభూవ
వశ్యా నిత్యం ముద్గలస్యాజమీఢ ।
యథా సీతా దాశరథేర్మహాత్మనః
యథా తవ ద్రుపదీ పాండుపుత్ర ।
తథా శాంతా ఋష్యశృంగం వనస్థం
ప్రీత్యా యుక్తా పర్యచరన్నరేంద్ర ॥ 24
నారాయణి ఇంద్రసేన ముద్గలుని అధీనమైనట్లు, సీత రాముని అధీనమైనట్లు. ద్రౌపదీదేవి నీవశమైనట్లు, శాంత ప్రీతితో ఋష్యశృంగుని సేవించింది. (24)
తస్యాశ్రమః పుణ్య ఏషోఽవభాతి
మహాహ్రదం శోభయన్ పుణ్యకీర్తిః ।
అత్ర స్నాతః కృతకృత్యో విశుద్ధః
తీర్థాన్యన్యాన్యనుసంయాహి రాజన్ ॥ 25
రాజా! ఇది పుణ్యం, పవిత్రం అయిన ఆశ్రమం. ఈ నదీ కుండం దీనివలన ప్రసిద్ధి పొందింది. ఇక్కడ స్నానం చేసినవాడు కృతకృత్యుడై, పరిశుద్ధుడై తిరిగి యాత్రను కొనసాగిస్తాడు. (25)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయామృష్యశృంగోపాఖ్యానే త్రయోదశాధికశతతమోఽధ్యాయః ॥ 113 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో ఋష్యశృంగోపాఖ్యానము అను నూట పదమూడవ అధ్యాయము. (113)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 25 1/2 శ్లోకాలు.)