116. నూట పదునారవ అధ్యాయము
పరశురాముడు తల్లిని చంపుట, కార్తవీర్యుని చంపుట, రాజపుత్రులు జమదగ్నిని చంపుట.
అకృతవ్రణ ఉవాచ
స వేదాధ్యయనే యుక్తః జమదగ్నిర్మహాతపాః ।
తపస్తేపే తతో దేవాన్ నియమాద్ వశమానయత్ ॥ 1
అకృతవ్రణుడు పలికాడు - మహాతపస్వి అయిన జమదగ్ని వేదాధ్యయన శీలంతో తపస్సు ప్రారంభించి, నియమాలతో దేవతలను వశపరచుకొన్నాడు. (1)
స ప్రసేనజితం రాజన్ అధిగమ్య నరాధిపమ్ ।
రేణుకాం వరయామాస స చ తస్మై దదౌ నృపః ॥ 2
అతడు ప్రసేనజిత్తు అనే రాజును కోరి అతని కుమార్తె రేణుకను వరించాడు. ఆ రాజు తనకూమార్తెను జమదగ్నికిచ్చి వివాహం చేశాడు. (2)
రేణుకాం త్వథ సంప్రాప్య భార్యాం భార్గవనందనః ।
ఆశ్రమస్థస్తయా సార్ధం తపస్తేపేఽనుకూలయా ॥ 3
జమదగ్ని రేణుకను భార్యగా పొంది, ఆశ్రమంలో అనుకూలవతి అయిన ఆ భార్యతో సహా ఉంటూ గొప్ప తపస్సు ఆచరించాడు. (3)
తస్యాః కుమారాశ్చత్వారః జజ్ఞిరే రామపంచమాః ।
సర్వేషామజఘన్యస్తు రామ ఆసీజ్జఘన్యజః ॥ 4
ఆమె గర్భం నుంచి నలుగురు పుత్రులు పుట్టారు. అయిదవవాడు పరశురాముడు, జన్మచే చివరివాడైనా గుణగణాల్లో అందరికంటె పెద్దవాడు. (4)
ఫలాహారేషు సర్వేషు గతేష్వథ సుతేషు వై ।
రేణుకా స్నాతుమగమత్ కదాచిన్నియతవ్రతా ॥ 5
ఒకరోజు పండ్లకోసం కుమారులు అందరు వెళ్ళగా నియమశీల అయిన రేణుక నదికి స్నానానికి వెళ్లింది. (5)
సా తు చిత్రరథం నామ మార్తికావతకం నృపమ్ ।
దదర్శ రేణుకా రాజన్ ఆగచ్ఛంతీ యదృచ్ఛయా ॥ 6
ఆమె స్నానం చేసి తిరిగివస్తూ, మార్తికావతపు రాజు అయిన చిత్రరథుని అనుకోకుండా చూచింది. (6)
క్రీడంతం సలిలే దృష్ట్వా సభార్యం పద్మమాలినమ్ ।
బుద్ధిమంతం తతస్తస్య స్పృహయామాస రేణుకా ॥ 7
కమలాల మాల ధరించి, ఐశ్వర్యవంతుడు అయిన చిత్రరథుడు భార్యలతో జలక్రీడలు ఆడుతున్న సమయంలో ఆ రాజును మనస్సులో కోరింది. (7)
వ్యభిచారాచ్చ తస్మాత్ సా క్లిన్నాంభసి విచేతనా ।
ప్రవివేశాశ్రమం త్రస్తా తాం వై భర్తాన్వబుధ్యత ॥ 8
మానసికంగా వ్యభిచరించి ఆ వికారంలో కరిగినదై ఆశ్రమానికి రేణుక తిరిగివచ్చింది. ఆశ్రమంలో ప్రవేశిస్తుండగనే భయపడిన ఆమెను జమదగ్ని గుర్తించాడు. (8)
స తాం దృష్ట్వా చ్యుతాం ధైర్యాద్ బ్రాహ్మా లక్ష్మ్యా వివర్జితామ్ ।
ధిక్ఛబ్దేన మహాతేజాః గర్హయామాస వీర్యవాన్ ॥ 9
ధైర్యాన్ని కోల్పోయి బ్రహ్మతేజాన్ని విడచిన ఆమెను శక్తిశాలి జమదగ్ని ధిక్కారపూర్వకంగా నిందించాడు. (9)
తతో జ్యేష్ఠో జామదగ్న్యః రుమణ్వాన్ నామ నామతః ।
ఆజగామ సుషేణశ్చ వసుర్విశ్వావసుస్తథా ॥ 10
అదే సమయాన జమదగ్ని జ్యేష్ఠపుత్రుడు రుమణ్వంతుడు వచ్చాడు. క్రమంగా సుషేణుడు, వసువు, విశ్వావసువు ఆశ్రమానికి వచ్చారు. (10)
తానానుపూర్వ్యాద్ భగవాన్ వధే మాతురచోదయత్ ।
న చ తే జాతసంహ్నేహాః కించిదూచుర్విచేతసః ॥ 11
వారిని అదే వరుసలో ఆ మహర్షి తల్లిని వధించుటకు ప్రేరేపించాడు. కాని తల్లి మీద ప్రేమతో వారు ఏమీ పలుకక నిలబడ్డారు. (11)
తతః శశాప తాన్ క్రోధాత్ తే శప్తాశ్చేతనాం జహుః ।
మృగపక్షిసధర్మాణః క్షిప్రమాసన్ జడోపమాః ॥ 12
జమదగ్ని కోపించి అందరు కుమారులను శపించగా వారు ఆలోచించే శక్తి కోల్పోయి మృగాలవలె, పక్షులవలె జడులయ్యారు. (12)
తతో రామోఽభ్యయాత్ పశ్చాద్ ఆశ్రమం పరవీరహా ।
తమువాచ మహాబాహుః జమదగ్నిర్మహాతపాః ॥ 13
పిమ్మట శత్రువులను చంపగల పరశురాముడు ఆశ్రమంలోకి ప్రవేశించాడు. జమదగ్ని అతన్నీ తల్లిని చంపమని కోరాడు. (13)
జహీమాం మాతరం పాపాం మా చ పుత్ర వ్యథాం కృథాః ।
తత ఆదాయ పరశుం రామో మాతుః శిరోఽహరత్ ॥ 14
'నీ తల్లిని ఇప్పుడే చంపు. మనస్సులో దుఃఖాన్ని విడచిపెట్టు' అన్నాడు. వెంటనే పరశురాముడు గండ్రగొడ్డలి తీసుకొని తల్లి తలను నరికివేశాడు. (14)
తతస్తస్య మహారాజ జమదగ్నేర్మహాత్మనః ।
కోపోఽభ్యగచ్ఛత్ సహసా ప్రసన్నశ్చాబ్రవీదిదమ్ ॥ 15
దీని వలన ఆయన క్రోధం పోయి, ప్రసన్నుడై, శాంతత పొంది అతనితో ఇలా పలికాడు. (15)
మమేదం వచనాత్ తాత కృతం తే కర్మ దుష్కరమ్ ।
వృషీష్వ కామాన్ ధర్మజ్ఞ యావతో వాంఛసే హృదా ॥ 16
స వవ్రే మాతురుత్థానమ్ అస్మృతిం చ వధస్య వై ।
పాపేన తేన చాస్పర్శం భ్రాతౄణాం ప్రకృతిం తథా ॥ 17
అపత్రిద్వంద్వతాం యుద్ధే దీర్ఘమాయుశ్చ భారత ।
దదౌ చ సర్వాన్ కామాంస్తాన్ జమదగ్నిర్మహాతపాః ॥ 18
'నామాటగా నీవు అసాధ్యమైన పనిని చేశావు. దీన్ని ఇతరులు చేయలేరు. నీవు ధర్మజ్ఞుడవు. మనస్సులో నున్న వరాలన్నీ కోరుకో.' అన్నాడు జమదగ్ని. అప్పుడు పరశురాముడు తండ్రితో 'తల్లిని బ్రతికించండి, నాచేతిలో చనిపోయిన విషయం ఆమెకు తెలియకుండా వరం ఇయ్యండి. మానసిక పాపం ఆమెను చేరకుండునట్లు నా సోదరులు బ్రతుకునట్లు అనుగ్రహించండి. యుద్ధంలో నన్ను జయించువాడు లేకుండాను, దీర్ఘాయువును ఇవ్వండి' అని ప్రార్థించాడు. మహాతపస్వి జమదగ్ని ఆ కోరికలన్నింటినీ ఇచ్చాడు. (16-18)
కదాచిత్తు తథైవాస్య వినిష్ర్కాంతాః సుతాః ప్రభో ।
అథానూపపతిర్వీరః కార్తవీర్యోఽభ్యవర్తత ॥ 19
ఒకనాడు వారందరు పూర్వంలాగే బయటికి పండ్లకోసం వెళ్ళారు. అనూపదేశపురాజు కార్తవీర్యార్జునుడు అక్కడికి వచ్చాడు. (19)
తమాశ్రమపదం ప్రాప్తమ్ ఋషేర్భార్యా సమార్చయత్ ।
స యుద్ధమదసమ్మత్తః నాభ్యనందత్ తథార్చనమ్ ॥ 20
ఆశ్రమంలో ఋషిపత్ని రేణుక అతనికి ఆ సమయానికి తగిన ఆతిధ్యం ఇచ్చింది. యుద్ధాన్ని కోరిన కార్తవీర్యార్జునుడు ఆ సత్కారాన్ని స్వికరించలేదు. (20)
ప్రమథ్య చాశ్రమాత్ తస్మాత్ హోమధేనోస్తథా బలాత్ ।
జహార వత్సం క్రోశంత్యాః బభంజ చ మహాద్రుమాన్ ॥ 21
హోమధేనువు అరుస్తుండగా దూడను బలవంతంగా ఆశ్రమం నుంచి అపహరించాడు. అక్కడి చెట్లను కూల్చి నాశనం చేశాడు. (21)
ఆగతాయ చ రామాయ తదాచష్ట పితా స్వయమ్ ।
గాం చ రోరుదతీం దృష్ట్వా కోపో రామం సమావిశత్ ॥ 22
ఆశ్రమానికి తిరిగివచ్చిన పరశురామునికి తండ్రి స్వయంగా ఈ విషయాన్ని తెల్పాడు. పదే పదే రోదిస్తున్న హోమధేనువుపై అతని దృష్టి పడింది. వెంటనే రామునికి కోపం వచ్చింది. (22)
స మృత్యువశమాపన్నం కార్తవీర్యముపాద్రవత్ ।
తస్యాథ యుధి విక్రమ్య భార్గవః పరవీరహా ॥ 23
చిచ్ఛేద నిశితైర్భల్లైః బాహూన్ పరిఘసన్నిభాన్ ।
సహస్రసమ్మితాన్ రాజన్ ప్రగృహ్య రుచిరం ధనుః ॥ 24
మృత్యు వశుడైన కార్తవీర్యుని పరశురాముడు ఎదుర్కొన్నాడు. పరశురాముడు యుద్ధంలో అందమైన ధనుస్సు తీసికొని తీక్ష్ణ బాణాలతో అతని వేయి చేతులను నరికాడు. (23,24)
అభిభూతః స రామేణ సంయుక్తః కాలధర్మణా ।
అర్జునస్యాథ దాయాదా రామేణ కృతమన్యవః ॥ 25
ఆశ్రమస్థం వినా రామం జమదగ్నిముపాద్రవన్ ।
తే తం జఘ్నుర్మహావీర్యమ్ అయుధ్యంతం తపస్వినమ్ ॥ 26
ఓడిన కార్తవీర్యుడు పరశురాముని చేతిలో చనిపోయాడు. అర్జునుని దాయాదులు పరశురామునిపై కోపించి పరశురాముడు లేనప్పుడు జమదగ్నిపై దాడిచేశారు. మహావీరుడు, యుద్ధకాంక్షలేనివాడు, తాపసి అయిన జమదగ్ని మహరిని వారు చంపివేశారు. (25,26)
అసకృద్ రామరామేతి విక్రోశంతమనాథవత్ ।
కార్తవీర్యస్య పుత్రాస్తు జమదగ్నిం యుధిష్ఠిర ॥ 27
పీడయిత్వా శరైర్జగ్ముః యథాగతమరిందమాః ।
అపక్రాన్తేషు వై తేషు జమదగ్నౌ తథా గతే ॥ 28
సమిత్పాణిరుపాగచ్ఛద్ ఆశ్రమ భృగునందనః ।
స దృష్ట్వా పితరం వీరః తథా మృత్యువశం గతమ్ ।
అనర్హంతం తథాభూతం విలలాప సుదుఃఖితః ॥ 29
యుధిష్ఠిరా! పదేపదే రామునిపేరు తలుస్తూ అనాథవలె విలపిస్తుండగా కార్తవీర్యార్జునుని పుత్రులు జమదగ్నిని చంపారు. శత్రునాశకులై కార్తవీర్యునిపుత్రులు జమదగ్నిని చంపి, వచ్చిన చోటుకే వెళ్ళారు. వారు వెడలిన పిదప జమదగ్ని మరణించగా దర్భలు గైకొని పరశురాముడు ఆశ్రమంలోకి వచ్చాడు. వీరుడైన పరశురాముడు తండ్రి చమ్పబడినట్లు తెలిసికొని అట్టి మృత్యువుకు అర్హుడు కాని, తండ్రిని చూచి చాలా సేపు విలపించాడు. (27-29)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం కార్తవీర్యోపాఖ్యానే జమదగ్నివధే షోడశాధికశతతమోఽధ్యాయః ॥ 116 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో కార్తవీర్యోపాఖ్యానమున జమదగ్నివధ అను నూట పదునారవ అధ్యాయము. (116)