117. నూట పదునేడవ అధ్యాయము

పరశురాముడు తండ్రికై విలపించుట. క్షత్రియ సంహారము, ధర్మజుడు పరశురాముని పూజించుట.

రామ ఉవాచ
మమాపరాధాత్ తైః క్షుద్రైః హతస్త్వం తాత బాలిశైః ।
కార్తవీర్యస్య దాయాదైః వనే మృగ ఇవేషుభిః ॥ 1
నా తప్పిదంచేత ఆ నీచులు, మూర్ఖులు కార్తవీర్యుని పుత్రులు అడవిలో బాణాలతో మృగాన్ని చంపినట్లు నిన్ను చంపారు. (1)
ధర్మజ్ఞస్య కథం తాత వర్తమానస్య సత్పథే ।
మృత్యురేవంవిధో యుక్తః సర్వభూతేష్వనాగసః ॥ 2
మీరు ధర్మజ్ఞులై సన్మార్గంలో నడచేవారు, మీరు ఇతర ప్రాణులను హింసింపరు. మీకు ఇలాంటి దుర్మరణం ఉచితమైంది కాదు. (2)
కిం ను తైర్న కృతం పాపం యైర్భవాంస్తపసి స్థితః ।
అయుధ్యమానో వృద్ధః సన్ హతః శరశతైః శితైః ॥ 3
మీరు తపస్సులో ఉండి, యుద్ధవిముఖులై, వృద్ధులై ఉన్నా వందలకొద్దీ తీక్ష్ణబాణాలతో మిమ్ము చంపారంటే ఇక వారు చెయ్యని పాపం ఏమి ఉంటుంది? (3)
కిం ను తే తత్ర వక్ష్యంతి సచివేషు సుహృత్సు చ ।
అయుధ్యమానం ధర్మజ్ఞమ్ ఏకం హత్వానపత్రపాః ॥ 4
ఆ సిగ్గులేని రాకుమారులు యుద్ధం ఇష్టం లేక ధర్మజ్ఞులై, అసహాయులైన మిమ్ము చంపి స్నేహితులు, వృద్ధుల ఎదుట దీన్ని ఎలా సమర్థించుకొంటారు? (4)
విలప్యైవం సకరుణం బహు నానావిధం నృప ।
ప్రేతకార్యాణి సర్వాణి పితుశ్చక్రే మహాతపాః ॥ 5
దదాహ పితరం చాగ్నౌ రామః పరపురంజయః ।
ప్రతిజజ్ఞే వధం చాపి సర్వక్షత్రస్య భారత ॥ 6
రాజా! ఇలా పరిపరివిధాలుగా దుఃఖంతో విలపించి ఆ పరశురాముడు తండ్రికి దహనసంస్కారాలు యథావిధిగా జరిపాడు. తండ్రికి ప్రేతకర్మలు చేసినపిమ్మట బలవంతుడు, పరాక్రమవంతుడు అయిన అతడు సంపూర్ణక్షత్రియవధకై ప్రతిన పూనాడు. (5,6)
సంక్రుద్ధోఽతిబలః సంఖ్యే శస్త్రమాదాయ వీర్యవాన్ ।
జఘ్నివాన్ కార్తవీర్యస్య సుతానేకోఽంతకోపమః ॥ 7
బలవంతుడు, వీర్యవంతుడు అయిన పరశురాముడు కోపించి యమునితో సమానుడై కార్తవీర్యుని కుమారులు అందరినీ సంహరించాడు. (7)
తేషాం చానుగతా యే చ క్షత్రియాః క్షత్రియర్షభ ।
తాంశ్చ సర్వానవామృద్గాద్ రామః ప్రహరతాం వరః ॥ 8
వారిని అనుసరించిన క్షత్రియులనందర్నీ కూడ యోధాగ్రేసరుడైన పరశురాముడు మట్టిలో కలిపివేశాడు. (8)
త్రిఃసప్తకృత్వః పృథివీం కృత్వా నిఃక్షత్రియాం ప్రభుః ।
సమంతపంచకే పంచ చకార రుధిరహ్రదాన్ ॥ 9
ఇరవై ఒక్క పర్యాయాలు భూమిని క్షత్రియ రహితం చేసి, ఆ రక్తంతో సమంతపంచక క్షేత్రాన అయిదు మడుగులు నింపాడు. (9)
స తేషు తర్పయామాస భృగూన్ భృగుకులోద్వహః ।
సాక్షాద్ దదర్శ చర్చీకం స చ రామం న్యవారయత్ ॥ 10
భృగువంశదీపకుడైన ఆ పరశురాముడు భృగువంశాన్ని రక్తంతో తర్పణం చేసి పవిత్రం చేశాడు. ఆ సమయాన ఋచీకుడు ప్రత్యక్షంగా చూసి అతని నివారించాడు. (10)
తతో యజ్ఞేన మహతా జామదగ్న్యః ప్రతాపవాన్ ।
తర్పయామాస దేవేంద్రమ్ ఋత్విగ్భ్యః ప్రదదౌ మహీమ్ ॥ 11
పిమ్మట పరాక్రమవంతుడు అయిన పరశురాముడు యజ్ఞం చేసి, ఇంద్రుని తృప్తి పరచి, భూమిని ఋత్విక్కులకు దక్షిణగా ఇచ్చాడు. (11)
వేదీం చాప్యదదద్ధైమీం కశ్యపాయ మహాత్మనే ।
దశవ్యామాయతాం కృత్వా నవోత్సేధాం విశాంపతే ॥ 12
మహాత్ముడైన కశ్యపునికి భార్గవరాముడు నలభైహస్తాల పొడుగు, నలభై హస్తాల వెడల్పు, ముప్పై ఆరు హస్తాల ఎత్తు గల బంగారు వేదికను దానం చేశాడు. (12)
తాం కశ్యపస్యానుమతే బ్రాహ్మణాః ఖండశస్తదా ।
వ్యభజంస్తే తదా రాజన్ ప్రఖ్యాతాః ఖాండవాయనాః ॥ 13
ఆ సమయంలో కశ్యపుని ఆజ్ఞచే బ్రాహ్మణులు ఆ భూమిని ఖండఖండాలుగా చేసికొని తీసుకొన్నారు. వారే తరువాత ఖాండవాయనులు అని ప్రసిద్ధిని పొందారు. (13)
స ప్రదాయ మహీం తస్మై కశ్యపాయ మహాత్మనే ।
అస్మిన్ మహేంద్రే శైలేంద్రే వసత్యమితవిక్రమః ॥ 14
ఆ విధంగా భూమిని కశ్యపునికి దానం చేసి సాటిలేని పరాక్రమం గల పరశురాముడు ఈ మహేంద్రపర్వతంపై నివసిస్తున్నాడు. (14)
ఏవం వైరమభూత్ తస్య క్షత్రియైర్లోకవాసిభిః ।
పృథివీ చాపి విజితా రామేణామితతేజసా ॥ 15
ఈ ప్రకారంగా లోకంలోని క్షత్రియులతో అతనికి వైరం ఏర్పడింది. అమితతేజోవంతుడైన పరశురామునిచే భూమి అంతా జయింపబడింది. (15)
వైశంపాయన ఉవాచ
తతశ్చతుర్దశీం రామః సమయేన మహామనాః ।
దర్శయామాస తాన్ విప్రాన్ ధర్మరాజం చ సానుజమ్ ॥ 16
వైశంపాయనుడు పలికాడు.
మరునాడు చతుర్దశిరోజున సోదరులతో కూడిన ధర్మజునికి ఆయన దర్శనమిచ్చాడు. (16)
స తమానర్చ రాజేంద్ర భ్రాతృభిః సహితః ప్రభుః ।
ద్విజానాం చ పరాం పూజాం చక్రే నృపతిసత్తమః ॥ 17
రాజశ్రేష్ఠుడు, ప్రతిభావంతుడు అయిన ధర్మరాజు సోదరులతో కూడి పరశురాముని బ్రాహ్మణులనుఉ, విశేషంగా పూజించాడు. (17)
అర్చిత్వా జామదగ్న్యం సః పూజితస్తేన చోదితః ।
మహేంద్ర ఉష్యతాం రాత్రిం ప్రయయౌ దక్షిణాముఖః ॥ 18
పరశురాముని అర్చించి స్వయంగా ఆయనచే సమ్మానింపబడి ఆయన ఆజ్ఞ గైకొని ధర్మరాజు ఆ రాత్రి మహేంద్రపర్వతంపై గడిపి, ఉదయాన లేచి, దక్షిణ దిక్కుగా బయలుదేరాడు. (18)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం కార్తవీర్యోపాఖ్యానే సప్తదశాధికశతతమోఽధ్యాయః ॥ 117 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో కార్తవీర్యోపాఖ్యానమను నూట పదునేడవ అధ్యాయము. (117)