125. నూట ఇరువది ఐదవ అధ్యాయము
ఇంద్రుడు ఆపదనుండి బయటపడుట - లోమశుడు చెప్పిన తీర్థాల మాహాత్మ్యము.
లోమశ ఉవాచ
తం దృష్ట్వా ఘోరవదనం మదం దేవః శతక్రతుః ।
ఆయాంతం భక్షయిష్యంతం వ్యాత్తాననమివాంతకమ్ ॥ 1
భయాత్ సంస్తంభితభుజః సృక్కిణీ లేలిహన్ ముహుః ।
తతోఽబ్రవీత్ దేవరాజః చ్యవనం భయపీడితః ॥ 2
సోమార్హావశ్వినావేతౌ అద్యప్రభృతి భార్గవ ।
భవిష్యతః సత్యమేతత్ వచోవిప్ర ప్రసీద మే ॥ 3
లోమశుడు పలికాడు. నోరు తెరుచుకొన్న యమరాజువలె భయంకరముఖం గల మదాసురుని చూచి నూరుయజ్ఞాలు చేసిన ఇంద్రుడు భయంతో వ్యాకులపడ్డాడు. భుజాలు కొయ్యబారిపోయి ఆ ఇంద్రుడు మృత్యువుకు భయపడి మాటిమాటికి పెదవుల మూలలను నాకసాగాడు. ఆ అవస్థలో అతడు చ్యవనునితో అన్నాడు - 'ఈ అశ్వినీ దేవతలు నేటి నుండి సోమపానం చేయడానికి అధికారులు కాగలరు. నామాట సత్యం. మీరు నాపై ప్రసన్నత చూపండి' (1,2,3)
న తే మిథ్యా సమారంభః భవత్వేష పరో విధిః ।
జానామి చాహం విప్రర్షే న మిథ్యాత్వం కరిష్యసి ॥ 4
సోమార్హావశ్వినావేతౌ యథా వాద్యకృతౌ త్వయా ।
భూయ ఏవ తు తే వీర్యం ప్రకాశేదితి భార్గవ ॥ 5
సుకన్యాయాః పితుశ్చాస్య లోకే కీర్తిః ప్రథేదితి ।
అతో మయైతత్ విహితం తవ వీర్యప్రకాశనమ్ ॥ 6
తస్మాత్ ప్రసాదం కురు మే భవత్వేవం యధేచ్ఛసి ।
'మీరు సంకల్పించిన ఈ యజ్ఞం అసత్యం కాదు. మీరు దేన్ని ఆచరించారో అదే ఉత్తమ విధానం. బ్రహ్మర్షీ! నేను ఎఱుగుదును. మీరు మీ సంకల్పాన్ని అసత్యం కానివ్వరు. నేడు అశ్వనీదేవతలను ఎలా సోమపానానికి అధికారులను చేశారో నాకు కూడ అలాగే మేలు చెయ్యండి. తిరిగి మీ పరాక్రమం వెల్లడి కాగలదు. సుకన్య కీర్తి, ఆమె తండ్రి కీర్తి విస్తరిస్తుంది. ఈ ఉద్దేశంతో నేను మీ బలవీర్యాలు ప్రకాశించే కార్యాన్ని చేశాను. మీరు ప్రసన్నులై నాపై దయచూపండి. మీరు ఎలా కోరితే అలా జరుగుతుంది'. (4,5,6)
ఏవముక్తస్య శక్రేణ భార్గవస్య మహాత్మనః ।
స మన్యుర్వ్యగమచ్ఛీఘ్రం ముమోచ చ పురందరమ్ ।
మదం చ వ్యభజత్ రాజన్ పానే స్త్రీషు చ వీర్యవాన్ ॥ 8
అక్షేషు మృగయాయాం చ పూర్వస్పృష్టం పునః పునః ।
తదా మదం వినిక్షిప్య శక్రం సంతర్ప్యచేందునా ॥ 9
అశ్విభ్యాం సహితాన్ దేవాన్ యాజయిత్వా చ తం నృపమ్ ।
విఖ్యాప్య వీర్యం లోకేషు సర్వేషు వదతాం వరః ॥ 10
సుకన్యయా సహారణ్యే విజహారానుకూలయా ।
తస్యైతత్ ద్విజసంఘుష్టం సరో రాజన్ ప్రకాశతే ॥ 11
రాజా! ఇంద్రుడు ఇలా పలికిన మీదట గొప్ప మనస్వి చ్యవనుని క్రోధం తగ్గింది. అతడు ఇంద్రుని వెంటనే దుఃఖాల నుంచి విముక్తిని చేశాడు. శక్తిశాలి అయిన ఆ చ్యవనుడు మదాసురుని క్రమంగా స్త్రీలు, మద్యపానం, ద్యూతం, వేట ఈ నాలుగింటిలో భాగాలుగా చేసి ప్రవేశపెట్టాడు. అపుడే మదుని దూరంగా తరిమి, ఇంద్ర, అశ్వినీదేవతలతో కలిసి సోమరసం త్రాగి, రాజు శర్యాతి కోరిక తీర్చి లోకానికంతటికీ తన శక్తి ప్రకటించి, చ్యవనుడు తన భార్య సుకన్యతో హాయిగా వనవిహారం చేయసాగాడు. పక్షులు సవ్వడిచేసే ఈ సరోవరం చ్యవనునిదే. (7-11)
అత్ర త్వం సహ సోదర్యైః పితౄన్ దేవాంశ్చ తర్పయ ।
ఏతద్ దృష్ట్వా మహీపాల సికతాక్షం చ భారత ॥ 12
సైంధవారణ్యమాసాద్య కుల్యానాం కురు దర్శనమ్ ।
పుష్కరేషు మహారాజ సర్వేషు చ జలం స్పృశ ॥ 13
స్థాణోర్మంత్రాణి చ జపన్ సిద్ధిం ప్రాప్య్ససి భారత ।
సంధిర్ద్వయోః నరశ్రేష్ఠ త్రేతాయా ద్వాపరస్య చ ॥ 14
నీవు ఇక్కడ నీ తమ్ములతో కలిసి పితృదేవతలను ఆరాధించు. ఈ సరోవరమూ, సికతాక్షతీర్థమూ దర్శించి సైంధవారణ్యంలో చిన్న చిన్న నదుల్లో స్నానం చెయ్యాలి. అక్కడి అన్ని సరస్సుల్లో జలాన్ని స్పృశించాలి. పరమశివుని మంత్రాలు జపిస్తూ ఆ తీర్థాల్లో మునిగి సిద్ధిని పొందుతావు. రాజా! ఇది త్రేతా, ద్వాపరయుగాల సంధి సమయంలో ఏర్పడిన తీర్థం. (12-14)
అయం హి దృశ్యతే పార్థ సర్వపాపప్రణాశనః ।
అత్రోపస్పృశ్య చైవ త్వం సర్వ పాపప్రణాశనే ॥ 15
ఇది అన్ని పాపాలను నాశనం చేయగల తీర్థం. ఇక్కడ సర్వపాప ప్రణాశన తీర్థంలో స్నానం చేసి శుద్ధిని పొందు. (15)
అర్చీకపర్వతశ్చైవ నివాసో వై మనీషిణామ్ ।
సదాఫలః సదాస్రోతః మరుతాం స్థానముత్తమమ్ ॥ 16
ఎదురుగా ఉన్నది అర్చీకపర్వతం. ఇక్కడ విద్వాంసులు నివాసం ఉంటారు. ఈ పర్వతంపై పళ్లూ, నీరూ ఎప్పుడూ సమృద్ధిగా ఉంటాయి. ఇది దేవతల ఉత్తమ వసతి స్థానం. (16)
చైత్యాశ్చైతే బహువిధాః త్రిదశానాం యుధిష్ఠిర ।
ఏతచ్చంద్రమసస్తీర్థం ఋషయః పర్యుపాసతే ।
వైఖానసా వాలఖిల్యాః పావకా వాయుభోజనాః ॥ 17
శృంగాణి త్రీణి పుణ్యాని త్రీణి ప్రస్రవణాని చ ।
సర్వాణ్యను పరిక్రమ్య యథాకామముపస్పృశ ॥ 18
ధర్మజా! ఈ పర్వతంపై దేవతలకు చాలా మందిరాలు ఉన్నాయి. ఇది చంద్రతీర్థం. దీన్ని ఋషులు తప్పక సేవిస్తారు. ఈ ప్రదేశంలో వాలఖిల్యులు, వైఖానసులు, వాయుభక్షణం చేసేవారు నివసిస్తారు. ఈ పర్వతంపైన మూడు శిఖరాలు, మూడు సెలయేళ్ళు ఉన్నాయి. వీటన్నింటిలో నీకోరికను అనుసరించి స్నానాదులు ఆచరించు. (17,18)
శాంతనుశ్చాత్ర రాజేంద్ర శునకశ్చ నరాధిపః ।
నరనారాయణౌ చోభౌ స్థానం ప్రాప్తాః సనాతనమ్ ॥ 19
రాజేంద్రా! ఇక్కడే రాజు శాంతనుడు, శునకుడు, నరనారాయణులు తపస్సుచేసి శాశ్వతలోకాలకు వెళ్ళారు. (19)
ఇహ నిత్యశయా దేవాః పితరశ్చ మహర్షిభిః ।
ఆర్చీకపర్వతే తేపుః తాన్ యజస్వ యుధిష్ఠిర ॥ 20
ఈ అర్చీక పర్వతంపై నిత్యం నివాసం చేస్తూ ఋషులతో కలిసి దేవతలు, పితరులు తపస్సు చేశారు. నీవు వీరిని అందరినీ పూజించు. (20)
ఇహ తే వై చరూన్ ప్రాశ్నన్ ఋషయశ్చ విశాంపతే ।
యమునా చాక్షయస్రోతా కృష్ణశ్చేహ తపోరతః ॥ 21
యమౌ చ భిమసేనశ్చ కృష్ణాచామిత్రకర్శన ।
సర్వే చాత్ర గమిష్యామః త్వయైవ సహపాండవ ॥ 22
ఏతత్ ప్రస్రవణం పుణ్యం ఇంద్రస్య మనుజేశ్వర ।
యత్ర ధాతా విధాతా చ వరుణశ్చోర్ధ్వమాగతాః ॥ 23
ఇక్కడ దేవతలు, ఋషులు చరుభోజనం చేశారు. దీనికి దగ్గరలో నాశం లేని ప్రవాహం కల యమునానది ఉంది. ఇక్కడే కృష్ణుడు తపస్సు చేశాడు. నకులుడు, సహదేవుడు, భీమసేనుడు, ద్రౌపది మీరు, మేము ఈ స్థానానికి చేరుదాం. ఇది ఇంద్రుని సెలయేరు. ధాత, విధాత, వరుణుడు, ఊర్థ్వలోకాలకు చేరిన స్థానం ఇదే. (21,22,23)
ఇహతే ప్యవసన్ రాజన్ క్షాంతాః పరమధర్మిణః ।
మైత్రాణామృజుబుద్ధీనాం అయం గిరివరః శుభః ॥ 24
ఓర్పుకల్గి, ధర్మాత్ములైన పురుషులందరూ ఇక్కడే నివసించారు. ఋజుబుద్ధికలిగి, మైత్రీభావం కలవారందరికీ ఈ పర్వతం అత్యంతం ఆశ్రయింపతగింది. (24)
ఏషా సా యమునా రాజన్ మహర్షి గణసేవితా ।
నానాయజ్ఞచితా రాజన్ పుణ్యా పాపభయాపహా ॥ 25
అత్ర రాజా మహేష్వాసః మాంధాతా యజత స్వయమ్ ।
సాహదేవిశ్చ కౌంతేయ సోమకో దదతాం వరః ॥ 26
కౌంతేయా! మహర్షిగణంచే సేవలందుకునే యమున ఇదే. వారు దీని ఒడ్డున అనేక యజ్ఞాలు చేశారు. అవి పాపాలభయాన్ని పోగొట్టేవి. గొప్పవిలుకాడైన మాంధాత మహారాజు స్వయంగా ఈ ప్రదేశంలో యజ్ఞం ఆచరించాడు. దానశిరోమణి, సహదేవకుమారుడూ అయిన సోమకుడు ఈ ఒడ్డుపై యజ్ఞయాగాలు ఆచరించి మంచిఫలాన్ని పొందాడు. (25,26)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం సౌకన్యే పంచవింశత్యధికశతతమోఽధ్యాయః ॥ 125 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రాపర్వము అను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో సౌకన్యము అను నూట ఇరువది అయిదవ అధ్యాయము. (125)