126. నూట ఇరువది ఆరవ అధ్యాయము
మాంధాతపుట్టుక, సంక్షిప్త చరిత్ర.
యుధిష్ఠిర ఉవాచ
మాంధాతా రాజశార్దూలః త్రిషు లోకేషు విశ్రుతః ।
కథం జాతో మహాబ్రహ్మన్ యౌవనాశ్వో నృపోత్తమః ॥ 1
కథం చైనాం పరాం కాష్ఠాం ప్రాప్తవానమితద్యుతిః ।
యస్య లోకాస్త్రయో వశ్యాః విష్ణోరివ మహాత్మనః ॥ 2
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం చరితం తస్య ధీమతః ।
(సత్యకీర్తేర్హి మాంధాతుః కథ్యమానం త్వయానఘ ।)
యథా మాంధాతృశబ్దశ్చ తస్య శక్రసమద్యుతేః ।
జన్మ చాప్రతివీర్యస్య కుశలో హ్యసి భాషితుమ్ ॥ 3
ధర్మరాజు ప్రశ్నించాడు.
యువనాశ్వుని కుమారుడు మాంధాత మూడులోకాల్లో ప్రసిద్ధి చెందిన రాజు కదా! అతడు ఎలా పుట్టాడు? మాంధాత అందరికంటె ఉన్నతస్థితిని ఎలా సంపాదించాడు? విష్ణువుతో సమానంగా మూడు లోకాలు అతనికి ఎలా వశమయ్యాయి? నేను మీ ముఖం నుంచి ధీమంతుడు, సత్యకీర్తి అయిన మాంధాత చరిత్ర వినాలనుకొంటున్నాను. ఇంద్రసమాన తేజస్వి, సాటిలేని పరాక్రమవంతుడు అయిన ఆయనకు మాంధాత అని పేరు ఎలా వచ్చింది? అన్ని విషయాలు వివరించటానికి మీరే సమర్థులు. (1-3)
లోమశ ఉవాచ
శృణుష్వావహితో రాజన్ రాజ్ఞస్తస్య మహాత్మనః ।
యథా మాంధాతృశబ్దో వై లోకేషు పరిగీయతే ॥ 4
లోమశుడు చెప్పాడు. రాజా! సావధానంగా ఆ మహాత్ముని గూర్చి విను. మాంధాత అన్నపేరు లోకంలో ఎలా ప్రసిద్ధి చెందిందో తెలుపుతాను. (4)
ఇక్ష్వాకువంశప్రభవః యువనాశ్వో మహీపతిః ।
సోఽయజత్ పృథివీపాలః క్రతుభిర్భూరిదక్షిణైః ॥ 5
ఇక్ష్వాకువంశంలో యువనాశ్వుడు అనే గొప్ప రాజు పుట్టాడు. అతడు గొప్పదక్షిణలిచ్చి చాలా యజ్ఞాలు చేశాడు. (5)
అశ్వమేధసహస్రం చ ప్రాప్య ధర్మభృతాం వరః ।
అన్యైశ్చ క్రతుభిర్ముఖైః అయజత్ స్వాప్తదక్షిణైః ॥ 6
ధర్మాత్ములలో శ్రేష్ఠుడైన మాంధాత వేయి అశ్వమేధ యాగాలు ఇతర ప్రధాన యాగాలు చేసి భగవంతుని ఆరాధించాడు. (6)
అనపత్యస్తు రాజర్షిః స మహాత్మా మహావ్రతః ।
మంత్రిష్వాధాయ తద్ రాజ్యం వననిత్యో బభూవ హ ॥ 7
శాస్త్రదృష్టేన విధినా సంయోజ్యాత్మానమాత్మవాన్ ।
స కదాచిన్నృపో రాజన్ ఉపవాసేన దుఃఖితః ॥ 8
పిపాసాశుష్కహృదయః ప్రవివేశాశ్రమం భృగోః ।
తామేవ రాత్రిం రాజేంద్ర మహాత్మా భృగునందనః ॥ 9
ఇష్టిం చకార సౌద్యుమ్నేః మహర్షిః పుత్రకారణాత్ ।
సంభృతో మంత్రపూతేన వారిణా కలశో మహాన్ ॥ 10
రాజేంద్రా! గొప్పవ్రతాలను, నియమాలను పాలించేవాడైనా అతనికి సంతానం కలుగలేదు. రాజ్యాన్ని మంత్రులపై ఉంచి వనంలో నివసించసాగాడు. యోగశాస్త్రవిధానంగా తన ఆత్మను పరమాత్మలో లీనం చేసి ఒకనాడు ఉపవాసం చేసి దుఃఖితుడై ఉన్నాడు. దప్పిక అతని హృదయాన్ని బాధిస్తూండగా నీటిని త్రాగడం కోసం భృగుమహర్షి ఆశ్రమాన్నొ చేరాడు. ఆ రాత్రే చ్యవనుడు సుద్యుమ్నకుమారుడైన, యువనాశ్వునికి పుత్రసంతానం కోసం ఇష్టిని చేశాడు. ఆ ఇష్టి సమయంలో చ్యవనమహర్షి మంత్రపూతమైన నీటితో ఒక పెద్ద కలశాన్ని నింపి అక్కడ ఉంచాడు. (7-10)
తత్రాతిష్ఠత రాజేంద్ర పూర్వమేవ సమాహితః ।
యత్ ప్రాశ్య ప్రసవేత్ తస్య పత్నీ శక్రసమం సుతమ్ ॥ 11
రాజేంద్రా! ఆ కలశం ఆశ్రమం లోపల ఒక అభిప్రాయంతో ఉంచబడింది. దాన్ని త్రాగిన యువనాశ్వుని భార్య ఇంద్ర సమానుడు అయిన పుత్రుని కంటుంది అని. (11)
తం న్యస్య వేద్యాం కలశం సుషుపుస్తే మహర్షయః ।
రాత్రిజాగరణాచ్ర్ఛాంతాన్ సౌద్యుమ్నిః సమతీత్య తాన్ ॥ 12
ఆ కలశం వేదికపై ఉంచి మహర్షులు అందరు నిద్రించారు. రాత్రి అంతా మేల్కొనటం వలన వారు అంతా అలసిపోయారు. (12)
శుష్కకంఠః పిపాసార్తః పానీయార్థీ భృశం నృపః ।
తం ప్రవిశ్యాశ్రమం శాంతః పానీయం సోఽభ్యయాచత ॥ 13
దప్పికతో అతని కంఠం నీరసించింది. నీటిని కోరిన రాజు ఆ ఆశ్రమంలోకి ప్రవేశించి వారిని నీటికోసం ప్రార్థించాడు. (13)
తస్య శ్రాంతస్య శుష్కేణ కంఠేన క్రోశతస్తదా ।
నాశ్రౌషీత్ కశ్చన తదా శకునేరివ వాశతః ॥ 14
అలసి నీరసపడుటచే అతడు అరుస్తున్నా ఆ సమయంలో ఎరెవరికీ అతని పిలుపు వినపడలేదు. పైగా ఆ సమయంలో పక్షికూతలా అనిపించింది. (14)
తతస్తం కలశం దృష్ట్వా జలపూర్ణం స పార్థివః ।
అభ్యద్రవత వేగేన పీత్వా చాంభో వ్యవాసృజత్ ॥ 15
నీటితో నిండిన ఆ కలశంపై అతని దృష్టి పడింది. వేగంగా ఆ వైపు పరుగు తీసి స్వేచ్ఛగా అందులోని నీరు త్రాగి మిగిలిన నీటిని వదిలివేశాడు. (15)
స పీత్వా శీతలం తోయం పిపాసార్తో మహీపతిః ।
నిర్వాణమగమద్ ధీమాన్ సుసుఖీ చాభవత్ తదా ॥ 16
రాజైన యువనాశ్వుడు ఆ చల్లని నీరు త్రాగిన వెంటనే అతనికి శాంతి లభించింది. ధీమంతుడైన రాజు సుఖాన్ని కూడ పొందాడు. (16)
తతస్తే ప్రత్యబుధ్యంత మునయః సతపోధనాః ।
నిస్తోయం తం చ కలశం దదృశుః సర్వ ఏవ తే ॥ 17
తపోధనులు అందరు మేల్కొని నీరులేని కలశాన్ని చూశారు. (17)
కస్య కర్మేదమితి తే పర్యపృచ్ఛన్ సమాగతాః ।
యువనాశ్వో మమేత్యేవం సత్యం సమభిపద్యత ॥ 18
ఆ మునులు ఒకచోటికి చేరి ఒకరు రెండవవారిని గూర్చి 'ఇది ఎవరి పని' అని అడిగారు. యువనాశ్వుడు ఎదురుగా వచ్చి "ఇది నా పనే" అని వాస్తవాన్ని చెప్పాడు. (18)
న యుక్తమితి తం ప్రాహ భగవాన్ భార్గవస్తదా ।
సుతార్థం స్థాపితా హ్యాపః తపసా చైవ సంభృతాః ॥ 19
మయా హ్యత్రాహితం బ్రహ్మ తప ఆస్థాయ దారుణమ్ ।
పుత్రార్థం తవ రాజర్షే మహాబలపరాక్రమ ॥ 20
చ్యవనుడు "బలపరాక్రమాలు కల నీకు ఇది తగినది కాదు. ఈ కలశంలో నీకు పుత్రసంతానం కోసమే నా తపస్సుచే సంస్కరింపబడ్డ నీరు ఉంచాను. కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మతేజం అందులో నింపాను. (19,20)
మహాబలో మహావీర్యః తపోబలసమన్వితః ।
యః శక్రమపి వీర్యేణ గమయేద్ యమసాదనమ్ ॥ 21
అనేన విధినా రాజన్ మయైతదుపపాదితమ్ ।
అబృక్షణం త్వయా రాజన్ న యుక్తం కృతమద్య వై ॥ 22
పైన చెప్పిన క్రమంలో ఈ నీటిని నేను శక్తిసంపన్నం చేశాను. దీన్ని త్రాగిన వారికి మహావీర్యం, తపస్సు, బలం కల కుమారుడు పుడతాడు. అతడు ఇంద్రుణ్ణి అయినా జయించి యమపురికి పంపుతాడు. యథావిధిగా నాచే ఇది సమర్థతతో చేయబడింది. జలభక్షణం మాత్రం నీచే చేయబడింది. ఇది సరైంది కాదు. (21,22)
న త్వద్య శక్యమస్మాభిః ఏతత్ కర్తుమతోఽన్యథా ।
మానం దైవకృతం హ్యేతద్ యదేవం కృతావానసి ॥ 23
ఇప్పుడు మేము ఈ ప్రభావాన్ని సంపాదించడానికిగాని, మార్చడానికి గాని సమర్థుల కాము. నీవు చేసిన పని నిశ్చయంగా దైవ కారణంగానే జరిగింది. (23)
పిపాసితేన యాః పీతాః విధిమంత్రపురస్కృతాః ।
ఆపస్త్వమాత్మనా పుత్రమ్ ఈదృశం జనయిష్యసి ।
విధాస్యామో వయం తత్ర తవేష్టిం పరమాద్భుతామ్ ॥ 25
యథా శక్రసమం పుత్రం జనయిష్యసి వీర్యవాన్ ।
గర్భధారణజం వాపి న ఖేదం సమవాప్స్యసి ॥ 26
దప్పిక వలన నీవు విధి, మంత్రబలాలతో పాటు నా తపస్సు, వీర్యం చేర్చిన నీళ్ళు త్రాగావు. వాఠి నుంచి నీవు అట్లాంటి కుమారుణ్ణే కంటావు. ఈ ఆశయసాధనకై మేం నీ కోరికకు అనుగుణంగా అద్భుతమైన ఇష్టిని చేయిస్తాము. దీనితో ఇంద్రునితో సమానుడు అయిన పుత్రుని కంటావు. గర్భధారణ వల్ల ఏర్పడిన బాధ నీకు కలుగదు. (24-26)
తతో వర్షశతే పూర్ణే తస్య రాజ్ఞో మహాత్మనః ।
వామం పార్శ్వం వినిర్భిద్య సుతః సూర్య ఇవ స్థితః ॥ 27
నిశ్చక్రామ మహాతేజా న చ తం మృత్యురావిశత్ ।
యువనాశ్వం నరపతిం తదద్భుతమివాభవత్ ॥ 28
పిమ్మట వందసంవత్సరాలు గడిచాక ఆ మహారాజు ఎడమభాగాన్ని చీల్చుకొని సూర్యునివలె ప్రకాశించే తేజోవంతుడు అయిన కుమారుడు పుట్టాడు. రాజుకు మృత్యువు కూడా రాలేదు. ఇఇది చాలా అద్భుతం. (27,28)
తత్ర శక్రో మహాతేజాః తం దిదృక్షురుపాగమత్ ।
తతో దేవా మహేంద్రం తమ్ అసృచ్ఛన్ ధాస్యతీతి కిమ్ ॥ 29
మహాతేజస్వి అయిన ఇంద్రుడు విడ్డూరంగా పుట్టిన ఈ బాలుని చూడడానికి వచ్చాడు. ఆ సమయాన దేవతలు 'ఈ పిల్లవాడు ఏం త్రాగుతాడు?" అని ఇంద్రుని అడిగారు. (29)
ప్రదేశినీం తతోఽప్యాస్యే శక్రః సమభిసందధే ।
మామయం ధాస్యతీత్యేవం భాషితే చైవ వజ్రిణా ॥ 30
మాంధాతేతి చ నామాస్య చక్రుః సేంద్రా దివౌకసః ॥ 31
ప్రదేశినీం శక్రదత్తామ్ ఆస్వాద్య స శిశుస్తదా ।
అవర్ధత మహాతేజాః కిష్కూన్ రాజంస్త్రయోదశ ॥ 32
ఇంద్రుడు తన చేతి చూపుడు వ్రేలును అతని నోటిలో ఉంచి ఇలా అన్నాడు. 'నన్ను ఇతడు గ్రోలగలడు.' ఇంద్రుడు పలికిన మాటలు విని దేవతలు మాంధాత అనే పేరును అతనికి స్థిరం చేశారు. ఇంద్రుని చూపుడు వ్రేలిని గ్రహించి పాలను త్రాగిన ఆ శిశువు పదమూడు సంవత్సరాలు పెరిగాడు. (30-32)
వేదాస్తం సధనుర్వేదాః దివ్యాన్యస్త్రాణి చేశ్వరమ్ ।
ఉపతస్థుర్మహారాజ ధ్యాతమాత్రస్య సర్వశః ॥ 33
ఆ సమయాన శక్తిశాలి అయిన మాంధాత ధ్యానించగానే వేదాలు, ధనుర్వేదం, దివ్యాస్త్రాలు ఈశ్వరుని కృపచే అతనిలో ప్రవేశించాయి. (33)
ఆజగవం నామ ధనుః శరాః శృంగోద్భవాశ్చ యే ।
అభేద్యం కవచం చైవ సద్యస్తముపశిశ్రియుః ॥ 34
ఆజగవం అనే విల్లు, కొమ్ములతో చేసిన బాణాలు, చీల్చశక్యం కాని కవచం అతని నాశ్రయించాయి. (34)
సోఽభిషిక్తో మఘవతా స్వయం శక్రేణ భారత ।
ధర్మేణ వ్యజయల్లోకాన్ త్రీన్ విష్ణురివ విక్రమైః ॥ 35
అతడు స్వయంగా ఇంద్రునిచే పట్టాభిషిక్తుడై విష్ణువు మూడు పాదాలతో లోకాలను జయించినట్లు ధర్మంతో ముల్లోకాలను జయించాడు. (35)
తస్యాప్రతిహతం చక్రం ప్రావర్తత మహాత్మనః ।
రత్నాని చైవ రాజర్షిం స్వయమేవోపతస్థిరే ॥ 36
అతని శాసననియమాలు ఎదురు లేనివి అయ్యాయి. రత్నాలన్నీ రాజర్షి మాంధాతను స్వయంగా చేరాయి. (36)
తస్యైవం వసుసంపూర్ణా వసుధా వసుధాధిప ।
తేనేష్టం వివిధైర్యజ్ఞైః బహుభిః స్వాప్తదక్షిణైః ॥ 37
రాజా! ఈ ప్రకారంగా అతనికోసం భూమి ధనరత్నరాసులను నింపింది. ఘనమైన దక్షిణలతో ఎన్నో యాగాలను సమర్థవంతంగా పూర్తి చేసి ఫలాన్ని అందుకొన్నాడు. (37)
చితచైత్యో మహాతేజాః ధర్మాన్ ప్రాప్య చ పుష్కలాన్ ।
శక్రస్యార్ధాసనం రాజన్ లబ్ధవానమితద్యుతిః ॥ 38
రాజా! తేజస్సంపన్నుడైన మాంధాత ఎన్నో చయనమండపాలను నిర్మించి దాని వలన పుష్కలమైన ధర్మాన్ని పొందాడు. ఇంద్రుని అర్ధసింహాసనం సంపాదించాడు. (38)
ఏకాహాత్ పృథివీ తేన ధర్మనిత్యేన ధీమతా ।
విజితా శాసనాదేవ సరత్నాకరపత్తనా ॥ 39
ధర్మపరాయణుడు అయిన ఆయన ఆజ్ఞచే ఒక్కరోజులోనే పట్టణాలు, సముద్రంతో కూడిన భూమి అతనికి వశమయ్యాయి. (39)
తస్య చైత్యైర్మహారాజ క్రతూనాం దక్షిణావతామ్ ।
చతురంతా మహీ వ్యాప్తా నాసీత్ కించిదనావృతమ్ ॥ 40
మహారాజా! అతని యజ్ఞమండపాలు, దక్షిణ కలిగిన యజ్ఞాలు సముద్రాల వరకు వ్యాపించాయి. మండపాలు లేని భూమి కొంచెం కూడ లేదు. (40)
తేన పద్మసహస్రాణి గవాం దశ మహాత్మనా ।
బ్రాహ్మణానాం మహారాజ దత్తానీతి ప్రచక్షతే ॥ 41
మహారాజు మాంధాత పదివేల పద్మాల గోవులను బ్రాహ్మణులకు దానం చేశాడని కీర్తింపబడుతున్నాడు. (41)
తేన ద్వాదశవార్షిక్యామ్ అనావృష్ట్యాం మహాత్మనా ।
వృష్టం సస్యవివృద్ధ్యర్థం మిషతో వజ్రపాణినః ॥ 42
పన్నెండు సంవత్సరాలు అనావృష్టి ఏర్పడినప్పుడు వజ్రపాణి అయిన ఇంద్రుడు చూస్తుండగా పంటల అభివృద్ధికై స్వయంగా వర్షాన్ని కురిపించాడు. (42)
గర్జన్నివ మహామేఘః ప్రమథ్య నిహతః శరైః ॥ 43
చంద్రవంశంలో పుట్టి మేఘం వలె గర్జింపగల గాంధారాధిపతిని మాంధాత తీక్ష్ణబాణాలతో గాయపరిచి చంపివేశాడు. (43)
ప్రజాశ్చతుర్విధాస్తేన త్రాతా రాజన్ కృతాత్మవా ।
తేనాత్మతపసా లోకాస్తాపితాశ్చాతితేజసా ॥ 44
రాజా! అతడు తన మనస్సును అదుపులో ఉంచుకుని తపోబలంతో దేవ, మనుష్య, తిర్యఙ్, స్థావరాలనే నాలుగురకాల ప్రకృతిని రక్షించాడు. తన పరాక్రమంతో లోకాలను తపింపచేశాడు. (44)
తస్యైతద్ దేవయజనం స్థానమాదిత్యవర్చసః ।
పశ్య పుణ్యతమే దేశే కురుక్షేత్రస్య మధ్యతః ॥ 45
(తథా త్వమపి రాజేంద్ర మాంధాతేవ మహీపతిః ।
ధర్మం కృత్వా మహీం రక్షన్ స్వర్గలోకమవాప్ప్యసి ॥)
రాజేంద్రా! సూర్యతేజంతో సమానమైన తేజస్సు గల మాంధాత దేవయజ్ఞస్థానం ఇది. కురుక్షేత్రం మధ్యలో పవిత్రప్రదేశంలో ఉంది. దీనిని దర్శించు. మాంధాత వలె నీవు కూడ ధర్మంగా భూమిని పాలించి స్వర్గాన్ని చేరుతావు. (45)
ఏతత్ తే సర్వమాఖ్యాతం మాంధాతుశ్చరితం మహత్ ।
జన్మ చాగ్ర్యం మహీపాల యన్మాం త్వం పరిపృచ్ఛసి ॥ 46
రాజా! మాంధాత చరిత్ర అంతా నీవు అడిగినవిధంగా పూర్తిగా చెప్పాను. (46)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తః స కౌంతేయః లోమశేన మహర్షిణా ।
పప్రచ్ఛానంతరం భూయః సోమకం ప్రతి భారత ॥ 47
వైశంపాయనుడు పలికాడు.
లోమశుని వాక్యాలు విన్న ధర్మరాజు తరువాత సోమకుని చరిత్ర వినిపింపమని ఆయన్ని కోరాడు. (47)
ఇది శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి
లోమశతీర్థయాత్రాయాం మాంధాతోపాఖ్యానే షడ్ వింశత్యధికశతతమోఽధ్యాయః ॥ 126 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున లోమశతీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున మాంధాత చరిత్ర అను నూట ఇరువది ఆరవ అధ్యాయము. (126)
(దాక్షిణాత్య అధికపాఠం 1 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 48 1/2 శ్లోకాలు.)