129. నూట ఇరువదితొమ్మిదవ అధ్యాయము
కురుక్షేత్రద్వారము - యమునాతీర్థము - సరస్వతీ తీర్థమహాత్మ్యము.
లోమశ ఉవాచ
అస్మిన్ కిల స్వయం రాజన్ ఇష్టవాన్ వై ప్రజాపతిః ।
సత్రమిష్టీకృతం నామ పురా వర్షసహస్రికమ్ ॥ 1
లోమశుడు అన్నాడు - రాజా! ఈ తీర్థంలో పూర్వకాలం ప్రజాపతి ఇష్టీకృతం అనే యాగాన్ని వేయి ఏండ్లపాటు అనుష్ఠించాడు. (1)
అంబరీషశ్చ నాభాగః ఇష్టవాన్ యమునామను ।
యత్రేష్ట్వా దశ పద్మాని సదస్యేభ్యోఽభిసృష్టవాన్ ॥ 2
యజ్ఞైశ్చ తపసా చైవ పరాం సిద్ధిమవాప సః ।
నాభాగుని కుమారుడైన అంబరీషుడు ఇక్కడే యమునా తీరంలో తపస్సు చేశాడు. పిమ్మట సదస్యులకు పది పద్మాల నాణాలను దానం చేశాడు. తపస్సు ద్వారా సిద్ధిని పొందాడు. (2 1/2)
దేశశ్చ నాహుషస్యాయం యజ్వనః పుణ్యకర్మణః ॥ 3
సార్వభౌమస్య కౌంతేయ యయాతేరమితౌజసః ।
స్పర్ధమానస్య శక్రేణ తస్యేదం యజ్ఞవాస్త్విహ ॥ 4
కౌంతేయా! ఇది నహుషకుమారుడు యయాతి ప్రదేశం. అతడు పవిత్రకర్మలను చేసేవాడు. యాజ్ఞికుడు, మహాతేజస్వి, సార్వభౌముడు. అతడు ఎప్పుడూ ఇంద్రునితో పోటీపడేవాడు. ఇది అతని యజ్ఞభూమి. (3,4)
పశ్య నానావిధాకారైః అగ్నిభిర్నిచితాం మహీమ్ ।
మజ్జంతీమివ చాక్రాంతాం యయాతేర్యజ్ఞకర్మభిః ॥ 5
చూడు. ఇక్కడ అనేకాకారములయిన అగ్నులతో (చితులు) కూడిన భూమి యయాతి యజ్ఞకర్మలచే వ్యాప్తమై అతని పుణ్యధారలలో మునిగి ఉంది. (5)
ఏషా శమ్యేకపత్రా యా సరకం చైతదుత్తమమ్ ।
పశ్య రామహ్రదానేతాన్ పశ్య నారాయణాశ్రమమ్ ॥ 6
ఈ జమ్మికొమ్మకు ఒకే ఆకు ఉంది. ఈ సరస్సు కూడ ఉత్తమమయింది. చూడు, ఇవి పరశురాముని కుండాలు, ఇదే నారాయణాశ్రమం. చూడు. (6)
ఏతచ్చర్చీకపుత్రస్య యోగైర్విచరతో మహీం ।
ప్రసర్పణం మహీపాల రౌప్యాయామముతౌజసః ॥ 7
రాజా! ఇది యోగశక్తిచే భూమి అంతా సంచరించే ఋచీకుని పుత్రుడైన జమదగ్ని తీర్థం. ఇది రౌప్యానదీ సమీపంలో ఉంది. (7)
అత్రానువంశం పఠతః శృణు మే కురునందన ।
ఉలూఖలైరాభరణైః పిశాచీ యదభాషత ॥ 8
ఈ తీర్థానికి పరంపరగా ప్రాప్తమైన కథ ఉంది, చెబుతాను. విను. ప్రాచీన కాలంలో ఒక స్త్రీ తన పుత్రునితో కలిసి ఇక్కడ నివసించడానికి వచ్చింది. ఒక పిశాచి రోళ్ళపరిమాణం గల ఆభరణాలు దాల్చి ఆమెతో అంది. (8)
యుగంధరే దధి ప్రాశ్య ఉషిత్వా చాచ్యుతస్థలే ।
తద్వద్ భూతలయే స్నాత్వా సపుత్రా వస్తుమర్హసి ॥ 9
యుగంధరదేశంలో పెరుగు త్రాగి, అచ్యుతస్థలంలో రాత్రి నివసించి, భూతలయంలో స్నానమాడితేకాని పుత్రునితో ఇక్కడ నీకు నివసించుటకు అధికారం లేదు. (9)
ఏకరాత్రముషిత్వేహ ద్వితీయం యది వత్స్యసి ।
ఏతద్ వై తే దివావృత్తం రాత్రౌ వృత్తమతోఽన్యథా ॥ 10
ఒక రాత్రి ఇక్కడ పరుండి రెండవరోజున ఉంటే పగలు పొందిన కష్టం కంటె ఎక్కువ కష్టాన్ని రాత్రి పొందుతావు. (10)
అద్య చాత్ర నివత్స్యామః క్షపాం భరతసత్తమ ।
ద్వారమేతత్ తు కౌంతేయ కురుక్షేత్రస్య భారత ॥ 11
ఈ జనశ్రుతిని బట్టి ఇక్కడ ఒకే రాత్రి ఉండాలి. ఇక్కడ మనం ఈ రోజు రాత్రి నివసిద్దాం. ఇది కురుక్షేత్రానికి ద్వారం. (11)
అత్రైవ నాహుషో రాజా రాజన్ క్రతుభిరిష్టవాన్ ।
యయాతిర్బహురత్నౌఘైః యత్రేంద్రో ముదమభ్యగాత్ ॥ 12
రాజా! ఇక్కడే నహుషపుత్రుడు రాజైన యయాతి ధనరాశులను దక్షిణరూపంగా ఇచ్చి భగవంతుని అర్చించాడు. ఆ యజ్ఞాల్లో ఇంద్రుడు ఇతనిపట్ల చాలా ప్రసన్నుడు అయ్యాడు. (12)
ఏతత్ ప్లక్షావతరణం యమునాతీర్థముత్తమమ్ ।
ఏతద్ వై నాకపృష్ఠస్య ద్వారమాహుర్మనీషిణః ॥ 13
ఇది యమునా నదీ తీరాన ఉన్న ప్లక్షావతరణ తీర్థం, సాటిలేనిది, విద్వాంసులు దీన్ని స్వర్గలోకమార్గం అని కీర్తించారు. (13)
అత్ర సారస్వతైర్యజ్ఞైః ఈజానాః పరమర్షయః ।
యూపోలూఖలికాస్తాత గచ్ఛంత్యవభృథప్లవమ్ ॥ 14
ఇక్కడే యూపాలు, రోళ్ళు మొదలైన యజ్ఞసాధనాలను ప్రోగు చేసి సారస్వత యజ్ఞాలను అనుష్ఠించిన గొప్ప ఋషులు అవభృథ స్నానం చేశారు. (14)
అత్ర వై భరతో రాజా రాజన్ క్రతుభిరిష్టవాన్ ।
హయమేధేన యజ్ఞేన మేధ్యమశ్వమవాసృజత్ ॥ 15
అసకృత్ కృష్ణసారంగం ధర్మేణాప్య చ మేదినీమ్ ।
అత్రైవ పురుషవ్యాఘ్ర మరుత్తః సత్రముత్తమమ్ ॥ 16
ప్రాప చైవర్షిముఖ్యేన సంవర్తేనాభిపాలితః ।
అత్రోపస్పృశ్య రాజేంద్ర సర్వావ్లోకాన్ ప్రపశ్యతి ।
పూయతే దుష్కృతాచ్చైవ అత్రాపి సముపస్పృశ ॥ 17
ఇదే ప్రదేశంలో భరతుడు అనే రాజు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పొంది చాలా యజ్ఞాలు చేశాడు. అశ్వమేధయాగాన్ని చేయ నిశ్చయించి నల్లలేడి వంటి ఆకారమూ, నీలపు చెవులూ కల గుర్రాన్ని భూతలంపై తిరగటానికి విడచిపెట్టాడు. ఇదే తీర్థంలో ఋషిప్రవరుడు సంవర్తుడు మరుత్తమహారాజుచే సత్రయాగం చేయించాడు. రాజేంద్రా! ఇక్కడ స్నానం చేసిన మానవుడు పరిశుద్ధుడై లోకాలన్నింటిని ప్రత్యక్షంగా చూడగలడు. పాపాల నుంచి విముక్తిని పొందుతాడు. ఇక్కడ కూడ స్నానం చెయ్యి. (15-17)
వైశంపాయన ఉవాచ
తత్ర సభ్రాతృకః స్నాత్వా స్తూయమానో మహర్షిభిః ।
లోమశం పాండవశ్రేష్ఠః ఇదం వచనమబ్రవీత్ ॥ 18
వైశంపాయనుడు పలికాడు - తరువాత సోదరులతో కూడి, స్నానం చేసి, మహర్షులచే ప్రశంసింపబడి, లోమశునితో ధర్మజుడు ఇలా అన్నాడు. (18)
సర్వాన్లోకాన్ ప్రపశ్యామి తపసా సత్యవిక్రమ ।
ఇహస్థః పాండవశ్రేష్ఠం పశ్యామి శ్వేతవాహనమ్ ॥ 19
మహర్షీ! తపస్సంపనులగు మీరు సత్యపరాక్రములు. మీ కృపచే నేను సర్వలోకాలనూ చూడగలుగుతున్నాను. ఇక్కడే ఉండి పాండవశ్రేష్ఠుడైన అర్జునుని చూడగలుగుతున్నాను. (19)
లోమశ ఉవాచ
ఏవమేతన్మహాబాహో పశ్యంతి పరమర్షయః ।
(ఇహ స్నాత్వా తపోయుక్తాన్ త్రీన్లోకాన్ సచరాచరాన్ ।)
సరస్వతీమిమాం పుణ్యాం పుణ్యైకశరణావృతామ్ ॥ 20
లోమశుడు పలుకుతున్నాడు. మహాబాహూ! నీవు నిజం చెప్పావు. మహర్షులు అందరూ ఇక్కడ స్నానం చేసి మూడు లోకాలలోని చరాచరప్రాణుల నన్నింటిని చూస్తున్నారు. ఈ సరస్వతీ తీర్థాన్ని దర్శించే పుణ్యం కలవారు మాత్రమే ఈ ప్రదేశంలో సంచరిస్తారు. (20)
యత్ర స్నాత్వా నరశ్రేష్ఠ ధూతపాప్మా భవిష్యసి ।
ఇహ సారస్వతైర్యజ్ఞైః ఇష్టవంతః సురర్షయః ।
ఋషయశ్చైవ కౌంతేయ తథా రాజర్షయోఽపి చ ॥ 21
కౌంతేయా! ఈ తీర్థాలను సేవిస్తే నీపాపాలు పటాపంచలవుతాయి. దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు ఈ తీర్థంలో సారస్వత యజ్ఞాలు అనుష్ఠించారు. (21)
వేదీ ప్రజాపతేరేషా సమంతాత్ పంచయోజనా ।
కురోర్వై యజ్ఞశీలస్య క్షేత్రమేతన్మహాత్మనః ॥ 22
ఇది పంచయోజన విస్తీర్ణం అయిన ప్రజాపతి యజ్ఞవేదిక. ఇది యజ్ఞాచరణశీలం కల కురుమహారాజు క్షేత్రం. (22)
ఇది శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి
లోమశతీర్థయాత్రాయామేకోనత్రింశదిధికశతతమోఽధ్యాయః ॥ 129 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున లోమశతీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో నూట ఇరువది తొమ్మిదవ అధ్యాయము. (129)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 22 1.2 శ్లోకాలు.)