128. నూట ఇరువది యెనిమిదవ అధ్యాయము
నూరుగురు కుమారులు కలుగుట - సోమకపురోహితులు నరకస్వర్గములను అనుభవించుట.
సోమక ఉవాచ
బ్రహ్మన్ యద్ యద్ యథా కార్యం తత్ కురుష్వ తథా తథా ।
పుత్రకామతయా సర్వం కరిష్యామి వచస్తవ ॥ 1
సోమకుడు పలికాడు - పురోహితా! ఏ పని ఎలా ఎలా చెయ్యాలో అలాగే ఆచరించు. పుత్రప్రాప్తికై నీవు చెప్పిన దాన్ని చెప్పినట్టే ఆచరిస్తాను.
లోమశ ఉవాచ
తతః స యాజయామాస సోమకం తేన జంతునా ।
మాతరస్తు బలాత్ పుత్రమ్ అపాకర్షుః కృపాన్వితాః ॥ 2
హా హతాః స్మేతి వాశంత్యః తీవ్రశోకసమాహతాః ।
రుదంత్యః కరుణం వాపి గృహీత్వా దక్షిణే కరే ॥ 3
సవ్యే పాణౌ గృహీత్వా తు యాజకోఽపి స్మ కర్షతి ।
కురరీణామివార్తానాం సమాకృష్య తు తం సుతమ్ ॥ 4
విశస్య చైనం విధివద్ వపామస్య జుహావ సః ।
వపాయాం హూయమానాయాం గంధమాఘ్రాయ మాతరః ॥ 5
ఆర్తా నిపేతుః సహసా పృథివ్యాం కురునందన ।
సర్వాశ్చ గర్భానలభంస్తతస్తాః పరమాంగనాః ॥ 6
లోమశుడు అన్నాడు - అప్పుడు పురోహితుడు సోమకునిచే జంతుడిని యజ్ఞకుండంలో బలి ఇప్పించి యజ్ఞాన్ని ఆరంభించాడు. ఆ సమయంలో తల్లులందరు ఏడుస్తూ దయకలవారై 'మేము చనిపోయాము' అని అరుస్తూ జంతుడిని తీవ్ర్రశోకంతో లాగసాగారు. తల్లుపు ఒకవైపు నుంచి పిల్లవాణ్ణి కుడిచేయి పట్టుకుని లాగుతున్నారు. పురోహితుడు ఎడమ చేయి పట్టుకుని లాగుతున్నాడు. ఆడలకుముకి పిట్టలవలె అరుస్తూ తల్లులు తమ కుమారుని పట్టి లాగుతుండగా పురోహితుడు బలవంతంగా ఆ బాలకుని పట్టిలాగి శాస్త్రప్రకారంగా అతని వపను హోమం చేశాడు. ఆ గంధాన్ని వాసన చూచిన తల్లులందరు భూమిపై దీనురాండ్రై పడిపోయారు. ఆ వాసన పీల్చటంతో వారు అందరు గర్భవతులు అయ్యారు. (2-6)
తతీ దశసు మాసేషు సోమకస్య విశాంపతే ।
జజ్ఞే పుత్రశతం పూర్ణం తాసు సర్వాసు భారత ॥ 7
పిమ్మట పదినెలల్లో వారంతా పుత్రులను నూరుమందిని కన్నారు. (7)
జంతుర్జ్యేష్ఠః సమభవత్ జనిత్ర్యామేవ పార్థివ ।
స తాసామిష్ట ఏవాసీద్ న తథా తే నిజాః సుతాః ॥ 8
జంతుడు పూర్వపు తల్లియందే జ్యేష్ఠుడై పుట్టాడు. అందరు రాణులకూ తమ పుత్రుల కంటె అతడే ప్రీతిపాత్రుడు అయ్యాడు. (8)
తచ్చ లక్షణమాస్యాసీత్ సౌవర్ణం పార్శ్వ ఉత్తరే ।
తస్మిన్ పుత్రశతే చాగ్ర్యః స బభూవ గుణైరపి ॥ 9
అతని కుడివైపు బంగారపురంగు మచ్చ ఉంది. ఆ వందమందిలో అతడే గుణవంతుడు అయ్యాడు. (9)
తతః స లోకమగమత్ సోమకస్య గురుః పరమ్ ।
అథ కాలే వ్యతీతే తు సోమకోఽప్యగమత్ పరమ ॥ 10
అథ తం నరకే ఘోరే పచ్యమానం దదర్శ సః ।
తమపృచ్ఛత్ కిమర్థం త్వం నరకే పచ్యసే ద్విజ ॥ 11
పిమ్మట కొంతకాలానికి సోమకుని పురోహితుడు పరలోకాన్ని చేరాడు. కొన్ని దినాల తరువాత సోమకుడు పరలోకాన్ని పొందాడు. ఘోరనరకంలో అగ్నిలో వేగుతున్న పురోతుని చూచి అడిగాడు రాజు. 'ఏ కారణంగా నరకంలో అగ్నిపీడను అనుభవిస్తున్నావు?' అని. (10,11)
తమబ్రవీద్ గురుః సోఽథ పచ్యమానోఽగ్నినా భృశమ్ ।
త్వం మయా యాజితో రాజన్ తస్యేదం కర్మణః ఫలమ్ ॥ 12
ఏతచ్ర్ఛుత్వా స రాజర్షిః ధర్మరాజమథాబ్రవీత్ ।
అహమత్ర ప్రవేక్ష్యామి ముచ్యతాం మమ యాజకః ॥ 13
మత్కృతే హి మహాభాగః పచ్యతే నరకాగ్నినా ।
(సోఽహమాత్మానమాధాస్యే నరకాన్ముచ్యతాం గురుః ।)
నరకాగ్నిలో వేగిపోయే పురోహితుడు రాజుతో 'నేను నీచే యజ్ఞం చేయించాను. దాని ఫలితమే ఇది' అన్నాడు. ఇది విని రాజర్షి సోమకుడు యమధర్మరాజుతో అన్నాడు. 'నేను నరకాగ్నిలో ప్రవేశిస్తాను. నా పురోహితుని విడచిపెట్టండి.' అని. (నా కారణంగా ఈ మహాభాగుడు నరకాగ్నిలో వేగుతున్నాడు. నన్ను నేను నరకంలో ప్రవేశపెట్టుకొంటాను. అతన్ని విడువండి) (12,13)
ధర్మ ఉవాచ
నాన్యః కర్తుః ఫలం రాజన్ ఉపభుంక్తే కదాచన ।
ఇమాని తవ దృశ్యంతే ఫలాని వదతాం వర ॥ 14
ధర్ముడు అన్నాడు.
వాగ్మీ! కర్తయే అతడు చేసిన కర్మలకు ఫలాన్ని అనుభవించాలి. అతని బదులుగా ఇతరులు అనుభవింప వీలులేదు. నీవు నీ పుణ్యకర్మల ఫలంగా పుణ్యాన్ని పొంది ప్రత్యక్షంగా చూడగలుగుతున్నావు. (14)
సోమక ఉవాచ
పుణ్యాన్న కామయే లోకాన్ ఋతేఽహం బ్రహ్మవాదినమ్ ।
ఇచ్ఛామ్యహమనేనైవ సహ వస్తుం సురాలయే ॥ 15
నరకే వా ధర్మరాజ కర్మణాస్య సమో హ్యహమ్ ।
పుణ్యాపుణ్యఫలం దేవ సమమస్త్వావయోరిదమ్ ॥ 16
సోమకుడు అన్నాడు - నేను నా పురోహితుణ్ణి విడచి పుణ్యలోకాలు కోరను. నేను ఇతనితో కలిసియే స్వర్గంలోగాని, నరకంలోగాని ఉండాలి అనుకొంటున్నాను. ఈ నా పుణ్యకర్మలలో మా ఇద్దరికీ సమానంగా ఫలముంది. కావున పాపపుణ్యాల ఫలం సమానంగా అనుభవించాలి అని నా అభిప్రాయం. (15,16)
ధర్మరాజ ఉవాచ
యద్యేవమీప్సితం రాజన్ భుంక్ష్వాస్య సహితః ఫలమ్ ।
తుల్యకాలం సహానేన పశ్చాత్ ప్రాప్స్యసి సద్గతిమ్ ॥ 17
ధర్మరాజు పలికాడు - రాజా! నీకు అలాంటి కోరిక ఉంటే ఇతనితో సహా ఫలాన్ని అనుభవించు. ఇతని శిక్ష పూర్తి అయిన పిదప స్వర్గాన్ని చేరతావు. (17)
లోమశ ఉవాచ
స చకార తథా సర్వం రాజా రాజీవలోచనః ।
క్షీణపాపశ్చ తస్మాత్ సః విముక్తో గురుణా సహ ॥ 18
లోమశుడు అన్నాడు - పద్మాల వంటి కన్నులు గల ఆ రాజు యమధర్మరాజు చెప్పినట్లుగా అన్నిపనులు అలాగే చేశాడు. భోగం ద్వారా పాపం నశించాక పురోహితునితో కలిసి నరకం నుంచి బయటపడ్డాడు. (18)
లేభే కామాన్ శుభాన్ రాజన్ కర్మణా నిర్జితాన్ స్వయమ్ ।
సహ తేనైవ విప్రేణ గురుణా స గురుప్రియః ॥ 19
రాజా! గురుప్రేమ కల రాజు తన కర్మల్చే గురువుతో బాటు పుణ్యలోకాలు అనుభవించాడు. (19)
ఏష తస్యాశ్రమః పుణ్యః య ఏషోఽగ్రే విరాజతే ।
క్షాంత ఉష్యాత్ర షడ్రాత్రం ప్రాప్నోతి సుగతిం నరః ॥ 20
ఎదురుగా కనిపిస్తున్న ఇదే ఆయన ఆశ్రమం. పవిత్రమైన ఈ ఆశ్రమంలో క్షమాశీలుడై ఆరురాత్రులు ఇక్కడ ఉపవాసం చేస్తే మనుష్యునికి సద్గతులు కలుగుతాయి. (20)
ఏతస్మిన్నపి రాజేంద్ర వత్స్యామో విగతజ్వరాః ।
షడ్రాత్రం నియతాత్మానః సజ్జీభవ కురూద్వహ ॥ 21
రాజేంద్రా! మనము అందరం ఇంద్రియసంయమనంతో నిశ్చింతగా ఇక్కడ ఆరురోజులు ఉపవాసం చేద్దాం. సిద్ధం కండి. (21)
ఇది శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి
లోమశతీర్థయాత్రాయాం జంతూపాఖ్యానే సప్త అష్టావింశత్యధికశతతమోఽధ్యాయః ॥ 128 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో జంతూపాఖ్యానము అను నూట ఇరువది ఎనిమిదవ అధ్యాయము. (128)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 21 1/2 శ్లోకాలు.)