138. నూట ముప్పది ఎనిమిదవ అధ్యాయము
బ్రహ్మ హత్య నుండి పరావసువు విముక్తుడగుట. రైభ్య భరద్వాజ యవక్రీతులు తిరిగి జీవించుట.
లోమశ ఉవాచ
ఏతస్మిన్నేవ కాలే తు బృహద్ద్యుమ్నో మహీపతిః ।
సత్రం తేనే మహాభాగః రైభ్యయాజ్యః ప్రతాపవాన్ ॥ 1
లోమశుడు పలికాడు - ఇదే రోజుల్లో పరాక్రమవంతుడైన బృహద్ద్యుమ్నుడు అనే రాజు గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించాడు. రైభ్యుడు అక్కడ యాజకుడు. (1)
తేన రైభ్యస్య వై పుత్రౌ అర్వావసుపరావసూ ।
వృతౌ సహాయౌ సత్రార్థం బృహాద్ ద్యుమ్నేన ధీమతా ॥ 2
బుద్ధిమంతుడైన బృహద్ద్యుమ్నుడు యజ్ఞసమాప్తికై రైభ్యపుత్రులైన అర్వావసుపర్వసులను సహాయకులుగా చేశాడు. (2)
తత్ర తౌ సమనుజ్ఞాతౌ పిత్రా కౌంతేయ జగ్మతుః ।
ఆశ్రమే త్వభవద్ రైభ్యః భార్యా చైవ పరావసోః ॥ 3
అథావలోకకోఽగచ్ఛద్ గృహానేకః పరావసుః ।
కృష్ణాజినేన సంవీతం దదర్శ పితరం వనే ॥ 4
తండ్రి ఆజ్ఞగైకొని వారిరువురు రాజు చేసే యాగానికి వెళ్ళారు. ఆశ్రమంలో రైభ్యుడు, పరావసుని భార్య మాత్రమే ఆ సమయంలో ఉన్నారు. ఒకరోజున పరావసువు ఇంటిని చూడటానికి వచ్చాడు. ఆ సమయంలో నల్లలేడిచర్మంతో బంధింపబడిన తండ్రిని వనంలో చూశాడు. (3,4)
జఘన్యరాత్రే నిద్రాంధః సావశేషే తపస్యపి ।
చరంతం గహనేఽరణ్యే మేనే స పితరం మృగమ్ ॥ 5
రాత్రి చివర ఘడియలో అంధకారం కొద్దిగా ఉంది. పరావసువు నిద్రచే అంధుడై మృగచర్మం కప్పుకుని దట్టమైన అడవిలో తిరిగే తండ్రిని హింస్రజంతువు అని భావించాడు. (5)
మృగం తు మన్యమానేన పితా వై తేన హింసితః ।
అకామయానేన తదా శరీరత్రాణమిచ్ఛతా ॥ 6
మృగం అని భావించి తండ్రిని అతడు చంపాడు. అలా చేయటానికి ఇష్టపడకపోయినా, హింస్రపశువులు నుంచి తన శరీరరక్షణకై క్రూరకార్యాన్ని ఆచరించాడు. (6)
తస్య స ప్రేతకార్యాణి కృత్వా సర్వాణి భారత ।
పునరాగమ్య తత్ సత్రమ్ అబ్రవీద్ భ్రాతరం వచః ॥ 7
ఇదం కర్మ న శక్తస్త్వం వోఢుమేకః కథంచన ।
మయా తు హింసితస్తాతః మన్యమానేన తం మృగమ్ ॥ 8
సోఽస్మదర్థం వ్రతం తాత చర త్వం బ్రహ్మహింసనమ్ ।
సమరథోఽప్యహమేకాకీ కర్మ కర్తుమిదం మునే ॥ 9
తండ్రికి ప్రేతకార్యాలనన్నింటిని పూర్తిచేసి తిరిగి యజ్ఞమండపానికి వచ్చి తన సోదరుడైన అర్వావసువుతో అన్నాడు. 'సోదరా! ఈ యజ్ఞకర్మను నీవు ఒక్కడివీ నిర్వహించలేవు. ఇటు నేను హింసపశువుగా ఎంచి తండ్రిని చంపాను. నీవు నా కొరకు బ్రహ్మహత్యను నివారించే వ్రతాన్ని ఆచరించు. నేను రాజు యజ్ఞాన్ని పూర్తిచేస్తాను. నేను ఈ పనిని ఒంటరిగానైనా చేయగలవాడిని.' (7-9)
అర్వావసురువాచ
కరోతు వై భవాన్ సత్రం బృహద్ద్యుమ్నస్య ధీమతః ।
బ్రహ్మవధ్యాం చరిష్యేఽహం త్వదర్థం నియతేంద్రియః ॥ 10
అర్వావసువు పలికాడు.
నీవు బుద్ధిమంతుడైన బృహద్ద్యుమ్నుని యాగాన్ని పూర్తి చెయ్యి. నీ కొరకు నేను ఇంద్రియనిగ్రహంతో బ్రహ్మహత్యకు ప్రాయశ్చిత్తం చేస్తాను. (10)
లోమశ ఉవాచ
స తస్య బ్రహ్మవధ్యాయాః పారం గత్వా యుధిష్ఠిర ।
అర్వావసుస్తదా సత్రమ్ ఆజగామ పునర్మునిః ॥ 11
తతః పరావసుర్దృష్ట్వా భ్రాతరం సముపస్థితమ్ ।
బృహద్ద్యుమ్నమువాచేదం వచనం హర్షగద్గదమ్ ॥ 12
ఏష తే బ్రహ్మహా యజ్ఞం మా ద్రష్టుం ప్రవిశేదితి ।
బ్రహ్మహా ప్రేక్షితేనాపి పీడయేత్ త్వామసంశయమ్ ॥ 13
లోమశుడు పలికాడు - అర్వావసువు సోదరుని కోసం బ్రహ్మహత్యకు ప్రాయశ్చిత్తాన్ని పూర్తి చేసి, మళ్ళీ యజ్ఞంలో కలిశాడు. అటుపైన యజ్ఞంలో ప్రవేశించిన సంతోషంతో అర్వావసువును చూసి పరావసువు గద్గదస్వరంతో బృహద్ద్యుమ్నునితో ఇలా అన్నాడు. 'ఇతడు బ్రహ్మహత్య చేశాడు. యజ్ఞాన్ని చూడడానికి ఇతనికి ప్రవేశంలేదు. బ్రహ్మహత్య చేసినవాడు చూపుతోనే ఇతరులను పీడిస్తాడు. సంశయం లేదు.' (11-13)
లోమశ ఉవాచ
తచ్ర్ఛుత్వైవ తదా రాజా ప్రేష్యానాహ స విట్పతే ।
ప్రేష్యైరుత్సార్యమాణస్తు రాజన్నర్వావసుస్తదా ॥ 14
న మయా బ్రహ్మహత్యేయం కృతేత్యాహ పునః పునః ।
ఉచ్యమానోఽసకృత్ర్పేష్యైః బ్రహ్మహన్నితి భారత ॥ 15
లోమశుడు చెప్పాడు - పరావసువు మాటలు వింటూనే బృహద్ద్యుమ్నుడు అర్వావసుని లోపలికి రానివ్వవద్దని తన సేవకులను ఆజ్ఞాపించాడు. సేవకులచే నెట్టివేయబడిన అర్వావసువు మాటిమాటికి 'నేను బ్రహ్మహత్య చెయ్యలేదు' అని చెప్పాడు. కాని రాజసేవకులు అతనిని బ్రహ్మహత్య చేసినాడని సంబోధించారు. (14,15)
నైవ మ ప్రతిజానాతి బ్రహ్మవధ్యాం స్వయంకృతామ్ ।
మమ భ్రాత్రా కృతమిదం మయా స పరిమోక్షితః ॥ 16
అర్వావసువు తాను చేసిన బ్రహ్మహత్య ఏమిటో తెలుసుకోలేకపోయాడు. 'ఈ బ్రహ్మ హత్య నా సోదరుడు చేశాడు. నేను వానిని ఆ పాపం నుండి విడిపించాను.' (16)
స తథా ప్రవదన్ క్రోధాత్ తైశ్చ ప్రేష్యైః ప్రభాషితః ।
తూష్ణీం జగామ బ్రహ్మర్షిః వనమేవ మహాతపాః ॥ 17
అర్వావసువు అలా అంటూ కోపంతో సేవకులు అనే మాటలు పడ్డాడు. మహాతపస్వి అయిన అతడు ఇక మాట్లాడకుండా వనానికి వెళ్లిపోయాడు. (17)
ఉగ్రం తపః సమాస్థాయ దివాకరమథాశ్రితః ।
రహస్యవేదం కృతవాన్ సూర్యస్య ద్విజసత్తమః ॥ 18
మూర్తిమాంస్తం దదర్శాథ స్వయమగ్రభుగవ్యయః ।
ఆ బ్రహ్మర్షి సూర్యుని ఉద్దేశించి ఉగ్రతపస్సు చేశాడు. రహస్యమయిన సూర్య అష్టాక్షరి జపించాడు. తరువాత సూర్యుడు స్వస్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. (18 1/2)
లోమశ ఉవాచ'
ప్రీతాస్తస్యాభవన్ దేవాః కర్మణార్వావసోర్నృప ॥ 19
తం తే ప్రవరయామాసుః నిరాసుశ్చ పరావసుమ్ ।
తతో దేవా వరం తస్మై దదురగ్నిపురోగమాః ॥ 20
అర్వావసుని తపస్సుకు దేవతలంతా మెచ్చుకొన్నారు. పరావసుని నిరాకరించారు. అపుడు అగ్ని మొదలైన దేవతలు అతనికి వరమిచ్చారు. (19,20)
స చాపి వరయామాస పితురుత్థానమాత్మనః ।
అనాగస్త్వం తతో భ్రాతుః పితుశ్చాస్మరణం వధే ॥ 21
అపుడతడు దేవతలను "తన తండ్రి బ్రతకాలనీ, తన సోదరుడు నిర్దోషి కావాలనీ, తండ్రికి తన చావు గుర్తుండకూడదనీ కోరాడు. (21)
భరద్వాజస్య చోత్థానం యవక్రీతస్య చోభయోః ।
ప్రతిష్ఠాం చాపి వేదస్య సౌరస్య ద్విజసత్తమః ।
ఏవమస్త్వితి తం దేవాః ప్రోచుశ్చాపి వరాన్ దదుః ॥ 22
భరద్వాజుడు, యవక్రీతుడూ ఇద్దరూ బ్రతకాలనీ, సౌరమంత్రం ప్రతిష్ఠింపబడాలనీ" కోరాడు. అట్లే అని దేవతలంతా వరాలిచ్చారు. (22)
తతః ప్రాదుర్బభువుస్తే సర్వ ఏవ యుధిష్ఠిర ।
అథాబ్రవీద్ యవక్రీతః దేవానగ్నిపురోగమాన్ ॥ 23
సమధీతం మయా బ్రహ్మ వ్రతాని చరితాని చ ।
కథం చ రైభ్యః శక్తో మామ్ అధీయానం తపస్వినమ్ ॥ 24
తథాయుక్తేన విధినా నిహంతుమమరోత్తమాః ।
ధర్మజా! వెంటనే మునులంతా మళ్లీ బ్రతికారు. అపుడు అగ్ని మొదలైన దేవతలతో యవక్రీతుడు ఇలా అన్నాడు. 'నేను వేదమంతా చదివాను. తపస్విని, వేదవేత్తను అయిన నన్ను రైభ్యుడు ఇలా అనుచితంగా ఎలా చంపగలిగాడు?' (23,24 1/2)
దేవా ఊచుః
మైవం కృథా యవక్రీత యథా వదసి వై మునే ।
ఋతే గురుమధీతా హి సుఖం వేదాస్త్వయా పురా ॥ 25
అనేన తు గురూన్ దుఃఖాత్ తోషయిత్వాఽఽత్మకర్మణా ।
కాలేన మహతా క్లేశాద్ బ్రహ్మాధిగతముత్తమమ్ ॥ 26
దేవతలు పలికారు.
యవక్రీతా! నీవు ఏమి అంటున్నావో దాన్ని అలాగే భావించకు. గురువు లేకపోయినా నీవు సుఖంగా సర్వవేదాలు పఠించావు. ఈ రైభ్యుడు చాలా కష్టాలను సహించి, తన మంచి పనులతో గురువులను సంతోష పెట్టి, ఉత్తమ వేదజ్ఞానాన్ని పొందాడు. (25,26)
లోమశ ఉవాచ
యవక్రీతమథోక్త్వైవం దేవాః సాగ్నిపురోగమాః ।
సంజీవయిత్వా తాన్ సర్వాన్ పునర్జగ్ముస్త్రివిష్టపమ్ ॥ 27
లోమశుడు పలికాడు. అగ్న్యాది దేవతలు యవక్రీతునితో ఇలా పలికి, వారినందరిని తిరిగి బ్రతికించి, తమస్వర్గానికి వెళ్ళిపోయారు. (27)
ఆశ్రమస్తస్య పుణ్యోఽయం సదాపుష్పఫలద్రుమః ।
అత్రోష్య రాజశార్దూల సర్వం పాపం ప్రమోక్ష్యసి ॥ 28
ఇది రైభ్యముని పవిత్ర ఆశ్రమం. ఎల్లప్పుడు ఫలపుష్పసమృద్ధి కలది. రాజశ్రేష్ఠా! ఇక్కడ వసించి పాపాన్ని అంతటినీ పోగొట్టుకొంటావు. (28)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం యవక్రీతోపాఖ్యానే అష్టాత్రింశదధికశతతమోఽధ్యాయః ॥ 138 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున యవక్రీతోపాఖ్యనము అను నూట ముప్పది ఎనిమిదవ అధ్యాయము. (138)