139. నూట ముప్పది తొమ్మిదవ అధ్యాయము

పాండవుల ఉత్తరదిగ్యాత్ర.

లోమశ ఉవాచ
ఉశీరబీజం మైనాకం గిరిం శ్వేతం చ భారత ।
సమతీతోఽసి కౌంతేయ కాలశైలం చ పార్థివ ॥ 1
ఇప్పుడు నీవు ఉశీరబీజం, మైనాకం, శ్వేతం, కాలశైలం అనే పర్వతాలను దాటి ముందుకు వచ్చావు. (1)
ఏషా గంగా సప్తవిధా రాజతే భరతర్షభ ।
స్థానం విరజసం పుణ్యం యత్రాగ్నిర్నిత్యమిధ్యతే ॥ 2
ఇది గంగానది. ఏడుధారలతో ప్రకాశిస్తోంది. రజోగుణం లేని తీర్థం ఇది. ఇక్కడ ఎల్లప్పుడు అగ్ని ప్రకాశిస్తూ ఉంటాడు. (2)
ఏతద్ వై మానుషేణాద్య న శక్యం ద్రష్టుమద్భుతమ్ ।
సమాధిం కురుతావ్యగ్రాః తీర్థాన్యేతాని ద్రక్ష్యథ ॥ 3
ఈ అద్భుతతీర్థం మనుషులకు చూడ శక్యం కాదు. మీరందరు ఏకాగ్రచిత్తులు కండి. ఉద్విగ్నతను పొందక మీరు ఈ తీర్థదర్శనం చేయండి. (3)
ఏతద్ ద్రక్ష్యసి దేవానామ్ ఆక్రీడం చరణాంకితమ్ ।
అతిక్రాంతోఽసి కౌంతేయ కాలశైలం చ పర్వతమ్ ॥ 4
శ్వేతం గిరిం ప్రవేక్ష్యామః మందరం చైవ పర్వతమ్ ।
యత్ర మాణివరో యక్షః కుబేరశ్చైవ యక్షరాట్ ॥ 5
కౌంతేయా! ఇది దేవతలక్రీడాస్థలం, వారి పాదాలగుర్తులు కలిగి ఉంది. మీరు సావధానులైతే దాన్నీ దర్శిస్తారు. కాలశైలపర్వతాన్ని దాటి మీరు ముందుకు సాగండి. ఇది దాటి మనం కైలాసం, మందరాచలం ప్రవేశిస్తాం. ఇవి క్రమంగా, మణివరుడు అనే యక్షుని, కుబేరుని నివాసాలు. (4,5)
అష్టాశీతిసహస్రాణి గంధర్వాః శీఘ్రగామినః ।
తథా కింపురుషా రాజన్ యక్షాశ్చైవ చతుర్గుణాః ॥ 6
అనేకరూపసంస్థానాః నానాప్రహరణాశ్చ తే ।
యక్షేంద్రం మనుజశ్రేష్ఠ మణిభద్రముపాసతే ॥ 7
తీవ్రగమనం కల ఎనభైవేల మంది గంధర్వులు, వారి కంటె నాలుగు రెట్లు గల యక్షులు ఇక్కడ నివసిస్తారు. వారి ఆకారాలు, రూపాలు రకరకాలు. వారు వేరు వేరు ఆయుధాలు ధరిస్తూ యక్షరాజైన మాణిభద్రుని సేవలో లగ్నమై ఉంటారు. (6,7)
తేషామృద్ధిరతీవాత్ర గతౌ వాయుసమాశ్చ తే ।
స్థానాత్ ప్రచ్యావయేయుర్యే దేవరాజమపి ధ్రువమ్ ॥ 8
ఇక్కడ వారి సమృద్ధి అధికంగా ఉంది. తీవ్రగతిలో వారు వాయుసమానులు. వారే తలుచుకుంటే దేవేంద్రుని కూడ తన స్థానం నుంచి తొలగిస్తారు. (8)
తైస్తాత బలిభిర్గుప్తాః యాతుధానైశ్చ రక్షితాః ।
దుర్గమాః పర్వతాః పార్థ సమాధిం పరమం కురు ॥ 9
ఆ యక్షరాక్షసులచే రక్షింపబడుతున్నాయి. ఈ దుర్గమపర్వతాలు. కావున మీరు ఇంకా అధికంగా ఏకాగ్రచిత్తులై ఉండండి. (9)
కుబేరసచివాశ్చాన్యే రౌద్రా మైత్రాశ్చ రాక్షసాః ।
తైః సమేష్యామ కౌంతేయ సంయతో విక్రమేణ చ ॥ 10
కౌంతేయా! కుబేరుని మంత్రులు, రౌద్రులు, మైత్రులు అనే పేరు గల రాక్షసులు మనకు ఎదురుపడతారు. నీవు పరాక్రమంతో సంసిద్ధంగా ఉండు. (10)
కైలాసః పర్వతో రాజన్ షడ్ యోజనసముచ్ర్ఛితః ।
యత్ర దేవా సమాయాంతి విశాలా యత్ర భారత ॥ 11
రాజా! ఈ కైలాసపర్వతం ఆరు యోజనాలు ఎత్తు ఉంటుంది. ఇక్కడకు దేవతలు వస్తూ ఉంటారు. దీనికి దగ్గరలో విశాలాపురి (బదరికాశ్రమతీర్థం) కలదు. (11)
అసంఖ్యేయాస్తు కౌంతేయ యక్షరాక్షసకిన్నరాః ।
నాగాః సుపర్ణా గంధర్వాః కుబేరసదనం ప్రతి ॥ 12
కౌంతేయా! కుబేరుని భవనంలో యక్ష, రాక్షస, కిన్నర, నాగ, గరుడ, గంధర్వులు ఎంతో మంది నివసిస్తున్నారు. (12)
తాన్ విగాహస్వ పార్థాద్య తపసా చ దమేన చ ।
రక్ష్యమాణో మయా రాజన్ భీమసేనబలేన చ ॥ 13
నీవు భీమసేనుని బలంచే, నా తపస్సుచే రక్షింపబడతావు. ఇంద్రియనిగ్రహంతో ఉండి ఈ తీర్థాల్లో స్నానం చెయ్యి. (13)
స్వస్తి తే వరుణో రాజా యమశ్చ సమితింజయః ।
గంగా చ యమునా చైవ పర్వతశ్చ దధాతు తే ॥ 14
వరుణరాజు, యుద్ధవిజేత యముడు, గంగ-యమున, ఈ పర్వతమూ ప్రత్యేకంగా నిన్ను రక్షించుగాక. (14)
మరుతశ్చ సహాశ్విభ్యాం సరితశ్చ సరాంసి చ ।
స్వస్తి దేవాసురేభ్యశ్చ వసుభ్యశ్చ మహాద్యుతే ॥ 15
మరుద్గణాలు, అశ్వినీదేవతలు, నదులు, సరోవరాలు నీకు శుభం చెయ్యాలి. దేవతలు, రాక్షసులు, వసువులు కూడ మేలు చేయుదురుగాక! (15)
తతో మహాత్మా స యమౌ సమేత్య
మూర్ధన్యుపాఘ్రాయ విమృజ్య గాత్రే ।
ఉవాచ తౌ బాష్పకలం స రాజా
మా భైష్టమాగచ్ఛతమప్రమత్తౌ ॥ 20
పిమ్మట మహాత్ముడైన యుధిష్ఠిరుడు నకులసహదేవుల వద్దకు పోయి, శిరస్సును చుంబించి, చేతితో శరీరం అంతా నిమిరాడు. నేత్రాల నుంచి కన్నీళ్ళు జలజలరాలుతుండగా 'మీరు భయపడవద్దు. సావధానులై ముందుకు సాగండి' అని వారితో అన్నాడు. (20)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం కైలాసాదిగిరిప్రవేశే ఏకోనచత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥ 139 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో కైలాసాది గిరిప్రదేశము అను నూట ముప్పది తొమ్మిదవ అధ్యాయము. (139)