145. నూట నలువది అయిదవ అధ్యాయము

ఘటోత్కచుడు పాండవులను గంధమాదనమునకు చేర్చుట.

యుధిష్ఠిర ఉవాచ
ధర్మజ్ఞో బలవాన్ శూరః సత్యో రాక్షసపుంగవః ।
భక్తోఽస్మానౌరసః పుత్రః భీమ గృహ్ణాతు మాచిరమ్ ॥ 1
తవ భీమ సుతేనాహమ్ అతిభీమపరాక్రమ ।
అక్షతః సహ పాంచాల్యా గచ్ఛేయం గంధమాదనమ్ ॥ 2
ధర్మరాజు అన్నాడు.
బలవంతుడు, శూరుడు, సత్యవాది, రాక్షసశ్రేష్ఠుడు, మన భక్తుడు, ఔరసపుత్రుడు అయిన ఘటోత్కచుడు ఆలస్యం చేయక మనలను శరీరానికి హాని కలుగకుండా ద్రౌపదీసహితంగా గంధమాదనం చేర్చాలి. (1,2)
వైశంపాయన ఉవాచ
భ్రాతుర్వచనమాజ్ఞాయ భీమసేనో ఘటోత్కచమ్ ।
ఆదిదేవ నరవ్యాఘ్రః తనయం శత్రుకర్శనమ్ ॥ 3
వైశంపాయన ఉవాచ
భ్రాతుర్వచనమాజ్ఞాయ భీమసేనో ఘటోత్కచమ్ ।
ఆదిదేశ నరవ్యాఘ్రః తనయం శత్రుకర్శనమ్ ॥ 3
వైశంపాయనుడు అన్నాడు.
సోదరుని మాటలు విన్న భీమసేనుడు శత్రుసంహారకుడు అయిన తనకుమారుని ఇలా ఆదేశించాడు. (3)
భీమసేన ఉవాచ
హైడింబేయ పరిశ్రాంతా తవ మాతాపరాజిత ।
త్వం చ కామగమస్తాత బలవాన్ వహ తాం ఖగ ॥ 4
భీమసేనుడు ఆజ్ఞాపించాడు. ఘటోత్కచా! నీ తల్లి ద్రౌపది అలసిపోయింది. నీవు ఆకాశంలో ఎదురులేక సంచరిస్తావు. ఆకాశమార్గాన ఈమెను తీసుకొని ఎగిరి రావలసింది. (4)
స్కంధమారోప్య భద్రం తే మధ్యేఽస్మాకం విహాయసా ।
గచ్ఛ నీచికయా గత్యా యథా చైనాం న పీడయేః ॥ 5
ఈమెను భుజాలపై నుంచుకొని మామధ్యనుండియే ఆకాశమార్గాన తీసికొనిరా! కొంచెం కూడా కష్టం లేకుండా మెల్లమెల్లగా ప్రయాణం చేయి. నీకు మేలు జరుగుతుంది. (5)
ఘటోత్కచ ఉవాహ
ధర్మరాజం చ ధౌమ్యం చ కృష్ణాం చ యమజౌ తథా ।
ఏకోఽప్యహమలం వోఢుం కిముతాద్య సహాయవాన్ ॥ 6
అన్యే చ శతశః శూరాః విహంగాః కామరూపిణః ।
సర్వాన్ వో బ్రాహ్మణైః సార్ధం వక్ష్యంతి సహితానఘ ॥ 7
ధర్మజుని, ధౌమ్యుని, కవలలను, ద్రౌపదిని నేను ఒక్కడనే సహాయం లేకుండా తీసుకొనిపోగలను. ఇంకా చాలామంది శూరులు, ఆకాశచారులు కామరూపులు అయిన నాసేవకులు బ్రాహ్మణులందరినీ మోసుకొంటూ వస్తారు.' (6,7)
ఏవముక్త్వా తతః కృష్ణామ్ ఉవాహ స ఘటోత్కచః ।
పాండూనాం మధ్యగో వీరః పాండవానపి చాపరే ॥ 8
అని పలికి ఘటోత్కచుడు ద్రౌపదీదేవిని తన వీపుపై ఎక్కించుకొని, పాండవులను, ఇతరులు మోసుకొనిరాగా బయలుదేరాడు. (8)
లోమశః సిద్ధమార్గేణ జగామానుపమద్యుతిః ।
స్వేనైవ స ప్రభావేణ ద్వితీయ ఇవ భాస్కరః ॥ 9
సాటిలేని తేజోవంతుడైన లోమశమహర్షి సిద్ధులు సంచరించేమార్గంలో తన తపఃప్రభావంతో రెండవసూర్యునిలా సాగిపోతున్నాడు. (9)
బ్రాహ్మణాంశ్చాపి తాన్ సర్వాన్ సముపాదాయ రాక్షసాః ।
నియోగాద్ రాక్షసేంద్రస్య జగ్ముర్భీమపరాక్రమాః ॥ 10
ఘటోత్కచుని ఆజ్ఞానుసారం అతని సేవకులు బ్రాహ్మణులను తమవీపులపై మోసుకొని వెంట బయలుదేరారు. (10)
ఏవం సురమణీయాని వనాన్యుపవనాని చ ।
ఆలోకయంతస్తే జగ్ముః విశాలాం బదరీం ప్రతి ॥ 11
ఈ విధంగా సుందరవనాలు, ఉద్యానవనాలు చూస్తూ వారు విశాలమయిన బదరీవనాన్ని చేరుకొన్నారు. (11)
థే త్వాశుగతిభిర్వీరాః రాక్షసైస్తైర్మహాజవైః ।
ఉహ్యమానా యయుః శీఘ్రం దీర్ఘమధ్వానమల్పవత్ ॥ 12
వారు వేగమూ, శీఘ్రగమనమూ కల రాక్షసులచే మోయబడుతూ చాలా దూరాన్ని స్వల్పదూరం వలె దాటారు. (12)
దేశాన్ మ్లేచ్ఛజనాకీర్ణాన్ నానారత్నాకరాయుతాన్ ।
దదృశుర్గిరిపాదాంశ్చ నానాధాతుసమాచితాన్ ॥ 13
విద్యాధరసమాకీర్ణాన్ యుతాన్ వానరకిన్నరైః ।
యథా కింపురుషైశ్చైవ గంధర్వైశ్చ సమంతతః ॥ 14
మ్లేచ్ఛులతో నిండిన ప్రదేశాలను, రత్నాలగనులతో కూడిన ప్రదేశాలను, కొండలపై ధాతువులచే ప్రకాశించే ప్రదేశాలను చూశారు. విద్యాధరులు, వానరులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు అక్కడ అన్నిచోట్ల కనిపించారు. (13,14)
మయూరైశ్చమరైశ్చైవ వానరై రురుభిస్తథా ।
వరాహైర్గవయైశ్చైవ మహిషైశ్చ సమావృతాన్ ॥ 15
నెమళ్ళు, చమరీమృగాలు, వానరాలు, రురుమృగాలు, అడవిపందులు, గవయమృగాలు అడవి దున్నలతో ఆ ప్రదేశాలు నిండి ఉన్నాయి. (15)
నదీజాలసమాకీర్ణాన్ నానాపక్షియుతాన్ బహూన్ ।
నానావిధమృగైర్జుష్టాన్ వానరైశ్చోపశోభితాన్ ॥ 16
అక్కడ అన్నివైపుల నదులు ప్రవహిస్తున్నాయి. ఎన్నో రకాల పక్షులు సంచరిస్తున్నాయి. ఆ ప్రదేశం నానావిధాలైన మృగాలు, వానరాలతో ప్రకాశిస్తూ ఉంది. (16)
సమదైశ్చాపి విహగైః పాదపైరన్వితాస్తథా ।
తేఽవతీర్య బహూన్ దేశానుత్తరాంశ్చ కురూనపి ॥ 17
దదృశుర్వివిధాశ్చర్యం కైలాసం పర్వతోత్తమమ్ ।
తస్యాభ్యాశే తు దదృశుః నరనారాయణాశ్రమమ్ ॥ 18
ఉపేతం పాదపైర్దివ్యైః సదాపుష్పఫలోపగైః ।
దదృశుస్తాం చ బదరీం వృత్తస్కంధాం మనోరమామ్ ॥ 19
స్నిగ్ధామవిరలచ్ఛాయాం శ్రియా పరమయా యుతామ్ ।
పత్రైః స్నిగ్ధైరవిరలైః ఉపేతాం మృదుభిః శుభామ్ ॥ 20
మదించిన పక్షులు, లెక్కలేనన్ని చెట్లు కలిగిన ఉత్తరకురు దేశాలను దాటి వారు ఆశ్చర్యవిషయాలకు నిలయం అయిన కైలాస పర్వతాన్ని చూశారు. దాని సమీపాన ఉన్న నరనారాయణుల బదరికాశ్రమాన్ని వీక్షించారు. అది నిత్యం ఫలపుష్పాలతో నిండి ఉంటుంది. అక్కడ ఉన్న రేగుచెట్లు వాటి కాండాలు గుండ్రంగా ఉన్నాయి. దట్టమైన నీడలు, చిక్కగా ఉన్నచెట్లు, శోభకలిగి, శుభవృక్షాల ఆకులతో నిండి ఉన్నాయి. (17-20)
విశాలశాఖాం విస్తీర్ణామ్ అతిద్యుతిసమన్వితామ్ ।
ఫలైరుపచితైర్దివ్యైః ఆచితాం స్వాదుభిర్భృశమ్ ॥ 21
మధుస్రవైః సదా దివ్యాం మహర్షిగణసేవితామ్ ।
మదప్రముదితైర్నిత్యం నానాద్విజగణైర్యుతామ్ ॥ 22
వాటి శాఖలు విశాలంగా కనిపించాయి. మిక్కిలి కాంతితో ప్రకాశిస్తున్నాయి. దివ్యఫలాలతో నిండి ఉన్నాయి. ఆ ఫలాల నుంచి మధుధారలు స్రవిస్తున్నాయి. మహర్షులు ఆ ప్రదేశాన్ని సేవిస్తున్నారు. మదోన్మత్తాలై, ఆనందంతో నిండిన పక్షులు అకక్డ ఎక్కువగా ఉన్నాయి. (21,22)
అదంశమశకే దేశే బహూమూలఫలోదకే ।
నీలశాద్వలసంఛన్నే దేవగంధర్వసేవితే ॥ 23
సుసమీకృతభూభాగే స్వభావవిహితే శుభే ।
జాతాం హిమమృదుస్పర్శే దేశేఽపహతకంటకే ॥ 24
అక్కడ ఈగలు, దోమలు లేవు. చాలా రకాలైన పళ్లు, సరోవరాలు ఉన్నాయి. పచ్చికబయళ్ళు ఉన్నాయి. వాటిని గంధర్వులు సేవిస్తున్నారు. ఆ ప్రదేశం సహజంగానే సమంగా ఉంది. మంచుచే ఆవరింపబడి మృదుస్పర్శ కలిగి ఉంది. ముళ్ళు ఎక్కడా కన్పించటం లేదు. ఈ ప్రదేశంలోనే గొప్ప రేగుచెట్టు ఏర్పడింది. (23,24)
తాంఉపేత్య మహాత్మానః సహ తైర్ర్బాహ్మణర్షభైః ।
అవతేరుస్తతః సర్వే రాక్షసస్కంధతః శనైః ॥ 25
అక్కడకు చేరి మహాత్ములైన ఆ పాండవులు బ్రాహ్మణులతో సహా రాక్షసుల వీపుల నుంచి మెల్లగా క్రిందకు దిగారు. (25)
తతస్తమాశ్రమం రమ్యం నరనారాయణాశ్రితమ్ ।
దదృశుః పాండవా రాజన్ సహితా ద్విజపుంగవైః ॥ 26
పిమ్మట బ్రాహ్మణసహితులై పాండవులు నరనారాయణ నిలయం అయిన ఆ ప్రదేశాన్ని సందర్శించారు. (26)
తమసా రహితం పుణ్యమ్ అనామృష్టం రవేః కరైః ।
క్షుత్తృట్శీతోష్ణదోషైశ్చ వర్జితం శోకనాశనమ్ ॥ 27
అంధకారం తమోగుణం రెండూ అక్కడ లేవు. వనం అంతా దట్టంగా ఉండటంచేత సూర్యకిరణాల స్పర్శకూడా లేదు. ఆకలి, దప్పిక, శీతం, ఉష్టం లేక శోకదూరమై ఉంది. (27)
మహర్షిగణసంబాధం బ్రాహ్మా లక్ష్మ్యా సమన్వితమ్ ।
దుష్ర్పవేశం మహారాజ నరైర్ధర్మబహిష్కృతైః ॥ 28
ఆ పవిత్రతీర్థం మహర్షిగణంతో, బ్రాహ్మీలక్ష్మితో నిండి ఉంది. ధర్మహీనులైన నరులకు చొరశక్యం కానిదై ఉంది. (28)
వి॥సం॥ బ్రాహ్మీలక్ష్మి = ఋగ్యజుస్సామాత్మిక - "బుచః సామాని యజూంషి సాహి శ్రీరమృతా సతామ్" అని శ్రుతివచనం (నీల)
బలిహోమార్చితం దివ్యం సుసమ్మృష్టానులేపనమ్ ।
దివ్యపుష్పోపహారైశ్చ సర్వతోఽభివిరాజితమ్ ॥ 29
ఆ ఆశ్రమం బలి, దేవపూజ, హోమాలతో అర్చింపబడి ఉంది. దివ్యాలైన పుష్పాల గంధం అంతటా వ్యాపించి ఉంది. అన్నివైపుల చక్కగా అలుకబడి ఉంది. (29)
విశాలైరగ్నిశరణైః స్రుగ్భాండైరాచితం శుభైః ।
మహద్భిస్తోయకలశైః కఠినైశ్చోపశోభితమ్ ॥ 30
విశాలాలైన అగ్నిగృహాలు, స్రుక్కులు, స్రువాలు సుందరయజ్ఞపాత్రలు కల ఆ ఆశ్రమం జలంతో నిండిన కలశాలతో ఉట్లతో శోభిల్లుతోంది. (30)
శరణ్యం సర్వభూతానాం బ్రహ్మఘోషనినాదితమ్ ।
దివ్యమాశ్రయణీయం తమ్ ఆశ్రమం శ్రమనాశనమ్ ॥ 31
అది ప్రాణులందరికి శరణునిచ్చుచోటు. బ్రహ్మఘొషలు మారుమ్రోగుతున్నాయి. అందరికీ నివాసయోగ్యమైనది. శ్రమను పోగొట్టేదిగా ఉంది. (31)
శ్రియా యుతమనిర్దేశ్యం దేవచర్యోపశోభితమ్ ।
ఫలమూలాశనైర్దాంతైః చారుకృష్ణాజినాంబరైః ॥ 32
సూర్య వైశ్యానరసమైః తపసా భావితాత్మభిః ।
మహర్షిభిర్మోక్షపరైః యతిభిర్నియతేంద్రియైః ॥ 33
బ్రహ్మభూతైర్మహాభాగైః ఉపేతం బ్రహ్మవాదిభిః ।
సోఽభ్యగచ్ఛన్మహాతేజాః తానృషీన్ ప్రయతః శుచిః ॥ 34
భ్రాతృభిః సహితో ధీమాన్ ధర్మపుత్రో యుధిష్ఠిరః ।
దివ్యజ్ఞానోపపన్నాస్తే దృష్ట్వా ప్రాప్తం యుధిష్ఠిరమ్ ॥ 35
అభ్యగచ్ఛంత సుప్రీతాః సర్వ ఏవ మహర్షయః ।
ఆశీర్వాదాన్ ప్రయుంజానాః స్వాధ్యాయనిరతా భృశమ్ ॥ 36
ప్ర్రీతాస్తే తస్య సత్కారం విధినా పావకోపమాః ।
ఉపాజహ్రుశ్చ సలిలం పుష్పమూలఫలం శుచి ॥ 37
ఆ శోభిమ్చే ఆశ్రమం వర్ణనకు సాధ్యం కానిది. దేవతాకార్యాలచే దాని శోభ పెరిగింది. ఫలమూలాలు తినేవారు, జితేంద్రియులు, నల్లలేడి చర్మాలు దాల్చినవారు, తపస్సుచే పరిశుద్ధమైన అంతరంగం కల వారు సూర్య, అగ్ని సములు అయిన మహర్షులు, యతులు, మోక్షేచ్ఛగలవారు, బ్రహ్మభూతులు, వేదవాదులు అక్కడ ఉన్నారు. తేజోవంతుడైన ధర్మరాజు జితేంద్రియుడై, పవిత్రుడై ఆ ఋషుల వద్దకు సోదరులతో సహా వెళ్లాడు. దివ్యజ్ఞానులువారు తమవద్దకు వచ్చిన ధర్మజుని వీక్షించి ప్రసన్నులై అతనికి అనేక విధాలుగా ఆశీర్వాదాలను ఇచ్చారు. వేదవాదులు, అగ్నిసములు అయిన వారందరు యథావిధిగా అతనిని సత్కరించి అతనికి పుష్ప, ఫలాలు, మూలాలు, జలం సమకూర్చారు. (32-37)
స తైః ప్రీత్యాథ సత్కారమ్ ఉపనీతం మహర్షిభిః ।
ప్రయతః ప్రతిగృహ్యాథ ధర్మరాజో యుధిష్ఠిరః ॥ 38
ధర్మరాజు మహర్షుల నుండి ప్రేమపూర్వక సత్కారాన్ని పొంది, పరిశుద్ధంగా గ్రహించి చాలా ప్రసన్నుడు అయ్యాడు. (38)
తం శక్రసదనప్రఖ్యం దివ్యగంధం మనోరమమ్ ।
ప్రీతః స్వర్గోపమం పుణ్యం పాండవః సహ కృష్ణయా ॥ 39
వివేశ శోభయా యుక్తం భ్రాతృభిశ్చ సహానఘ ।
బ్రాహ్మణైర్వేదవేదాంగపారగైశ్చ సహస్రశః ॥ 40
ధర్మజుడు సోదరులతో, భార్యతో కలిసి స్వర్గంతో సమానసౌఖ్యం కలిగి, దివ్యగంధంతో నిండి, ఆహ్లాదకరమైన ఆ నరనారాయణుల ఆశ్రమాన్ని ప్రవేశించాడు. అతనితో వేదవేదాంగ పారంగతులైన బ్రాహ్మణులు అనేకులు కూడా ప్రవేశించారు. (39,40)
తత్రాపశ్యత ధర్మాత్మా దేవదేవర్షిపూజితమ్ ।
నరనారాయణస్థానం భాగీరథ్యోపశోభితమ్ ॥ 41
ధర్మాత్ముడైన యుధిష్ఠిరుడు దేవ, ఋషిపూజితం అయిన గంగచే ప్రకాశించే నరనారాయణ స్థానాన్ని చూశాడు. (41)
పశ్యంతస్తే నరవ్యాఘ్రాః రేమిరే తత్ర పాండవాః ।
మధుస్రవఫలం దివ్యం బ్రహ్మర్షిగణసేవితమ్ ॥ 42
తదుపేత్య మహాత్మానః తేఽవసన్ బ్రాహ్మణైః సహ ।
ముదా యుక్తా మహాత్మానః రేమిరే తత్ర తే సదా ॥ 43
నరశ్రేష్ఠులైన పాండవులు ఆ స్థానాన్ని చూస్తూనే సంతసించి తిరుగసాగారు. మహర్షులు సేవించే మధువు స్రవించే ఫలాలతో కూడిన దది. దాన్ని చేరి బ్రాహ్మణులతో సహా అక్కడ పాండవులు నివసించారు. సంతోషంతో నిండి సుఖంగా కాలం గడిపారు. (42,43)
ఆలోకయంతో మైనాకం నానాద్విజగణాయుతమ్ ।
హిరణ్యశిఖరం చైవ తచ్చ బిందుసరః శివమ్ ॥ 44
తస్మిన్ విహరమాణాశ్చ పాండవాః సహ కృష్ణయా ।
మనోజ్ఞే కాననవరే సర్వర్తుకుసుమోజ్జ్వలే ॥ 45
బంగారు శిఖరాలతో ప్రకాశిమ్చే మైనాకునిపై, అనేకవిధాల పక్షులతో కూడిన ఆ ప్రదేశం శీతలజలాలతో నిండిన బిందు సరస్సు అనే చెరువు కలిగి ఉంది. వాటిని అన్నింటినీ చూస్తూ, పాండవులు ద్రౌపదితో విహరించసాగారు. అది సమస్త ఋతువులలోని పుష్పాలతో ప్రకశిస్తోంది. (44,45)
పాదపైః పుష్పవికచైః ఫలభారావనామిభిః ।
శోభితే సర్వతో రమ్యైః పుంస్కోకిలగణాయుతైః ॥ 46
ఆ వనంలో అందమై వికసించిన చెట్లు, ఫలభారంతో వంగిన చెట్లు కనిపిస్తున్ణాయి. కోకిలలతో నిండిన చెట్లతో ఆ వనమంతా రమ్యంగా ఉంది. (46)
స్నిగ్ధపత్రైరవిరలైః శీతచ్ఛాయైర్మనోరమైః ।
సరాంసి చ విచిత్రాణి ప్రసన్నసలిలాని చ ॥ 47
చెట్ల ఆకులు చిక్కగా, దట్టంగా ఉన్నాయి. ఎక్కువ నీడను ఇస్తున్నాయి. అక్కడ సరస్సులు నిర్మలజలంతో నిండి కనిపించాయి. (47)
కమలైః సోత్పలైశ్చైవ భ్రాజమానాని సర్వశః ।
పశ్యంతశ్చారురూపాణి రేమిరే తత్ర పాండవాః ॥ 48
వికసించిన కమలాలు, కలువలు అన్నివైపుల శోభను నింపుతున్నాయి. పాండవులు సుందరసరోవరాలను చూస్తూ ఆనందంతో సంచరించారు. (48)
పుణ్యగంధః సుఖస్పర్శః వవౌ తత్ర సమీరణః ।
హ్లాదయన్ పాండవాన్ సర్వాన్ ద్రౌపద్యా సహితాన్ ప్రభో ॥ 49
గంధమాదనపర్వతం మీది గాలి సువాసన, సుఖస్పర్శకల్గి ఉంది. ద్రౌపదితో సహా పాండవులను ఆహ్లాదపరుస్తోంది. (49)
భాగీరథీం సుతీర్థాం చ శీతాం విమలపంకజామ్ ।
మణిప్రవాలప్రస్తారాం పాదపైరుపశోభితామ్ ॥ 50
దివ్యపుష్పసమాకీర్ణాం మనః ప్రీతివివర్ధినీమ్ ।
వీక్షమాణా మహాత్మానః విశాలాం బదరీమను ॥ 51
తస్మిన్ దేవర్షిచరితే దేశే పరమదుర్గమే ।
భాగీరథీపుణ్యజలే తర్పయాంచక్రిరే తదా ॥ 52
దేవానృషీంశ్చ కౌంతేయాః పరమం శౌచమాస్థితాః ।
తత్ర తే తర్పయంతశ్చ జపంతశ్చ కురూద్వహాః ॥ 53
బ్రాహ్మణైః సహితా వీరాః హ్యవసన్ పురుషర్షభాః ।
కృష్ణాయాస్తత్ర పశ్యంతః క్రీడితాన్యమరప్రభాః ।
విచిత్రాణి నరవ్యాఘ్రాః రేమిరే తత్ర పాండవాః ॥ 54
ఆ విశాల బదరీవృక్ష సమీపాన ఉత్తమతీర్థాలతో ప్రకాశించే చల్లని నీరు గల గంగ ప్రవహిస్తోంది. ఆ గంగలో అందమైన కమలాలు వికసించి ఉన్నాయి.
దాని తీరాలు, పుష్పాలతో, మణులతో ప్రకాశిస్తూ మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఆ విశాలబదరీవృక్షాలను చూస్తూ పాండవులు ఆనందించారు.
దేవర్షులు సంచరించే, దుర్గమం అయిన దేశంలో పవిత్రగంగాజలంతో దేవతలకు, ఋషులకు, తర్పణాలు ఇచ్చారు.
అక్కడ వారికి తర్పణాలు చేస్తూ జపం చేసుకొంటూ బ్రాహ్మణ సహితులై, శుచులై పాండవులు నివసించారు.
అమరకాంతి గల పాండవులు ద్రౌపదీ ఆడుతున్న విచిత్ర క్రీడలను చూస్తూ ఆనందంతో సంచరించారు. (50-54)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం గంధమాదనప్రవేశే పంచచత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥ 145 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో గంధమాదనప్రవేశము అను నూట నలువది అయిదవ అధ్యాయము. (145)