146. నూట నలువది ఆరవ అధ్యాయము

భీమసేనుడు సౌగంధికపుష్పాలు తెచ్చుటకు పోవుట - హనుమంతుని కలియుట.

వైశంపాయన ఉవాచ
తత్ర తే పురుషవ్యాఘ్రాః పరమం శౌచమాస్థితాః ।
షడ్రాత్రమవసన్ వీరాః ధనంజయదిదృక్షవః ॥ 1
వైశంపాయనుడు పలికాడు - ఆ పురుషశ్రేష్ఠులు పాండవులు పరమపవిత్రులై ధనంజయుని దర్శనం కోరి అక్కడ ఆరు రాత్రులు గడిపారు. (1)
తతః పూర్వోత్తరే వాయుః ప్లవమానో యదృచ్ఛయా ।
సహస్రపత్రమర్కాభం దివ్యం పద్మముపాహరత్ ॥ 2
పిమ్మట ఈశాన్య దిక్కు నుంచి వాయువు యథేచ్ఛగా వీస్తూ సూర్యునివలె ప్రకాశిమ్చే వేయి దళాల దివ్యకమలాన్ని తెచ్చి ముందు పడవేసింది. (2)
తదవైక్షత పాంచాలీ దివ్యగంధం మనోరమామ్ ।
అనిలేనాహృతం భూమౌ పతితం జలజం శుచి ॥ 3
తచ్ఛుభా శుభమాసాద్య సౌగంధికమనుత్తమమ్ ।
అతీవ ముదితా రాజన్ భీమసేనమథాబ్రవీత్ ॥ 4
అది చాల అందంగా ఉంది. దివ్యగంధం కలిగి ఉంది. ద్రౌపది దాన్ని చూచి, గాలిచే తీసుకొని రాబడి, భూమిపై పడిన పవిత్రపుష్పాన్ని సౌగంధికాన్ని పరికించి ఎంతో సంతోషించి, భీమునితో ఇలా అంది. (3,4)
పశ్య దివ్యం సురుచిరం భీమ పుష్పమనుత్తమమ్ ।
గంధసంస్థానసంపన్నం మనసో మమ నందనమ్ ॥ 5
ఇదం చ ధర్మరాజాయ ప్రదాస్యామి పరంతప ।
హరేదం మమ కామాయ కామ్యకే పునరాశ్రమే ॥ 6
భీమసేనా! ఉత్తమమైన ప్రకాశవంతమైన ఈ దివ్యపుష్పం చూడు. దీని దివ్యగంధం ఆఘ్రాణిస్తే ఆనందంగా ఉంది. సుగంధమే దీని స్వరూపం. దీన్ని ధర్మజునకు కానుకగా ఇస్తాను. నాకోరిక తీర్చటానికి నీవు కామ్యకవనానికి వెళ్లి దీన్ని తీసుకొనిరా. (5,6)
యది తేఽహం ప్రియా పార్థ బహూనీమాన్యుపాహర ।
తాన్యహం నేతుమిచ్ఛామి కామ్యకం పునరాశ్రమమ్ ॥ 7
నీకు నాపై ప్రేమ ఉంటే నాకోసం వీటిని చాలా తీసుకురా. వాటిని నేను మన కామ్యకవనంలోని ఆశ్రమానికి తీసుకువెడతాను. (7)
ఏవముక్త్వా శుభాపాంగీ భీమసేనమనిందితా ।
జగామ పుష్పమాదాయ ధర్మరాజాయ తత తదా ॥ 8
అని పలికి సుందరమైన కనుకొలకులు గల సాధ్వి ద్రౌపది పుష్పాన్ని తీసుకొని ధర్మజునికి చూపడానికి వెళ్లింది. (8)
అభిప్రాయం తు విజ్ఞాయ మహిష్యాః పురుషర్షభః ।
ప్రియాయాః ప్రియకామః స ప్రాయాద్ భీమో మహాబలః ॥ 9
భీముడు తన ప్రియురాలి మనోభావాన్ని గుర్తించి ఆమెకు ప్రియాన్ని చేయగోరి అక్కడి నుంచి బయలు దేరాడు. (9)
వాతం తమేవాభిముఖో యతస్తత్ పుష్పమాగతమ్ ।
ఆజిహీర్షుర్జగామాశు స పుష్పాణ్యపరాణ్యపి ॥ 10
అలాంటి పూలనే చాలా తీసుకొని రావటానికి వెంటనే ఆ గాలి ఏ వైపు నుంచి వచ్చిందో ఆ వైపుకి బయలుదేరాడు. (10)
రుక్మపృష్ఠం ధనుర్గృహ్య శరాంశ్చాశీవిషోపమాన్ ।
మృగరాడివ సంక్రుద్ధః ప్రభిన్న ఇవ కుంజరః ॥ 11
బంగారు తొడుగు కల విల్లు తీసుకున్నాడు - విషసర్పాల్లాంటి బాణాలు తీసుకున్నాడు. కోపించిన సింహం వలె, మదం స్రవించిన ఏనుగువలె ఉన్నాడు. (11)
దదృశుః సర్వభూతాని మహాబాణధనుర్ధరమ్ ।
న గ్లాన్నిర్న చ వైక్లవ్యంన భయం న చ సంభ్రమః ॥ 12
కదాచిజ్జుషతే పార్థమ్ ఆత్మజం మాతరిశ్వనః ।
విల్లు బాణాలు ధరించిన ఆ భీముని ప్రాణులన్నీ చూశాయి. వాయుపుత్రునకు మాత్రం అలసట, వైక్లబ్యం, భయం, తొందరపాటు లేవు. (12 1/2)
ద్రౌపద్యాః ప్రియమన్విచ్ఛన్ స బాహుబలమాశ్రితః ॥ 13
వ్యపేతభయసమ్మోహః శైలమభ్యపతద్ బలీ ।
స తే ద్రుమలతాగుల్మచ్ఛన్నం నీలశిలాతలమ్ ॥ 14
గిరిం చచారారిహరః కిన్నరాచరితం శుభమ్ ।
నానావర్ణధరైశ్చిత్రం ధాతుద్రుమమృగాండజైః ॥ 15
ద్రౌపదికి ప్రియాన్ని చేయగోరి తన బాహుబలాన్ని ఆశ్రయించి భయమోహాలు లేక బలవంతుడై ఎదురుగా ఉన్న పర్వతశిఖరం అధిరోహించాడు. ఆ పర్వతం చెట్లు, లతలు, తీగలతో కప్పబడి నీలపురంగు శిలలు కలిగి ఉంది. కిన్నరులు అక్కడ సంచరిస్తున్నారు. శత్రుతాపనుడైన భీమసేనుడు ఆ పర్వతంపై చరించాడు. చాల రంగులలో ధాతువులు, చెట్లు, మృగాలు, పక్షులు కలిగి విచిత్రశోభతో కూడి పర్వతం ప్రకాశిస్తోంది. (13-15)
సర్వభూషణసంపూర్ణం భూమేర్భుజమివోచ్ర్ఛితమ్ ।
సర్వత్ర రమణీయేషు గంధమాదనసానుషు ॥ 16
సక్తచక్షురభిప్రాయాన్ హృదయేనానుచింతయన్ ।
పుంస్కోకిలనినాదేషు షట్ పదాచరితేషు చ ॥ 17
బద్ధశ్రోత్రమనశ్చక్షుః జగామామితవిక్రమః ।
భూమి సమస్త ఆభరణాలు కల తన భుజాన్ని పైకెత్తినట్లుగా అందంగా ఆ గంధమాన పర్వతం చరియలు కనిపించాయి. ఆ శిఖరం ఎటుచూసినా అందంగా ఉంది. పుంస్కోకిలల నాదాలు, తుమ్మెదల ఝంకారాలు గాఢంగా వినిపిస్తున్నాయి. వాటిని ఆసక్తిగా గమనిస్తూనే మనస్సులో తన పని గురించి ఆలోచిస్తున్నాడు. (16-17 1/2)
ఆజిఘ్రన్ స మహాతేజాః సర్వర్తుకుసుమోద్భవమ్ ॥ 18
గంధముద్ధతముద్దామో వనే మత్త ఇవ ద్విపః ।
వీజ్యమానః సుపుణ్యేన నానాకుసుమగంధినా ॥ 19
పితుః సంస్పర్శశీతేన గంధమాదనవాయునా ।
హ్రియమాణశ్రమః పిత్రా సంప్రహృష్టతనూరుహః ॥ 20
అన్ని ఋతువుల పుష్పాలగంధమూ అధికంగా వ్యాపించింది. దాన్ని ఆఘ్రాణిస్తూ మదించిన ఏనుగులా ఉన్నాడు. గంధమానం మీదుగా వీచే గాలి వింజామరవలె సేవిస్తోంది. తండ్రికి పుత్ర సంస్పర్శ సుఖం కలిగిస్తున్నట్లు అదే సుఖం గంధమాదన పర్వతం మీది గాలితో భీమసేనునికి కలుగుతోంది. (18-20)
స యక్షగంధర్వసురబ్రహ్మర్షిగణసేవితమ్ ।
విలోకయామాస తదా పుష్పహేతోరరిందమః ॥ 21
ఆ సమయంలో యక్షులు, గంధర్వులు, బ్రహ్మర్షులు, దేవర్షులు సేవించే ఆ విశాల పర్వతానికి అన్నివైపులా పుష్పాల కోసం దృష్టిని ప్రసారించాడు. (21)
విషమచ్ఛదైరచితైః అనులిప్త ఇవాంగులైః ।
వలిభిర్ధాతువిచ్ఛేదైః కాంచానాంజనరాజతైః ।
సపక్షమివ నృత్యంతం పార్శ్వలగ్నైః పయోధరైః ॥ 22
అనేక ధాతువులచే రంజితమై, ఏడాకుల అరటి ఆకులతో విభిన్నాలైన రంగులు కలిసి అంగుళుల ద్వారా త్రిపుండ్రాలు దాల్చినట్లు ఉంది. పర్వతశిఖరానికి ఇరువైపులా లగ్నమైన మేఘాలశోభ అది రెక్కలు దాల్చి నృత్యం చేస్తున్నట్లు అనిపిస్తోంది. (22)
ముక్తాహారైరివ చితం చ్యుతైః ప్రస్రవణోదకైః ।
అభిరామదరీకుంజనిర్ఘరోదకకందరమ్ ॥ 23
నిరంతరం ప్రవహించే జలం, పర్వతకంఠానికి వేసిన ముత్యాల హారంలా ఉంది. పర్వతగుహలు, పొదలు, సెలయేళ్లు అన్నీ మనోహరంగా ఉన్నాయి. (23)
అప్సరోనూపురరవైః ప్రనృత్తవరబర్హిణమ్ ।
దిగ్వారణవిషాణాగ్రైః ఘృష్టోపలశిలాతలమ్ ॥ 24
అప్సరసల అందెల ధ్వనులచే నృత్య చేసే నెమళ్ళు వింతగా కనిపించాయి. దిగ్గజాల దంతప్రహారాలు పర్వత శిలలపై చిహ్నితాలై ఉన్నాయి. (24)
స్రస్తాంశుకమివాక్షోభ్యైః నిమ్నగానిఃసృతైర్జలైః ।
సశష్పకవలైః స్వస్థైః అదూరపరివర్తిభిః ॥ 25
భయానభిజ్ఞైర్హరిణైః కౌతూహలనిరీక్షితః ।
చాలయన్నురువేగేన లతాజాలాన్యనేకశః ॥ 26
ఆక్రీడమానో హృష్టాత్మా శ్రీమాన్ వాయుసుతో యయౌ ।
ప్రియామనోరథం కర్తుముద్యతశ్చారులోచనః ॥ 27
పల్లంవైపు ప్రవహించే నదుల నుండి వచ్చే నీరు కలత చెందక ప్రవహిస్తే పర్వతం పైట జారినట్లుంది.
భయం తెలియని లేళ్ళు లేతగడ్డి పరకలు కొరుకుతూ భీమునివైపు కుతూహలదృష్టితో చూస్తున్నాయి. మనోహరనేత్రాలు, గొప్ప వేగమూ కల భీమసేనుడు తనవేగంతో దగ్గరలోని లతా సమూహాల్ని కదుపుతూ హర్షంతో ఆటలాడుతూ ముందుకు సాగుతున్నాడు. అతడు తన ప్రియురాలు ద్రౌపది కోరికను తీర్చటానికి సిద్ధమయ్యాడు. (25-27)
ప్రాంశుః కనకవర్ణాభః సింహసంహననో యువా ।
మత్తవారణవిక్రాంతః మత్తవారణవేగవాన్ ॥ 28
అతడు చాల ఎత్తుగా ఉన్నాడు. బంగారు రంగుతో ఉన్నాడు. అతని అవయవాలు సింహపు అవయవాల్లా బలంగా కనపడుతున్నాయి. మదించిన ఏనుగుయొక్క విక్రమమూ వేగమూ కలిగి ఉన్నాడు. (28)
మత్తవారణతామ్రాక్షః మత్తవారణవారణః ।
ప్రియపార్శ్వోపవిష్టాభిః వ్యావృత్తాభిర్విచేష్టితైః ॥ 29
యక్షగంధర్వయోషాభిః అదృశ్యాభిర్నిరీక్షితః ।
నవావతారో రూపస్య విక్రీడన్నివ పాండవః ॥ 30
చచార రమణీయేషు గంధమాదనసానుషు ।
సంస్మరన్ వివిధాన్ క్లేశాన్ దుర్యోధనకృతాన్ బహూన్ ॥ 31
ద్రౌపద్యా వనవాసిన్యాః ప్రియం కర్తుం సముద్యతః ।
సోఽచింతయద్ గతే స్వర్గమ్ అర్జునే మయి చాగతే ॥ 32
పుష్పహేతోః కథం త్వార్యః కరిష్యతి యుధిష్ఠిరః ।
స్నేహాన్నరవరో నూనమ్ అవిశ్వాసాద్ బలస్య చ ॥ 33
నకులం సహదేవం చ న మోక్ష్యతి యుధిష్ఠిరః ।
కథం తు కుసుమావాప్తిః స్యాచ్ఛీఘ్రమితి చింతయన్ ॥ 34
ప్రతస్థే నరశార్దూలః పక్షిరాడివ వేగితః ।
సజ్జమానమనోదృష్టిః ఫుల్లేషు గిరిసానుషు ॥ 35
మదించిన ఏనుగులాంటి ఎఱ్ఱటి కళ్ళు భీమునివి. మదించిన ఏనుగుల్ని యుద్ధంలో వెనుకకు మళ్లించేవాడు అతడు. ప్రియుని జతలో కూర్చున్న యక్ష గంధర్వ స్త్రీలు చేష్టలుడిగి ఆశ్చర్యంతో అతనిని చూస్తున్నారు.
సౌందర్యానికి నూతన అవతారంలా ఉన్నాడు. అతడిని యక్షగంధర్వ స్త్రీలందరూ తాము కనపడకుండా చూస్తున్నారు.
గంధమాదనశిఖరాలపై ఒక ఆటగాడిలా తిరుగుతున్నాడు. దుర్యోధనుడు చేసిన అపకారాల్ని స్మరించుకుంటూ వనవాసిని అయిన ద్రౌపదికి ప్రియం చెయ్యాలని సిద్ధం అయ్యాడు.
"అర్జునుడు స్వర్గంలో ఉండగా నేను సౌగంధిక పుష్పాలకై రాగా ధర్మరాజు ఒక్కడూ పనులన్నీ ఎలా సాధిస్తాడు?
ధర్మరాజు నకులసహదేవులపై మిక్కిలి ప్రేమ కలిగి ఉన్నాడు. వారి బలంపై అతనికి నమ్మకం లేదు. (అంటే వారిని ఏ పనికీ పంపడు)
శీఘ్రంగా పుష్పాలు ఎలా లభిస్తాయి?" అని ఆలోచిస్తూ గరుడునితో సమాన వేగంతో ముందుకు పోతున్నాడు.
అతని మనస్సు వికసించిన పూలున్న పర్వతాల చరియల మీద లగ్నమైంది. (29-35)
ద్రౌపదీవాక్యపాథేయో భీమః శీఘ్రతరం యయౌ ।
కంపయన్ మేదినీం పద్భ్యాం నిర్ఘాత ఇవ పర్వసు ॥ 36
త్రాసయన్ గజయూథాని వాతరంహా వృకోదరః ।
సింహవ్యాఘ్రమృగాంశ్చైవ మర్దయానో మహాబలః ॥ 37
ఉన్మూలయన్ మహావృక్షాన్ పోథయంస్తరసా బలీ ।
లతావల్లీశ్చ వేగేన వికర్షన్ పాండునందనః ।
ఉపర్యుపరి శైలాగ్రమ్ ఆరురుక్షురివ ద్విపః ॥ 38
ద్రౌపదీ వాక్యాలే దారిలో ఆహారంగా భీముడు శీఘ్రంగా బయలుదేరాడు. వాయువేగం కల భీమసేనుడు పర్వసమయాల్లోని భూకంపాలు, పిడుగుపాటు లాంటి ఉత్పాతాలతో సమంగా తన పాదాలా సవ్వడితో భూమిని కంపింపచేస్తూ ఏనుగుల మందలను భయపెడుతూ
నడవసాగాడు. భీమసేనుడు సింహాలను, పెద్దపులులను, మృగాలను మర్దిస్తూ, తన వేగంతో పెద్దపెద్ద చెట్లనూ తీగల్ని లాగివేస్తూ ముందుకు సాగుతున్నాడు. అతడు పైపైకి పోతుంటే గజరాజు పర్వతశిఖరాగ్రం వైపు సాగుతున్నట్లు ఉంది. (36-38)
వినర్దమానోఽతిభృశం సవిద్యుదివ తోయదః ।
తేన శబ్దేన మహతా భీమస్య ప్రతిబోధితాః ॥ 39
గుహాం సంతత్యజుర్వ్యాఘ్రాః నిలిల్యుర్వనవాసినః ।
సముత్పేతుః ఖగాస్త్రస్తాః మృగయూథాని దుద్రువుః ॥ 40
మెరుపు తీగల వల్ల ప్రకాశిమ్చే మేఘాల వలె గట్టిగా గర్జించాడు. భీమసేనుని భయంకర గర్జనచే పులులు గుహలను వీడి పరుగుపెట్టాయి.
వనంలో నివసించే ప్రాణులు లోపల దాగాయి. భయపడిన పక్షులు ఆకాశంలోకి ఎగిరాయి. మృగాల గుంపు దూరంగా పరుగులు తీశాయి. (39-40)
ఋక్షాశ్చోత్ససృజుర్వృక్షాన్ తత్యజుర్హరయో గుహామ్ ।
వ్యజృంభంత మహాసింహాః మహిషాంచావలోకయన్ ॥ 41
ఎలుగుబంట్లు చెట్లను విడచాయి. సింహాలు గుహలను విడచిపెట్టాయి. పెద్దపెద్ద సింహాలు విజృంభిస్తూ దున్నలను చూస్తున్నాయి. (41)
తేన విత్రాసితా నాగాః కరేణుపరివారితాః ।
తద్ వనం స పరిత్యజ్య జగ్మురన్యన్మహావనమ్ ॥ 42
అతనిచే భయపెట్టబడిన ఏనుగులు ఆడఏనుగులతో కలిసి ఆ వనం విడిచి ఇంకొక మహావనానికి చేరుకున్నాయి. (42)
వరాహమృగసంఘాశ్చ మహిషాశ్చ వనేచరాః ।
వ్యాఘ్రగోమాయుసంఘాశ్చ ప్రణేదుర్గవయైః సహ ॥ 43
రథాంగసాహ్వాదాత్యూహాః హంసకారండవప్లవాః ।
శుకాః పుంస్కోకిలాః క్రౌంచాః విసంజ్ఞా భేజిరే దిశః ॥ 44
అడవి పందులు, మృగాల గుంపులు, దున్నలు, గవయ మృగాలు, వ్యాఘ్రాలు, నక్కలు, చిలుకలు, చక్రవాకాలు, చాతక, హంస, కారండవ, ప్లవ, కోకిల, క్రౌంచాదులు గాబరాపడి నోళ్ళు తెరిచి పెద్దగా అరుస్తూ తలకొక దిక్కుకూ ఎగిరాయి. (43-44)
తథాన్యే దర్పితా నాగాః కరేణుశరపీడితాః ।
సింహవ్యాఘ్రాశ్చ సంక్రుద్ధాః భీమసేనమథాద్రవన్ ॥ 45
శకృన్మూత్రం చ ముంచానా భయవిభ్రాంతమానసాః ।
వ్యాదితాస్యా మహారౌద్రౌః వ్యనదన్ భీషణాన్ రవాన్ ॥ 46
ఆడఏనుగుల కటాక్ష బాణాలకు లొంగిన ఏనుగులు, సింహాలు, పెద్దపులులు కోపించి భీమసేనునిపై విరుచుకుపడ్డాయి.
మలమూత్రాల్ని విడుస్తూ, భయంతో చలించిన మనస్సులతో నోళ్ళు తెరిచి రౌద్రంగా ధ్వనులు చేశాయి. (45-46)
తతో వాయుసుతః క్రోధాత్ స్వబాహుబలమాశ్రితః ।
గజేనాన్యాన్ గజాన్ శ్రీమాన్ సింహం సింహేన వా విభుః ॥ 47
తలప్రహారైరన్యాంశ్చ వ్యహనత్ పాండవో బలీ ।
తే వధ్యమానా భీమేన సింహవ్యాఘ్రతరక్షవః ॥ 48
భయాద్ విససృజుర్భీమం శకృన్మూత్రం చ సుస్రువుః ।
ప్రవివేశ తతః క్షిప్రం తానపాస్య మహాబలః ॥ 49
వనం పాండుసుతః శ్రీమాన్ శబ్దేనాపూరయన్ దిశః ।
భీమసేనుడు తన బాహుబలంతో ఒక ఏనుగుతో మరికొన్ని ఏనుగుల్ని, ఒక సింహంతో మరొక సింహాన్ని చంపి, మిగతావాటిని అరచేతి దెబ్బలతో చంపాడు.
భీమసేనుని దెబ్బలకు సింహాలు, వ్యాఘ్రాలు, తరక్షువులు భయంతో మలమూత్రాల్ని ఒక్కసారిగా విడచాయి.
శక్తిశాలి భీమసేనుడు శీఘ్రంగా వాటిని విడచి తన గర్జనతో దిక్కుల్ని ప్రతిధ్వనింపచేస్తూ ఒక వనంలో ప్రవేశించాడు. (47-49 1/2)
అథాపశ్యన్మహాబాహుః గంధమాదనసానుషు ॥ 50
సురమ్యం కదలీషండం బహుయోజనవిస్తృతమ్ ।
తమభ్యగచ్ఛద్ వేగేన క్షోభయిష్యన్ మహాబలః ॥ 51
మహాగజ ఇవాస్రావీ ప్రభంజన్ వివిధాన్ ద్రుమాన్ ।
ఉత్పాట్య కదలీస్తంభాన్ బహుతాలసముచ్ర్ఛయాన్ ॥ 52
చిక్షేప తరసా భీమః సమంతాద్ బలినాం వరః ।
వినదన్ సుమహాతేజాః నృసింహ ఇవ దర్పితః ॥ 53
తతః సత్త్వాన్యుపాక్రామద్ బహూని సుమహాంతి చ ।
రురువానరసింహాంశ్చ మహిషాంశ్చ జలాశయాన్ ॥ 54
తేన శబ్దేన చైవాథ భీమసేనరవేణ చ ।
వనాంతరగతశ్చాపి విత్రేసుర్మృగపక్షిణః ॥ 55
గంధమాదన శిఖరాలపై భీముడు చాల యోజనాలు వ్యాపించిన అందమైన అరటి తోటను చూశాడు.
మహాబలుడైన వాయుపుత్రుడు అరటితోపులో తిరుగుతూ మదం స్రవించే ఏనుగు వలె దాన్ని పడవేస్తూ తాడిచెట్లంత ఎత్తైన చెట్లను పెకలించి భూమిపై విసరసాగాడు. తన
బలపరాక్రమాలపై గర్వంతో గొప్ప తేజంతో నరసింహుని వలె గర్జిస్తూ ఉన్నాడు. పిమ్మట పెద్ద పెద్ద జంతువులపై దాడిచేశాడు. రురు, వానర, సింహాలు, దున్నలు జలజంతువులపై దాడి చేశాడు.
పశుపక్ష్యాదుల ధ్వనికి, భీమసేనుని గర్జనకు వేరే వనంలో ఉన్న మృగాలు, పక్షులు కూడ భయపడ్డాయి. (50-55)
తం శబ్దం సహసా శ్రుత్వా మృగపక్షిసమీరితమ్ ।
జలార్ద్రపక్షా విహగాః సముత్పేతుః సహస్రశః ॥ 56
భయసూచకమగు మృగ, పక్ష్యాదుల శబ్దాన్ని విని వేలకొద్దీ పక్షులు ఆకాశంలోకి ఎగిరాయి. (56)
తానౌదకాన్ పక్షిగణాన్ నిరీక్ష్య భరతర్షభః ।
తానేవానుసరన్ రమ్యం దదర్శ సుమహత్ సరః ॥ 57
భీముడు ఇది చూచి జల పక్షుల వెంటపడ్డాడు. కొంత దూరం పోయిన పిదప అందమైన సరస్సును చూశాడు. (57)
కాంచనైః కదలీషండైః మందమారుతకంపితైః ।
వీజ్యమానమివాక్షోభ్యం తీరాత్ తీరవిసర్పిభిః ॥ 58
సరోవరతీర మంతా వ్యాపించిన బంగారు అరటిచెట్లు మెల్లని గాలిచే కదల్పబడి అగాధ జలాశయాన్ని వింజామరల్లా వీచాయి. (58)
తత్ సరోఽథావతీర్యాశు ప్రభూతనలినోత్పలమ్ ।
మహాగజ ఇవోద్దామః చిక్రీడ బలవద్ బలీ ॥ 59
దానిలో ఎన్నో కమలాలు కలువలు వికసించి ఉన్నాయి. బంధనం లేని ఏనుగువలె భీముడు సరోవరంలోకి దిగి జలక్రీడలాడ మొదలుపెట్టాడు. (59)
విక్రీడ్య తస్మిన్ సుచిరమ్ ఉత్తతారామితద్యుతిః ।
తతోఽధ్యగంతుం వేగేన తద్ వనం బహుపాదపమ్ ॥ 60
చాలసేపు స్నానంచేసి సరోవరంలో క్రీడించి అమిత తేజోవంతుడైన భీముడు సరోవరం నుంచి బయటపడి వేగంగా అరటితోపులో ప్రవేశింపబోయాడు. (60)
దధ్మౌ చ శంఖం స్వనవత్ సర్వప్రాణేన పాండవః ।
ఆస్ఫోటయచ్చ బలవాన్ భీమః సన్నాదయన్ దిశః ॥ 61
తస్య శంఖస్య శబ్దేన భీమసేనరవేణ చ ।
బాహుశబ్దేన చోగ్రేణ నదంతీవ గిరేర్గుహాః ॥ 62
ఆ సమయంలో భీముడు తన శక్తినంతటినీ కూడతీసికొని వేగంగా శంఖాన్ని ఊదాడు. అది అన్ని దిశలా మారుమ్రోగింది. ఆ శంఖధ్వనితో, భీమసేన గర్జనతో అతని చప్పట్ల శబ్దంతో పర్వతగుహలన్నీ ప్రతిధ్వనించాయి. (61-62)
తం వజ్రనిష్పేషసమమ్ ఆస్ఫోటితమహారవమ్ ।
శ్రుత్వా శైలగుహాసుప్తైః సింహైర్ముక్తో మహాస్వనః ॥ 63
పర్వతాలపై వజ్రం వేసినప్పుడు మోగినట్లుగా మ్రోగిన భుజాస్ఫాలలనానికి గుహల్లో నిద్రించే సింహాలు గర్జించాయి. (63)
సింహనాదభయత్రస్తైః కుంజరైరపి భారత ।
ముక్తో విరావః సుమహాన్ పర్వతో యేన పూరితః ॥ 64
సింహాలనాదానికి భయపడిన ఏనుగులు కూడ తొండాలు ఎత్తి పర్వతం మారుమ్రోగేలా ఘీంకారాలు అప్రయత్నంగా చేశాయి. (64)
తం తు నాదం తతః శ్రుత్వా ముక్తం వారణపుంగవైః ।
భ్రాతరం భీమసేనం తు విజ్ఞాయ హనుమాన్ కపిః ॥ 65
ఏనుగుల ఘీంకారాల్ని విన్న కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు అరటితోపులో ఉండి తన సోదరుడు భీమసేనుని రాకను గుర్తించి ఇటువైపు వచ్చాడు. (65)
దివంగమం రురోధాథ మార్గం భీమస్య కారణాత్ ।
అనేన హి పథా మా వై గచ్ఛేదితి విచార్య సః ॥ 66
ఆస్త ఏకాయనే మార్గే కదలీషండమండితే ।
భ్రాతుర్భీమస్య రక్షార్థం తం మార్గమవరుధ్య వై ॥ 67
భీమసేనుని మేలుకోరి స్వర్గంవైపు పోయే మార్గాన్ని ఆంజనేయుడు అడ్డగించాడు. భీమసేనుడు ఈ మార్గంలో వెళ్ళకూడదని ఒక మనుష్యుని రాకపోకలకు వీలైనంత దారిలో కూర్చున్నాడు. అరటిచెట్లు దట్టంగా ఉండటం వలన ఆ దారి చాలా అందంగా ఉంది. భీముని రక్షణకే హనుమంతుడు ఆ దారిలో అడ్డుగా కూర్చున్నాడు. (66-67)
మాత్ర ప్రాప్స్యతి శాపం వా ధర్షణాం వేతి పాండవః ।
కదలీషండమధ్యస్థః హ్యేవం సంచింత్య వానరః ॥ 68
ప్రాజృంభత మహాకాయః హనుమాన్ నామ వానరః ।
కదలీషండమధ్యస్థః నిద్రావశగతస్తదా ॥ 69
జృంభమాణః సువిపులం శక్రధ్వజమివోచ్ర్ఛితమ్ ।
ఆస్ఫోటయచ్చ లాంగూలమ్ ఇంద్రాశనిసమస్వనమ్ ॥ 70
అరటితోపుగుండా వచ్చే భీమసేనుడు ఈ దారిలో శాపాన్ని గాని, తిరస్కరంగాని పొందకూడదని ఆలోచించి హనుమంతుడు వనానికి వెలుపల దారిని నిరోధించాడు.
ఆ సమయాన తన శరీరాన్ని అతడు పెంచివేశాడు. నిద్రాసక్తుడై ఆ అరటితోట మధ్యలో కూర్చున్నాడు.
ఇంద్రధ్వజం వలె ప్రకాశించే తోకను వజ్రాయుధపు దెబ్బలా అనిపించేటట్లు భూమిపై చరిచాడు. (68-70)
తస్య లాంగూలనినదం పర్వతః సుగుహాముఖైః ।
ఉద్గారమివ గౌర్నర్దన్ ఉత్ససర్జ సమంతతః ॥ 71
ఆ తోక చేసిన ధ్వని గుహల అంతర్భాగాల్లో అన్నివైపుల ప్రతిధ్వనించింది. ఒక ఆబోతురంకెలా ఉంది. (71)
లాంగూలాస్ఫోటశబ్దాచ్చ చలితః స మహాగిరిః ।
విఘూర్ణమానశిఖరః సమంతాత్ పర్యశీర్యత ॥ 72
స లాంగూలరవస్తస్య మత్తవారణనిఃస్వనమ్ ।
అంతర్ధాయ విచిత్రేషు చచార గిరిసానుషు ॥ 73
తోకను చరుస్తూండడం వలన చలించిన ఆ మహాపర్వతం శిఖరాలు గిరగిర తిరిగి అన్నివైపుల విరిగి పడసాగింది.
ఆ శబ్దం ఏనుగు ఘీంకారం వలె మార్ర్మోగి పర్వత చరియలంతటా వ్యాపించింది. (72-73)
స భీమసేనస్తచ్ర్ఛుత్వా సంప్రహృష్టతనూరుహః ।
శబ్దప్రభవమన్విచ్ఛన్ చచార కదలీవనమ్ ॥ 74
ఇది విని భీమసేనుడు మిక్కిలి ఉత్సాహంతో పులకాంకురాలు కలిగి ఆ శ్బ్దం పుట్టిన చోటు వెదకుతూ అరటి తోటలో తిరగసాగాడు. (74)
కదలీవనమధ్యస్థమ్ అథ పీనే శిలాతలే ।
దదర్శ సుమహాబాహుః వానరాధిపతిం తదా ॥ 75
అరటితోపు మధ్యలో విశాలమై మందమైన రాతిపలకపై భీమసేనుడు వానర శ్రేష్ఠుడైన హనుమంతుని చూశాడు. (75)
విద్యుత్సంపాతదుష్ప్రేక్షం విద్యుత్సంపాతిపింగలమ్ ।
విద్యుత్సంపాతనినదం విద్యుత్సంపాతచంచలమ్ ॥ 76
మెరుపుతీగ కాంతితో చూడశక్యం కాని రంగుతో ప్రకాశిస్తున్నాడు. అతని గర్జన వజ్రాయుధం పడిన శబ్దంతో సమంగా ఉంది. అతడు మెరుపు తీగలా చంచలంగా ఉన్నాడు. (76)
బాహుస్వస్తికవిన్యస్తపీనహ్రస్వశిరోధరమ్ ।
స్కంధభూయిష్ఠకాయత్వాత్ తనుమధ్యకటీతటమ్ ॥ 77
కించిచ్చాభుగ్నశీర్షేణ దీర్ఘరోమాంచితేన చ ।
లాంగూలేనోర్ధ్వగతినా ధ్వజేనేవ విరాజితమ్ ॥ 78
చేతులను మడిచి బలిసిన పొట్టి శిరస్సు క్రింద ఆన్చాడు. భుజాలు పెద్దవిగా ఉండటంచేత కృశిమ్చిన నడుముతో ఉన్నాడు.
అతని పొడవైన తోక చివర కొంచెం వంగి ఉంది. దాని నిండా పొడవైన వెంట్రుకలు ఉన్నాయి. పైకి ఉండటం వలన జెండాలా ఉంది. (77,78)
హ్రస్వౌష్ఠం తామ్రజిహ్వాస్యం రక్తకర్ణం చలద్ర్భువమ్ ।
వివృత్తదంష్ట్రాదశనం శుక్లతీక్ష్ణాగ్రశోభితమ్ ॥ 79
అపశ్యద్ వదనం తస్య రశ్మిమంతమివోడుపమ్ ।
వదనాభ్యంతరగతైః శుక్లైర్దంతైరలంకృతమ్ ॥ 80
పెదవులు చిన్నవిగా, నాలుక - ముఖం ఎఱ్ఱగా, చంచలమైన కనుబొమలు, నోటిలో మెరిసే దంతాలు తెల్లగా, పదునుగా ఉన్నాయి. అతని ముఖం ప్రకాశించే కిరణాలు గల చంద్రునిలా ఉంది. ముఖానికి లోపల తెల్లని దంతాలు కాంతిని పెంచుతూ ఆభరణాల సొగసును కలిగిస్తున్నాయి. (79-80)
కేసరోత్కరసమ్మిశ్రమ్ అశోకానామివోత్కరమ్ ।
హిరణ్మయీనాం మధ్యస్థం కదలీనాం మహాద్యుతిమ్ ॥ 81
బంగారు అరటిచెట్ల మధ్యలో ప్రకాశించే తేజోవంతుడు హనుమంతుడు బంగారు రంగు గల అరటి చెట్ల మధ్యలో ఉన్నాడు. (81)
దీప్యమానేన వపుషా స్వర్చిష్మంతమివానలమ్ ।
నిరీక్షంతమమిత్రఘ్నం లోచనైర్మధుపింగలైః ॥ 82
వెలిగిపోయే శరీరంతో భగభగమండే అగ్నిలా ఉన్నాడు. తేనె రంగుకళ్లతో అటుఇటూ చూస్తున్నాడు. (82)
తం వానరవరం ధీమాన్ అతికాయం మహాబలమ్ ।
స్వర్గపంథానమావృత్య హిమవంతమివ స్థితమ్ ॥ 83
దృష్ట్వా చైనం మహాబాహుః ఏకం తస్మిన్ మహావనే ।
అథోపసృత్య తరసా విభీర్భీమస్తతో బలీ ॥ 84
సింహనాదం చకారోగ్రం వజ్రాశనిసమం బలీ ।
తేన శబ్దేన భీమస్య విత్రేసుర్మృగపక్షిణః ॥ 85
బుద్ధిమంతుడైన బీమసేనుడు పెద్ద శరీరమూ, చాలా బలమూ కల హనుమంతుని చూస్తే స్వర్గ మార్గాన్ని అడ్డగించి హిమాలయపర్వతంలా కనిపించాడు.
భయం ఎరుగని భీముడు ఆ పెద్ద తోటలో ఒంటరిగా ఉన్న అతనిని సమీపించి సింహనాదం చేశాడు. అది గొప్ప పిడుగుధ్వనిలా ఉంది. ఆ శబ్దానికి మృగాలు, పశుపక్ష్యాదులు భయపడ్డాయి. (83-85)
హనూమాంశ్చ మహాసత్త్వః ఈషదున్మీల్య లోచనే ।
దృష్ట్వా తమథ సావజ్ఞం లోచనైర్మధుపింగలైః ।
స్మితేన చైనమాసాద్య హనూమానిదమబ్రవీత్ ॥ 86
ధైర్యశాలి హనుమంతుడు కొద్దిగా కళ్లు తెరిచి అతనిని తిరస్కారపూర్వకంగా ఎఱ్ఱటి కళ్ళతో చూసి చిరునవ్వుతో దగ్గరకు వచ్చాక ఇలా అన్నాడు. (86)
హనూమానువాచ
కిమర్థం సరుజస్తేఽహం సుఖసుప్తః ప్రబోధితః ।
నను నామ త్వయా కార్యా దయా భూతేషి జానతా ॥ 87
హనుమంతుడు అంటున్నాడు. ఏ కారణంగా హాయిగా నిద్రించే రోగినైన నన్ను నీవు నిద్ర లేపావు. అన్ని ప్రాణులపై దయ చూపాలి అని నీకు తెలుసు గదా! (87)
వయం ధర్మం న జానీమః తిర్యగ్యోనిముపాశ్రితాః ।
నరాస్తు బుద్ధిసంపన్నాః దయాం కుర్వంతి జంతుషు ॥ 88
మేము పశువుల గర్భాన పుట్టాము, ధర్మం తెలియని వాళ్లము. నరులు బుద్ధి కలవారు. ఇతర ప్రాణులపై దయ చూపుతారు కదా! (88)
క్రూరేషు కర్మసు కథం దేహవాక్చిత్తదూషిషు ।
ధర్మఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాః ॥ 89
మీ వంటి బుద్ధిమంతులు ధర్మాన్ని నాశనం చేసే శరీర, వచన, మానసిక దోషాలయందు ఎందుకు ప్రవర్తిస్తారు? (89)
న త్వం ధర్మం విజానాసి బుధా నోపాసితాస్త్వయా ।
అల్పబుద్ధితయా బాల్యాద్ ఉత్సాదయసి యన్మృగాన్ ॥ 90
నీకు ధర్మం తెలియదు, జ్ఞానం లేదు. నీవు పండితుల సేవ చేయలేదు. చిన్నతనం వలన మందబుద్ధితో మృగాలను కష్టాలకు గురిచేస్తున్నావు. (90)
బ్రూహి కస్త్వం కిమర్థం వా కిమదం వనమాగతః ।
వర్జితం మానుషైర్భావైః తథైవ పురుషైరపి ॥ 91
చెప్పు. నీవు ఎవడవు, ఎందుకీ వనానికి, వచ్చావు? ఇక్కడ మనుష్యులకు, మనుష్య భావాలకు కూడా ప్రవేశం లేదు. (91)
క్వ చ త్వయాద్య గంతవ్యం ప్రబ్రూహి పురుషర్షభ ।
అతః పరమగమ్యోఽయం పర్వతః సుదురారుహః ॥ 92
నీవు ఎక్కడికి పోవాలో చెప్పు. నీవు ఎక్కడికి చేరాలి. ఇక్కడికి ముందున్న పర్వతం మానవులకు ప్రవేశింప వీలుకానిది. దీని నధిరోహించటం మరీ కష్టం. (92)
వినా సిద్ధగతిం వీర గతిరత్ర న విద్యతే ।
దేవకోకస్య మార్గోఽయమ్ అగమ్యో మానుషైః సదా ॥ 93
సిద్ధపురుషులకు మాత్రమే ఇది సుగమం. ఇది దేవలోకానికి పోయేదారి. మనుష్యులకు అసాధ్యం అయినది. (93)
కారుణ్యాత్ త్వామహం వీర వారయామి నిబోధ మే ।
నాతః పరం త్వయా శక్యం గంతుమాశ్వసిహి ప్రభో ॥ 94
నీపై దయతో నిన్ను వారిస్తున్నాను. ఇది తెలుసుకో, ఇకపై ముందుకు పోవటం చాలా కష్టం. నాపై నమ్మకం ఉంచు. (94)
స్వాగతం సర్వథైవేహ తవాద్య మనుజర్షభ ।
ఇమాన్యమృతకల్పాని మూలాని చ ఫలాని చ ॥ 95
భక్షయిత్వా నివర్తస్ట్వ మా వృథా ప్రాప్స్యసే వధమ్ ।
గ్రాహ్యం యది వచో మహ్యం హితం మనుజపుంగవ ॥ 96
నీకు అన్ని విధాల ఈ ప్రదేశానికి స్వాగతం పలుకుతున్నాను. ఈ పండ్లు అమృత సమానం అయిన రుచికలవి. వీటిని హాయిగా తిని వెనుకకు మరలుము. అనవసరంగా చావును కొనితెచ్చుకోకు. నా మాట మేలు కలిగిస్తుంది అనుకొంటే ఆచరించు. (95-96)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం భీమకదలీషండప్రవేశే షట్ చత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥ 146 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వమను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో భీమకదలీవన ప్రవేశము అను నూట నలువది ఆరవ అధ్యాయము. (146)