155. నూట ఏబది ఐదవ అధ్యాయము
యుధిష్ఠిరాదులు గంధమాదనము చేరుట.
వైశంపాయన ఉవాచ
తతస్తాని మహార్హాణి దివ్యాఇ భరతర్షభ ।
బహూని బహురూపాణి విరజాంసి సమాదదే ॥ 1
వైశంపాయనుడు పలికాడు. - పిమ్మట భీముడు ఎన్నోరకాలైన విలువైన, దివ్యమైన, నిర్మలమైన సౌగంధిక పుష్పాలను సంగ్రహించాడు. (1)
తతో వాయుర్మహాన్ శీఘ్రః నీచైః శర్కరకర్షణః ।
ప్రాదురాసీద్ ఖరస్పర్శః సంగ్రామమభిచోదయన్ ॥ 2
ఇంతలో గంధమాదన పర్వతంపై శీఘ్రంగా గాలి వీచసాగింది. అది రాళ్ళను ఇసుకను పైకి తీసుకువస్తోంది. దాని తాకిడి తీక్ష్ణంగా ఉంది. ఏదో ఒక పెద్దయుద్ధం జరగబోతోందని సూచనగా చెప్తోంది. (2)
పపాత మహతీ చోల్కా సనిర్ఘాహా మహాభయా ।
నిష్ప్రభశ్చాభవత్ సూర్యః ఛన్నరశ్మిస్తమోవృతః ॥ 3
పిడుగుపాటుతో భయానకం అయిన ఉల్క భూమిపై పడింది. అందకారం ఆవరించి సూర్యుణ్ణి శూన్యంగా కన్పించాడు. అతని కిరణాలు కప్పబడి ఉన్నాయి. (3)
నిర్ఘాతశ్చాభవద్ భీమో భీమే విక్రమమాస్థితే ।
చచాల పృథివీ చాపి పాంసువర్షం పపాత చ ॥ 4
భీముడు రాక్షసులపై పరాక్రమం చూపేటప్పుడు గొప్ప గర్జనతో భూమి కంపించింది. ధూళి వర్షంలా కురవసాగింది. (4)
సలోహితా దిశశ్చాసన్ ఖరవాచో మృగద్విజాః ।
తమోవృతమభూత్ సర్వం న ప్రాజ్ఞాయత కించన ॥ 5
దిక్కులు ఎఱ్ఱబడ్డాయి. మృగాలు, పక్షులు కఠోరంగా అరవసాగాయి. జగత్తు అంతా చీకటి ఆవరించి ఏ వస్తువూ కనపడకుండా పోయింది. (5)
అన్యే చ బహవో భీమాః ఉత్పాతాస్తత్ర జజ్ఞిరే ।
తదద్భుతమభిప్రేక్ష్య ధర్మపుత్రో యుధిష్ఠిరః ॥ 6
ఉవాచ వదతాం శ్రేష్ఠః కోఽస్మానభిభవిష్యతి ।
సజ్జీభవత భద్రం వః పాండవా యుద్ధదుర్మదాః ॥ 7
యథారూపాణి పశ్యామి స్వభ్యగ్రో నః పరాక్రమః ।
ఏవముక్త్వా తతో రాజా వీక్షాంచక్రే సమంతతః ॥ 8
ఇంతేకాక ఇంకాభయంకరాలైన ఉత్పాతాలు కనిపించాయి. అది చూచిన యుధిష్ఠిరుడు అన్నాడు - మనలను ఎవరు జయింపగలరు.
యుద్ధమందు ఆసక్తిగల తమ్ములారా సిద్ధంగా ఉండండి. మీకు మేలు కలుగుతుంది.
మనం పరాక్రమం చూపే సమయం ఆసన్నం అయింది. నేను లక్షణాల్ని బట్టి గ్రహించాను. అని పలికి అన్నివైపులా కలయజూచాడు. (6-8)
అపశ్యమానో భీమం తు ధర్మపుత్రో యుధిష్ఠిరః ।
తతః కృష్ణాం యమౌ చాపి సమీపస్థావరిందమః ॥ 9
పప్రచ్ఛ భ్రాతరం భీమం భీమకర్మాణమాహవే ।
కచ్చిత్ క్వభీమః పాంచాలి కించిత్ కృత్యం చికీర్షతి ॥ 10
భీముడు కనిపించకపోవుటచే ధర్మాత్ముడు యుధిష్ఠిరుడు ద్రౌపదిని, నకుల సహదేవులను సమీపించి భీముని గురించి అడిగాడు.
పాంచాల రాజపుత్రీ! భీముడు ఎక్కడ ఉన్నాడు? ఏ పని నిర్వహించాలి అనుకుంటున్నాడు? (9,10)
కృతవానపి వా వీరః సాహసం సాహసప్రియః ।
ఇమే హ్యకస్మాదుత్పాతాః మహాసమరదర్శనాః ॥ 11
సాహసశీలి భీముడు ఏదైనా సాహసకార్యాన్ని ఆచరించాడా? ఈ ఉత్పాతాలు అకస్మాత్తుగా సంభవించి గొప్ప సంగ్రామాన్ని సూచిస్తున్నాయి. (11)
దర్శయంతో భయం తీవ్రం ప్రాదుర్భూతాః సమంతతః ।
తం తథావాదివం కృష్ణా ప్రత్యువాచ మనస్వినీ ।
ప్రియా ప్రియం చికీర్షంతీ మహిషీ చారుహాసినీ ॥ 12
ఇవి నాలుగువైపుల విజృంభించి భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అలా పలికిన ధర్మరాజుతో చక్కగా నవ్వుతూ మనస్విని పట్టమహిషి ద్రౌపది ప్రియాన్ని కోరుతూ ఇఇలా పలికింది. (12)
ద్రౌపద్యువాచ
యత్ తత్ సౌగంధికం రాజన్నాహృతం మాతరిశ్వనా ।
తన్మయా భీమసేనస్య ప్రీతయాద్యోపపాదితమ్ ॥ 13
అపి చోక్తో మయా వీరః యది పశ్యేర్బహూన్యపి ।
తాని సర్వాణ్యుపాదాయ శీఘ్రమాగమ్యతామితి ॥ 14
ద్రౌపది పలికింది - నేడు సౌగంధిక పుష్పం వాయువుచే ఎగురగొట్టబడి మాముందు పడింది. నేను ప్రసన్నతతో భీమునికి ఇచ్చి ఇలా అన్నాను.
ఇలాంటి పుష్పాలు మరిన్ని నీవు చూచినట్లైతే వాటిని తీసుకొని శీఘ్రంగా ఇక్కడకురా. (13,14)
స తు నూనం మహాబాహుః ప్రియార్థం మమ పాండవః ।
ప్రాగుదీచీం దిశం రాజన్ తాన్యాహర్తుమితో గతః ॥ 15
మహాబాహువులు గల భీముడు నా ప్రియంకోరి నిశ్చయంగా వాటిని తీసికొని రావాలని ఈశాన్య దిక్కుగా బయలుదేరి వెళ్ళాడు. (15)
ఉక్తస్త్వేవం తయా రాజా యమావిదమథాబ్రవీత్ ।
గచ్ఛామ సహితాస్తూర్ణం యేన యాతో వృకోదరః ॥ 16
ద్రౌపది మాటలు విని యుధిష్ఠిరుడు మనమందరం భీముడు పోయిన దారిలో తొందరగానే వెడదాము అని కవలలతో అన్నాడు. (16)
వహంతు రాక్షసా విప్రాన్ యథాశ్రాంతాన్ యథాకృశాన్ ।
త్వమప్యమరసంకాశ వహ కృష్ణాం ఘటోత్కచ ॥ 17
ఘటోత్కచా! నీపరిచారకులు అలసిన, కృశించిన బ్రాహ్మణులను మోయుగాక, నీవు కూడ ద్రౌపదిని వీపుపై ఎక్కించుకో. (17)
వ్యక్తం దూరమితో భీమః ప్రవిష్ట ఇతి మే మతిః ।
చిరం చ తస్య కాలోఽయం స చ వాయుసమో జవే ॥ 18
తరస్వీ వైనతేయస్య సదృశో భువి లంఘనే ।
ఉత్పతేదపి చాకాశం నిపతేచ్చ యథేచ్ఛకమ్ ॥ 19
భీముడిక్కడికి దూరంగా వెళ్ళాడని నాకు అనిపిస్తోంది. ఇది నా విశ్వాసం. ఎందుకంటే అతడు వెళ్ళి చాల సమయం గడిచింది. అతడు వేగంలో వాయు సమానుడు.
వైనతేయునివేగంతో భూమిని దాటటంలో దిట్ట. ఆకాశంలోకి ఎగిరి స్వేచ్ఛగా ఎక్కడికైనా దుముకగలడు. (18,19)
తమన్వియామ భవతాం ప్రభావాద్ రజనీచరాః ।
పురా స నాపరాధ్యోతి సిద్ధానాం బ్రహ్మవాదినామ్ ॥ 20
రాక్షసులారా! మీ ప్రభావంచే ముందుగా భీముని వెదకుదాం. అతడు బ్రహ్మవాదుల పట్ల అపరాధం చెయ్యకుండా ఉండేలోపు అతనిని చేరుదాం. (20)
తథేత్యుక్త్వా తు తే సర్వే హైడింబిప్రముఖాస్తదా ।
ఉద్దేశజ్ఞాః కుబేరస్య నలిన్యా భరతర్షభ ॥ 21
ఆదాయ పాండవాంశ్చైవ తాంశ్చ విప్రాననేకశః ।
లోమశేనైవ సహితాః ప్రయయుః ప్రీతమానసాః ॥ 22
అలాగే అని పలికిన ఘటోత్కచాదులు కుబేరుని సరోవరం తెలిసినవారవడం చేత పాండవుల్ని, బ్రాహ్మణుల్ని లోమశునితో సహా వీపులపై ఎక్కించుకొని ఆనందంతో బయలుదేరారు. (21,22)
తే సర్వే త్వరితా గత్వా దదృశుః శుభకాననామ్ ।
పద్మసౌగంధికవతీం నలినీం సుమనోరమామ్ ॥ 23
వారందరు వేగంగా పోయి సుందరవనస్థలిలో సౌగంధిక పుష్పాలతో నిండిన కొలను చూశారు. (23)
తం చ భీమం మహాత్మానం తస్యాస్తీరే మనస్వినమ్ ।
దదృశుర్నిహతాంశ్చైవ యక్షాంశ్చ విపులేక్షణాన్ ॥ 24
భిన్నకాయాక్షిబాహురూన్ సంచూర్ణితశిరోధరాన్ ।
తం చ భీమం మహాత్మానం తస్యాస్తీరే వ్యవస్థితమ్ ॥ 25
ఆ సరోవరతీరంలో మనస్వి భీముని వీక్షించారు. అతనిచే చంపబడ్డ పెద్దపెద్ద కన్నులు గల యక్షుల్ని కనుగొన్నారు. శరీరం తెగినవారు, కళ్ళు భుజాలు, తొడలు ఛిన్నాభిన్నమైన వారు, తలలు పగిలిన వారు ఆ సరోవరంతీరంలో ఉన్నారు. ప్రక్కనే భీముడు నిలబడి ఉన్నాడు. (24,25)
సక్రోధం స్తబ్ధనయనం సందష్టదశనచ్ఛదమ్ ।
ఉద్యమ్య చ గదాం దోర్భ్యాం నదీతీరేష్వవస్థితమ్ ॥ 26
అతని క్రోధం తగ్గలేదు. కళ్ళు తెరిచినవి అలానే ఉన్నాయి. పళ్ళు, పెదవులు కొరుకుతున్నాడు. గదను చేతులతో త్రిప్పుతూ సరోవర తీరంలో అలాగే నిలబడ్డాడు. (26)
ప్రజాసంక్షేపసమయే దండహస్తమివాంతకమ్ ।
తం దృష్ట్వా ధర్మరాజస్తు పరిష్వజ్య పునః పునః ॥ 27
ప్రజానాశం చేసే సమయంలో దండధరుడైన యమునిలా ఉన్నా అతన్ని చూచి ధర్మరాజు దగ్గరకు చేరి ఎన్నోసార్లు కౌగిలించుకున్నాడు. (27)
ఉవాచ శ్లక్ష్ణయా వాచా కౌంతేయ కిమిదం కృతమ్ ।
సాహసం బత భద్రం తే దేవానామథ చాప్రియమ్ ॥ 28
మధురవచనాలతో కౌంతేయా! ఏం పని చేశావు! సాహసం ఎల్లవేళలా పనికిరాదు. నీకు మంగళమగుగాక. దేవతలకు అనిష్టాన్ని కలిగిస్తుంది. (28)
పునరేవం న కర్తవ్యం మమ చేదిచ్ఛసి ప్రియమ్ ।
అనుశిష్య తు కౌంతేయం పద్మాని పరిగృహ్య చ ॥ 29
తస్యామేవ నలిన్యాం తు విజహ్రురమరోపమాః ।
ఏతస్మిన్నేవ కాలే తు ప్రగృహీతశిలాయుధాః ॥ 30
ప్రాదురాసన్ మహాకాయాః తస్యోద్యానస్య రక్షిణః ।
తే దృష్ట్వా ధర్మరాజానం మహర్షిం చాపి లోమశమ్ ॥ 31
నకులం సహదేవం చ తథాన్యాన్ బ్రాహ్మణర్షభాన్ ।
వినయేన నతాః సర్వే ప్రణిపత్య చ భారత ॥ 32
నా ప్రియాన్ని నీవు కోరితే మళ్ళీ ఇలాంటి సాహసం చేయవద్దు. అని భీమునికి ఉపదేశం చేసి సౌగంధిక పుష్పాన్ని తీసుకొని ఆ సరోవరతీరంలో దేవతల్లా విహరించారు.
ఇంతలో శిలాయుధాలు గ్రహించిన మహాకాయులు ఆ ఉద్యానవన పాలకులు ప్రత్యక్షమై ధర్మజునికి, లోమశమహర్షికి, నకులసహదేవులకు ఇతర బ్రాహ్మణులకు శిరస్సులు వంచి వినయంతో నమస్కరించారు. (29-32)
సాంత్వితా ధర్మరాజేన ప్రసేదుః క్షణదాచరాః ।
విదితాశ్చ కుబేరస్య తత్ర తే కురుపుంగవాః ॥ 33
ఊషుర్నాతిచిరం కాలం రమమాణాః కురూద్వహాః ।
ప్రతీక్షమాణా బీభత్సుం గంధమాదనసానుషు ॥ 34
ధర్మరాజు వారినందరినీ ఊరడించాడు. ఆ రాక్షసులు ప్రసన్నులయ్యారు. ఆ కురుశ్రేష్టులు కుబేరుని అధీనంలో కొంచెం కాలం గడిపి ఆనందాన్ని అనుభవించి గంధమాదన పర్వత సానువుల్లో అర్జునుని రాకకై ఎదురు చూడసాగారు. (33,34)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం సౌగంధికాహరణే పంచపంచాశదధికశతతమోఽధ్యాయః ॥ 155 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వము అను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో సౌగంధికాహరణము అను నూట ఏబది అయిదవ అధ్యాయము. (155)