156. నూట ఏబది ఆరవ అధ్యాయము
అశరీరవాణి ఆదేశము - పాండవులు నరనారాయణుల ఆశ్రమము చేరుట.
వైశంపాయన ఉవాచ
తస్మిన్ నివసమానోఽథ ధర్మరాజో యుధిష్టిరః ।
కృష్ణయా సహితాన్ భ్రాతౄన్ ఇత్యువాచ సహద్విజాన్ ॥ 1
వైశంపాయనుడు పలికాడు - అక్కడే సౌగంధికసరోవర తీరంలో నివసిస్తూ ఒకరోజున ద్రౌపదితో కూడిన బ్రాహ్మణులతో సోదరులతో ఇలా అన్నాడు. (1)
యుధిష్ఠిర ఉవాచ
దృష్టాని తీర్థాన్యస్మాభిః పుణ్యాని చ శివాని చ ।
మనసో హ్లాదనీయాని వనాని చ పృథక్ పృథక్ ॥ 2
ధర్మరాజు ఇలా అన్నాడు.
మనం అనేక తీర్థాలను చూశాం. మనస్సుకి ఆహ్లాదాన్ని కల్గించే అనేక వనాలను మనం వీక్షించాం. (2)
దేవైః పూర్వం విచీర్ణాని మునిభిశ్చ మహాత్మభిః ।
యథాక్రమం విశేషేణ ద్విజైః సంపూజితాని చ ॥ 3
ఇవన్నీ పూర్వకాలం దేవతలు మునులు సంచరించిన ప్రదేశాలు. క్రమంగా పెద్దల ఆజ్ఞ ప్రకారం వీటిలో మునిగి ఫలితం పొందాం. (3)
ఋషీణాం పూర్వచరితం తథా కర్మ విచేష్టితమ్ ।
రాజర్షీణాం చ చరితం కథాశ్చ వివిధాః శుభాః ॥ 4
శృణ్వానాస్తత్ర తత్ర స్మ ఆశ్రమేషు శివేషు చ ।
అభిషేకం ద్విజైః సార్ధం కృతవంతో విశేషతః ॥ 5
మనం ఋషుల పూర్వచరిత్ర, వారి పవిత్ర కర్మలు, రాజర్షుల కథలు విన్నాం. మంగళకరమైన ఆశ్రమాలు తిరిగాం. ప్రత్యేకించి బ్రాహ్మణులతో సహా తీర్థాల్ని సేవించాం. (4,5)
అర్చితాః సతతం దేవాః పుష్పైరద్భిః సదా చ వః ।
యథాలభైర్మూలఫలైః పితరశ్చాపి తర్పితాః ॥ 6
మనం ఎల్లప్పుడు పుష్పాలతో, జలంతో దేవతల్ని అర్చిస్తున్నాం. ఆయా ప్రదేశాల్లో లభించిన ఫలాలతో పితరుల్ని పూజించాం. (6)
పర్వతేషు చ రమ్యేషు సర్వేషు చ సరస్సు చ ।
ఉదధౌ చ మహాపుణ్యే సూపస్పృష్టం మహాత్మభిః ॥ 7
సుందర పర్వత ప్రదేశాల్లో, రమ్యమైన సరస్సులో పవిత్రమైన సముద్రజలాల్లో మహాత్ములతో కలిసి స్నానాచమనాలు చేశాం. (7)
ఇలా సరస్వతీ సింధుః యమునా నర్మదా తథా ।
నానాతీర్థేషు రమ్యేషు సూపస్పృష్టం సహ ద్విజైః ॥ 8
ఇలా, సరస్వతి, సింధువు, యమున, నర్మద మొదలగు తీర్థాల్లో బ్రాహ్మణులతో కలిసి పవిత్రస్నానాలు, ఆచమనాలు ఆచరించాం. (8)
గంగాద్వారమతిక్రమ్య బహవః పర్వతాః శుభాః ।
హిమవాన్ పర్వతశ్చైవ నానాద్విజగణాయుతః ॥ 9
హరిద్వారాన్ని దాటి అందమైన పర్వతాల్ని చూశాము, హిమవత్పర్వతం అనేకరకాలైన బ్రాహ్మణులతో కూడి ఉంది. (9)
విశాలా బదరీ దృష్టా నరనారాయణాశ్రమః ।
దివ్యా పుక్షరిణీ దృష్ట్వా సిద్ధదేవర్షిపూజితా ॥ 10
విశాలమైన బదరీతీర్థం, దాన్ని ఆనుకొని ఉన్న నరనారాయణాశ్రమం, సిద్ధులు, దేవర్షులు పూజించే దివ్యసరోవరం దర్శించాం. (10)
యథాక్రమవిశేషేణ సర్వాణ్యాయతనాని చ ।
దర్శితాని ద్విజశ్రేష్ఠా లోమశేన మహాత్మనా ॥ 11
మహాత్ముడు లోమశుడు యథాక్రమంగా మందిరాల, పుణ్యప్రదేశాల దర్శనం చేయించాడు. (11)
ఇమం వైశ్రవణావాసం పుణ్యం సిద్ధనిషేవితమ్ ।
కథం భీమ గమిష్యామః గతిరంతరధీయతామ్ ॥ 12
ఇది సిద్ధులు సేవించే కుబేరుని నివాస స్థానం. ఇప్పుడు మనం కుబేర భవనంలో ప్రవేశించడానికి ఉపాయం ఆలోచించు. (12)
వైశంపాయన ఉవాచ
ఏవం బ్రువతి రాజేంద్రే వాగువాచాశరీరిణీ ।
న శక్యో దుర్గమో గంతుమ్ ఇతో వైశ్రవణాశ్రమాత్ ॥ 13
వైశంపాయనుడు పలికాడు - ఇలా ధర్మరాజు పలికేసరికి అశరీరవాణి సమాధానం ఇచ్చింది. ఈ కుబేరుని నివాసం నుండి ముందుకు పోవుట అసాధ్యం. (13)
అనేనైవ పథా రాజన్ ప్రతిగచ్ఛ యథాగతమ్ ।
నరనారాయణస్థానం బదరీత్యభివిశ్రుతమ్ ॥ 14
ఏదారిలో నీవు ఇక్కడకు వచ్చావో అదే దారిలో బదరీ అను ప్రఖ్యాతి గల నరనారాయణాశ్రమానికి తిరిగివెళ్ళు. (14)
తస్మాద్ యాస్యసి కౌంతేయ సిద్ధచారణసేవితమ్ ।
బహుపుష్పఫలం రమ్యమ్ ఆశ్రమం వృషపర్వణః ॥ 15
అక్కడి నుంచి నీవు సిద్ధ చారణులు సేవించే చాల పుష్పఫలాలున్న వృషపర్వుని ఆశ్రమం చేరతావు. (15)
అతిక్రమ్య చ తం పార్థ త్వార్ ష్టిషేణాశ్రమే వసేః ।
తతో ద్రక్ష్యసి కౌంతేయ నివేశం ధనదస్య చ ॥ 16
అది దాటి ఆర్ష్టిషేణాశ్రమంలో ఉండు. అక్కడ కుబేరుని నివాసస్థానం దర్శిస్తావు. (16)
ఏతస్మిన్నంతరే వాయుః దివ్యగంధవహః శుచిః ।
సుఖప్రహ్లాదనః శీతః పుష్పవర్షం వవర్ష చ ॥ 17
ఇంతలో దివ్య సుగంధభరితం, పవిత్రం, ఆహ్లాదకరం శీతలం అయిన వాయువు వీస్తూ పుష్పవర్షం కురిసింది. (17)
శ్రుత్వా తు దివ్యామాకాశాద్ వాచం సర్వే విసిస్మియుః ।
ఋషీణాం బ్రాహ్మణానాం చ పార్థివానాం విశేషతః ॥ 18
ఆకాశం నుంచి దివ్యవాణిని విని అందరూ ఆశ్చర్యపోయారు. ఋషులకు బ్రాహ్మణులకు విశేషంగా రాజర్షులకు ఆశ్చర్యం కలిగింది. (18)
శ్రుత్వా తన్మహదాశ్చర్యం ద్విజో ధౌమ్యోఽబ్రవీత్ తదా ।
న శక్యముత్తరం వక్తుమ్ ఏవం భవతు భారత ॥ 19
ఆ ఆశ్చర్యకరమైన మాటల్ని విని ధౌమ్యమహర్షి ఇలా అన్నాడు. దీనికి సమాధానం ఇవ్వటం మనకు సాధ్యంకాదు. ఇలా జరగనివ్వండి. (19)
తతో యుధిష్ఠిరో రాజా ప్రతిజగ్రాహ తద్ వచః ।
ప్రత్యాగమ్య పునస్తం తు నరనారాయణాశ్రమమ్ ॥ 20
భీమసేనాదిభిః సర్వైః భ్రాతృభిః పరివారితః ।
పాంచాల్యా బ్రాహ్మణాశ్చైవ న్యవసంత సుఖం తదా ॥ 21
ఆ మాటలను ధర్మరాజు స్వీకరించి నరనారాయణాశ్రమానికి తిరిగివచ్చి భీమసేనుడు సోదరులతో, ద్రౌపదితో సుఖంగా నివసించాడు.
అతనితో ఉన్న బ్రాహ్మణులు కూడ అతని సంరక్షణలో సుఖంగా ఉన్నారు. (20,21)
ఇథి శ్రీమహాభారతే వనపర్వణి తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం పునర్నరనారాయణాశ్రమాగమనే షట్పంచాశదధికశతతమోఽధ్యాయః ॥ 156 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున తీర్థయాత్రా పర్వము అను ఉపపర్వమున లోమశతీర్థయాత్రలో పునర్నరనారాయణాశ్రమగమనము అను నూట ఏబది ఆరవ అధ్యాయము. (156)