162. నూట అరువది రెండవ అధ్యాయము

కుబేరుడు పాండవులకు ఉపదేశము చేయుట.

ధనద ఉవాచ
యుధిష్ఠిర ధృతిర్దాక్ష్యం దేశకాలపరాక్రమాః ।
లోకతంత్రవిధానానామ్ ఏష పంచవిధో విధిః ॥ 1
కుబేరుడు చెపుతున్నాడు - యుధిష్ఠిరా! ధైర్యము, సమర్థత, దేశము, కాలము, పరాక్రమము; ఈ ఐదు లోకంలో కార్యసిద్ధికి కారణాలు. (1)
ధృతిమమ్తశ్చ దక్షాశ్చ స్వే స్వే కర్మణి భారత ।
పరాక్రమవిధానజ్ఞాః నరా కృతయుగేఽభవన్ ॥ 2
భారతా! కృతయుగమానవులు ధైర్యవంతులు, తమ తమ పనిలో సమర్థులు, పరాక్రమం చూపటం తెలిసినవారుగా ఉండేవారు. (2)
ధృతిమాన్ దేశకాలజ్ఞః సర్వధర్మవిధానవిత్ ।
క్షత్రియః క్షత్రియశ్రేష్ఠ ప్రశాస్తి పృథివీం చిరమ్ ॥ 3
క్షత్రియోత్రమా! ధైర్యం కల్గి దేశకాలాలనెరిగి, అన్ని ధర్మాలను ఎలా ఆచరించాలో తెల్సిన క్షత్రియుడు చాలాకాలం భూమిని పాలిస్తాడు. (3)
య ఏవం వర్తతే పార్థ పురుషః సర్వకర్మసు ।
స లోకే లభతే వీర యశః ప్రేత్య చ సద్గతిమ్ ॥ 4
దేశకాలాంతరప్రేప్సుః కృత్వా శక్రః పరాక్రమమ్ ।
సంప్రాప్తస్త్రిదివే రాజ్యం వృత్రహా వసుభిః సహ ॥ 5
కుంతీకుమారులారా! వీరుడ్! ఏ మానవుడు అన్నిపనులందు ఇలా నడుచుకుంటాడో అతడికీ లోకంలో కీర్తికలుగుతుంది. శరీరాన్ని విడిచిన తరువాత ఉత్తమగతిని పొందుతాడు. దేశకాలాలనెరిగి ఇంద్రుడు వసువులతో కలిసి పరాక్రమం చూపి వృత్రుని చంపి స్వర్గంలో రాజ్యాన్ని పొందాడు. (4,5)
యస్తు కేవలసంరంభాత్ ప్రపాతం న నిరీక్షతే ।
పాపాత్మా పాపబుద్ధిర్యః పాపమేవానువర్తతే ॥ 6
కోపానికి మాత్రం లోనై తన పతనాన్ని గుర్తించని పాపాత్ముడు పాపబుద్ధితో పాపాన్నే అనుసరిస్తాడు. (6)
కర్మణామవిభాగజ్ఞః ప్రేత్య చేహ వినశ్యతి ।
అకాలజ్ఞః సుదుర్మేధాః కార్యాణామవిశేషవిత్ ॥ 7
పనులను వేరుచేసి తెలుసుకోలేనివాడు, సమయం గుర్తించలేనివాడు, చాలా మందబుద్ధి (మొద్దు), చెయ్యతగినపనుల విశిష్టత నెరుగనివాడు, ఈ లోకంలోను పరలోకంలోను నశిస్తాడు. (7)
వృథాఽచారసమారంభః ప్రేత్య చేహ వినశ్యతి ।
సాహసే వర్తమానానాం నికృతీనాం దురాత్మనామ్ ॥ 8
వ్యర్థమైన ప్రవర్తనతో ప్రయత్నించేవాడు తగనిపనిలో తగుల్కొనే, చెడు ప్రవర్తన గల దుర్బుద్ధులు ఈ లోకంలోని పరలోకంలోను నశిస్తారు. (8)
సర్వసామర్థ్యలిప్సూనాం పాపో భవతి నిశ్చయః ।
అధర్మజ్ఞోఽవలిప్తశ్చ బాలబుద్ధిరమర్షణః ॥ 9
నిర్భయో భీమసేనోఽయం తం శాధి పురుషర్షభ ।
అన్నిరకాల సామర్థ్యాలకు ఎగబడేవారికి తప్పక పాపం కలుగుతుంది. పురుషశ్రేష్ఠా! ధర్మం తెలియనివాడు, బలగర్వితుడు, బుద్ధివికాసంలేనివాడు, కోపి, భయంలేనివాడు ఈ భీమసేనుడు. ఇతనిని అదుపుచెయ్యి. (9 1/2)
ఆర్ ష్టిషేణస్య రాజర్షేః ప్రాప్య భూయస్త్వమాశ్రమమ్ ॥ 10
తామిస్రం ప్రథమం పక్షం వీతశోకభయో వస ।
మళ్ళీ రాజర్షి అయిన ఆర్ ష్టిషేణుడి ఆశ్రమాన్ని చేరుకుని నీవు అక్కడ మొదటిదైన కృష్ణపక్షంలో శోకభయాల్లేకుండా నివసించు. (10 1/2)
వి॥ సం॥ ప్రథములు అంటే ముందు పుట్టిన రాక్షసులు. కాబట్టి తామిస్ర పక్షమంటే రాక్షస భయమున్న తామిస్రపక్షమనే అర్థం. కొందరు కృష్ణపక్షంతోనే నెల మొదలవుతుంది కాబట్టి ప్రథమశబ్దానికి కృష్ణ పక్షమని అర్థం చెపుతారు కానీ అది కుదరదు. పూర్వపక్ష - అపరపక్షాలకు క్రమంగా శుక్ల, కృష్ణపక్షాలన్న అర్థంలోనే రూఢి. శ్రౌతక్రియలలో కూడా పూర్ణిమనుండియే యాగారంభం. (నీల)
అలకాః సహ గంధర్వైర్యక్షాశ్చ సహ కిన్నరైః ॥ 11
మన్నియుక్తా మనుష్యేంద్ర సర్వే చ గిరివాసినః ।
రక్షిష్యంతి మహాబాహో సహితం ద్విజసత్తమైః ॥ 12
రాజా! మహాబాహూ! బ్రాహ్మణశ్రేష్ఠులతో కూడియున్న నిన్ను అలకాపట్టణవాసులైన యక్షులు, గంధర్వులు, కిన్నరులతో, ఈ కొండపై ఉండేవారంతా నా ఆజ్ఞచేత కాపాడుతారు. (11,12)
సాహసాదనుసంప్రాప్తః ప్రతిబుధ్య వృకోదరః ।
వార్యతాం సాధ్వయం రాజన్ త్వయా ధర్మభృతాం వర ॥ 13
ధర్మాత్ములలో శ్రేష్ఠుడవైన రాజా! భీముడు దుస్సాహసంతో ఇక్కడకు చేరాడు. అది గమనించి చక్కగా ఇతనిని వారించు. (అడ్డుకో) (13)
అతః పరం చ వో రాజన్ ద్రక్ష్యంతి వనగోచరాః ।
ఉపస్థాస్యంతి వో రాజన్ రక్షిష్యంతే చ వః సదా ॥ 14
రాజా! ఇకమీదట ఈ ఆటవికులు మిమ్మల్ని చూస్తారు. ఎల్లవేళలా సమీపంలో ఉంటారు. రక్షిస్తారు. (14)
తథైవ చాన్నపానాని స్వాదూని చ బహూని చ ।
ఆహరిష్యంతి మత్ర్పేష్యాః సదా వః పురుషర్షభాః ॥ 15
అలాగే పురుషశ్రేష్ఠులైన నా సేవకులు అనేకరుచికరములైన ఆహారపానీయాలను మీకు తెస్తారు. (15)
యథా జిష్ణుర్మహేంద్రస్య యథా వాయోర్వృకోదరః ।
ధర్మస్య త్వం యథా తాత యోగోత్పన్నో నిజః సుతః ॥ 16
ఆత్మజావాత్మసంపన్నౌ యమౌ చోభౌ యథాశ్వినోః ।
రక్ష్యాస్తద్వన్మమాపీహ యూయం సర్వే యుధిష్ఠిర ॥ 17
నాయనా! ఇంద్రుడికి అర్జునుడు లాగా, వాయుదేవుడికి భీముడిలాగా యమధర్మరాజుకు నీవు యోగబలమ్తో పుట్టిన కన్నకొడుకులు. అశ్వినీదేవతలతో సమానులైన ఈ కవలలిద్దరు వారికుమారులు. యుధిష్ఠిరా! మీరంతా కాపాడదగినవారు. నాకు కూడా అలాంటివారే. (16,17)
అర్థతత్త్వవిధ్నజ్ఞః సర్వధర్మవిధానవిత్ ।
భీమసేనాదవరజః ఫాల్గునః కుశలీ దివి ॥ 18
ప్రయోజనస్వరూపాన్నెరిగి మసలుకోవటం తెల్సినవాడు, అన్ని ధర్మాల ఆచరణను ఎరిగినవాడు అయిన భీముని తమ్ముడైన అర్జునుడు స్వర్గంలో కుశలంగా ఉన్నాడు. (18)
యాః కాశ్చన మతా లోకే స్వర్గ్యాః పరమసంపదః ।
జన్మప్రభృతి తాః సర్వాః స్థితాస్తాత ధనంజయే ॥ 19
నాయనా! ఈ లోకంలో ఏవి స్వర్గసంబంధమైన గొప్ప సంపదలుగా తలచబడుతున్నాయో అవన్నీ పుట్టినప్పటి నుండి అర్జునుడిలో ఉన్నాయి. (19)
దమో దానం బలం బుద్ధిః హ్రీర్ధృతిస్తేజ ఉత్తమమ్ ।
ఏతాన్యపి మహాసత్త్వే స్థితాన్యమితతేజసి ॥ 20
బలము, అమితతేజస్సు గల అర్జునుడి యందు మనోనిగ్రహము, దానము, బలము, బుద్ధి, సిగ్గు, ధైర్యము, కాంతి కూడ ఉన్నాయి. (20)
న మోహాత్ కురుతే జిష్ణుః కర్మ పాండవ గర్హితమ్ ।
న పార్థస్య మృషోక్తాని కథయంతి నరా నృషు ॥ 21
పాండవా! అర్జునుడు మోహంతో నిందించతగిన పని చెయ్యడు. మానవులు అర్జునుని అబద్ధమాడినట్లు ఎన్నడూ చెప్పుకోరు. (లేరని భావము) (21)
స దేవపితృగంధర్వైః కురూణాం కీర్తివర్ధనః ।
మానితః కురుతేఽస్త్రాణి శక్రసద్మని భారత ॥ 22
భరతవంశీయుడా! కురువంశీయుల కీర్తిని పెంచే అతడు ఇంద్రుడి భవనంలో దేవతలు, పితృదేవతలు, గంధర్వుల చేత గౌరవింపబడి అస్త్రములను అభ్యసిస్తున్నాడు. (22)
యోఽసౌ సర్వాన్ మహీపాలాన్ ధర్మేణ వశమానయత్ ।
స శాంతనుర్మహాతేజాః పితుస్తవ పితామహః ॥ 23
ప్రీయతే పార్థ పార్థేన దివి గాండీవధన్వనా ।
సమ్యక్ చాసౌ మహావీర్యః కులధుర్యేణ పార్థివః ॥ 24
పార్థా! ధర్మం చేత రాజులందరినీ వశుల్ని చేసుకొన్న, గొప్ప తేజస్సు గల నీ తండ్రికి తాత శాంతనుడు గొప్పపరాక్రమం గల రాజు. అతడు వంశప్రతిష్ఠకారకుడైన అర్జునుడితో స్వర్గంలో చాలా ప్రీతిని పొందుతున్నాడు. (23,24)
పితౄన్ దేవానృషీన్ విప్రాన్ పూజయిత్వా మహాతపాః ।
సప్త ముఖ్యాన్ మహామేధాన్ ఆహరద్ యమునాం ప్రతి ॥ 25
అధిరాజః స రాజంస్త్వాం శాంతనుః ప్రపితామహః ।
స్వర్గజిచ్ఛక్రలోకస్థః కుశలం పరిపృచ్ఛతి ॥ 26
మహాతపస్వియైన ఆ శాంతనుడు పితరులను, దేవతలను, ఋషులను, బ్రాహ్మణులను పూజించి యమునానది వద్ద ప్రధానములైన ఏడు గొప్ప మేధయాగాలను చేశాడు. రాజా! రాజాధిరాజై, స్వర్గాన్ని జయించి, ఇంద్రలోకంలో ఉన్న నీ తాత శాంతనుడు నీ కుశలమడుగుతున్నాడు. (25,26)
వైశంపాయన ఉవాచ
ఏతచ్ర్ఛుత్వా తు వచనం ధనదేన ప్రభాషితమ్ ।
పాండవాశ్చ తతస్తేన బభూవుః సంప్రహర్షితాః ॥ 27
తతః శక్తిం గదాం ఖడ్గం ధనుశ్చ భరతర్షభః ।
ప్రాధ్వం కృత్వా నమశ్చక్రే కుబేరాయ వృకోదరః ॥ 28
వైశంపాయనుడు చెప్తున్నాడు.
కుబేరుడు చెప్పిన ఈ మాటలు విన్న తరువాత పాండవులు చాలా సంతోషించారు. భరతవంశశ్రేష్ఠుడైన భీముడు శక్తి, గద, కత్తి, ధనుస్సులను క్రిందపెట్టి అనుకూలంగా కుబేరుడికి నమస్కరించాడు. (27,28)
తతోఽబ్రవీద్ ధానాధ్యక్ష శరణ్యః శరణాగతమ్ ।
మానహా భవ శత్రూణాం సుహృదాం నంధివర్ధనః ॥ 29
రక్షణకోరిన ఆ భీముడితో రక్షకుడయిన కుబేరుడు "శత్రువులకు గౌరవభాంగాన్ని, స్నేహితులకు ఆనంధవృద్ధిని కలుగచేసేవాడివికమ్ము" అన్నాడు. (29)
స్వేషు వేశ్మసు రమ్యేషు వసతామిత్రతాపనాః ।
కామాన్న పరిహాస్యంతి యక్షా వో భరతర్షభాః ॥ 30
తాపసులైన భరతవంశోత్తములారా! అందమైన మీ నివాసాల్లో నివసించండి. యక్షులు మీరు కోరుకున్న వాటికి అడ్డు తగలరు. (30)
శీఘ్రమేవ గుడాకేశః కృతాస్త్రః పునరేష్యతి ।
సాక్షాన్మఘవతా సృష్టః సంప్రాప్స్యతి ధనంజయః ॥ 31
అర్జునుడు అస్త్రవిద్యనుపొంది స్వయంగా ఇంద్రుడు పంపగా వచ్చి మిమ్మల్ని తొందరలో కలుస్తాడు. (31)
ఏవముత్తమకర్మాణమ్ అనుశిష్య యుధిష్ఠిరమ్ ।
శ్వేతం గిరివరశ్రేష్ఠం ప్రయయౌ గుహ్యకాధిపః ॥ 32
ఇలా ఉత్తమకర్ముడయిన యుధిష్ఠిరుడికి చెప్పి యక్షరాజు కుబేరుడు పర్వతశ్రేష్ఠమయిన కైలాసానికి బయలుదేరాడు. (32)
తం పరిస్తోమసంకీర్ణైః నానారత్నవిభూషితైః ।
యానైరనుయయుర్యక్షాః రాక్షసాశ్చ సహస్రశః ॥ 33
రంగురంగుల తివాసీలు పరచబడి, అనేక రత్నాలతో అలంకరించబడిన వాహనాలలో వేలకొలది యక్షరాక్షసులు అతనిని అనుసరించారు. (33)
పక్షిణామివ నిర్ఘోషః కుబేరసదనం ప్రతి ।
బభూవ పరమాశ్వానామ్ ఐరావతపథే యథా ॥ 34
ఐరావతం వెళ్ళే ఇంద్రుడి పట్టణమార్గంలో లాగా కుబేరుడి భవనం వైపు సాగే మేలుజాతి గుర్రాల చప్పుడు ఎగిరే పక్షుల చప్పుడులా ఉంది. (34)
తే జగ్ముస్తూర్ణమాకాశం ధనాధిపతివాజినః ।
ప్రకర్షంత ఇవాభ్రాణి పిబంత ఇవ మారుతమ్ ॥ 35
మేఘాలను లాగుతున్నాయా! అన్నట్లు గాలిని త్రాగుతున్నాయా! అన్నట్లు! ఆ కుబేరుని గుర్రాలు వెంటనే ఆకాశానికి ఎగిరాయి. (35)
తతస్తాని శరీరాణి గతసత్త్వాని రక్షసామ్ ।
అపాకృష్యంత శైలాగ్రాద్ ధనాధిపతిశాసనాత్ ॥3 6
కుబేరుడి ఆజ్ఞవల్ల కొండపైన ప్రాణాలు విడచిన రాక్షసుల శరీరాలు తొలగించబడ్డాయి. (36)
తేషాం హి శాపకాలః స కృతోఽగస్త్యేన ధీమతా ।
సమరే నిహతాస్తస్మాత్ శాపస్యాంతోఽభవత్ తదా ॥ 37
పాండవాశ్చ మహాత్మానస్తేషు వేశ్మసు తాం క్షపామ్ ।
సుఖమూషుర్గతోద్వేగాః పూజితాః సర్వరాక్షసైః ॥ 38
బుద్ధిమంతుడైన అగస్త్యునిచేత వారికి శాపమెంతవరకో నిర్ణయించబడింది. వారంతా యుద్ధంలో చంపబడ్డారు. అప్పుడు వారికి శాపం తొలగిపోయింది. మహాత్ములైన పాండవులూ ఆ రాత్రి తమనివాసాల్లో రాక్షసులందరిచే పూజింపబడుతూ ఆందోళన లేకుండా సుఖంగా గడిపారు. (37-38)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి యక్షయుద్ధపర్వణి కుబేరవాక్యే ద్విషష్ట్యధికశతతమోఽధ్యాయః ॥ 162 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున యక్షయుద్ధపర్వమను ఉపపర్వమున కుబేరవాక్యమను నూట అరువది రెండవ అధ్యాయము. (162)