163. నూట అరువది మూడవ అధ్యాయము

ధౌమ్యుడు ధర్మజునకు బ్రహ్మాదుల స్థానములను చూపుట.

వైశంపాయన ఉవాచ
తతః సూర్యోదయే ధౌమ్యః కృత్వాఽఽహ్నికమరిందమ ।
ఆర్ ష్టిషేణేన సహితః పాండవానభ్యవర్తత ॥ 1
తరువాత సూర్యోదయకాలంలో అనుష్ఠానమును ముగించుకొని ధౌమ్యుడు ఆర్ ష్టిషేణుడితో కలిసి పాండవుల వద్దకు వచ్చాడు. (1)
తేఽభివాద్యార్ ష్టిషేణస్య పాదౌ ధౌమ్యస్య చైవ హ ।
తతః ప్రాంజలయః సర్వే బ్రాహ్మణాంస్తానపూజయన్ ॥ 2
వారందరూ ఆర్ ష్టిషేణ, ధౌమ్యులపాదములకు నమస్కరించి, చేతులు జోడించి ఆ బ్రాహ్మాణులను పూజించారు. (2)
తతో యుధిష్ఠిరం ధౌమ్యః గృహీత్వా దక్షిణే కరే ।
ప్రాచీం దిశమభిప్రేక్ష్య మహర్షిరిదమబ్రవీత్ ॥ 3
అపుడు ధౌమ్యమహర్షి యుధిష్ఠిరుని కుడిచేయి పట్టుకుని తూర్పుదిక్కువైపు చూస్తూ ఇలా అన్నాడు. (3)
అసౌ సాగరపర్యంతాం భూమిమావృత్య తిష్ఠతి ।
శైలరాజో మహారాజ మందరోఽతి విరాజతే ॥ 4
మహారాజా! పర్వతములకు రాజైన ఈ మందరపర్వతం సముద్రం దాకా గల భూమినావరించి ఉన్నది. (4)
ఇంద్రవైశ్రవణావేతాం దిశం పాండవ రక్షతః ।
పర్వతైశ్చ వనాంతైశ్చ కాననైశ్చ సుశోభితామ్ ॥ 5
పాండవా! కొండలు అడవిమధ్య భూములు, అడవులతో శోభిల్లే ఈ దిక్కును ఇంద్రకుబేరులు రక్షించుతున్నారు. (5)
ఏతదాహుర్మహేంద్రస్య రాజ్ఞో వైశ్రవణ్స్య చ ।
ఋషయః సర్వధర్మజ్ఞాః సద్మ తాత మనీషిణః ॥ 6
అతశ్చోద్యంతమాదిత్యమ్ ఉపతిష్ఠంతి వై ప్రజాః ।
ఋషయశ్చాపి ధర్మజ్ఞాః సిద్ధాః సాధ్యాశ్చ దేవతాః ॥ 7
నాయనా! అన్ని ధర్మములను ఎరిగిన, మేధావులైన ఋషులు ఈ చోటును ఇంద్ర, కుబేరుల నివాసమంటారు. ఇక్కడ ఉదయించే సూర్యుని ప్రజలు, ధర్మజ్ఞులయిన ఋషులు, సిద్ధులు, సాధ్యులు, దేవతలు ఉపాసిస్తున్నారు. (6,7)
యమస్తు రాజా ధర్మజ్ఞః సర్వప్రాణభృతాం ప్రభుః ।
ప్రేతసత్త్వగతిం హ్యేనాం దక్షిణామాశ్రితో దిశమ్ ॥ 8
ప్రాణులందరినీ నియమించే యమధర్మరాజు మరణించిన ప్రాణులమార్గమైన ఈ దక్షిణ దిక్కున ఉన్నాడు. (8)
ఏతత్ సంయమనం పుణ్యమ్ అతీవాద్భుతదర్శనమ్ ।
ప్రేతరాజస్య భవనమ్ ఋద్ధ్యా పరమయా యుతమ్ ॥ 9
సంయమున మనబడే ఈ ప్రేతరాజు (యముని) భవనము పవిత్రమైనది. చూడటానికెంతో అద్భుతమైనది. సర్వసమృద్ధమయినది. (9)
యం ప్రాప్య సవితా రాజన్ సత్యేన ప్రతితిష్ఠతి ।
అస్తం పర్వతరాజానమ్ ఏతమాహుర్మనీషిణః ॥ 10
ఏతం పర్వతరాజానం సముద్రం చ మహోదధిమ్ ।
ఆవసన్ వరుణో రాజా భూతాని పరిరక్షతి ॥ 11
రాజా! మేధావులు ఈ పర్వతరాజమును అస్తాచలమంటారు. ఇక్కడికి చేరి సూర్యుడు సత్యంచేత ప్రతిష్ఠితుడౌతాడు. ఈ పర్వతరాజం మీద, జలంతో నిండిన సముద్రంలోను నివసిస్తూ రాజైన వరుణుడు ప్రాణులను కాపాడుతున్నాడు. (10,11)
ఉదీచీం దీపయన్నేవ దిశం తిష్ఠతి వీర్యవాన్ ।
మహామేరుర్మహాభాగ శివో బ్రహ్మవిదాం గతిః ॥ 12
మహాభాగా! శక్తిమంతమూ, శుభకరమూ, బ్రహ్మవేత్తలకు ఆశ్రయమూ అయిన ఈ మేరుపర్వతం ఉత్తరదిక్కును ప్రకాశింపచేస్తున్నది. (12)
యస్మిన్ బ్రహ్మసదశ్చైవ భూతాత్మా చావతిష్ఠతే ।
ప్రజాపతిః సృజన్ సర్వం యత్ కించిజ్జంగమాగమమ్ ॥ 13
దానియందే బ్రహ్మదేవుని సభ ఉంది. ప్రాణులకాత్మయైన బ్రహ్మ కదిలే ప్రాణులను, కదలని ప్రాణులనూ అన్నింటినీ ఇక్కడనుండి సృష్టిస్తున్నాడు. (13)
యానాహుర్ర్బహ్మణః పుత్రాన్ మానసాన్ దక్షసప్తమాన్ ।
తేషామపి మహామేరుః శివం స్థానమనామయమ్ ॥ 14
దక్షుడు ఏడవవాడుగా గల బ్రహ్మమానసపుత్రులకు కూడ ఈ మహామేరుపర్వతం కుశలము, సుఖము కలిగించే చోటు. (14)
అత్రైవ ప్రతితిష్ఠంతి పునరేవోదయంతి చ ।
సప్త దేవర్షయస్తాత వసిష్ఠప్రముఖాః సదా ॥ 15
నాయనా! వసిష్ఠుడు మొదలైన దేవర్షు లేడుగురు ఎల్లప్పుడూ ఇక్కడ ప్రజాపతిలో లీనమౌతారు. మళ్ళి ఉదయిస్తారు. (15)
దేశం విరజసం పశ్య మేరోః శిఖరముత్తమమ్ ।
యత్రాత్మతృప్తైరధ్యాస్తే దేవైః సహ పితామహః ॥ 16
ఉత్తమమైన మేరుపర్వతశిఖరాన్ని చూడు. అది రజోగుణము కలుగని చోటు. అక్కడ ఆథ్మతృప్తి కల దేవతలతో కలసి బ్రహ్మ నివసిస్తాడు. (16)
యమాహుః సర్వభూతానాం ప్రకృతేః ప్రకృతిం ధ్రువమ్ ।
అనాదినిధనం దేవం ప్రభుం నారాయణం పరమ్ ॥ 17
బ్రహ్మణః సదనాత్ తస్య పరం స్థానం ప్రకాశతే ।
దేవా అపి న పశ్యంతి సర్వతేజోమయం శుభమ్ ॥ 18
అత్యర్కానలదీప్తం తత్ స్థానం విష్ణోర్మహాత్మనః ।
స్వయైవ ప్రభయా రాజన్ దుష్ర్పేక్ష్యం దేవదానవైః ॥ 19
ప్రాణులన్నింటికి, ప్రకృతికి శాశ్వతమైన కారణము; మొదలు, తుదిలేనివాడు, పరమప్రభువు అయిన దేవుని నారాయణుడంటారు. అతడి ఉత్తమమైన స్థానము బ్రహ్మలోకంకంటే ఆవల ప్రకాశిస్తోంది. వెలుగులన్నింటి సమూహము, శుభస్వరూపము, దేవతలకు కూడ కానరానిది. సూర్యుడు, అగ్నులకంటె అధికమైన తేజస్సు గల ఆస్థానం పరమాత్మ విష్ణువుది. రాజా! స్వయంగా ప్రకాశించే ఆ చోటు దేవదానవులకు కానరాదు. (17-19)
ప్రాచ్యాం నారాయణస్థానం మేరావతివిరాజతే ।
యత్ర భూతేశ్వరస్తాత సర్వప్రకృతిరాత్మభూః ॥ 20
భాసయన్ సర్వభూతాని సుశ్రియాభివిరాజతే ।
నాత్ర బ్రహ్మర్షయస్తాత కుత ఏవ మహర్షయః ॥ 21
ప్రాప్నువంతి గతిం హ్యేతం యతీనాం భావితాత్మనామ్ ।
న తం జ్యోతీంషి సర్వాణి ప్రాప్య భాసంతి పాండవ ॥ 22
నాయనా! తూర్పున మేరుపర్వతం మీద జీవులందరకు ప్రభువు, అన్నిటికీ కారణము తనకు తానుగా పుట్టిన నారాయణుని సన్నిధి ఎంతో ప్రకాశిస్తోంది. చక్కని తేజస్సుతో ప్రకాశించే నారాయణుడు అన్ని ప్రాణులను ప్రకాశింపచేస్తున్నాడు. జ్ఞానులైన యతులు (సన్యాసులు) తప్ప ఈ మార్గమును బ్రహ్మర్షులే చేరుకోలేరు. మహర్షులెలా చేరుకుంటారు? పాండవా! సూర్యచంద్రాదిజ్యోతులన్ని ఆ మహాజ్యోతి రూపుడైన నారాయణుని ముందు ప్రకాశించవు. (20-22)
వి॥సం॥ సోపాధికకార్యమంతా విష్ణువునందే అంతర్లీనమవుతుందని వైదిక సిద్ధాంతం. అప్పుడు విష్ణుస్థానం దానికన్న పైన అనటమెలా కుదురుతుంది? సమాధానమిది. బ్రహ్మవిష్ణు స్థానాల తారతమ్యం మేరువునందే కానీ దేశవిశేషవిభాగానికి సంబంధించినది కాదు. దీనిని బట్టి పౌరాణికంగా కూడా విష్ణులోకం నుండి మరలివారు అని వ్యవహారం. (నీల)
స్వయం ప్రభురచింత్యాత్మా తత్ర హ్యతివిరాజతే ।
యతయస్తత్ర గచ్ఛంతి భక్త్యా నారాయణం హరిమ్ ॥ 23
సాక్షాత్తు మన భావమునకు కూడ అందని పరమాత్మ అక్కడ ప్రకాశిస్తూంటాడు. భక్తి వల్ల యతులు అక్కడ పాపాలను హరించే నారాయణుని చేరుకుంటారు. (23)
పరేణ తపసా యుక్తాః భావితాః కర్మభిః శుభైః ।
యోగసిద్ధా మహాత్మానః తమోమోహవివర్జితాః ॥ 24
తత్ర గత్వా పునర్నేమం లోకమాయాంతి భారత ।
స్వయంభువః మహాత్మానం దేవదేవం సనాతనమ్ ॥ 25
భారతా! గొప్ప తపస్సుకలవారు, పుణ్యకర్మలచే పవిత్రులైనవారు, యోగసిద్ధులు, మహాత్ములు, అజ్ఞానము, మోహము తొలగినవారు అక్కడకు చేరుకుని మరల తిరిగి ఈ లోకమునకు రారు. తానుగా ఏర్పడిన మహాత్ముడు, దేవదేవుడు, శాశ్వతుడు అయిన నారాయణునిలో లీనమౌతారు. (24,25)
స్థానమేతన్మహాభాగ ధ్రువమ్ అక్షయమవ్యయమ్ ।
ఈశ్వరస్య సదా హ్యేతత్ ప్రణమాత్ర యుధిష్ఠిర ॥ 26
యుధిష్ఠిరా! తిరుగులేని శాశ్వతమైన ఈ స్థానము ఎల్లప్పుడూ ఈశ్వరనివాసము. ఇక్కడ నుండి నమస్కరించు. (26)
ఏనం త్వహరహర్మేరుం సూర్యాచంద్రమసౌ ధ్రువమ్ ।
ప్రదక్షిణముపావృత్య కురుతః కురునందన ॥ 27
జ్యోతీంషి చాప్యశేషేణ సర్వాణ్వనఘ సర్వతః ।
పరియాంతి మహారాజ గిరిరాజం ప్రదక్షిణమ్ ॥ 28
కురునందనా! సూర్యచంద్రులు ప్రతిదినము నిశ్చలమైన ఈ మేరువుకు ప్రదక్షిణం చేస్తుంటారు. మహారాజా! నక్షత్రాలన్నీ కూడ పర్వతరాజైన మేరువును మొత్తం విడువక ప్రదక్షిణం చేస్తాయి. (27,28)
ఏతం జ్యోతీంషి సర్వాణి ప్రకర్షన్ భగనానపి ।
కురుతే వితమస్కర్మా ఆదిత్యోఽభిప్రదక్షిణమ్ ॥ 29
వెలుగులన్నింటిని తనవైపు లాగుకొని, చీకటిని పారద్రోలే సూర్యభగవానుడు కూడ ఈ మేరువుకు ప్రదక్షిణం
చేస్తున్నాడు. (29)
అస్తం ప్రాప్య తతః సంధ్యామ్ అతిక్రమ్య దివాకరః ।
ఉదీచీం భజతే కాష్ఠాం దిశమేష విభావసుః ॥ 30
స మేరుమనువృత్త సన్ పునర్గచ్ఛతి పాండవ ।
ప్రాజ్ఞ్ముఖః సవితా దేవః సర్వబూతహితే రతః ॥ 31
తరువాత్ అస్తమించిన సూర్యుడు సంధ్యాకాలం తరువాత ఉత్తరదిక్కును పొందుతాడు. పాంఅవా! సూర్యభగవానుడు మేరువును అనుసరిస్తూ మళ్ళీ ప్రాణికోటికంతకూ మేలుకోరి తూర్పునకు మళ్ళుతాడు. (30,31)
స మాసాన్ విభజన్ కాలే బహుధా పర్వసింధిషు ।
తథైవ భగవాన్ సోమో నక్షత్రైః సహ గచ్ఛతి ॥ 32
అలాగే చంద్రభగవానుడు నక్షత్రాలతో కలసి మేరువుకు ప్రదక్షిణం చేస్తాడు. పర్వదినాల సంధికాలంలో వేర్వేరు మాసములను విడగొడతారు. (32)
ఏవమేతం త్వతిక్రమ్య మహామేరుమతంద్రితః ।
భావయన్ సర్వభూతాని పునర్గచ్ఛతి మందరమ్ ॥ 33
తథా తమిస్రహా దేవో మయూఖైర్భావయం జగత్ ।
మార్గమేతదసంబాధమ్ ఆదిత్యః పరివర్తతే ॥ 34
ఈవిధంగా సోమరితనం లేకుండా ఈ మహామేరువును దాటుకుని ప్రాణులన్నింటిని తలౌచుకుంటూ మళ్ళీ మందరపర్వతం వైపు వెళతాడు. అలాగే చీకట్లను పారద్రోలే సూర్యభగవానుడు తనకిరణాలతో ఈ జగత్తును పాళిస్తూ బాధలేని ఈ మార్గంలో తిరుగుతూ ఉంటాడు. (33,34)
సిసృక్షుః శిశిశ్రాణ్యేవ దక్షిణాం భజతే దిశమ్ ।
తతః సర్వాణి భూతాని కాలోఽభ్యర్చ్ఛుతి శైశిరః ॥ 35
చల్లదనం సృష్టించదలచి దక్షిణదిక్కును చేరుకుంటాడు. వాని వలల్ ప్రాణులన్నీ శీతకాల ప్రభావాన్ని పొందుతాయి. (35)
స్థావరాణాం చ భూతానాం జంగమానాం చ తేజసా ।
తేజాంసి సముపాదత్తే నివృత్తః స విభావసుః ॥ 36
తతః స్వేదక్లమౌ తంద్రీ గ్లానిశ్చ భజతే నరాన్ ।
ప్రాణిభిః సతతం స్వప్నః హ్యభీక్ష్ణం చ నిషేవ్యతే ॥ 37
ఏవమేతదనిర్దేశ్యం మార్గమావృత్య భానుమాన్ ।
పునః సృజతి వర్షాణి భగవాన్ భావయన్ ప్రజాః ॥ 38
ఆ సూర్యుడు దక్షిణాయనము నుండి మరలి తన తేజస్సుతో కదిలీ, కదలని ప్రాణుల తేజస్సులను గ్రహిస్తాడు. ఆ కారణం చేత చెమట, అలసట, కునికిపాట్లు, దిగులు మానవులకు కలుగుతాయి. ప్రాణులెల్లప్పుడూ మాటిమాటికి నిద్రపోతూంటారు. ఈవిధంగా అంతరిక్షమార్గాన్ని ఆవరించి సూర్యభగవానుడు ప్రజల పుష్టిని కోరుతూ మళ్ళీ వర్షాన్ని సృష్టిస్తాడు. (36-38)
వృష్టిమారుతసంతాపైః సుఖైః స్థావరజంగమాన్ ।
వర్ధయన్ సుమహాతేజాః పునః ప్రతినివర్తతే ॥ 39
చాలా గొప్ప తేజస్వి అయిన సూర్యుడు వర్షం, గాలి, తాపం అనే సుఖాలతో కదిలే, కదలని జీవరాశులకు పుష్టినిస్తూ మళ్ళీ తన స్థానానికి చేరుకుంటాడు. (39)
ఏవమేష చరన్ పార్థ కాలచక్రమతంద్రితః ।
ప్రకర్షన్ సర్వభూతాని సవితా పరివర్తతే ॥ 40
కుంతీకుమారా! ఇలా సూర్యభగవానుడు ఏమరుపాటు లేకుండా ప్రాణులన్నింటిని ఆకర్షించడం, పోషించడం చేస్తూ, తిరుగుతూ కాలచక్రాన్ని త్రిప్పుతున్నాడు. (40)
సంతతా గతిరేతస్య నైష తిష్ఠతి పాండవ ।
ఆదాయైవ తు భూతానాం తేజో విసృజతే పునః ॥ 41
విభజన్ సర్వభూతానామ్ ఆయుః కర్మ చ భారత ।
అహోరాత్రం కలాః కాష్ఠాః సృజత్యేష సదా విభుః ॥ 42
పాండవా! ఈ సుర్యగమనం నిరంతరం సాగుతుంది. ఆగదు. ఇతడు ప్రాణుల నుండి తేజస్సును గ్రహించి మళ్ళీ వర్సరూపంలో ఇస్తాడు.
భరతవంశీయుడా! ప్రభువైన సూర్యుడు ప్రాణులన్నింటి ఆయుర్దాయము, కర్మలను విడగొట్టుతూ రాత్రి-పగలు, కలా-కాష్ఠ వంటి కాలాన్ని ఎప్పుడూ కపిస్తుంటాడు. (41,42)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి యక్షయుద్ధపర్వణి మేరుదర్శనే త్రిషష్ట్యధికశతతమోఽధ్యాయః ॥ 163 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున యక్షపర్వమను ఉపపర్వమున మేరుదర్శనమను నూట అరువది మూడవ అధ్యాయము. (163)