164. నూట అరువది నాలుగవ అధ్యాయము

అర్జునుడు పాండవుల కడకు వచ్చుట.

వైశంపాయన ఉవాచ
తస్మిన్ నగేంద్రే వసతాం తే తేషాం
మహాత్మనాం సద్ర్వతమాస్థితానామ్ ।
రతిః ప్రమోదశ్చ బభూవ తేషామ్
ఆకాంక్షతాం దర్శనమర్జునస్య ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు - శ్రేష్ఠమైన ఆ పర్వతం మీద నివసిస్తూ ఉత్తమమైన నియమం పాటిస్తూ అర్జునుని చూడాలనే కాంక్ష గల మహాత్ములైన పాండవుల మనస్సుల్లో ఎంతో ప్రేమ, ఆనందమూ కలిగాయి. (1)
తాన్ వీర్యయుక్తాన్ సువిశుద్ధకామాః
తేజస్వినః సత్యధృతిప్రధానాన్ ।
సంప్రీయమాణా బహవోఽభిజగ్ముః
గంధర్వసంఘాశ్చ మహర్షయశ్చ ॥ 2
పరాక్రమవంతులు, ఎంతో పరిశుద్ధమైన కోర్కెలు గల కాంతిమంతులు, సత్యం ధైర్యం ప్రధానగా గల వారి పట్ల ప్రేమతో గంధర్వులు మహర్షులు సమూహాలుగా వస్తున్నారు. (2)
తం పాదపైః పుష్పధరైరుపేతం
నగోత్తమం ప్రాప్య మహారథానామ్ ।
మనః ప్రసాదః పరమో బభూవ
యథా దివం ప్రాప్య మరుద్గణానామ్ ॥ 3
పూచినచెట్లు గల ఉత్తమమైన పర్వతం చేరిన ఆ మహారథులకు స్వర్గమును చేరిన మరుద్గణాలకు వలె మనసెంతో ప్రసన్నమైంది. (3)
మయూరహంశస్వననాదితాని
పుష్పోపకీర్ణాని మహాచలస్య ।
శృంగాణి సానూని చ పశ్యమానా
గిరేః పరం హర్షమవాప్య తస్థుః ॥ 4
ఆ గొప్పపర్వతశిఖరాలు, చరియలు నెమళ్ల ధ్వనులతో హంసల ధ్వనులతో మ్రోగుతున్నాయి. పూలతో వ్యాఫించాయి. వాఠిని చూస్తూ పాండవులు ఎంతో సంతోషాన్ని పొంది అక్కడ నివసించసాగారు. (4)
సాక్షాత్ కుబేరేణ కృతాశ్చ తస్మిన్
నగోత్తమే సంవృతకూలరోధసః ।
కాదబకారండవహంసజుష్టాః
పద్మాకులాః పుష్కరిణీరపశ్యన్ ॥ 5
ఆ ఉత్తమమైన పర్వతం మీద స్వయంగా కుబేరుడిచే నిర్మించబడిన సరస్సులను చూశారు. వాటిప్రవాహం, ఒడ్డు నాచుతో కప్పబడినాయి. వాటిని ధూమ్రవర్ణపు ముక్కు, కాళ్ళు గల హంసలు, కన్నె లేళ్ళు, హంసలు సేవిస్తున్నాయి. తామరలతో నిండి ఉన్నాయి. (5)
క్రీడాప్రదేశాంశ్చ సమృద్ధరూపాన్
సుచిత్రమాల్యావృతజాతశోభాన్ ।
మణిప్రకీర్ణాంశ్చ మనోరమాంశ్చ
యథా భవేయుర్ధనదస్య రాజ్ఞః ॥ 6
కుబేరుని క్రీడాప్రాంగణాల వలె అన్ని హంగులూ కల విచిత్రములైన మాలలచే అలంకరింపబడటం చేత శోభను సంతరించుకొని మణులు పొదగబడి మనోరంజకంగా ఉన్న క్రీడామైదానాలను పాండవులు చూశారు. (6)
అనేకవర్ణైశ్చ సుగంధిభిశ్చ
మహాద్రుమైః సంతతమభ్రజాలైః ।
తపః ప్రధానాః సతతం చరంతః
శృంగం గిరేశ్చింతయితుం న శేకుః ॥ 7
నిరంతరం తపోనిష్ఠులయి తిరుగుతున్న ఆ పాండవులు చాలా రంగులతో, సువాసనలతో నున్న పెద్దచెట్లు, మేఘాలగుంపులతోను నిండిన ఆపర్వతశిఖరం యొక్క వైభవాన్ని ఊహించలేకపోయారు. (7)
స్వతేజసా తస్య నగోత్తమస్య
మహౌషధీనాం చ తథా ప్రభావాత్ ।
విభక్తభావో న బభూవ కశ్చిద్
అహోనిశానాం పురుషప్రవీర ॥ 8
ఆ పర్వతశ్రేష్ఠము యొక్క కాంతిచేత, ఓషధుల ప్రభావం చేత ఏర్పడ్డ ప్రకాశం వల్ల రాత్రింబవళ్ళను వేరు చెయ్యలేని స్థితి ఏర్పడింది. (8)
యమాస్థితః స్థావరజంగమాని
విభావసుర్భావయతేఽమితౌజాః ।
తస్యోదయం చాస్తమనం చ వీరాః
తత్ర స్థితాస్తే దదృశుర్నృసింహాః ॥ 9
పురుషసింహాలైన ఆ వీరులు అక్కడ నుండి చరాచరజీవకోటిని పోషించే అమితతేజస్సు గల అగ్నికి ఆశ్రయమైన సూర్యుని ఉదయాస్తమయాలను చక్కగా చూసేవారు. (9)
రవేస్తమిస్రాగమనిర్గమాంస్తే
తథోదయం చాస్తమనం చ వీరాః ।
సమావృతాః ప్రేక్ష్య తమోనుదస్య
గభస్తిజాలైః ప్రదిశో దిశశ్చ ॥ 10
స్వాధ్యాయవంతః సతతక్రియాశ్చ
ధర్మప్రధానాశ్చ శుచివ్రతాశ్చ ।
సత్యే స్థితాస్తస్య మహారథస్య
సత్యవ్రతస్యాగమనప్రతీక్షాః ॥ 11
వీరులైన వారక్కడి నుండి చీకటిరాకపోకలను, చీకట్లను పారద్రోలే సూర్యుని ఉదయాస్తమయాలను, సూర్యకిరణసమూహాలతో నిండిన దిక్కులు, మూల లన్నింటిని చూస్తూ ధర్మమే ప్రధానంగా, పవిత్రమైన ఆచరణంతో అనుష్ఠానంతో సత్యమైన ఆచరణ గల ఆ అర్జునుని రాకకు ఎదురు చూస్తున్నారు. (10,11)
ఇహైవ హర్షోఽస్తు సమగతానాం
క్షిప్రం కృతాస్త్రేణ ధనంజయేన ।
ఇతి బ్రువంతః పరమాశిషస్తే
పార్థాస్తపోయోగపరా బభూవుః ॥ 12
ఇక్కడకు చేరుకున్న మనకు తొందరలో అస్త్రవిద్యను సిద్ధింపచేసుకుని వస్తున్న అర్జునుడి దర్శనం చేత సంతోషం కలగాలి అని శుభాకాంక్షలను వ్యక్తం చేసుకుంటూ ఆ కుంతీ కుమారులు తపస్సు, యోగముల సాధనలో నిమగ్నమయ్యారు. (12)
దృష్ట్వా విచిత్రాణి గిరౌ వనాని
కిరీటినం చింతయతామభీక్ష్ణమ్ ।
బభూవ రాత్రిర్దివసశ్చ తేషాం
సంవత్సరేణైవ సమానరూపః ॥ 13
ఆ కొండమీద విచిత్రములైన అడవులను చూసి అర్జునుని తరచూ తలచుకుంటున్న వాళ్ళకు ఒక్కరాత్రి, పగలూ సంవత్సరంతో సమానమయ్యాయి. (13)
యదైవ ధౌమ్యానుమతే మహాత్మా
కృత్వా జటాం ప్రవ్రజితః స జిష్ణుః ।
తదైవ తేషాం న బభూవ హర్షః
కుతో రతిస్తద్గతమానసానామ్ ॥ 14
ధౌమ్యుడి అనుమతితో మహాత్ముడైన ఆ అర్జునుడు జడలను ధరించి తపస్సుకై వెళ్ళినప్పటి నుండి వారి మనసులో సంతోషం లేదు. ఇక అతడిపైనే మనసంతా పెట్టుకున్న వాళ్ళకు సుఖమెక్కడిది? (14)
భ్రాతుర్నియోగాత్ తు యుధిష్ఠిరస్య
వనాదసౌ వారణమత్తగామీ ।
యత్ కామ్యకాత్ ప్రవ్రజితః స జిష్ణుః
తదైవ తే శోకహతా బభూవుః ॥ 15
గజరాజుఠీవితో నడిచే ఆ అర్జునుడు తన అన్న యుధిష్ఠిరుడి ఆజ్ఞవల్ల కామ్యకవనం నుండి బయలుదేరిన నాటి నుండి వారు శోకపీడితులయ్యారు. (15)
తథైవ తం చింతయతాం సితాశ్చ
మస్త్రార్థినం వాసవమభ్యుపేతమ్ ।
మాసోఽథ కృచ్ఛేణ తదా వ్యతీతః
తస్మిన్ నగే భారత భారతానామ్ ॥ 16
భారతా! అస్త్రములను పొందగోరి ఇంద్రుడిని సమీపించిన అర్జునుని గూర్చి అలానే ఆలోచిస్తున్న పాండవులకు అప్పుడు ఆ పర్వతం మీద అతికష్టంతో ఒక నెల గడిచింది. (16)
ఉషిత్వా పంచ వర్షాణి సహస్రాక్షనివేశనే ।
అవాప్య దివ్యాన్యస్త్రాణి సర్వాణి విబుధేశ్వరాత్ ॥ 17
ఆగ్నేయం వారుణం సౌమ్యం వాయవ్యమథ వైష్ణవమ్ ।
ఐంద్రం పాశుపతం బ్రాహ్మం పారమేష్ఠ్యం ప్రజాపతేః ॥ 18
యమస్య ధాతుః సవితుః త్వష్టుర్వైశ్రవణస్య చ ।
తాని ప్రాప్య సహస్రాక్షాద్ అభివాద్య శతక్రతుమ్ ॥ 19
అనుజ్ఞాతస్తదా తేన కృత్వా చాపి ప్రదక్షిణమ్ ।
ఆగచ్ఛదర్జునః ప్రీతః ప్రహృష్టో గంధమాదనమ్ ॥ 20
ఇంద్రుడి భవనంలో ఐదేళ్ళుండి దేవతలకు రాజైన ఇంద్రుని వల్ల ఆగ్నేయము, వారుణము, సౌమ్యము, వాయువ్యము, వైష్ణవము, ఐంద్రము, పాశుపతము, బ్రాహ్మము, పారమేష్ఠ్యము, యమ, బ్రహ్మ, సూర్య, త్వష్ట, కుబేరులకు చెందిన అన్ని దివ్యములైన అస్త్రాలను పొంది ఇంద్రునికి నమస్కరించి, ప్రదక్షిణం చేసి ఆయన అనుమతి పొంది అర్జునుడు ఎంతో ప్రసన్నతను పొంది చాలా సంతోషంతో గంధమాదన పర్వతానికి వచ్చాడు. (17-20)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి యక్షయుద్ధపర్వణ్యర్జునాభిగమనే చతుఃషష్ట్యధికశతతమోఽధ్యాయః ॥ 164 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున యక్షయుద్ధపర్వమను ఉపపర్వమున అర్జునాభిగమనమను నూట అరువది నాలుగవ అధ్యాయము. (164)