167. నూట అరువది ఏడవ అధ్యాయము
పాశుపతాస్త్ర ప్రాప్తిని గురించి అర్జునుడు వివరించుట.
వైశంపాయన ఉవాచ
యథాగతం గతే శక్రే భ్రాతృభిః సహ సంగతః ।
కృష్ణయా చైవ బీభత్సుః ధర్మపుత్రాపూజయత్ ॥ 1
వచ్చినదోవనే ఇంద్రుడు వెళ్ళగా అర్జునుడు సోదరులతో ద్రౌపదితో కలిసి ధర్మరాజును పూజించాడు. (1)
అభివాదయమానం తం మూర్ధ్న్యుపాఘ్రాయ పాండవమ్ ।
హర్షగద్గదయా వాచా ప్రహృష్టోఽర్జునమబ్రవీత్ ॥ 2
నమస్కరిస్తున్న ఆ పాండవుడైన అర్జునుడి తలపై మూర్కొని ధర్మరాజు చాలా సంతోషాన్ని పొంది గద్గదస్వరంతో ఇలా అన్నాడు. (2)
కథమర్జున కాలోఽయం స్వర్గే వ్యతిగతస్తవ ।
కథం చాస్త్రాణ్యవాప్తాని దేవరాజశ్చ తోషితః ॥ 3
అర్జునా! నీకు స్వర్గంతో కాలమెలా గడిచింది? ఎలా అస్త్రాలు పొందావు? దేవరాజైన ఇంద్రుని ఎలా సంతోషపెట్టావు? (3)
సమ్యగ్ వా తే గృహీతాని కచ్చిదస్త్రాణి పాండవ ।
కచ్చిత్ సురాధిపః ప్రీతో రుద్రో వాస్త్రాణ్యదాద్ తవ ॥ 4
పాండవా! అస్త్రాలను చక్కగా గ్రహించావా? సంతోషించిన ఇంద్రుడూ, శివుడూ నీకు అస్త్రాలనిచ్చారా? (4)
యథా దృష్టశ్చ తే శక్రో భగవాన్ వా పినాకధృక్ ।
యథైవాస్త్రాణ్యవాప్తాని యథైవారాధితశ్చ తే ॥ 5
ఇంద్రుడూ, భగవానుడైన శివుడూ నీకెలా కనబడ్డారు? అస్త్రాలను సంపాదించావు? నీవెలా ఆరాధించావు? (5)
యథోక్తవాంస్త్వాం భగవాన్ శతక్రతురరిందమ ।
కృతప్రియస్త్వయాస్మీతి తస్య తే కిం ప్రియం కృతమ్ ॥ 6
శత్రుమర్దనా! భగవానుడైన ఇంద్రుడు నీవల్ల సంతోషించానన్నాడే అతనికెలా నీవు ప్రియమైన పనిచేశావు? ((6)
ఏతదిచ్చామ్యహం శ్రోతుం విస్తరేణ మహాద్యుతే ।
యథా తుష్టో మహాదేవో దేవరాజస్తథానఘ ॥ 7
యచ్చాపి వజ్రపాణేస్తు ప్రియం కృతమరిందమ ।
ఏతదాఖ్యాహి ఏ సర్వమఖిలేన ధనంజయ ॥ 8
మహాదేవుడైన శివుడు, దేవరాజైన ఇంద్రుడు సంతోషించిన తీరు విపులంగా వినాలనుకుంటున్నాను. అర్జునా! ఇంద్రుడికి చేసిన ప్రియమైన పనేమిటో మొత్తమంతా నాకు చెప్పు. (7,8)
అర్జున ఉవాచ
శృణు హంత మహారాజ విధినా యేన దృష్టవాన్ ।
శతక్రతుమహం దేవం భగవంత చ శంకరమ్ ॥ 9
విద్యామధీత్య తా రాజన్ త్వయోక్తామరిమర్దన ।
భవతా చ సమాదిష్ఠః తపసే ప్రస్థితో వనమ్ ॥ 10
అర్జునుడు చెప్తున్నాడు - మహారాజా! నేనే ప్రకారంగా నూరుయాగాలు చేసిన ఇంద్రుని, భగవంతుడైన శంకరుని దర్శించానో విను. రాజా! నీవు చెప్పిఅ విద్యనభ్యసించి నీ ఆదేశంతో తపస్సు చెయ్యటానికి అడవికి బయలుదేరాను. (9,10)
భృగుతుంగమథో గత్వా కామ్యకాదాస్థితస్తపః ।
ఏకరాత్రోషితః కంచిద్ అపశ్యం బ్రాహ్మణం పథి ॥ 11
కామ్యకవనం నుండి భృగుతుంగం చేరుకుని తపస్సు చేస్తూనే ఒకరాత్రి గడిపి వెళుతూ దోవలో ఒక బ్రాహ్మణుని చూశాను. (11)
స మామపృచ్ఛత్ కౌంతేయ క్వాసి గంతా బ్రవీహి మే ।
తస్మా అవితథం సర్వం అబ్రువం కురునందన ॥ 12
"ఎక్కడికి వెళ్తున్నావో నాకు చెప్పు" అని అతడు నన్నడిగాడు. అతనికంతా ఉన్నది ఉన్నట్లు చెప్పాను. (12)
అ తథ్యం మమ తచ్ఛ్రుత్వా బ్రాహ్మణో రాజసత్తమ ।
అపూజయత మాం రాజన్ ప్రీతిమాంశ్చాభవన్మయి ॥ 13
నా నుండి ఆ నిజాన్ని విని ఆ బ్రాహ్మణుడు నన్ను గౌరవించాడు. రాజా! నా మీద ప్రేమ చూపాడు. (13)
తతో మామబ్రవీత్ ప్రీతః తప ఆతిష్ఠ భారత ।
తపస్వీ న చిరేణ త్వం ద్రక్ష్యసే విబుధాధిపమ్ ॥ 14
తరువాత ప్రీతితో నాతో "భారతా! తపస్సు చెయ్యి. తపస్సు చేస్తూ త్వరలోనే దేవరాజును నీవు దర్శించగలుగుతావు" అని అన్నాడు. (14)
తతోఽహం వచనాత్ తస్య గిరిమారుహ్య శైశిరమ్ ।
తపోఽతప్యం మహారాజ మాసం మూలఫలాశనః ॥ 15
తరువాత నే నతని మాట ప్రకారం హిమాలయ పర్వతాన్నెక్కి ఒక నెలరోజులు దుంపలు, పళ్ళు తింటూ తపస్సు చేశాను. (15)
ద్వితీయశ్చాపి మే మాసో జలం భక్షయతో గతః ।
నిరాహారస్తృతీయేఽథ మాసే పాండవనందన ॥ 16
ఊర్ధ్వబాహుశ్చతుర్థం తు మాసమస్మి స్థితస్తదా ।
న చ ఏ హీయతే ప్రాణః తదద్భుతమివాభవత్ ॥ 17
నీళ్ళు త్రాగుతూ తపస్సు చేసే నాకు రెండో నెల గడిచింది. తరువాత మూడవనెలలో ఆహారాన్ని తీసుకోనేలేదు. నాలుగవ నెలలో చేతులు పైకెత్తి తపస్సు చేశాను. అప్పుడు నాకు ప్రాణం పోకపోవడం అద్భుతం అనిపించింది. (16,17)
పంచమే త్వథ సంప్రాప్తే ప్రథమే దివసే గతే ।
వరాహసంస్థితం భూతం మత్సమీపం సమాగమత్ ॥ 18
ఐదవనెలలో మొదటి రోజు గడవగానే పందిలా ఉన్న ఒక ప్రాణి నా దగ్గరకు వచ్చింది. ॥ 19
ముట్టెతో నేలను త్రవ్వుతూ పాదాలతో రాస్తూ, మాటిమాటికి పొట్టతో నేలపై దొర్లుతూ, నేలను ఊడుస్తూ ఉంది (19)
అను తస్యాపరం భూతం మహత్ కైరాతసంస్థితమ్ ।
ధనుర్బాణాసిమత్ ప్రాప్తం స్త్రీగణానుగతం తదా ॥ 20
అప్పుడు దానివెంట కిరాతవేషాన్ని ధరించిన ఒకడు విల్లు, బాణాలు, కత్తి పట్టుకుని స్త్రీతో కలిసి నా దగ్గరకు వచ్చాడు. (20)
తతోఽహం ధనురాదాయ తథాక్షయ్యే మహేషుధీ ।
అతాడయం శరేణాథ తద్ భూతం లోమహర్షణమ్ ॥ 21
నేను వింటిని, అమ్ములపొదులను తీసుకొని ఒక బాణంతో గగుర్పాటుకలిగించే ఆ ప్రాణిని కొట్టాను. (21)
యుగపత్ తం కిరాతస్తు వికృష్య బలవద్ ధనుః ।
అభ్యాజఘ్నే దృఢతరం కంపయన్నివ మే మనః ॥ 22
అదే సమయంలో కిరాతుడు తన వింటిని గట్టిగా లాగి దానిని గట్టిగా నా మనస్సు వణికించేటట్లు కొట్టాడు. (22)
స తు మామబ్రవీద్ రాజన్ మమ పూర్వపరిగ్రహః ।
మృగయాధర్మముత్సృజ్య కిమర్ధం తాడితస్త్వయా ॥ 23
ముందుగా నే గ్రహించిన దాన్ని వేట కట్టుబాటును విడిచి నీ వెందుకు కొట్టావని అతడు నన్నడిగాడు. (23)
ఏష తే నిశితైర్బాణైః దర్పం హన్మి స్థిరో భవ ।
స ధనుష్మాన్ మహాకాయః తతో మామభ్యభాషత ॥ 24
పెద్ద శరీరం గల ఆ విలుకాడు "ఇదుగో ఈ వాడి బాణాలతో నీ గర్వాన్ని అణగగొడ్తాను. కదలకు" అని నాతో అన్నాడు. (24)
తతో గిరిమివాత్యర్థమ్ ఆవృణోన్మాం మహాశరైః ।
తం చాహం శరవర్షేణ మహతా సమవాకిరమ్ ॥ 25
అపుడు అతడు కొండపై వాన కురిసినట్లు పెద్ద బాణాలతో నన్ను కప్పేశాడు. అతనిని నేను కూడా గొప్ప బాణవర్షంతో కప్పేశాను. (25)
తతః శరైర్దీప్తముఖైః యంత్రితైరనుమంత్రితైః ।
ప్రత్యవిధ్యమహం తం తు వజ్రైరివ శిలోచ్చయమ్ ॥ 26
వజ్రాయుధపు దెబ్బలతో కొండను కొట్టినట్లు మంటలు కక్కే బాణాలతో అతనిని నేను గాయపరచాను. (26)
తస్య తచ్ఛతధా రూపమ్ అభవచ్చ సహస్రధా ।
తాని చాస్య శరీరాణి శరైరహమతాడయమ్ ॥ 27
అప్పుడు అతని ఆ ఆకారం వందలు వేలుగా అయ్యింది. అతని ఆ శరీరాలను నేను బాణాలతో కొట్టాను. (27)
పునస్తాని శరీరాణి ఏకీభూతాని భారత ।
అదృశ్యంత మహారాజ తాన్యహం వ్యధమం పునః ॥ 28
భారతా! మహారాజా! ఆ శరీరాలు మళ్ళీ ఒకటిగా అయి కనబడ్డాయి. మళ్ళీ నేను వాటిని గాయపరచాను. (28)
అణుర్బృహచ్ఛిరా భూత్వా బృహచ్చాణుశిరాః పునః ।
ఏకీభూతస్తదా రాజన్ సోఽభ్యవర్తత మాం యుధి ॥ 29
యదాభిభవితుం బాణైః న చ శక్నోమి తం రణే ।
తతో మహాస్త్రమాతిష్ఠం వాయవ్యం భరతర్షభ ॥ 30
రాజా! పెద్ద తలకాయతో అణువంత అయింది. అణువు పెద్దదయింది. మళ్ళీ పెద్ద ఆకారం అణువంత తలతో ఒకటిగా అయింది నన్ను యుద్ధంలో అతడు ఎదుర్కొన్నాడు. యుద్ధంలో అతడిని బాణాలతో అణచలేక వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాను. (29,30)
న చైనమశకం హంతుం తదద్భుతమివాభవత్ ।
తస్మిన్ ప్రతిహతే చాస్త్రే విస్మయో మే మహానభూత్ ॥ 31
కాని అతడిని చంపలేకపోయాను. అది అద్భుతమనిపించింది ఆ అస్త్రం విఫలమైనందుకు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. (31)
భూయ ఏవ మహారాజ సవిశేషమహం తతః ।
అస్త్రపూగేన మహతా రణే భూతమవాకిరమ్ ॥ 32
రాజా! మళ్ళీ నేను విశేషంగా ప్రయత్నించి గొప్ప అస్త్రసమూహాన్ని, యుద్ధంలో ఆ ప్రాణిపై గుప్పించాను. (32)
స్థూణాకర్ణమథో జాలం శరవర్షమథోల్బణమ్ ।
శలభాస్త్రమశ్మవర్షం సమాస్థాయాహమభ్యయామ్ ॥ 33
రుద్రుడి అవతారమై స్థూణాకర్ణుడు దేవతగా గల అస్త్రాన్ని, ఆకాశాన్ని కప్పేసి మీద కురికే లెక్కలేనన్ని వర్షాస్త్రాన్ని శలభాస్త్రాన్ని, రాళ్ళుకుమ్మరించే అశ్మవర్షాస్త్రాన్ని ఊతంగా చేసుకొని అతనిపై పడ్డాను.(33)
జగ్రాస ప్రసభం తాని సర్వాణ్యస్త్రాణి మే నృప ।
తేషు సర్వేషు జగ్ధేషు బ్రహ్మస్త్రం మహదాదిశమ్ ॥ 34
రాజా! ఆ నా అస్త్రాలన్నింటిని అతడు మింగేశాడు వాటినన్నిటిని మ్రింగగానే నేను బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించాను. (34)
తతః ప్రజ్వలితైర్బాణైః సర్వతః సోపచీయతే ।
ఉపచీయమానశ్చ మయా మహాస్త్రేణ వ్యవర్ధత ॥ 35
మండేబాణాలతో ఆ అస్త్రం అంతటా పాకింది. నా మహాస్త్రంతో ప్రేరణ పొంది ఆ బ్రహ్మస్త్రం చాలా వేగంతో పెరుగుతూ ఉంది (35)
తతః సంతాపితా లోకాః మత్ప్రసూతేన తేజసా ।
క్షణేన హి దిశః ఖం చ సర్వతో హి విదీపిత ॥ 36
నేను ప్రయోగించిన అస్త్రం యొక్క తేజస్సుతో లోకులంతా తాపానికి లోనయ్యారు క్షణంలో దిక్కులు, ఆకాశం అంతటా మంటలు చెలరేగాయి (36)
తదప్యస్త్రం మహాతేజాః క్షణేనైవ వ్యశాతయత్ ।
బ్రహ్మస్త్రే తు హతే రాజన్ భయం మాం మహదావిశత్ ॥ 37
గొప్ప తేజస్సు కలిగిన అతనిచే ఆ అస్త్రం కూడ క్షణంలోనే చల్లార్చబడింది రాజా! బ్రహ్మస్త్రం నశించే సరికి నాకు చాలా కలిగింది. (37)
తతోఽహం ధనురాదాయ తథాక్షయ్యే మహేషుధీ ।
సహసాభ్యహనం భూతం తాన్యప్యస్త్రాణ్యభక్షయత్ ॥ 38
నేను విల్లు అమ్ములపొదులను తీసుకుని వెంటనే ఆ ప్రాణిని కొట్టాను. ఆ అస్త్రాలన్నింటిని కూడా ఆ ప్రాణి తినేసింది. (38)
హతేష్వస్త్రేషు సర్వేషు భక్షితేష్వాయుధేషు చ ।
మమ తస్య చ భూతస్య బాహుయుద్ధమవర్తత ॥ 39
అస్త్రాలన్నీ నశించాయి. ఆయుధాలన్నీ మ్రింగబడ్డాయి. అప్పుడు నాకూ ఆ ప్రాణికీ ముష్టి యుద్ధం జరిగింది (39)
వ్యాయామం ముష్టిభిః కృత్వా తలైరపి సమాగతైః ।
అపారయంశ్చ తద్ భూతం నిశ్చేష్టమగమం మహీమ్ ॥ 40
ఆ ప్రాణిని పిడికిళ్ళతో పొడిచి గుద్దులతో ఎదుర్కొనే ప్రయత్నం చేశాను. కాని చేష్టలుడిగి నేలమీద పడ్డాను. (40)
తతః ప్రహస్య తద్ భూతం తత్రైవాంతరధీయత ।
సహ స్త్రీభిర్మహారాజ పశ్యతో మేఽద్భుతోపమమ్ ॥ 41
తరువాత అద్భుతంలాంటి ఆ ప్రాణిని నేను చూస్తూండగానే పెద్దగా నవ్వి స్త్రీలతో కలిసి ఆ ప్రాణి అక్కడే అంతర్ధానమయింది (41)
ఏవం కృత్వా స భగవాన్ తతోఽన్యద్ రూపమాస్థితః ।
దివ్యమేవ మహారాజ వసానోఽద్భుతమంబరమ్ ॥ 42
హిత్వా కిరాతరూపం చ భగవాంస్త్రిదశేశ్వరః ।
స్వరూపం దివ్యమాస్థాయ తస్థౌ తత్ర మహేశ్వరః ॥ 43
రాజా! ఆ భగవంతుడిలా చేసి కిరాతవేషాన్ని వదలి మరొక రూపాన్ని పొందాడు. దేవతలకు ప్రభువైన ఆ మహేశ్వరుడు దివ్యము, అద్భుతము అయిన వస్త్రాన్ని ధరించి దివ్యమైన స్వరూపంతో అక్కడ నిలిచాడు. (42,43)
అదృశ్యత తతః సాక్షాద్ భగవాన్ గోవృషధ్వజః ।
ఉమాసహాయో వ్యాలధృగ్ బహురూపః పినాకధృక్ ॥ 44
స మామభ్యేత్య సమరే తథైవాభిముఖం స్థితమ్ ।
శూలపాణిరథోవాచ తుష్టోఽస్మీతి పరంతప ॥ 45
తరువాత సాక్షాత్తు భగవంతుడైన శివుడు, పామును, పినాకమనే ధనుస్సును ధరించి పార్వతి తోడుగా ఉండగా అనేక రూపాలతో కనిపించాడు యుద్ధరంగంలో అలాగే ఎదురుగా ఉన్న నా దగ్గరకు వచ్చి, శూలం పట్టుకున్న ఆ శివుడు 'సంతోషించాను' అన్నాడు. (44,45)
తతస్తద్ ధనురాదాయ తూణౌ చాక్షయ్యసాయకౌ ।
ప్రాదాన్మమైవ భగవాన్ ధారయస్వేతి చాబ్రవీత్ ॥ 46
తరువాత ఆ వింటిని, తరగని బాణాలు గల ఆ రెండు అమ్ములపొదులను తీసుకొని ఆ భగవంతుడు వాటిని నాకే ఇచ్చి 'ధరించు' అన్నాడు. (46)
తుష్టోఽస్మి తవ కౌంతేయ బ్రూహి కిం కరవాణి తే ।
యత్ తే మనోగతం వీర తద్ బ్రూహి వితరామ్యహమ్ ॥ 47
అమరత్వమపాహాయ బ్రూహి యత్ తే మనోగతమ్ ।
తతః ప్రాంజలిరేవాహమస్త్రేషు గతమానసః ॥ 48
ప్రణమ్య మనసా శర్వం తతో వచనమాదదే ।
భగవాన్ మే ప్రసన్నశ్చేద్ ఈప్సితోఽయం వరో మమ ॥ 49
కుంతీకుమారా! నీ పట్ల సంతోషించాను నీ కేంచెయ్యమంటావో అడుగు. నీ మనసులో ఉన్నది చెప్పు. (శరీరంతో) అమరత్వం మినహా నీ మనసులో ఉన్నదేదో అడుగు. దాన్ని నేను తీరుస్తాను. (అన్నాడు). తరువాత అస్త్రాలపైనే మోజుగల నేను చేతులు జోడించి మనసులో శంకరునికి ప్రణామం చేసి భగవన్! నాపట్ల ప్రసన్నుడవయితే ఇది నేను కోరుకున్న వరం అన్నాను. (47-49)
అస్త్రాణీచ్ఛామ్యహం జ్ఞాతుం యాని దేవేషి కానిచిత్ ।
దదానీత్యేవ భగవాన్ అబ్రవీత్ త్య్రంబకశ్చ మామ్ ॥ 50
"దేవతల దగ్గరున్న అస్త్రాల గురించి తెలుసుకోవాల" నుకుంటున్నాను. అన్నాను. దానికి భగవంతుడైన త్రినేత్రుడు నాతో ఇవ్వబోతున్నా నన్నాడు (50)
రౌద్రమస్త్రం మదీయం త్వామ్ ఉపస్థాస్యతి పాండవ ।
ప్రదదౌ చ మమ ప్రీతః సోస్త్రం పాశుపతం మహత్ ॥ 51
పాండవా! నాదైన రౌద్రౌస్త్రం నిన్ను చేరుకుంటుంది అంటూ ఆ దేవుడు నాపై ప్రీతితో గొప్పదైన పాశుపతాస్త్రం ఇచ్చాడు. (51)
ఉవాచ చ మహాదేవః దత్త్వా మేఽస్త్రం సనాతనమ్ ।
న ప్రయోజ్యం భవేదేతద్ మానుషేషు కథంచన ॥ 52
సనాతనమైన ఆ అస్త్రాన్ని నాకిచ్చి ఆ మహాదేవుడు ఏమైనప్పటికీ మానవులపై దీన్ని ప్రయోగించకూడ దన్నాడు. (52)
జగద్ వినిర్దహేదేవమ్ అల్పతేజసి పాతితమ్ ।
పీడ్యమానేన బలవత్ ప్రయోజ్యం స్యాద్ ధనంజయ ॥ 53
అస్త్రాణాం ప్రతిఘాతే చ సర్వథైవ ప్రయోజయేత్ ।
తక్కువశక్తి గల వారిపై ప్రయోగిస్తే ప్రపంచాన్ని తగులబెడుతుంద్. ధనంజయా! తన కన్న బలవంతుడిచేత పీడింపబడుతున్నప్పుడు మాత్రమే ప్రయోగించాలి. శత్రువుయొక్క అస్త్రాలను విఫలం చెయ్యటానికి తప్పకుండా ప్రయోగించవచ్చు. (53 1/2)
తదప్రతిహతం దివ్యం సర్వాస్త్రప్రతిషేధనమ్ ॥ 54
మూర్తిమన్మే స్థితం పార్శ్వే ప్రసన్నే గోవృషధ్వజే ।
ఈవిధంగా శివుడు ప్రసన్నుడయినందున, ఎదురులేని అన్ని అస్త్రాలను ఎదుర్కోగల దివ్యమైన ఆ పాశుపతాస్త్రం ఆకారం దాల్చి నా ప్రక్కన నిలిచింది. (54 1/2)
ఉత్సాదనమమిత్రాణాం పరసేనానికర్తనమ్ ॥ 55
దురాసదం దుష్ప్రసహం సురదానారాక్షసైః ॥
అనుజ్ఞాతస్త్వహం తేన తత్రైవ సముపావిశమ్ ॥ 56
ప్రేక్షతశ్చైవ మే దేవః తత్రైవాంతరధీయత ॥ 57
అది శత్రువుల్ని చెల్లాచెదరు చేస్తుంది శత్రువు సేనల్ని ఊచకోత కోస్తుంది దాన్ని పొందటమెంతో కష్టం. దేవదానవరాక్షసులెవరి కైనా దాని వేగం తట్టుకోవటం సాధ్యం కాదు. ఆయన అనుమతితో నేనక్కడే కూర్చున్నాను నేను చూస్తూండగానే ఆ దేవుడక్కడే అంతర్దానమయ్యాడు (55-57)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నివాతకవచయుద్ధపర్వణి గంధమాదనవాసే యుధిష్ఠిరార్జునసంవాడ్గే సప్తషష్ట్యధికశతతమోఽధ్యాయః ॥ 167 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నివాతకవచయుద్ధపర్వమను ఉపపర్వమున గంధమాదనవాసమున యుధిష్ఠిరార్జున సంవాదమను నూట అరువది యేడవ అధ్యాయము. (167)