168. నూట అరువది ఎనిమిదవ అధ్యాయము

స్వర్గమున అర్జునుని అస్త్రవిద్యాభ్యాసము.

అర్జున ఉవాచ
తతస్తామవసం ప్రీతో రజనీం తత్ర భారత ।
ప్రసాదాద్ దేవదేవస్య త్య్రంబకస్య మహాత్మనః ॥ 1
అర్జునుడు చెపుతున్నాడు.
భరతవంశీయుడా! దేవదేవుడు, మహాత్ముడూ అయిన త్రినేత్రుని అనుగ్రహంతో తరువాత ఆ రాత్రి అక్కడ గడిపాను. (1)
వ్యుషితో రజనీం చాహం కృత్వా పౌర్వాహ్ణికీః క్రియాః ।
అపశ్యం తం ద్విజశ్రేష్ఠం దృష్టవానస్మి యం పురా ॥ 2
తెల్లవారగానే ప్రొద్దున ఆచరించవలసిన పనులను చేసి వెనుక చూసిన ఆ బ్రాహ్మణోత్తముని చూశాను. (2)
తస్మై చాహం యథావృత్తం సర్వమేవ న్యవేదయమ్ ।
భగవంతం మహాదేవం సమేతోఽస్మీతి భారత ॥ 3
భారతా! భగవంతుడైన మహాదేవుని కలిశానని జరిగినదంతా నేనతడికి నివేదించాను. (3)
స మూమువాచ రాజేంద్ర ప్రీయమాణో ద్విజోత్తమః ।
దృష్టస్త్వయా మహాదేవో యథా నాన్యేన కేనచిత్ ॥ 4
రాజేంద్రా! ప్రసన్నుడైన ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడు నాతో వేరెవ్వరికి జరగనివిధంగా నీవు మహాదేవుణ్ణి చూశావని నాతో అన్నాడు. (4)
సమేత్య లోకపాలైస్తు సర్వై ర్వైవసతాదిభిః ।
ద్రష్టాస్యనఘ దేవేంద్రం స చ తేఽస్త్రాణి దాస్యతి ॥ 5
యముడు మొదలైన లోకపాలకులతో కలిసి ఉన్న దేవేంద్రుని చూడబోతున్నావు. అతడు నీకు అస్త్రాలనిస్తాడు. (5)
ఏవముక్త్వా స మాం రాజన్ ఆశ్లిష్య చ పునః పునః ।
అగచ్ఛత్ స యథాకామం బ్రాహ్మణః సూర్యసన్నిభః ॥ 6
రాజా! ఇలా అంటూ సూర్యుడితో సమానమైన తేజస్సు గల ఆ బ్రాహ్మణుడు మాటిమాటిక్ నన్ను హత్తుకుంటూ వెళ్ళిపోయాడు. (6)
అథాపరాహ్ణే తస్యాహ్నః ప్రావాత్ పుణ్యః సమీరణః ।
పునర్నవమిమం లోకం కుర్వన్నివ సపత్నహన్ ॥ 7
దివ్యాని చైవ మాల్యాని సుగంధీని నవాని చ ।
శైశిరస్య గిరేః పాదే ప్రాదురాసన్ సమీపతః ॥ 8
తరువాత ఆ రోజు మధ్యాహ్నం ఈ లోకానికి క్రొత్తదనాన్నిస్తూన్నట్లు పవిత్రమైన గాలివీస్తోంది. హిమాలయపర్వతం క్రిందిభాగాన, సువాసనలు ఎదజల్లే దివ్యమైన క్రొత్తపూలవాన కురుస్తోంది. (7,8)
వాదిత్రాణి చ దివ్యాని సుఘోరాణీ సమంతతః ।
స్తుతయశ్చేంద్రసంయుక్తాః అశ్రూయంత మనోహరాః ॥ 9
చుట్టూ మనస్సు నాకట్టుకునే దివ్యవాద్యములఘోష, ఇంద్రుడి స్తోత్రాలు వినబడసాగాయి. (9)
గణాశ్చాప్సరసాం తత్ర గంధర్వాణాం తథైవ చ ।
పురస్తాద్ దేవదేవస్య జగుర్గీతాని సర్వశః ॥ 10
అక్కడ అంతటా ఆ దేవదేవుడైన ఇంద్రుడి ఎదుట అప్సరసలు, గంధర్వుల సమూహాలు గానం చేయసాగాయి. (10)
మరుతాం చ గణాస్తత్ర దేవయానైరుపాగమన్ ।
మహేంద్రానుచరా యే చ యే చ సద్మనివాసినః ॥ 11
మహేంద్రుడి అనుచరులు, ఆయన భవనంలో నివసించేవాళ్ళు అయిన దేవతల గుంపులు అక్కడికి దివ్యవిమానాల మీద చేరుకున్నారు. (11)
తతో మరుత్వాన్ హరిభిః యుక్తైర్వాహైః స్వలంకృతైః ।
శచీసహాయస్తత్రాయాత్ సహ సర్వైస్తదామరైః ॥ 12
అప్పుడు దేవతలందరితో కలిసి, శచీదేవి తోడురాగా, అలంకరించబడిన, పచ్చనిగుర్రాలు పూన్చబడిన రథాలపై ఇంద్రుడు అక్కడికి వచ్చాడు (12)
ఏతస్మిన్నేవ కాలే తు కుబేరో నరవాహనః ।
దర్శయామాస మాం రాజన్ లక్ష్మ్యా పరమయా యుతః ॥ 13
రాజా! ఇంతలోనే చాలా ఐశ్వర్యంతో కూడిన నరవాహనుడైన కుబేరుడు నాకు దర్శనమిచ్చాడు. (13)
దక్షిణస్యాం దిశి యమం ప్రత్యపశ్యం వ్యవస్థితమ్ ।
వరుణం దేవరాజం చ యథాస్థానమవస్థితమ్ ॥ 14
దక్షిణదిక్కున యముని చూశాను. తమతమ స్థానాలలో ఉన్న వరుణునీ దేవరాజు ఇంద్రునీ చూశాను. (14)
తే మామూచుర్మహారాజ సాంత్వయిత్వా నరర్షభ ।
సవ్యసాచిన్ నిరీక్షాస్మాన్ లోకపాలానవస్థితాన్ ॥ 15
వారు నన్నోదార్చి అర్జునా! ఇక్కడకు చేరిన లోకపాలకులమైన మమ్మల్ని చూడు అని నాతో అన్నారు. (15)
సురకార్యార్థం సిద్ధ్యర్థం దృష్టవానసి శంకరమ్ ।
అస్మత్తోఽపి గృహాణ త్వమ్ అస్త్రాణీతి సమంతతః ॥ 16
దేవకార్యం సిద్ధింపచెయ్యటానికి శంకరుని చూడగలిగావు. నాలుగు ప్రక్కలా ఉన్న మానుండి కూడా నీవు అస్త్రాలను స్వీకరించు అన్నారు. (16)
తతోఽహం ప్రయతో భూత్వా ప్రణిపత్య సురర్షభాన్ ।
ప్రత్యగృహ్ణం తదాస్త్రాణి మహాంతి విధివద్ విభో ॥ 17
ప్రభూ! తరువాత నేను ఏకాగ్రతతో ఆ దేవతాశ్రేష్ఠులకు ప్రణామం చేసి అప్పుడు యథావిధిగా గొప్పవైన ఆ అస్త్రాలను స్వీకరించాను. (17)
గృహీతాస్త్రస్తతో దేవైః అనుజ్ఞాతోఽస్మి భారత ।
అథ దేవా యయుః సర్వే యథాగతమరిందమ ॥ 18
భారతా! అస్త్రాలను స్వీకరించిన తరువాత దేవతలు నాకు వెళ్ళేందుకు అనుమతి నిచ్చారు. తరువాత దేవతలంతా వచ్చినదోవనే వెళ్ళిపోయారు. (18)
మఘవానపి దేవేశో రథమారుహ్య సుప్రభమ్ ।
ఉవాచ భగవాన్ స్వర్గం గంతవ్యం ఫాల్గున త్వయా ॥ 19
దేవరాజు, భగవంతుడూ అయిన ఇంద్రుడు కూడ ఎంతో ప్రకాశిస్తూన్న రథాన్నెక్కి, అర్జునా! నీవు స్వర్గానికి వెళ్ళవలసి ఉంది అన్నాడు. (19)
పురైవాగమనాదస్మాద్ వేదాహం త్వాం ధనంజయ ।
అతః పరం త్వహం వై త్వాం దర్శయే భరతర్షభ ॥ 20
భరతశ్రేష్ఠా! ధనంజయా! ఇక్కడకి రావటానికి ముందే నీగురించి నాకు తెలుసు. అటు తరువాతనే నేను నిన్ను చూస్తున్నాను. (20)
త్వయా హి తీర్థేషు పురా సమాప్లావః కృతోఽసకృత్ ।
తపశ్చేదం మహత్ తప్తం స్వర్గం గంతాసి పాండవ ॥ 21
పాండవా! వెనుక చాలా సార్లు నీవు పవిత్రజలాల్లో స్నానం చేశావు. ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళే అధికారాన్ని పొందావు. (21)
భూయశ్చైవ చ తప్తవ్యం తపశ్చరణముత్తమమ్ ।
స్వర్గం త్వవశ్యం గంతవ్యం త్వయా శత్రునిఘాదన ॥ 22
మళ్ళీ ఉత్తమమైన రీతిలో తపస్సు చెయ్యాల్సి ఉంది. స్వర్గానికి తప్పక నీవు వెళ్ళాలి. (22)
మాథలిర్మన్నియోగాత్ త్వాం త్రిదివం ప్రాపయిష్యతి ।
విదితస్త్వం హి దేవానాం మునీనాం చ మహాత్మనామ్ ॥ 23
ఇహస్థః పాండవశ్రేష్ఠః తపః కుర్వన్ సుదుష్కరమ్ ।
నా ఆదేశం వల్ల మాతలి నిన్ను స్వర్గానికి చేరుస్తాడు. పాండవశ్రేష్ఠా! ఇక్కడ ఉండి చాలా కష్టమైన తపస్సు చేసినందువల్ల నీవు దేవతలకు, మహాత్ములైన మునులకు తెలుసు అన్నాడు. (23 1/2)
తతోఽహమబ్రువం శక్రం ప్రసీద భగవన్ మమ ।
ఆచార్యం వరయేయం త్వామ్ అస్త్రార్థం త్రిదశేశ్వర ॥ 24
తరువాత నేను దేవరాజా! నాకు ప్రసన్నుడవగుమని నిన్ను అస్త్రాలకోసం ఆచార్యుడుగా వరిస్తున్నానని ఇంద్రుడితో అన్నాను. (24)
ఇంద్ర ఉవాచ
క్రూరకర్మాస్తవిత్ తాత భవిష్యసి పరంతప ।
యదర్థమస్త్రాణీప్సుస్త్వం తం కామం పాండవాప్నుహి ॥ 25
ఇంద్రుడు చెపుతున్నాడు - నాయనా! పాండవా! అస్త్రముల జ్ఞానం పొందిన నీవు క్రూరమైన పనులు చేసేవాడి వౌతావు. అందువల్ల దేనికై అస్త్రాలను పొందాలనుకుంటున్నావో ఆ కోర్కె నెరవేరుగాక! (25)
తతోఽహమబ్రువం నాహం దివ్యాన్యస్త్రాణి శత్రుహన్ ।
మానుషేషు ప్రయోక్ష్యామి వినాస్త్రప్రతిఘాతనాత్ ॥ 26
తరువాత నేను 'శత్రువులు ప్రయోగించిన అస్త్రాలను వమ్ముచెయ్యటానికే తప్ప దివ్యములైన అస్త్రాలను మానవులపై ప్రయోగించను' అన్నాను. (26)
తాని దివ్యాని మేఽస్త్రాణి ప్రయచ్ఛ విబుధాధిప ।
లోకాంశ్చాస్త్రజితాన్ పశ్చాల్లభేయం సురపుంగవ ॥ 27
దేవరాజా! ఆ దివ్యములైన అస్త్రాలను నాకు ప్రసాదించు. అస్త్రముల వల్ల జయించబడే లోకాలను తరువాత పొందాలనుకుంటున్నాను. (27)
ఇంద్ర ఉవాచ
పరీక్షార్థః మయైతత్ తే వాక్యముక్తం ధనంజయ ।
మమాత్మజస్య వచనం సూపపన్నమిదం తవ ॥ 28
ఇంద్రుడు చెపుతున్నాడు - "ధనంజయా! నిన్ను పరీక్షించటానికి ఈ మాటలు పలికాను. నా కుమారుడవైన నీకు ఇలా మాట్లాడటం తగినదే. (28)
శిక్ష మే భవనం గత్వా సర్వాణ్యస్త్రాణి భారత ।
వాయోరగ్నేర్వసుభ్యోపి వరుణాత్ సమరుద్గణాత్ ॥ 29
సాధ్యం పైతామహం చైవ గంధర్వోరగరక్షసామ్ ।
వైష్ణవాని చ సర్వాణి నైర్ ఋతాని తథైవ చ ॥ 30
మద్గతాని చ జానీహి సర్వాస్త్రాణికురూద్వహ ।
ఏవముక్త్వా తు మాం శక్రః తత్రైవాంతరధీయత ॥ 31
భారతా! నా భవనానికి వెళ్ళి అస్త్రాలన్నింటినీ నేర్చుకో. కురుశ్రేష్ఠా! వాయువు, అగ్ని, వసువులు, మరుద్గణములతో కూడిన వరుణుడు, సాధ్యులు, బ్రహ్మ, గంధర్వులు, ఉరగులు, రాక్షసులు, విష్ణువు, నిర్ ఋతిలకు, అలాగే నాకు, సంబంధించిన అన్ని అస్త్రాలను నేర్చుకో" అని నాతో అంటూ ఇంద్రుడక్కడే అంతర్ధానమయ్యాడు. (29-31)
అథాపశ్యం హరియుతం రథమైంద్రముపస్థితమ్ ।
దివ్యం మాయామయం పుణ్యం యత్తం మాతలినా నృప ॥ 32
తరువాత గుర్రాలను పూన్చిన ఇంద్రరథం సమీపించింది. రాజా! దివ్యమూ, మాయామయమూ, పవిత్రమూ అయిన ఆ రథం మాతలి అదుపులో ఉంది. (32)
లోకపాలేషు యాతేషు మామువాచాథ మాతలిః ।
ద్రష్టుమిచ్ఛతి శక్రస్త్వాం దేవరాజో మహాద్యుతే ॥ 33
లోకపాలకులు వెళ్ళిపోయిన తరువాత మాతలి మహాతేజస్వీ! దేవరాజైన ఇంద్రుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు' అని నాతో అన్నాడు. (33)
సంసిద్ధ్యస్వ మహాబాహో కురు కార్యమనంతరమ్ ।
పశ్య పుణ్యకృతాన్ లోకాన్ సశరీరో దివం వ్రజ ॥ 34
సిద్ధం కమ్ము. ఆయనను కలుసుకొని కృతార్థుడవగుము. ఇప్పుడు తప్పక చెయ్యదగిన పనిచెయ్యి. పుణ్యం వల్ల లభించే లోకాలను చూడు. ఈ శరీరంతోనే సర్గానికి వెళ్ళు (34)
దేవరాజః సహస్రాక్షః త్వాం దిదృక్షతి భారత ।
ఇత్యు క్తోఽహం మాతలినా గిరిమామంత్య్ర శైశిరమ్ ॥ 35
ప్రదక్షిణముపావృత్య సమారోహం రథోత్తమమ్ ।
భారతా! దేవరాజైన ఇంద్రుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు అని మాతలి చెప్పగా నేను హిమాలయపర్వతం నుండి అనుమతి పొంది ఆ ఉత్తమమైన రథానికి ప్రదక్షిణం చేసి ఎక్కాను. (35 1/2)
చోదయామాస స హయాన్ మనోమారుతరంహసః ॥ 36
మాతలిర్హయతత్త్వజ్ఞః యథావద్ భూరిదక్షిణః ।
మాతలి సారథ్యంలో నేర్పరి. మనస్సు, వాయువులతో సమానమైన వేగంతో గుర్రాలనతడు తగినట్లుగా తోలుతున్నాడు. (36 1/2)
అవైక్షత చ మే వక్త్రం స్థితస్యాథ స సారథిః ॥ 37
తథా భ్రాంతే రథే రాజన్ విస్మితశ్చేదమబ్రవీత్ ।
రాజా! అటు తరువాత ఆ దేవసారథి మాతలి అలా రథాన్ని పోనిస్తూ స్థిరంగా కూర్చున్న నావంక చూశాడు. ఆశ్చర్యచకితుడై ఇలా అన్నాడు. (37 1/2)
అత్యద్భుతమిదం త్వద్య విచిత్రం ప్రతిభాతి మే ॥ 38
యదాస్థితో రథం దివ్యం పదాన్న చలితః పదమ్ ।
నాకీ రోజు ఇది చాలా విచిత్రంగా అద్భుతంగా తోస్తోంది ఈదివ్యరథం మీద కూర్చున్న నీవు ఆ చోటు నుండి ఎంతమాత్రమూ కదలలేదు (38 1/2)
దేవరాజోఽపి హి మయా నిత్యమత్రోపలక్షితః ॥ 39
విచలన్ ప్రథమోత్పాతే హయానాం భరతర్షభ ।
త్వం పునః స్థిత ఏవాత్ర రథే భ్రాంతే కురూద్వహ ॥ 40
భరతశ్రేష్ఠా! గుర్రాలు మొదట ఎగిరేటప్పుడు దేవరాజైన ఇంద్రుడు కూడా కదలటం నేనెప్పుడూ చూస్తూంటాను. కాని నీవు మాత్రం రథం కదులుతున్నా ఇక్కడే కదలకుండా ఉన్నావు. (39,40)
అతిశక్రమిదం సర్వం తవేతి ప్రతిభాతి మే ।
ఇత్యు క్త్వాఽఽకాశమావిశ్య మాథలిర్విబుధాలయాన్ ॥ 41
దర్శయామాస మే రాజన్ విమానాని చ భారత ।
స రథో హరిభిర్యుక్తో హ్యూర్ధ్వమాచక్రమే తతః ॥ 42
రాజా! భారతా! మాతలి నీదంతా ఇంద్రుని మించిపోయిందంటూ అంతరిక్షంలోకి ప్రవేశించి దేవతల నివాసాలను, విమానాలను నాకు చూపసాగాడు. తరువాత గుర్రాలు పూన్చబడిన ఆ రథం అక్కడి నుండి పైకి వెళ్ళసాగింది. (41,42)
ఋషయో దేవతాశ్చైవ పూజయంతి నరోత్తమ ।
తతః కామగమాన్ లోకాన్ అపశ్యం వై సురర్షిణామ్ ॥ 43
మానవ్వశ్రేష్ఠా! ఋషులు, దేవతలూ ఆ రథాన్ని పూజిస్తున్నారు. తరువాత తమ కోర్కె బట్టి వెళ్ళుతున్న దేవర్షుల లోకాలను చూశాను. (43)
గంధర్వాప్సరసాం చైవ ప్రభావమమితౌజసామ్ ।
నందనాదీని దేవానాం వనాన్యుపవనాని చ ॥ 44
దర్శయామాస మే శీఘ్రం మాతలిః శక్రసారథిః ।
తతః శక్రస్య భవనమ్ అపశ్యమమరావతీమ్ ॥ 45
దివ్యైః కామఫలైర్వృక్షైః రత్నైశ్చ సమలంకృతామ్ ।
న తత్ర సూర్యస్తపతి న శీతోష్ణే న చ క్లమః ॥ 46
అంతులేని తేజస్సు గల గంధర్వుల, అప్సరసల, ప్రభావాన్ని; నందనం మొదలైన దేవతల ఉద్యానవనాలను, తోటలను ఇంద్రుడి సారథి మాతలి చకచకా నాకు చూపించసాగాడు తరువాత దివ్యములు, అడిగిన పండ్లనిచ్చే చెట్లు, రత్నాలతో బాగా అలంకరించబడిన అమరావతీ పట్టణాన్ని, ఇంద్రుడి భవనాన్ని చూశాను. సూర్యుడక్కడ తాపాన్నీయడు. చలి, ఎండా లేవు. అలసట లేదు. (44-46)
న బాధతే తత్ర రజః తత్రాస్తి న జరా నృప ।
న తత్ర శోకో దైన్యం వా దౌర్బల్యం చోపలక్ష్యతే ॥ 47
రాజా! అక్కడ దుమ్ములేదు. రజోగుణం బాధించదు. ముసలితనపు బాధలేదు. అక్కడ మనోవేదన, దీనత, బలహీనతా కనబడవు. (47)
దివౌకసాం మహారాజ న గ్లానిరరిమర్దన ।
న క్రోధలోభౌ తత్రాస్తం సురాదీనాం విశాంపతే ॥ 48
మహారాజా! మానవప్రభూ! దేవతలకు విచారం లేదు. దేవతలు మొదలైన వారికక్కడ కోపము, పేరాశ లేవు. (48)
నిత్యతుష్టాశ్చ తే రాజన్ ప్రాణినః సురవేశ్మని ।
నిత్యపుష్పఫలాస్తత్ర పాదపా హరితచ్ఛదాః ॥ 49
రాజా! స్వర్గంలో నివసించే ప్రాణులు ఎల్లప్పుడూ సంతోషాన్నే కలిగి ఉన్నారు. అక్కడ చెట్లు ఆకుపచ్చని ఆకులతో ఎప్పుడూ పూలతో పండ్లతో నిండి ఉన్నాయి. (49)
పుష్కరిణ్యశ్చ వివిధాః పద్మసౌగందికాయుతాః ।
శీతస్తత్ర వవౌ వాయుః సుగంధీ జీవనః శుచిః ॥ 50
వేలకొలది సౌగంధిక పద్మాలతో కూడిన అనేక రకాల సరోవరాలున్నాయి. అక్కడ గాలి చల్లగా, సువాసనలను వెదజల్లుతూ, స్వచ్ఛంగా నూతనోత్తేజాన్నిస్తూ వీస్తుంది. (50)
సర్వరత్నవిచిత్రా చ భూమిః పుష్పభూషితా ।
మృగద్విజాశ్చ బహవః రుచిరా మధురస్వరాః ॥ 51
విమానగామినశ్చాత్ర దృశ్యంతే బహవోఽంబరే ।
తతోఽపశ్యం వసూన్ రుద్రాన్ సాధ్యాంశ్చ సమరుద్గణాన్ ॥ 52
ఆదిత్యానశ్వినౌ చైవ తాన్ సర్వాన్ ప్రత్యపూజయమ్ ।
తే మాం వీర్యేణ యశసా తేజసా చ బలేన చ ॥ 53
అస్తైశ్చాప్యన్వజానంత సంగ్రామే విజయేన చ ।
నేల రత్నాలన్నిటితో విచిత్రంగా, పూలతో అలంకరించబడి ఉంటుంది. అనేక రకాలైన జంతువులు పక్షులూ మనోహరంగా మధురంగా ధ్వనులు చేస్తూంటాయి. అక్కడ చాలా మంది ఆకాశంలో విమానాల మీద వెళుతూ కనబడతారు. తరువాత వసువుల్ని, రుద్రుల్ని, సాధ్యుల్ని, మరుద్గణాలను, ఆదిత్యుల్ని, అశ్వినుల్ని చూశాను వారిందరినీ పూజించాను. వారంతా నన్ను పరాక్రమం, కీర్తి, తేజస్సు, బలం, అస్త్రాలు యుద్ధంలో విజయమూ కలగాలని దీవించారు. (51-53 1/2)
ప్రవిశ్య తాం పురీం దివ్యాం దేవగంధర్వపూజితామ్ ॥ 54
దేవరాజం సహస్రాక్షమ్ ఉపాతిష్ఠం కృతాంజలిః ।
దదావర్ధాసనం ప్రీతః శక్రో మే దదతాం వరః ॥ 55
దివ్యమైన దేవతలు గంధర్వుల చేత ఆరాధింపబడే ఆ నగరాన్ని ప్రవేశించి దేవరాజైన దేవేంద్రుడి చెంత చేతులు జోడించి నిలచాను. దాతలలో శ్రేష్ఠుడైన ఇంద్రుడు సంతోషించి నాకు తన సింహాసనంలో సగమిచ్చాడు. (54-55)
బహుమానాచ్చ గాత్రాణి పస్పర్శ మమ వాసవః ।
తత్రాహం దేవగంధర్వైః సహితో భూరిదక్షిణ ॥ 56
అస్త్రార్థమవసం సర్గే శిక్షాణోఽస్త్రాణి భారత ।
విశ్వావసోశ్చ వై పుత్రః చిత్రసేనోఽభవత్ సఖా ॥ 57
భరతశ్రేష్ఠా! ఇంద్రుడు ఎంతో ఆదరంతో నా అవయవాలను తాకాడు. అక్కడ నేను దేవతలు గంధర్వులతో కలిసి అస్త్రవిద్య నేర్చుకుంటూ అస్త్రాల కోసం ఉన్నాను. గంధర్వరాజు విశ్వావసు కుమారుడైన చిత్రసేనుడు నాకు స్నేహితుడయ్యాడు. (56,57)
స చ గాంధర్వమఖిలం గ్రాహయామాస మాం నృప ।
తత్రాహమవసం రాజన్ గృహీతాస్త్రః సుపూజితః ॥ 58
సుఖం శక్రస్య భవనే సర్వకామసమన్వితః ।
శృణ్వన్ వై గీతశబ్దం చ తూర్యశబ్దం చ పుష్కలమ్ ।
పశ్యంశ్చాప్సరసః శ్రేష్ఠాః నృత్యంతీర్భరతర్షభ ॥ 59
భరతశ్రేష్ఠా! రాజా! నాకతడు సంగీత విద్యనంతా నేర్పాడు. నేనక్కడ ఇంద్రభవనంలో ఎంతో ఆదరించబడి, అస్త్రాలను నేర్చుకుంటూ కోరిందల్లా పొందుతూ సుఖంగా నివసించాను. గానాన్ని పుష్కలమైన దేవవాద్యముల ధ్వనులను వింటూ, నాట్యమాడే శ్రేష్ఠలైన అప్సరసలను చూస్తూ గడిపాను. (58,59)
తత్ సర్వానవజ్ఞాయ తథ్యం విజ్ఞాయ భారత ।
అత్యర్థం ప్రతిగృహ్యాహమ్ అస్త్రేష్వేవ వ్యవస్థితః ॥ 60
భారతా! ఈ సౌకర్యాలను, సుఖాలను తిరస్కరించకుండా, ఆటి నిజరూపాన్ని గ్రహించి, చివరకవి సారము లేని వని చక్కగా తెలుసుకొని నేను ఎక్కువ అస్త్రవిద్య అభ్యసించడంలోనే నిమగ్నమయ్యాను. (60)
తతోఽతుష్యత్ సహస్రాక్షః తేన కామేన మే విభుః ।
ఏవం మే వసతో రాజన్ ఏష కాలోఽత్యగాద్ దివి ॥ 61
దాని వల్ల ప్రభువైన ఇంద్రుడు నాకోరికను గుర్తించి సంతోషించాడు రాజా! అలా ఉంటున్న నాఖు స్వర్గంలో కాలం గడుస్తూ ఉంది. (61)
కృతాస్త్రమతివిశ్వస్తమథ మాం హరివాహనః ।
సంస్పృశ్య మూర్థ్ని పాణిభ్యామ్ ఇదం వచనమబ్రవీత్ ॥ 62
నా అస్త్రవిద్యలో నైపుణ్యం వల్లను నమ్మదగిన స్థితి వల్లనూ ఇంద్రుడొకనాడు తన రెండు చేతులతో నాతలపై తాకి ఇలా అన్నాడు (62)
న త్వమద్య యుధా జేతుం శక్యః సురగణైరపి ।
కిం పునర్మానుషే లోకే మానుషైరకృతాత్మభిః ॥ 63
నీవిక దేవతా సమూహాల వల్ల కూడ యుద్ధంలో జయించరానివడవయ్యావు. మానవలోకంలో తమపైనే అదుపులేని మానవుల చేత ఎలా జయించబడతావు? (63)
అప్రమేయోఽప్రధృష్యశ్చ యుద్ధేష్వప్రతిమస్తథా ।
అజేయస్త్వం హి సంగ్రామే సర్వైరపి సురాసురైః ।
అథాబ్రవీత్ పునర్దేవః సంప్రహృష్టతనూరుహః ॥ 64
నీవు యుద్ధంలో మితం లేని శక్తికలవాడివి ఎదుర్కొనలేనివాడివి. సాటిలేనివాడివి. దేవాసురలందరి చేత కూడ జయించబడవు. ఇంకా ఆ దేవుడు గగుర్పాటుతో మళ్ళీ ఇలా అన్నాడు. (64)
అస్త్రయుద్ధే సమో వీర న తే కశ్చిత్ భవిష్యతి ।
అప్రమత్తః సదా దక్షః సత్యవాదీ జితేంద్రియః ॥ 65
బ్రహ్మణ్యశ్చాస్త్రవిచ్చాసి శూరశ్చాసి కురూద్వహ ।
అస్త్రాణి సమవాప్తాని త్వయా దశ చ పంచ చ ॥ 66
పంచభిర్విధిభిః పార్థ విద్యతే న త్వయా సమః ।
ప్రయోగముపసంహారమ్ ఆవృత్తిం చ ధనంజయ ॥ 67
ప్రాయశ్చిత్తం చ వేత్థ త్వం ప్రతీఘాతం చ సర్వశః ।
తతో గుర్వర్థకాలోఽయం సముత్పన్నః పరంతప ॥ 68
వీరుడా! అస్త్ర యుద్ధంలో నీకెవ్వడూ సమానుడు కాలేడు. కురుశ్రేష్ఠా! నీవెప్పుడూ జాగరూకుడివి. సమర్థుడివి. ఇంద్రియాలను జయించినవాడివి సత్యాన్నే పలుకుతావు బ్రాహ్మణభక్తి కలవాడివి అస్త్రవేత్తవు. శూరుడివి. ఐదువిధులలో పదిహేను అస్త్రాలను నీవు సంపాదించావు పార్థా! నీకు సమానుడే లేడు ధనంజయా! ప్రయోగము, ఉపసంహారము, ఆవృత్తి, ప్రాయశ్చిత్తము, ప్రతిఘాతములను పూర్తిగా నీవు తెలుసుకున్నావు కాబట్టి అర్జునా! గురుదక్షిణ సమర్పించే సమయం ఆసన్నమైంది. (65-68)
ప్రతిజానీష్వ తం కర్తుం తతో వేత్స్యామ్యహం పరమ్ ।
తతోఽహమబ్రువం రాజన్ దేవరాజమిదం వచః ॥ 69
విషహ్యం యన్మయా కర్తుం కృతమేవ నిబోధ తత్ ।
తతో మామబ్రవీత్ రాజన్ ప్రహసన్ బలవృత్రహా ॥ 70
నీ వది చెయ్యటానికి ప్రతిజ్ఞ చెయ్యి. అప్పుడా గొప్పపనిని నీకు చెప్తాను. రాజా! అప్పుడు నేను దేవరాజుతో నేను చెయ్యటానికి సాధ్యం కానిదైనా చేసినట్లే అనుకో అన్నాను. రాజా! అప్పుడు ఆ ఇంద్రుడు నవ్వుతూ నాతో ఇలా అన్నాడు. (69,70)
నా విషహ్యం తవాద్యాస్తి త్రిషు లోకేషు కించన ।
నివాతకవచా నామ దానవా మమ శత్రవః ॥ 71
"నీకిప్పుడు మూడులోకాల్లోనూ సాధ్యంకాని దేదీలేదు నివాతకవచులనబడే దానవులు నాకు శత్రువులు." (71)
సముద్రకుక్షిమాశ్రిత్య దుర్గే ప్రతివసంత్యుత ।
తిస్రః కోట్యః సమాఖ్యాతాః తుల్యరూపబలప్రభాః ॥ 72
తాంస్తత్ర జహి కౌంతేయ గుర్వర్థస్తే భవిష్యతి ।
తతో మాతలిసంయుక్తం మయూరసమరోమభిః ॥ 73
హయైరుపేతం ప్రాదాన్మే రథం దివ్యం మహాప్రభమ్ ।
బబంధ చైవ మే మూర్ధ్ని కిరీటమిదముత్తమమ్ ॥ 74
వాళ్లు సముద్రగర్భంలో వెళ్ళటానికి వీలుకానిచోట ఉంటున్నారు వారి సంఖ్య మూడుకోట్లుగా చెప్పబడుతోంది వారందరి ఆకారము, బలము, తేజస్సు ఒకేరకంగా ఉంటాయి. కుంతీకుమారా! వారినక్కడ చంపు. దానివల్ల నీవు గురుదక్షిణ చెల్లించినట్లౌతుంది" అని గొప్ప కాంతులీనే దివ్యమైన రథాన్ని నాకిచ్చాడు. దానికి నెమలిఈకల వంటి రోమములు కల గుర్రాలు పూన్చబడ్డాయి మాతలి అందులో ఉన్నాడు. ఈ ఉత్తమమైన కిరీటాన్ని నా తలకు అమర్చాడు. (72-74)
స్వరూపసదృశం చైవ ప్రాదాదంగవిభూషణమ్ ।
అభేద్యం కవచం చేదం స్పర్శరూపవదుత్తమమ్ ॥ 75
నా ఆకారానికి తగినట్లు నా శరీరానికి ఆభరణాలనిచ్చాడు. ఉత్తమమమైన రూపము, స్పర్శగల ఈ భేదించలేని కవచాన్నిచ్చాడు. (75)
అజరాం జ్యామిమాం చాపి గాండీవే సమయోజయత్ ।
తతః ప్రాయామహం తేన స్యందనేన విరాజతా ॥ 76
యేనాజయద్ దేవపతిః బలిం వైరోచనిం పురా ।
తతో దేవాః సర్వ ఏవ తేన ఘోషేణ బోధితాః ॥ 77
మన్వానా దేవరాజం మాం సమాజగ్ముర్విశాంపతే ।
దృష్ట్వా చ మామపృచ్ఛంత కిం కరిష్యసి ఫాల్గున ॥ 78
తెగని ఈ అల్లెత్రాటిని గాండీవానికి సమకూర్చాడు. పూర్వం దేవరాజు విరోచనుని కుమారుడైన బలిని జయించడానికుపయోగించిన ఆరథం మీద నే నప్పుడు బయలుదేరాను. మహారాజా! ఆ రథ ధ్వనివల్ల ఆసక్తితో దేవతలంతా దేవరాజనుకొని నాదగ్గరకు వచ్చారు. నన్ను చూశాక 'అర్జునా! ఏం చెయ్యబోతున్నా'వని అడిగారు.(76-78)
తానబ్రువం యథాభూతమ్ ఇదం కర్తాస్మి సంయుగే ।
నివాతకవచానాం తు ప్రస్థితం మాం వధైషిణమ్ ॥ 79
నిబోధత మహాభాగాః శివం చాశాస్త మేఽనఘాః ।
తతో వాగ్భిః ప్రశస్తాభిఃత్రిదశాః పృథివీపతే ।
తుష్టువుర్మాం ప్రసన్నాస్తే యథా దేవం పురందరమ్ ॥ 80
వారితో 'మహానుభావులారా! నేను యుద్ధం చెయ్యబోతున్నాను. నివాతకవచుల్ని వధించటానికి వెళ్తున్నానని తెలుసుకోండి' అని ఉన్నది ఉన్నట్లు చెప్తాను. (79)
నాకు శుభం పలకమన్నాను. రాజా! ఆ దేవతలప్పుడు ప్రసన్నులై దేవరాజ ఇంద్రుడిని స్తుతించినట్లు నన్ను ప్రశస్తములైన వాక్కులతో సంతోషపెట్టారు. (80)
రథేనానేన మఘవా జితవాన్ శంబరం యుధి ।
నముచిం బలవృత్రౌ చ ప్రహ్లాదనరకావపి ॥ 81
ఇంద్రుడు యుద్ధంలో ఈ రథంతోనే శంబరుణ్ణి నముచిని, బలుడిని వృత్రుడిని, ప్రహ్లాద నరకుల్ని జయించాడు. (81)
బహూని చ సహస్రాణి ప్రయుతాన్యర్బుదాన్యపి ।
రథేనానేన దైత్యానాం జితవాన్ మఘవా యుధి ॥ 82
అనేక వేల లక్షల కోట్ల రాక్షసుల్ని యుద్ధంలో ఇంద్రుడు ఈ రథంతోనే జయించాడు (82)
త్వమప్యనేన కౌంతేయ నివాతకవచాన్ రణే ।
విజేతా యుధి విక్రమ్య పురేవ మఘవా వశీ ॥ 83
కుంతీకుమారా! ఇంద్రుడు పూర్వం చేసినట్లుగా నీవు కూడా ఈ రథంతో యుద్ధంలో పరాక్రమం చూపి నివాతకవచులను జయిస్తావు. (83)
అయం చ శంఖప్రవరో యేన జేతాసి దానవాన్ ।
అనేన విజితా లోకాః శక్రేణాపి మహాత్మనా ॥ 84
ఇది శ్రేష్ఠమైన శంఖము, దీనవల్ల దానవుల్ని జయించగలుగుతావు. మహాత్ముడైన ఇంద్రుడు కూడ దీనివల్ల లోకాల్ని జయించాడు. (84)
ప్రదీయమానం దేవైస్తం దేవదత్తం జలోద్భవమ్ ।
ప్రత్యగృహ్ణం జయాయైనం స్తూయమానస్తదామరైః ॥ 85
స శంఖీ కవచీ బాణీ ప్రగృహీతశరాసనః ।
దానవాలయమత్యుగ్రం ప్రయాతోఽస్మి యుయుత్సయా ॥ 86
జయంకోసం దీన్ని గ్రహించాను. ఈ శంఖం దేవతల చేత ఇవ్వబడింది కాబట్టి దీని పేరు దేవదత్తము. శంఖాన్ని గ్రహించి దేవతల చేత స్తుతించబడుతూ శంఖం కవచం బాణాలు ధనుస్సు పట్టుకుని, యుద్ధం చెయ్యాలనే కోరికతో భయంకరమైన ఆ దానవుల నివాసానికి బయలుదేరాను. (85-86)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి నివాతకవచయుద్ధపర్వణ్యర్జునవాక్యే అష్టషష్ట్యధికశతతమోఽధ్యాయః ॥ 168 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున నివాతకవచయుద్ధపర్వమను ఉపపర్వమున అర్జునవాక్యమను నూట అరువది ఎనిమిదవ అధ్యాయము. (168)