176. నూట డెబ్బది ఆరవ అధ్యాయము
(ఆజగర పర్వము)
పాండవులు గంధమాదనమునకు వెడలుట.
జనమేజయ ఉవాచ
తస్మిన్ కృతాస్త్రే రథినాం ప్రవీరే
ప్రత్యాగతే భవనాద్ వృత్రహంతుః ।
అతః పరం కిమకుర్వంత పార్థాః
సమేత్య శూరేణ ధనంజయేన ॥ 1
జనమేజయుడడుగుతున్నాడు. రధికోత్తముడైన అర్జునుడు ఇంద్రుడిభవనం నుండి అస్త్రాలను నేర్చి తిరిగిరాగా శూరుడైన అర్జునుడితో పాండవులేం చేశారు? (1)
వైశంపాయన ఉవాచ
వనేషు తేష్వేవ తు తే నరేంద్రాః
సహార్జునేనేంద్రసమేన వీరాః ।
తస్మింశ్చ శైలప్రవరే సురమ్యే
ధనేశ్వరాక్రీడగతా విజహ్రుః ॥ 2
వైశంపాయనుడు చెపుతున్నాడు.
వీరులైన ఆ రాజులు ఆ అడవుల్లోనే అందమైన ఆ పర్వతశ్రేష్ఠమందే, ఇంద్రుడితో సమానుడైన అర్జునుడితో కలిసి కుబేరుడి క్రీడాప్రాంగణంలో విహరించారు. (2)
వేశ్మాని తాన్యప్రతిమాని పశ్యన్
క్రీడాశ్చ నానాద్రుమసన్నిబద్ధాః ।
చచార ధన్వీ బహుధా నరేంద్రః
సోఽస్త్రేషు యత్తః సతతం కిరీటీ ॥ 3
సాటిలేని ఆ కుబేరుడి భవనాలను, అనేకరకాల చెట్లక్రింద ఆటలను చూస్తూ ధనుస్సును, కిరీటాన్ని ధరించిన అర్జునుడు అస్త్రాలను అభ్యసిస్తూ అనేకవిధాల సంచరించేవాడు. (3)
అవాప్య వాసం నరదేవపుత్రాః
ప్రసాదజం వైశ్రవణస్య రాజ్ఞః ।
న ప్రాణినాం తే స్పృహయంతి రాజన్
శివశ్చ కాలః స బభూవ తేషామ్ ॥ 4
రాజకుమారులైన పాండవులు రాజాధిరాజైన కుబేరుడి దయవల్ల అక్కడ నివసించే అవకాశం పొందారు. అక్కడనుండి వారు ఇతరప్రాణుల ఐశ్వర్య సుఖాలను కోరటం లేదు. వారికి ఆ సమయం సుఖంగా గడిచింది. (4)
సమేత్య పార్థేన యథైకరాత్ర
మూషుః సమాస్తత్ర తదా చతస్రః ।
పూర్వాశ్చ షట్ తా దశ పాండవానాం
శివా బభువుర్వసతాం వనేషు ॥ 5
వారు అర్జునుడితో కలిసి అక్కడ నాలుగు సంవత్సరాలు ఉన్నారు. అది వారికి ఒక్కరాత్రిలా గడిచింది. అంతకు మునుపు ఆరేళ్ళున్నారు. ఇలా అడవుల్లో ఉన్న పాండవులకు ఆ పదిసంవత్సరాలూ ఆనందంగా గడిచిపోయాయి. (5)
తతోఽబ్రవీద్ వాయుసుతస్తరస్వీ
జిష్ణుశ్చ రాజానముపోపవిశ్య ।
యమౌ చ వీరౌ సురరాజకల్పౌ
ఏకాంతమాస్థాయ హితం ప్రియం చ ॥ 6
తరువాత ఒకనాడు అర్జునుడు, వీరులు, ఇంద్రసమానులైన కవలలు నకులసహదేవులు ఏకాంతంలో రాజైన యుధిష్ఠిరుడి దగ్గర కూర్చొని యుండగా, వేగవంతుడైన భీముడు మేలును, సంతోషాన్ని కలిగించే విధంగా పలికాడు. (6)
తవ ప్రతిజ్ఞాం కురురాజ సత్యాం
చికీర్షామాణాస్తదమ ప్రియం చ ।
తతో న గచ్ఛామ వనాన్యపాస్య
సుయోధనం సానుచరం నిహంతుమ్ ॥ 7
కురురాజా! నీప్రతిజ్ఞను నిజమ్ చెయ్యాలనే కోరికతో అలాగే ప్రీతికలిగించాలని మేము అడవులను విడిచి అనుచరులతో సహా దుర్యోధనుని చంపటానికి వెళ్ళలేదు. (7)
ఏకాదశం వర్షమిదం వసామః
సుయోధనేనాత్తసుఖాః సుఖార్హాః ।
తం వంచయిత్వాధమబుద్ధిశీలమ్
అజ్ఞాతవాసం సుఖమాప్నుయామ ॥ 8
సుఖాలకు తగిన వాళ్ళమైన మనం దుర్యోధనుడి చేత మన సుఖాలను పోగొట్టుకొని ఇప్పుడు పదకొండవ సంవత్సరం గడుపుతున్నాము. అధమమైన బుద్ధి, స్వభావమూ గల వాణ్ణి తారుమారు చేసి అజ్ఞాతవాసాన్ని సుఖంగా గడుపుదాం. (8)
తవాజ్ఞయా పార్థివ నిర్విశంకా
విహాయ మానం విచరన్ వనాని ।
సమీపవాసేన విలోభితాస్తే
జ్ఞాస్యంతి నాస్మానపకృష్టదేశాన్ ॥ 9
రాజా! నీఆదేశం వల్ల జంకులేకుండా అభిమానాన్ని విడిచిపెట్టి అడవుల్లో తిరుగుతున్నాం. దగ్గరగా ఉండి వారికి మనమక్కడే ఉన్నట్లు నమ్మించి వెతికేటట్లు చేసి దూరప్రదేశాలకు వెళ్తే వారు మన ఉనికిని తెలుసుకోలేరు. (9)
సంవత్సరం తత్ర విహృత్య గూఢం
నరాధమం తం సుఖముద్ధరేమ ।
నిర్యాత్య వైరం సఫలం సపుష్పం
తస్మై నరేంద్రాధమపూరుషాయ ॥ 10
సుయోధనాయానుచరైర్వృతాయ
తతో మహీమావస ధర్మరాజ ।
స్వర్గోపమం దేశమిమం చరద్భిః
శక్యో విహంతుం నరదేవ శోకః ॥ 11
అక్కడ చాటుగా సంవత్సరం గడిపి తేలికగా నరాధముడైన ఆ దుర్యోధనుని పెకలిద్దాం. రాజా! అనుచరులతో కూడిన నీచుడైన దుర్యోధనుడు నాటగా పూసి, ఫలించిన వైరవృక్షాన్ని పీకేసి దాని నుండి బయటపడి అప్పుడు భూమిని నివాసంగా పొందు. మహారాజా! ధర్మరాజా! స్వర్గంలాంటి ఈ చోట తిరుగుతున్న మనకు శోకాన్ని విడిచిపెట్టటం కుదురుతుంది. (10,11)
కీర్తిస్తు తే భారత పుణ్యగంధా
నశ్యేద్ధి లోకేషు చరాచరేషు ।
తత్ ప్రాప్య రాజ్యం కురుపుంగవానాం
శక్యం మహత్ ప్రాప్తుమథ క్రియాశ్చ ॥ 12
ఇదం తు శక్యం సతతం నరేంద్ర
ప్రాప్తుం త్వయా యల్లభసే కుబేరాత్ ।
కురుష్వ బుద్ధిం ద్విషతాం వధాయ
కృతాగసాం భారత నిగ్రహే చ ॥ 13
అలా కాకపోతే భారతా! చరాచర జగత్తులో పవిత్రమైన నీకీర్తి నశించిపోతుంది. కురువంశశ్రేష్ఠుల గొప్పరాజ్యాన్ని పొందితే మంచి పనులు చెయ్యగల అవకాశాన్ని పొందుతాము. మహారాజా! కుబేరుడి వల్ల పొందుతున్న ఈ గౌరవం నీకెప్పుడూ లభిస్తుంది. శత్రువులను చంపటానికి తప్పులు చేసినవారిని అణచటానికి నిర్ణయం తీసుకో. (12,13)
తేజస్తవోగ్రం న సహేత రాజన్
సమేత్య సాక్షాదపి వజ్రపాణిః ।
న హి వ్యథాం జాతు కరిష్యతస్తౌ
సమేత్య దేవైరపి ధర్మరాజ ॥ 14
తవార్థసిద్ధ్యర్థమపి పవృత్తౌ
సుపర్ణకేతుశ్చ శినేశ్చ నప్తా ।
తథైవ కృష్ణోఽప్రతిమో బలేన
తథైవ చాహం నరదేవవర్య ॥ 15
తవార్థసిద్ధ్యర్థమభిప్రపన్నః
యథైవ కృష్ణః సహ యాదవైస్తైః ।
తథైవ చాహం నరదేవవర్య
యమౌ చ వీరౌ కృతినౌ ప్రయోగే ॥ 16
రాజా! స్వయంగా ఇంద్రుడైనా, నిన్నెదుర్కొని నీభయంకరమైన తేజస్సును సహించలేడు నీ పనిని సఫలం చెయ్యటానికి ప్రయత్నస్తున్న ఆ గరుడధ్వజుడైన కృష్ణుడు శినిమునిమమమడైన సాత్యకి ఎప్పుడైనా దేవతలతోనైనా సరే యుద్ధం చెయ్యటానికి శ్రమ అనుకోరు. రాజశ్రేష్ఠా! సాటిలేని బలంగల అర్జునుడు అలాగే నేనూ సిద్ధంగా ఉన్నాం.
రాజశ్రేష్ఠా! యాదవులతో కలిసి కృష్ణుడెలా నీపనిని సఫలం చెయ్యటానికి పూనుకున్నాడో, అలాగే నేనూ అస్త్రాలను ప్రయోగించే నేర్పుగల వీరులైన ఈ కవలలూ సిద్ధంగా ఉన్నాం. (14-16)
త్వదర్థయోగప్రభవప్రధానాః
శమం కరిష్యామ పరాన్ సమేత్య ॥ 16
నీకు ధనలాభం, అధికారసిద్ధి మా ప్రధానలక్ష్యాలు. కాబట్టి మేము శత్రువులనెదుర్కొని శత్రుత్వాన్ని అణచివేస్తాం. (16 1/2)
వైశంపాయన ఉవాచ
తతస్తదాజ్ఞాయ మతం మహాత్మా
తేషాం చ ధర్మస్య సుతో వరిష్ఠః ॥ 17
ప్రదక్షిణం వైశ్రవణాధివాసం
చకార ధర్మార్థవిదుత్తమౌజాః ।
ఆమంత్ర్య వేశ్మాని నదీః సరాంసి
సర్వాణి రక్షాంసి చ ధర్మరాజః ॥ 18
యథాగతం మార్గమవేక్షమాణః
పునర్గిరిం చైవ నిరీక్షమాణః ।
తతో మహాత్మా స విశుద్ధబుద్ధిః
సంప్రార్థయామాస నగేంద్రవర్యమ్ ॥ 19
వైశంపాయనుడు చెపుతున్నాడు.
తరువాత ధర్మార్థములనెరిగి, ఉత్తమమమైన ఓజస్సు, నిష్కల్మషమైన బుద్ధి గల మహాత్ముడు, ధర్మదేవత కుమారుడూ అయిన ధర్మరాజు వారి అభిప్రాయాన్ని తెలుసుకుని కుబేరుడి నివాసమైన ఆగంధమాదన పర్వతానికి ప్రదక్షిణం చేశాడు. అక్కడి భవనాలు నదులు సరస్సులు, రాక్షసులందరి అనుమతిపొంది, వచ్చిన మార్గం వంకచూస్తూ మళ్ళీ ఆ పర్వతం వైపు చూస్తూ శ్రేష్ఠమైన ఆ పర్వతరాజు నిలా ప్రార్థించాడు. (17-19)
సమాప్తకర్మా సహితః సుహృద్భిః
జిత్వా సపత్నాన్ ప్రతిలభ్య రాజ్యమ్ ।
శైలేంద్ర భూయస్తపసే జితాత్మా
ద్రష్టా తవాస్మీతి మతిం చకార ॥ 20
పర్వతరాజా! శత్రువులను జయించి రాజ్యాన్ని పొంది, స్నేహితులతో కలిసి నా కర్తవ్యాలను నెరవేర్చి, తిరిగి మళ్ళీ మనసును అదుపుచేసుకొని తపస్సు చెయ్యటానికి నిన్ను దర్శిస్తాను అని బయలుదేర తలచాడు. (20)
వృతాశ్చ సర్వైరనుజైర్ద్విజైశ్చ
తేనైవ మార్గేణ పతిః కురూణామ్ ।
ఉవాహ చైతాన్ గణశస్తథైవ
ఘటోత్కచః పర్వతనిర్ ఝరేషు ॥ 21
తన సోదరులందరితో, బ్రాహ్మణులతో కలిసి ధర్మరాజు ఆ మార్గం గుండా దిగసాగాడు. ఆ కొండమీద నుండి జాలువారే జలపాతాల వద్ద ఘటోత్కచుడు, తన గణాలతో కలిసి వీరిని మోస్తూ దాటించాడు. (21)
తాన్ ప్రస్థితాన్ ప్రీతమానా మహర్షిః
పితేవ పుత్రాననుశిష్య సర్వాన్ ।
స లోమశః ప్రీతమానా జగామ
దివౌకసాం పుణ్యతమం నివాసమ్ ॥ 22
ప్రీతి గల తండ్రి కొడుకులకుపదేశించినట్లుగా బయలుదేరిన వారందరికీ ఆ లోమశమహర్షి ఉపదేశించి, సంతోషంతో చాలా పవిత్రమైన దేవతల నివాసానికి వెళ్ళిపోయాడు. (22)
తేనార్ ష్టిషేణేన తథానుశిష్టాః
తీర్థాని రమ్యాణి తపోవనాని ।
మహాంతి చాన్యాని సరాంసి పార్థాః
సంపశ్యమానాః ప్రయయుర్నరాగ్య్రాః ॥ 23
రాజర్షి ఆర్ ష్టిషేణుడు వారికి అలా ఉపదేశించాడు - మానవశ్రేష్ఠులైన కుంతీకుమారులు పవిత్రజలాలను, అందమైన తపోవనాలను, ఇంకా పెద్ద సరస్సులనూ చూస్తూ ముందుకు సాగారు. (23)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఆజగరపర్వణి గంధమాదనప్రస్థానే షట్ సప్తత్యధికశతతమోఽధ్యాయః ॥ 176 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున అజగరపర్వమను ఉపపర్వమున గంధమాదన ప్రస్థానమను నూట డెబ్బది ఆరవ అధ్యాయము. (176)