177. నూట డెబ్బది ఏడవ అధ్యాయము
గంధమాదనము నుండి పాండవులు బదరికాశ్రమము ద్వారా ద్వైతవనము చేరుట.
వైశంపాయన ఉవాచ
నగోత్తమం ప్రస్రవణైరుపేతం
దిశాం గజైః కిన్నరపక్షిభిశ్చ ।
సుఖం నివాసం జహతాం హి తేషాం
న ప్రీతిరాసీద్ భరతర్షభాణామ్ ॥ 1
వైశంపాయనుడు చెపుతున్నాడు.
జలపాతాలు, దిగ్గజాలు కిన్నరులు, పక్షులతో కూడి సుఖనివాసానికి చోటైన పర్వతాన్ని విడిచిపెడుతున్న భరతవంశశ్రేష్ఠులైన ఆ పాండవులకు సంతోషంగా లేదు. (1)
తతస్తు తేషాం పునరేవ హర్షః
కైలాసమాలోక్య మహాన్ బభూవ ।
కుబేరకాంతం భరతర్షభాణాం
మహీధరం వారిధరప్రకాశమ్ ॥ 2
తరువాత మళ్ళీ భరతవంశశ్రేష్ఠులైన ఆ పాండవులకు కుబేరుడి మనసునాకట్టుకునే, తెల్లని మేఘాలతో ప్రకాశించే కైలాసాన్ని చూసేసరికి చాలా సంతోషం కలిగింది. (2)
సముచ్ఛ్రయాన్ పర్వతసన్నిరోధాన్
గోష్ఠాన్ హరీణాం గిరిసేతుమాలాః ।
బహూన్ ప్రపాతాంశ్చ సమీక్ష్య వీరాః
స్థలాని నిమ్నాని చ తత్ర తత్ర ॥ 3
తథైవ చాన్యాని మహావనాని
మృగద్విజానేకపసేవితాని ।
ఆలోకయంతోఽభియయుః ప్రతీతాః
తే ధన్వినః ఖడ్గధరా నరాగ్య్రాః ॥ 4
ధనుస్సులను, కత్తులను ధరించిన వీరులూ, నరశ్రేష్ఠులూ అయిన పాండవులు ఎత్తైన పర్వతశిఖరాలను, సింహాల గుంపులను, పర్వతాలలోని నదులను దాటేందుకు ఏర్పరచబడిన వంతెనల వరుసలను, అనేక జలపాతాలను, అక్కడక్కడా పల్లపుభూములను చూస్తూ... అలాగే జంతువులు, పక్షులు, ఏనుగులు తిరుగాడే ఇతరములైన పెద్ద అడవులను చూస్తూ అపాయాల శంక లేకుండా ముందుకు సాగారు. (3,4)
వనాని రమ్యాణి నద్యో సరాంసి
గుహా గిరీణాం గిరిగహ్వరాణి ।
ఏతే నివాసాః సతతం బభూవుః
దివానిశం ప్రాప్య నరర్షభాణామ్ ॥ 5
మానవశ్రేష్ఠులైన పాండవులకు అందమైన అడవులు, నదీతీరాలు సరస్సుల తీరాలు కొండలలోని గుహలు రాత్రింబవళ్ళూ వారికి నివాసయోగ్యాలయ్యాయి. (5)
తే దుర్గవాసం బహుధా నిరుష్య
వ్యతీత్య కైలాసమచింత్యరూపమ్ ।
ఆసేదురత్యర్థమనోరమం తే
తమాశ్రమాగ్య్రం వృషపర్వణస్తు ॥ 6
వారు చేరుకోలేని చోటులందు చాలాసార్లు గడిపి, ఊహకందని ఆకారం గల కైలాసపర్వతాన్ని దాటి ఎంతో మనోహరమైన శ్రేష్ఠమైన వృషపర్వుని ఆశ్రమాన్ని చేరుకున్నారు. (6)
సమేత్య రాజ్ఞా వృషపర్వణా తే
ప్రత్యర్చితాస్తేన చ వీతమోహాః ।
శశంసిరే విస్తరశః ప్రవాసం
గిరౌ యథావద్ వృషపర్వణస్తు ॥ 7
వారు రాజర్షి వృషపర్వుని కలుసుకుని అతనిచేత పూజింపబడి శోకమోహాలకు దూరమయ్యారు. గంధమాదనపర్వతం మీద వారు నివసించినతీరును ఉన్నది ఉన్నట్లు విపులంగా చెప్పారు. (7)
సుఖోషితాస్తస్య త ఏకరాత్రం
పుణ్యాశ్రమే దేవమహర్షిజుష్టే ।
అభ్యాయయుస్తే బదరీం విశాలాం
సుఖేన వీరాః పునరేవ వాసమ్ ॥ 8
దేవతలు, మహర్షులచేత సేవించబడే ఆ వృషపర్వుని పవిత్రమైన ఆశ్రమంలో ఆ వీరులు ఒకరాత్రి సుఖంగా గడిపి తిరిగి విశాలా పట్టణంలోని బదరికాశ్రమానికి సుఖనివాసం కోసం చేరుకున్నారు. (8)
ఊషుస్తతస్తత్ర మహానుభావాః
నారాయణస్థానగతాః సమగ్రాః ।
కుబేరకాంతాం నలినీం విశోకాః
సంపశ్యమానాః సురసిద్ధజుష్టామ్ ॥ 9
తరువాత అక్కడ నారాయణుని క్షేత్రమును చేరుకుని ఆ మహానుభావులందరూ శోకరహితులై; దేవతలు, సిద్ధులు సేవించే కుబేరుడికి ప్రియమైన కొలను చూస్తూ గడిపారు. (9)
తాం చాథ దృష్ట్వా నలినీం విశోకాః
పాండోః సుతాః సర్వనరప్రధానాః ।
తే రేమిరే నందనవాసమేత్య
ద్విజర్షయో వీతమలా యథైవ ॥ 10
రాజకుమారులు కొలను చూసి విశోకులయ్యారు. పాపరహితులైన బ్రహ్మర్షులు నందనవనాన్ని చేరుకున్నట్లు సంచరిస్తూ పాండవులు ఆనందించారు. (10)
తతః క్రమేణోపయయుర్నృవీరాః
యథాగతేనైవ పథా సమగ్రాః ।
విహృత్య మాసం సుఖినో బదర్యాం
కిరాతరాజ్ఞో విషయం సుబాహోః ॥ 11
మానవవీరులైన ఆ పాండవులందరూ బదరికాశ్రమంలో సుఖంగా ఒకనెలరోజులు గడిపి తరువాత క్రమంగా వచ్చిన మార్గాన కిరాతరాజైన సుబాహుని దేశానికి బయలుదేరారు. (11)
చీనాంస్తుషారాన్ దరదాంశ్చ సర్వాన్
దేశాన్ కులిందస్య చ భూమిరత్నాన్ ।
అతీత్య దుర్గం హిమవత్ప్రదేశం
పురం సుబాహోర్దదృశుర్నృవీరాః ॥ 12
చీన, తుషార, దరద దేశాలనన్నిటినీ, కుళిందుని సారవంతమైన భూములనూ దాటి పాండవులు దుర్గమమైన హిమాత్పర్వతం దాటి సుబాహుని పురాన్ని చూశారు. (12)
శ్రుత్వా చ తాన్ పార్థివపుత్రపౌత్రాన్
ప్రాప్తాన్ సుబాహుర్విషయే సమగ్రాన్ ।
ప్రత్యుద్యయౌ ప్రీతియుతః స రాజా
తం చాభ్యనందన్ వృషభాః కురూణామ్ ॥ 13
తన దేశానికి వచ్చిన రాజకుమారులు, మనుమలు గురించి విని ప్రీతితో ఆ రాజు కురుశ్రేష్ఠులను అభినందిస్తూ ఎదురుగా వెళ్ళాడు. (13)
సమేత్య రాజ్ఞా తు సుబాహునా తే
సూతైర్విశోకప్రమూఖైశ్చ సర్వే ।
సహేంద్రసేనైః పరిచారికైశ్చ
పౌరోగవైర్యే చ మహానసస్థాః ॥ 14
రాజైన సుబాహుని కలుసుకుని వారంతా విశోకుడు మొదలైన రథసారథుల్నీ, ఇంద్రసేనుడు మొదలైన పరిచారకుల్ని, ముందు నడిచే సేవకుల్నీ, వంటవారినీ కలిశారు. (14)
సుఖోషితాస్తత్ర త ఏకరాత్రం
సూతాన్ సమాదాయ రథాంశ్చ సర్వాన్ ।
ఘటోత్కచం సానుచరం విసృజ్య
తతోఽభ్యయుర్యామునమద్రిరాజమ్ ॥15
వారక్కడ ఒక రాత్రి సుఖంగా గడిపి సారథులందర్నీ, రథాలనూ తీసుకుని అనుచరులతో కలిసియున్న ఘటోత్కచుని విడిచిపెట్టి యమునానది పుట్టినచోటు నుండి హిమాలయానికి బయలుదేరారు. (15)
తస్మిన్ గిరౌ ప్రస్రవణోపపన్న
హిమోత్తరీయారుణపాండుసానౌ ।
విశాఖయూపం సముపేత్య చక్రుః
తదా నివాసం పురుషప్రవీరాః ॥ 16
జలపాతాలతో కూడిన ఆ కొండకు మంచు ఉత్తరీయంలా ఉంది. ఉదయించే సూర్యకిరణాలు పడటంతో లేత ఎరుపు, తెలుపు రంగులు తలపాగావలె ఉన్నాయి. ఆ కొండపై ఉన్న విశాఖయూపాన్ని చేరుకుని ఆ పురుషశ్రేష్ఠులక్కడ నివసించారు. (16)
వరాహనానామృగపక్షిజుష్టం
మహావనం చైత్రరథప్రకాశమ్ ।
శివేన పార్థా మృగయాప్రధానాః
సంవత్సరం తత్ర వనే విజహ్రుః ॥ 17
చైత్రరథవనంలా ఉన్న ఆ విశాలమైన అడవిలో పందులు మొదలైన జంతువులు, పక్షులు నివసిస్తున్నాయి. క్రూరజంతువులను వేటాడటమే ప్రధానమైన పనిగా ఒక సంవత్సరం వారక్కడ అడవిలో సుఖంగా సంచరించారు. (17)
తత్రాససాదాతిబలం భుజంగం
క్షుధార్దితం మృత్యుమివోగ్రరూపమ్ ।
వృకోదరః పర్వతకందరాయాం
విషాదమోహవ్యథితాంతరాత్మా ॥ 18
విషాద, మోహాలతో కూడిన మనసుగల భీముడక్కడ ఒకనాడు ఒక కొండగుహలో మృత్యువులా భయంకరమైన ఆకారమూ, బలమూ కల్గి; ఆకలి గొన్న ఒక పామును చేరుకున్నాడు. (18)
ద్వీపోఽభవద్ యత్ర వృకోదరస్య
యుధిష్ఠిరో ధర్మభృతాం వరిష్ఠః ।
అమోక్షయద్ యస్తమనంత తేజా
గ్రాహేణ సంవేష్టితసర్వగాత్రమ్ ॥ 19
అపుడు ధర్మాత్ములలో శ్రేష్ఠుడు, అంతులేని తేజస్సు గల యుధిష్ఠిరుడు భీమునికి దీవి(ఊతం)లా అయ్యాడు. పాముచే ఒళ్ళంతా చుట్టబడ్డ అతనిని విడిపించాడు. (19)
తే ద్వాదశం వర్షముపోపయాతం
వనే విహర్తుం కురవః ప్రతీతాః ।
తస్మాద్ వనాచ్చైత్రరథప్రకాశాత్
శ్రియాజ్వలంతస్తపసా చ యుక్తాః ॥ 20
తతశ్చ యాత్వా మరుధన్వపార్శ్వం
సదా ధనుర్వేదరతిప్రధానాః ।
సరస్వతీమేత్య నివాసకామాః
సరస్తతో ద్వైతవనం ప్రతీయుః ॥ 21
ఆ కురువంశీయులైన పాండవులు పన్నెండవ సంవత్సరం సమీపిస్తూండగా అడవిలో ఆనందంగా గడపటానికే ఉత్సాహపడుతున్నారు. తమకాంతితో ప్రకాశిస్తూ, తపస్సుతో కూడియున్న పాండవులు చైత్రరథంలా ప్రకాశించే ఆ అడవి నుండి బయలుదేరి, ధనుర్వేదం మీదే ఎప్పుడూ ఆసక్తి కలిగి, మరుభూమి (ఎడారి) ప్రక్కన సరస్వతీనదీతీరాన్ని చేరి నివసించాలని ద్వైతవనానికి చెందిన సరస్సు వద్దకు వెళ్ళారు. (20,21)
సమీక్ష్య తాన్ ద్వైతవనే నివిష్టాన్
నివాసినస్తత్ర తతోఽభిజగ్ముః ।
తపోదమాచారసమాధియుక్త
స్తృణోదపాత్రావరణాశ్మకుట్టాః ॥ 22
తపస్సు, ఇంద్రియనిగ్రహం, సదాచారం, సమాధులతో కూడి, ధర్భలు, జలపాత్రలు, వస్త్రములు, రాతిపలకలు సామగ్రిగా కల ఆ ప్రదేశవాసులు ద్వైతవనంలో ప్రవేశించిన పాండవుల్ని చూసి సమీపించారు. (22)
ప్లక్షాక్షరౌహీతకవేతాసాశ్చ
తథా బదర్యః ఖదిరాః శిరీషాః ।
బిల్వేంగుదాః పీలుశమీకరీరాః
సరస్వతీతీరరుహా బభూవుః ॥ 23
జువ్వి, జిల్లేడు, రౌహీతక, మద్ది, రేగు, చండ్ర, దిరిసెన, మారేడు, ఇంగుదీ(ఇప్ప), పీలు, జమ్మి, కరీర చెట్లు ఆ సరస్వతీ నదీ తీరాన ఉన్నాయి. (23)
తాం యక్షగంధర్వమహర్షికాంతమ్
ఆగారభూతామివ దేవతానామ్ ।
సరస్వతీం ప్రీతియుతాశ్చరంతః
సుఖం విజహ్రుర్నరదేవపుత్రాః ॥ 24
యక్షులు, గంధర్వులు, మహర్షుల మనసులను ఆకట్టుకునే దేవనివాసంలా ఉన్న ఆ సరస్వతీనదీతీరంలో ప్రీతితో తిరుగుతూ ఆ రాజకుమారులు సుఖంగా నివసించసాగారు. (24)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఆజగరపర్వణి పునర్ద్వైతవనప్రవేశే సప్తసప్తత్యధికశతతమోఽధ్యాయః ॥ 177 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఆజగరపర్వమను ఉపపర్వమున పునర్ద్వైతవనప్రవేశమను నూట డెబ్బది ఏడవ అధ్యాయము. (177)