178. నూట డెబ్బది ఎనిమిదవ అధ్యాయము

అజగరము భీముని పట్టుకొనుట.

జనమేజయ ఉవాచ
కథం నాగాయుతప్రాణః భీమో భీమపరాక్రమః ।
భయమాహారయత్ తీవ్రం తస్మాదజగరాన్మునే ॥ 1
జనమేజయుడు అడుగుతున్నాడు.
మునీ! పదివేల ఏనుగుల బలమూ, భయంకరమైన పరాక్రమమూ కల భీముడు ఆ పామువల్ల తీవ్రభయాన్ని ఎలా పొందాడు? (1)
పౌలస్త్యం ధనదం యుద్ధే య ఆహ్వయతి దర్పితః ।
నలిన్యాం కదనం కృత్వా నిహంతా యక్షరక్షసామ్ ॥ 2
తం శంససి భయావిష్టమ్ ఆపన్నమరిసూదనమ్ ।
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే ॥ 3
పులస్త్యమహర్షి కుమారుడైన కుబేరుని గర్వంతో యుద్ధానికి పిల్చినవాడు , కుబేరుడి సరస్సువద్ద యుద్ధంచేసి యక్షులు, రాక్షసుల్నీ చంపిన భీముడు భయాన్ని పొందడు. ఆపదలో చిక్కుకున్నాడంటున్నావు. ఈ విషయం నేను వినాలనుకుంటున్నాను. నాకు చాలా ఆసక్తిగా ఉంది. (2,3)
వైశంపాయన ఉవాచ
బహ్వాశ్చర్యే వనే తేషాం వసతాముగ్రధన్వినామ్ ।
ప్రాప్తానామాశ్రమాద్ రాజన్ రాజర్షేర్వృషపర్వణః ॥ 4
వైశంపాయనుడు చెపుతున్నాడు - రాజా! రాజర్షి వృషపర్వుని ఆశ్రమం నుండి వచ్చి, ధనుస్సులు దాల్చి ఆ పాండవులు ఎన్నో ఆశ్చర్యాలతో నిండిన ఆ అడవిలో ఉంటున్నారు. (4)
యదృచ్ఛయా ధనుష్పాణిః బద్ధఖడ్గో వృకోదరః ।
దదర్శ తద్ వనం రమ్యం దేవగంధర్వసేవితమ్ ॥ 5
ఒరలో కత్తి, చేతిలో ధనుస్సుతో భీముడు దేవతలూ గంధర్వులూ సేవించే అందమైన ఆ అడవిని చూసి అందులో యధేచ్ఛగా విహరిస్తున్నాడు. (5)
స దదర్శ శుభాన్ దేశాన్ గిరేర్హిమవతస్తదా ।
దేవర్షిసిద్ధచరితాన్ అప్సరోగణసేవితాన్ ॥ 6
అతడు దేవర్షులూ సిద్ధులూ తిరిగే, అప్సరసల సమూహాలు సేవించే పవిత్రములైన హిమవత్పర్వత ప్రాంతాలను చూశాడు. (6)
చకోరైరుపచక్రైశ్చ పక్షిభిర్జీవజీవకైః ।
కోకిలైర్భృంగరాజైశ్చ తత్ర తత్ర నినాదితాన్ ॥ 7
అక్కడక్కడా చకోర, ఉపచక్ర, జీవజీవక, కోకిల, భృంగరాజపక్షులు కూస్తున్నాయి. (7)
నిత్యపుష్పఫలైర్వృక్షైః హిమసంస్పర్శకోమలైః ।
ఉపేతాన్ బహులచ్ఛాయైః మనోనయననందనైః ॥ 8
ఆ ప్రాంతాలలో చెట్లు అన్నికాలాల్లో పూలూ పండ్లూ ఇస్తాయి. మంచు పడటంచేత అవి సుకుమారంగా ఉంటాయి. ఎంతో నీడ గలవి, మనసులకు కళ్ళకూ ఆనందాన్ని ఇస్తూంటాయి. (8)
స సంపశ్యన్ గిరినదీః వైదుర్యమణిసన్నిభైః ।
సలిలైర్హిమసంకాశైః హంసకారండవాయుతైః ॥ 9
వైడూర్యమణులవంటి రంగుతో, మంచులా స్వచ్ఛంగా ఉన్న వేలహంసలు, కారండవపక్షులూ గల కొండలలోని నదులను అతడు ఆసక్తితో చూడసాగాడు. (9)
వనాని దేవదారూణాం మేఘానామివ వాగురాః ।
హరిచందనమిశ్రాణి తుంగకాలీయకాన్యపి ॥ 10
ఎర్రచందనవృక్షాలతో కలిసిపోయిన, సురపొన్నలు, నల్లచందనములతో దేవదారు అడవులు మేఘాల వలల వలే ఉన్నాయి. (10)
మృగయాం పరిధావన్ స సమేషు మరుధన్వసు ।
విధ్వన్ మృగాన్ శరైః శుద్ధైః చచార స మహాబలః ॥ 11
గొప్ప బలం గల ఆ భీముడు బల్లపరుపుగా ఉన్న మరు(ఎడారి) భూములందు వేటకోసం పరుగెడుతూ మామూలు బాణాలతో జంతువుల్ని గాయపరుస్తూ తిరిగాడు. (11)
భీమసేనస్తు విఖ్యాతో మహాంతం దంష్ట్రిణం బలాత్ ।
నిఘ్నన్ నాగశతప్రాణః వనే తస్మిన్ మహాబలః ॥ 12
భీమసేనుడు చాలాబలవంతుడుగా ప్రసిద్ధుడు. అతనికి వందల ఏనుగుల శక్తి ఉంది. ఆ అడవిలో తనబలంతో పెద్దపెద్ద సింహాలను చంపుతున్నాడు. (12)
మృగాణాం స వరాహాణాం మహిషాణాం మహాభుజః ।
వినిఘ్నం స్తత్ర తత్రైవ భీమో భీమపరాక్రమః ॥ 13
దీర్ఘభుజాలు, భయంకరమైన పరాక్రమమూ గల ఆ భీముడు అక్కడ కూడా జంతువుల్ని, పందుల్ని, దున్నపోతుల్ని చంపుతున్నాడు. (13)
స మాతంగశతప్రాణః మనుష్యశతవారణః ।
సింహశార్దూలవిక్రాంతః వనే తస్మిన్ మహాబలః ॥ 14
వృక్షానుత్పాటయామాస తరసా వై బభంజ చ ।
పృథివ్యాశ్చ ప్రదేశాన్ వై నాదయంస్తు వనాని చ ॥ 15
గొప్పబలంగల ఆ భీముడు వందల మదపుటేనుగుల బలం కలవాడు, ఒక్క ఉదుటున వందమంది మనుష్యుల్ని అడ్డుకోగలడు. సింహాలు, శార్దూలాలకంటే పరాక్రమం గలవాడు. ఆ అడవిలో వేగంగా చెట్లను పెకలించి విరగ్గొట్టాడు. మైదానప్రాంతాల్ని, అడవుల్ని తనగర్జనలతో మారుమ్రోగింపచేస్తున్నాడు. (14,15)
పర్వతాగ్రాణి వై మృద్నన్ నాదయానశ్చ విజ్వరః ।
ప్రక్షిపన్ పాదపాంశ్చాపి నాదేనాపూరయన్ మహీమ్ ॥ 16
పర్వతశిఖరాలను చదునుచేస్తూ, చెట్లను పీకి విసిరేస్తూ, జంకులేకుండా తనగర్జనతో భూమండలాన్ని నింపి మారుమ్రోగింపచేస్తున్నాడు. (16)
వేగేన న్యపతద్ భీమోనిర్భయశ్చ పునః పునః ।
ఆస్ఫోటయన్ క్ష్వేడయంశ్చ తలతాలాంశ్చ వాదయన్ ॥ 17
భయంలేని భీముడు మాటిమాటికీ, చప్పుడు చేస్తూ చరుస్తూ, చప్పట్లుకొడుతూ, మ్రోగిస్తూ వేగంగా ఎగిరిపడుతున్నాడు. (17)
చిరసంబద్ధదర్పస్తు భీమసేనో వనే తదా ।
గజేంద్రాశ్చ మహాసత్త్వాః మృగేంద్రాశ్చ మహాబలాః ॥ 18
భీమసేనస్య నాదేన వ్యముంచంత గుహా భయాత్ ।
భీముడికి బలగర్వం చాలాకాలం నుండి ఉంది. ఆ భీమునిసింహనాదానికి శక్తి గల గజరాజులు ఎంతో బలం గల సింహాలు భయంతో తామున్న గుహలను విడిచి పారిపోతున్నాయి. (18 1/2)
క్వచిత్ ప్రధావంస్తిష్ఠంశ్చ క్వచిచ్చోపవిశంస్తథా ।
మృగప్రేప్సుర్మహారౌద్రే వనే చరతి నిర్భయః ।
స తత్ర మనుజవ్యాఘ్రః వనే వనచరోపమః ॥ 20
పద్భ్యామభిసమాపేదే భీమసేనో మహాబలః ।
స ప్రవిష్టో మహారణ్యే నాదాన్ నదతి చాద్భుతాన్ ॥ 21
త్రాసయన్ సర్వభూతాని మహాసత్త్వపరాక్రమః ।
నిర్భయంగా జంతువులను వేటాడుతూ చాలా ఘోరమైన ఆ అడవిలో ఒకచోట పరిగెడుతూ, ఒకచోట నిలుస్తూ మరోచోట కూర్చుంటూ సాగాడు. మనుష్యులలో పెద్దపులిలాంటి బలం గల ఆ భీమసేనుడు ఆటవికుడిలా ఆ అడవిలో కాలినడకన సాగుతున్నాడు. ఎంతోశక్తి, పరాక్రమం గల అతడు ఆ పెద్ద అడవిలో అద్భుతంగా గర్జిస్తూ ప్రాణులన్నింటిని బెదరగొడుతూ ప్రవేశించాడు. (20,21 1/2)
తతో భీమస్య శబ్దేన భీతాః సర్పా గుహాశయాః ॥ 22
అతిక్రాంతాస్తు వేగేన జగామానుసృతః శనైః ।
తతోఽమరవరప్రఖ్యో భీమసేనో మహాబలః ॥ 23
స దదర్శ మహాకాయం భుజంగం లోమహర్షణమ్ ।
గిరిదుర్గే సమాపన్నం కాయేనావృత్య కందరమ్ ॥ 24
భీముడి గర్జనలకు భయపడి గుహలలో ఉన్న పాములు వేగంగా కదిలిపోతున్నాయి. మెల్లగా భీముడు వాటివెంట వెళ్ళాడు. తరువాత దేవతాశ్రేష్ఠులకాంతి, గొప్పబలమూ గల భీమసేనుడు తనశరీరంతో గుహను చుట్టినంత పెద్దశరీరంతో గగుర్పాటు కలిగించే గిరిదుర్గంలో ఉన్న పామును చుశాడు. (22-24)
పర్వతాభోగవర్ష్మాణమ్ అతికాయం మహాబలమ్ ।
చిత్రాంగమంగజైశ్చిత్రైః హరిద్రాసదృశచ్ఛవిమ్ ॥ 25
గుహాకారేణ వక్త్రేణ చతుర్దంష్ట్రేణ రాజతా ।
దీప్తాక్షేణాతితామ్రేణ లిహానం సృక్కిణీ ముహుః ॥ 26
త్రాసనం సర్వభూతానాం కాలాంతకయమోపమమ్ ।
నిఃశ్వాసక్ష్వేడనాదేన భర్త్సయంతమివ స్థితమ్ ॥ 27
పర్వతంలా విశాలమైన పెద్దశరీరం, చాలా బలం కలిగి ఉంది. చిత్రంగా ఉన్న అవయవాలతో దానిశరీరం విచిత్రంగా ఉంది. దాని కాంతి పసుపుపచ్చగా ఉంది. నాలుగుకోరలున్న గుహలాంటి నోటితో ప్రకాశిస్తోంది. నిప్పులుకక్కే ఎర్రటి కళ్ళున్నాయి. మాటిమాటికీ రెండు కోరలను నాకుతోంది. ప్రళయకాలంలోని యముడిలా ఉంది. ప్రాణులన్నింటిని చెదరగొట్టుతోంది. బయటకు వదిలే గాలి చప్పుడుతో విసిరిపారేస్తున్నట్లుంది. (25-27)
స భీమం సహసాభ్యేత్య పృదాకుః కుపితో భృశమ్ ।
జగ్రాహాజగరో గ్రాహః భుజయోరుభయోర్బలాత్ ॥ 28
మనుష్యుల్ని పట్టుకొనే, చాలా కోపంతో ఉన్న ఆ పాము ఒక్క ఉదుటున వచ్చి ఆ భీముడి రెండు భుజాలను గట్టిగా చుట్టేసింది. (28)
తేన సంస్పృష్టగాత్రస్య భీమసేనస్య వై తదా ।
సంజ్ఞా ముమోహ సహసా వరదానేన తస్య హి ॥ 29
అప్పుడు ఆ పాముచే చుట్టబడిన భీమసేనుడు వెంటనే తెలివితప్పాడు. ఆ పాముకున్న వరబలం వల్ల అలా జరిగింది. (29)
దశనాగసహస్రాణి ధారయంతి హి యద్ బలమ్ ।
తద్ బలం భీమసేనస్య భుజయోరసమం పరైః ॥ 30
పదివేల ఏనుగులబలం గల ఆ భీమసేనుడి భుజబలంతో ఇతరులు ఎవ్వరూ సాటిరారు. (30)
స తేజస్వీ తథా తేన భుజగేన వశీకృతః ।
విస్ఫురన్ శనకైర్భీమః న శశాక విచేష్టితుమ్ ॥ 31
తేజోవంతుడైన ఆ భీముడిలా పాముచే పట్టుకొనబడి మెల్లగా తేరుకొని కూడా దాన్ని వదిలించుకోవటం చేతకాని వాడయ్యాడు. (31)
నాగాయుతసమప్రాణః సింహస్కంధో మహాభుజః ।
గృహీతో వ్యజహాత్ సత్త్వం వరదానవిమోహితః ॥ 32
పదివేల ఏనుగుల ప్రాణశక్తి సింహంలాంటి మూపురమూ గొప్ప భుజాలూ కలిగి కూడా ఆ పాముకున్న వరప్రభావం చేత మోహితుడయ్యాడు. దాని పట్టువల్ల తన బుద్ధిబలాన్ని పోగొట్టుకున్నాడు. (32)
స హి ప్రయత్నమకరోత్ తీవ్రమాత్మవిమోక్షణే ।
న చైనమశకద్ వీరః కథంచిత్ ప్రతిబాధితుమ్ ॥ 33
తనను విడిపించుకోవటానికి అతడెంతో తీవ్రంగా ప్రయత్నించాడు. కాని ఆ పామును త్రిప్పికొట్టటానికి ఆ వీరుడికెంత మాత్రమూ సాధ్యంకాలేదు. (33)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఆజగరపర్వణి అజగరగ్రహణే అష్ట సప్తత్యధికశతతమోఽధ్యాయః ॥ 178 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఆజగరపర్వమను ఉపపర్వమున అజగరగ్రహణమను నూటడెబ్బది ఎనిమిదవ అధ్యాయము. (178)