186. నూట ఎనుబది ఆరవ అధ్యాయము

తార్ క్ష్య సరస్వతీ సంవాదము.

మార్కండేయ ఉవాచ
అత్రైవ చ సరస్వత్యా గీతం పరపురంజయ ।
పృష్టయా మునినా వీర శృణు తార్ క్ష్యేణ ధీమతా ॥ 1
మార్కండేయుడిలా అన్నాడు.
శత్రుపురంజయా! వీరా! ఈ విషయాన్ని గురించియే ధీమంతుడైన తార్ష్యుడు అడుగగా సరస్వతి చెప్పిన సమాధానాన్ని విను. (1)
తార్ క్ష్య ఉవాచ
కిం ను శ్రేయః పురుషస్యేహ భద్రే
కథం కుర్వన్ న చ్యవతే స్వధర్మాత్ ।
ఆచక్ష్వ మే చారుసర్వాంగి కుర్యాం
త్వయా శిష్టో న చ్యవేయం స్వధర్మాత్ ॥ 2
తార్ క్ష్యుడిలా అడిగాడు. కళ్యాణీ! ఇహలోకంలో పురుషునకేది శ్రేయస్సు? సధర్మభ్రష్టత లేకుండా ఎలా ప్రవర్తించాలి? సుందరీ! నాకు చెప్పు. పాటిస్తాను. స్వధర్మం నుండి జారకుండా నిలుస్తాను. (2)
కథం వాగ్నిం జుహుయాం పూజయే వా
కస్మిన్ కాలే కేన ధర్మో న నశ్యేత్ ।
ఏతత్ సర్వం సుభగే ప్రబ్రవీహి
యథా లోకాన్ విరజాః సంచరేయమ్ ॥ 3
సుభగా! ఎప్పుడు ఏవిధంగా అగ్నిహవనం చేయాలి? ఎలా పూజించాలి? ఏ పనిచేస్తే ధర్మం నశించకుండా ఉంటుంది? ఇదంతా నాకు చెప్పు. దానితో నేను రజోగుణహీనుడనై లోకాల్లో సంచరిస్తాను. (3)
వి॥ సం॥ "తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి" అని శ్రుతివాక్యం. అటువంటి సర్వలోకకామచారిత్వం ఎలా సిద్ధిస్తుందని ప్రశ్న. (నీల్)
మార్కండేయ ఉవాచ
ఏవం పృష్టా ప్రీతియుక్తేన తేన
శుశ్రూషుమీక్ష్యోత్తమబుద్ధియుక్తమ్ ।
తార్ క్ష్యం విప్రం ధర్మయుక్తం హితం చ
సరస్వతీ వాక్యమిదం బభాషే ॥ 4
మార్కండేయుడిలా అన్నాడు.
ప్రేమపూర్వకంగా అలా అడుగగా సరస్వతి ఉత్తమబుద్ధి గల ఆ విప్రుని శుశ్రూషను గుర్తించి ధర్మబద్ధమూ, హితకరమూ అయిన వాక్యాన్ని తార్ష్యునకు ఇలా చెప్పింది. (4)
సరస్వత్యువాచ
యో బ్రహ్మ జానాతి యథాప్రదేశం
స్వాధ్యాయనిత్యః శుచిరప్రమత్తః ।
స వై పారం దేవలోకస్య గంతా
సహామరైః ప్రాప్నుయాత్ ప్రీతియోగమ్ ॥ 5
సరస్వతి ఇలా చెప్పింది. అప్రమత్తుడై, పవిత్రుడై, నిత్యాధ్యయనశీలుడై అర్చిరాదిమార్గాల ద్వారా చేరదగిన పరబ్రహ్మను తెలిసికొన్నవాడు దేవలోకం నుండి బ్రహ్మలోకాన్ని పొంది దేవతలతో ప్రేమబంధాన్ని ఏర్పరచుకొంటాడు. (5)
తత్ర స్మ రమ్యా విపులా విశోకాః
సుపుష్పితాః పుష్కరిణ్యః సుపుణ్యాః ।
అకర్దమా మీనవత్యః సుతీర్థాః
హిరణ్మయైరావృతాః పుండరీకైః ॥ 6
అక్కడ చిన్న చిన్న సరోవరాలుంటాయి. అవి అందమైనవి, విశాలమైనవి, శోకంలేనివి, చక్కగా పుష్పించినవి, పవిత్రమైనవి. వాటిలో బురద ఉండదు. చేపలకు అవి వాసయోగ్యాలు. బంగారుతామరలతో నిండినవి. అక్కడక్కడ చక్కని స్నానఘట్టాలుంటాయి. (6)
తాసాం తీరేష్వాసతే పుణ్యభాజో
మహీయమానాః పృథగప్సరోభిః ।
సుపుణ్యగంధాభిరలంకృతాభిః
హిరణ్యవర్ణాభిరతీవ హృష్టాః ॥ 7
ఆ సరస్సుల తీరాలలో విడివిడిగా అప్సరసలతో కూడి ఆనందిస్తున్న పుణ్యాత్ములుంటారు. ఆ అప్సరసలు పవిత్రచందనాలతో, ఆభరణాలతో అలంకరింపబడి బంగారువన్నెతో ప్రకాశిస్తూంటారు. (7)
పరం లోకం గోప్రదాస్త్వాప్నువంతి
దత్త్వానడ్ వాహం సూర్యలోకం వ్రజంతి ।
వాసో దత్త్వా చాంద్రమసం తు లోకం
దత్త్వా హిరణ్యమమరత్వమేతి ॥ 8
గోదానం చేసినవారు ఉత్తమలోకాలను పొందుతారు. ఎద్దులను దానం చేసినవారు సూర్యలోకాన్ని పొందుతారు. వస్త్రదానం చేసినవాడు చంద్రలోకాన్ని చేరుతాడు. సువర్ణదానం చేసినవాడు అమరుడు కాగలడు. (8)
మంచివన్నె కలిగి, తేలికగా పాలిచ్చే స్వభావం గలిగి, మంచి దూడలను ఇస్తూ పారిపోకుండా నిలిచే స్వభావం గల ఆవులను దానం చేసినవాడు ఆ ఆవుల శరీరంపై గల రోమాలసంఖ్యతో సమానమైన సంవత్సరాలు దేవలోకంలో ఉంటాడు. (9)
అనడ్ వాహం సువ్రతం యో దదాతి
హలస్య వోఢారమనంతవీర్యమ్ ।
ధురంధరం బలవంతం యువానం
ప్రాప్నోతి లోకాన్ దశ ధేనుదస్య ॥ 10
సత్స్వభావం గలిగి, పొలం దున్నగలిగి, అనంతశక్తి గలిగి, బండి లాగగలిగిన బలిష్ఠమైన కోడెదూడను దానం చేసినవాడు ఆవుదానం చేసిన వానికన్న పదిరెట్లు పుణ్యలోకాలను పొందుతాడు. (10)
దదాతి యో వై కపిలాం సచైలాం
కాంస్యోపదోహాం ద్రవిణైరుత్తరీయైః ।
తైస్తైర్గుణైః కామదుహాథ భూత్వా
నరం ప్రదాతారముపైతి సా గౌః ॥ 11
పాలు పితకడానికి కంచుగిన్నెను, వస్త్రాలను, తరువాత అయ్యే మేత ఖర్చును కలిపి కపిలగోవును దానం చేస్తే ఆ ఆవు ఆ గుణాలతో కామధేనువుగా మారి పరలోకంలో దాతను చేరుతుంది. (11)
యావంతి రోమాణి భవంతి ధేన్వాః
తావత్ ఫలం భవతి గోప్రదానే ।
పుత్రాంశ్చ పౌత్రాంశ్చ కులం చ సర్వమ్
ఆసప్తమం తారయతే పరత్ర ॥ 12
ఆవుకు ఎన్ని వెంట్రుకలుంటాయో అన్ని సంవత్సరాలు గోదానం చేసినవాడు దాని ఫలాన్ని అనుభవిస్తాడు. అంతేకాక పరలోకంలో గోదాత కొడుకులను, మనుమలను, వంశాన్ని ఏడుతరాల వరకు తరింపజేస్తుంది. (12)
సదక్షిణాం కాంచనచారుశృంగీం
కాంస్యోపదోహాం ద్రవిణైరుత్తరీయైః ।
ధేనుం తిలానాం దదతో ద్విజాయ
లోకా వసూనాం సులభా భవంతి ॥ 13
స్వకర్మభిర్దానవసన్నిరుద్ధే
తీవ్రాంధకారే నరకే సంపతంతమ్ ।
మహార్ణవే నౌరివ వాతయుక్తా
దానం గవాం తారయతే పరత్ర ॥ 14
అందమైన బంగారు కొమ్ములు, పాలు పితకటానికి కంచుపాత్ర, ధనం, వస్త్రాలు, దక్షిణలతో పాటు మచ్చల ఆవును బ్రాహ్మణునకు దానమిచ్చినవాడు తేలికగా వసులోకాలను చేరగలుగుతాడు. తన కర్మల వలన అంతశ్శత్రువులచే నిరోధింపబడి గాఢాంధకారం గల
నరకంతో పడబోయే వానిని కూడా మహాసముద్రంలో అనుకూల వాయువు గల నౌకలాగా గోదానం పరలోకంలో తరింపజేస్తుంది. (13,14)
యో బ్రాహ్మదేయాం తు దదాతి కన్యాం
భూమిప్రదానం చ కరోతి విప్రే ।
దదాతి దానం విధినా చ యశ్చ
స లోకమాప్నోతి పురందరస్య ॥ 15
బ్రాహ్మవివాహ విధితో దానయోగ్య అయిన కన్యను దానం చేసినవాడు, బ్రాహ్మణునకు భూదానం చేసినవాడు, శాస్త్రోక్తంగా వివిధదానాలు చేసినవాడు ఇంద్రలోకాన్ని పొందుతాడు. (15)
యః సప్త వర్షాణి జుహోతి తార్ క్ష్య
హవ్యం త్వగ్నౌ నియతః సాధుశీలః ।
సప్తావరాన్ సప్త పూర్వాన్ పునాతి
పితామహానాత్మనా కర్మభిః స్వైః ॥ 16
తార్ష్యా! సత్ప్రవర్తన గలవాడై, నియమపూర్వకంగా ఏడుసంవత్సరాలు అగ్నిలో హవ్యాన్ని ఆహుతి చేసినవాడు తన సత్కర్మల ఫలితంగా తనతో పాటు గతించిన ఏడుతరాల పితరులను, రాబోయే ఏడు తరాలను కూడా పవిత్రం చేస్తాడు. (16)
వి॥సం॥ "అగ్నిహోత్రం జుహ్వానా లోభజాలం భినత్తి అంతః సంమోహం ఛిత్వా" అని మైత్రాయణీయోపనిషత్తు అగ్ని హోత్రానికి జ్ఞానాంతరంగత్వాన్ని ప్రతిపాదిస్తోంది. (నీల)
తార్ క్ష్య ఉవాచ
కిమగ్నిహోత్రస్య వ్రతం పురాణమ్
ఆచక్ష్య మే పృచ్ఛతశ్చానురూపే ।
త్వయానుశిష్టోఽహమిహాద్య విద్యాం
యదగ్నిహోత్రస్య వ్రతం పురాణమ్ ॥ 17
తార్ష్యుడిలా అన్నాడు దివ్యసుందరీ! అగ్నిహోత్రం యొక్క ప్రాచీన నియమమేమిటో అడుగుతున్నాను. చెప్పు. నీవు ఉపదేశిస్తే నేను అగ్నిహోత్రవ్రతం యొక్క ప్రాచీననియమాన్ని తెలిసికొంటాను. (17)
సరస్వత్యువాచ
న చాశుచిర్నాప్యనిర్ణిక్తపాణిః
నాబ్రహ్మవిజ్జుహుయాన్నావిపశ్చిత్ ।
బుభుత్సవః శుచికామా హి దేవా
నాశ్రద్దధానాద్ది హవిర్జుషంతి ॥ 18
సరస్వతి ఇలా అన్నది. అపరిశుభ్రుడు, చేతులు శుభ్రం చేసికొననివాడు, వేద జ్ఞానశూన్యుడు, అపండితుడు, అగ్నితో వ్రేల్చరాదు. దేవతలు ఇతరుల మనస్సులను తెలుసుకొన గోరుతారు. పవిత్రతను కోరేవారు. శ్రద్ధలేనివారి హవిస్సులను గ్రహించరు. (18)
నాశ్రోత్రియం దేవహవ్యే నియుంజ్యాత్
మోఘం పురా సించతి తాదృశో హి ।
అపూర్వమశ్రోత్రియమాహ తార్ క్ష్య
న వై తాదృగ్ జుహుయాదగ్నిహోత్రమ్ ॥ 19
వేదవేత్త కాని వానిని హవిర్దానంలో నియంత్రించకూడదు. అటువంటివాని ఆహుతి నిరర్థకం. తార్ష్యా! అశ్రోత్రియుడు దేవతలకు అపరిచితుని క్రింద లెక్క, కాబట్టి అటువంటివాడు అగ్నిహోత్రానికి అర్హుడు కాడు. (19)
కృశాశ్చ యే జుహ్వతి శ్రద్ధధానాః
సత్యవ్రతా హుతశిష్టాశినశ్చ ।
గవాం లోకం ప్రాప్య తే పుణ్యగంధం
పశ్యంతి దేవం పరమం చాపి సత్యమ్ ॥ 20
తపస్సుతో కృశించి, సత్యవ్రతులై, శ్రద్ధాళువులై, శేషహోమద్రవ్యాన్ని భుజించేవారు పరిమళభరితమైన గోలోకానికి వెళ్ళి అక్కడ సత్యస్వరూపుడైన పరమాత్మను సందర్శిస్తారు. (20)
తార్ క్ష్య ఉవాచ
క్షేత్రజ్ఞభూతాం పరలోకభావే
కర్మోదయే బుద్ధిమతిప్రవిష్టామ్ ।
ప్రజ్ఞాం చ దేవీం సుభగే విమృశ్య
పృచ్ఛామి త్వాం కా హ్యసి చారురూపే ॥ 21
తార్ష్యుడిలా అన్నాడు.
దివ్యసుందరీ! సౌభాగ్యవతీ! నీవు పరమాత్మస్వరూపవు. పరలోకవిషయంలో, కర్మఫలవిషయంలో ప్రసరించే బుద్ధిస్వరూపవు. ప్రజ్ఞాదేవివి. అయినా అడుగుతున్నాను. వాస్తవంగా నీ రూపమేది? (21)
సరసత్యువాచ
అగ్నిహోత్రాదహమభ్యాగతాస్మి
విప్రర్షభాణాం సంశయచ్ఛేదనాయ ।
త్వత్సంయోగాదహమేతమబ్రువం
భావే స్థితా తథ్యమర్థం యథావత్ ॥ 22
సరస్వతి ఇలా అన్నది. బ్రహ్మర్షుల సందేహాలను తీర్చటానికి అగ్నిహోత్రం నుండి వచ్చిన దానను నేను. నీ సంయోగంతో నేను సత్యవచనాలను యథాతథంగా చెప్పగలిగిననాను. మనోగతశ్రద్ధయే నా స్వరూపం. (22)
తార్ క్ష్య ఉవాచ
న హి త్వయా సదృశీ కాచిదస్తి
విభ్రాజసే హ్యతిమాత్రం యథా శ్రీః ।
రూపం చ తే దివ్యమనంతకాంతి
ప్రజ్ఞాం చ దేవీం సుభగే బిభర్షి ॥ 23
తార్ష్యుడిలా అన్నాడు. సౌభాగ్యవతీ! నీ వంటి స్త్రీ మరొకతె లేదు. లక్ష్మివలె మిక్కిలి ప్రకాశిస్తున్నావు. అనంతకాంతి కల దివ్యరూపం నీది. దివ్యప్రజ్ఞను కూడా నీవు ధరిస్తున్నావు. (23)
సరస్వత్యువాచ
శ్రేష్ఠాని యాని ద్విపదాం వరిష్ఠ
యజ్ఞేషు విద్వన్నుపపాదయంతి ।
తైరేవ చాహం సంప్రవృద్ధా భవామి
చాప్యాయితా రూపవతీచ విప్ర ॥ 24
సరస్వతి ఇలా అన్నది. నరశ్రేష్ఠా! పండితా! యజ్ఞంలో సంకలనం చేయబడే శ్రేష్ఠమైన ఉపాసనలతో నాకు వృద్ధీ, తృప్తీ కలుగుతాయి. వాటి వలననే నాకు ఆకృతి సిద్ధిస్తుంది. (24)
యచ్చాపి ద్రవ్యముపయుజ్యతే హ
వానస్పత్యమాయసం పార్థివం వా ।
దివ్యేన రూపేణ చ ప్రజ్ఞయా చ
తవైవ సిద్ధిరితి విద్ధి విద్వన్ ॥ 25
పండితా! యాగసమయంలో వినియోగింపబడే వృక్షసంబంధ వస్తువులు, (సమిధలు మొదలగునవి) లోహసంబంధ వస్తువులు, (సువర్ణము మొదలగునవి) పృథివీ సంబంధ వస్తువులు (ధాన్యాదులు) స్వర్గఫలమూ యాగములోని ఉపాసన చేత ఆత్మజ్ఞానము కలుగునని గ్రహించుము. (25)
తార్ క్ష్య ఉవాచ
ఇదం శ్రేయః పరమం మన్యమానా
వ్యాయచ్ఛంతే మునయః సంప్రతీతాః ।
ఆచక్ష్య మే తం పరమం విశోకం
మోక్షం పరం యం ప్రవిశంతి ధీరాః ।
సాంఖ్యా యోగా పరమం యం విదంతి
పరం పురాణాం తమహం న వేద్మి ॥ 26
తార్ష్యుడిలా అన్నాడు. దేనిని పరమకళ్యాణ రూపంగా భావించి మునులు విశ్వాసంతో జితేంద్రియులవుతున్నారో, ధీరులు దేనిలో ప్రవేశించగలుగుతున్నారో ఆ శోకహీనమైన పరమమోక్షాన్ని నాకు తెలుపుము సాంఖ్యులు యోగులు గ్రహించిన ఆ పురాతన మోక్ష్యస్వరూపం నాకు తెలియదు. (26)
సరస్వత్యువాచ
తం వై పరం వేదవిదః ప్రపన్నాః
పరం పరేభ్యః ప్రథితం పురాణమ్ ।
స్వాధ్యాయవంతో వ్రతపుణ్యయోగైః
తపోధనా వీతశోకా విముక్తాః ॥ 27
సరస్వతి ఇలా అన్నది. స్వాధ్యాయ తత్పరులై, తపోధనులై వ్రతపుణ్యయోగాలతో ప్రసిద్ధమూ, పురాతనమూ అయిన పరాత్పర స్థానాన్ని పొందిన వేదవేత్తలు వీతశోకులై ముక్తులవుతున్నారు. (27)
వి॥ సం॥ "నా వేద విన్మనుతే తం బృహంతం" అను శ్రుతి వచనాన్ని బట్టి వేదవేత్తలే ఆ నిరుపాధిక శ్రేష్ఠ సచ్చిదానందరూప బ్రహ్మను ఆశ్రయించగలరు.
"అస్తి భాతి ప్రియం రూపం నామ చేత్యర్థపంచకమ్ ।
ఆద్యం త్రయంబ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయమ్ ॥ అని అస్తి భాతిప్రియత్వాలే బ్రహ్మ రూపమని చెప్పబడింది. (నీల)
తస్యాథ మధ్యే వేతసః పుణ్యగంధః
సహస్రశాఖో విపులో విభాతి ।
తస్య మూలాత్ సరితః ప్రస్రవంతి
మధూదకప్రస్రవణాః సుపుణ్యాః ॥ 28
ఆ పరబ్రహ్మలో పుణ్యగంధం గల ఒక వేతసవృక్షం సహస్రశాఖలతో విపులమై ప్రకాశిస్తోంది. దాని మూలం నుండి నదులు పుడుతున్నాయి. ఆ నదులు పవిత్రమైనవి. వాటి జలం తేనె వలె తీయనిది. (28)
శాఖాం శాఖాం మహానద్యః సంయాంతి సికతాశయాః ।
ధానాపూపా మాంసశాకాః సదా పాయసకర్దమాః ॥ 29
కానీ ఆ మహానదులు అరిసెల వలె చిల్లులు కలవి. మాంసం వలె హింసతో కూడినవి. పాయసం వలె బురదగా ఉండేవి. ఇసుక రేణువుల వలె దేనికవే ఉంటూ బ్రహ్మాండరూపమైన ఈ వృక్షశాఖలలో ప్రవహిస్తాయి. (29)
యస్మిన్నగ్నిముఖా దేవాః సేంద్రాః సహమరుద్గణాః ।
ఈజిరే క్రతుభిః శ్రేష్ఠైః తత్ పదం పరమం మమ ॥ 30
అగ్ని మొదలుగా గల దేవతలు, దేవేంద్రుడు, మరుత్తులు ఏ స్థానాన్ని పొందాలని శ్రేష్ఠయాగాలను ఆచరిస్తారో అదే నా పరమపదం. (30)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి సరస్వతీ తార్ క్ష్యసంవాదే షడశీత్యధికశతతమోఽధ్యాయః ॥ 186 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున సరస్వతీ తార్ష్య సంవాదమను నూట యెనుబది ఆరవ అధ్యాయము. (186)