187. నూట ఎనుబది ఏడవ అధ్యాయము

వైవస్వతమనువు చరిత్రము.

వైశంపాయన ఉవాచ
తతః స పాండవో విప్రం మార్కండేయమువాచ హ ।
కథయస్వేతి చరితం మనోర్వైవస్వతస్య చ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
ఆ తరువాత యుధిష్ఠిరుడు "వైవస్వతమనువు చరితాన్ని చెప్పండి" అని మార్కండేయుని అడిగాడు. (1)
మార్కండేయ ఉవాచ
వివస్వతః సుతో రాజన్ మహర్షిః సుప్రతాపవాన్ ।
బభూవ నరశార్దూల ప్రజాపతిసమద్యుతిః ॥ 2
మార్కండేయుడిలా అన్నాడు. నరశార్దూలా! రాజా! సూర్యునకు మహాప్రతాపశాలియై, ప్రజాపతితో సమానమైన ఒక కొడుకుండేవాడు. ఆయన మహర్షి. (2)
ఓజసా తేజసా లక్ష్మ్యా తపసా చ విశేషతః ।
అతిచక్రామ పితరం మనుః స్వం చ పితామహమ్ ॥ 3
ఆయనే వైవస్వతమనువు. తన ఓజస్సుతో, తేజస్సుతో, కాంతితో, తపస్సుతో తండ్రితాతలను మించిపోయాడాయన. (3)
ఊర్ధ్వబాహుర్విశాలాయాం బదర్యాం స నరాధిప ।
ఏకపాదస్థితస్తీవ్రం చకార సుమహత్త్ తపః ॥ 4
అవాక్ శిరాస్తథా చాపి నేత్రైరనిమిషైర్దృఢమ్ ।
సోఽతప్యత తపో ఘోరం వర్షాణామయుతం తదా ॥ 5
నరోత్తమా! ఆయన విశాలమయిన బదరికాశ్రమంలో చేతులు పైకెత్తి ఒంటికాలిపై నిలిచి పదివేల సంవత్సరాలు తలక్రిందులుగా నిలిచి, కనురెప్పలు వాల్చకుండా దృఢదీక్షతో ఘోరతపస్సు నాచరించాడు. (4,5)
తం కదాచిత్ తపస్యంతమ్ ఆర్ద్రచీరజటాధరమ్ ।
చీరిణీతీరమాగమ్య మత్స్యో వచనమబ్రవీత్ ॥ 6
ఒకసారి చీరిణీ నదీతీరంలో తడిసిన బట్టలతో, జటలతో తపస్సు చేస్తున్న ఆయన దగ్గరకు ఒక చేప వచ్చి ఇలా అన్నది. (6)
భగవన్ క్షుద్రమత్స్యోఽస్మి బలవద్భ్యో భయం మమ ।
మత్స్యేభ్యో హి తతో మాం త్వం త్రాతుమర్హసి సువ్రత ॥ 7
స్వామీ! సువ్రతా! నేను చిన్న చేపను. పెద్ద చేపల వలన నాకు భయం కలుగుతోంది. నన్ను నీవు కాపాడాలి. (7)
దుర్బలం బలవంతో హి మత్స్యా మత్స్యం విశేషతః ।
ఆస్వదంతి సదా వృత్తిః విహితా నః సనాతనీ ॥ 8
పెద్దచేపలు ప్రత్యేకించి చిన్న చేపలను తింటుంటాయి. ఇది మా మత్స్యజాతిలో ఎప్పటినుండియో ఉన్న పద్ధతి. (8)
తస్మాద్ భయౌఘాన్మహతః మజ్జంతం మాం విశేషతః ।
త్రాతుమర్హసి కర్తాస్మి కృతే ప్రతికృతం తవ ॥ 9
ఆ భయమనే మహాప్రవాహంలో బాగా మునిగిపోతున్న నన్ను నీవు రక్షించాలి. ఈ ఉపకారానికి ప్రత్యుపకారం నేను చేయగలను. (9)
స మత్స్యవచనం శ్రుత్వా కృపయాభిప।ప్లుతః ।
మనుర్వైవస్వతోఽగృహ్ణాత్ తం మత్స్యం పాణినా స్వయమ్ ॥ 10
ఉదకాంతముపానీయ మత్స్యం వైవస్వతో మనుః ।
అలింజరే ప్రాక్షిపత్ తం చంద్రాంశుసదృశప్రభమ్ ॥ 11
ఆ చేపమాట విని వైవస్వతమనువు దయామయుడై దానిని చేతితో పట్టుకొని నీటినుండి వెలుపలికి తీసి చంద్రకిరణాల వలె కాంతిమంతమైన ఆ చేపను కుండలో ఉంచాడు. (10,11)
స తత్ర వవృధే రాజన్ మత్స్యః పరమసత్కృతః ।
పుత్రవత్ స్వీకరోత్ తస్మై మనుర్భావం విశేషతః ॥ 12
అథ కాలేన మహతా స మత్స్యః సుమహానభూత్ ।
అలింజరే యథా చైవ నాసౌ సమభవత్ కిల ॥ 13
వైవస్వతమనువు ఆదరణతో ఆ చేప అక్కడే పెరిగి పెద్దయింది. మనువు దానిని పుత్రునివలె భావించాడు.
చాలా కాలానికి ఆ చేప బాగా పెద్దదయింది. కుండలో ఉండలేకపోయింది. (12,13)
అథ మత్స్యో మనుం దృష్ట్వా పునరేవాభ్యభాషత ।
భగవన్ సాధు మేఽద్యాన్యత్ స్థానం సంప్రతిపాదయ ॥ 14
ఆ తరువాత ఆ చేప మనువును చూచి "స్వామీ! ఇంతకన్న మంచి చోటికి నన్ను చేర్చండి" అని మరలా అడిగింది. (14)
ఉద్ధృత్యాలింజరాత్ తస్మాత్ తతః స భగవాన్ మనుః ।
తం మత్స్యమనయద్ వాసీం మహతీం స మనుస్తదా ॥ 15
అప్పుడు పూజ్యుడైన వైవస్వతమనువు దానిని కుండలో నుండి పైకితీసి పెద్ద దిగుడు బావి దగ్గరకు తీసికొనిపోయాడు. (15)
తత్ర తం ప్రాక్షిపచ్చాపి మనుః పరపురంజయ ।
అథావర్ధత మత్స్యః స పునర్వర్షగణాన్ బహూన్ ॥ 16
పరపురంజయా! మనువు ఆ చేపను ఆ దిగుడుబావిలో ఉంచాడు. అది చాలా సంవత్సరాళు ఆ దిగుడు బావిలో పెరిగింది. (16)
ద్వియోజనాయతా వాపీ విస్తృతా చాపి యోజనమ్ ।
తస్యాం నాసౌ సమభవత్ మత్స్యో రాజీవలోచన ॥ 17
రాజీవలోచనా! ఆ బావి రెండు యోజనాల పొడవు, ఒక యోజనం వెడల్పు గలది. ఆ చేపకు ఆ బావి చాలలేదు. (17)
విచేష్టితుం చ కౌంతేయ మత్స్యో వాప్యాం విశాంపతే ।
మనుం మత్స్యస్తతో దృష్ట్వా పునరేవాభ్యభాషత ॥ 18
యుధిష్ఠిరా! మహారాజా! ఆ చేప ఆ దిగుడుబావిలో కదలలేకపోయింది మనువును చూచి మరలా ఇలా పలికింది. (18)
నయ మాం భగవన్ సాధో సముద్రమహిషీం ప్రియామ్ ।
గంగాం తత్ర నివత్స్యామి యథా వా తాత మన్యసే ॥ 19
నిదేశే హి మయా తుభ్యం స్థాతవ్యమనసూయతా ।
వృద్ధిర్హి పరమా ప్రాప్తా త్వత్కృతే హి మయానఘ ॥ 20
స్వామీ! సాధుస్వభావా! నన్ను సముద్రుని ప్రియభార్య అయిన గంగానదికి తీసికొనిపో. నేనక్కడ నివసిస్తాను. లేకపోతే నీ ఇష్టం వచ్చిన చోటుకు తీసికొనిపో.
అనఘా! నేను దోషదృష్టిని వీడి నీ ఆదేశం మేరకే ప్రవర్తించాలి. నీ కారణంగానే నేను బాగా వృద్ధి పొందానుగదా! (19,20)
ఏవముక్తో మనుర్మత్స్యమ్ అనయద్ భగవాన్ వశీ ।
నదీం గంగాం తత్ర చైవం స్వయం ప్రాక్షిపదచ్యుతః ॥ 21
పూజ్యుడు, జితేంద్రియుడు అయిన మనువు ఆ మాట విని ఆ చేపను గంగాన్ది దగ్గరకు తీసికొని పోయి స్వయంగా ఆ నదిలో విడిచాడు. (21)
స తత్ర వవృధే మత్స్యః కించిత్కాలమరిందమ ।
తతః పునర్మనుం దృష్ట్వా మత్స్యో వచనమబ్రవీత్ ॥ 22
గంగాయాం హి న శక్నోమి బృహత్త్వాచ్చేష్టితుం ప్రభో ।
సముద్రం నయ మామాశు ప్రసీద భగవన్నితి ॥ 23
ఉద్ధృత్య గంగాసలిలాత్ తతో మత్స్యం మనుః స్వయమ్ ।
సముద్రమనయత్ పార్థ తత్ర చైనమవాసృజత్ ॥ 24
అరిందమా! ఆ చేప అక్కడ కొంతకాలం పెరిగింది. తరువాత మరలా మనువును చూచి ఇలా పలికింది.
ప్రభూ! సూక్ష్మశరీరం పెద్దదైనందు వలన గంగలో తిరుగలేకున్నాను. స్వామీ! వెంటనే నన్ను సముద్రానికి తీసికొనిపోయి అనుగ్రహించండి.
పార్థా! వైవస్వతమనువు గంగానది నుండి ఆ చేపను తీసి స్వయంగా సముద్రానికి కొనిపోయి అక్కడ విడిచాడు. (22-24)
సుమహానపి మత్స్యస్తు స మనోర్నయతస్తదా ।
ఆసీద్ యథేష్టహార్యశ్చ స్పర్శగంధసుఖస్య వై ॥ 25
ఆ చేప పెద్దదయినా మనువు తీసికొనిపోతున్న సమయంలో తేలికగా కొనిపోగలిగినట్లు అయింది. దాని స్పర్శ, దాని వాసన కూడా సుఖంగానే కనిపించాయి. (25)
యదా సముద్రే ప్రక్షిప్తః స మత్స్యో మనువా తదా ।
తత ఏవమిదం వాక్యం స్మయమాన ఇవాబ్రవీత్ ॥ 26
మనువు దానిని సముద్రంలో విడవగానే అది నవ్వుతూ మనువుతో ఇలా అన్నది. (26)
భగవన్ హి కృతా రక్షా త్వయా సర్వా విశేషతః ।
ప్రాప్తకాలం తు యత్ కార్యం త్వయా తచ్ఛ్రూయతాం మమ ॥ 27
స్వామీ! నన్ను ఏలోటు లేకుండా కాపాడావు. ఇప్పుడు నీవు చేయవలసిన పనిని చెపుతాను. విను. (27)
అచిరాద్ భగవన్ భౌమమ్ ఇదం స్థావరజంగమమ్ ।
సర్వమేవ మహాభాగ ప్రలయం వై గమిష్యతి ॥ 28
స్వామీ! మహానుభావా! స్థావరజంగమాత్మకమయిన ఈ భూమి అంతా త్వరలోనే నశించబోతోంది. (28)
సంప్రక్షాలనకాలోఽయం లోకానాం సముపస్థితః ।
తస్మాత్ త్వాం బోధయామ్యద్య యత్ తే హితమనుత్తమమ్ ॥ 29
ఈ లోకమంతా ఏకార్ణవ జలంలో లయించే ప్రక్షాళన సమయమాసన్నమైనది. కాబట్టి నిన్ను మేల్కొల్పుతూ నీకు హితకరమయిన మాటను చెప్తున్నాను. (29)
త్రసానాం స్థావరాణాం చ యచ్చేంగం యచ్ఛ నేంగతి ।
తస్య సర్వస్య సంప్రాప్తః కాలః పరమదారుణః ॥ 30
స్థావరజంగమాత్మకము - చరాచరాత్మకము - అయిన ఈ సమస్తవిశ్వానికీ పరమభయంకర సమయం ఆసన్నమయినది. (30)
నౌశ్చ కారయితవ్యా తే దృఢా యుక్తవటారకా ।
తత్ర సప్తర్షిభిః సార్ధమ్ ఆరుహేథా మహామునే ॥ 31
నీకోసం ఒకగట్టి నావను తయారుచేయించి దానికొక తాడు కట్టి పంపుతాను. మహర్షీ! ప్రాణాలతో సహా నీవు దానినెక్కు. (31)
బీజాని చైవ సర్వాణి యథోక్తాని ద్విజైః పురా।
తస్యామారోహయేర్నావి సుసంగుప్తాని భాగశః ॥ 32
పూర్వం బ్రాహ్మణులు చెప్పిన బీజాలనన్నింటిని విడివిడిగా సమకూర్చుకొని ఆ నావపై ఎక్కించుకో. (32)
నౌస్థశ్చ మాం ప్రతీక్షేథాః తతో మునిజనప్రియ ।
ఆగమిష్యామ్యహం శృంగీ విజ్ఞేయస్తేవ తాపస ॥ 33
ఏవమేతత్ త్వయా కార్యమ్ ఆపృష్టోఽసి వ్రజామ్యహమ్ ।
తా న శక్యా మహత్యో వై ఆపస్తర్తుం మయా వినా ॥ 34
మునిజనప్రియా! నావపై నిలిచి నాకోసం ఎదురుచూడు. తాపసా! నేను కొమ్ములు ధరించి నీ దగ్గరకు వస్తాను. వాటితో నన్ను గుర్తించవచ్చు. ఈ పనంతా నీవు చేయాలి. ఇక నేను వెళ్ళటానికి అనుమతించు. నా సహాయం లేకుండా ఆ జలరాశిని అతిక్రమించటం కుదరదు. (33,34)
నాభిశంక్యమిదం చాపి వచనం మే త్వయా విభో ।
ఏవం కరిష్య ఇతి తం స మత్స్యం ప్రత్యభాషత ॥ 35
స్వామీ! నా ఈ మాటను సందేహించవద్దు.
'అలాగే చేస్తా'నని వైవస్వతమనువు ఆ చేపతో అన్నాడు. (35)
జగ్మతుశ్చ యథాకామమ్ అనుజ్ఞాప్య పరస్పరమ్ ।
తతో మనుర్మహారాజ యథోక్తం మత్స్యకేన హ ॥ 36
బీజాన్యాదాయ సర్వాణి సాగరం పుప్లువే తదా ।
నౌకయా శుభయా వీర మహోర్మిణమరిందమ ॥ 37
శత్రుదమనా! మహారాజా! వారు పరస్పరం సెలవు తీసికొని ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు. ఆ తరువాత వైవస్వతమనువు చేప చెప్పిన రీతిగా సర్వబీజాలను తీసికొని అందమైన నావను సమకూర్చుకొని పెద్దపెద్ద అలలు గల సాగరంలో సంచరించసాగాడు. (36,37)
చింతయామాస చ మనుః తం మత్స్యం పృథివీపతే ।
స చ తచ్చింతితం జ్ఞాత్వా మత్స్యః పరపురంజయ ॥ 38
శృంగీ తత్రాజగామాశు తదా భరతసత్తమ ।
తం దృష్ట్వా మనుజవ్యాఘ్ర మనుర్మత్స్యం జలార్ణవే ॥ 39
శృంగిణం తం యథోక్తేన రూపేణాద్రిమివోచ్చ్రితమ్ ।
వటారకమయం పాశమ్ అథ మత్స్యప్య మూర్ధని ॥ 40
మనుర్మనుజశార్దూల తస్మిన్ శృంగే న్యవేశయత్ ।
సంయతస్తేవ పాశేన మత్స్యః పరపురంజయ ॥ 41
వేగేన మహతా నావం ప్రాకర్షల్లవణాంభసి ।
స చ తాంస్తారయన్ నావా సముద్రం మనుజేశ్వర ॥ 42
వృత్యమానమివోర్మీభిః గర్జమానమివాంభసా ।
క్షోభ్యమాణా మహావాతైః సా నౌస్తస్మిన్ మహోదధౌ ॥ 43
ఘూర్ణతే చపలేవ స్త్రీ మత్తా పరపురంజయ ।
వైవ భూమిర్న చ దిశః ప్రదిశో వా చకాశిరే ॥ 44
పరపురంజయా! రాజా! మనువు ఆ మత్స్యాన్ని తలచుకొన్నాడు. ఆ చేప మనువు తలచుకొనటాన్ని గ్రహించి కొమ్ములు ధరించి వెంటనే వచ్చింది. భరతశ్రేష్ఠా! తాను ముందు చెప్పినట్లు కొమ్ములు ధరించి వచ్చిన ఆ చేపను సముద్రంలో చూచి మనువు దాని కొమ్ములకు త్రాడును తగిలించాడు. ఆ చేప ఉన్నత పర్వతంలా ఉంది.
శత్రుదమనా! మనుజశ్రేష్ఠా! మనువు ఆ చేప కొమ్ములకు త్రాడు బిగించగానే ఆ చేప మహావేగంతో లవణసముద్రంలో నావికులను దాటిస్తూ నావను లాగసాగింది. అప్పుడు ఆ సముద్రం అలలతో నాట్యం చేస్తున్నట్లుంది. నీటివేగంతో గర్జిస్తున్నట్లుంది. పరపురంజయా! ఆ మహాసముద్రంలోని పెనుగాలుల వలన ఆ నౌక అటు ఇటు ఊగుతోంది. మత్తెక్కిన ఉన్మాదిని వలె ఘోషపెడుతోంది. నేల, దిక్కులు, మూలలూ ఏవీ తెలియలేదు. (38-44)
సర్వమాంభసమేవాసీత్ ఖం ద్యౌశ్చ నరపుంగవ ।
ఏవంభూతే తదా లోకే సంకులే భరతర్షభ ॥ 45
అదృశ్యంతర్షయః సప్త మనుర్మత్స్యస్తథైవ చ ।
ఏవం బహూన్ వర్షగణాంస్తాం నావం సోఽథ మత్స్యకః ॥ 46
చకర్షాతంద్రితో రాజన్ తస్మిన్ సలీలసంచయే ।
తతో హిమవతః శృంగం యత్ పరం భరతర్షభ ॥ 47
తత్రాకర్షత్ తతో నావం స మత్స్యః కురునందన ।
అథాబ్రవీత్ తదా మత్స్యః తానృషీన్ ప్రహసన్ శనైః ॥ 48
అస్మిన్ హిమవతః శృంగే నావం బధ్నీత మా చిరమ్ ।
సా బద్ధా తత్ర తైస్తూర్ణమ్ ఋషిభిర్భరతర్షభ ॥ 49
నౌర్మత్స్యస్య వచః శ్రుత్వా శృంగే హిమవతస్తదా ।
తచ్చ నౌబంధనం నామ శృంగం హిమవతః పరమ్ ॥ 50
నరోత్తమా! ఆకాశం స్వర్గం మొత్తం జలమయమైంది. లోకమంతా ఆ విధంగా జలమయమైనప్పుడు సప్తర్షులు, మనువు, చేపమాత్రమే మునగలేదు. ఎన్నో సంవత్సరాల వరకు ఆ చేప ఆ నావను ఆ నీటిలో లాగుతూనే ఉంది. కురునందనా! మహారాజా! ఆ తరువాత ఆ చేప నావను హిమవచ్చిశిఖరం దగ్గరకు లాగుకొని పోయింది. ఆపై చేప మెల్లగా నవ్వుతూ మహర్షులతో "వెంటనే హిమవచ్చిశిఖరానికి ఈనావను కట్టండి. ఆలస్యం చేయవద్దు" అన్నది.
వెంటనే వాఱు ఆ చేప మాటను విని హిమవచ్చి శిఖరానికి నావను కట్టారు. నాటి నుండి ఈ హిమాలయశిఖరం "నౌకాబంధన"మన్న పేరుతో ప్రసిద్ధమైనది. (45-50)
ఖ్యాతమద్యాపి కౌంతేయ తద్ విద్ధి భరతర్షభ ।
అథాబ్రవీదనిమిషః తానృషీన్ సహితస్తదా ॥ 51
భరతర్షభా! యుధిష్ఠిరా! నేటికీ ఆ శిఖరం ఆ పేరుతో ప్రసిద్ధమై ఉంది. ఆ తరువాత ఆ మత్స్యదేవుడు మహర్షులతో ఇలా అన్నాడు. (51)
అహం ప్రజాపతిర్బ్రహ్మా మత్పరం నాధిగమ్యతే ।
మత్స్యరూపేణ యూయం చ మయాస్మాన్మోక్షితా భయాత్ ॥ 52
మనునా చ ప్రజాః సర్వాః సదేవాసురమానుషాః ।
స్రష్టవ్యాః సర్వలోకాశ్చ యచ్చేంగం యచ్చ నేంగతి ॥ 53
నేనే ప్రజాపతి అయిన బ్రహ్మను. నేను కానిది ఏదీ లేదు. మత్స్యరూపాన్ని ధరించి మిమ్ములనందరినీ ఈ భీకర పరిణామం నుండి రక్షించాను.
ఈ మనువు దేవాసుర మానుషరూపధారులయిన సర్వప్రజలనూ, సర్వలోకాలనూ, చరాచరాత్మకమయిన సమస్తాన్నీ సృష్టించాలి. (52,53)
తపసా చాపి తీవ్రేణ ప్రతిభాస్య భవిష్యతి ।
మత్ప్రసాదాత్ ప్రజాసర్గే న చ మోహం గమిష్యతి ॥ 54
తీవ్రమయిన తపస్సుతో సృష్టికవసరమయిన ప్రతిభ మనువుకు కలుగుతుంది. నా అనుగ్రహం కారణంగా ప్రజాసృష్టిలో మోహమేర్పడదు. (54)
ఇత్యుక్తా వచనం మత్స్యః క్షణేనాదర్శనం గతః ।
స్రష్టుకామః ప్రజాశ్చాపి మనుర్వైవస్వతః స్వయమ్ ॥ 55
ప్రమూఢోఽభూత్ ప్రజాసర్గే తపస్తేపే మహత్ తతః ।
తపసా మహతా యుక్తః సోఽథ స్రష్టుం ప్రచక్రమే ॥ 56
ఆ విధంగా పలికి వెంటనే మత్స్యం అదృశ్యమయింది. వైవస్వతమనువు తానే ప్రజలను సృష్టించగోరాడు. కానీ కుదరలేదు. దానితో సృష్టి కార్యం కొరకు తీవ్రంగా తపించాడు. ఆ తపోబలంతో సృష్టికుపక్రమించాడు. (55,56)
సర్వాః ప్రజా మనుః సాక్షాద్ యథావద్ భరతర్షభ ।
ఇత్యేతన్మాత్స్యకం నామ పురాణం పరికీర్తితమ్ ॥ 57
భరతశ్రేష్ఠా! వైవస్వతమనువు సమస్తప్రజలనూ యథాపూర్వంగా సృష్టించసాగాడు. ఇది మత్స్యపురాణం. మీకు వినిపించాను. (57)
ఆఖ్యానమిదమాఖ్యాతం సర్వపాపహరం మయా ।
య ఇదం శృణుయాన్నిత్యం మనోశ్చరితమాదితః ।
స సుఖీ సర్వపూర్ణార్థః సర్వలోఖమియాన్నరః ॥ 58
సర్వపాపహరమయిన ఈ ఉపాఖ్యానాన్ని మీకు చెప్పాను. ఈ మనువృత్తాంతాన్ని పూర్తిగా నిత్యమూ విన్నవాడు సర్వార్థసిద్ధిని పొంది, సుఖించి, సర్వలోకాలకూ వెళ్ళగలుగుతాడు. (58)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణీ మార్కండేయసమాస్యాపర్వణి మత్స్యోపాఖ్యానే సప్తాశీత్యధికశతతమోఽధ్యాయః ॥ 187 ॥
శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున మత్స్యోపాఖ్యానమను నూట యెనుబది ఏడవ అధ్యాయము. (187)