190. నూట తొంబదియవ అధ్యాయము
కలి యుగలక్షణములు - కల్క్యవతారము.
వైశంపాయన ఉవాచ
యుధిష్ఠిరస్తు కౌంతేయః మార్కండేయమహామునిమ్ ।
పునః పప్రచ్ఛ సామ్రాజ్యే భవిష్యాం జగతో గతిమ్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
కౌంట్తేయుడైన యుధిష్ఠిరుడు తన సామ్రాజ్యంలో ఇక ఉండబోవు లోకగతిని గూర్చి మరల మార్కండేయ మహర్షిని అడిగాడు. (1)
యుధిష్ఠిర ఉవాచ
ఆశ్చర్యభూతం భవతః శ్రుతం నో వదతాం వర ।
మునే భార్గవ యద్ వృత్తం యుగాదౌ ప్రభవాత్యయమ్ ॥
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
వక్తలలో శ్రేష్ఠుడా! భృగువంశసంజాతా! నీద్వారా యుగాదిలోని ఉత్పత్తి సంహారాలను గూర్చిన ఆశ్చర్యకరవృత్తాంతాన్ని మేము విన్నాము. (2)
అస్మిన్ కలియుగే త్వస్తి పునః కౌతూహలం మమ ।
సమాకులేషు ధర్మేషు కిం ను శేషం భవిష్యతి ॥ 3
అయినా నాకింకా వినాలని కుతూహలంగా ఉంది. ఈ కలియుగంలో సర్వధర్మాలు కలతపడినప్పుడు మిగిలేది ఏమిటి? (3)
కింవీర్యా మానవాస్తత్ర కిమాహారవిహారిణః ।
కిమాయుషః కింనసనాః భవిష్యంతి యుగక్షయే ॥ 4
కలియుగాంతవేళలో మానవుల పరాక్రమం, ఆహరవిహారాలు ఎలా ఉంటాయి? ఆయుర్దాయమెలా ఉంటుంది? వస్త్రాలంకారాలు ఎలా ఉంటాయి? (4)
కాం చ కాష్ఠాం సమాసాద్య పునః సంపత్స్యతే కృతమ్ ।
విస్తరేణ మునే బ్రూహి విచిత్రాణీహ భాషసే ॥ 5
కలియుగమెంతమేర జరిగిన తర్వాత మరల కృతయుగ మేర్పడుతుంది? మహర్షీ! వివరంగా చెప్పు. నీకథనం చాలా విచిత్రంగా ఉంది. (5)
ఇత్యుక్తః స మునిశ్రేష్ఠః పునరేవాభ్యభాషత ।
రమయన్ వృష్ణిశార్దూలం పాండవాంశ్చ మహానృషిః ॥ 6
యుధిష్ఠిరుడిలా అడుగగానే మహర్షిశ్రేష్ఠుడైన మార్కండేయుడు శ్రీకృష్ణునకు, పాండవులకు ఆహ్లాదాన్ని కల్గిస్తూ మరల ఇలా చెప్పాడు. (6)
మార్కండేయ ఉవాచ
శృణు రాజన్ మయా దృష్టం యత్ పురా శ్రుతమేవ చ ।
అనుభూతం చ రాజేంద్ర దేవదేవప్రసాదజమ్ ॥ 7
భవిష్యం సర్వలోకస్య వృత్తాంతం భరతర్షభ ।
కలుషం కాలమాసాద్య కథ్యమానం నిబోధ మే ॥ 8
మార్కండేయుడిలా అన్నాడు.
భరతశ్రేష్ఠా! రాజేంద్రా! కలుషితమైన కలియుగం ఏర్పడిన తర్వాత సమస్తలోకాల వృత్తాంతాన్ని గురించి బాలముకుందుని అనుగ్రహం వలన నేను విన్నదీ, అనుభవించినదీ చెపుతాను. సావధానంగా విని గ్రహించు. (7,8)
కృతే చతుష్పాత్ సకలః నిర్వ్యాజోపాధివర్జితః ।
వృషః ప్రతిష్ఠితో ధర్మః మనుష్యే భరతర్షభ ॥ 9
కృతయుగం ఏర్పడినపుడు ధర్మం పూర్ణరూపంతో, నాలుగుపాదాలతో మనుష్యులలో ప్రతిష్ఠింపబడుతుంది. అప్పుడు లోభమోహాలకూ, కపటత్వానికి అవకాశం లేదు. (9)
అధర్మపాదవిద్దస్తు త్రిభిరంశైః ప్రతిష్ఠితః ।
త్రేతాయాం ద్వాపరేఽర్ధేన వ్యామిశ్రో ధర్మ ఉచ్యతే ॥ 10
త్రేతాయుగంలో అధర్మపాదం చేత కొట్టబడిన ధర్మం మూడుపాదాలతోనే ఉంటుంది. ద్వాపరంలో అధర్మం సగభాగాన్ని ఆక్రమిమ్చి ధర్మమిళితంగా ఉంటుంది. (10)
త్రిభిరంశైరధర్మస్తు లోకానాక్రమ్య తిష్ఠతి ।
తామసం యుగమాసాద్య తదా భరతసత్తమ ॥ 11
చతుర్ధాంశేన ధర్మస్తు మనుష్యానుపతిష్ఠతి ।
ఆయుర్వీర్యమథో బుద్ధిః బలం తేజశ్చ పాండవ ॥ 12
మనుష్యాణామనుయుగం హ్రసతీతి నిబోధ మే ।
రాజానో బ్రాహ్మణా వైశ్యాః శూద్రాశ్చైవ యుధిష్ఠిర ॥ 13
వ్యాజైర్ధర్మం చరిష్యంతి ధర్మవైతంసికా వరాః ।
సత్యం సంక్షేప్స్యతే లోకే నరైః పండితమానిభిః ॥ 14
భరతశ్రేష్ఠా! కలియుగం తామసయుగం, అధర్మం మూడు పాదాలతో లోకాల నాక్రమిస్తుంది. నాలుగవపాదాంతో మాత్రమే ధర్మం మనుష్యులలో నిలుస్తుంది. పాండుకుమారా! మనుష్యుల ఆయుస్సు వీర్యం, బుద్ధి, బలం, తేజస్సు అన్నీ యుగయుగానికీ తగ్గుతుంటాయి. రాజులు, బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు అందరూ కపటత్వంతో ధర్మాన్ని ఆచరిస్తారు. యుధిష్ఠిరా! ధర్మాన్ని ముసుగుగా వేసికొని మనుష్యులు ఇతరులను మోసగిస్తారు. తమను తాము పండితుల మనుకొనేవారు సత్యాన్ని విడిచి ప్రవర్తిస్తారు. (11-14)
సత్యహాన్యా తతస్తేషామ్ ఆయురల్పం భవిష్యతి ।
ఆయుషః ప్రక్షయాద్ విద్యాం న శక్ష్యంత్యుపజీవితుమ్ ॥ 15
సత్యహాని వలన వారి ఆయుస్సు క్షీణిస్తుంది. ఆయుస్సు క్షీణించినందువలన జీవనాన్ని నడపటానికి తగినవిద్యను వారు పొందలేరు. (15)
విద్యాహీనానవిజ్ఞానాత్ లోభోఽపభిభవిష్యతి ।
లోభక్రోధపరా మూఢాః కామాసక్తాశ్చ మానవాః ॥ 16
వైరబద్ధా భవిష్యంతి పరస్పరవధైషిణః ।
విద్యావిహీనులను, విజ్ఞానశూన్యులవడం వల్ల లోభం కూడా లోగొంటుంది. లోభక్రోధాలకు వశులైన మూఢమానవులు కామాసక్తులవుతారు. పరస్పరవైరంతో ఒకరినొకరు చంపుకొనటానికి సిద్ధపడతారు. (16 1/2)
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః సంకీర్యంతః పరస్పరమ్ ॥ 17
శూద్రతుల్యా భవిష్యంతి తపఃసత్యవివర్జితాః ।
అంత్యా మధ్యా భవిష్యంతి మధ్యాశ్చాంత్యా న సంశయః ॥ 18
బ్రాహ్మణక్షత్రియవైశ్యులలో పరస్పరం వర్ణసంకరం జరుగుతుంది. అందరూ తపస్సును, సత్యాన్ని వీడి శూద్రసమానులవుతారు. కడవారి మధ్యవారుగా, నడిమివారు కడవారుగా మారిపోతారు. సందేహం లేదు. (17,18)
ఈదృశో భవితా లోకః యుగాంతే పర్యుపస్థితే ।
వస్త్రాణాం ప్రవరా శాణీ ధాన్యానాం కోరదూషకాః ॥ 19
యుగాంతవేళలో లోక మీ విధంగానే ఉంటుంది. జనుముతో చేసిన బట్టలు, ధాన్యాలలో కొఱ్ఱలు శ్రేష్ఠంగా పరిగణన కెక్కుతాయి. (19)
భార్యామిత్రాశ్చ పురుషాః భవిష్యంతి యుగక్షయే ।
మత్స్యామిషేన జీవంతః దుహంతశ్చాప్యజైడకమ్ ॥ 20
గోషు నష్ఠాసు పురుషాః యేఽపి నిత్యం ధృతవ్రతాః ।
తేఽపి లోభసమాయుక్తాః భవిష్యంతి యుగక్షయే ॥ 21
యుగాంతవేళలో పురుషులకు భార్యలే మిత్రులవుతారు. చేపలమాంసంతో చాలామంది జీవిస్తారు. గోసంపద నశించటంతో మేకల నుండి, గొర్రెల నుండి పాలు పిండుకొంటారు. నిత్యమూ ధర్మదీక్ష గలవారు కూడా కలియుగాంతంలో లోభానికి లోనవుతారు. (20,21)
అన్యోన్యం పరిముష్ణంతః హింసయంతశ్చ మానవాః ।
అజపా నాస్తికాః స్తేనాః భవిష్యంతి యుగక్షయే ॥ 22
యుగాంతవేళలో ఒకరినొకరు దోచుకొంటూ, ఒకరినొకరు హింసించుకొంటూ నాస్తికులై, జపహీనులై, దొంగలై బ్రతుకుతుంటారు. (22)
సరిత్తీరేషు కుద్దాలైః వాపయిష్యంతి చౌషధీః ।
తాశ్చాప్యల్పఫలాస్తేషాం భవిష్యంతి యుగక్షయే ॥ 23
నదీతీరాలలో పారలతో త్రవ్వి ఓషధుల బీజాలను నాటుతారు. అయితే యుగాంతవేళలో అవి కూడా తక్కువ ఫలితాన్నే ఇస్తాయి. (23)
శ్రాద్ధే దైవే చ పురుషా యేఽపి నిత్యం ధృతవ్రతాః ।
తేఽపి లోభసమాయుక్తా భోక్ష్యంతీహ పరస్పరమ్ ॥ 24
నిత్యమూ దైవ పితృ కర్మలు చేసేవారు కూడా లోభవశులై దైవయజ్ఞ, శ్రాద్ధకర్మలలో ఒకరి ఇంట మరొకరు భుజిస్తారు. (24)
పితా పుత్రస్య భోక్తా చ పితుః పుత్రస్తథైవ చ ।
అతిక్రాంతాని భోజ్యాని భవిష్యంతి యుగక్షయే ॥ 25
కలియుగాంతంలో శ్రాద్ధక్రియల్లో పుత్రునికి తండ్రి భోక్త అవుతాడు. తండ్రికి పుత్రుడు భోక్త అవుతాడు. ఆ సమయంలో నిషిద్ధపదార్థాలు భోజనయోగ్యాలవుతాయి. (25)
న వ్రతాని చరిష్యంతి బ్రాహ్మణా వేదనిందకాః ।
న యక్ష్యంతి న హోష్యంతి హేతువాదవిమోహితాః ।
నిమ్నేష్వీహాం కరిష్యంతి హేతువాదవిమోహితాః ॥ 26
బ్రాహ్మణులు వ్రతాచరణను మానటమే కాక వేదనింద కూడా చేస్తారు. హేతువాదానికి లొంగి యాగాలను, హోమాలను విడిచిపెడతారు. ఆ హేతువాదంతో నీచకర్మలపై సైతం మోజుపడతారు. (26)
నిమ్నే కృషిం కరిష్యంతి యోక్ష్యంతి ధురి ధేనుకాః ।
ఏకహాయనవత్సాంశ్చ యోజయిష్యంతి మానవాః ॥ 27
లోతట్టు ప్రాంతాలలో కూడా వ్యవసాయం చేస్తారు. ఆవులను కూడా మూటలను మోయటానికి వినియోగిస్తారు. సంవత్సరం వయస్సు గల దూడలతో కూడా దున్నుతారు. (27)
పుత్రః పితృవధం కృత్వా పితా పుత్రవధం తథా ।
నిరుద్వేగో బృహద్వాదీ న నిందాముపలప్స్యతే ॥ 28
కొడుకు తండ్రిని చంపినా, తండ్రి కొడుకును చంపినా ఏవిధమైన ఉద్వేగమూ ఉండదు. 'ఆత్మకు ఏవీ అంటవు' అంటూ పెద్దపెద్ద మాటలు పలుకుతారు. అయినా వారిని ఎవ్వరూ ఏమీ అనరు. (28)
మ్లేచ్ఛభూతం జగత్ సర్వం నిష్క్రియం యజ్ఞవర్జితమ్ ।
భవిష్యతి నిరానందమ్ అనుత్సవమథో తథా ॥ 29
ప్రపంచమంతా మ్లేచ్ఛప్రాయమవుతుంది. శుభకర్మలీ, యజ్ఞాలూ ఉండవు. నిరానందంగా, నిరుత్సవంగా సాగుతుంటుంది. (29)
ప్రాయశః కృపణానాం హి తథా బంధుమతామపి ।
విధవానాం చ విత్తాని హరిష్యంతీహ మానవాః ॥ 30
జనులు సాధారణంగా దీనుల యొక్క, నిస్సహాయుల యొక్క విధవల యొక్క ధనాలను అపహరిస్తారు. (30)
స్వల్పవీర్యబలాః స్తబ్దాః లోభమోహపరాయణాః ।
తత్కథాదానసంతుష్టాః దుష్టానామపి మానవాః ॥ 31
పరిగ్రహం కరిష్యంతి మాయాచారపరిగ్రహాః ।
సమాహ్వయంతః కౌంతేయ రాజానః పాపబుద్ధయః ॥ 32
పరస్పరవధోద్యుక్తాః మూర్ఖాః పండితమానినః ।
భవిష్యంతి యుగస్యాంతే క్షత్రియా లోకకంటకాః ॥ 33
జనుల్ శారీరకంగా దుర్బలులు, పరాక్రమహీనులు, చేష్ఠారహితులు, లోభమోహాసక్తులు అవుతారు. అటువంటి వారి గురించియే మాట్లాడుకొంటూ, అటువంటి వారి నుండి దానాలు పడతారు. మిథ్యాచారపరాయణులై దుర్మార్గుల నుండి దానాలు తీసికొంటారు. పాండుకుమారా! పాపబద్ధులయిన రాజులు ఒకరినొకరు యుద్ధానికి రెచ్చగొడుతూ ఒకరినొకరు చంపటానికి సిద్ధపడతారు. మూర్ఖులై తమను తాము పండితులనుగా భావిస్తారు. ఈ రీతిగా యుగాంతవేళలో క్షత్రియులు కూడా లోకకంటకులవుతారు. (31-33)
అరక్షితారో లుబ్ధాశ్చ మానాహంకారదర్పితాః ।
కేవలం దండరుచయః భవిష్యంతి యుగక్షయే ॥ 34
కలియుగాంతంలో ఆ రాజులు ప్రజలను రక్షించరు. వారి డబ్బుపై ఆశపడతారు. మానాహంకారాలతో గర్విస్తారు. ప్రజలను దండించటం మాత్రమే వారికిష్టమవుతుంది. (34)
ఆక్రమ్యాక్రమ్య సాధూనాం దారాంశ్చాపి ధనాని చ ।
భోక్ష్యంతే నిరనుక్రోశాః రుదతామపి భారత ॥ 35
భారతా! సజ్జనుల భార్యలను, సొమ్ములను సొంతం చేసికొని, వారు ఏడుస్తున్నా లెక్కచేయకుండా వాటిని అనుభవిస్తారు. (35)
న కన్యాం యాచతే కశ్చిద్ నాపి కన్యా ప్రదీయతే ।
స్వయంగ్రాహా భవిష్యంతి యుగాంతే సముపస్థితే ॥ 36
యుగాంతవేళలో ఎవరూ కన్యలను యాచించరు. ఎవ్వరికీ కన్యల నివ్వరు. ఎవరికి వారు స్వయంగానే వరులను, కన్యలను ఎన్నుకొంటారు. (36)
రాజానశ్చాప్యసంతుష్టాః పరార్తాన్ మూఢచేతసః ।
సర్వోపాయైర్హరిష్యంతి యుగాంతే పర్యుపస్థితే ॥ 37
కలియుగాంతంలో రాజులు కూడా అసంతుష్టులూ మూర్ఖులూ అయి సర్వోపాయాలను ఉపయోగించి పరులసొమ్ములు హరిస్తారు. (37)
మ్లేచ్ఛీభూతం జగత్ సర్వం భవిష్యతి న సంశయః ।
హస్తో హస్తం పరిముషేద్ యుగాంతే సముపస్థితే ॥ 38
ప్రపంచమంతా మ్లేచ్ఛప్రాయమవుతుంది. సందేహం లేదు. యుగాంతంకాలంలో ఒకచేయి మరొకచేతిని దోచుకొంటుంది. (38)
సత్యం సంక్షిప్యతే లోకే నరైః పండితమానిభిః ।
స్థవిరా బాలమతయః బాలాః స్థవిరబుద్ధయః ॥ 39
లోకంలో తమను తామే పండితులమనుకొనే ప్రజలు సత్యాన్ని నాశనం చేస్తారు. వృద్ధులు పిల్లలవలె, పిల్లలు వృద్ధుల వలె ప్రవర్తిస్తారు. (39)
భీరుస్తథా శూరమానీ శూరా భీరువిషాదినః ।
న విశ్వసంతి చాన్యోన్యం యుగాంతే పర్యుపస్థితే ॥ 40
యుగాంతవేళలో పిరికివాడు శూరుడననుకొంటాడు. శూరుడు పిరికితనంతో విషాదానికి లోనవుతాడు. ఎవ్వరినీ ఎవ్వరూ నమ్మరు. (40)
ఏకాహార్యం యుగం సర్వం లోభమోహవ్యవస్థితమ్ ।
అధర్మో వర్దతే తత్ర న తు ధర్మః ప్రవర్తతే ॥ 41
యుగాంతవేళలో సర్వజనులు లోభమోహాలకు లొంగి, అందరూ భక్ష్యాభక్ష్యవివేకాన్న్ విడిచి ఆరగిస్తారు. అధర్మం వృద్ధి పొందుతుంది. ధర్మప్రవృత్తి కనిపించదు. (41)
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః న శిష్యంతి జనాధిప ।
ఏకవర్ణస్తదా లోకః భవిష్యతి యుగక్షయే ॥ 42
రాజా! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య విభాగాలు కనిపించవు. యుగాంతంలో అంతా ఒకే వర్ణంగా ఒకే జాతిగా ఉంటుంది. (42)
న క్షంస్యతి పితా పుత్రం పుత్రశ్చ పితరం తథా ।
భార్యాశ్చ పతిశుశ్రూషాం న కరిష్యంతి సంక్షయే ॥ 43
యుగాంతంలో తండ్రి కొడుకును క్షమించలేడు. కొడుకు తండ్రిమాటను పాటించడు. భార్యలు పతిశుశ్రూష చేయరు. (43)
యే యవాన్నా జనపదాః గోధుమాన్నాస్తథైవ చ ।
తాన్ దేశాన్ సంశ్రయిష్యంతి యుగాంతే పర్యుపస్థితే ॥ 44
యుగాంతవేళలో జనులు యవలు, గోధుమలు ఎక్కువగా పండే ప్రాంతాలకు వెళ్ళిపోతారు. (44)
స్వైరాచారాశ్చ పురుషాః యోషితశ్చ విశాంపతే ।
అన్యోన్యం న సహిష్యంతి యుగాంతే పర్యుపస్థితే ॥ 45
రాజా! యుగాంతకాలంలో స్త్రీపురుషులు ఇద్దరూ స్వేచ్ఛగా విహరిస్తుంటారు. ఒకరినొకరు సహించరు. (45)
మ్లేచ్ఛభూతం జగత్ సర్వం భవిష్యతి యుధిష్ఠిర ।
న శ్రాద్ధైస్తర్పయిష్యంతి దైవతానీహ మానవాః ॥ 46
యుధిష్ఠిరా! ప్రపంచమంతా మ్లేచ్ఛప్రాయమవుతుంది. మానవులు శ్రాద్ధయజ్ఞకర్మలలో పితరులను, దేవతలను తృప్తిపరచరు. (46)
న కశ్చిత్ కస్యచిచ్ఛ్రోతా న కశ్చిత్ కస్యచిద్ గురుః ।
తమోగ్రస్తస్తదా లోకః భవిష్యతి జనాధిప ॥ 47
రాజా! ఆ సమయంలో ఎవడూ ఎవడిమాటా వినడు. ఎవడూ ఎవడికీ గురువు కాదు. లోకమంతా అజ్ఞానాంధకారంతో నిండిపోతుంది. (47)
పరమాయుశ్చ భవితా తదా వర్షాణి షోడశ ।
తతః ప్రాణాన్ విమోక్ష్యంతి యుగాంతే సముపస్థితే ॥ 48
పంచమే వాథ షష్ఠే వా వర్షే కన్యా ప్రసూయతే ।
సప్తవర్షాష్టవర్షాశ్చ ప్రజాస్యంతి నరాస్తదా ॥ 49
యుగాంతకాలంలో మానవుల పరమాయువు పదహారు సంవత్సరాలే. ఆ తర్వాత మరణించటమే. ఐదారు సంవత్సరాల వయస్సులో స్త్రీలు పిల్లలను కంటారు. ఏడెనిమిది సంవత్సరాల పురుషులు సంతానోత్పాదకులు అవుతారు. (48,49)
పత్యౌ స్త్రీ తు తదా రాజన్ పురుషో వా స్త్రియం ప్రతి ।
యుగాంతే రాజశార్దూల న తోషముపయాస్యతి ॥ 50
రాజశ్రేష్ఠా! యుగాంతకాలంలో స్త్రీ తన భర్తతోనూ, పురుషుడు తన భార్యతోనూ తృప్తి చెందరు. (50)
అల్పద్రవ్యా వృథాలింగా హింసా చ ప్రభవిష్యతి ।
న కశ్చిత్ కస్యచిద్ దాతా భవిష్యతి యుగక్షయే ॥ 51
యుగాంతకాలంలో దారిద్ర్యం పెరుగుతుంది. కపటసాధుత్వం వృద్ధినొందుతుంది. హింస ప్రబలుతుంది. ఎవ్వరూ ఎవ్వరికీ ఏమీ ఇవ్వరు. (51)
అట్టశూలా జనపదాః శివశూలాశ్చతుష్పథాః ।
కేశశూలాః స్త్రియశ్చాపి భవిష్యంతి యుగక్షయే ॥ 52
యుగాంతవేళలో ఊళ్ళలో అన్న మమ్ముతారు. బ్రాహ్మణులు వేదాన్ని అమ్ముకొంటారు. స్త్రీలు వేశ్యావృత్తిని స్వీకరిస్తారు. (52)
మ్లేచ్ఛాచారాః సర్వభక్షాః దారుణాః సర్వకర్మసు ।
భావినః పశ్చిమే కాలే మనుష్యా నాత్ర సంశయః ॥ 53
రాబోయే యుగాంతవేళలో మనుష్యులు మ్లేచ్ఛాచారులవుతారు. అన్నీ తింటారు. అన్ని పనులలో క్రూరత్వాన్ని ప్రదర్శిస్తారు. ఈ విషయంలో సందేహం లేదు. (53)
క్రయవిక్రయకాలే చ సర్వః సర్వస్య వంచనమ్ ।
యుగాంతే భరతశ్రేష్ఠ విత్తలోభాత్ కరిష్యతి ॥ 54
భరతశ్రేష్ఠా! యుగాంతవేళలో డబ్బుమీది ఆశతో అమ్మకాలు కొనుగోళ్ళలో, అందరూ అందరినీ మోసగిస్తారు. (54)
జ్ఞానాని చాప్యవిజ్ఞాయ కరిష్యంతి క్రియాస్తథా ।
ఆత్మచ్ఛందేన వర్తంతే యుగాంతే సముపస్థితే ॥ 55
యుగాంతవేళలో వస్తుతత్త్వ మెరుగకుండానే కర్మల నాచరిస్తారు. అన్నింటికీ తామే ప్రమాణమనుకొని తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. (55)
స్వభావాత్ క్రూరకర్మాణః చాన్యోన్యమభిశంసినః ।
భవితారో జనాః సర్వే సంప్రాప్తే తు యుగక్షయే ॥ 56
యుగాంతవేళలో ప్రజలంతా స్వాభావికంగానే క్రూరలుగా ఉంటారు. ఒకరినొకరు ఆడిపోసుకొంటారు. (56)
ఆరామాంశ్చైవ వృక్షాంశ్చ నాశయిష్యంతి నిర్వ్యథాః ।
భవితా సంశయో లోకే జీవితస్య హి దేహినామ్ ॥ 57
తోటలను, చెట్లను నాశనం చేస్తారు. అందుకసలు బాధపడరు. ప్రాణుల జీవితం కూడా సంశయగ్రస్తమవుతుంది. (57)
తథా లోభాభిభూతాశ్చ భవిష్యంతి నరా నృప ।
బ్రాహ్మణాంశ్చ హనిష్యంతి బ్రాహ్మణస్వోపభోగినః ॥ 58
రాజా! నరులందరూ ఆశపోతులవుతారు. బ్రాహ్మణుల సొమ్ము తింటూనే వారిని సంహరిస్తారు. (58)
హాహాకృతా ద్విజాశ్చైవ భయార్తా వృషలార్దితాః ।
త్రాతారమలభంతో వై భ్రమిష్యంతి మహీమిమామ్ ॥ 59
శూద్రులచే పీడింపబడిన బ్రాహ్మణుల భయంతో హాహాకారాలు చేస్తూ, కాపాడేవాడు లేక లోకమంతా తిరుగుతుంటారు. (59)
జీవితాంతకరాః క్రూరాః రౌద్రాః ప్రాణివిహింసకాః ।
యదా భవిష్యంతి నరాః తదా సంక్షేప్స్యతే యుగమ్ ॥ 60
నరులు పరుల జీవితాలను అంతం చేస్తూ క్రూరులై, రౌద్రులై, జీవహింసకులైనపుడు యుగాంతకాలం పూర్తిఅయినట్లే. (60)
ఆశ్రయష్యంతి చ నదీః పర్వతాన్ విషయాణి చ ।
ప్రధావమానా విత్రస్తాః ద్విజాః కురుకులోద్వహ ॥ 61
కురుకులద్వేష్ఠా! బ్రాహ్మణులు భయంతో సంచరిస్తూ నదులనూ, పర్వతాలనూ, చొరరాని ప్రదేశాలను ఆశ్రయిస్తారు. (61)
దస్యుభిః పీడితా రాజన్ కాకా ఇవ ద్విజోత్తమాః ।
కురాజభిశ్చ సతతం కరభారప్రపీడితాః ॥ 62
ధైర్యం త్యక్త్వా మహీపాల దారుణే యుగసంక్షయే ।
వికర్మాణి కరిష్యంతి శూద్రాణాం పరిచారకాః ॥ 63
రాజా! బ్రాహ్మణులు దొంగలబాధతో కాకులవలె కావుకావుమంటూ తిరుగుతారు. దుష్టులైనపాలకులు వేసే పన్నులభారాన్ని భరించలేక ధైర్యాన్ని వీడి, శూద్రులకు సేవకులై చేయరాని పనులు చేస్తారు. దారుణమైన యుగాంతకాలస్థితి ఇది. (62,63)
శూద్రా ధర్మం ప్రవక్ష్యంతి బ్రాహ్మణాః పర్యుపాసకాః ।
శ్రోతారశ్చ భవిష్యంతి ప్రామాణ్యేన వ్యవస్థితాః ॥ 64
విపరీతశ్చ లోకోఽయం భవిష్యత్యధరోత్తరః ।
ఏడూకాన్ పూజయిష్యంతి వర్జయిష్యంతి దేవతాః ॥ 65
శూద్రులు ధర్మబోధ చేస్తారు. బ్రాహ్మణులు వారిని సేవిస్తారు. వారి బోధలనే ప్రమాణమనే శ్రోతలు కూడా ఏర్పడుతారు. లోకవ్యవహారం ఉల్టా సీదాగా మారుతుంది. ఉచ్చనీచాలు తారుమారవుతాయి. దేవతలను కాదని ఎముకలగూళ్ళను (బౌద్దాలయాలను) పూజిస్తారు జనులు (64,65)
శూద్రాః పరిచరిష్యంతి న ద్విజాన్ యుగసంక్షయే ।
ఆశమేషు మహర్షీణాం బ్రాహ్మణావసథేషు చ ॥ 66
దేవస్థానేషు చైత్యేషు నాగానామాలయేషు చ ।
ఎడూకచిహ్నా పృథివీ న దేవగృహభూషితా ॥ 67
భవిష్యతి యుగే క్షీణే తద్ యుగాంతస్య లక్షణమ్ ।
యుగాంతవేళలో శూద్రులు ద్విజులను సేవించరు. మహర్షుల ఆశ్రమాలలో, బ్రాహ్మణుల ఇళ్ళలో, దేవాలయాలలో, యాగశాలల్లో నాగాలయాల్లో ఎముకలు కలిపిన గోడలే కనిపిస్తాయి. భూమిపై దేవమందిరశోభ ఉండదు. యుగధర్మాలు నశించిన యుగాంత లక్షణమిది. (66,67)
యదా రౌద్రా ధర్మహీనాః మాంసాదాః పానపాస్తథా ॥ 68
భవిష్యంతి నరా నిత్యం తదా సంక్షేప్స్యతే యుగమ్ ।
నరులు కోపిష్ఠులు, ధర్మహీనులు, మాంసభక్షకులు, సురాప్రియులు అయినప్పుడు యుగాంతమవుతుంది. (68 1/2)
పుష్పం పుష్పే యదా రాజన్ ఫలే వా ఫలమాశ్రితమ్ ॥ 69
ప్రజాస్యతి మహారాజ తదా సంక్షేప్స్యతే యుగమ్ ।
అకాలవర్షీ పర్జన్యః భవిష్యతి గతే యుగే ॥ 70
రాజా! పూవులో పూవు, పండులో పండు కనిపిస్తే అది యుగసమాప్తి సూచన. యుగాంత వేళలో మేఘాలు అకాలంలో వర్షిస్తాయి. (69,70)
అక్రమేణ మనుష్యాణాం భవిష్యంతి తదా క్రియాః ।
విరోధమథ యాస్యంతి వృషలా బ్రాహ్మణైః సహ ॥ 71
యుగాంతకాలంలో మనుష్యుల చేతలు అక్రమంగా ఉంటాయి. శూద్రులు బ్రాహ్మణులతో శత్రుత్వాన్ని పూనుతారు. (71)
మహీ మ్లేచ్ఛజనాకీర్ణా భవిష్యతి తతోఽచిరాత్ ।
కరభారభయాద్ విప్రాః భజిష్యంతి దిశో దశ ॥ 72
కొద్దికాలంలోనే భూమిమొత్తం మ్లేచ్ఛులతో నిండిపోతుంది. పన్నులబాధతో విప్రులు పదిదిక్కులకూ పారిపోతారు. (72)
నిర్విశేషా జనపదాః తథా విష్టికరార్దితాః ।
ఆశ్రమానుపలప్స్యంతి ఫలమూలోపజీవినః ॥ 73
జానపదులంతా ఒకటిగానే కనిపిస్తారు. వెట్టిచాకిరితో, పన్నులబాధతో భయపడిన ప్రజలు ఆశ్రమాలకు వెళ్ళి, ఫలమూలాలు తింటూ జీవిస్తారు. (73)
ఏవం పర్యాకులే లోకే మర్యాదా న భవిష్యతి ।
న స్థాస్యంత్యుపదేశే చ శిష్యా విప్రియకారిణః ॥ 74
లోకమంతా ఇలా కలతపడుతుంది. ఏ మర్యాదలూ మిగలవు. శిష్యులు గురువుల మాట వినరు. పైపెచ్చు గురువులకు కీడు చేస్తారు. (74)
ఆచార్యోఽపనిధిశ్చైవ భర్త్స్యతే తదనంతరమ్ ।
అర్థయుక్త్యా ప్రవత్స్యంతి మిత్రసంబంధిబాంధనాః ॥ 75
నిర్ధనులయిన గురువులను శిష్యులు కూడా బెదిరిస్తారు. స్నేహాలూ, వియ్యాలూ, బాంధవ్యాలూ అన్నీ డబ్బును బట్టి ఏర్పడుతాయి. (75)
అభావః సర్వభూతానాం యుగాంతే సంభవిష్యతి ।
దిశః ప్రజ్వలితాః సర్వాః నక్షత్రాణ్యప్రభాణి చ ॥ 76
యుగాంతవేళలో ప్రాణులేవీ మిగలవు. దిక్కులు మండిపోతాయి. నక్షత్రాల కాంతి లోపిస్తుంది. (76)
జ్యోతీంషి ప్రతికూలాని వాతాః పర్యాకులాస్తథా ।
ఉల్కాపాతాశ్చ బహవః మహాభయనిదర్శకాః ॥ 77
గ్రహాలు ప్రతికూలంగా నడుస్తాయి. గాలులు భీకరంగా కలతపెడుతాయి. మహాభయాన్ని సూచిస్తూ మాటిమాటికి తోకచుక్కలు రాలుతాయి. (77)
షడ్ భిరన్యైశ్చ సహితః భాస్కరః ప్రతపిష్యతి ।
తుములాశ్చాపి నిర్ర్హాదాః దిగ్దాహాశ్చాపి సర్వశః ॥ 78
సూర్యుడు మరో ఆరుగురు సూర్యులతో కలిసి తపింపజేస్తాడు. భయంకరధ్వనులు వినిపిస్తాయి. అన్ని దిక్కులలో మంటలు లేస్తాయి. (78)
కబంధాంతర్హితో భానుః ఉదయాస్తమనే తదా ।
అకాలవర్షీ భగవాన్ భవిష్యతి సహస్రదృక్ ॥ 79
ఉదయాస్తమనవేళల్లో రాహువు సూర్యుని మ్రింగుతాడు. పూజ్యుడైన దేవేంద్రుడు అకాలంలో వర్షిస్తాడు. (79)
సస్యాని చ న రోక్ష్యంతి యుగాంతే పర్యుపస్థితే ।
అభీక్ ష్ణం క్రూరవాదిన్యః పరుషా రుదితప్రియాః ॥ 80
యుగాంతవేళలో గింజలు మొలకెత్తవు. స్త్రీలు ఎప్పుడూ క్రూరంగా, పరుషంగా మాటాడుతారు. ఏడుపే వారికి నచ్చుతుంది. (80)
భర్తౄణాం వచనే చైవ న స్థాప్యంతి తతః స్త్రియః ।
పుత్రాశ్చ మాతాపితరౌ హనిష్యంతి యుగక్షయే ॥ 81
స్త్రీలు భర్తల మాట వినరు. యుగాంతకాలంలో కొడుకులే తల్లిదండ్రులను చంపుతారు. (81)
సూదయిష్యంతి చ పతీన్ స్త్రియః పుత్రానపాశ్రితాః ।
అపర్వణి మహారాజ సూర్యం రాహురుపైష్యతి ॥ 82
భార్యలు కొడుకులతో కలిసి భర్తలను చంపుతారు. మహారాజా! అమావాస్య లేకపోయినా రాహువు సూర్యుని మ్రింగుతాడు. (82)
యుగాంతే హుతభుక్ చాపి సర్వతః ప్రజ్వలిష్యతి ।
పానీయం భోజనం చాపి యాచమానాస్తదాధ్యగాః ॥ 83
న లప్స్యంతే నివాసం చ నిరస్తాః పథి శేరతే ।
యుగాంతవేళలో అన్నిదిక్కుల్లో మంటలు లేస్తాయి. బాటసారులు యాచించినా నీరు కానీ, ఆహారం కానీ, వసతి కానీ దొరకదు. తిరస్కారానికి గురి అయిన వారు బాటమీదనే శయనిస్తారు. (83 1/2)
నిర్ఘాతవాయసా నాగాః శకునాః సమృగద్విజాః ॥ 84
రూక్షా వాచో విమోక్ష్యంతి యుగాంతే పర్యుపస్థితే ।
మిత్రసంబంధినశ్చాపి సంత్యక్ష్యంతి నరాస్తదా ॥ 85
జనం పరిజనం చాపి యుగాంతే పర్యుపస్థితే ।
అథ దేశాన్ దిశశ్చాపి పత్తనాని పురాణి చ ॥ 86
క్రమశః సంశ్రయిష్యంతి యుగాంతే పర్యుపస్థితే ।
యుగాంతవేళలో కఠినంగా అరిచే కాకులు, ఏనుగులు, పక్షులు, జంతువులు క్రూరంగా అరుస్తాయి. ఆ సమయంలో నరులు, మిత్రులను, బంధువులను, సేవకులను, కుటుంబసభ్యులను కూడా అకారణంగా పరిత్యజిస్తారు.
జనులు తామున్న తావులను వీడి ఇతరదేశాలనూ, దిక్కులనూ, పట్టణాలనూ, నగరాలనూ ఆశ్రయిస్తారు. (84-86)
హా తాత హా సుతేత్యేవం తదా వాచః సుదారుణాః ॥ 87
విక్రోశమానశ్చాన్యోన్యం జనో గాం పర్యటిష్యతి ।
హా, తండ్రీ, హా, కుమారా! అంటూ దయనీయమయిన మాటలతో ఒకరినొకరు పిలుచుకొంటూ, ఏడుస్తూ భూమిపై సంచరిస్తారు. యుగాంతవేళలోని స్థితి ఇది. (87,88)
తతస్తుములసంఘాతే వర్తమానే యుగక్షయే ॥ 88
ద్విజాతిపూర్వకో లోకః క్రమేన ప్రభవిష్యతి ।
తతః కాలాంతరేఽన్యస్మిన్ పునర్లోకవివృద్ధయే ॥ 89
భవిష్యతి పునర్దైవమ్ అనుకూలం యదృచ్ఛయా ।
యదా సూర్యశ్చ చంద్రశ్చ తథా తిష్యబృహస్పతీ ॥ 90
ఏకరాశౌ సమేష్యంతి ప్రపత్స్యతి తదా కృతమ్ ।
కాలవర్షీ చ సర్జన్యః నక్షత్రాణి శుభాని చ ॥ 91
ప్రదక్షిణా గ్రహాశ్చాపి భవిష్యంత్యనులోమగాః ।
క్షేమం సుభిక్షమారోగ్యం భవిష్యతి నిరామయమ్ ॥ 92
ఆపై క్రమంగా లోకంలో జనులంతా అన్నిరకాల కష్టాలు పడుతుండగా మరల బ్రాహ్మణాది వర్ణాలు ఏర్పడి లోకం వర్దిల్లుతుంది. దానికై అప్రయత్నంగా దైవం అనుకూలిస్తుంది. సూర్యుడు, చంద్రుడు, గురువు పుష్యనక్షత్రంలో ఒకేరాశిలో అడుగుపెడతారు. అప్పుడు కృతయుగం ప్రారంభమవుతుంది. సకాలంలో నానలు కురుస్తాయి. నక్షత్రాలు శుభాస్పదాలు అవుతాయి. గ్రహాలు ప్రదక్షిణభావంతో అనుకూలగతిని ఆశ్రయిస్తాయి. లోకమంతా క్షేమంగా, సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉంటుంది. (89-92)
కల్కీ విష్ణుయశా నామ ద్విజః కాలప్రచోదితః ।
ఉత్పత్స్యతే మహా వీర్యః మహాబుద్ధిపరాక్రమః ॥ 93
సంభూతః సంభలగ్రామే బ్రాహ్మణావసథే శుభే ।
(మహాత్మా వృత్తసంపన్నః ప్రజానాం హితకృన్నృప ।)
రాజా! యుగాంతవేళలో కాలప్రేరణచే సంభలగ్రామంలో మంగళకరమైన బ్రాహ్మణగృహంలో విష్ణుయశః కల్కి పేరుతో ఒక మహాత్ముడు జన్మిస్తాడు. అతడు మహాపరాక్రమవంతుడు, బుద్ధిమంతుడు, సచ్ఛీలుడు, ప్రజలకు మేలుకూర్చేవాడు. (93 1/2)
మనసా తస్య సర్వాణి వాహనాన్యాయుధాని చ ॥ 94
ఉపస్థాస్యంతి యోధాశ్చ శస్త్రాణి కవచాని చ ।
స ధర్మవిజయీ రాజా చక్రవర్తీ భవిష్యతి ॥ 95
సంకల్పమాత్రం చేతనే అన్ని ఆయుధాలు, వాహనాలు, యోధులు, శస్త్రాలు, కవచాలు అతనిని చేరుతాయి. అతడు ధర్మవిజేత, చక్రవర్తి అవుతాడు. (94,95)
స చేమం సంకులం లోకం ప్రసాదముపనేష్యతి ।
ఉత్థితో బ్రాహ్మణో దీప్తః క్షయాంతకృదుదారధీః ॥ 96
ఉదారమతి, తేజస్సంపన్నుడు అయిన ఆ బ్రాహ్మణుడు దుఃఖభుయిష్ఠమైన ఈ లోకానికి ఆనందాన్ని కలిగిస్తాడు. కలియుగాన్ని అంతం చేయటమే అతని లక్ష్యం. (96)
సంక్షేపకో హి సర్వస్య యుగస్య పరివర్తకః ।
స సర్వత్ర గతాన్ క్షుద్రాన్ బ్రాహ్మణైః పరివారితః ।
ఉత్పాదయిష్యతి తదా సర్వమ్లేచ్ఛగణాన్ ద్విజః ॥ 97
అతడు కలియుగాన్ని అంతంచేసి సత్యయుగాన్ని ప్రవర్తింపజేస్తాడు. బ్రాహ్మణపరివృతుడై ఆ ద్విజుడు లోకమంతా తిరుగుతూ సమస్త మ్లేచ్ఛగణాలను సంహరిస్తాడు. (97)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి భవిష్యకథనే నవత్యధికశతతమోఽధ్యాయః ॥ 190 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయసమాస్యాపర్వమను ఉపపర్వమున భవిష్యకథనమను నూటతొంబదియవ అధ్యాయము. (190)
(దాక్షిణాత్య అధికపాఠము 1/2 శ్లోకము కలిపి మొత్తం 97 1/2 శ్లోకాలు.)