189. నూట ఎనుబది తొమ్మిదవ అధ్యాయము

వటపత్రశాయి మార్కండేయునకు తన్ను గురించి తెలుపుట.

దేవ ఉవాచ
కామం దేవా అపి న మాం విప్ర జానంతి తత్త్వతః ।
త్వత్ర్పీత్యా తు ప్రవక్ష్యామి యథేదం విసృజామ్యహమ్ ॥ 1
భగవానుడిలా అన్నాడు.
బ్రాహ్మణా! దేవతలు సైతం నాగురించి యథాతథంగా తెలిసికొనలేరు. నీమీద ప్రేమతో ఈ జగత్తును ఎలా సృష్టిస్తున్నానో నీకు చెపుతాను. (1)
పితృభక్తోఽసి విప్రర్షే మాం చైవ శరణం గతః ।
తతో దృష్టోఽస్మి తే సాక్షాద్ బ్రహ్మచర్యం చ తే మహత్ ॥ 2
బ్రహ్మర్షీ! నీవు పితృభక్తి గలవాడవు. నన్ను శరణుకోరినవాడవు నీవు. గొప్పగా బ్రహ్మచర్యాన్ని పాలించినవాడవు. కాబట్టి నేను చూడబడినాను. (2)
అపాం నారా ఇతిపురా సంజ్ఞాకర్మ కృతం మయా ।
తేన నారాయణోఽప్యు క్తః మమ తత్ త్వయనం సదా ॥ 3
గతంలో నేను నీళ్ళకు 'నారాః' అని పేరు పెట్టాను. ఆ నీళ్ళు నాకు నిత్య నివాసాలు. కాబట్టి నేను నారాయణుడను. (3)
వి॥ సం॥ "తత్స్పష్ట్వా తదేవానుప్రావిశత్" అను శ్రుతివచనం ద్వారా "సంఘాతస్పష్టికర్తనూ నేనే, తదభిమానినీనేనే" అని జీవేశ్వరులకు అభేదం చూపబడింది. (నీల)
అహం నారాయణో నామ ప్రభవః శాశ్వతోఽవ్యయః ।
విధాతా సర్వభూతానాం సంహర్తా చ ద్విజోత్తమ ॥ 4
అహం విష్ణురహం బ్రహ్మా శక్రశ్చాహం సురాధిపః ।
అహం వైశ్రవణో రాజా యమః ప్రేతాధిపస్తథా ॥ 5
ద్విజోత్తమా! నేను నారాయణుడను. అన్నింటి పుట్టుకకు కారకుడను. శాశ్వతుడను. నశించని వాడను. సర్వప్రాణులకూ సృష్టికర్తనూ, నాశకుడనూ నేనే. నేనే విష్ణువును, బ్రహ్మను, ఇంద్రుడను, కుబేరుడను, యముడను. (4,5)
అహం శివశ్చ సోమశ్చ కశ్యపోఽథ ప్రజాపతిః ।
అహం ధాతా విధాతా చ యజ్ఞశ్చాహం ద్విజోత్తమ ॥ 6
ద్విజోత్తమా! నేనే శివుడను, సోముడను, కశ్యపప్రజాపతిని. నేనే ధాతను, విధాతను. నేనే యజ్ఞస్వరూపుడను. (6)
అగ్నిరాస్యం క్షితిః పాదౌ చంద్రాదిత్యౌ చ లోచనే ।
ద్యౌర్మూర్ధా ఖం దిశః శ్రోత్రే తథాఽపః స్వేదసంభవాః ॥ 7స్
సదిశం చ నభః కాయః వాయుర్మవసి మే స్థితః ।
మయా క్రతుశతైరిష్టం బహుభిః స్వాప్తదక్షిణైః ॥ 8
అగ్ని నాముఖం. భూమి నా పాదాలు. సూర్యచంద్రులు నా నేత్రాలు. ఆకాశమే నా తల. దిక్కులు నా చెవులు. నా స్వేదం నుండి పుట్టినవే నీళ్ళు. దిక్కులతో కూడిన ఆకాశమే నా శరీరం. గాలి నా మనస్సులో ఉంటుంది. నేను భూరిదక్షిణలతో వందల కొలది యాగాలను చేశాను. (7,8)
యజంతే వేదవిదుషః మాం దేవయజనే స్థితమ్ ।
పృథివ్యాం క్షత్రియేంద్రాశ్చ పార్థివాః స్వర్గకాంక్షిణః ॥ 9
యజంతే మాం తథా వైశ్యాః స్వర్గలోకజిగీషయా ।
చతుఃసముద్రపర్యంతాం మేరుమందరభూషణామ్ ॥ 10
శేషో భూత్వాహమేవైతాం ధారయామి వసుంధరామ్ ।
వేదవేత్తలు యజ్ఞశాలలో ఉన్న నన్నుగూర్చి యాగాలు చేస్తారు. భూపాలకులయిన క్షత్రియులు, వైశ్యులు కూడా స్వర్గాభిలాషతో నాగురించి యాగాలు చేస్తారు. మేరు మందరపర్వతాలతో అలంకరింపబడిన చతుస్సముద్రపర్యంతమైన ఈ భూమిని శేషుడనై నేనే మోస్తున్నాను. (9,10 1/2)
వారాహం రూపమాస్థాయ మయేయం జగతీ పురా ॥ 11
మజ్జమానా జలే విప్ర వీర్యేణాసీత్ సముద్ధృతా ।
అగ్నిశ్చ వడవావక్ర్తః భూత్వాహం ద్విజసత్తమ ॥ 12
పిబామ్యపః సదా విద్వన్ తాశ్చైవం విసృజామ్యహమ్ ।
బ్రహ్మ వక్ర్తం భుజౌ క్షత్రమ్ ఊరూ మే సంస్థితా విశః ॥ 13
బ్రాహ్మణా! గతంలో నేను వరాహరూపాన్ని ధరించి నీటమునుగుతున్న భూమిని పరాక్రమంతో ఉద్ధరించాను.
విద్వాంసుడా! నేనే బడబాగ్నినై నిత్యం జలాన్ని త్ర్రాగుతూ, విడుస్తూ ఉంటాను. బ్రాహ్మణులు నా ముఖం. క్షత్రియులు నా భుజాలు. వైశ్యులు నా తొడలు. (11-13)
పాదౌ శూద్రా భవంతీమే విక్రమేణ క్రమేణ చ ।
ఋగ్వేదః సామవేదశ్చ యజుర్వేదోఽప్యథర్వణః ॥ 14
మత్తః ప్రాదుర్భవంత్యేతే మామేవ ప్రవిశంతి చ ।
శూద్రులు నా పాదాలు. నా శక్తితో వీరంతా క్రమంగా పుట్టారు. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం నానుమ్డే పుడతాయి. నాలోనేలయిస్తాయి. (14 1/2)
యతయః శాంతిపరమాః యతాత్మానో బుభుత్సవః ॥ 15
కామక్రోధద్వేదముక్తాః నిఃసంగా వీతకల్మషాః ।
సత్త్వస్థా నిరహంకారాః నిత్యమధ్యాత్మకోవిదాః ॥ 16
మామేవ సతతం విప్రాః చింతయంత ఉపాసతే ।
శాంతిపరాయణులు, నియతేంద్రియులు, జిజ్ఞాసువులు, కామక్రోధద్వేషరహితులు, నిస్సంగులు, కల్మషరహితులు, సాత్త్వికులు, నిరహంకారులు నిత్యమూ అధ్యాత్మకోవిదులూ అయిన యతులు, బ్రాహ్మణులు ఎల్లప్పుడూ నాగురించియే ఆలోచిస్తూ నన్ను సేవిస్తారు. (15,16 1/2)
అహం సంవర్తకో వహ్నిః అహ సంవర్తకోఽనలః ॥ 17
అహం సంవర్తకః సూర్యః త్వహం సంవర్తకోఽనిలః ।
తారారూపాణి దృశ్యంతే యాన్యేతాని నభస్తలే ॥ 18
మమ వై రోమకూపాణి విద్ధి త్వం ద్విజసత్తమ ।
రత్నాకరాః సముద్రాశ్చ సర్వ ఏవ చతుర్దిశమ్ ॥ 19
వసనం శయనం చైవ నిలయం చైవ విద్ధి మే ।
మయైవ సువిభక్తాస్తే దేవకార్యార్థసిద్ధయే ॥ 20
ప్రళయకారణమైన సంవర్తకాగ్నిని నేనే. సంవర్తక సూర్యుడను, సంవర్తక వాయువును నేనే. ద్విజోత్తమా! ఆకాశంలో నక్షత్రాలవలె కనిపించేవన్నీ నారోమకూపాలు అని గ్రహించాలి. రత్ననిలయాలయిన సముద్రాలు, నాలుగు దిక్కులూ నాకు వస్త్రాలు, శయ్య, నివాస స్థానాలని తెలుసుకో. దేవతల కార్యాసిద్ధికై నేనే వాటిని విభజించాను. (17-20)
కామం క్రోధం చ హర్షం చ భయం మోహం తథైవ చ ।
మమైవ విద్ధి రోమాణి సర్వాణ్యేతాని సత్తమ ॥ 21
సజ్జనశ్రేష్ఠా! కామం, క్రోధం, హర్షం, భయం, మోహం ఇవన్నీ నా రోమాలు అని గ్రహించు. (21)
ప్రాప్నువంతి నరా విప్ర యత్ కృత్వా కర్మ శోభనమ్ ।
సత్యం దానం తపశ్చోగ్రమ్ అహింసా చైవ జంతుషు ॥ 22
మద్విధానేన విహితా మమ దేహవిహారిణః ।
మయాఽఽవిర్భూతవిజ్ఞానాః విచేష్టంతే న కామతః ॥ 23
బ్రాహ్మణా! ఏ శుభకర్మలన్ ఆచరించి మానవులు శుభాలను పొందుతారో అవి - సత్యం, దానం, తీవ్రతపస్సు, ప్రాణులపై అహింసాస్వభావం - అన్నీ నా ద్వారా ఏర్పడినవే. నా శరీరంలో సంచరించేవే. ప్రాణుల విజ్ఞానానికై నేను ఆవిర్భవింపజేసినప్పుడే అవి పుడతాయి. స్వతంత్రంగా అవి ఏమీ చేయలేవు. (22,23)
సమ్యగ్ వేదమధీయానాః యజంతే వివిధైర్మఖైః ।
శాంతాత్మానో జితక్రోధాః ప్రాప్నువంతి ద్విజాతయః ॥ 24
వేదాన్ని చక్కగా అధ్యయనం చేసి, శాంతస్వరూపులై, క్రోధాన్ని జయించి వివిధయాగాల ద్వారా నన్ను ఉపాసించిన బ్రాహ్మణులు నా సన్నిధికి చేరుతారు. (24)
ప్రాప్తుం న శక్యో యో విద్వన్ నరైర్దుష్కృత్కకర్మభిః ।
లోభాభిభూతైః కృపణైః అనార్యైరకృతాత్మభిః ॥ 25
తం మాం మహాఫలం విద్ది నరాణాం భావితాత్మనామ్ ।
సుదుష్ప్రాపం విమూఢానాం మార్గం యాగైర్నిషేవితమ్ ॥ 26
పండితా! లోభానికి ఎరయై, నీచులై, ఇంద్రియాధీనులై, మర్యాద తప్పి చెడ్డపనులు చేసేవారు నన్ను చేరలేరు. అట్టి మహాఫలాన్ని నేను. పుణ్యాత్ములు తేలికగా పొందగల యోగమార్గాన్న్ నేను. మూఢులు ఆ మార్గాన్ని సమీపించటం కష్టం. (25,26)
యదా యదా చ ధర్మస్య గ్లానిర్భవతి సత్తమ ।
అభ్యుత్థానమధర్మస్య తదాఽఽత్మానం సృజామ్యహమ్ ॥ 27
దైత్యా హింసానురక్తాశ్చ అవధ్యాః సురసత్తమైః ।
రాక్షసాశ్చాపి లోకేఽస్మిన్ యదోత్పత్స్యంతి దారుణాః ॥ 28
తదాహం సంప్రసూయామి గృహేషు సుభకర్మణామ్ ।
ప్రవిష్టో మానుషం దేహం సర్వం ప్రశమయామ్యహమ్ ॥ 29
భారతా! ధర్మానికి గ్లాని కలిగి, అధర్మం ఎగిసిపడినప్పుడు నన్ను నేను ప్రకటించుకొంటాను.
హింసానురక్తులయిన దైత్యులను దేవతలు అణచటానికి అలవికానపుడూ, దారుణరాక్షసులు లోకంలో ఉద్భవించినప్పుడూ నేను మానుషదేహాన్ని ధరించి సత్పురుషుల ఇంట జన్మిస్తాను. (27-29)
వి॥సం॥ సూర్యుని ఉదయాస్తమయాలు మనం కల్పించినవే కానీ వాస్తవంగా సూర్యునికి ఉదయాస్తమయాలు లేవు. అదేవిధంగా నందనందనుని విషయంలో కూడా పుట్టుక, వినాశం మనం కల్పించినవే. (నీల)
సృష్ట్వా దేవమనుష్యాంస్తు గంధర్వోరగరాక్షసాన్ ।
స్థావరాణి చ భూతాని సంహరామ్యాత్మమాయయా ॥ 30
దేవతలను, మనుష్యులను, గంధర్వులను, నాగులను, రాక్షసులను, స్థావరాలైన ప్రాణులను నా మాయతో నేనే సృష్టించి తగినవేళలో అన్నింటిని లయం చేసికొంటాను. (30)
కర్మకాలే పునర్దేహమ్ అవిచింత్యం సృజామ్యహమ్ ।
ఆవిశ్య మానుషం దేహం మర్యాదాబంధకారణాత్ ॥ 31
మర్యాదాబంధం కారణంగా మానుషదేహంలో ప్రవేశిస్తాను. పనిచేసేవేళలో నేను ఊహకందని రూపాన్ని ధరిస్తాను. (31)
శ్వేతః కృతయుగే వర్ణః పీతస్త్రేతాయుగే మమ ।
రక్తో ద్వాపరమాసాద్య కృష్ణః కలియుగే తథా ॥ 32
కృతయుగంలో నేను శ్వేతవర్ణుడను. త్రేతాయుగంలో పీతవర్ణుడను. ద్వాపరయుగంలో రక్తవర్ణుడను. కలియుగంలో కృష్ణవర్ణుడను. (32)
త్రయో భాగా హ్యధర్మస్య తస్మిన్ కాలే భవంతి చ ।
అంతకాలే చ సంప్రాప్తే కాలో భూత్వాతిదారుణః ॥ 33
త్రైలోక్యం నాశయామ్యేకః కృత్స్నం స్థావరజంగమమ్ ।
కలియుగంలో మూడుభాగాలు అధర్మం ఉంటుంది. ప్రళయకాలం సమీపించినప్పుడు అతిదారుణమైన కాలరూపాన్ని ధరించి నేను ఒక్కడనే స్థావరజంగమాత్మకమయిన మూడులోకాలను పూర్తిగా నశింపజేస్తాను. (33 1/2)
అహం త్రివర్త్మా విశ్వాత్మా సర్వలోకసుఖావహః ॥ 34
ఆవిర్భూః సర్వగోఽనంతః హృషీకేశ ఉరుక్రమః ।
కాలచక్రం నయామ్యేకః బ్రహ్మన్నహమరూపకమ్ ॥ 35
శమనం సర్వభూతానం సర్వలోకకృతోద్యమమ్ ।
ఏవం ప్రణిహితః సమ్యగ్ మమాత్మా మునిసత్తమ ।
సర్వభూతేషు విప్రేంద్ర న చ మాం వేత్తి కశ్చన ॥ 36
నేను మూడులోకాలలో వ్యాపించిన వాడను. విశ్వరూపుడను. సర్వలోకాలకు సుఖాలను కల్పించేవాడను. ఉత్పత్తిహేతువును. సర్వవ్యాపిని, అనంతుడను. ఇంద్రియాలను నియంత్రించినవాడను. విక్రమశాలిని.
బ్రాహ్మణా! కాలచక్రం రూపవిరహితం. సర్వప్రాణులనూ, నశింపజేసేదీ, సర్వలోకాలనూ ఉద్యుక్తులను చేసేదీ ఆ కాలచక్రమే. నేను ఒక్కడినే దానిని నడిపిస్తున్నాను.
మునిశ్రేష్ఠా! ఈరీతిగా నా ఆత్మ సర్వప్రాణుల యందు చక్కగా నిక్షిప్తమై ఉండి. అయినా నన్నెవ్వరూ తెలియలేరు. (34-36)
సర్వలోకే చ మాం భక్తాః పూజయంతి చ సర్వశః ।
యచ్చ కించిత్ త్వయా ప్రాప్తం మయి క్లేశాత్మకం ద్విజ ॥ 37
సుఖోదయాయ తత్ సర్వం శ్రేయసే చ తవానఘ ।
యచ్చ కించిత్ త్వయా లోకే దృష్టం స్థావరజంగమమ్ ॥ 38
విహితః సర్వథైవాసౌ మమాత్మా భూతభావనః ।
అర్ధం మమ శరీరస్య సర్వలోకపితామహః ॥ 39
బ్రాహ్మణా! సర్వలోకాలలో భక్తులు నన్ను సర్వవిధాలుగా ఆరాధిస్తున్నారు. నాదగ్గర నువ్వు ఏదైనా క్లేశాన్ని అనుభవించి ఉంటే అది భవిష్యత్తులో నీ సుఖానికి శ్రేయస్సుకు కారణమవుతుంది. అనఘా! నీవు లోకంలో చూస్తున్న స్థావరజంగమపదార్థాలన్నింటిలో భూతభావనాత్మకమయిన నా స్వరూపమే ప్రకటితమవుతుంది. సర్వలోకపితామహుడు నాశరీరంలో అర్ధభాగమే. (37-39)
వి॥సం॥ 'అర్ధం మమ శరీరస్య' అనటం ఈశ్వర స్వరూపంలో వికారాంతర్భూతమూ, బహిర్భూతమూ కూడా అనటమే. నిత్యసిద్ధేశ్వరునకూ, ఉపాసనాసిద్ధేశ్వరులకూ భేదమున్నది. నిత్యసిద్ధేశ్వరునకు జగత్స్నష్టిలో స్వాతంత్ర్యమున్నది. ఇతరులకు ఆ సామర్థ్యం లేదు. గీతవాది త్రాదిభోగానుభవంలో ఇద్దరూ సమానులే. నిత్యసిద్ధేశ్వరుడు మహదాదివికారాలలోను, బయటా కూడా ఉంటాడు. (నీల)
అహం నారాయణో నామ శంఖచక్రగదాధరః ।
యావద్యుగానాం విప్రర్షే సహస్రపరివర్తనాత్ ॥ 40
తావత్ స్వపిమి విశ్వాత్మా సర్వభూతాని మోహయన్ ।
ఏవం సర్వమహం కాలమ్ ఇహాస్సే మునిసత్తమ ॥ 41
అశిశుః శిశురూపేణ యావద్ బ్రహ్మా న బుధ్యతే ।
బ్రహ్మర్షీ! శంఖచక్రగదాధరుడనైన నారాయణుడను నేనే. సహస్రయుగాంతవేళలో ప్రళయమున్నంతసేపు ప్రాణులను మోహనిద్రలో నుంచి నేను నిద్రిస్తాను.
మునిశ్రేష్ఠా! నేను యథార్థంగా బాలుడను కాకపోయినా బ్రహ్మ మేల్కొనే వరకు బాలకరూపాన్ని ధరించి నేనిక్కడ శయనిస్తాను. (40,41 1/2)
మయా చ దత్తో విప్రాగ్ర్య వరస్తే బ్రహ్మరూపిణా ॥ 42
అసకృత్ పరితుష్టేన విప్రర్షిగణపూజిత ।
సర్వమేకార్ణవం దృష్ట్వా నష్టం స్థావరజంగమమ్ ॥ 43
విక్లవోఽసి మయా జ్ఞాతః తతస్తే దర్శితం జగత్ ।
అభ్యంతరం శరీరస్య ప్రవిష్టోఽసి యదా మమ ॥ 44
దృష్ట్వా లోకం సమస్తం చ విస్మితో నావబుధ్యసే ।
తతోఽసి వక్ర్తాద్ విప్రర్షే ద్రుతం నిఃసారితో మయా ॥ 45
విప్రశ్రేష్ఠా! విప్రగణపూజితా! నేను నీప్రవర్తనతో పదేపదే సంతుష్టుడనై బ్రహ్మరూపంతో నీకు వరమిచ్చాను. నీవు స్థావరజంగమాత్మకమైన సర్వజగత్తి ఏకార్ణవంగా మారటాన్ని చూచి కలతపడ్డావు. అది నేనెరిగి నీకు మరల జగత్తును చూపించాను. నా ఉదరంలో ప్రవేశించి, లోపల సమస్తవిశ్వాన్నీ చూచి నీవు ఆశ్వర్యమగ్నుడవై చైతన్యాన్ని కోల్పోయావు. అందువలన బ్రహ్మర్షీ! నిన్ను నానోటి నుండి వెంటనే వెలుపలికి తెచ్చాను. (42-45)
ఆఖ్యాతస్తే మయా చాత్మా దుర్ జ్ఞేయో హి సురాసురైః ॥ 46
యావత్ స భగవాన్ బ్రహ్మా న బుధ్యేత మహాతపాః ।
తావత్ త్వమిహ విప్రర్షే విశ్రబ్ధశ్చర వై సుఖమ్ ॥ 47
సురాసురులు కూడా గ్రహించలేని నా స్వరూపాన్ని నీకు వివరించాను. మహాతపస్వు, భగవంతుడు అయిన బ్రహ్మ మేల్కొనేదాకా నీవు ఇక్కడే శ్రద్ధావిశ్వాసాలతో సుఖంగా జీవించు. (46,47)
తతో విబుద్ధే తస్మింస్తు సర్వలోకపితామహే ।
ఏకీభూతో హి ప్రక్ష్యామి శరీరాణి ద్విజోత్తమ ॥ 48
ద్విజశ్రేష్ఠా! సర్వోలోక పితామహుడైన బ్రహ్మ మేల్కొన్న తర్వాత ఆయనలో లీనమై సమస్తప్రాణులను సృష్టిస్తాను. (48)
ఆకాశం పృథివీం జ్యోతిః వాయుం సలిలమేవ చ ।
లోకే యచ్చ భవేచ్ఛేషమ్ ఇహ స్థావరజంగమమ్ ॥ 49
ఆకాశం, నేల, అగ్ని, వాయువు, నీరు - ఇంకా లోకంలో మిగిలిన సమస్త చరాచరాలను సృష్టిస్తాను. (49)
మార్కండేయ ఉవాచ
ఇత్యుక్త్వాంతర్హితస్తాత స దేవః పరమాద్భుతః ।
ప్రజాశ్చేమాః ప్రపశ్యామి విచిత్రా వివిధాః కృతాః ॥ 50
మార్కండేయుడిలా అన్నాడు -
నాయనా! ఆ విధంగా పలికి పరమాద్భుతస్వరూపుడైన ఆ బాలుడు మాయమయ్యాడు. వెంటనే వివిధ విచిత్రాలతో కూడిన ఈ ప్రజలను చూశాను. (50)
ఏవం దృష్టం మయా రాజన్ తస్మిన్ ప్రాప్తే యుగక్షయే ।
ఆశ్చర్యం భరతశ్రేష్ఠ సర్వధర్మభృతాం వర ॥ 51
భరతశ్రేష్ఠా! ధార్మికశ్రేష్ఠా! రాజా! యుగాంతవేళలో ఈ ఆశ్చర్యకర సంఘటను నేను చూశాను. (51)
యః స దేవో మయా దృష్టః పురా పద్మాయతేక్షణః ।
స ఏష పురుషవ్యాఘ్ర సంబంధీ తే జనార్దనః ॥ 52
పురుషోత్తమా! నేను పూర్వం చూచిన ఆ భగవానుడు పుండరీకాక్షుడే నేడు నీకు బంధువైన జనార్దనుడు. (52)
అస్యైవ వరదానార్ది స్మృతిర్న ప్రజహాతి మామ్ ।
దీర్ఘమాయుశ్చ కౌంతేయ స్వచ్ఛందమరణం మమ ॥ 53
కౌంతేయా! ఆయన వరమిచ్చి నందువలననే అదంతా నాకు గుర్తుంది. నా దీర్ఘాయుస్సు, స్వచ్ఛందమరణం కూడా ఆయన వరఫలమే. (53)
స ఏష కృష్ణో వార్ ష్ణేయః పురాణపురుషో విభుః ।
ఆస్తే హరిరచింత్యాత్మా క్రీడన్నివ మహాభుజః ॥ 54
వృష్ణివంశస్థుడూ, మహాభుజుడు అయిన ఈ శ్రీకృష్ణుడు సర్వవ్యాపి, అచింత్యస్వరూపుడు, పురాణపురుషుడు, శ్రీహరి. నాకు బాలకుడుగా కనిపించిన వాడీయనయే. (54)
ఏష ధాతా విధాతా చ సంహర్తా చైవ శాశ్వతః ।
శ్రీవత్సవక్షా గోవిందః ప్రజాపతిపతిః ప్రభుః ॥ 55
ఈయనయే శ్రీవత్సలాంఛనుడు, గోవిందుడు, శాశ్వతుడు, విశ్వసృష్ఠిస్థితి సంహారకర్త, బ్రహ్మలకే బ్రహ్మ, ప్రభువు కూడా. (55)
దృష్ట్వేమం వృష్టిప్రవరం స్మృతిర్మామియమాగతా ।
ఆదిదేవమయం జిష్ణుం పురుషం పీతవాసనమ్ ॥ 56
ఆదిదేవుడు, జయశీలుడు, పీతాంబరుడు, వృష్ణివంశశ్రేష్ఠుడు అయిన ఈ పురాణపురుషుని చూచిన తరువాత ఇదంతా స్మృతికి వచ్చింది. (56)
సర్వేషామేవ భూతానాం పితా మాతా చ మాధవః ।
గచ్ఛధ్వమేనం శరణం శరణ్యం కౌరవర్షభాః ॥ 57
సర్వప్రాణులకు తల్లి, తండ్రి ఈ మాధవుడే. కురువంశశ్రేష్ఠులారా! ఆశ్రయింపదగిన ఈయననే మీరు ఆశ్రయించండి. (57)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తాశ్చ తే పార్థాః యమౌ చ పురుషర్షభౌ ।
ద్రౌపద్యా సహితాః సర్వే నమశ్చక్రుర్జనార్దనమ్ ॥ 58
వైశంపాయనుడిలా అన్నాడు.
మార్కండేయుడారీతిగా చెప్పగా పాండవులు, పురుషశ్రేష్ఠులైన నకులసహదేవులు ద్రౌపదు - అందరూ జనార్దనునికి నమస్కరించారు. (58)
స చైతాన్ పురుషవ్యాఘ్ర సామ్నా పరమవల్గునా ।
సాంత్వయామాస మానార్హః మన్యమానో యథావిధి ॥ 59
పురుషోత్తమా! పూజార్హుడైన ఆ జనార్దనుడు కూడా వారిని యథావిధిగా సమాదరించి మధుర సాంత్వనవచనాలతో అనునయించాడు. (59)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి భవిష్యకథనే ఏకోననవత్యధికశతతమోఽధ్యాయః ॥ 189 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయసమాస్యాపర్వమను ఉపపర్వమున భవిష్య కథనమను నూటయెనుబది తొమ్మిదవ అధ్యాయము. (189)