196. నూట తొంబది ఆరవ అధ్యాయము

సేదుకవృషదర్భుల చరిత్రము.

వైశంపాయన ఉవాచ
భూయ ఏవ మహాభాగ్యం కథ్యతామిత్యబ్రవీత్ పాండవః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
'మార్కండేయా! క్షత్రియమాహాత్య్మాన్ని గురించి ఇంకా చెప్పవలసినది' అని యుధిష్ఠిరుడు అడిగాడు. (1)
అథాచష్ట మార్కండేయో మహారాజ
వృషదర్భసేదుకనామానౌ రాజానౌ
నీతిమార్గరతావస్త్రోపాస్త్రకృతినౌ ॥ 2
మార్కండేయుడిలా చెప్పాడు. మహారాజా! వృషదర్భుడు, సేదుకుడు అనే రాజులుండేవారు. వారు నీతిమార్గంలో నడిచేవారూ. అస్త్రవిద్యలోను, ఉపాస్త్రవిద్యలోను నేర్పరులు. (2)
సేదుకో వృషదర్భస్య బాలస్యైవ
ఉపాంశువ్రతమభ్యజానాత్ కుప్యమదేయం
బ్రాహ్మణస్య ॥ 3
వృషదర్భునకు చిన్ననాటినుండి కూడా బ్రాహ్మణులకు బంగారం తప్ప మరేమీ ఇవ్వకూడదని రహస్యవ్రతం. అది సేదుకునకు తెలుసు. (3)
అథ తం సేదుకం బ్రాహ్మణః కశ్చిద్
వేదాధ్యయనసంపన్న ఆశిషం దత్త్వా గుర్వర్థీ భిక్షితవాన్ ॥ 4
అశ్వసహస్రం మే భవాన్ దదాత్వితి ।
తం సేదుకో బ్రాహ్మణమబ్రవీత్ ॥ 5
నాస్తి సంభవో గుర్వర్థం దాతుమితి ॥ 6
ఒకమారు వేదాధ్యయన సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు సేదుకుని చెంతకు వచ్చి, దీవెనలిచ్చి గురుదక్షిణకై యాచించాడు.
రాజా! నాకు వేయి గుర్రాల నివ్వండి. అని అడిగాడు. అప్పుడు సేదుకుడు "నీవు కోరిన గురుదక్షిణ నిచ్చే స్థాయి నాకు లేదు" అన్నాడు. (4-6)
స త్వం గచ్ఛ వృషదర్భసకాశమ్
రాజా పరమధర్మజ్ఞో బ్రాహ్మణ తం భిక్షస్వ ।
స తే దాస్యతి తస్యైతదుపాంశువ్రతమితి ॥ 7
నీవు వృషదర్భుని దగ్గరకు వెళ్ళు. ఆయన పరమధర్మజ్ఞుడు. బ్రాహ్మణా ఆయనను యాచించు. (7)
అథ బ్రాహ్మణో వృషదర్భసకాశం గత్వా అశ్వసహస్రమయాచత్ ।
స రాజా తం కశేనాతాడయత్ ॥ 8
అప్పుడు బ్రాహ్మణుడు వృషదర్భుని దగ్గరకు పోయి వేయిగుర్రాల నడిగాడు. ఆ రాజు బ్రాహ్మణుని కొరడాతో కొట్టించాడు. (8)
తం బ్రాహ్మణోఽబ్రవీత్ కిం హింస్యనాగసం మామితి ॥ 9
"ఏ తప్పు చేయని నన్నెందుకు కొట్టించావు"? అని బ్రాహ్మణుడు రాజునడిగాడు. (9)
ఏవముక్త్వా తం శపంతం రాజాఽఽహ ।
విప్ర కిం యో న దదాతి తుభ్యముతాహోస్విద్ బ్రాహ్మణమేతత్ ॥ 10
అడుగుతూనే శపించబోయాడు. అప్పుడు రాజు ఇలా అన్నాడు. బ్రాహ్మణా! నీవడిగినది ఇవ్వనంతమాత్రాన శపిస్తావా? ఇది బ్రాహ్మణులకు తగిన పనియేనా?" (10)
బ్రాహ్మణ ఉవాచ
రాజాధిరాజ తవ సమీపం సేదుకేన ప్రేషితో భిక్షితుమాగతః ।
తేనానుశిష్టేన మయా త్వం భిక్షితోఽసి ॥ 11
బ్రాహ్మణుడిలా అన్నాడు. రాజాధిరాజా! సేదుకుడు పంపగా భిక్షకై నీ దగ్గరకు వచ్చాను. ఆయన ఉపదేశం మేరకు నిన్ను నేను యాచించాను (11)
రాజోవాచ
పూర్వాహ్ణేతే దాస్యామి యో మేఽద్య బలిరాగమిష్యతి ।
యో హన్యతే కశయా కథం మోఘం క్షేపణం తస్య స్యాత్ ॥ 12
రాజు ఇలా అన్నాడు. ఈరోజు నాఖు వచ్చిన ఆదాయాన్ని రేపుదయం నీకు ఇస్తాను. కొరడాతో కొట్టి వట్టిచేతులతో ఎలా పంపుతాను. (12)
ఇత్యుక్త్వా బ్రాహ్మణాయ దైవసికాముత్పత్తిం
ప్రాదాత్ అధికస్యాశ్వసహస్రస్య మూలమేవాదాదితి ॥ 13
అని చెప్పి బ్రాహ్మణునకు ఒకనాటి ఆదాయాన్ని ఇచ్చాడు. అది వేయిగుర్రాల వెలకన్న ఎక్కువే. (13)
వి॥ సం॥ తన నియమాన్ని ఉల్లంఘించిన బ్రాహ్మణుని దండించటానికైనా, అడిగినదానికన్నా ఎక్కువ ఇచ్చి ఆనందింపజేయటానికైనా రాజులు సమర్థులే అని తాత్పర్యం. (నీల)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి సేదుకవృషదర్భచరితే షణ్ణవత్యధిక శతతమోఽధ్యాయః ॥ 196 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున సేదుకవృషదర్భచరితమను నూట తొంబది యారవ అధ్యాయము. (196)