197. నూట తొంబది ఏడవ అధ్యాయము

ఇంద్రాగ్నులు శిబిని పరీక్షించుట.

మార్కండేయ ఉవాచ
దేవానాం కథా సంజాతా మహీతలం గత్వా
మహీపతిం శిబిమౌశీనరం సాధ్వేనం శిబిం జిజ్ఞాస్యామ ఇతి ।
ఏవం భో ఇత్యుక్త్వా అగ్నీంద్రావుపతిష్ఠేతామ్ ॥ 1
దేవతలలో ఒకసారి ఇలా చర్చ జరిగింది. "భూలోకంలో ఉశీనరునికొడుకు శిబి గొప్పరాజు. ఆయనను పరీక్షిద్దాం." అలాగే అని అగ్ని ఇంద్రుడు బయలుదేరారు. (1)
అగ్నిః కపోతరూపేణ తమభ్యధావదామిషార్థమింద్రః శ్యేనరూపేణ ॥ 2
అగ్ని పావురం రూపం ధరించి శిబి దగ్గరకు వచ్చాడు. ఇంద్రుడు డేగరూపం ధరించి మాంసానికై దాన్ని తరుముతూ వచ్చాడు. (2)
అథ కపోతో రాజ్ఞో దివ్యాసనాసీనస్యోత్సంగం న్యపతత్ ॥ 3
పావురం దివ్యాసనంలో కూర్చొని ఉన్న శిబి ఒడిలో వ్రాలింది. (3)
అథ పురోహితో రాజానమబ్రవీత్ ।
ప్రాణరక్షార్థం శ్యేనాద్ భీతో భవంతం ప్రాణార్థీ ప్రపద్యతే ॥ 4
అపుడు పురోహితుడు రాజుతో ఇలా అన్నాడు - డేగను చూచి భయపడి ప్రాణాలను కాపాడుకోటానికి పావురం నీ దగ్గరకు ప్రాణభిక్షకై వచ్చింది. (4)
వసు దదాతు అంతవాన్ పార్థివోఽస్య నిష్కృతిం
కుర్యాద్ ఘోరం కపోతస్య నిపాతమాహుః ॥ 5
పావురం ఒడిలో వ్రాలటం అనర్థదాయకమనీ, మృత్యుప్రదమనీ అంటారు. దాని శాంతికై ధనదానం చెయ్యండి. (5)
అథ కపోతో రాజానమబ్రవీత్ ।
ప్రాణరక్షార్థం శ్యేనాద్ భీతో భవంతం ప్రాణార్థీ ప్రపద్యే ।
అంగైరంగాని ప్రాప్యార్థీ మునిర్భూత్వా ప్రాణాంస్త్వాం ప్రపద్యే ॥ 6
అపుడు పావురం రాజుతో ఇలా అన్నది. డేగను చూచి భయపడి ప్రాణరక్షణకై నీదగ్గరకు చేరాను. ప్రాణభిక్ష పెట్టు. నేను వాస్తవానికి మునిని. రూపాన్ని మార్చుకొన్నాను. నాప్రాణరూపుడవయిన నిన్ను శరణుకోరాను. (6)
స్వాధ్యాయేన కర్శితం బ్రహ్మచారిణం మాం విద్ధి ।
తపసా దమేన యుక్తమాచార్యస్యాప్రతికూలభాషిణమ్ ।
ఏవం యుక్తమపాపం మాం విద్ధి ॥ 7
నేను స్వాధ్యాయంతో బక్క చిక్కిన బ్రహ్మచారిని. తపస్విని, జితేంద్రియుడను. ఆచార్యునకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. ఈ రీతిగా యోగ్యునిగా, అనఘునిగా నన్ను గ్రహించు. (7)
గదామి వేదాన్ విచినోమి ఛందః
సర్వే వేదా అక్షరశో మే అధీతాః ।
న సాధు దానం శ్రోత్రియస్య ప్రదానం
మా ప్రాదాః శ్యేనాయ న కపోతోఽస్మి ॥ 8
వేదాలు పలుకగలను. ఛందస్సులను విడగొట్టగలను. వేదాలలోని ప్రత్యక్షరాన్ని చదివాను. అటువంటి నన్ను ఆకలి తీరటానికి దానం చేయటం తగదు. నన్ను డేగకివ్వవద్దు. నేను పావురాన్ని కాను. (8)
అథ శ్యేనో రాజానమబ్రవీత్ ॥ 9
పర్యాయేణ వసతిర్వా భవేషు
సర్గే జాతః పూర్వమస్మాత్ కపోతాత్ ।
త్వమాదదానోఽథ కపోతమేనం
మా త్వం రాజన్ విఘ్నకర్తా భవేథాః ॥ 10
అప్పుడు డేగ రాజుతో ఇలా అన్నది. 'జీవుడు వేరువేరు ప్రాణులరూపాన్ని వేరువేరు జన్మలలో ధరిస్తుంటాడు. ఏదో జన్మలో నీవీ పావురానికి పుట్టి ఉంటావు. అందుకే దీనిని ఆదరించి నాభోజనానికి ఆటంకం కలిగించకు.' (9, 10)
వి॥సం॥ ఈ జన్మలోని భార్య రాబోయే జన్మలో తల్లి అవుతుంది. కొడుకు తండ్రి అవుతారు. అలాగే శత్రువు మిత్రుడవుతాడు. మిత్రుడు శత్రువు అవుతాడు. (నీల)
రాజోవాచ
కేనేదృశీ జాతు పరా హి దృష్టా
వాగుచ్యమానా శకునేన సంస్కృతా ।
యాం వై కపోతో వదతే యాం చ శ్వేన
ఉభౌ విదిత్వా కథమస్తు సాధు ॥ 11
రాజు ఇలా అన్నాడు. 'ఇంతకు ముందెప్పుడూ ఏ పక్షీ ఇంత చక్కగా డేగా పావురాలవలె మాటాడటం వినలేదు, చూడలేదు. వీరి స్వరూపాన్ని గ్రహించి న్యాయోచితంగా వ్యవహరించటమెలా? (11)
నాస్య్ వర్షం వర్షతి వర్షకాలే
నాస్య బీజం రోహతి కాల ఉప్తమ్ ।
భీతం ప్రపన్నం యో హి దదాతి శత్రవే
న త్రాణం లభేత్ త్రాణమిచ్ఛన్ స కాలే ॥ 12
భయంతో తనను శరణుజొచ్చిన వానిని శత్రువుల కప్పగించిన వానిరాజ్యంలో సకాలంలో వర్షాలు కురియవు. నాటిన గింజలు మొలకెత్తవు. ఆ రాజు తనకు రక్షణకోరినవేళ రక్షణ దొరకదు. (12)
జాతా హ్రస్వా ప్రజా ప్రమీయతే
సదా న వాసం పితరోఽస్య కుర్వతే ।
భీతం ప్రపన్నం యో హి దదాతి శత్రవే
నాస్య దేవాః ప్రతిగృహ్ణంతి హవ్యమ్ ॥ 13
భయంతో తనను శరణుజొచ్చిన వానిని శత్రువుల కప్పగించిన వాని సంతానం శైశవంలోనే మరణిస్తుంది. వాని పితరులకు పితృలోకంలో తావు దొరకదు. ఆ వ్యక్తి ఇచ్చిన హవ్విస్సులను దేవతలు గ్రహింపరు. (13)
మోఘమన్నం విందతి చాప్రచేతాః
స్వర్గాల్లోకాద్ భ్రశ్యతి శీఘ్రమేవ ।
భీతం ప్రపన్నం యో హి దదాతి శత్రవే
సేంద్రా దేవాః ప్రహరంత్యస్య వజ్రమ్ ॥ 14
భయంతో తనను శరణుజొచ్చిన వానిని శత్రువులకప్పగించిన వాని అన్నం నిరర్థకం. మంచి మనస్సులోని అతడు త్వరగా స్వర్గలోకభ్రష్టుడవుతాడు. ఇంద్రాది దేవతలు అతనిని వజ్రంతో కొడతారు. (14)
ఉక్షాణం పక్త్వా సహ ఓదనేన
అస్మాత్ కపోతాత్ ప్రతి తే నయంతు ।
యస్మిన్ దేశే రమసేఽతీవ శ్యేన
తత్ర మాంసం శిబయస్తే వహంతు ॥ 15
శ్యేనమా! ఈ పావురానికి బదులు ఎద్దును అన్నంతో కలిపి వండి నీకై మా వారు అందజేస్తారు. నీకిష్టమైన చోట నీవుంటే శిబివంశస్థులు అక్కడకే మాంసాన్ని తెచ్చి అందిస్తారు.' (15)
శ్యేన ఉవాచ
వోక్షాణో రాజన్ ప్రార్థయేయం న చాన్య
దస్మాన్మాంసమధికం వా కపోతాత్ ।
దేవైర్దత్తః సోఽద్య మమైష భక్షః
తన్మే దదస్వ శకునానామభావాత్ ॥ 16
డేగ ఇలా అన్నది. రాజా! నాకు ఎద్దుమాంసమక్కరలేదు. ఈ పావురం కన్న నాకే మాంసమూ ఎక్కువ అక్కరలేదు. దేవతలు నాకు నేడు దీనినే ఆహారం చేశారు. మరే పక్షులూ లేవు కాబట్టి దీనినే నాకిచ్చివేయి. (16)
రాజోవాచ
ఉక్షాణం వేహతమనూనం నయంతు
తే పశ్యంతు పురుషా మమైవ ।
భయాహితస్య దాయం మమాంతికాత్ త్వాం
ప్రత్యామ్నాయం తు త్వం హ్యేనం మా హింసీః ॥ 17
రాజు ఇలా అన్నాడు. ఋషభాన్ని కాని సర్వాంగ సంపూర్ణమైన గొడ్డుటావునుకాని నీకోసం నావారే వెళ్ళి వెదకి తెచ్చి ఇస్తారు. భయంతో నాదగ్గరకు వచ్చిన పావురానికి బదులుగా దాన్ని తీసుకో. దీనిని హింసించవద్దు. (17)
త్యజే ప్రాణాన్ నైవ దద్యాం కపోతం
సౌమ్యో హ్యయం కిం న జానాపి శ్యేన ।
యథా క్లేశం మా కురుష్వేహ సౌమ్య
నాహం కపోతమర్పయిష్యే కథంచిత్ ॥ 18
ప్రాణాలనయినా ఇస్తాను కానీ దీనిని విడువను. డేగా! ఈ పావురం సౌమ్యమైనది. సౌమ్యుడా! ఈ విషయంలో నీవు బాధపడవద్దు ఎట్టిస్థితిలోనూ కపోతాన్ని నేను నీకివ్వను. (18)
యథా మాం వై సాధువాదైః ప్రసన్నాః
ప్రశంసేయుః శిబియః కర్మణా తు ।
యథా శ్యేన ప్రియమేవ కుర్యాం
ప్రశాధి మాం యద్ వదేస్తత్ కరోమి ॥ 19
శ్యేనమా! నేను ఏపనివలన శిబివంశస్థులు నన్ను సాధువాదాలతో ప్రశంసిస్తారో నీకు నచ్చుతుందో అది నాకు చెప్పుము. నీవు చెప్పినట్లు చేస్తాను. (19)
శ్యేన ఉవాచ
ఊరోర్దక్షిణాదుత్కృత్య స్వపిశితం తావద్ రాజన్
యావన్మాంసం కపోతేన సమమ। తథా
తస్మాత్ సాధు త్రాతః కపోతః ప్రశంసేయుశ్చ
శిబియః కృతం చ ప్రియం స్యాన్మమేతి ॥ 20
డేగ ఇలా అన్నది. రాజా! పావురానికి సమానంగా నీ కుడితొడ నుండి మాంసాన్ని తీసి ఇవ్వు. పావురాన్ని రక్షించినట్లు అవుతుంది. శిబివంశస్థులు నిన్ను ప్రశంసిస్తారు. నా కోరిక కూడా తీరుతుంది. (20)
అథ స దక్షిణాదూరోరుత్కృత్య స్వమాంసపేశీం
తులయాఽఽధారయత్ । గురుతర ఏవ కపోత ఆసీత్ ॥ 21
అప్పుడు శిబి తన కుడితొడనుండి మాంసపుముద్దను తీసి పావురంతో తూచాడు. పావురమే బరువుగా ఉంది. (21)
పునరన్యముచ్చకర్త గురుతర ఏవ కపోతః ।
ఏవం సర్వం సమధికృత్య శరీరం తులాయామారోపయామాస ।
తత్ తథాపి గురుతర ఏవ కపోత ఆసీత్ ॥ 22
మరొకముద్దను తీశాడు. పావురమే బరువైంది. ఈవిధంగా శరీరంలోని సర్వాంగాలనుండీ మాంసాన్ని అంతా తీసి త్రాసులో పెట్టాడు. అయినా పావురమే బరువుగా ఉంది. (22)
అథ రాజా స్వయమేవ తులామారురోహ ।
న చ వ్యలీకమాసీద్ రాజ్ఞ ఏతద్ వృత్తాంతం
దృష్ట్వా త్రాత ఇత్యుక్త్వా ప్రాలీయత శ్యేనోఽథ రాజా అబ్రవీత్ ॥ 23
అప్పుడు శిబి తానే త్రాసులో కూర్చున్నాడు. తానేమీ బాధపడలేదు. రాజు త్రాసులో కూర్చోగానే "పావురాన్ని రక్షించావు" అంటూ డేగ అదృశ్యమయింది.
అప్పుడు రాజు ఇలా అడిగాడు. (23)
కపోతం విద్యుః శిబయస్త్వాం కపోత
పృచ్ఛామి తే శకునే కో ను శ్యేనః ।
నానీశ్వర ఈదృశం జాతు కుర్యాత్
ఏతం ప్రశ్నం భగవన్ మే విచక్ష్వ ॥ 24
పావురమా! శిబివంశస్థులు నిన్ను పావురమనే భావిస్తున్నారు. పక్షీ! మరి ఆ డేగ ఎవరో చెప్పు. ఈశ్వరుడు తప్ప మరెవ్వరూ ఇటువంటి పనిచేయలేదు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. (24)
కపోత ఉవాచ
వైశ్వానరోఽహం జ్వలనో ధూమకేతుః
అథైవ శ్యేనో వజ్రహస్తః శచీపతిః ।
సాధు జ్ఞాతుం త్వామృషభం సౌరథేయ
నౌ జిజ్ఞాసయా త్వత్సకాశం ప్రపన్నౌ ॥ 25
పావురమిలా అన్నది.
ధూమకేతువునైన వైశ్వానరాగ్నిని నేను. శచీపతి, వజ్రధారి అయిన ఇంద్రుడే ఈ డేగ. సురథాకుమారా! నీవు గొప్పవాడవు. నీ గొప్పతనాన్ని గ్రహించటానికే మేమిలా వచ్చాం. (25)
యామేతాం పేశీం మమ నిష్క్రయాయ
ప్రాదాద్ భవానసినోత్కృత్య రాజన్ ।
ఏతద్ వో లక్ష్మ శివం కరోమి
హిరణ్యవర్ణం రుచిరం పుణ్యగంధమ్ ॥ 26
రాజా! నా శరీరాన్ని విడిపించటానికి కత్తితో నీ శరీరాన్ని కోసి మాంసాన్ని తీశావు. ఆ మచ్చ నీకు మంగళకరమవుతుంది. బంగారువన్నెతో మెరుస్తూ అందగిస్తూ, సుగంధాలు వెదజల్లుతుంది. (26)
ఏతాసాం ప్రజానాం పాలయితా యశస్వీ
సురర్షీణామథ సమ్మతో భృశమ్ ।
ఏతస్మాత్ పార్శ్వాత్ పురుషో జనిష్యతి
కపోతరోమేతి చ తస్య నామ ॥ 27
నీ ఈ కుడిప్రక్కనుండి ఒక కొడుకు పుడతాడు. కీర్తిమంతుడై ఈ ప్రజలను పాలించి దేవర్షులకు ఆదరపాత్రుడు కాగలడు. కపోతరోముడని ఆ బాలునకు పేరు. (27)
కపోతరోమాణం శిబినౌద్భిదం పుత్రం ప్రాప్స్యసి
నృప వృషసంహననం యశోదీప్యమానం
ద్రష్టాసి శూరమృషభం సౌరథానామ్ ॥ 28
రాజా! నీకు పుట్టబోయే ఆ కొడుకు - కపోతరోముడు - నీ తొడను చీల్చుకొని వస్తాడు కాబట్టి ఔద్భిదుడని వ్యవహరింపబడతాడు. అతడు ఆబోతువలె సౌష్ఠవంగలవాడై కీర్తితో ప్రకాశిస్తూ, శూరుడై, సౌరథులలో గొప్పవాడు కాగలడు. (28)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి శిబిచరితే సప్తనవత్యధికశతతమోఽధ్యాయః ॥ 197 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున శిబిచరితమను నూట తొంబది యేడవ అధ్యాయము. (197)