203. రెండు వందల మూడవ అధ్యాయము

విష్ణువు మధుకైటభులను వధించుట.

మార్కండేయ ఉవాచ
స ఏవముక్తో రాజర్షిః ఉత్తంకేనాపరాజితః ।
ఉత్తంకం కౌరవశ్రేష్ఠ కృతాంజలిరథాబ్రవీత్ ॥ 1
మార్కండేయుడిలా అన్నాడు.
కౌరవశ్రేష్ఠా! ఉత్తంకుడు ఇలా అనగానే ఎదురులేని ఆ రాజర్షి చేతులు జోడించి ఉత్తంకునితో ఇలా అన్నాడు. (1)
న తేఽభిగమనం బ్రహ్మన్ మోఘమేతద్ భవిష్యతి ।
పుత్రో మమాయం భగవన్ కువలాశ్వ ఇతి స్మృతః ॥ 2
ధృతిమాన క్షిప్రకారీ చ వీర్యేణాప్రతిమో భువి ।
బ్రాహ్మణా! నీ రాక వ్యర్థం కారాదు. స్వామీ! ఇతడు నా కొడుకు. కువలాశ్వుడని పేరు. ధీరుడు, వేదవంతుడు, తిరుగులేని పరాక్రమశాలి. (2 1/2)
ప్రియం చ తే సర్వమేతత్ కరిష్యతి న సంశయః ॥ 3
పుత్రైః పరివృతః సర్వైః శూరైః పరిఘబాహుభిః ।
విసర్జయస్వ మాం బ్రహ్మన్ న్యస్తశస్త్రోఽస్మి సాంప్రతమ్ ॥ 4
బ్రాహ్మణా! ప్రాకారాల వంటి బాహువులు గలవారు, శూరులు అయిన తన కుమారులందరితో కలిసి నీవుకోరిన ఈ ప్రియకార్యాన్ని పూర్తిచేస్తాడు. సందేహం లేదు. అస్త్రసన్యాసం చేసి ఉన్నా నన్ను ఇప్పుడు విడిచిపెట్టు. (3,4)
తథాస్త్వితి చ తేనోక్తః మునినామితతేజసా ।
స తమాదిశ్య తనయమ్ ఉత్తంకాయ మహాత్మనే ॥ 5
క్రియతామితి రాజర్షిఆహ జగామ వనముత్తమమ్ ।
అమితతేజస్వి అయిన ఉత్తంకుడు 'అలాగే కానీ' అని బృహదశ్వుని అనుమతించాడు. అప్పుడు రాజర్షి బృహదశ్వుడు తన కుమారుని ఉత్తంకునకు నివేదించి, ముని కార్యాన్ని పూర్తిచేయమని ఆదేశించి తపోవనానికి వెళ్ళిపోయాడు. (5 1/2)
యుధిష్ఠిర ఉవాచ
క ఏష భగవన్ దైత్యః మహావీర్యస్తపోధన ॥ 6
కస్య పుత్రోఽథ నప్తా వా ఏతదిచ్ఛామి వేదితుమ్ ।
యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు - తపోధనా! స్వామీ! మహాపరాక్రమశాలి అయిన ఆ రాక్షసుడెవడు? ఎవని కొడుకు? ఎవని మనుమడు? ఇదంతా తెలిసికోవాలనుకొంటున్నాను. (6 1/2)
ఏవం మహాబలో దైత్యః న శ్రుతో మే తపోధన ॥ 7
ఏతదిచ్ఛామి భగవన్ యాథాతథ్యేన వేదితుమ్ ।
సర్వమేవ మహాప్రాజ్ఞ విస్తరేణ తపోధన ॥ 8
తపోధనా! ఇటువంటి బలశాలి అయిన దైత్యుని గురించి ఎప్పుడూ వినలేదు. స్వామీ! మహాప్రాజ్ఞా! ఈ విషయమంతా యథాతథంగా తెలియగోరుతున్నాను. (7,8)
మార్కండేయ ఉవాచ
శృణు రాజన్నిదం సర్వం యథావృత్తం నరాధిప ।
కథ్యమానం మహాప్రాజ్ఞ విస్తరేణ యథాతథమ్ ॥ 9
మార్కండేయుడిలా అన్నాడు.
రాజా! మహాప్రాజ్ఞా! ఈ విషయాన్ని జరిగినది జరిగినట్లుగ విస్తరంగా చెపుతాను. విను. (9)
ఏకార్ణవే తదా లోకే నష్టే స్థావరజంగమే ।
ప్రణష్టేషు చ భూతేషు సర్వేషు భరతర్షభ ॥ 10
భరతర్షభా! లోకమంతా ఏకార్ణవంగా (జలమయంగా) మారినప్పుడు, స్థావరజంగమ ప్రాణులన్నీ నశించి పోయినపుడు జరిగిన సంగతి ఇది. (10)
ప్రభవం లోకకర్తారం విష్ణుం శాశ్వతమవ్యయమ్ ।
యమాహుర్మునయః సిద్ధాః సర్వలోకమహేశ్వరమ్ ॥ 11
సుష్వాప భగవాన్ విష్ణుః అప్సు యోగత ఏవ సః ।
నాగస్య భోగే మహతి శేషస్యామితతేజసః ॥ 12
లోకకర్తగా, సర్వసృష్టి కారణంగా, సనాతనుడుగా, అవ్యయుడుగా, సర్వలోకమహేశ్వరుడుగా మునులు, సిద్ధులు ప్రస్తుతించే విష్ణువు ఆ నీటిలో తన యోగశక్తితో అమితతేజస్వి అయిన ఆదిశేషనాగుని పెద్దపడగపై శయనించి నిద్రించాడు. (11,12)
లోకకర్తా మహాభాగ భగవానచ్యుతో హరిః ।
నాగభోగేన మహతా పరిరభ్య మహీమిమామ్ ॥ 13
స్వపతస్తస్య దేవస్య పద్మం సూర్యసమప్రభమ్ ।
నాభ్యాం వినిఃసృతం దివ్యం తత్రోత్పన్నః పితామహః ॥ 14
సాక్షాల్లోకగురుర్బ్రహ్మా పద్మే సూర్యసమప్రభః ।
మహాభాగా! లోకకర్త, అచ్యుతుడూ, పూజనీయుడూ అయిన హరి ఆ పెద్ద నాగు పాము పడగతో ఈ భూమిని ధరించాడు. నిద్రిస్తున్న ఆ దేవుని నాభినుండి సూర్యతేజస్సు గల దివ్యపద్మం వెలువడింది. దానిలో సూర్యుని తేజస్సుగలవాడు, పితామహుడు, లోకగురువయిన బ్రహ్మ జన్మించాడు. (13, 14 1/2)
చతుర్వేదశ్చతుర్మూర్తిః తథైవ చ చతుర్ముఖః ॥ 15
స్వప్రభావాద్ దురాధర్షః మహాబలపరాక్రమః ।
ఆయన చతుర్వేదస్వరూపుడు. చతుర్మూర్తి, చతుర్ముఖుడు. మహాబలపరాక్రమశాలి. తన ప్రభావం వలన ఆయన ఎవరికీ లొంగనివాడు. (15 1/2)
కస్యచిత్ త్వథ కాలస్య దానవౌ వీర్యవత్తమౌ ॥ 16
మధుశ్చ కైటభశ్చైవ దృష్టవంతౌ హరిం ప్రభుమ్ ।
ఆ తరువాత కొంతకాలానికి శక్తిసంపన్నులైన మధుకైటభరాక్షసులు శ్రీహరిని సందర్శించారు. (16 1/2)
శయానం శయనే దివ్యే నాగభోగే మహాద్యుతిమ్ ॥ 17
బహుయోజనవిస్తీర్ణే బహుయోజనమాయతే ।
కిరీటకౌస్తుభధరం పీతకౌశేయవాససమ్ ॥ 18
ఆ విష్ణువు మహాకాంతిమంతుడు. దివ్యనాగభోగంపై శయనించి ఉన్నాడు. ఆ పాము పడగ కొన్ని యోజనాల పొడవు వెడల్పులు గలది. ఆ శ్రీహరి కిరీటాన్నీ, కౌస్తుభాన్నీ, పచ్చని పట్టుబట్టనూ ధరించి ఉన్నాడు. (17,18)
దీప్యమానం శ్రియా రాజన్ తేజసా వపుషా తథా ।
సహస్రసూర్యప్రతిమమ్ అద్భుతోపమదర్శనమ్ ॥ 19
రాజా! ఆ శ్రీహరి కాంతితో, తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. ఆయన శరీరం వేయిమంది సూర్యులతో సమానంగా ఉన్నది. ఆయన దర్శనం అద్భుతం, నిరుపమానం. (19)
విస్మయః సుమహానాసీత్ మధుకైటభయోస్తథా ।
దృష్ట్వా పితామహం చాపి పద్మే పద్మనిభేక్షణమ్ ॥ 20
విత్రాసయేతామథ తౌ బ్రహ్మాణమమితౌజసమ్ ।
విత్రస్యమానో బహుశః బ్రహ్మా తాభ్యాం మహాయశాః ॥ 21
అకంపయత్ పద్మనాలం తతోఽబుధ్యత కేశవః ।
అతాపశ్యత గోవిందః దానవౌ వీర్యవత్తరౌ ॥ 22
తామరల వంటి కన్నులు గల పితామహుని పద్మంలో చూచి మధుకైటభులు ఎంతో ఆశ్చర్యానికి గురి అయ్యారు. అమిత తేజస్వి అయిన ఆ బ్రహ్మను వారు భయపెట్టారు. వారు భయపెట్టగా మహాయశస్వి అయిన బ్రహ్మ తామరతూటిని కదిలించాడు. దానితో విష్ణువు మేల్కొన్నాడు. బలసంపన్నులైన మధుకైటభులను చూచాడు. (20-22)
దృష్ట్వా తావబ్రవీద్ దేవః స్వాగటం వాం మహాబలౌ ।
దదామి వాం వరం శ్రేష్ఠం ప్రీతిర్హి మమ జాయతే ॥ 23
వారిని చూచి విష్ణుమూర్తి "మహాబలులకు మీకు స్వాగతం. నాకు సంతోషంగా ఉంది. మీకు గొప్పవరాన్ని ఇస్తాను" అని వారితో అన్నాడు. (23)
తౌ ప్రహస్య హృషీకేశం మహాదర్పౌ మహాబలౌ ।
ప్రత్యబ్రూతాం మహారాజ సహితౌ మధుసూదనమ్ ॥ 24
మహారాజా! మహాబలం, మహాగర్వం గల వారు శ్రీహరిని చూసి నవ్వి, ఇద్దరూ ఒక్కటై ఆయనతో ఇలా అన్నారు. (24)
ఆవాం వరయ దేవ త్వం వరదౌ స్వః సురోత్తమ ।
దాతారౌ స్వో వరం తుభ్యం తద్ బ్రవీహ్యవిచారయన్ ॥ 25
సురోత్తమా! నీవే మమ్ము వరం కోరుకో. వరమిస్తాం. నీకు మేము వరమిస్తాం. ఏమీ సంకోచించకుండా చెప్పు. (25)
శ్రీభగవానువాచ
ప్రతిగృహ్ణే వరం వీరౌ ఈప్సితశ్చ వరో మమ ।
యువాం హి వీర్యసంపన్నౌ న వామస్తి సమః పుమాన్ ॥ 26
శ్రీభగవానుడిలా అన్నాడు. వీరులారా! వరాన్ని స్వీకరిస్తాను. నాకు కూడా వరం కావాలి. మీరు బలసంపన్నులు. మీకు సాటి ఎవడూ లేడు. (26)
వధ్యత్వముపగచ్ఛేతాం మమ సత్యపరాక్రమౌ ।
ఏతదిచ్ఛామ్యహం కామం ప్రాప్తుం లోకహితాయ వై ॥ 27
సత్యపరాక్రములారా! మీరు నాచేతిలో మరణించండి. లోకహితం కోసం నేను ఈ వరాన్ని కోరుతున్నాను. (27)
మధుకైటభావూచతుః
అనృతం నోక్తపూర్వం నౌ స్వైరేష్వపి కుతోఽన్యథా ।
సత్యే ధర్మే చ నిరతౌ విద్ధ్యావాం పురుషోత్తమ ॥ 28
మధుకైటభులు ఇలా అన్నారు.
పురుషోత్తమా! మేమెప్పుడూ వినోదానికి కూడా అసత్యమాడలేదు. సత్యధర్మాసక్తులం మేము. మమ్ము చంపు. (28)
బలే రూపే చ శర్యే చ న శమే చ సమోఽస్తి నౌ ।
ధర్మే తపసి దానే చ శీలసత్త్వదమేషు చ ॥ 29
బలంలో, రూపంలో, పరాక్రమంలో, శాంతంలో, ధర్మంలో, తపస్సులో, దానంలో, శీలంలో, శక్తిలో, ఇంద్రియనిగ్రహంలో మాకు సాటి ఎవడూ లేడు. (29)
ఉపప్లవో మహానస్మాన్ ఉపావర్తత కేశవ ।
ఉక్తం ప్రతికురుష్వ త్వం కాలో హి దురతిక్రమః ॥ 30
కేశవా! మాకు ఈ పెద్దచిక్కు వచ్చింది. నీ కోరికను తీర్చుకో. కాలాన్ని అతిక్రమించలేము గదా! (30)
ఆవామిచ్ఛావహే దేవ కృతమేకం త్వయా విభో ।
అనావృతేఽస్మిన్నాకాశే వధం సురవరోత్తమ ॥ 31
దేవా! సురశ్రేష్ఠా! ప్రభూ! ఒక్కపని జరగాలని కోరుకొంటున్నాం. ఏ ఆవరణాలేవి బహిరాకాశంలో మమ్ము చంపు. (31)
అనృతం మా భవేద్ దేవ యద్ధి నౌ సంశ్రుతం తదా ।
పుత్రత్వమధిగచ్ఛావ తవచాపి సులోచన ॥ 32
వర ఏషవృతో దేవ తద్విద్ధి సురసత్తమ ।
సులోచనా! నీకు మేము పుత్రుల కావాలి. మేము ఈ వరాన్ని కోరుతున్నాం. గ్రహించు. సురశ్రేష్ఠా! మేము చేసిన ప్రతిజ్ఞ అసత్యం కారాదు. (32 1/2)
శ్రీభగవానువాచ
బాఢమేవం కరిష్యామి సర్వమేతద్ భవిష్యతి ॥ 33
శ్రీభగవానుడిలా అన్నాడు.
అలాగే. నేను ఆ రీతిగానే చేస్తా. అంతా మీరు ఆశించినట్టే జరుగుతుంది. (33)
స విచింత్యాథ గోవిందః నాపశ్యద్ యదనావృతమ్ ।
అవకాశం పృథివ్యాం వా దివి వా మదుసూదనః ॥ 34
స్వకావనావృతావూరూ దృష్ట్వా దేవవరస్తదా ।
మధుకైటభయో రాజన్ శిరసీ మధుసూదనః ।
చక్రేణ శితధారేణ న్యకృంతత మహాయశాః ॥ 35
ఆపై విష్ణువు ఎంత ఆలోచించినా ఇలపైకానీ, స్వర్గంలోకానీ అనావృతమయిన ఆకాశాన్ని చూడలేకపోయాడు. రాజా! అప్పుడు తన తొడలు అనావృతంగా ఉండటం చూచి మహాయశస్వి అయిన మధుసూదనుడు మధుకైటభుల తలలను తన తొడలపై నుంచి వాడి అయిన చక్రంతో వారిని నరికివేశాడు. (34,35)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి ధుంధుమారోపాఖ్యానే త్ర్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 203 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున ధుంధుమారోపాఖ్యానమను రెండువందల మూడవ అధ్యాయము. (203)