204. రెండు వందల నాలుగవ అధ్యాయము
కువలాశ్వుడు ధుంధుని సంహరించుట.
మార్కండేయ ఉవాచ
ధుంధుర్నామ మహారాజ తయోః పుత్రో మహాద్యుతిః ।
స తపోఽతప్యత మహత్ మహావీర్యపరాక్రమః ॥ 1
మార్కండేయుడిలా అన్నాడు. మహారాజా! ఆ మధుకైటభుల కొడుకు ధుంధువు. అతడు తేజస్వి, మహాబల పరాక్రమసంపన్నుడు. అతడు ఘోరతపస్సు చేశాడు. (1)
అతిష్ఠదేకపాదేన కృశో ధమనిసంతతః ।
తస్మై బ్రహ్మా దదౌ ప్రీతః వరం వవ్రే స చ ప్రభుమ్ ॥ 2
చాలాకాలం ఒంటికాలిపై తపస్సు చేశాడు. నరాలు బయటకు కనిపించేంత చిక్కిపోయాడు. దానితో సంతసించిన బ్రహ్మ వరమిచ్చాడు. ఆ వరాన్ని ఇలా కోరాడు ధుంధువు. (2)
దేవదానవయక్షాణాం సర్పగంధర్వరక్షసామ్ ।
అవధ్యోఽహం భవేయం వై వర ఏష వృతో మయా ॥ 3
దేవతలు, దానవులు, యక్షులు, నాగులు, గంధర్వులు, అచ్చరలు - వీరెవ్వరి చేతిలోనూ నేను చావకూడదు. ఇదే నేను కోరే వరం. (3)
ఏవం భవతు గచ్ఛేతి తమువాచ పితామహః ।
స ఏవముక్తస్తత్పాదౌ మూర్ధ్నా స్పృశ్య జగామ హ ॥ 4
"అలాగే జరుగుతుంది. వెళ్ళిరా" అన్నాడు బ్రహ్మ. బ్రహ్మ అలా పలుకగానే ధుంధువు ఆయన పాదాలకు శిరసా నమస్కరించి వెళ్ళాడు. (4)
స తు ధుంధుర్వరం లబ్ధ్వా మహావీర్యపరాక్రమః ।
అనుస్మరన్ పితృవధం ద్రుతం విష్ణుముపాగమత్ ॥ 5
మహాశక్తి పరాక్రమాలు గల ఆ ధుంధువు వరాన్ని పొంది, పితృవధను తలచుకొంటూ వెంటనే విష్ణువు దగ్గరకు వెళ్ళాడు. (5)
స తు దేవాన్ సగంధర్వాన్ జిత్వా ధుంధురమర్షణః ।
బబాధ సర్వానసకృద్ విష్ణుం దేవాంశ్చ వై భృశమ్ ॥ 6
అసహనశీలి అయిన ధుంధువు దేవతలను, గంధర్వులను జయించి విష్ణువును పదేపదే తీవ్రంగా బాధించాడు. (6)
సముద్రే వాలుకాపూర్ణే ఉజ్జాలక ఇతి స్మృతే ।
ఆగమ్య చ స దుష్టాత్మా తం దేశం భరతర్షభ ॥ 7
బాధతే స్మ పరం శక్త్యా తముత్తంకాశ్రమం విభో ।
అంతర్భూమిగతస్తత్ర వాలుకాంతర్హితస్తథా ॥ 8
భరతర్షభా! ధుంధువు ఉజ్జాలకమని ప్రసిద్ధికెక్కిన ఇసుకసముద్రం దగ్గరకు వచ్చి, దుష్టాత్ముడై అందరినీ బాధించసాగాడు. రాజా! తన శక్తినంతా వినియోగించి భూమిలోపల ఇసుకలో ఉండి ఉత్తంకాశ్రమాన్ని కలతపెట్టసాగాడు. (7,8)
మధుకైటభయోః పుత్రః ధుంధుర్భీమపరాక్రమః ।
శేతే లోకవినాశాయ తపోబలముపాశ్రితః ॥ 9
ఉత్తంకస్యాశ్రమాభ్యాశే నిఃశ్వసన్ పావకార్చిషః ।
మధుకైటభ పుత్రుడు, భీమపరాక్రముడు అయిన ఆ ధుంధువు తపోబలాన్ని అడ్డుపెట్టుకొని ఉత్తంకుని ఆశ్రమానికి దగ్గరగా నిప్పులు క్రక్కుతూ లోకవినాశనం చేయటానికి శయనించి ఉన్నాడు. (9 1/2)
ఏతస్మిన్నేవ కాలే తు రాజా సబలవాహనః ॥ 10
ఉత్తంకవిప్రసహితః కువలాశ్వో మహీపతిః ।
పుత్రైః సహ మహీపాలః ప్రయయౌ భరతర్షభ ॥ 11
భరతర్షభా! అదే సమయంలో తనసేనతో, వాహనాలతో, కుమారులతో సహా కువలాశ్వమహారాజు ఉత్తంకబ్రాహ్మణునితో కలిసి బయలుదేరాడు. (10,11)
సహస్రైరేకవింశత్యా పుత్రాణామరిమర్దనః ।
కువలాశ్వో నరపతిః అన్వితో బలశాలినామ్ ॥ 12
శత్రుమర్దనుడైన కువలాశ్వనరపతి బలశాలులయిన తన ఇరువదియొక్క వేల కుమారులతో కూడా ప్రయాణమయ్యాడు. (12)
తమావిశత్ తతో విష్ణుః భగవాంస్తేజసా ప్ర్రభుః ।
ఉత్తంకస్య నియోగేన లోకానాం హితకామ్యయా ॥ 13
అప్పుడు సర్వసమర్థుడైన విష్ణువు ఉత్తంకుని అభ్యర్థనమేరకు లోకహితాన్ని కోరి తన తేజస్సుతో కువలాశ్వునిలో ప్రవేశించాడు. (13)
తస్మిన్ ప్రయాతే దుర్ధర్షే దివి శబ్దో మహానభూత్ ।
ఏష శ్రీమానవధ్యోఽద్య ధుంధుమారో భవిష్యతి ॥ 14
దుర్ధర్షుడైన కువలాశ్వుడు బయలుదేరగానే "శ్రీమంతుడైన ఈ కువలాశ్వుడు అవధ్యుడు. నేడు ధుంధువును చంపి 'ధుంధుమారు'డవుతాడు" అని స్వర్గంలో మహాకోలాహలధ్వని వినిపించింది. (14)
దివ్యైశ్చ పుష్పైస్తం దేవాః సమంతాత్ పర్యవారయన్ ।
దేవదుందుభయశ్చాపి నేదుః స్వయమనీరితాః ॥ 15
దేవతలు దివ్యపుష్పాలతో కువలాశ్వుని చుట్టూ చేరారు. దేవదుందుభలు కూడా ఎవ్వరు మ్రోయించకపోయినా తమంత తాము మ్రోగాయి. (15)
శ్రీతశ్చ వాయుః ప్రవవౌ ప్రయాణే తస్య ధీమతః ।
విపాంసులాం మహీం కుర్వన్ వవర్ష చ సురేశ్వరః ॥ 16
ధీమంతుడైన అతని ప్రయాణవేళలో గాలి చల్లగా వీచింది. భూమిపై దుమ్ము లేవకూడదని దేవేంద్రుడు వర్షాన్ని కురిపించాడు. (16)
అంతరిక్షే విమానాది దేవతానాం యుధిష్ఠిర ।
తత్రైవ సమదృశ్యంత ధుంధుర్యత్ర మహాసురః ॥ 17
యుధిష్టిరా! మహాసురుడైన ధుంధువు ఉన్నచోటనే గగనతలంపై దేవతల విమానాలన్నీ నిలిచాయి. (17)
కువలాశ్వస్య ధుంధోశ్చ యుద్ధకౌతూహలాన్వితాః ।
దేవగంధర్వసహితాః సమవైక్షన్ మహర్షయః ॥ 18
ధుంధు, కువలాశ్వుల యుద్ధాన్ని చూచే కుతూహలంతో దేవగంధర్వులతో సహా మహర్షులంతా కనిపించారు. (18)
నారాయణేన కౌరవ్య తేజసాఽఽప్యాయితస్తదా ।
స గతో నృపతిః క్షిప్రం పుత్రైస్తైః సర్వతో దిశమ్ ॥ 19
అర్ణవం ఖానయామాస కువలాశ్వో మహీపతిః ।
కౌరవ్యా! నారాయణ తేజస్సుతో వృద్ఢిచెందిన ఆ కువలాశ్వమహీపతి తన కుమారులతో కూడివెళ్ళి వెంటనే నాలుగువైపులా ఇసుకసముద్రాన్ని త్రవ్వించాడు. (19 1/2)
కువలాశ్వస్య పుత్రైశ్చ తస్మిన్ వై వాలుకార్ణవే ॥ 20
సప్తభిర్దివసైః ఖాత్వా దృష్టో ధుంధుర్మహాబలః ।
కువలాశ్వుని కుమారులు ఆ ఇసుకకడలిలో ఏడురోజులు త్రవ్వి, మహాబలుడైన ధుంధువును చూచారు. (20 1/2)
ఆసీద్ ఘోరం వపుస్తస్య వాలుకాంతార్హితం మహత్ ॥ 21
దీప్యమానం యథా సూర్యః తేజసా భరతర్షభ ।
భరతర్షభా! ఇసుక క్రింది దాగి ఉన్న అతని మహాకాయం భయంకరంగా ఉన్నది. సూర్యుని వలె తేజస్సుతో ప్రజ్వలిస్తోంది. (21 1/2)
తతో ధుంధుర్మహారాజ దిశమావృత్య పశ్చిమామ్ ॥ 22
సుప్తోఽభూద్ రాజశార్దూల కాలానలసమద్యుతిః ।
రాజశ్రేష్ఠా! ప్రళయకాలాగ్ని వలె కాంతిమంతుడైన ఆ ధుంధువు పశ్చిమదిక్కు నాశ్రయించి నిద్రిస్తూ కనిపించాడు. (22 1/2)
కువలాశ్వస్య పుత్రైస్తు సర్వతః పరివారితః ॥ 23
అభిద్రుతః శరైస్తీక్ష్ణైః గదాభిర్ముసలైరపి ।
పట్టిశైః పరిఘైః ప్రాసైః ఖడ్గైశ్చ విమలైః శితైః ॥ 24
స వధ్యమానః సంక్రుద్ధః సముత్తస్థౌ మహాబలః ।
క్రుద్ధశ్చాభక్షయత్ తేషాం శస్త్రాణి వివిధాని చ ॥ 25
కువలాశ్వుని కొడుకులు అన్నివైపుల నుండి చుట్టుముట్టి ధుంధువులై దాడిచేశారు. తీక్ష్ణబాణాలతో, గదలతో, ముసలాలతో, పట్టిశాలతో, పరిఘలతో, ప్రాసాలతో, మెరిసే వాడి కత్తులతో దెబ్బతిన్న మహాబలుడు ధుంధువు క్రోధంతో లేచాడు. ఆ కోపంలోనే వారు ప్రయోగించిన వివిధశస్త్రాలను మ్రింగివేశాడు. (23-25)
ఆస్యాద్ వమన్ పావకం స సంవర్తకసమం తదా ।
తాన్ సర్వాన్ నృపతేః పుత్రాన్ అదహత్ స్వేన తేజసాః ॥ 26
అప్పుడు తననోటి నుండి ప్రళయకాలాగ్నివలె నిప్పులు క్రక్కుతూ తన తేజస్సుతో రాజకుమారులనందరినీ దహించివేశాడు. (26)
ముఖజేనాగ్నినా క్రుద్ధః లోకానుద్వర్తయన్నివ ।
క్షణేన రాజశార్దూల పురేవ కపిలః ప్రభుః ॥ 27
సగరస్యాత్మజాన్ క్రుద్ధః తదద్భుతమివాభవత్ ।
రాజశార్దూలా! పూర్వకాలంలో కపిలమహర్షి కోపించి సగరపుత్రులనందరినీ క్షణంలో దహించినట్లు ధుంధువు కూడా కోపించి లోకాల నన్నింటినీ నశింపజేస్తున్నట్లు ముఖాగ్నితో కపిలాశ్వపుత్రులను దహించాడు. (27 1/2)
తేషు క్రోధాగ్నిదగ్ధేషు తదా భరతసత్తమ ॥ 28
తం ప్రబుద్ధం మహాత్మానం కుంభకర్ణమివాపరమ్ ।
ఆససాద మహాతేజాః కువలాశ్వో మహీపతిః ॥ 29
భరతసత్తమా! తన కుమారులు అందరూ కోపాగ్నిలో తగులబడగా మహాతేజస్వి అయిన కువలాశ్వమహీపతి మరొక కుంభకర్ణునివలె నిదురలేచిన ఆ ధుంధువును సమీపించాడు. (28,29)
తస్య వారి మహారాజ సుస్రావ బహు దేహతః ।
తదాపీయ తతస్తేజో రాజా వారిమయం నృప ॥ 30
యోగీ యోగేన వహ్నిం చ శమయామాస వారిణా ।
మహారాజా! అతనిదేహం నుండి జలం ఎక్కువగా ప్రవహింపసాగింది. కాని కువలాశ్వుడు యోగి కాబట్టి యోగశక్తితో జలరూపమైన ఆ తేజస్సును త్రాగి నీటితోనే అతని ముఖాగ్నిని శమింపజేశాడు. (30 1/2)
బ్రహ్మాస్త్రేణ చ రాజేంద్ర దైత్యం క్రూరపరాక్రమమ్ ॥ 31
దదాహ భరతశ్రేష్ఠ సర్వలోకభవాయ వై ।
సోఽస్త్రేణ దగ్ధ్వా రాజర్షిః కువలాశ్వో మహాసురమ్ ॥ 32
సురశత్రుమమిత్రఘ్నం త్రైలోక్యేశ ఇవాపరః ।
రాజేంద్రా! భీకరపరాక్రమం గల ఆ దైత్యుని బ్రహ్మాస్త్రంతో దహించివేశాడు. ఈ రీతిగా లోకకళ్యాణం కోసం కువలాశ్వుడు సురశత్రువు. శత్రుసంహర్త అయిన ఆ మహారాక్షసుని బ్రహ్మాస్త్రంతో దగ్ధం చేసి మరొక దేవేంద్రుని వలె ప్రకాశించాడు. (31 ,32 1/2)
ధుంధోర్వధాత్ తదా రాజా కువలాశ్వో మహామనాః ॥ 33
ధుంధుమార ఇతి ఖ్యాతః నామ్నాఽప్రతిరథోఽభవత్ ।
మహామనస్కుడైన కువలాశ్వమహారాజు ధుంధువును చంపినందువల్ల ధుంధుమారుడని ప్రసిద్ధుకెక్కి, తిరుగులేని వాడయ్యాడు. (33 1/2)
ప్రీతైశ్చ త్రిదశైః సర్వైః మహర్షిసహితైస్తదా ॥ 34
వరం వృణీష్వేత్యుక్తః స ప్రాంజలిః ప్రణతస్తదా ।
అతీవ ముదితో రాజన్ ఇదం వచనమబ్రవీత్ ॥ 35
దేవతలూ, మహర్షులు అందరూ సంతోషించి కువలాశ్వుని వరం కోరుకొమ్మన్నారు. దానికి పరమానందప్సిన కువలాశ్వుడు చేతులు జోడించి వినయంతో ఇలా అన్నాడు. (34, 35)
దద్యాం విత్తం ద్విజాగ్ర్యేభ్యః శత్రూణాం చాపి దుర్జయః ।
సఖ్యం చ విష్ణునా మే స్యద్ భూతేష్వద్రోహి ఏవ చ ॥ 36
బ్రాహ్మణశ్రేష్ఠులకు ధనాన్ని దానమివ్వగలగాలి. శత్రువులకు అజేయుడను కావాలి. విష్ణువుతో చెలిమి ఉండాలి. ప్రాణులపై ద్రోహబుద్ధి కలుగరాదు. (36)
ధర్మే రతిశ్చ సతతం స్వర్గే వాసస్తథాక్షయః ।
తథాస్త్వితి తతో దేవైః ప్రీతైరుక్తః స పార్థివః ॥ 37
నిత్యమూ ధర్మాసక్తి ఉండాలి. అక్షయస్వర్గనివాసం సిద్ధించాలి అన్నాడు. ఆనందించిన దేవతలు "తథాస్తు" అని రాజుతో అన్నారు. (37)
ఋషిభిశ్చ సగంధర్వైరుత్తంకేన చ ధీమతా ।
సంభాష్య చైనం వివిధైః ఆశీర్వాదైస్తతో నృప ॥ 38
రాజా! ఆపై ఋషులు, గంధర్వులు, ధీమంతుడైన ఉత్తంకుడు వివిధాశీర్వాదాల నిస్తూ రాజుతో సంభాషించారు. (38)
దేవా మహర్షయశ్చాపి స్వాని స్థానాని భేజిరే ।
తస్య పుత్రాస్త్రయః శిష్టాః యుధిష్ఠిర తదాభవన్ ॥ 39
తరువాత దేవతలు, మునులు తమ తమ స్థానాలకు వెళ్ళారు. యుధిష్ఠిరా! ఆ యుద్ధంలో కువలాశ్వుని కొడుకులు ముగ్గురు మాత్రమే మిగిలారు. (39)
దృఢాశ్వః కపిలాశ్వశ్చ చంద్రాశ్వశ్చైవ భారత ।
తేభ్యః పరంపరా రాజన్ ఇక్ష్వాకూణాం మహాత్మనామ్ ॥ 40
వంశస్య సుమహాభాగ రాజ్ఞామమితతేజసామ్ ।
వారు దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, చంద్రాశ్వుడు, అపార తేజస్వులయిన ఇక్ష్వాకు మహారాజుల వంశపరంపర వారి వల్లనే వచ్చింది. (40 1/2)
ఏవం స నిహతస్తేవ కువలాశ్వేన సత్తమ ॥ 41
ధుంధుర్నామ మహాదైత్యః మధుకైటభయోః సుతః ॥
కువలాశ్వశ్చ నృపతిః ధుంధుమార ఇతి స్మృతః ॥ 42
ఇలా కువలాశ్వుని చేత ధుంధుడు చంపబడ్డాడు. మధుకైటుభుల కొడుకయిన ధుంధుని చంపడంచేత కువలాశ్వుడు ధుంధుమారుడయ్యాడు. (41, 42)
నామ్నా చ గుణసంయుక్తః తదాప్రభృతి సోఽభవత్ ।
ఏతత్ తే సర్వమాఖ్యాతం యన్మాం త్వం పరిపృచ్ఛసి ॥ 43
ధౌంధుమారముపాఖ్యానం ప్రథితం యస్య కర్మణా ।
అప్పటి నుండి అతడు ధుంధుమారుడని పిలువబడ్డాడు. అతని పనులను బట్టియే ఈ ఉపాఖ్యానం ధౌంధుమారోపాఖ్యానం అని పేరు కెక్కింది. నీ వడిగిన వృత్తాంతమంతా నీకు చెప్పాను. (43 1/2)
ఇదం తు పుణ్యమాఖ్యానం విష్ణోఃసమనుకీర్తనమ్ ॥ 44
శృణుయాద్ యః స ధర్మాత్మా పుత్రవాంశ్చ భవేన్నరః ।
అయుష్మాన్ భూతిమాంశ్చైవ శ్రుత్వా భవతి పర్వసు ।
న చ వ్యాధిభయం కించిత్ ప్రాప్నోతి విగతజ్వరః ॥ 45
పుణ్యప్రదమై, విష్ణుకీర్తనంతో నిండిన ఈ కథను విన్న ధర్మాత్ముడు పుత్రవంతుడవుతాడు. పర్వసమయాల్లో విన్నవాడు ఆయువునూ, ఐశ్వర్యాన్నీ పొందుతాడు. అతనికి వ్యాధి భయం ఏ మాత్రమూ ఉండదు. దుఃఖస్పర్శ ఉండదు. (44,45)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి ధుంధుమారోపాఖ్యానే చతురధికద్విశతతమోఽధ్యాయః ॥ 204 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున ధుంధుమారోపాఖ్యానమను రెండువందల నాలుగవ అధ్యాయము. (204)