207. రెండు వందల ఏడవ అధ్యాయము

కౌశిక ధర్మవ్యాధుల సంవాదము.

మార్కండేయ ఉవాచ
చింతయిత్వా తదాశ్చర్యం స్త్రియా ప్రోక్తమశేషతః ।
వినిందన్ స స్వమాత్మానమ్ ఆగస్కృత ఇవాబభౌ ॥ 1
మార్కండేయుడు అన్నాడు - యుధిష్ఠిరా! పతివ్రత చెప్పిన విషయం అంతా ఆలోచించి, కౌశికుడు తనను తాను నిందించుకొంటూ తప్పు చేసినవాడిలాగా కన్పించాడు. (1)
చింతమానః స్వధర్మస్య సూక్ష్మం గతిమథాబ్రవీత్ ।
శ్రద్దధానేన వై భావ్యం గచ్ఛామి మిథిలామహమ్ ॥ 2
తాను ఆచరించివలసిన ధర్మసూక్ష్మం ఎంత లోతైనదో బాగా ఆలోచించి 'తప్పకుండా ఆ పతివ్రత మాటల్లో నేను బాగా విశ్వాసం ఉంచి మిథిలానగరానికి వెళతాను.' అని తనలో తాను అనుకొన్నాడు. (2)
కృతాత్మా ధర్మవిత్ తస్యాం వ్యాధో నివసతే కిల ।
తం గచ్చామ్యహమద్యైవ ధర్మం ప్రష్టుం తపోధనమ్ ॥ 3
అక్కడ పుణ్యాత్ముడు, ధర్మజ్ఞుడు అయిన వ్యాధుడు ఉన్నాడట. నేను ఆ తపోధనుని వద్దకు ధర్మవిషయం అడగటానికి ఈ రోజే వెళ్తాను. (3)
ఇతి సంచిత్య మనసా శ్రద్దధానః స్త్రియా వచః ।
బలాకాప్రత్యయేనాసౌ ధర్మ్యైశ్చ వచనైః శుభైః ॥ 4
సంప్రతస్థే స మిథిలాం కౌతూహలసమన్వితః ।
ఆయన ఇలా మనస్సులో నిశ్చయించుకొని కుతూహలంతో మిథిలాపురానికి బయలుదేరాడు. ఆ పతివ్రత చూడకుండానే కొంగ పడిపోయిన విషయం తెలుసుకోవటమే కాక ధర్మోపదేశం చేసింది. ఇందువల్ల ఆయనకు ఆమె మాటల మీద బాగా నమ్మకం కుదిరింది. (4 1/2)
అతిక్రామన్నరణ్యాని గ్రామాంశ్చ నగరాణి చ ॥ 5
తతో జగామ మిథిలాం జనకేన సురక్షితామ్ ।
ధర్మసేతుసమాకీర్ణాం యజ్ఞోత్సవవతీం శుభామ్ ॥ 6
ఆయన ఎన్నో అరణ్యాలను, పల్లెలను, పట్టణాలను దాటి జనకమహారాజుచేత సురక్షితమై, ధర్మమర్యాదతో నిండి, అనేక యజ్ఞాలతో అలంకృతమై, శుబప్రదమయిన మిథిలాపురం చేరాడు. (5,6)
గోపురాట్టాలకవతీం హర్మ్యప్రాకారశోభనామ్ ।
ప్రవిశ్య నగరీం రమ్యాం విమానైర్బహుభిర్యుతామ్ ॥ 7
పణ్యైశ్చ బహుభిర్యుక్తాం సువిభక్తమహాపథామ్ ।
అశ్వై రథైస్తథా నాగైః యాధైశ్చ బహుభిర్యుతామ్ ॥ 8
హృష్టపుష్టజనాకీర్ణాం నిత్యోత్సవసమాకులామ్ ।
సోఽపశ్యద్ బహువృత్తాంతాం బ్రాహ్మణః సమతిక్రమన్ ॥ 9
ఆ నగరంలో కోటవాకిళ్ళు, పైన ఉండే ఇళ్ళు, దేవాలయాలు, మేడలు, లెక్కలేనన్ని ఉన్నాయి. దానికి పెద్ద అందమైన ప్రాకారం ఉన్నది. అనేకమైన సౌధాలు, పెద్ద దుకాణాలు ఉన్నవి. పెద్ద వీథులు తీర్చిదిద్దినట్లు ఉన్నాయి. అసంఖ్యాకమైన గుఱ్ఱాలు, రథాలు, ఏనుగులు ఉన్నాయి. వీరులు చాలామంది ఉన్నారు. ఆ పట్టణంలో జనులందరూ పుష్టిగా, సంతోషంగా ఉన్నారు. ఆ పట్టణంలో జనులందరూ పుష్టిగా, సంతోషంగా ఉన్నారు. నిత్యమూ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అనేక ప్రవృత్తులతో కూడిన ఆ నగరంలో ప్రవేశించి ఆ బ్రాహ్మణుడు ఆ ప్రదేశాలన్నీ దాటివెళ్లాడు. (7-9)
ధర్మవ్యాధమపృచ్ఛచ్చ స చాస్య కథితో ద్విజైః ।
అపశ్యత్ తత్ర గత్వా తం సూనామధ్యే వ్యవస్థితమ్ ॥ 10
మార్గమాహిషమాంసాని విక్రీణంతం తపస్వినమ్ ।
ఆకులత్వాచ్చ క్రేతౄణామ్ ఏకాంతే సంస్థితో ద్విజః ॥ 11
ధర్మవ్యాధుని గురించి వాకబు చేశాడు. ఆ నగరంలో ఉన్న బ్రాహ్మణులు అతని నివాసాన్ని తెలియజేశారు. కౌశికుడు అక్కడికి వెళ్ళాడు. అప్పుడు మాంసదుకాణం మధ్యలో కూర్చుని పందిమాంసం, గొడ్డుమాంసం అమ్ముతూ తపస్విలాగా - పవిత్రునిగా ఉన్న వ్యాధుని చూశాడు. కొనేవాళ్ళు గుంపులుగా ఉండటం వల్ల ఆ బ్రాహ్మణుడు కొద్దిదూరంలో ఒంటరిగా నిలిచాడు. (10,11)
స తు జ్ఞాత్వా ద్విజం ప్రాప్తం సహసా సంభ్రమోత్థితః ।
ఆజగామ యతో విప్రః స్థిత ఏకాంతదర్శనే ॥ 12
బ్రాహ్మణుడు రావటం తెలుసుకొని వ్యాధుడు తొట్రుపాటుతో లేచి ఒంటరిగా ఆయన ఉన్నచోటికి వేగంగా వచ్చాడు. (12)
వ్యాధ ఉవాచ
అభివాదయే త్వాం భగవన్ స్వాగతం తే ద్విజోత్తమ ।
అహం వ్యాధో హి భద్రం తే కిం కరోమి ప్రశాధి మామ్ ॥ 13
వ్యాధుడన్నాడు - మహాత్మా! మీకు నా నమస్కారాలు. బ్రాహ్మణశ్రేష్ఠా! మీకు స్వాగతం. నేనే ఆ వ్యాధుడను. మీకు మేలు కలుగుగాక. నేను ఏమిచేయాలో ఆజ్ఞాపించండి. (13)
ఏకపత్న్యా యదుక్తోఽసి గచ్ఛ త్వం మిథిలామితి ।
జానామ్యేతదహం సర్వం యదర్థం త్వమిహాగతః ॥ 14
'మిథిలానగరానికి వెళ్ళు' అని ఆ పతివ్రత నీకు చెప్పినది. నీవు ఎందుకు వచ్చినదీ నాకు అంతా తెలుసు. (14)
శ్రుత్వా చ తస్య తద్ వాక్యం స విప్రో భృశవిస్మితః ।
ద్వితీయమిదమాశ్చర్యమ్ ఇత్యచింతయత ద్విజః ॥ 15
వ్యాధుని ఆ మాటలు విని బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడినాడు. ఇది రెండవ ఆశ్చర్యకరవిషయం అని మనస్సులో అనుకొన్నాడు. (15)
అదేశస్థం హి తే స్థానమ్ ఇతి వ్యాధోఽబ్రవీదిదమ్ ।
గృహం గచ్ఛావ భగవన్ యది తే రోచతేఽనఘ ॥ 16
'మహాత్మా! ఈ ప్రదేశం మీరు నిలువదగినది కాదు. అనఘా! మీకు ఇష్టమయితే మాయింటికి వెళ్ళుదాము.' అని వ్యాధుడు అన్నాడు. (16)
మార్కండేయ ఉవాచ
బాఢమిత్యేవ తం విప్రః హృష్ణో వచనమబ్రవీత్ ।
అగ్రతస్తు ద్విజం కృత్వా స జగామ గృహం ప్రతి ॥ 7
మార్కండేయుడు అన్నాడు - ఆ మాటలు విని బ్రాహ్మణుడు సంతోషించి 'అలాగే వెళ్దాం' అన్నాడు. వ్యాధుడు ఆ ద్విజుని ముందుంచుకొని తన ఇంటికి వెళ్ళాడు. (17)
ప్రవిశ్య చ గృహం రమ్యమ్ ఆసనేనాభిపూజితః ।
అర్ఘ్యేణ చ స వై తేన వ్యాధేన ద్విజసత్తమః ॥ 18
ఆ వ్యాధుడు సుందరమైన తన ఇంటిలోకి ఆయనను తీసుకొనిపోయినాడు. మంచి ఆసనం మీద కూర్చోబెట్టాడు. ఆర్ఘ్యం (కాళ్ళు చేతులు కడుగుకోటానికి నీళ్ళు) ఇచ్చి పూజించాడు. (18)
తతః సుఖోపవిష్టస్తం వ్యాధం వచనమబ్రవీత్ ।
కర్మైతద్ వై న సదృశం భవతః ప్రతిభాతి మే ।
అనుతప్యే భృశం తాత తవ ఘోరేణ కర్మణా ॥ 19
తరువాత సుఖంగా కూర్చొని ఆయన ఆ వ్యాధునితో ఇలా పలికాడు 'నాయనా! ఈ మాంసం అమ్మటం అనే పని నీవు చేయదగినదిగా నాకు అనిపించటం లేదు. నీవు చేసే ఈ ఘోరమైన పని చూసి నేను చాలా బాధపడుతున్నాను.' (19)
వ్యాధ ఉవాచ
కులోచితమిదం కర్మ పితృపైతామహం పరమ్ ।
వర్తమానస్య మే ధర్మే స్వే మన్యుం మా కృథా ద్విజ ॥ 20
వ్యాధుడన్నాడు - ద్విజా! నేను చేసేపని నా కులానికి తగినది. తాత తండ్రులనుంచీ వంశపరంపరగా వస్తున్నది. నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. కాబట్టి నీవు కోపించదగదు. (20)
విధాత్రా విహితం పూర్వం కర్మ స్వమనుపాలయన్ ।
ప్రయత్నాచ్చ గురూ వృద్ధౌ శుశ్రూషేఽహం ద్విజోత్తమ ॥ 21
బ్రాహ్మణోత్తమా! పూర్వం బ్రహ్మదేవుడు నిర్ణయించిన నాకర్తవ్యాన్ని యథావిధిగా చేస్తూ నేను ముసలివారైన నాతల్లిదండ్రులకు ప్రయత్నపూర్వకంగా సేవ చేస్తున్నాను. (21)
సత్యం వదే నాభ్యసూయే యథాశక్తి దదామి చ ।
దేవతాతిథిభృత్యానామ్ అవశిష్టేన వర్తయే ॥ 22
నిజమే చెపుతుంటాను. ఎవరినీ నిందించను. నాశక్తిని అనుసరించి దానం చేస్తుంటాను దేవతలకు, అతిథులకు కుటుంబంలోని సేవకులకు భోజనం పెట్టి మిగిలినదానితో శరీరాన్ని పోషిస్తుంటాను. (22)
న కుత్సయామ్యహం కించిత్ న గర్హే బలవత్తరమ్ ।
కృతమన్వేతి కర్తారం పురా కర్మ ద్విజోత్తమ ॥ 23
నేను దేనిని నిందించను. బలవత్తరమైన ప్రారబ్ధం చేత కలిగే దుఃఖాన్ని నిందించను పూర్వం చేసిన మంచి చెడు పనులఫలితం స్వయంగా కర్తను వెంటనంటుతుంది కదా విప్రోత్తమా! (23)
కృషిగోరక్ష్యవాణిజ్యమ్ ఇహ లోకస్య జీవనమ్ ।
దండనీతిస్త్రయీ విద్యా తేన లోకో భవత్యుత ॥ 24
వ్యవసాయం, గోసేవ, వ్యాపారం, దండనీతి, త్రయీవిద్య- మూడువేదాలను అధ్యయనం చేసి వాటిని అనుసరించి యజ్ఞాలు చేయటం - ఈ లోకంలో మానవుల జీవనవిధానం. వీటి వల్ల ఇహలోకపరలోకాల్లో ఉన్నతి కలుగుతుంది. (24)
కర్మ శూద్రే కృషిర్వైశ్యే సంగ్రామః క్షత్రియే స్మృతః ।
బ్రహ్మచర్యం తపో మంత్రాః సత్యం చ బ్రాహ్మణే సదా ॥ 25
శూద్రునికి సేవ, వైశ్యునికి వ్యవసాయం, క్షత్రియునికి యుద్ధం కర్తవ్యాలు బ్రహ్మచర్యం, తపస్సు, వేదాధయ్యనం, నిజం చెప్పటం అనేవాటిని ఎల్లప్పుడూ పాటించటం బ్రాహ్మణునికి కర్తవ్యం. ధర్మం. (25)
రాజా ప్రశాస్తి ధర్మేణ స్వకర్మనిరతాః ప్రజాః ।
వికర్మాణశ్చ యే కేచిత్ తాన్ యునక్తి స్వకర్మసు ॥ 26
తమ వర్ణధర్మాలను నిర్వహించటంలో ఆసక్తి కల ప్రజలను రాజు ధర్మపూర్వకంగా పరిపాలిస్తాడు తమధర్మాన్ని వదలి అపమార్గం పట్టిన వాళ్ళను ధర్మానుసారం ప్రవర్తింపజేస్తాడు. (26)
భేతవ్యం హి సదా రాజ్ఞః ప్రజానామధిపా హి తే ।
వారయంతి వికర్మస్థం నృపా మృగమివేషుభిః ॥ 27
ప్రజలకు శాసకులు కాబట్టి రాజులకు భయపడాలి క్రూరమృగాలను బాణాలతో నిరోధించినట్లు రాజులు అపమార్గాన పోయేవానిని నివారిస్తారు. (27)
ప్రజలకు శాసకులు కాబట్టి రాజులకు భయపడాలి. క్రూరమృగాలను బాణాలతో నిరోధించినట్లు రాజులు అపమార్గాన పోయేవానిని నివారిస్తారు. (27)
జనకస్యేహ విప్రర్షే వికర్మస్థో న విద్యతే ।
స్వకర్మనిరతా వర్ణాః చత్వారోఽపి ద్విజోత్తమ ॥ 28
బ్రహ్మర్షీ! జనకుని పట్టణమైన ఈ మిథిలానగరంలో స్వవర్ణధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు ఎవడూ లేడు. నాలుగు వర్ణాల వారూ కూడ స్వకర్మాచరణ తత్పరులుగా ఉంటారు. (28)
స ఏష జనకో రాజా దుర్వృత్తమపి చేత్ సుతమ్ ।
దండ్యం దండే నిక్షిపతి తథా న గ్లాతి ధార్మికమ్ ॥ 29
అటువంటివాడు జనకమహారాజు. చెడు నడతగలవాడు తనకుమారుడైనా దండించదగినవాడే అని దండిస్తాడు. ధర్మాత్ముని బాధించడు. (29)
సుయుక్తచారో నృపతిః సర్వం ధర్మేణ పశ్యతి ।
శ్రీశ్చ రాజ్యం చ దండశ్చ క్షత్రియాణాం ద్విజోత్తమ ॥ 30
బ్రాహ్మణశ్రేష్ఠా! జనక చక్రవర్తి అన్నివైపులా గూఢచారులను ఉంచి, అందరినీ ధర్మానుసారం గమనిస్తాడు. ధనసంపాదనం, రాజ్యరక్షణ, దుష్టశిక్షణ రాజుల కర్తవ్యం. (30)
రాజానో హి స్వధర్మేణ శ్రియమిచ్ఛంతి భూయసీమ్ ।
సర్వేషామేవ వర్ణానాం త్రాతా రాజా భవత్యుత ॥ 31
రాజులు స్వధర్మాన్ని అనుసరిస్తూనే సమృద్ధిగా సంపద కావాలని కోరుకొంటారు. అంతేకాక రాజు అన్ని వర్ణాల వారికి రక్షకుడు అవుతాడు. (31)
పరేణ హి హతాన్ బ్రహ్మన్ వరాహమహిషానహమ్ ।
న స్వయం హన్మి విప్రర్షే విక్రీణామి సదా త్వహమ్ ॥ 32
బ్రహ్మర్షీ! నేను స్వయంగా దేన్నీ హింసించను. ఇతరులు చంపిన వరాహాలను, మహిషాలను కొని వాటి మాంసాన్ని ఎప్పుడూ అమ్ముతుంటాను. (32)
న భక్షయామి మాంసాని ఋతుగామీ తథా హ్యహమ్ ।
సదోపవాసీ చ తథా నక్తభోజీ సదా ద్విజ ॥ 33
మాంసం తినను. ఋతుకాలంలోనే భార్యాసంగమం చేస్తాను. ఎప్పుడూ పగలు ఉపవాసం ఉంటాను. రాత్రి మాత్రం భోజనం చేస్తుంటాను. (33)
అశీలశ్చాపి పురుషః భూత్వా భవతి శీలవాన్ ।
ప్రాణిహింసారతశ్చాప్ భవతే ధార్మికః పునః ॥ 34
శీలంలేనివాడైనా మానవుడు ఒకప్పుడు మంచిశీలం కలవాడు అవుతాడు. అలాగే ప్రాణిహింసలో ఆసక్తికలవాడు కూడా ధర్మాత్ముడు అవుతాడు. (34)
ఆభిచారాన్నరేంద్రాణాం ధర్మః సంకీర్యతే మహాన్ ।
అధర్మో వర్ధతే చాపి సంకీర్యంతే తతః ప్రజాః ॥ 35
రాజుల స్వేచ్ఛాప్రవృత్తి దోషం వల్ల ధర్మం చాలా ఎక్కువగా సంకీర్ణం అవుతుంది. అధర్మం కూడా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల ప్రజలలో వర్ణసాంకర్యం ఏర్పడుతుంది. (35)
వి॥ సం॥ ఆభిచారాత్ = స్వేచ్ఛాచారం వల్ల (నీల)
భేరుండా వామనాః కుబ్జాః స్థూలశీర్షాస్తథైవ చ ।
క్లీబాశ్చాంధాశ్చ బధిరాః జాయంతేఽత్యుచ్ఛలోచనాః ॥ 36
ఆస్థితిలో భయంకరాకారులు, పొట్టివారు, గూనివారు, పెద్దతలలవారు, నపుంసకులు, గుడ్డివారు, చెవిటివారు పెద్దకన్నులు కలవారు జన్మిస్తారు. (36)
పార్థివానామధర్మత్వాత్ ప్రజానామభవః సదా ।
స ఏష రాజా జనకః ప్రజా ధర్మేణ పశ్యతి ॥ 37
రాజులు అధర్మపరులు కావటం వల్ల ప్రజలు ఎల్లప్పుడు ఉనికిని కోల్పోతారు. మా జనకమహారాజు ప్రజలను ధర్మదృష్టితో చూస్తాడు. (37)
అనుగృహ్ణన్ ప్రజాః సర్వాః స్వధర్మనిరతాః సదా ।
(పాత్యేవ రాజా జనకః పితృవజ్జనసత్తమ ।)
యే చైవ మాం ప్రశంసంతి యే చ నిందంతి మానవాః ॥ 38
సర్వాన్ సుపరణీతేన కర్మణా తోషయామ్యహమ్ ।
నరశ్రేష్ఠా! జనకమహారాజు ఎల్లప్పుడూ స్వధర్మతత్పరులైన ప్రజలందరినీ తండ్రిలాగా రక్షిస్తాడు. నన్ను ప్రశంసించే వారినీ, నిందించేవారినీ అందరినీ నామంచి నడవడితో సంతోషపెడతాను. (38 1/2
యే జీవంతి స్వధర్మేణ సంయుంజంతి చ పార్థివాః ॥ 39
న కించిదుపజీవంతి దాంతా ఉత్థానశీలినః ।
స్వధర్మాన్ని అనుసరిస్తూ దానితోనే జీవించేవారు, ప్రజారక్షణకై సైన్యం సమకూర్చుకున్నవారే రాజులు ఇంద్రియాలను వశంచేసుకొని ఉన్నతిని కోరే రాజులు దేనినీ ఆశ్రయించరు. (39 1/2)
శక్త్యాన్నదానం సతతం తితిక్షా ధర్మనిత్యతా ॥ 40
యథార్హం ప్రతి పూజా చ సర్వభూతేషు వై సదా ।
త్యాగాన్నాన్యత్ర మర్త్యానాం గుణాస్తిష్ఠంతి పూరుషే ॥ 41
యథాశక్తిగా అన్నదానం చేయటం, ఇతరుల తప్పులను సహించటం, ఎల్లప్పుడూ ధర్మనిష్ఠతో ఉండటం తగినవిధంగా పూజ్యులను పూజించటం, అనే మానవసద్గుణాలు, స్వార్థత్యాగం లేని పురుషుల్లో ఉండవు. (40,41)
మృషా వాదం పరిహరేత్ కుర్యాత్ ప్రియమయాచితః ।
న చ కామాన్న సంరంభాద్ న ద్వేషాద్ ధర్మముత్సృజేత్ ॥ 42
అబద్ధాలు చెప్పటం వదలివేయాలి. అడక్కుండానే ఇతరులకు మేలుచేయాలి. కామంతోగాని, భయంతోకాని, ద్వేషంతో గాని ధర్మాన్ని వదలకూడదు. (42)
ప్రియే నాతిభృశం హృష్యేద్ అప్రియే న చ సంజ్వరేత్ ।
న ముహ్యేదర్థకృచ్ఛ్రేషు న చ ధర్మం పరిత్యజేత్ ॥ 43
తనకు ఇష్టమైనది లభిస్తే అతిగా సంతోషించరాదు. తనకు ఇష్టం కానిది, బాదాకరమైనది జరిగితే అతిగా బాధపడరాదు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైతే మోహపరవశులై గాబరా పడరాదు. స్వధర్మాన్ని వదలకూడదు. (43)
కర్మ చేత్కించిదన్యత్ స్యాద్ ఇతరన్న తదాచరేత్ ।
యత్ కల్యాణమభిధ్యాయేత్ తత్రాత్మానం నియోజ యేత్ ॥ 44
పొరపాటు వల్ల ఒక తప్పుపని చేస్తే మళ్ళీ దాన్ని చేయగూడదు. తనకూ పరులకూ మంచి పనిని ఆలోచించాలి. ఆ పనిలో తనను లగ్నం చేసుకోవాలి. (44)
న పాపే ప్రతిపాపః స్యాత్ సాధురేవ సదా భవేత్ ।
ఆత్మమైన హతః పాపః యః పాపం కర్తుమిచ్ఛతి ॥ 45
ఎవరైనా తన విషయంలో చెడుగా ప్రవర్తిస్తే దానికి బదులు తాను కూడా చెడుగా ప్రవర్తించరాదు. అందరితో మంచిగానే ఉండాలి. ఇతరులకు కీడు చేయదలచిన పాపాత్ముడు స్వయంగానే నష్టపోతాడు. (45)
కర్మ చైతదసాధూనాం వృజినానామసాధువత్ ।
న ధర్మోఽస్తీతి మన్వానాః శుచీనవహసంతి యే ॥ 46
అశ్రద్దధానా ధర్మస్య తే నశ్యంతి న సంశయః ।
మహాదృతిరివాధ్మాతః పాపో భవతి నిత్యదా ॥ 47
ఇతరులకు కీడుచేయటం దురాచారులకు వలె దుర్వ్యసనాలకు లోనైన పాపాత్ముల పనే అవుతుంది. ధర్మమే లేదనుకొని మంచినడవడి కల ఉత్తములను పరిహసిస్తూ, ధర్మం మీద నమ్మకం లేనివాళ్ళు తప్పకుండా నష్టపోతారు. పాపాత్ములు సారం లేకపోయినా గాలితో కొలిమితిత్తిలాగా పైకి మాత్రం నిండుగా కనిపిస్తారు. (46,47)
(సాధుః సన్నతిమానేవ సర్వత్ర ద్విజసత్తమ ।)
మూఢానామవలిప్తానామ్ అసారం భావితం భవేత్ ।
దర్శయత్యంతరాత్మా తం దివా రూపమివాంశుమాన్ ॥ 48
బ్రాహ్మణశ్రేష్ఠా! ఉత్తముడు అంతటా నమస్కరింపబడుతూనే ఉంటాడు. అహంకారం గల మూర్ఖులు ఆలోచించే విషయాలన్నీ సారరహితంగానే ఉంటాయి. సూర్యుడు పగటిపూట రూపాన్ని కనిపింపచేసినట్టు వాళ్ళ అంతరాత్మ వాళ్ళ అసలు స్వరూపాన్ని వ్యక్తం చేస్తుంది. (48)
న లోకే రాజతే మూర్ఖః కేవలాత్మప్రశంసయా ।
అపి చేహ శ్రియా హీనః కృతవిద్యః ప్రకాశతే ॥ 49
మూర్ఖుడు కేవలం ఆత్మప్రశంసతో లోకంలో కీర్తిపొందడు. విద్వాంసుడు సంపద, సౌందర్యం లేకపోయినా జగత్తులో కీర్తిప్రతిష్ఠలు పొందుతాడు. (49)
అబ్రువన్ కస్యచిన్నిందామ్ ఆత్మపూజామవర్ణయన్ ।
న కశ్చిద్ గుణసంపన్నః ప్రకాశో భువి దృశ్యతే ॥ 50
ఎవ్వరినీ నిందించకుండా ఆత్మప్రశంస చేసుకోకుండా కేవలం సద్గుణాలు మాత్రమే కలవాడెవడూ ఈ భూమిమీద కన్పించడు.
పరనిందను, ఆత్మప్రశంసను వదలనివాడు ఎంతగుణవంతుడైనా ఈ లోకంలో గౌరవం పొందటం కన్పించదు. (50)
వికర్మణా తప్యమానః పాపాద్ విపరిముచ్యతే ।
న తత్ కుర్యాం పునరితి ద్వితీయాత్ పరిముచ్యతే ॥ 51
మానవుడు పాపంచేసినందుకు నిండుమనస్సుతో పశ్చాత్తాపపడితే పాపవిముక్తుడు అవుతాడు. 'ఇకముందు మళ్ళీ ఇలాంటిపనిని చేయను' అని గట్టిగా నిశ్చయించుకొంటే ఆ పాపదోషం అసలు అంటదు. (51)
కర్మణా యేన తేనేహ పాపాద్ ద్విజవరోత్తమ ।
ఏవం శ్రుతిరియం బ్రహ్మన్ ధర్మేషు ప్రతిదృశ్యతే ॥ 52
బ్రాహ్మణోత్తమా! శాస్త్ర విధించిన జపతపోయజ్ఞాదులలో దేన్ని అయినా నిష్కామంగా చేస్తే పాపవిముక్తి కలుగుతుంది. ధార్మిక విషయాలను గురించి ఇలా చెప్పినట్లు వేదాల్లో కనిపిస్తుంది. (52)
వి॥సం॥ జపతపస్తీర్థగమనాదికమైన ఏదో ఒక దానితో పాపవిముక్తి లభించవచ్చు. అయితే ధర్మవిషయంలో మాత్రమే. జ్ఞానోత్పత్తికి శ్రవణాది మార్గమొక్కటే. "నాన్యః పన్థాః విద్యతేఽయనాయఆ" అని శ్రుతి వచనం. (నీల)
పాపాన్యబుద్ధ్వేహ పురా కృతాని
ప్రాగ్ ధర్మశీలోఽపి విహంతి పశ్చాత్ ।
ధర్మో రాజన్ నుదతే పూరుషాణాం
యత్ కుర్వతే పాపమిహ ప్రమాదాత్ ॥ 53
ధర్మాత్ముడైనా మొదట తెలియక పాపం చేసి ఉంటే తరువాత నిష్కామంగా మంచిపనిచేస్తే ఆ పాపం పోగొట్టుకొంటాడు. ధర్మజ్ఞా! పొరపాటున అతడు చేసిన పాపాల నుంచి ధర్మమే అతని పాపాలను పోగొట్టుతుంది. (53)
పాపం కృత్వా హి మన్యేత నాహమస్మీతి పూరుషః ।
తం తు దేవాః ప్రపశ్యంతి స్వస్యైవాంతరపూరుషః ॥ 54
మానవుడు పాపం చేసి కూడా నేను పాపాత్ముడను కాను అని అనుకోకూడదు. అతని పాపాన్ని దేవతలు, అతని హృదయంలో ఉండే పరమాత్మ చూస్తుంటారు. (54)
చికీర్షేదేవ కల్యాణం శ్రద్ధధానోఽనసూయకః ।
వసనస్యేవ ఛిద్రాణి సాధూనాం వివృణోతి యః ॥ 55
(అనశ్యన్నాత్మనో దోషాన్ స పాపః ప్రేత్య నశ్యతి ॥)
కార్యదీక్షకలవాడు ఇతరుల తప్పులను చూడకుండ మంచిపనులే చేయగోరాలి. తన తప్పులను గమనించకుండా ఇతరుల దోషాలను చూసేవాడు, మంచివాళ్ళ పొరపాట్లను వస్త్రానికున్న రంధ్రాలలాగా ఎత్తి చూపే పాపాత్ముడు మరణించిన తరువాత పరలోకంలో బాధలపాలవుతారు. (55)
పాపం చేత్ పురుషః కృత్వా కల్యాణమభిపద్యతే ।
ముచ్యతే సర్వపాపేభ్యః మహాభ్రేణేవ చంద్రమాః ॥ 56
మానవుడు మొదట పాపం చేసినా తారువాత మంచిపనులు చేస్తే పెద్దమేఘం చాటు నుండి ఇవతలకు వచ్చిన చంద్రునిలాగా సర్వపాపాలనుంచి విముక్తుడు అవుతాడు. (56)
యథాఽఽదిత్యః సముద్యన్ వై తమః పూర్వం వ్యపోహతి ।
ఏవం కల్యాణమాతిష్ఠన్ సర్వపాపైః ప్రముచ్యతే ॥ 57
సూర్యుడు ఉదయించి అంతకు ముందు ఉన్న చీకటిని పోగొట్టినట్లు నిష్కామంగా మంచిపనులు చేసేవాడు అన్ని పాపాల నుంచి విముక్తుడు అవుతాడు. (57)
పాపానాం విద్ధ్యధిష్ఠానం లోభమేవ ద్విజోత్తమ ।
లుబ్ధాః పాపం వ్యవస్యంతి నరా నాతిబహుశ్రుతాః ॥ 58
బ్రాహ్మణోత్తమా! పాపాలకు నివాసస్థానం లోభమే అని తెలుసుకో. బాగా శాస్త్రజ్ఞానం లేని లోభులే పాపకార్యాలు చేయటానికి ప్రయత్నిస్తుంటారు. (58)
అధర్మా ధర్మరూపేణ తృణైః కూపా ఇవావృతాః ।
తేషాం దమః పవిత్రాణి ప్రలాపా ధర్మసంశ్రితాః ।
సర్వం హి విద్యతే తేషు శిష్టాచారః సుదుర్లభః ॥ 59
గడ్డితో మూసుకుపోయిన బావులలాగా ధర్మం ముసుగులో అధర్మాలు కప్పుకొని ఉంటాయి. ధర్మాత్ములుగా కనిపించే ఈ అధార్మికులలో ఇంద్రియనిగ్రహం, ముందు చెపుతున్న పవిత్రములు, ధర్మాన్ని బోధించే మాటలు అన్నీ ఉంటాయి. కాని శిష్టాచారం మాత్రం దుర్లభం. (59)
మార్కండేయ ఉవాచ
స తు విప్రో మహాప్రాజ్ఞః ధర్మవ్యాధమపృచ్ఛత ।
శిష్టాచారం కథమహం విద్యామితి నరోత్తమ ॥ 60
మార్కండేయుడు ఇలా అన్నాడు - ధర్మజా! తరువాత బుద్ధిమంతుడైన ఆ బ్రాహ్మణుడు 'మానవోత్తమా! నాకు శిష్టాచారం ఎలా తెలుస్తుంది?' అని అడిగాడు. (60)
ఏతదిచ్ఛామి భద్రం తే శ్రోతుం ధర్మభృతాం వర ।
త్వత్తో మహామతే వ్యాధ తద్ బ్రవీహి యథాతథమ్ ॥ 61
ధర్మసంపన్నులలో శ్రేష్ఠుడా! మహామతీ! నీకు మేలు కలుగుగాక. ఇవన్నీ నీవు చెపుతుంటే వినాలి అని ఉంది. వాటిని ఉన్నవి ఉన్నట్లుగా చెప్పవలసింది. (61)
వ్యాధ ఉవాచ
యజ్ఞో దానం తపో వేదాః సత్యం చ ద్విజసత్తమ ।
పంచైతాని పవిత్రాణి శిష్టాచారేషు సర్వదా ॥ 62
బ్రహ్మణశ్రేష్ఠా! యజ్ఞం, దానం, తపస్సు, వేదాధ్యయనం, నిజం చెప్పటం - ఈ ఐదూ శిష్టుల ఆచారవ్యవహారాల్లో ఎప్పుడూ పవిత్రములని చెప్పబడతాయి. (62)
కామక్రోధౌ వశే కృత్వా దంభం లోభమనార్జవమ్ ।
ధర్మమిత్యేవ సంతుష్టాః తే శిష్టాః శిష్టసమ్మతాః ॥ 63
కామక్రోధాలను, దంభాన్ని, లోభాన్ని, కుటిలత్వాన్ని వశం చేసుకొని ధర్మాచరణమే చాలు ననుకొని సంతోషించేవారు సదాచారసంపన్నులకు ఆదరపాత్రులైన వారు శిష్టులు. (63)
న తేషాం విద్యతేఽవృత్తం యజ్ఞస్వాధ్యాయశీలినామ్ ।
ఆచారపాలనం చైవ ద్వితీయం శిష్టలక్షణమ్ ॥ 64
నిరంతరం యజ్ఞస్వాధ్యాయపరులైన వారికి స్వేచ్ఛాప్రవర్తనం ఉండదు. సదాచార రక్షణం శిష్టుల రెండోలక్షణం. (64)
గురుశుశ్రూషణం సత్యమ్ అక్రోధో దానమేవ చ ।
ఏతచ్చతుష్టయం బ్రహ్మన్ శిష్టాచారేషు నిత్యదా ॥ 65
బ్రాహ్మణా! శిష్టాచారాల్లో గురుశుశ్రూష, సత్యం చెప్పటం, కోపం లేకపోవటం, దానం చేయటం అనే నాలుగూ ఎప్పుడూ ఉంటాయి. (65)
శిష్టాచారే మనః కృత్వా ప్రతిష్ఠాప్య చ సర్వశః ।
యామయం లభతే వృత్తిం సా న శక్యా హ్యతోఽన్యథా ॥ 66
శిష్టాచారాన్ని మనస్సులో సుస్థిరంగా నిలిపి నేను స్వీకరించే ఈ వృత్తి గురుశుశ్రూషాదులు లేనిచో ఎన్నటికీ రాదు. (66)
వేదస్యోపనిషత్ సత్యం సత్యస్యోపనిషద్ దమః ।
దమస్యోపనిషత్ త్యాగః శిష్టాచారేషు నిత్యదా ॥ 67
వేదసారం సత్యం. సత్యసారం ఇంద్రియాలను వశంలో ఉంచుకొనటం. ఇంద్రియసంయమనానికి సారం త్యాగం. ఈ త్యాగం శిష్టాచారంలో ఎప్పుడూ ఉంటుంది. (67)
యే తు ధర్మానసూయంతే బుద్ధిమోహాన్వితా నరాః ।
అపథా గచ్ఛతాం తేషామ్ అనుయాతా చ పీడ్యతే ॥ 68
బుద్ధిమోహంతో (అజ్ఞానంతో) గూడిన అపమార్గంలో వెళ్ళేవాళ్ళు, అలా పెడత్రోవలో వెళ్ళే వారిని అనుసరించి వెళ్ళే వాళ్ళు కష్టాలపాలవుతారు. (68)
యే తు శిష్టాః సునియతాః శ్రుతిత్యాగపరాయణాః ।
ధర్మపంథానమారూఢాః సత్యధర్మపరాయణాః ॥ 69
శిష్టులు ఎల్లప్పుడు ఉత్తమాచారపరాయణులు, వేదాధ్యయన పరులై, త్యాగతత్పరులై, ధర్మమార్గాన్ని అధిరోహించి; సత్యాన్ని, ధర్మాన్ని ఆశ్రయించి ఉంటారు. (69)
నియచ్ఛంతి పరాం బుద్ధిం శిష్టాచారాన్వితా జనాః ।
ఉపాధ్యాయమతే యుక్తాః స్థిత్యా ధర్మార్థదర్శినః ॥ 70
శిష్టాచారపరాయణులైన సజ్జనులు తమ ఉత్తమబుద్ధిని అదుపులో పెట్టుకొంటారు. గురువుల సిద్ధాంతాలను అనుసరిస్తారు. ధర్మార్థాల మీద దృష్టి నిలుపుతారు. (70)
నాస్తికాన్ భిన్నమర్యాదాన్ క్రూరాన్ పాపమతౌ స్థితాన్ ।
త్యజ తాన్ జ్ఞానమాశ్రిత్య ధార్మికానుపసేవ్య చ ॥ 71
కాబట్టి నీవు నాస్తికులను, శిష్టాచారాన్ని నాశనం చేసేవారిని, క్రూరులను, పాపాలోచనలు చేసేవారిని వదిలిపెట్టు. జ్ఞానాన్ని ఆశ్రయించి ధార్మికులను సేవించు. (71)
కామలోభగ్రహాకీర్ణాం పంచేంద్రియజలాం నదీమ్ ।
నావం ధృతిమయీం కృత్వా జన్మదుర్గాణి సంతర ॥ 72
కామం, లోభం అనే మొసళ్ళతో నిండి పంచేంద్రియాల వల్ల గలిగే విషయాసక్తి అనే నీళ్ళు ఉన్న దేహమనే నదిని ధైర్యాన్ని నావగా చేసుకొని జన్మాదిక్లేశాలనే దుర్గమస్థానాలను దాటి వెళ్ళు. (72)
(అసలీ దేహం ఒకనది. దీనిలో కామ, లోభాలనే మొసళ్లు చాలా ఉన్నాయి. ఇంద్రియాల వల్ల కలిగే విషయాసక్తియే ఇందులో నీళ్లు- ఈనదిని దాటి పోవాలంటే నిశ్చలమైన ధైర్యం అనే నావను ఎక్కాలి. అప్పుడే జన్మలనే దుర్గాలను తరిస్తారు - అలా చెయ్యి.)
క్రమేణ సంచితో ధర్మః బుద్ధియోగమయో మహాన్ ।
శిష్టాచారే భవేత్ సాధుః రాగః శుక్లేవ వాససి ॥ 73
తెల్లని వస్త్రం మీద ఏ రంగు అయినా స్పష్టంగా కనపడుతుంది. అలాగే శిష్టాచారం గల వ్యక్తి క్రమక్రమంగా సంపాదించుకొనే ధర్మం బుద్ధియోగమయమై చక్కగా వెలుగొందుతుంది. (73)
అహింసా సత్యవచనం సర్వభూతహితం పరమ్ ।
అహింసా పరమో ధర్మః స చ సత్యే ప్రతిష్ఠితః ।
సత్యే కృత్వా ప్రతిష్ఠాం తు ప్రవర్తంతే ప్రవృత్తయః ॥ 74
అహింస, నిజం, చెప్పటం అనేవి సర్వప్రాణులకు చాల మేలు కలిగిస్తాయి. అహింస అన్నిటిని మించిన ఉత్తమధర్మం. అది సత్యం మీదనే నిలిచి ఉంటుంది. ఉత్తముల సత్కార్యాలన్నీ సత్యం మీదనే నడుస్తాయి. (74)
సత్యనేవ గరీయస్తు శిష్టాచారనిషేవితమ్ ।
ఆచారశ్చ సతాం ధర్మః సంతశ్చాచారలక్షణాః ॥ 75
కాబట్టి శిష్టులు ఆచరించే సత్యమే చాలా గొప్పది. సదాచారం సత్పురుషుల ధర్మం. సదాచారంతోనే సజ్జనులను గుర్తించవచ్చు (సదాచారమే సజ్జనలక్షణం). (75)
యో యథాప్రకృతిర్జంతుః స స్వాం ప్రకృతిమశ్నుతే ।
పాపాత్మా క్రోధకామాదీన్ దోషానాప్నోత్యనాత్మవాన్ ॥ 76
ఏ ప్రాణికి ఏది సహజస్వభావమో ఆ ప్రాణి దాన్నే పొందుతాడు. మనస్సును స్వాధీనంలో ఉంచుకోలేని పాపాత్ముడు కోపం, కామం మొదలైన దోషాలను పొందుతాడు. (76)
ఆరంభో న్యాయయుక్తో యః స హి ధర్మ ఇతి స్మృతః ।
అనాచారస్త్వధర్మేతి ఏతచ్ఛిష్టానుశాసనమ్ ॥ 77
న్యాయంతో గూడిన కార్యారంభమే ధర్మమని చెప్పబడింది. అనాచారమే అధర్మం అని శిష్టుల ఉపదేశం. (7)
అక్రుద్ధ్యంతోఽనసూయంతః నిరహంకారమత్సరాః ।
ఋజవః శమసంపన్నాః శిష్టాచారా భవంతి తే ॥ 78
కోపించని వారు, ఇతరుల తప్పులను చూడనివారు, అహంకారం, ఈర్ష్యలేనివారు, ఋజుప్రవర్తన, మనోనిగ్రహం బాగా ఉన్నవారు శిష్టాచారులు అవుతారు. (78)
త్రైవిద్యవృద్ధాః శుచయః వృత్తవంతో మనస్వినః ।
గురుశుశ్రూషవో దాంతాః శిష్టాచారా భవంత్యుత ॥ 79
మూడువేదాలు అధ్యయనం చేసినవారిలో శ్రేష్ఠులు, పవిత్రులు, సదాచారసంపన్నులు, దృఢమైన మనస్సు గలవారు. గురుసేవ చేసినవారు, ఇంద్రియాలను జయించినవారు శిష్టాచారులు అవుతారు. (79)
తేషామహీనసత్త్వానాం దుష్కరాచారకర్మణామ్ ।
స్వైః కర్మభిః సత్కృతానాం ఘోరత్వం సంప్రణశ్యతి ॥ 80
సత్త్వగుణసంపన్నులు; ఇతరులకు కష్టమైన ఆచారాలు, సత్కర్మలూ చేసేవారు; తమ మంచిపనులచేత లోకంలో గౌరవం పొందేవారు చేసిన పాపకర్మ నశించిపోతుంది. (80)
తం సదాచారమాశ్చర్యం పురాణం శాశ్వతం ధ్రువమ్ ।
ధర్మం ధర్మేణ పశ్యంతః స్వర్గం యాంతి మనీషిణః ॥ 81
సజ్జనులు ఆచరించినది. అనాది, సనాతనం, నిత్యం, అసామాన్యం అయిన ధర్మాన్ని ధర్మదృష్టితోనే చూసే విద్వాంసులు స్వర్గానికి వెళ్తారు. (81)
ఆస్తికా మానహీనాశ్చ ద్విజాతిజనపూజకాః ।
శ్రుతవృత్తోపసంపన్నాః సంతః స్వర్గనివాసినః ॥ 82
ఆస్తికులు, గర్వం లేనివారు, బ్రాహ్మణులను గౌరవించే వారు, విద్వాంసులు, సదాచారసంపన్నులు అయిన సజ్జనులు తుదకు స్వర్గనివాసులు అవుతారు. (82)
వేదోక్తః పరమో ధర్మః ధర్మశాస్త్రేషు చాపరః ।
శిష్టాచారశ్చ శిష్టానాం త్రివిధం ధర్మలక్షణమ్ ।
వేదం చెప్పిన ధర్మం ఉత్తమం. ధర్మశాస్త్రాలలో చెప్పినది రెండోది. శిష్టుల సదాచారం మూడోది అని ధర్మలక్షణం మూడు విధాలు.
పారణం చాపి విద్యానాం తీర్థానామవగాహనమ్ ॥ 83
క్షమా సత్యార్జవం శౌచం సతామాచారదర్శనమ్ ।
విద్యలను అధ్యయనం చేయటం, పుణ్యతీర్థాలలో స్నానం, ఓర్పు, సత్యం, కపటం లేకపోవటం, పవిత్రత అనేవి ఉత్తముల ఆచారానికి నిదర్శనం. (83 1/2)
వి॥సం॥ వేదోక్తమైన అగ్ని హోత్రాదికం, ధర్మశాస్త్రోక్తమైన అష్టకశ్రాద్ధాదికం, శిష్టాచారరూపమైన హోళకాదికం ప్రమాణం. "సతాం హి సందేహపదేషు వస్తుషు ప్రమాణ మంతః కరణ ప్రవృత్తయః "(కాళిదాసు) అంటూ శిష్టతుష్టిని కూడా ప్రమాణంగా భావిస్తారు కొందరు. కానీ అది కూడా శిష్టాచారంలోనే చేరిపోతుంది కాబట్టి ప్రమాణాలు మూడే. (నీల)
సర్వభూతదయావంతః అహింసానిరతాః సదా ॥ 84
పరుషం చ న భాషంతే సదా సంతో ద్విజప్రియాః ।
సర్వభూతదయ కల్గినవారు ఎప్పుడూ అహింసనే పాటిస్తూ ఉంటారు. ద్విజులపై ప్రీతితో ఎన్నడూ పరుషంగా మాట్లాడరు. (84 1/2)
శుభానామశుభానాం చ కర్మణాం ఫలసంచయే ॥ 85
విపాకమభిజానంతి తే శిష్టాః శిష్టసమ్మతాః ।
పుణ్యపాప కర్మలయొక్క ఫలాల పరిణామాన్ని శిష్టులు గ్రహిస్తారు. పుణ్యఫలమైన సుఖాన్ని కోరరు. పాపఫలమైన దుఃఖాన్ని సహిస్తారు. అట్టివారే శిష్టులు. (85 1/2)
న్యాయోపేతా గుణోపేతాః సర్వలోకహితైషిణః ॥ 86
సంతః స్వర్గజితః శుక్లాః సన్నివిష్టాశ్చ సత్పథే ।
న్యాయపరాయణులు, సద్గుణసంపన్నులు, అందరిమేలు కోరువారు, శుద్ధులు హింస చేయక, మంచిత్రోవలో నడిచే సత్పురుషులు స్వర్గాన్ని జయించినవారు. (86 1/2)
దాతారః సంవిభక్తారః దీనానుగ్రహకారిణః ॥ 87
సర్వపూజ్యాః శ్రుతధనాః తథైవ చ తపస్వినః ।
సర్వభూతదయావంతః తే శిష్టాః శిష్టసమ్మతాః ॥ 88
1) దాతలు, 2) తమకుటుంబంలోని వారికి వస్తువులను సమానంగా పంచి తక్కింది తాము ఉపయోగించే వారు, 3) దీనుల మీద దయచూపేవారు, 4) అందరి ఆదరాన్ని పొందేవారు, 5) విద్యయే ధనంగా గలవారు, 6) స్వధర్మానుసారులు, 7) సర్వప్రాణుల యందు దయచూపేవారు, 8) ఇతర శిష్టులకు ఇష్టమైనవారే శిష్టులు. (87,88)
దానశిష్టాః సుఖాన్ లోకాన్ ఆప్నువంతీహ చ శ్రియమ్ ।
పీడయా చ కలత్రస్య భృత్యానాం చ సమాహితాః ॥ 89
అతిశక్త్యా ప్రయచ్ఛంతి సంతః సద్భిః సమాగతాః ।
లోకయాత్రాం చ పశ్యంతో ధర్మమాత్మహితాని చ ॥ 90
దానం చేసిన తరువాత మిగిలిన దానిని ఉపయోగించేవారు ఈ లోకంలో సుఖసంపదలను, పరలోకంలో సుఖాన్ని పొందుతారు. ఉత్తములైనవారు పవిత్రవ్యక్తుల వద్దకు వచ్చి ఏదైనా అడిగితే వారు కుటుంబంలోని భార్యాదులకు బాధకలిగినా మనస్సు స్థిరపరచుకొని తమశక్తిని మించి దానం చేస్తారు. న్యాయపూర్వకంగా జీవితాన్ని గడుపుకోవటమూ, ధర్మాన్ని రక్షించటమూ తమకు మేలు కలగటమూ ఎలాగా? అని వారు ఆలోచిస్తారు. (89, 90)
ఏవం సంతో వర్తమానాస్త్వేధంతే శాశ్వతీః సమాః ।
అహింసా సత్యవచనమ్ ఆనృశంస్యమథార్జవమ్ ॥ 91
అద్రోహో నాభిమానశ్చ హ్రీస్తితిక్షా దమః శమః ।
ధీమంతో ధృతిమంతశ్చ భూతానామనుకంపకాః ॥ 92
అకామద్వేషసంయుక్తాః తే సంతో లోకసాక్షిణః ।
ఈవిధంగా ఉండే సజ్జనులు చాలాకాలం అభివృద్ధి నందుతారు. అహింస ఆచరించే వారు, సత్యాన్ని చెప్పేవారు, మార్దవం, ఋజుప్రవర్తన కలిగి కీడు చేయనివారు - అహంకరించకపోవటం, లజ్జ, ఓర్పు, దమం, శమం, కలిగినవారు, బుద్ధిమంతులు, సంతుష్టులు, ప్రాణుల మీద దయచూపేవారు, కామం, ద్వేషం లేనివారు - ఇటువంటి సజ్జనులు జనానికి ప్రమాణంగా ఉంటారు. (91, 92 1/2)
త్రీణ్యేవ తు పదాన్యాహుః సతాం వ్రతమనుత్తమమ్ ॥ 93
న చైవ ద్రుహ్యేద్ దద్యాచ్చ సత్యం చైవ సదా వదేత్ ।
'ఎవరికిని ద్రోహం చేయరాదు; దానం చేయాలి; ఎల్లప్పుడు సత్యాన్నే చెప్పాలి.' అని సజ్జనుల నియమాన్నిగుర్తుచేస్తూ పెద్దలు మూడు విషయాలనే చెప్పారు. (93)
సర్వత్ర చ దయావంతః సంతః కరుణవేదినః ॥ 94
గచ్ఛంతీహ సుసంతుష్టా ధర్మపంథానముత్తమమ్ ।
శిష్టాచారా మహాత్మానః యేషాం ధర్మః సునిశ్చతః ॥ 95
సర్వవిషయాలలో దయగలవారు, కరుణానుభూతి గల సజ్జనులు లోకంలో సంతృప్తితో ఉత్తమ ధర్మమార్గంలో పయనిస్తారు. తమ యీ ధర్మాలను దృఢంగా నిశ్చయించుకొనిన మహాత్ములే శిష్టాచారవంతులు. (94,95)
అనసూయా క్షమా శాంతిః సంతోషః ప్రియవాదితా ।
కామక్రోధపరిత్యాగః శిష్టాచారనిషేవణమ్ ॥ 96
కర్మ చ శ్రుతసంపన్నం సతాం మార్గమనుత్తమమ్ ।
అసూయ లేకుండుట, ఓర్పు, శాంతి, సంతోషం, ప్రేమగా మాట్లాడటం, కోరికలను కోపాన్ని వదలటం శిష్టాచారాన్ని అనుసరించటం, శాస్త్రానుసారం తనపని చేయటం అనేవి సజ్జనుల శ్రేష్టామార్గం. (96 1/2)
శిష్టాచారం నిషేవంతే నిత్యం ధర్మమనువ్రతాః ॥ 97
ప్రజ్ఞాప్రాసాదమారుహ్య ముచ్యంతే మహతో భయాత్ ।
ప్రేక్షంతో లోకవృత్తాని వివిధాను ద్విజోత్తమ ॥ 98
అతిపుణ్యాని పాపాని తాని ద్విజవరోత్తమ ।
ద్విజోత్తమా! శిష్టాచారాన్ని సేవిమ్చే ధర్మాత్ములు ప్రజ్ఞారూపమైన సౌధాన్ని ఆరోహించి, నానావిధాలైన లోకప్రవృత్తులను అధికమైన పుణ్యపాపాలను సమీక్షిస్తూ సంసార భయవిముక్తులవుతారు. (97, 98 1/2)
ఏతత్ తే సర్వమాఖ్యాతం యథాప్రజ్ఞం యథాశ్రుతమ్ ।
శిష్టాచారగుణం బ్రహ్మన్ పురస్కృత్య ద్విజర్షభ ॥ 99
బ్రాహ్మణశ్రేష్ఠా! నేను తెలుసుకొన్న, నాకు తెలిసిన శిష్టాచార సుగుణాలను అన్నింటినీ నీకు చెప్పాను. (99)
ఇతి శ్రీమహాభారతమున వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి బ్రాహ్మణవ్యాధసంవాదే సప్తాధికద్విశతతమోఽధ్యాయః ॥ 207 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున బ్రాహ్మణధర్మవ్యాధసంవాదమను రెండువందల ఏడవ అధ్యాయము. (207)
(దాక్షిణాత్య అధికపాఠం 1 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 100 1/2 శ్లోకాలు)