208. రెండు వందల ఎనిమిదవ అధ్యాయము
హింసాహింసల నిర్ణయము.
మార్కండేయ ఉవాచ
స తు విప్రమథోవాచ ధర్మవ్యాధో యుధిష్ఠిర ।
యదహమాచరే కర్మ ఘోరమేతదసంశయమ్ ॥ 1
మార్కండేయుడు అన్నాడు - ధర్మరాజా! అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు. 'ఈ మాంసం అమ్మటం అనే పని చాలా ఘోరమైనదనటంలో సందేహం లేదు. (1)
విధిస్తు బలవాన్ బ్రహ్మన్ దుస్తరం హి పురా కృతమ్ ।
పురా కృతస్య పాపస్య కర్మదోషో భవత్యయమ్ ॥ 2
దోషస్యైతస్య వై బ్రహ్మన్ విఘాతే యత్నవానహమ్ ।
కౌశికా! విధి బలీయమైనది. పూర్వజన్మలో చేసిన కర్మఫలాన్ని అతిక్రమించటం చాలా కష్టం. ఈ వ్యాధజన్మ నా పూర్వజన్మలో చేసిన పాపఫలం. ఈ దోషాన్ని పోగొట్టుకొనటానికి ప్రయత్నం చేస్తున్నాను. (2 1/2)
విధినా హి హతే పూర్వం నిమిత్తం ఘాతకో భవేత్ ॥ 3
ఒకప్రాణికి బ్రహ్మ పూర్వమే మృత్యువును నిర్ణయిస్తాడు. అప్పుడు కసాయివాడు ఆ జంతువు మరణానికి కారణం అవుతాడు. (3)
నిమిత్తభూతా హి వయం కర్మణోఽస్య ద్విజోత్తమ ।
యేషాం హతానాం మాంసాని విక్రీణామీహ వై ద్విజ ॥ 4
తేషామపి భవేద్ ధర్మః ఉపయోగేన భక్షణే ।
దేవతాతిథిభృత్యానాం పితౄణాం చాపి పూజనమ్ ॥ 5
ఈ పనిలో మానవులు నిమిత్తమాత్రులు. ఇతరులు చంపిన వాటి మాంసాన్నే నేను ఇక్కడ అమ్ముతున్నాను.
బ్రతికి ఉన్నప్పుడు ఆ జంతువులను యాగంలో వినియోగించి శేషం భక్షిస్తే ధర్మమే అవుతుంది. మాంసభక్షణం మాత్రం ధర్మం కాదు. దేవతలను, పితృదేవతలను, అతిథులను, తాను పోషింపదగిన వారిని పూజించటం, ఆదరించటం ధర్మం. (4,5)
ఓషధ్యో వీరుధశ్చైవ పశవో మృగపక్షిణః ।
అనాదిభూతా భూతానామ్ ఇత్యపి శ్రూయతే శ్రుతిః ॥ 6
వరి, అరటి మొదలైనవి, తీగెలు, పశువులు, మృగాలు, పక్షులు - ఇలాంటివి అన్నీ ప్రాణులన్నింటికి అనాదికాలం నుంచి ఉపయోగపడేవి అని వేద మంత్రాలు చెపుతున్నాయి కదా. (6)
ఆత్మమాంసప్రసాదేన శిబిరౌశీనరో నృపః ।
స్వర్గం సుదుర్గమం ప్రాప్తః క్షమావాన్ ద్విజసత్తమ ॥ 7
ద్విజసత్తమా! పూర్వకాలంలో ఉశీనరుని పుత్రుడు, సహనశీలి యైన శిబి ఆకలిగొన్న డేగకు పావురానికి బదులుగా తన మాంసాన్ని ఇచ్చి, దాని మహిమ వల్ల పరమదుర్లభమైన స్వర్గానికి వెళ్లాడు. (7)
స్వధర్మ ఇతి కృత్వా తు న త్యజామి ద్విజోత్తమ ।
పురా కృతమితి జ్ఞాత్వా జీవామ్యేతేన కర్మణా ॥ 8
ఈ మాంసవిక్రయం స్వధర్మం కాబట్టి వదలను. మాపూర్వుల బ్రతుకుతెరువు ఇదే కాబట్టి దీనితో నాజీవితాన్ని వెళ్ళదీస్తున్నాము. (8)
స్వకర్మ త్యజతో బ్రహ్మన్ అధర్మ ఇహ దృశ్యతే ।
స్వకర్మనిరతో యస్తు ధర్మః స ఇతి నిశ్చయః ॥ 9
స్వధర్మమైన పనిని వదలివేసినవానిని అధర్ముడని ఈ లోకంలో అంటారు. కర్తవ్య తత్పరుడే ధర్మాత్ముడని నిర్ణయం. (9)
పూర్వం హి విహితం కర్మ దేహినం న విముంచతి ।
ధాత్రా విధిరయం దృష్టః బహుధా కర్మనిర్ణయే ॥ 10
పూర్వజన్మలో చేసిన కర్మ జీవుని వదలదు. కర్మ నిర్ణయాన్ని అనేక విధాలుగా చేయటంలో బ్రహ్మ ఈ విధానాన్ని దృష్టిలో ఉంచుకొన్నాడు. (10)
ద్రష్టవ్యా తు భవేత్ ప్రజ్ఞా క్రూరే కర్మణి వర్తతా ।
కథం కర్మ శుభం కుర్యాం కథం ముచ్యే పరాభవాత్ ॥ 11
క్రూరకర్మలో నిమగ్నమైనవాడు "నేను ఏ మంచిపనిని ఎలా చేయాలి? ఈ పాపకర్మ నుండి ఎలా విముక్తుడను అవుతాను?" అని ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉండాలి. (11)
కర్మణస్తస్య ఘోరస్య బహుధా నిర్ణయో భవేత్ ।
దానే చ సత్యవాక్యే చ గురుశుశ్రూషణే తథా ॥ 12
ద్విజాతిపూజనే చాహం ధర్మే చ నిరతః సదా ।
అభిమానాతివాదాభ్యాం నివృత్తోఽస్మి ద్విజోత్తమ ॥ 13
ఈ విధంగా చాలాసార్లు ఆలోచించటం వల్ల ఆ ఘోరకర్మ నుంచి విముక్తి పొందటానికి ఒక మంచి ఉపాయం నిశ్చితమవుతుంది. దానం, నిజం చెప్పటం, గురుశుశ్రూష, బ్రాహ్మణులను గౌరవించటం, ధర్మాచరణతత్పరత, అతివాదానికీ అభిమానానికీ దూరంగా ఉండటమూ, నాకు అలవాటు. (12,13)
కృషిం సాధ్వితి మన్యంతే తత్ర హింసా పరా స్మృతా ।
కర్షంతో లాంగలైః పుంసః ఘ్నంతి భూమిశయాన్ బహూన్ ।
జీవా నన్యాంశ్చ బహుశః తత్ర కిం ప్రతిభాతి తే ॥ 14
కొంతమంది వ్యవసాయం మంచిది అంటారు. కాని దానిలోనూ హింస ఉన్నది. నాగలితో భూమి దున్నే వారు భూమిలో ఉన్న అనేక జీవులను చంపుతున్నారు. ఈ విషయంలో నీకు ఏమనిపిస్తున్నది? (14)
ధాన్య జీజాని యాన్యాహుః వ్రీహ్యాదీని ద్విజోత్తమ ।
సర్వాణ్యేతాని జీవాని తత్ర కిం ప్రతిభాతి తే ॥ 15
ఆహారానికి అవసరమైన ధాన్యబీజాలు అన్నీ జీవం ఉన్నవే. ఈ విషయంలో నీకు ఏమనిపిస్తుంది? (15)
అధ్యాక్రమ్య పశూంశ్చాపి ఘ్నంతి వై భక్షయంతి చ ।
వృక్షాంస్తథౌషధీశ్చాపి ఛిందంతి పురుషా ద్విజ ॥ 16
జీవా హి బహవో బ్రహ్మన్ వృక్షేషు చ ఫలేషు చ ।
ఉదకే బహవశ్చాపి తత్ర కిం ప్రతిభాతి తే ॥ 17
బ్రాహ్మణోత్తమా! కొంతమంది మనుష్యులు పశువులను పట్టుకొని చంపి తింటారు. అలాగే చెట్లను, పంటలను కోస్తారు. వృక్షాల్లో, పంటలలో, నీళ్ళల్లో అనేక జీవులు ఉన్నవి గదా! ఆ విషయంలో నీకు ఏమి అనిపిస్తున్నది? (16,17)
సర్వం వ్యాప్తమిదం బ్రహ్మన్ ప్రాణిభిః ప్రాణిజీవనైః ।
మత్స్యాన్ గ్రసంతే మత్స్యాశ్చ తత్ర కిం ప్రతిభాతి తే ॥ 18
జీవులను తిని జీవించే ప్రాణులతో ఈ జగత్తు అంతా వ్యాప్తమై ఉన్నది. చిన్నచేపను తిని పెద్దచేప బ్రతుకుతున్నది. ఆ విషయంలో నీకు ఏమి తోస్తున్నది? (18)
సత్వైః సత్త్వాని జీవంతి బహుధా ద్విజసత్తమ ।
ప్రాణినోఽన్యోన్యభక్షాశ్చ తత్ర కిం ప్రతిభాతి తే ॥ 19
ద్విజోత్తమా! అనేకరీతులుగా జీవులు జీవులతోనే ప్రాణధారణ చేస్తున్నవి. ప్రాణులు ఒకదానిని ఇంకొకటి తింటున్నవి. ఆ విషయంలో నీకు ఏమి అనిపిస్తున్నది. (19)
చంక్రమ్యమాణా జీవాంశ్చ ధరణీసంశ్రితాన్ బహూన్ ।
పద్భ్యాం ఘ్నంతి నరా విప్ర తత్ర కిం ప్రతిభాతి తే ॥ 20
మానవులు భూమిమీద సంచరించే అనేక ప్రాణులను అనాలోచితంగానే కాళ్ళతో తొక్కి చంపుతున్నారు. అది నీకు ఎలా అనిపిస్తున్నది? (20)
ఉపవిష్టాః శయనాశ్చ ఘ్నంతి జీవాననేకశః ।
జ్ఞానవిజ్ఞానవంతశ్చ తత్ర కిం ప్రతిభాతి తే ॥ 21
విజ్ఞానులు మహాజ్ఞానులు కూడా కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు అనుకోకుండా అనేకజీవులను అనేకరీతులుగా చంపుతున్నారు. అది చూస్తే నీకు ఏమనిపిస్తున్నది? (21)
జీవైర్గ్రస్తమిదం సర్వమ్ ఆకాశం పృథివీ తథా ।
అవిజ్ఞానాచ్చ హింసంతి తత్ర కిం ప్రతిభాతి తే ॥ 22
ఆకాశం నుంచి భూమిదాకా ఈ లోకం అంతా జీవులతో నిండి ఉంది. ఎందరో మనుష్యులు తెలియకుండానే జీవహింస చేస్తున్నారు. ఆ విషయంలో నీకు ఏమనిపిస్తున్నది? (22)
అహింసేతి యదుక్తం హి పురుషైర్విస్మితైః పురా ।
కే న హింసంతి జీవాన్ వై లోకేఽస్మిన్ ద్విజసత్తమ ।
బహు సంచిత్య ఇతి వై నాస్తి కశ్చిదహింసకః ॥ 23
పూర్వకాలంలో నిరహంకారులైన అనేక మహాత్ములు అహింసను ఉపదేశించారు. కాని ఈ లోకంలో సామాన్యదృష్టితో చూస్తే జీవహింస చేయనివారు ఎవరున్నారు? బాగా ఆలోచిస్తే హింసచేయనివాడు ఎవడూ లేడని నానిశ్చయం. (23)
అహింసాయాం తు నిరతాః యతయో ద్విజసత్తమ ।
కుర్వంత్యేవ హి హింసాం తే యత్నాదల్పతరా భవేత్ ॥ 24
అహింసా తత్పరులైన యతులు ఎంతోయత్నించి కూడా కొద్దో గొప్పో హింస చేస్తూనే ఉన్నారు. కాకపోతే ప్రయత్నం వల్ల హింస తగ్గుతుంది. అంతే. (24)
ఆలక్ష్యాశ్చైవ పురుషాః కులే జాతా మహాగుణాః ।
మహాఘోరాణి కర్మాణి కృత్వా లజ్జంతి వై ద్విజ ॥ 25
ఉత్తమవంశంలో పుట్టినవారు, మంచిగుణాలు కలవారు, తెలుసుకొనదగినది తెలిసినవారు కూడా మహాఘోర కార్యాలను చేసి సిగ్గుపడుతుంటారు. (25)
సుహృదః సుహృదోఽన్యాంశ్చ దుర్హృదశ్చాపి దుహృదః ।
సమ్యక్ ప్రవృత్తాన్ పురుషాన్ న సమ్యగనుపశ్యతః ॥ 26
మిత్రులు మిత్రులను, శత్రువులు శత్రువులను మంచి పనులను చేస్తున్నవారినైనా సదభిప్రాయంతో చూడరు. (26)
సమృద్ధైశ్చ న నందమ్తి బాంధవా బాంధవైరపి ।
గూరూంశ్చైవ వినిందంతి మూఢాః పండితమానినః ॥ 27
బంధువులు సంపన్నులైన చుట్టాలను చూసి సంతోషించలేరు. పండితులమనుకొనే మూఢులు గురువులను కూడా నిందిస్తారు. (27)
బహు లోకే విపర్యస్తం దృశ్యతే ద్విజసత్తమ ।
ధర్మయుక్తమధర్మం చ తత్ర కిం ప్రతిభాతి తే ॥ 28
ఈ విధంగా లోకంలో అనేకరీతులుగా తారుమారైన విషయాలు కన్పిస్తూ ఉంటాయి. అధర్మంతో ధర్మం కలిసిపోయినట్లు కనపడుతుంది. ఈ విషయం నీకు ఏమనిపిస్తున్నది? (28)
వక్తుం బహువిధం శక్యం ధర్మాధర్మేషు కర్మసు ।
స్వకర్మనిరతో యో హి స యశః ప్రాప్నుయాన్మహత్ ॥ 29
ధర్మాధర్మకార్యాలను గురించి ఇంకా చాలా చెప్పవచ్చు. కాని ఒకటి నిశ్చయం. స్వధర్మతత్పరుడైనవాడు చక్కని కీర్తిసంపన్నుడవుతాడు. (29)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి పతివ్రతోపాఖ్యానే
బ్రాహ్మణవ్యాధసంవాదే అష్టాధికద్విశతతమోఽధ్యాయః ॥ 208 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున పతివ్రతోపాఖ్యనమున బ్రాహ్మణవ్యాధసంవాదమను రెండువందల ఎనిమిదవ అధ్యాయము. (208)