218. రెండు వందల పదునెనిమిదవ అధ్యాయము
అంగిరసుని వంశ వర్ణనము.
మార్కండేయ ఉవాచ
బ్రహ్మణో యస్తృతీయస్తు పుత్రః కురుకులోద్వహ ।
తస్యాభవత్ సుభా భార్యా ప్రజాస్తస్యాం చ మే శృణు ॥ 1
మార్కండేయుడన్నాడు.
కురువంశశ్రేష్ఠా! బ్రహ్మదేవుని మూడవ కుమారుడైన అంగిరసుని భార్యపేరు సుభ. ఆయనకు ఆమె యందు కలిగిన సంతానాన్ని గురించి విను. (1)
బృహత్కీర్తిర్బృహజ్జ్యోతిః బృహద్ర్బహ్మా బృహన్మనాః ।
బృహన్మంత్రో బృహద్భాసః తదా రాజన్ బృహస్పతిః ॥ 2
బృహత్కీర్తి, బృహజ్జ్యోతి, బృహద్ర్మహ్మ, బృహన్మనుడు, బృహన్మంత్రుడు, బృహద్భాసుడు, బృహస్పతి ఆయన కొడుకులు. (2)
ప్రజాసు తాసు సర్వాసు రూపేణాప్రతిమాభవత్ ।
దేవీ భానుమతీ నామ ప్రథమాంగిరసః సుతా ॥ 3
అంగిరసుని మొదటి కూతురు భానుమతీదేవి. ఆయన సంతానంలో ఆమె అధిక సౌందర్యవతి - సాటిలేని సౌందర్యం కలది. (సూర్యునితో కలిసి ఉండటంవల్ల, ఈ భానుమతి దినాభిమానిని అయిన దేవత.) (3)
భుతానామేవ సర్వేషాం యస్యాం రాగస్తదాభవత్ ।
రాగాద్రాగేతి యామాహుః ద్వితీయాంగిరసః సుతా ॥ 4
అంగిరసుని రెండవకూతురు రాగ అనే పేరుతో ప్రసిద్ధురాలు. ఆమె మీద సమస్తప్రాణులకు విశేషమైన అనురాగం కలగటం వలన ఆపేరు ప్రసిద్ధమైంది. (ఈ రాగ రాత్రి అభిమానిని ఐన దేవత.) (4)
యాం కపర్దిసుతామాహుః దృశ్యాదృశ్యేతి దేహినః ।
తనుత్వాత్ సా సినీవాలీ తృతీయాంగిరసః సుతా ॥ 5
అంగిరసుని మూడవ పుత్రిక సినీవాలి. (ఇది చతుర్దశితో గూడిన అమావాస్య). చాలా సన్నగా ఉండటం వలన ఒకసారి కనిపిస్తుంది. ఇంకొకసారి కనిపించదు. కాబట్టి ఈమె దృశ్యాదృశ్య. ఈశ్వరుడు నుదుట ధరిస్తాడు. అందువల్ల రుద్రసుత అనిపేరు. (5)
పశ్యత్యర్చిష్మతీ భాభిః హవిర్భశ్చ హవిష్మతీ ।
షష్ఠిమంగిరసః కన్యాం పుణ్యామాహుర్మహిష్మతీమ్ ॥ 6
ఆయన నాల్గవ పుత్రిక అర్చిష్మతి. (పూర్ణచంద్రునితో కలిసి ఉండటం వల్ల శుద్ధపూర్ణిమ). దీని కాంతితో జనం రాత్రి కూడా వస్తువులను స్పష్టంగా చూస్తారు. ఐదవకన్య హవిష్మతి. (పాడ్యమితో కూడిన పూర్ణిమ 'రాక'.) దీని సాన్నిధ్యంలో హవిస్సుతో దేవతలను పూజిస్తారు. ఆయన పవిత్రమైన ఆరవ కూతురిపేరు 'మహిష్మతి'. (ఇదే చతుర్దశితో కూడిన పూర్ణిమ) దీనినే 'అనుమతి' అని కూడా అంటారు. (6)
మహామఖేష్వాంగిరసీ దీప్తిమత్సు మహామతే ।
మహామతీతి విఖ్యాతా సప్తమీ కథ్యతే సుతా ॥ 7
తేజోవంతాలైన సోమయాగాది మహాయజ్ఞాలలో ప్రకాశించేది కాబట్టి మహామతి అనేపేరుతో ప్రసిద్ధమైన ఇది (పాడ్యమితో గూడిన అమావాస్య) అంగిరసుని ఏడవపుత్రిక. (7)
యాం తు దృష్ట్వా భగవతీం జనః కుహుకుహాయతే ।
ఏకానంశేతి తామాహుః కుహూమంగిరసః సుతామ్ ॥ 8
అంగిరసుని ఎనిమిదవ పుత్రికపేరు 'కుహు'. అది గల అమావాస్యను చూచి జనులు 'కుహు - కుహు' అని ఆశ్చర్యంతో అంటారు. అందులో చంద్రుని ఒకే కళ చాలా సన్నని అంశతో మిగిలి ఉంటుంది. (8)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి అంగిరసోపాఖ్యానే అష్టాదశాధికద్విశతతమోఽధ్యాయః ॥ 218 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున అంగిరసోపాఖ్యానమను రెండువందల పదునెనిమిదవ అధ్యాయము. (218)