219. రెండు వందల పందొమ్మిదవ అధ్యాయము
బృహస్పతి సంతాన వర్ణనము.
మార్కండేయ ఉవాచ
బృహస్పతేశ్చాంద్రమసీ భార్యాఽఽసీద్ యా యశస్వినీ ।
అగ్నీన్ సాజనయత్ పుణ్యాన్ షడేకాం చాపి పుత్రికామ్ ॥ 1
మార్కండేయుడు అన్నాడు - రాజా! బృహస్పతి భార్య చాంద్రమసి (తార) అనే పేరుతో ప్రసిద్ధురాలు. ఆమె పుత్ర రూపంలో ఆరు పవిత్రాగ్నులను, ఒకపుత్రికను కన్నది. (1)
ఆహుతిష్వేవ యస్యాగ్నేః హవిషాద్యం విధీయతే ।
సోఽగ్నిర్బృహస్పతేః పుత్రః శంయుర్నామ మహావ్రతః ॥ 2
(దర్శపూర్ణమాసాదులలో) ప్రధానాహుతులను ఇచ్చేటప్పుడు హవిస్సును స్వీకరిమ్చేవాడును మొట్టమొదట ఇచ్చే ఆజ్యాహుతియే ఉత్తమవ్రతం గల శంయువు అనే అగ్నియే బృహస్పతికి మొదతి పుత్రుడు. (2)
చాతుర్మాస్యేషు యస్యేష్టమ్ అశ్వమేధేఽఽగ్రజః ప్రభుః ।
దీప్తో జ్వాలైరనేకాభైః అగ్నిరేకోఽథ వీర్యవాన్ ॥ 3
చాతుర్మాస్య అశ్వమేధ యజ్ఞాలలో పూజితుడు, మొట్టమొదట జన్మించిన సర్వసమర్థుడు, అనేకమైన రంగులు గల జ్వాలలతో వెలిగేవాడు, సాటిలేని శక్తిశాలి అయిన అగ్నియే శంయువు. (3)
శాంయోరప్రతిమా భార్యా సత్యా సత్యాథ ధర్మజా ।
అగ్నిస్తస్య సుతో దీప్తిః తిస్రః కన్యాశ్చ సువ్రతాః ॥ 4
శంయువు భార్య ధర్మదేవపుత్రిక సత్య. ఆమె సౌందర్యగుణాలు సాటిలేనివి. ఆమె నిజం చెప్పటమే వ్రతంగా గలది. శంయువుకు ఆమె వలన అగ్ని అనే పుత్రుడు, మంచి నియమాలు గల ముగ్గురు పుత్రికలు జన్మించారు. (4)
ప్రథమేనాజ్యభాగేన పూజ్యతే యోఽగ్నిరధ్వరే ।
అగ్నిస్తస్య భరద్వాజః ప్రథమః పుత్ర ఉచ్యతే ॥ 5
యజ్ఞంలో మొదటి ఆజ్యభాగంతో పూజింపబడే అగ్నియే శంయువు యొక్క మొదటి పుత్రుడైన భారద్వాజుడు అనే అగ్ని అని చెపుతారు. (5)
పౌర్ణమాసేషు సర్వేషు హవిరాజ్యం స్రువోద్యతమ్ ।
భరతో నామతః సోఽగ్నిః ద్వితీయః శంయుతః సుతః ॥ 6
అన్ని పౌర్ణమాసయజ్ఞాలలో స్రువంతో నేతిని గ్రహించి సమర్పింపబడే భరతుడు (ప్రజాపతి) అనే అగ్నియే శంయువు రెండవ పుత్రుడు. (ఇతడు శంయువు మరొక భార్య పుత్రుడు). (6)
తిస్రః కన్యా భవంత్యన్యాః యాసాం స భరతః పతిః ।
భరతస్తు సుతస్తస్య భరత్యేకా చ పుత్రికా ॥ 7
శంయువుకు ఇంకా ముగ్గురు కన్యలు కలిగారు. వారిని పెద్దన్న భరతుడే రక్షించేవాడు. భరతు (ప్రజాపతి)నికి భరతుడు అనే కొడుకు, భరతి అనే కూతురు కలిగారు. (7)
భరతో భరతస్యాగ్నేః పావకస్తు ప్రజాపతేః ।
మహానత్యర్థమహితః తథా భరతసత్తమ ॥ 8
భరతవంశశ్రేష్ఠా! సర్వరక్షకుడు, పోషకుడు అయిన ప్రజాపతి భరతుడనే అగ్ని నుండి పావకుడు జన్మించాడు. ఆయన సమధికంగా పూజ్యుడు కావటం వల్ల మహాత్ముడన్నారు. (8)
భరద్వాజస్య భార్యా తు వీరా వీరస్య పిండదా ।
ప్రాహురాజ్యేన తస్యేజ్యాం సోమస్యేవ ద్విజాః శనైః ॥ 9
శంయువు మొదటిపుత్రుడైన భరద్వాజుని యొక్క భార్యపేరు వీర. ఆమె వీరుడు అనే వానిని కన్నది. బ్రాహ్మణులు సోముని వలెనే వీరుని కూడా ఆజ్యభాగంతో పూజించటం చెప్పబడింది. ఈయనకు ఆహుతి ఇచ్చేటప్పుడు మంత్రాన్ని ఉపాంశువుగా ఉచ్చరిస్తారు. (9)
హవిషా యో ద్వితీయేన సోమేన సహ యుజ్యతే ।
రథప్రభూ రథధ్వానః కుంభరేతాః స ఉచ్యతే ॥ 10
సోమదేవతతో పాటు ద్వితీయాజ్యభాగాన్ని పొందే ఈయనను రథప్రభు, రథధ్వానుడు, కుంభరేతుడు అని పిలుస్తారు. (10)
శరయ్వాం జనయత్ సిద్ధిం భానుం భాభిః సమావృణోత్ ।
ఆగ్నేయమానయన్ నిత్యమ్ ఆహ్వానే హ్యేష సూయతే ॥ 11
వీరుడు శరయువనే పత్నియందు సిద్ధి అనే పుత్రుని కన్నాడు. సిద్ధి తన కాంతితో సూర్యుని కప్పి వేశాడు. సూర్యుడు ఆచ్ఛాదితుడైనప్పుడు ఆయన అగ్నిసంబంధయజ్ఞాన్ని అనుష్ఠించాడు. ఆహ్వానమంత్రములో (అగ్ని మగ్న ఆవహ ఇత్యాదిమంత్రంలో) ఈ సిద్ధి యను అగ్నిస్తుతియే కలదు. (11)
యస్తు న చ్యవతే నిత్యం యశసా వర్చసా శ్రియా ।
అగ్నిర్నిశ్చ్యవనో నామ పృథివీం స్తౌతి కేవలమ్ ॥ 12
బృహస్పతి రెండో పుత్రునిపేరు నిశ్చ్యవనుడు. ఈయన కీర్తి, తేజస్సు, కాంతుల నుండి చ్యుతుడు కాడు. నిశ్చ్యవనాగ్ని వాగభిమానదేవతయైన అగ్ని. (12)
విపాప్మా కలుషైర్ముక్తః విశుద్ధశ్చార్చిషా జ్వలన్ ।
విపాపోఽగ్నిః సుతస్తస్య సత్యః సమయధర్మకృత్ ॥ 13
ఆయన పాపరహితుడు, నిర్మలుడు, పవిత్రుడు, తేజస్సమూహంతో ప్రకాశిస్తాడు. ఆయన పుత్రుడు సత్యుడు అనే అగ్ని. సత్యుడు శబ్ధముల వాచ్యవాచక సంబంధం కలిగిస్తాడు. (13)
ఆక్రోశతం హి భూతానాం యః కరోతి హి నిష్కృతిమ్ ।
అగ్నిః స నిష్కృతిర్నామ శోభయత్యభిసేవితే ॥1 4
ప్రాణులు నివసించే ఇండ్లు, తోటలు మొదలైన వాటి యందు బాధతో ఆర్తనాదం చేసే ప్రాణులను బాధనుండి ఆయన విముక్తులను చేస్తాడు. కాబట్టి ఆ అగ్నికి నిష్కృతి అని ఇంకొకపేరు. (14)
అనుకూజంతి యేనేహ వేదనార్తాః స్వయం జనాః ।
తస్య పుత్రః స్వనో నామ పావకః స రుజస్కరః ॥ 15
సత్యునికొడుకు స్వనుడు. అతనిచే బాధితులై యాతనతో కేకలు పెడతారు. కాబట్టి ఈ పేరు ఆయనకు ఏర్పడింది. ఆయన రోగాన్ని కలిగించే అగ్ని. (15)
యస్తు విశ్వస్య జగతో బుద్ధిమాక్రమ్య తిష్ఠతి ।
తం ప్రాహురధ్యాత్మవిదో విశ్వజిన్నామ పావకమ్ ॥ 16
(బృహస్పతి మూడవకొడుకు పేరు విశ్వజిత్తు) ఈ అగ్ని సమస్త జగత్తు యొక్క బుద్ధినీ వశం చేసుకొని ఉంటాడు. కాబట్టి తత్త్వవేత్తలు ఈయనను విశ్వజిత్తు అంటారు. (16)
అంతరాగ్నిః స్మృతో యస్తు భుక్తం పచతి దేహినామ్ ।
స జజ్ఞే విశ్వభుఙ్నామ సర్వలోకేషు భారత ॥ 17
భరతనందనా! సమస్తప్రాణుల కడుపులో ఉండి తిన్న పదార్థాలను జీర్ణంచేస్తాడు. లోకప్రసిద్ధుడైన ఈ విశ్వభుక్కు అనే అగ్ని బృహస్పతి నాల్గవ పుత్రుడుగా జన్మించాడు. (17)
బ్రహ్మచారీ యతాత్మా చ సతతం విపులవ్రతః ।
బ్రాహ్మణాః పూజయంత్యేనం పాకయజ్ఞేషు పావకమ్ ॥ 18
ఆ అగ్ని బ్రహ్మచారి, ఇంద్రియాలను జయించినవాడు, మంచి నియమాలు గలవాడు కావటం వల్ల పాకయజ్ఞంలో ఈయన్నే పూజిస్తారు. (18)
పవిత్రా గోమతీ నామ నదీ యస్యాభవత్ ప్రియా ।
తస్మిన్ కర్మాణి సర్వాణి క్రియంతే ధర్మకర్తృభిః ॥ 19
పవిత్రమైన గోమతీనది ఈయన ప్రియభార్య. ధర్మచరణం చేసే ద్విజులు ఈ విశ్వభుక్కు అనే అగ్నిలోనే సమస్త కర్మానుష్ఠానం చేస్తారు. (19)
వడవాగ్నిః పిబత్యంభః యోఽసౌ పరమదారుణః ।
ఊర్ధ్వభాగూర్ధ్వభాఙ్నామ కవిఃప్రాణాశ్రితస్తు యః ॥ 20
మహాభయంకరమైన బడబాగ్ని రూపంలో సముద్రజలాన్ని తాగే అగ్ని శరీరంలో పైకి వెళ్ళే 'ఉదానం' అనే పేరుతో ప్రసిద్ధుడైన అగ్ని. ఊర్ధ్వగతికలవాడు. కాబట్టే ఈయనపేరు 'ఊర్ధ్వభాక్కు. ఈయన ప్రాణవాయువును ఆశ్రయించినవాడు. త్రికాలదర్శి. (ఈయన బృహస్పతి అయిదవ పుత్రుడు) (20)
ఉదగ్ద్వారం హవిర్యస్య గృహే నిత్యం ప్రదీయతే ।
తతః స్విష్టం భవేదాజ్యం స్విష్టకృత్ పరమః స్మృతః ॥ 21
బృహస్పతి ఆరవకొడుకు స్విష్టకృత్తు అనే అగ్ని. ఆయనకు ఎప్పుడూ ఇచ్చే నేతిధార ఉత్తరాభిముఖప్రవాహంగా ఉండి కోరిన కోరికలను సిద్ధింపజేస్తుంది. కాబట్టి ఆ అగ్నికి ఆ పేరు వచ్చింది. (21)
యః ప్రశాంతేషు భూతేషు మన్యుర్భవతి పావకః ।
క్రుద్ధస్య తు రసో జజ్ఞే మన్యే తాం చాథ పుత్రికామ్ ।
స్వాహేతి దారుణా క్రూరా సర్వభూతేషు తిష్ఠతి ॥ 22
అగ్నిస్వరూపుడయిన బృహస్పతి కోపం ప్రశాంతంగా ఉండే ప్రాణుల మీద వ్యక్తం ఐనప్పుడు ఆయన శరీరం నుంచి ఏర్పడిన చెమట ఆయన పుత్రిక అయింది. ఆమె స్వాహా అనే పేరుతో ప్రసిద్ధురాలు అయింది. దారునమైనది క్రూరురాలు అయిన ఆకన్య అన్నిప్రాణుల్లో ఉంటుంది. (22)
త్రిదివే యస్య సదృశో నాస్తి రూపేణ కశ్చన ।
అతులత్వాత్ కృతో దేవైః నామ్నా కామస్తు పావకః ॥ 23
స్వర్గంలో గూడా సౌందర్యంలో సాటిలేనివాడు అయిన ఆ స్వాహాపుత్రునికి దేవతలు కాముడు అనే అగ్నిగా పేరుపెట్టారు. (23)
సంహర్షాద్ ధారయన్ క్రోధం ధన్వీ స్రగ్వీ రథే స్థితః ।
సమరే నాశయేచ్ఛత్రూన్ అమోఘో నామ పావకః ॥ 24
కోపాన్ని మనస్సులో ఉంచుకొని మాలాలంకృతుడు, ధనుర్ధారి అయి సంతోషంతో ఉత్సాహంతో రథం మీద కూర్చొని యుద్ధంలో శత్రునాశనం చేసే అగ్నిపేరు అమోఘుడు. (24)
ఉక్థో నామ మహాభాగ త్రిభిరుక్థైరభిష్ఠుతః ।
మహావాచం త్వజనయత్ సమాశ్వాసం హి యం విదుః ॥ 25
ఉక్థం అనే పేరు గల అగ్నిని బ్రాహ్మణులు ఉక్థాలు అనే త్రివిధస్తోత్రాలతో స్తుతిస్తారు. అది మహావాక్కును (పరావాక్కును) వ్యక్తం చేసింది. అది మోక్షము నిచ్చేది కాబట్టి దానిపేరు ఉక్థం. (25)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి ఆంగిరసోపాఖ్యానే ఏకోనవింశత్యధికద్విశతతమోఽధ్యాయఆHఅ ॥ 219 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమాస్యాపర్వమను ఉపపర్వమున ఆంగిరసోపాఖ్యానమను రెండువందల పందొమ్మిదవ అధ్యాయము. (219)