226. రెండువందల ఇరువది ఆరవ అధ్యాయము
స్కందునికి జాతకాదులు - అగ్నిదేవాదుల రక్షణము.
మార్కండేయ ఉవాచ
తస్మిన్ జాతే మహాసత్త్వే మహాసేనే మహాబలే ।
సముత్తస్థుర్మహోత్పాతాః ఘోరరూపాః పృథగ్విధాః ॥ 1
మార్కండేయ మహర్షి అన్నాడు. రాజా! మహాధైర్యశాలి, మహాబలవంతుడూ అయిన మహాసేనుడు జన్మించిన తరువాత అనేక విధాల భయంకరోత్పాతాలు కలిగాయి. (1)
స్త్రీపుంసోర్విపరీతం చ తథా ద్వంద్వాని యాని చ ।
గ్రహా దీప్తా దిశః ఖం చ రరాస చ మహీ భృశమ్ ॥ 2
స్త్రీ పురుషుల మధ్య శత్రుత్వం ఏర్పడింది. ద్వంద్వాల మధ్య వైపరీత్యం ఏర్పడింది. గ్రహాలు, దిక్కులు, ఆకాశం మండుతున్నట్లున్నాయి. భూమి చాల వేగంగా ధ్వనింపసాగింది. (2)
ఋషయశ్చ మహాఘోరాన్ దృష్ట్వోత్పాతాన్ సమంతతః ।
అకుర్వన్ శాంతిముద్విగ్నాః లోకానాం లోకభావనాః ॥ 3
లోకక్షేమాన్ని కోరే మహర్షులు నాలుగు వైపుల మిక్కిలి భయంకరమైన ఉత్పాతాలను చూసి, కలత చెంది, లేచి లోకంలో శాంతి కలగటానికి శాంతి కర్మలను యథావిధిగా అనుష్ఠించారు. (3)
నివసంతి వనే యే తు తస్మింశ్చైత్రరథే జనాః ।
తేఽబ్రువన్నేష నోఽనర్థః పావకేనాహితో మహాన్ ॥ 4
సంగమ్య షడ్ భిః పత్నీభిః సప్తర్షీణామితి స్మహ ।
చైత్రరథమనే వనంలో ఉన్న అగ్ని సప్తర్షుల ఆరుగురు భార్యలతో సంగమించి మనకు ఈ మహాభయంకరమైన అనర్థాన్ని కలిగించాడు. (4 1/2)
అపరే గరుడీమాహుః త్వయానర్థోఽయమాహృతః ॥ 5
యైర్దృష్టా సా తదా దేవీ తస్యా రూపేణ గచ్ఛతీ ।
న తు తత్ స్వాహయా కర్మ కృతం జానాతి వై జనః ॥ 6
ఇతరులు ఆడ గరుడపక్షితో 'నీవే ఈ అనర్థాన్ని కలిగించావు' అని అన్నారు. స్వాహాదేవి గరుడపక్షిరూపంలో వెళ్ళటం చూసినవారు ఇలా అనుకొన్నారు. 'ఇదంతా స్వాహాదేవి చేసినపని అని వారికి తెలియదు.' (5,6)
సుపర్ణీ తు వచః శ్రుత్వా మమాయం తనయస్త్వితి ।
ఉపగమ్య శనైః స్కందమ్ ఆహాహం జననీ తవ ॥ 7
ఆడగరుడపక్షి జనుల మాటలు విని 'ఇతడు నాకుమారుడు' అన్నది. తరువాత మెల్లగా స్కందునివద్దకు వెళ్ళి 'వత్సా! నీకు జన్మనిచ్చిన తల్లిని' అని అన్నది. (7)
అథ సప్తర్షయః శ్రుత్వా జాతం పుత్రం మహౌజసమ్ ।
తత్యజుః షట్ తదా పత్నీః వినా దేవీమరుంధతీమ్ ॥ 8
సప్తర్షులు తమ ఆరుగురు పత్నుల సమాగమంతో అగ్నిదేవునికి ఒక కుమారుడు కలిగినాడు అన్నమాట విని, అరుంధతీ దేవిని మినహా తక్కిన ఆరుగురి భార్యలను వదిలివేశారు. (8)
షడ్భిరేవ తదా జాతమ్ ఆహుస్తద్వనవాసినః ।
సప్తర్షీనాహ చ స్వాహా మమ పుత్రోఽయమిత్యుత ॥ 9
అహం జానే నైతదేవమ్ ఇతి రాజన్ పునః పునః ।
ఆ వనంలో ఉండేవారు ఆ సమయంలో ఆ ఆరుగురు ఋషులభార్యలే ఆ పుత్రుని తల్లులని అనటమే దానికి కారణం. స్వాహాదేవి చాలాసార్లు 'ఈపిల్లవాడు నాపుత్రుడే. ఈయన జన్మ రహస్యం నాకు తెలుసు. జనం చెప్పేది అబద్ధం' అని చెప్పినా లాభం లేకపోయింది. (9 1/2)
విశ్వామిత్రస్తు కృత్వేష్టిం సప్తర్షీణాం మహామునిః ॥ 10
పావకం కామసంతప్తమ్ అదృష్టః పృష్ఠతోఽన్వగాత్ ।
తత్ తేన నిఖిలం సర్వమ్ అవబుద్ధం యథాతథమ్ ॥ 11
విశ్వామిత్రమహర్షి సప్తర్షుల యజ్ఞం పూర్తి అయినప్పుడు కామపీడితుడైన అగ్నిదేవుని వెంబడి రహస్యంగా వెళ్ళాడు. అప్పుడు ఆయన ఎవరికి కన్పించలేదు. కాబట్టి ఆయనకు ఈ వృత్తాంతం అంతా తెలుసు. (10,11)
విశ్వామిత్రస్తు ప్రథమం కుమారం శరణం గతః ।
స్తవం దివ్యం సంప్రచక్రే మహాసేనస్య చాపి సః ॥ 12
విశ్వామిత్రుడు మొదట కుమారస్వామిని శరణుపొందాడు. మహాసేనుని దివ్యస్తోత్రంతో స్తుతించాడు. (12)
మంగలాని చ సర్వాణి కౌమారాణి త్రయోదశ ।
జాతకర్మాదికాస్తస్య క్రియాశ్చక్రే మహామునిః ॥ 13
ఆ ముని కుమారస్వామికి మంగళకృత్యాలు అన్నీ చేశాడు. జాతకర్మమొదలైన 13 సంస్కారాలు నిర్వర్తించాడు. (13)
షడ్ వక్త్రస్య తు మాహాత్మ్యం కుక్కుటస్య తు సాధనమ్ ।
శక్త్యా దేవ్యాః సాధనం చ తథా పారిషదామపి ॥ 14
విశ్వామిత్రశ్చకారైతత్ కర్మ లోకహితాయ వై ।
తస్మాదృష్టిః కుమారస్య విశ్వామిత్రోఽభవత్ ప్రియః ॥ 15
స్కందుని మహిమను, కుక్కుటాన్ని ధరించటం, పరమేశ్వరితో సమానమైన బలం గల శక్తి ఆయుధాన్ని గ్రహించటం, పారిషదులను గ్రహించటం మొదలైన సమస్త కార్యాలను లోకానికి మేలు కలిగించటానికి అవసరమైన రీతిగా సిద్ధం చేశాడు. అందువలన కూమారస్వామికి విశ్వామిత్రముని ఇష్టుడైనాడు. (14,15)
అన్వజానాచ్చ స్వాహాయాః రూపాన్యత్వం మహామునిః ।
అబ్రవీచ్చ మునీన్ సర్వాన్ నాపరాధ్యంతి వై స్త్రియః ॥ 16
శ్రుత్వా తు తత్త్వతస్తస్మాత్ తే పత్నీః సర్వతోఽత్యజన్ ।
స్వాహాదేవి ఇతర ఋషిపత్నుల రూపాన్ని ధరించి అగ్నిదేవునితో సంయోగం పొందటం తెలుసుకాబట్టి ఆ మునులతో 'మీ భార్యలు ఏ తప్పు చేయలేదు' అని చెప్పాడు. ఆయన చెప్పిన సత్యం తెలిసి కూడా ఋషులు భార్యలను పూర్తిగా వదలిపెట్టారు. (16 1/2)
మార్కండేయ ఉవాచ
స్కందం శ్రుత్వా తదా దేవాః వాసవం సహితాఽబ్రువన్ ॥ 17
అవిషహ్యబలం స్కందం జహి శక్రాశు మాచిరమ్ ।
యది వా న నిహంస్యేనం దేవేంద్రోఽయం భవిష్యతి ॥ 18
త్రైలోక్యం సంనిగృహ్యాస్మాన్ త్ర్వాం చ శక్ర మహాబల ।
మార్కండేయ మహర్షి ఇలా అన్నాడు - రాజా! ఆ సమయంలో కుమారస్వామి జననమూ, బలపరాక్రమాలనూ గురించి విన్న దేవతలు అందరు కలిసి ఇంద్రునితో ఇలా అన్నారు. 'దేవా! కుమారుని బలం మనకు తట్టుకొనరానిది. కాబట్టి త్వరగా ఆతనిని సంహరించు. ఆలస్యం చేయవద్దు. అలా ఇప్పుడే చేయకపోతే ఈయన మమ్ములను అందరిని, చివరకు నిన్ను గూడ వశం చేసుకొని దేవేంద్రుడు అవుతాడు.' (17,18 1/2)
స తానువాచ వ్యథితో బాలోఽయం సుమహాబలః ॥ 19
స్రష్టారమపి లోకానాం యుధి విక్రమ్య నాశయేత్ ।
న బాలముత్సహే హంతుమ్ ఇతి శక్రః ప్రభాషతే ॥ 20
అప్పుడు ఆయన బాధపడుతూ "దేవతలారా! ఈ బాలుడు చాలా బలవంతుడు. ఈయన లోకాలను సృష్టించే బ్రహ్మను గూడ యుద్ధంలో జయించగలడు. అందువల్ల నేను ఈ బాలుని చంపే సాహసం చేయలేను." అని మాటిమాటికి చెప్పాడు. (19,20)
తేఽబ్రువన్ నాస్తి తే వీర్యం యత ఏవం ప్రభాషసే ।
సర్వాస్త్వద్యాభిగచ్ఛంతు స్కందం లోకస్య మాతరః ॥ 21
కామవీర్యా ఘ్నంతు చైనం తథేత్యుక్త్వా చ తా యయుః ।
ఇది విని వారు 'నీకు ఇప్పుడు బలపరాక్రమాలు లోపించాయి. అందువలననే ఇలా అంటున్నావు. ఆరుగురు లోకమాతలు ఇప్పుడు స్కందుని వద్దకు వెళ్ళాలి. వారు ఇష్టం వచ్చినట్లు పరాక్రమించగలరు. స్కందుని మట్టుపెట్టగలరు. అని అన్నారు. మాతలు ఆ మాటలు విని 'అలాగే' అని బయలుదేరారు. (21 1/2)
తమప్రతిబలం దృష్ట్వా విషణ్ణవదనాస్తు తాః ॥ 22
అశక్యోఽయం విచింత్యైవం తమేవ శరణం యయుః ।
ఊచుశ్చైనం త్వమస్మాకం పుత్రో భవ మహాబల ॥ 23
సాటిలేని శక్తిగల కుమారస్వామిని చూసి, నిరుత్సాహపడి, 'ఈమహావీరుని ఓడించటం అసంభవం' అని నిశ్చయించుకొని ఆయనను శరణు పొందారు. 'మహాబలా! కుమారా! నీవు మా పుత్రుడవు కావాలసినది. (22,23)
అభినందస్వ నః సర్వాః ప్రస్నుతాః స్నేహావిక్లవాః ।
తాసాం తద్ వచనం శ్రుత్వా పాతుకామః స్తనాన్ ప్రభుః ॥ 24
పుత్రప్రేమతో మేము చలించిపోతున్నాం. మా పాలను త్రాగి సంతోషపెట్టు' అని పలికారు. వారిమాటలు విని ఆ సమర్థుడు మాతృస్తనపానాన్ని చేయగోరాడు. (24)
తాః సంపూజ్య మహాసేనః కామాంశ్చాసాం ప్రదాయ సః ।
అపశ్యదగ్నిమాయాంతం పితరం బలినాం బలీ ॥ 25
మహాసేనుడు వారిని గౌరవించి వారికోరికను తీర్చాడు. ఇంతలో ఆ మహాబలుడు తండ్రియైన అగ్నిదేవుని చూశాడు. (25)
స తు సంపూజితస్తేన సహ మాతృగణేన హ ।
పరివార్య మహాసేనం రక్షమాణః స్థితః శివః ॥ 26
కుమారుని పూజ స్వీకరించి, శుభంకరుడైన అగ్ని మాతృగణంతో గూడా ఆయనను చుట్టుముట్టి నిలిచి రక్షించసాగాడు. (26)
సర్వాసాం యా తు మాతౄణాం నారీ క్రోధసముద్భవా ।
ధాత్రీ స్వపుత్రవత్ స్కందం శూలహస్తాభ్యరక్షత ॥ 27
ఆ సమయంలో మాతృగణానుంచి అవతరించిన క్రోధరూప స్త్రీ చేతిలో త్రిశూలాన్ని పట్టుకొని, తనకు పుత్ర సమానుడైన ఆయనను అన్నివైపుల నుంచి రక్షిస్తూ నిలచింది. (27)
లోహితస్యోదధేః కన్యా క్రూరా లోహితభోజనా ।
పరిష్వజ్య మహాసేనం పుత్రవత్ పర్యరక్షత ॥ 28
రక్తసముద్ర పుత్రిక, క్రూరస్వభావం గలది, రక్తభోజనప్రియ అయిన ఒక కన్యక పుత్రునివలె ఆయనను గుండెకు హత్తుకొని అన్నివైపుల నుండి రక్షించసాగింది. (28)
అగ్నిర్భూత్వా నైగమేయః ఛాగవక్త్రో బహుప్రజః ।
రమయామాస శైలస్థం బాలం క్రీడనకైరివ ॥ 29
వేదప్రతిపాదితుడైన అగ్నిదేవుడు మేకముఖం గలిగి తన సంతానంతో వచ్చి, పర్వతనివాసి అయిన కుమారుని ఆటబొమ్మలతో చిన్నపిల్లవానిని వలె సంతోషపెట్టాడు. (29)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి ఆంగిరసే స్కందోత్పత్తౌ షడ్వింశత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 226 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమస్యాపర్వమను ఉపపర్వమున ఆంగిరసోపాఖ్యానమున కుమారజననము అను రెండు వందల ఇరువది ఆరవ అధ్యాయము. (226)