227. రెండు వందల ఇరువది యేడవ అధ్యాయము
ఓడిపోయి శరణు కోరిన ఇంద్రాదులకు స్కందుని అభయప్రదానము.
మార్కండేయ ఉవాచ
గ్రహాః సోపగ్రహాశ్చైవ ఋషయో మాతరస్తథా ।
హుతాశనముఖాశ్చైవ దృప్తాః పారిషదాం గణాః ॥ 1
ఏతే చాన్యే చ బహవః ఘోరాస్త్రిదివవాసినః ।
పరివార్య మహాసేనం స్థితా మాతృగణైః సహ ॥ 2
మార్కండేయుడన్నాడు. రాజా! గ్రహాలు, ఉపగ్రహాలు, మాతృగణం, అగ్నిముఖులు, పొగరుబోతులు అయిన పార్షదుల గణాలు, ఇంకా స్వర్గంలో ఉన్న భయంకరమైన ప్రాణులు, మాతృగణాలతో కలిసి ఆయనకు చుట్టూ ఉండి అన్నివైపుల నుండి రక్షించసాగాయి. (1,2)
సందిగ్ధం విజయం దృష్ట్వా విజయేప్సుః సురేశ్వరః ।
ఆరుహ్యైరావతస్కందం ప్రయయౌ దైవతైః సహ ॥ 3
విజయం సందిగ్ధంగా ఉన్నదని తలచిన ఇంద్రుడు జయం కలగాలనే కోరికతో ఐరావతాన్ని ఎక్కి దేవతలతో కలిసి ముందరికి వెళ్ళాడు. (3)
ఆదాయ వజ్రం బలవాన్ సర్వైర్దేవగణైర్వృతః ।
విజిఘాంసుర్మహాసేనమ్ ఇంద్రస్తూర్ణతరం యయౌ ॥ 4
దేవగణాలు చుట్టూ ఉండగా మహాసేనుని సంహరించాలనే ఉద్దేశ్యంతో వజ్రాయుధాన్ని ధరించి ఇంద్రుడు వేగంగా వెళ్ళాడు. (4)
ఉగ్రం తం చ మహానాదం దేవానీకం మహాప్రభుమ్ ।
విచిత్రధ్వజసంనాహం నానావాహనకార్ముకమ్ ॥ 5
ప్రవరాంబరసంవీతం శ్రియా జుష్టమలంకృతమ్ ।
విజిఘాంసుం తమాయాంతం కుమారః శక్రమన్వయాత్ ॥ 6
దేవసైన్యం చాలా భయంకరంగా ఉంది. ఆ సేనలో నుంచి తీవ్రమైన గర్జనలు వెలువడుతున్నాయి. వాటి కాంతులు విస్తారంగా ఉన్నాయి. వాటి జెండాలు, కవచాలు విచిత్రంగా ఉన్నాయి. సైనికులు, వాహనాలు నానావిధాలుగా కన్పిస్తున్నవి. వారు అందరూ ఉత్తమవస్త్రాలను ధరించారు. ప్రకాశవంతమైన వివిధాభరణాలను ధరించి కనపడుతున్నారు. తనను చంపటానికి వస్తున్న ఇంద్రుని చూచి కుమారస్వామి కూడా తన సైన్యాన్ని ఎదురువెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాడు. (5,6)
వినదన్ పార్థ దేవేశః ద్రుతం యాతి మహాబలః ।
సంహర్షయన్ దేవసేనాం జిఘాంసుః పావకాత్మజమ్ ॥ 7
ధర్మజా! బలిష్ఠుడైన ఇంద్రుడు అగ్ని కుమారుడైన స్కందుని సంహరించాలని దేవసైన్యానికి సంతోషం పెంపొందిస్తూ, తీవ్రంగా సింహనాదం చేస్తూ, వేగంగా ముందుకు వెళ్ళుతున్నాడు. (7)
సంపూజ్యమానస్త్రిదశైః తథైవ పరమర్షిభిః ।
సమీపమథ సంప్రాప్తః కార్తికేయస్య వాసవః ॥ 8
సింహనాదం తతశ్చక్రే దేవేశః సహితః సురైః ।
గుహోఽపి శబ్దం తం శ్రుత్వా వ్యనదత్ సాగరో యథా ॥ 9
దేవతలు, మహర్షులు ఆయనను చాలా గౌరవిస్తున్నారు. దేవరాజు కార్తికేయుని సమీపానికి వస్తూ దేవతలతో కూడా సింహగర్జన చేస్తున్నాడు. ఆ సింహనాదాన్ని విన్న కుమారస్వామి కూడా సముద్రధ్వని వంటి గర్జన చేయసాగాడు. (8,9)
తస్య శబ్దేన మహతా సముద్ధూతోదధిప్రభమ్ ।
బభ్రామ తత్ర తత్రైవ దేవసైన్యమచేతనమ్ ॥ 10
మహోత్సాహంతో పొంగిపోతూ, సముద్రంలాగా ముందుకు ఉరుకుతూ ఉన్న దేవతల సైన్యం కుమారస్వామి భయంకరసింహనాదం విన్నంతనే జడప్రాయమై అక్కడే తిరగసాగింది. (10)
జిఘాంసూనుపసంప్రాప్తాన్ దేవాన్ దృష్ట్వా స పావకిః ।
విససర్జ ముఖాత్ క్రుద్ధః ప్రవృద్ధాః పావకార్చిషః ॥ 11
తనను సంహరించటానికి ముందుకు వస్తున్న దేవసైన్యాన్ని చూసి, ఆ అగ్నిపుత్రుడు తీవ్రకోపంతో నోటినుంచి మహాగ్నిజ్వాలలను వెళ్ళగ్రక్కసాగాడు. (11)
అదహద్ దేవసైన్యాని వేపమానాని భూతలే ।
తే ప్రదీప్తశిరోదేహాః ప్రదీప్తాయుధవాహనాః ॥ 12
ఈ రీతిగా ఆయన దేవసైన్యాన్ని దగ్ధం చేయసాగాడు. ఆ సైన్యం అంతా నేల మీద పడి గిలగిల తన్నుకొనసాగింది. వారి శరీరాలు కాలిపోయాయి. (12)
ప్రచ్యుతాః సహసా భాంతి వ్యస్తాస్తారాగణా ఇవ ।
దహ్యమానాః ప్రపన్నాస్తే శరణం పావకాత్మజమ్ ॥ 13
దేవా వజ్రధరం త్యక్త్వా తతః శాంతిముపాగతాః ।
త్యక్తో దేవైస్తతః స్కందో వజ్రం శక్రో న్యపాతయత్ ॥ 14
వారందరూ చెల్లాచెదరై చెదరుమదురుగా పడిన ఆకాశంలోని నక్షత్రాల వలె కన్పడినారు. ఇలా తగలబడుతున్న
దేవసైన్యం ఇంద్రుని వదలి, అగ్నిపుత్రుడైన స్కందునే శరణు పొందడంతో సంతాపం తొలగింది. దేవతలు తనను వీడి వెళ్ళిన తరువాత దేవరాజు కుమారునిపై వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. (13,14)
తద్విసృష్టం జఘానాశు పార్శ్వం స్కందస్య దక్షిణమ్ ।
విభేద చ మహారాజ పార్శ్వం తస్య మహాత్మనః ॥ 15
రాజేంద్రా! ఆ ఆయుధం స్కందుని శరీరంలో కుడిప్రక్క ఎడమ ఎముకవరకూ పోయి పెద్దగాయం చేసింది. ఆయన ప్రక్కభాగం విరిగింది. (15)
వజ్రప్రహారాత్ స్కందస్య సంజాతః పురుషోఽపరః ।
యువా కాంచనసంనాహః శక్తిధృగ్ దివ్యకుండలః ॥ 16
వజ్రాయుధం దెబ్బతో కుమారస్వామి గాయం నుంచి ఒక యువకుడైన వీర పురుషుడు ఆవిర్భవించాడు. బంగారుకవచాన్ని ధరించిన ఆయన చేతిలో ఉన్న శక్తి అనే ఆయుధమూ, చెవులకున్న దివ్యకుండలాలూ మెరిసిపోతున్నాయి. (16)
యద్వజ్రవిశనాజ్జాతః విశాఖస్తేన సోఽభవత్ ।
సంజాతమపరం దృష్ట్వా కాలానలసమద్యుతిమ్ ॥ 17
భయాదింద్రస్తు తం స్కందం ప్రాంజలిః శరణం గతః ।
వజ్రాయుధం శరీరంలో ప్రవేశించటం వలన (జనించటం చేత) ఆయన విశాఖుడు అనేపేరుతో ప్రసిద్ధుడైనాడు. ప్రళయాగ్నివలె తేజస్వి ఐన ఆరెండవ వీరుడు అవతరించటం చూసి, భయంతో వణికిపోతూ ఇంద్రుడు చేతులు జోడించి కుమారుని శరణుకోరాడు. (17 1/2)
తస్యాభయం దదౌ స్కందః సహ సైన్యస్య సత్తమః ।
తతః ప్రహృష్టాస్త్రిదశాః వాదిత్రాణ్యాభ్యవాదయన్ ॥ 18
అప్పుడు సత్పురుషశ్రేష్ఠుడైన స్కందుడు ఆయనకు అభయం ఇచ్చాడు. అందుకు సంతోషించి దేవతలు మంగళవాద్యాలను మ్రోగించారు. (18)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి ఆంగిరసే ఇంద్రస్కందసమాగమే సప్తవింశత్యధికద్విశతతమోఽధ్యాయః ॥ 227 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున మార్కండేయ సమస్యాపర్వమను ఉపపర్వమున ఆంగిరసోపాఖ్యానమున ఇంద్రస్కందసమాగమ మను రెండు వందల ఇరువది ఏడవ అధ్యాయము. (227)