241. రెండు వందల నలువది ఒకటవ అధ్యాయము
కౌరవులు గంధర్వులతో యుద్ధము చేయుట, కర్ణుని పరాజయము.
వైశంపాయన ఉవాచ
తతస్తే సహితాః సర్వే దుర్యోధనముపాగమన్ ।
అబ్రువంశ్చ మహారాజ యదూచుః కౌరవం ప్రతి ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
మహారాజా! వారంతా ఒక్కుమ్మడిగా దుర్యోధనుని దగ్గరకు వచ్చి, గంధర్వరాజు దుర్యోధనునకు చెప్పమన్న మాటలన్నీ చెప్పారు. (1)
గంధర్వైర్వారితే సైన్యే ధార్తరాష్ట్రః ప్రతాపవాన్ ।
అమర్షపూర్ణః సైన్యాని ప్రత్యభాషత భారత ॥ 2
భారతా! గంధర్వులు తన సేనను వారించగా ప్రతాపశాలి అయిన దుర్యోధనుడు కోపంతో నిండిపోయి సేనలను ఇలా ఆదేశించాడు. (2)
శాసతైనానధర్మజ్ఞాన్ మమ విప్రియకారిణః ।
యది ప్రక్రీడతే సర్వైః దేవైః సహ శతక్రతుః ॥ 3
దేవతలందరితో కలిసి దేవేంద్రుడే వచ్చి ఇక్కడ విహరించినా, వారు కూడా నాకు నచ్చని పనిచేసినట్లే. వెళ్ళండి. ఆ అధర్మశీలురను శిక్షించండి. (3)
దుర్యోధనవచః శ్రుత్వా ధార్తరాష్ట్రా మహాబలాః ।
సర్వ ఏవాభిసంనద్ధాః యోధాశ్చాపి సహస్రశః ॥ 4
దుర్యోధనుని మాటవిని మహాబలులయిన ధార్తరాష్ట్రులు, వెలకొలదిగ ఉన్న సైనికులు అందరూ యుద్ధానికి సన్నద్ధులయ్యారు. (4)
తతః ప్రమథ్య సర్వాంస్తాన్ తద్ వనం వివిశుర్బలాత్ ।
సింహనాదేన మహతా పూరయంతో దిశో దశ ॥ 5
పెద్దపెద్ద సింహనాదాలతో దశదిక్కులనూ నింపుతూ వారు గంధర్వులను మథించి బలపూర్వకంగా ద్వైతవనంలో ప్రవేశించారు. (5)
తతోఽపరైరవార్యంత గంధర్వైః కురుసైనికాః ।
తే వార్యమాణా గంధర్వైః సామ్నేవ వసుధాధిప ॥ 6
తాననాదృత్య గంధర్వాన్ తద్ వనం వివిశుర్మహత్ ।
యదా వాచా న తిష్ఠంతి ధార్తరాష్ట్రాః సరాజకాః ॥ 7
తతస్తే ఖేచరాః సర్వే చిత్రసేనే న్యవేదయన్ ।
రాజా! అపుడు మరికొందరు గంధర్వులు కురుసైనికులను మంచి మాటలతోనే వారించారు. వారు వారిస్తున్నా కూడా లెక్కచేయక కౌరవసేనలు ఆ మహావనంలో ప్రవేశించాయి. దుర్యోధనుడు, ఆయన సేనలు మాటలతో ఆగకపోయినందువలన గంధర్వులు ఆ విషయాన్ని చిత్రసేనునికి నివేదించారు. (6, 7 1/2)
గంధర్వరాజస్తాన్ సర్వాన్ అబ్రవీత్ కౌరవాన్ ప్రతి ॥ 8
అనార్యాన్ శాసతేత్యేతాన్ చిత్రసేనోఽత్యమర్షణః ।
చిత్రసేనుడు తీవ్రంగా కోపించి "ఆ దుర్మార్గులను శిక్షించండి" అని కౌరవదండనకు ఆదేశించాడు. (8 1/2)
అనుజ్ఞాతాశ్చ గంధర్వాః చిత్రసేనేన భారత ॥ 9
ప్రగృహీతాయుధాః సర్వే ధార్తరాష్ట్రానభిద్రవన్ ।
భారతా! చిత్రసేనుని ఆదేశాన్ని అనుసరించి గంధర్వులు ఆయుధాలు చేతబట్టి ధార్తరాష్ట్రులందరిపై దాడిచేశారు. (9 1/2)
తాన్ దృష్ట్వా పతతః శీఘ్రాన్ గంధర్వానుద్యతాయుధాన్ ॥ 10
ప్రాద్రవంస్తే దిశః సర్వే ధార్తరాష్ట్రస్య పశ్యతః ।
ఆయుధాలు పైకెత్తి మీద పడుతున్న గంధర్వులను చూసి, కౌరవులందరూ దుర్యోధనుడు చూస్తుండగానే అన్నిదిక్కులకూ పరుగెత్తారు. (10 1/2)
తాన్ దృష్ట్వా ద్రవతః సర్వాన్ ధార్తరాష్ట్రాన్ పరాఙ్ముఖాన్ ॥ 11
రాధేయస్తు తదా వీరః నాసీత్ తత్ర పరాఙ్ముఖః ।
వెనుదిరిగి కౌరవులందరూ పరుగెత్తడం చూచి కూడా వీరుడయిన కర్ణుడొక్కడే వెన్నుచూపక నిలిచాడు. (11 1/2)
ఆపతంతీం తు సంప్రేక్ష్య గంధర్వాణాం మహాచమూమ్ ॥ 12
మహతా శరవర్షేణ రాధేయః ప్రత్యవారయత్ ।
మీదపడుతున్న గంధర్వుల మహాసైన్యాన్ని తేరిపారజూసి కర్ణుడు బాణాలజడివానతో దానిని నివారించాడు. (12 1/2)
క్షురప్రైర్విశిఖైర్భల్లైః వత్సదంతైస్తథాఽఽయసైః ॥ 13
గంధర్వాన్ శతశోఽభ్యఘ్నన్ లఘుత్వాత్ సూతనందనః ।
కర్ణుడు హస్తలాఘవంతో క్షురప్రాలను, బాణాలను, భల్లాలను, వత్సదంతాలనే లోహబాణాలను ప్రయోగించి వందలకొలది గంధర్వులను చంపాడు. (13 1/2)
పాతయన్నుత్తమాంగాని గంధర్వాణాం మహారథః ॥ 14
క్షణేన వ్యధమత్ సర్వాం చిత్రసేనస్య వాహినీమ్ ।
మహారథుడైన కర్ణుడు గంధర్వుల తలలను పడగొడుతూ
క్షణకాలంలో చిత్రసేనుని సేనను ఛిన్నాభిన్నం చేశాడు. (14 1/2)
తే వధ్యమానా గంధర్వాః సూతపుత్రేణ ధీమతా ॥ 15
భూయ ఏవాభ్యవర్తంత శతకోఽథ సహస్రశః ।
గంధర్వభూతా పృథివీ క్షణేన సమపద్యత ॥ 16
ఆపతద్భిర్మహావేగైః చిత్రసేనస్య సైనికైః ।
ధీమంతుడైన కర్ణుడు గంధర్వులను చంపుతుంటే మరల వందలవేల గంధర్వౌలు కర్ణునికెదురు నిలువసాగారు. మహావేగంతో వచ్చిపడుతున్న చిత్రసేనుని సేనలతో క్షణకాలంలో భూమండలం గంధర్వమయమైనది. (15, 16 1/2)
అథ దుర్యోధనో రాజా శకునిశ్చాపి సౌబలః ॥ 17
దుఃశాసనో వికర్ణశ్చ యే చాన్యే ధృతరాష్ట్రజాః ।
న్యహనంస్తత్ తదా సైన్యం రథైర్గరుడనిఃస్వనైః ॥ 18
అపుడు దుర్యోధననరపతి, సౌబలుడైన శకుని, దుశ్శాసనుడు, వికర్ణుడు , ధృతరాష్ట్రుని ఇతర కుమారులు గరుడుని వలె భీకరధ్వని చేస్తున్న రథాలనెక్కి ఆ సేనను సంహరించారు. (17,18)
భూయశ్చ యోధయామాసుః కృత్వా కర్ణమథాగ్రతః ।
మహతా రథసంఘేన రథచారేణ చాప్యుత ॥ 19
వైకర్తనం పరీప్సంతః గంధర్వాన్ సమవాకిరన్ ।
కర్ణుని ముందుంచుకొని మరల గంధర్వుల నెదిరించారు. లెక్కలేనన్ని రథసమూహాల విచిత్రగతితో కర్ణుని రక్షించుకొంటూ గంధర్వులపై బాణాలను కురిపించారు. (19 1/2)
తతః సంన్యపతన్ సర్వే గంధర్వాః కౌరవైః సహ ॥ 20
తదా సుతుములం యుద్ధమ్ అభవల్లోమహర్షణమ్ ।
తతస్తే మృదవోఽభూవన్ గంధర్వాః శరపీడితాః ॥ 21
ఉచ్చుక్రుశుశ్చ కౌరవ్యాః గంధర్వాన్ ప్రేక్ష్య పీడితాన్ ।
గంధర్వులంతా ఒక్కటై కౌరవులపై పడ్డారు. అపుడు రోమాలు నిక్కపొడుచుకొనేంత భయంకరయుద్ధం జరిగింది. బాణాల తాకిడికి గంధర్వులు డీలా పడిపోయారు. గంధర్వులు బాధపడుతుంటే చూచి కౌరవులు పెడబొబ్బలు పెట్టారు. (20, 21 1/2)
గంధర్వాంస్త్రాసితాన్ దృష్ట్వా చిత్రసేనో హ్యమర్షణః ॥ 22
ఉత్సపాతాసనాత్ క్రుద్ధః వధే తేషాం సమాహితః ।
గంధర్వులు భయపడి వెనుకంజవేయటం చూసి చిత్రసేనుడు అసహనంతో తీవ్రంగా కోపించి, కౌరవులను చంపగోరి, ఆసనం నుండి ఎగిరి క్రిందికి ఉరికాడు. (22 1/2)
తయా ముహ్యంత కౌరవ్యాః చిత్రసేనస్య మాయయా ॥ 23
అపుడు విచిత్రయుద్ధపద్ధతులు తెలిసిన చిత్రసేనుడు మాయాస్త్రాన్ని ప్రయోగించాడు. చిత్రసేనుని మాయతో కౌరవులంతా మూర్ఛిల్లారు. (23)
ఏకైకో హి తదా యోధః ధార్తరాష్ట్రస్య భారత ।
పర్యవర్తత గంధర్వైః దశభిర్దశభిః సహ ॥ 24
జనమేజయా! అపుడు దుర్యోధనుని ఒక్కొక్క సైనికుని పదిమంది గంధర్వులు చుట్టుముట్టారు. (24)
తతః సంపీడ్యమానాస్తే బలేన మహతా తదా ।
ప్రాద్రవంత రణే భీతాః యే చ రాజన్ జిగీషవః ॥ 25
రాజా! చిత్రసేనుని ఆ మహాసైన్యం బాధపెడుతుంటే గెలవాలని వచ్చిన ఆ కౌరవసేనలు రణభయంతో పరుగులు పెట్టాయి. (25)
భజ్యమానేష్వనీకేషు ధార్తరాష్ట్రేషు సర్వశః ।
కర్ణో వైకర్తనో రాజన్ తస్థౌ గిరిరివాచలః ॥ 26
రాజా! కౌరవసేనలు అన్ని దిక్కులకూ పారిపోతుంటే సూర్యసుతుడైన కర్ణుడు మాత్రం కొండలా నిశ్చలంగా నిలిచాడు. (26)
దుర్యోధనశ్చ కర్ణశ్చ శకునిశ్చాపి సౌబలః ।
గంధర్వాన్ యోధయామాసుః సమరే భృశవిక్షతాః ॥ 27
రణంలో తీవ్రంగా గాయపడి కూడా దుర్యోధనుడు, కర్ణుడు, సౌబలుడైన శకుని గంధర్వులతో పోరాడుతూనే ఉన్నారు. (27)
సర్వ ఏవ తు గంధర్వః శతశోఽథ సహస్రశః ।
జిఘాంసమానాః సహితాః కర్ణమభ్యద్రవన్ రణే ॥ 28
గంధర్వులంతా గుమిగూడి కర్ణుని చంపాలనే వ్యూహంతో వందలుగా, వేలుగా గుంపులుగా విడిపోయి రణభూమిలో కర్ణుని ఎదిరించారు. (28)
అసిభిః పట్టిశైః శూలైః గదాభిశ్చ మహాబలాః ।
సూతపుత్రం జిఘాంసంతః సమంతాత్ పర్యవాకిరన్ ॥ 29
ఆ మహాబలులు కర్ణునిచంపగోరి కత్తులతో, పట్టిశాలతో, శూలాలతో, గదలతో కర్ణుని చుట్టుముట్టి మోదసాగారు. (29)
అన్యేఽస్య యుగమచ్ఛిందన్ ధ్వజమన్యే న్యపాదయన్ ।
ఈషామన్యే హయానన్యే సూతమన్యే న్యపాతయన్ ॥ 30
కొందరు రథం కాడిని విరగగొట్టారు. కొందరు ధ్వజాన్ని పడగొట్టారు. కొందరు నొగలు విరుగగొట్టారు. కొందరు గుర్రాలను పడగొట్టారు. ఇతరులు సారథిని పడగొట్టారు. (30)
అన్యే ఛత్రం వరూథం చ బంధురం చ తథాపరే ।
గంధర్వా బహుసాహస్రాః తిలశో వ్యధమన్ రథమ్ ॥ 31
ఇతరులు గొడుగును, కవచాన్ని, ఇరుసులను విరుగగొట్టారు. వేలకొలదిగ ఉన్న గంధర్వులు రథాన్ని నుగ్గు నుగ్గు చేశారు. (31)
తతో రథాదవప్లుత్య సూతపుత్రోఽసిచర్మభృత్ ।
వికర్ణరథమాస్థాయ మోక్షా యాశ్వానచోదయత్ ॥ 32
అపుడు కర్ణుడు కత్తిని, డాలునూ పట్టుకొని తనరథం నుండి దూకి, వికర్ణుని రథాన్ని ఎక్కి, ఆత్మరక్షణకై గుఱ్ఱాలను వేగంగా తోలాడు. (32)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఘోషయాత్రాపర్వణి కర్ణపరాభవే ఏకచత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 241 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఘోషయాత్రా పర్వమను ఉపపర్వమున కర్ణపరాభవమను రెండు వందల నలుబదియొకటవ అధ్యాయము. (241)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 31 1/2 శ్లోకాలు.)