242. రెండువందల నలువది రెండవ అధ్యాయము

గంధర్వులు దుర్యోధనాదులను అపహరించుట.

వైశంపాయన ఉవాచ
గంధర్వైస్తు మహారాజ భగ్నే కర్ణే మహారథే ।
సంప్రద్రవచ్చమూః సర్వాః ధార్తరాష్ట్రస్య పశ్యతః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. మహారాజా! మహారథుడైన కర్ణుని గంధర్వులు భంగపరచారు. దుర్యోధనుడు చూస్తుండగానే సైన్యమంతా పారిపోయింది. (1)
తాన్ దృష్ట్వా ద్రవతః సర్వాన్ ధార్తరాష్ట్రాన్ పరాఙ్ముఖాన్ ।
దుర్యోధనో మహారాజః నాసీత్ తత్ర పరాఙ్ముఖః ॥ 2
ధార్తరాష్ట్రులందరూ వెనుదిరిగి పారిపోతున్నా దుర్యోధనమహారాజు మాత్రం అక్కడ వెనుకంజవేయలేదు. (2)
తామాపతంతీం సంప్రేక్ష్య గంధర్వాణాం మహాచమూమ్ ।
మహతా శరవర్షేణ సోఽభ్యవర్షదరిందమః ॥ 3
మిక్కిలిగా ఉన్న ఆ గంధర్వసైన్యం మీద పడుతుంటే చూసి, అరిందముడైన దుర్యోధనుడు బాణాల జడివానను కురిపించాడు. (3)
అచింత్య శరవర్షం తు గంధర్వాస్తస్య తం రథమ్ ।
దుర్యోధనం జిఘాంసంతః సమంతాత్ పర్యవారయన్ ॥ 4
బాణవర్షాన్ని లెక్కచేయకుండా గంధర్వులు దుర్యోధనుని చందలచి, ఆయన రథాన్ని చుట్టుముట్టారు. (4)
యుగమీషాం వరూథం చ తథైవ ధ్వజసారథీ ।
అశ్వాంస్త్రివేణుం తల్పం చ తిలశో వ్యధమన శరైః ॥ 5
రథంకాడిని, నొగలును, కవచాన్ని, ధ్వజాన్ని, సారథిని, గుర్రాలను, గొడుగును, తల్పాన్నీ బాణాలతో నుగ్గుచేశారు. (5)
దుర్యోధనం చిత్రసేనః విరథం పతితం భువి ।
అభిద్రుత్య మహాబాహుః జీవగ్రాహమథాగ్రహీత్ ॥ 6
దుర్యోధనుడు రథం నుండి జారి నేలపై పడిపోగా, మహాబాహువైన చిత్రసేనుడు వేగంగా వ్చ్చి దుర్యోధనుని ప్రాణాలతో పట్టుకొన్నాడు. (6)
తస్మిన్ గృహీతే రాజేంద్ర స్థితం దుఃశాసనం రథే ।
పర్యగృహ్ణంత గంధర్వాః పరివార్య సమంతతః ॥ 7
రాజేంద్రా! దుర్యోధనుడు పట్టుపడగానే గంధర్వులు రథంపై నున్న దుశ్శాసనుని అన్నివైపుల నుండి దాడిచేసి పట్టుకొన్నారు. (7)
వివింశతిం చిత్రసేనమ్ ఆదాయాన్యే విదుద్రువుః ।
విందానువిందావపరే రాజదారాంశ్చ సర్వశః ॥ 8
కొందరు గంధర్వులు వివింశతిని, చిత్రసేనుని (దుర్యోధనుని సోదరుడు) బంధించి తీసికొనిపోయారు. మరికొందరు విందానువిందులను, రాజస్త్రీలను అదుపులోనికి తీసికొన్నారు. (8)
సైన్యం తద్ ధార్తరాష్ట్రస్య గంధర్వైః సమభిద్రుతమ్ ।
పూర్వం ప్రభగ్నాః సహితాః పాండవానభ్యయుస్తదా ॥ 9
గంధర్వులు ధార్తరాష్ట్రుని సేనను తరిమికొట్టారు. వారూ, అంతకుముందే గాయపడి పారిపోయి ఉన్నవారూ అందరూ కలిసి అప్పుడు పాండవుల శరణు కోరారు. (9)
శకటాపణవేశాశ్చ యానయుగ్యం చ సర్వశః ।
శరణం పాండవాన్ జగ్ముః హ్రియమాణే మహీపతౌ ॥ 10
దుర్యోధనుడు బంధింపబడగానే శకటాలు, ఆపణాలు, గుడారాలు, బండ్లు, వాహకాలు (ఎద్దు మొదలగునవి) మొత్తం వెంట బెట్టుకొని కౌరవసేనలు పాండవుల శరణుకోరారు. (10)
సైనికా ఊచుః
ప్రియదర్శీ మహాబాహుః ధార్తరాష్ట్రో మహాబలః ।
గంధర్వైర్ర్హియతే రాజా పార్థాస్తమనుధావత ॥ 11
సైనికులిలా అన్నారు. ప్రియదర్శి, మహాబాహువు, మహాబలుడు అయిన దుర్యోధననరపాలుని అపహరించుకొని పోతున్నారు గంధర్వులు. కౌంతేయులు - మీరు - వారిని వెంటాడాలి. (11)
దుఃశాసనో దుర్విషహః దుర్ముఖో దుర్జయస్తథా ।
బద్ ధ్వా హ్రియంతే గంధర్వైః రాజదారాశ్చ సర్వశః ॥ 12
గంధర్వులు దుఃశాసనుని, దుర్విషహుని, దుర్ముఖుని, దుర్జయుని, రాజస్త్రీలనందరినీ బంధించి తీసికొని పోతున్నారు. (12)
ఇతి దుర్యోధనామాత్యాః క్రోశంతః రాజగృద్ధినః ।
ఆర్తా దీనాస్తతః సర్వే యుధిష్ఠిరముపాగమన్ ॥ 13
రాజును కాపాడుకోవాలని ఆరాటపడుతున్న దుర్యోధనమంత్రులందరూ ఆర్తులై, దీనులై పైరీతిగా విలపిస్తూ యుధిష్ఠిరుని చెంతచేరారు. (13)
తాంస్తథా వ్యథితాన్ దీనాన్ భిక్షమాణాన్ యుధిష్ఠిరమ్ ।
వృద్ధాన్ దుర్యోధనామాత్యాన్ భీమసేనోఽభ్యభాషత ॥ 14
దుర్యోధనుని వృద్ధమంత్రులు ఆ రీతిగా బాధపడుతూ దీనంగా ధర్మరాజును అభ్యర్థించగా భీమసేనుడు వారితో ఇలా అన్నాడు. (14)
మహతా హి ప్రయత్నేన సంనహ్య గజవాజిభిః ।
అస్మాభిర్యదనుష్ఠేయం గంధర్వైస్తదనుష్ఠితమ్ ॥ 15
ఏనుగులను, గుర్రాలను సిద్ధం చేసికొని ఎంతో ప్రయత్నంతో మేము చేయవలసిన పనిని గంధర్వులే చేశారు. (15)
అన్వథా వర్తమానానామ్ అర్థో జాతోఽయమన్యథా ।
దుర్మంత్రితమిదం తావద్ రాజ్ఞో దుర్ద్యూతదేవినః ॥ 16
ఏదో చేయాలనుకొంటే మరేదో జరిగింది. కపటద్యూత మాడే దుర్యోధనమహారాజు ఆలోచనలో దారి తప్పాడు. విఫలమయ్యాడు. (16)
ద్వేష్టారమన్యే క్లీబస్య పాతయంతీతి నః శ్రుతమ్ ।
ఇదం కృతం నః ప్రత్యక్షం గంధర్వైరతిమానుషమ్ ॥ 17
బలహీనుని ద్వేషించేవానిని. మరొకరు పడగొడతారని విని యున్నాం. అలౌకికపరాక్రమంతో గంధర్వులు ఇప్పుడు కళ్ళకు కట్టి చూపారు. (17)
దిష్ట్యా లోకే పుమానస్తి కశ్చిదస్మత్ర్పియే స్థితః ।
యేనాస్మాకం హృతో భారః ఆసీనానాం సుఖావహః ॥ 18
మాభాగ్యం వలన లోకంలో ఒక్కడైనా మావైపు మొగ్గేవాడు కనిపించాడు. మా బరువును దించాడు. సుఖంగా కూర్చొనే వీలు కల్పించాడు. (18)
శీతవాతాతపసహాన్ తపసా చైవ కర్శితాన్ ।
సమస్థో విషమస్థాన్ హి ద్రష్టుమిచ్ఛతి దుర్మతిః ॥ 19
మేము చలి, గాలి, ఎండలను భరిస్తున్నాం. తపస్సుతో కృశించిపోయాం. విషమస్థితిలో ఉన్నాం. అయినా దుర్మార్గుడైన దుర్యోధనుడు సుఖంగా ఉంటూ కూడా దుర్దశలో ఉన్న మమ్ము చూడాలనుకొన్నాడు. (19)
అధర్మచారిణస్తస్య కౌరవ్యస్య దురాత్మనః ।
యే శీలమనువర్తంతే తే పశ్యంతి పరాభవమ్ ॥ 20
దురాత్ముడు, అధర్మప్రవర్తకుసు అయిన దుర్యోధనుని మార్గాన్ని అనుసరించే వారంతా పరాభవాన్ని పొందుతారు. (20)
అధర్మో హి కృతస్తేన యేనైతదుపశిక్షితమ్ ।
అనృశంసాస్తు కౌంతేయాః తత్ ప్రత్యక్షం బ్రవీమి నః ॥ 21
ఘోషయాత్ర చేయమని దుర్యోధనునకు సలహా ఇచ్చినవాడు అధర్మం చేసినట్లే. కౌంతేయులు క్రూరులు కారు. ఇది మీ ఎదుటనే చెప్తున్నా. (21)
ఏవం బ్రువాణం కౌంతేయం భీమసేనమపస్వరమ్ ।
న కాలః పరుషస్యాయమ్ ఇతి రాజాభ్యభాషత ॥ 22
కుంతీనందనుడైన భీమసేనుడు విలక్షణ స్వరంతో ఈరీతిగా మాటాడుతుండగా "ఇది పరుషవాక్యాలకు సమయం కాదు" అని ధర్మరాజు పలికాడు. (22)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఘోషయాత్రాపర్వణి దుర్యోధనాదిహరణే ద్విచత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 242 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఘోషయాత్రా పర్వమను ఉపపర్వమున దుర్యోధనాదిహరణమను రెండు వందల నలువది రెండవ అధ్యాయము. (242)