243. రెండు వందల నలువది మూడవ అధ్యాయము
దుర్యోధనుని విడిపించుటకు భీమసేనుని ఆదేశించుట - అర్జునుడు పత్రిజ్ఞ చేయుట.
యుధిష్ఠిర ఉవాచ
అస్మానభిగతాంస్తాత భయార్తాన్ శరణైషిణః ।
కౌరవాన్ విషమప్రాప్తాన్ కథం బ్రూయాస్త్వమీదృశమ్ ॥ 1
యుధిష్ఠిరుడిలా అన్నాడు.
నాయనా! కౌరవులు భయపడి, శరణుకోరి, మన దగ్గరకు వచ్చారు. కష్టాలలో ఉన్నారు. అటువంటి వారితో ఈ విధంగా ఎలా మాటాడగలుగుతున్నావు? (1)
భవంతి భేదా జ్ఞాతీనాం కలహాశ్చ వృకోదర ।
ప్రసక్తాని చ వైరాణి కులధర్మో న నశ్యతి ॥ 2
వృకోదరా! జ్ఞాతుల మధ్య భేదాలు, కలహాలు సహజమే. శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి. కానీ వంశధర్మం నశించదు. (2)
యదా తు కశ్చిద్ జ్ఞాతీనాం బాహ్యః పోథయతే కులమ్ ।
న మర్షయంతి తత్ సంతః బాహ్యేనాభిప్రధర్షణమ్ ॥ 3
ఎప్పుడైనా బయటివాడెవడో వచ్చి వంశస్థులపై ఆక్రమణ చేస్తే సత్పురుషులు దాన్ని - బయటివారు వచ్చిపబడటాన్ని - సహించరు. (3)
(పరైః పరిభవే ప్రాప్తే వయం పంచోత్తరం శతమ్ ।
పరస్పరవిరోధే తు వయం పంచ శతం తు తే ॥)
జానాత్యేష హి దుర్బుద్ధిః అస్మానిహ చిరోషితాన్ ।
స ఏవం పరిభూయాస్మాన్ అకార్షీదిదమప్రియమ్ ॥ 4
ఇతరులు అవమానిస్తుంటే మనం నూట అయిదుగురం. మనలో మనకు వైరుధ్యమేర్పడితే మనం అయిదుగురం, వారు నూర్గురు.
ఈ దుర్మార్గుడికి (చిత్రసేనుడికి) మనం చాలా రోజులుగా ఈ ప్రాంతంలోనే ఉంటున్నామని తెలుసు. అయినా మనలను తిరస్కరించి మనకు నచ్చని ఈ పని చేశాడు. (4)
దుర్యోధనస్య గ్రహణాద్ గంధర్వేణ బలాత్ ప్రభో ।
స్త్రీణాం బాహ్యాభిమర్శాచ్చ హతం భవతి నః కులమ్ ॥ 5
భీమా! గంధర్వుడు దుర్యోధనుని బలాత్కారంతో బంధించటం వలనా, పరాయివారెవరో కురుకుల కాంతలను అపహరించటం వలనా మనవంశ ప్రతిష్ఠ నశించిపోతుంది. (5)
శరణం చ ప్రపన్నానాం త్రాణార్థం చ కులస్య చ ।
ఉత్తిష్ఠత నరవ్యాఘ్రాః సజ్జీభవత మా చిరమ్ ॥ 6
నరోత్తములారా! శరణుకోరినవారిని కాపాడటానికీ, కులప్రతిష్ఠను నిలపటానికీ లేవండి. ఆలస్యం చేయకుండా సిద్ధంకండి. (6)
అర్జునశ్చ యమౌ చైవ త్వం చ వీరాపరాజితః ।
మోక్షయధ్వం నరవ్యాఘ్రాః ప్రియమాణం సుయోధనమ్ ॥ 7
నరోత్తములారా! అర్జునుడు, నకులసహదేవులు, ఓటమినెరుగని నీవు - అందరూ కలిసి గంధర్వులు కొనిపోతున్న సుయోధనుని విడిపించండి. (7)
ఏతే రథా నరవ్యాఘ్రాః సర్వశస్త్రసమన్వితాః ।
ధృతరాష్ట్రస్య పుత్రాణాం విమలాః కాంచనధ్వజాః ॥ 8
సస్వనానధిరోహధ్వం నిత్యసజ్జానిమాన్ రథాన్ ।
ఇంద్రసేనాదిభిః సూతైః కృతశస్త్రైరధిష్ఠితాన్ ॥ 9
ఏతానాస్థాయ వ యత్తాః గంధర్వాన్ యోద్ధుమాహవే ।
సుయోధనస్య మోక్షాయ ప్రయతధ్వమతంద్రితాః ॥ 10
నరోత్తములారా! ఇవిగో ధృతరాష్ట్రకుమారుల ఈ రథాలు కాంచనధ్వజాలతో నిర్మలంగా ఉన్నాయి. అన్ని శస్త్రాలతో నిండి ఉన్నాయి.
ఇంద్రసేనుడు మొదలయిన యుద్ధనిపుణులయిన సూతులచే అధిష్ఠింపబడి, సర్వదా సన్నద్ధంగా ఉన్నాయి. ఇవి వెడుతుంటే గొప్ప సవ్వడి వస్తుంది. ఈ రథాలను ఎక్కండి.
వీటినెక్కి రణరంగంలో అలసట లేకుండా గంధర్వులతో పోరాడి సుయోధనుని విడిపించండి. (9-10)
య ఏవ కశ్చిద్ రాజన్యః శరణార్థమిహాగతమ్ ।
పరం శక్త్యాభిరక్షేత కిం పునస్త్వం వృకోదర ॥ 11
భీమసేనా! సాధారణ రాజయినా శరణుకోరి దగ్గరకు వచ్చిన వానిని శక్తినంతా ఒడ్డి, రక్షిస్తాడు. నీవు శరణాగతుని రక్షించాలని మరలా చెప్పాలా? (11)
(వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తు కౌంతేయః పునర్వాక్యమభాషత ।
కోపసంరక్తనయనః పూర్వవైరమనుస్మరన్ ॥
వైశంపాయనుడిలా అన్నాడు -
ధర్మరాజు అలా పలుకగానే భీమసేనునికి కోపంతో కన్నులు ఎర్రబడ్డాయి. పూర్వశత్రుత్వాన్ని తలచుకొంటూ మరలా ఇలా అన్నాడు.
భీమ ఉవాచ
పురా జతుగృహేఽనేన దగ్ధుమస్మాన్ యుధిష్ఠిర ।
దుర్బుద్ధిర్హి కృతా వీర భృశం దైవేన రక్షితాః ॥
భీముడిలా అన్నాడు.
వీరా! యుధిష్ఠిరా! గతంలో మనలనందరినీ లక్కయింటిలో తగులబెట్టాలని దురాలోచన చేసిన వాడితడు. కాని దైవం మనలను కాపాడింది.
కాలకూటం విషం తీక్ష్ణం భోజనే మమ భారత ।
ఉప్త్వా గంగాం లతాపాశైః బద్ ధ్వా చ ప్రాక్షిపత్ ప్రభో ॥
భారతా! మహారాజా! నా భోజనంలో శక్తిమంతమైన కాలకూటవిషాన్ని కలిపి, తీగెలతో బంధించి, గంగలోనికి త్రోశారు.
ద్యూతకాలే హి కౌంతేయ వృజినాని కృతాని వై ।
ద్రౌపద్యాశ్చ పరామర్శః కేశగ్రహణమేవ చ ॥
వస్త్రాపహరణం చైవ సభామధ్యే కృతాని వై ।
పురాకృతానాం పాపానాం ఫలం భుంక్తే సుయోధనః
కౌంతేయా! జూదమాడిన వేళలో కూడా ఎన్నో పాపాలు చేశారు. ద్రౌపదిని పట్టి లాగారు. జుట్టుపట్టుకొన్నారు. నిండుకొలువులో వస్త్రాపహరణం చేశారు. నాడు చేసిన పాపాల ఫలితాన్ని అనుభవిస్తున్నాడు సుయోధనుడు.
అస్మాభిరేవ కర్తవ్యః ధార్తారాష్ట్రస్య నిగ్రహః ।
అన్యేన తు కృతం తచ్చ మైత్య్రమస్మాభిరిచ్ఛతా ॥
ఉపకారీ తు గంధర్వః మా రాజన్ విమనా భవ ।
అసలు మనమే సుయోధనుని బంధించి శిక్షించవలసినది. కానీ మరెవరో మనతో మైత్రిని కోరుతూ ఆ పని చేశారు. గంధర్వుడు మనకు మేలే చేశాడు. రాజా! కోపించవద్దు.
వైశంపాయన ఉవాచ
ఏతస్మిన్నంతరే రాజన్ చిత్రసేనేన వై హృతః ।
విలలాప సుదుఃఖార్తః హ్రియమాణః సుయోధనః ।
రాజా! జనమేజయా! ఆ సమయంలోవే చిత్రసేనుడు అపహరించుకొనిపోతున్న దుర్యోధనుడు మిక్కిలి దుఃఖంతో విలపించాడు.
దుర్యోధన ఉవాచ
పాండుపుత్ర మహాబాహో పౌరవాణాం యశస్కర ॥
సర్వధర్మభృతాం శ్రేష్ఠ గంధర్వేణ హృతం బలాత్ ।
రక్షస్వ పురుషవ్యాఘ్ర యుధిష్ఠీర మహాయశాః ॥
భ్రాతరం తే మహాబాహో బద్ధ్వా నయతి మామయమ్ ।
దుఃశాసనం దుర్విషహం దుర్ముఖం దుర్జయం తథా ॥
బద్ ధ్వా హరంతి గంధర్వాః అస్మద్దారాంశ్చ సర్వశః ।
అనుధావత మాం క్షిప్రం రక్షధ్వం పురుషోత్తమాః ॥
వృకోదర మహాబాహో ధనంజయ మహాయశః ।
యమౌ మామనుధావేతాం రక్షార్థం మమ సాయుధౌ ॥
కురువంశస్య తు మహద్ అయశః ప్రాప్తమీదృశమ్ ।
వ్యపోహయధ్వం గంధర్వాన్ జిత్వా వీర్యేణ పాండవాః ॥
దుర్యోధనుడిలా అన్నాడు.
పాండుకుమారా! మహాబాహూ! పురువంశకీర్తికారకా! ధర్మవేత్తలలో శ్రేష్ఠుడా! పురుషవ్యాఘ్రా! యుధిష్ఠిరా! మహాయశస్వీ, నీ సోదరుని నన్ను రక్షించు. ఈ గంధర్వుడు నన్ను బంధించి కొనిపోతున్నాడు. ఈ గంధర్వులు దుఃశాసనుని, దుర్విషహుని, దుర్ముఖుని, దుర్జయుని నా భార్యలనందరినీ కూడా బంధించి కొనిపోతున్నారు. పురుషోత్తములారా! వారిని వెంబడించండి. నన్ను త్వరగా రక్షించండి. మహాబాహూ వృకోదరా! కీర్తిశాలీ అర్జునా! నకులసహదేవులారా! ఆయుధాలతో నావెంట పరుగెత్తండి. నన్ను రక్షించండి. కురువంశానికి ఈ రీతిగా గొప్ప అపకీర్తి కలిగింది. పాండు కుమారులారా! మీ పరాక్రమంతో గంధర్వులను జయించి అపకీర్తిని తొలగించండి.
వైశంపాయన ఉవాచ
ఏవం విలపమానస్య కౌరవస్యార్తయా గిరా।
శ్రుత్వా విలాపం సంభ్రాంతః ఘృణయాభిపరిప్లుతః ।
యుధిష్ఠిరః పునర్వాక్యం భీమసేనమథాబ్రవీత్ ॥
వైశంపాయనుడిలా అన్నాడు.
ఈ రీతిగా దీనస్వరంలో విలపిస్తున్న సుయోధనుని విలాపాన్ని విని, జాలితో తడిసిపోయిన ధర్మరాజు భీమసేనునితో మరలా ఇలా అన్నాడు.
క ఇహార్యో భవేత్ త్రాణమ్ అభిధావేతి నోదితః ।
ప్రాంజలిం శరణాపన్నం దృష్ట్వా శత్రుమపి ధ్రువమ్ ॥ 12
చేతులు జోడించి, శరణూగోరి "పరుగెత్తండి! రక్షించండి" అని ప్రార్థిస్తే అతడు శత్రువయినా సరే, రక్షించటానికి ప్రయత్నించని పురుషోత్తముడెవడుంటాడు? (12)
వరప్రదానం రాజ్యం చ పుత్రజన్మ చ పాండవాః ।
శత్రోశ్చ మోక్షణం క్లేశాత్ త్రీణి చైకంచ తత్సమమ్ ॥ 13
పాండవులారా! వరప్రదానం, రాజ్యప్రదానం, పుత్రుని కల్గించటం, శత్రువును ఇబ్బందులలో నుండి రక్షించటం - ఈ నాలుగింటిలో మొదటి మూడింటితో నాలుగవది సమానం. (13)
కిం చాప్యధికమేతస్మాద్ యదాపన్నః సుయోధనః ।
త్వద్బాహుబలమాశ్రిత్య జీవితం పరిమార్గతే ॥ 14
భీమా! నీకింతకన్నా ఆనందించదగిన దేముంటుంది? సుయోధనుడు ఆపదలలో చిక్కి, నీ బాహుబలాన్ని ఆసరా చేసికొని, ప్రాణాలు కాపాడుకోవాలనుకొంటున్నాడు. (14)
స్వయమేవ ప్రధావేయం యది న స్యాద్ వృకోదర ।
వితతో మే క్రతుర్వీరం న హి మేఽత్ర విచారణా ॥ 15
భీమసేనా! ఈ యజ్ఞాన్ని ఉపక్రమించకుండా ఉంటే దుర్యోధనుని రక్షించటానికి నేనే వెళ్ళిఉండేవాణ్ణి. మరొక ఆలోచన చేసేవాడిని కాదు. (15)
సామ్నైవ తు యథా భీమ మోక్షయేథాః సుయోధనమ్ ।
తథా సర్వైరుపాయైస్త్వం యతేథాః కురునందన ॥ 16
కురునందనా! భీమా! మంచిమాటలతోనే ఎలాగైనా సరే, సుయోధనుని విడిపించటానికి ప్రయత్నించు, సర్వోపాయాలతో అలాగే ప్రయత్నం చేయి. (16)
న సామ్నా ప్రతిపద్యేత యది గంధర్వరాడసౌ ।
పరాక్రమేణ మృదునా మోక్షయేథాః సుయోధనమ్ ॥ 17
మంచిమాటలతో ప్రయత్నిస్తే ఆ గంధర్వరాజు వినకపోతే మార్దవంతో కూడిన పరాక్రమంతో సుయోధనుని విడిపించు. (17)
అథాసౌ మృదుయుద్ధేన న ముంచేద్ భీమ కౌరవాన్ ।
సర్వోపాయైర్విమోచ్యాస్తే నిగృహ్య పరిపంథినః ॥ 18
భీమో! మృదుపరాక్రమంతో యుద్ధం చేసినా కౌరవులను చిత్రసేనుడు విడువకపోతే సర్వోపాయాలను ఆశ్రయించి, శత్రువులను బంధించి కౌరవులను విడిపించాలి. (18)
ఏతావద్ధి మయా శక్యం సందేష్టుం వై వృకోదర ।
వైతానే కర్మణి తతే వర్తమానే చ భారత ॥ 19
భారతా! వృకోదరా! ప్రస్తుతం నేను యజ్ఞకర్మలో ఉన్నాను. కాబట్టి ఇంతమాత్రమే చెప్పగలను. (19)
వైశంపాయన ఉవాచ
అజాతశత్రోర్వచనం తచ్ఛ్రుత్వా తు ధనంజయః ।
ప్రతిజజ్ఞే గురోర్వాక్యం కౌరవాణాం విమోక్షణమ్ ॥ 20
వైశంపాయనుడిలా అన్నాడు.
అజాతశత్రువయిన ధర్మజుని మాట విని అర్జునుడు అన్నమాట మేరకు కౌరవులను విడిపించటానికి ప్రతిజ్ఞ చేశాడు (20)
అర్జున ఉవాచ
యది సామ్నా న మోక్ష్యంతి గంధర్వా ధృతరాష్ట్రజాన్ ।
అద్య గంధర్వరాజస్య భూమిః పాస్యతి శోణితమ్ ॥ 21
అర్జునుడిలా అన్నాడు.
మంచిమాటలతో గంధర్వులు ధార్తరాష్ట్రులను విడువకపోతే నేడు పృథివి ఆ గంధర్వరాజు నెత్తురు త్రాగుతుంది. (21)
అర్జునస్య తు తాం శ్రుత్వా ప్రతిజ్ఞాం సత్యవాదినః ।
కౌరవాణాం తదా రాజన్ పునః ప్రత్యాగతం మనః ॥ 22
రాజా! సత్యవచనుడైన అర్జునుని ప్రతిజ్ఞ విని, కౌరవుల మనస్సులు కుదుటబడ్డాయి (22)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఘోషయాత్రాపర్వణి దుర్యోధనమోచనానుజ్ఞాయాం త్రిచత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 243 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఘోషయాత్రా పర్వమను ఉపపర్వమున దుర్యోధనమోచనానుజ్ఞయను రెండు వందల నలువది మూడవ అధ్యాయము. (243)
(దాక్షిణాత్య అధికపాఠం 15 1/2 శ్లోకాలతో కలిపి మొత్తం 37 1/2 శ్లోకాలు.)