246. రెండు వందల నలువది ఆరవ అధ్యాయము
దుర్యోధనుడు విడుదల అగుట.
వైశంపాయన ఉవాచ
వైశంపాయన ఉవాచ
తతోఽర్జునశ్చిత్రసేనం ప్రహసన్నిదమబ్రవీత్ ।
మధ్యే గంధర్వసైన్యానాం మహేష్వాసో మహాద్యుతిః ॥ 1
కిం తే వ్యవసితం వీర కౌరవాణాం వినిగ్రహే ।
కిమర్థం చ సదారోఽయం నిగృహీతః సుయోధనః ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు.
ఆపై మేటి విలుకాడు, మేటివన్నెకాడు అయిన అర్జునుడు గంధర్వసేనలమధ్య నిలిచి, నవ్వుతూ, చిత్రసేనునితో ఇలా అన్నాడు. "వీరుడా! కౌరవులను బంధించటంలో నీ భావమేమిటి? రాణులతో సహా సుయోధనుని ఎందుకు బంధించావు?" (1,2)
చిత్రసేన ఉవాచ
విదితోఽయమభిప్రాయః తత్రస్థేన దురాత్మనః ।
దుర్యోధనస్య పాపస్య కర్ణస్య చ ధనంజయ ॥ 3
వనస్థాన్ భవతో జ్ఞాత్వా క్లిశ్యమానాననాథవత్ ।
సమస్థో విషమస్థాంస్తాన్ ద్రక్ష్యామీత్యనవస్థితాన్ ॥ 4
ఇమేఽవహసితుం ప్రాప్తాః ద్రౌపదీం చ యశస్వినీమ్ ।
జ్ఞాత్వా చికీర్షితం చైషాం మామువాచ సురేశ్వరః ॥ 5
చితసేనుడిలా అన్నాడు.
అర్జునా! దురాత్ముడయిన ఈ దుర్యోధనుడు, పాపాత్ముడైన ఈ కర్ణుడు చేస్తున్న దురాలోచనను దేవేంద్రుడు గ్రహించాడు. మీరు అనాథల వలె అరణ్యంలో సంచరిస్తూ, కష్టాలు పడుతూ, విషమస్థితిలో ఉండగా ఆ స్థితిలో మిమ్ములను చూడాలని, బాధించాలని హాయిగా ఉన్న ఈ సుయోధనుడు భావించాడు. కీర్తిశాలిని అయిన ద్రౌపదిని గేలిచేయాలని వీరు వచ్చారు. వీరు చేయనెంచిన పనిని గ్రహించి, దేవేంద్రుడు నన్ను ఇలా ఆదేశించాడు. (3-5)
గచ్ఛ దుర్యోధనం బద్ ధ్వా సహామాత్యమిహానయ ।
ధనంజయశ్చ తే రక్ష్యః సహ భ్రాతృభిరాహవే ॥ 6
స చ ప్రియః సఖా తుభ్యం శిష్యశ్చ తవ పాండవః ।
"వెళ్లు! దుర్యోధనుని మంత్రులతో సహా బంధించి ఇక్కడకు తీసికొనిరా! అర్జునుని, అతని సోదరులను కూడా రక్షించాలి. ఆ అర్జునుడు నీకు ప్రియమిత్రుడు, శిష్యుడు కూడా." (6 1/2)
వచనాద్ దేవరాజస్య తతోఽస్మీహాగతో ద్రుతమ్ ॥ 7
అయం దురాత్మా బద్ధశ్చ గమిష్యామి సురాలయమ్ ।
నేష్యామ్యేనం దురాత్మానం పాకశాసనశాసనాత్ ॥ 8
దేవేంద్రుని ఆదేశాన్ని అనుసరించి వెంటనే ఇక్కడకు వచ్చాను. ఈ దుర్యోధనుని బంధించాను. ఇక స్వర్గానికి వెళతాను. దేవేంద్రుని శాసనం మేరకు ఈ దుర్మార్గుణ్ణి స్వర్గలోకానికి తీసికొనిపోతాను. (7,8)
అర్జున ఉవాచ
ఉత్సృజ్యతాం చిత్రసేన భ్రాతాస్మాకం సుయోధనః ।
ధర్మరాజస్య సందేశాత్ మమ చేదిచ్ఛసి ప్రియమ్ ॥ 9
అర్జునుడిలా అన్నాడు.
చిత్రసేనా! ఈ దుర్యోధనుడు మా సోదరుడు. నాకు నచ్చినపని చేయాలనుకొంటే, ధర్మరాజు ఆదేశం మేరకు ఇతనిని విడిచిపెట్టు. (9)
చిత్రసేన ఉవాచ
పాపోఽయం నిత్యసంతుష్టః న విమోక్షణమర్హతి ।
ప్రలబ్ధా ధర్మరాజస్య కృష్ణాయాశ్చ ధనంజయ ॥ 10
చిత్రసేనుడిలా అన్నాడు.
'అర్జునా! ఈ పాపాత్ముడు రాజ్యభోగాల ననుభవిస్తూ ఆనందంతో పోతరించి ఉన్నాడు. ధర్మజుని, ద్రౌపదిని కూడా మోసగించిన ఇతనిని విడిచిపెట్టకూడదు. (10)
నేదం చికీర్షితం తస్య కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
జానాతి ధర్మరాజో హి శ్రుత్వా కురు యథేచ్ఛసి ॥ 11
కౌంతేయుడు, యుధిష్ఠిరుడైన ధర్మరాజుకు సుయోధనుని ఈ దురాలోచన తెలియదు. దీనిని విన్నావు గదా! ఎలా నచ్చితే అలా చేయి.' (11)
వైశంపాయన ఉవాచ
తే సర్వ ఏవ రాజానమ్ అభిజగ్ముర్యుధిష్ఠిరమ్ ।
అభిగమ్య చ తత్ సర్వం శశంసుస్తస్య చేష్టితమ్ ॥ 12
వైశంపాయనుడిలా అన్నాడు.
వారంతా ధర్మరాజు దగ్గరకు వెళ్ళారు. దుర్యోధనుని దుశ్చర్యల నన్నింటినీ వివరించారు. (12)
అజాతశత్రుస్తచ్ఛ్రుత్వా గంధర్వస్య వచస్తదా ।
మోక్షయామాస తాన్ సర్వాన్ గంధర్వాన్ ప్రశశంస చ ॥ 13
అజాతశత్రువు (ధర్మరాజు) ఆ గంధర్వవచనాన్ని విని, కౌరవుల నందరినీ విడిపించాడు. గందర్వులను ఇలా ప్రశంసించాడు. (13)
దిష్ట్యా భవద్భిర్బలిభిః శక్తైః సర్వైర్న హింసితః ।
దుర్వృత్తో ధార్తరాష్ట్రోఽయం సామాత్యజ్ఞాతిబాంధవః ॥ 14
మీరంతా బలవంతులు, శక్తిసంపన్నులు. అయినా దుర్మార్గుడైన ఈ దుర్యోధనుని అమాత్యులు, సోదరులు, బంధువులతో సహా మీరు హింసించకపోవటం అదృష్టం. (14)
ఉపకారో మహాంస్తాత కృతోఽయం మమ ఖేచరైః ।
కులం న పరిభూతం మే మోక్షణేఽస్య దురాత్మనః ॥ 15
నాయనా! గగనచారులయిన మీరు నాకెంతో ఉపకారం చేశారు. ఈ దుర్మార్గుని విడిపించారు. మా వంశానికి పరాభవాన్ని నిలవరించారు. (15)
ఆజ్ఞాపయధ్వమిష్టాని ప్రీయమో దర్శనేన వః ।
ప్రాప్య సర్వానభిప్రాయాన్ తతో వ్రజత మా చిరమ్ ॥ 16
మేమేం చేయాలో ఆజ్ఞాపించండి. మీ దర్శనంతో ఆనందిస్తున్నాం. మీకు నచ్చిన వాటినన్నింటినీ స్వీకరించి ఇక్కడ నుండి త్వరగానే వెళ్ళవచ్చు. (16)
అనుజ్ఞాతాస్తు గంధర్వాః పాండుపుత్రేణ ధీమతా ।
సహాప్సరోభిః సంహృష్టాః చిత్రసేనముఖా యయుః ॥ 17
ధీమంతుడైన ధర్మరాజు అనుమతిని గైకొని, చిత్రసేనాది గంధర్వులు అప్సరసలతో సహా నిష్క్రమించారు. (17)
(దేవలోకం తతో గతా గంధర్వైః సహితస్తదా ।
న్యవేదయచ్చ తత్ సర్వం చిత్రసేనః శతక్రతోః ॥)
దేవరాడపి గంధర్వాన్ మృతాంస్తాన్ సమజీవయత్ ।
దివ్యేనామృతవర్షేణ యే హతాః కౌరవైర్యుధి ॥ 18
ఆపై చిత్రసేనుడు గంధర్వులతో కలిసి, దేవలోకానికి వెళ్ళి, జరిగినదంతా ఇంద్రునకు తెలియజేశాడు.
దేవేంద్రుడు కౌరవులతో యుద్ధం చేస్తూ మరణించిన గంధర్వుల నంధరినీ దివ్యామృతవర్షంతో మళ్ళీ బ్రతికించాడు. (18)
జ్ఞాతీంస్తానవముచ్యాథ రాజదారాంశ్చ సర్వశః ।
కృత్వా చ దుష్కరం కర్మ ప్రీతియుక్తాశ్చ పాండవాః ॥ 19
సస్త్రీకుమారైః కురుభిః పూజ్యమానా మహారథాః ।
బభ్రాజిరే మహాత్మానః క్రతుమధ్యే యథాగ్నయః ॥ 20
ఈ రీతిగా జ్ఞాతులను, రాజకులస్త్రీలను అందరిని విడిపించి, అసాధారణమైన పని చేయగలిగినందులకు పాండవులంతా ఆనందించారు. మహాత్ములు, మహారథులైన ఆ పాండవులను స్త్రీబాలకులతో సహా కౌరవులందరూ పూజించారు. యాగమధ్యంలోని అగ్నులవలె పాండవులు ప్రకాశించారు. (19,20)
తతో దుర్యోధనం ముక్తం భ్రాతృభిః సహితస్తదా ।
యుధిష్ఠిరస్తు ప్రణయాద్ ఇదం వచనమబ్రవీత్ ॥ 21
అప్పుడు సోదరులతో కలిసి ధర్మరాజు బంధవిముక్తుడైన దుర్యోధనునితో ప్రేమగా ఇలా అన్నాడు. (21)
మా స్మ తాత పునః కార్షీః ఈదృశం సాహసం క్వచిత్ ।
న హి సాహసకర్తారః సుఖమేధంతి భారత ॥ 22
భారతా! మరల ఎప్పుడు ఇటువంటి సాహసం చేయవద్దు. సాహసికులకు సుఖముండదు. (22)
స్వస్తిమాన్ సహితః సర్వైః భ్రాతృభిః కురునందన ।
గృహాన్ వ్రజ యథాకామం వైమనస్యం చ మా కృథాః ॥ 23
కురునందనా! నీ సోదరులతో కలిసి క్షేమంగా, స్వేచ్ఛగా ఇంటికి వెళ్ళు. మనస్సులో ఏమీ పెట్టుకోవద్దు. (23)
వైశంపాయన ఉవాచ
పాండవేనాభ్యనుజ్ఞాతః రాజా దుర్యోధనస్తదా ।
ప్రణమ్య ధర్మపుత్రం తు గతేంద్రియ ఇవాతురః ॥ 24
విదీర్యమాణో వ్రీడావాన్ జగామ నగరం ప్రతి ।
వైశంపాయనుడిలా అన్నాడు.
ధర్మరాజు అనుమతి పొంది, అప్పుడు దుర్యోధనుడు ఆయనకు నమస్కరించి, నగరానికి బయలుదేరాడు. అవయవాలు పనిచేయని రోగివలె సిగ్గుతో అతడు బ్రద్దలవుతున్నాడు. (24)
తస్మిన్ గతే కౌరవేయే కుంతీపుత్రో యుధిష్ఠిరః ॥ 25
భ్రాతృభిః సహితో వీరః పూజ్యమానో ద్విజాతిభిః ।
తపోధనైశ్చ తైః సర్వైః వృతః శక్ర ఇవామరైః ॥ 26
తథా ద్వైతవనే తస్మిన్ విజహార ముదా యుతః ॥ 27
దుర్యోధనుడు వెళ్ళగానే వీరుడైన కుంతీసుతుడు - ధర్మరాజు - సోదరులు, బ్రాహ్మణులు, తాపసులు పూజిస్తూ ఉండగా దేవతలమధ్యనున్న దేవేంద్రుని వలె ప్రకాశిస్తూ ద్వైతవనంలో ఆనందంగా విహరించాడు. (25-27)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఘోషయాత్రాపర్వణి దుర్యోధనమోక్షణే షట్ చత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 246 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఘోషయాత్రా పర్వమను ఉపపర్వమున దుర్యోధనమోక్షణమను రెండువందల నలువది యారవ అధ్యాయము. (246)
(దాక్షిణాత్య అధికపాఠం 1 శ్లోకంతో కలిపి మొత్తం 28 శ్లోకాలు.)