247. రెండు వందల నలువది ఏడవ అధ్యాయము
దుర్యోధనుడు విశ్రమించుట.
జనమేజయ ఉవాచ
శత్రుభిర్జితబద్ధస్య పాండవైశ్చ మహాత్మభిః ।
మోక్షితస్య యుధా పశ్చాత్ మానినః సుదురాత్మనః ॥ 1
కత్థవస్యావలిప్తస్య గర్వితస్య చ నిత్యశః ।
సదా చ పౌరుషౌదార్యైః పాండవానవమన్యతః ॥ 2
దుర్యోధనస్య పాపస్య నిత్యాహంకారవాదినః ।
ప్రవేశో హాస్తినపురే దుష్కరః ప్రతిభాతి మే ॥ 3
తస్య లజ్జాన్వితస్యైవ శోకవ్యాకులచేతసః ।
ప్రవేశం విస్తరేణ త్వం వైశంపాయన కీర్తయ ॥ 4
జనమేజయుడిలా అన్నాడు.
శత్రువులు దుర్యోధనుని ఓడించి బంధించారు. మహాత్ములయిన పాండవులు గంధర్వులతో పోరాడి అతనిని విడిపించారు. ఈ స్థితిలో అభిమాని, దురాత్ముడు, ఆత్మశ్లాఘి, మదించినవాడు, ఎప్పుడూ గర్వంతో విర్రవీగేవాడు, తన పౌరుషంతో, ఔదార్యంతో పాండవుల నెప్పుడూ పరాభవించేవాడు, పాపాత్ముడు, నిత్యమూ అహంకారంతో మాటాడేవాడు అయిన దుర్యోధనుడు మరల హస్తినలో ప్రవేశించటం చాలా కష్టం. వైశంపాయనా! శోకకలుషితమైన మనస్సుతో, సిగ్గుతో ఆ సుయోధనుడు హస్తినలో ప్రవేశించిన రీతిని వివరంగా చెప్పు. (1-4)
వైశంపాయన ఉవాచ
ధర్మరాజనిసృష్టస్తు ధార్తరాష్ట్రః సుయోధనః ।
లజ్జయాధోముఖః సీదన్ ఉపాసర్పత్ సుదుఃఖితః ॥ 5
వైశంపాయనుడిలా అన్నాడు.
ధర్మరాజు విడిపించగా ధృతరాష్ట్రసుతుడైన దుర్యోధనుడు సిగ్గుతో తలవంచుకొని, దుఃఖంతో ఖిన్నుడై, నిష్క్రమించాడు. (5)
స్వపురం ప్రయయౌ రాజా చతురంగబలానుగః ।
శోకోపహతయా బుద్ధ్యా చింతయానః పరాభవమ్ ॥ 6
శోకంతో మతి చెదరగా జరిగిన పరాభవాన్నే తలచుకొంటూ, సుయోధనుడు చతురంగబలాలు అనుసరిస్తుండగా నగరానికి బయలుదేరాడు. (6)
విముచ్య పథి యానాని దేశే సుయవసోదకే ।
సంనివిష్టః శుభే రమ్యే భూమిభాగే యథేప్సితమ్ ॥ 7
హస్త్యశ్వరథపాదాతం యథాస్థానం న్యవేశయత్ ।
మార్గమధ్యంలో ఆహారం, నీరు బాగా దొరికే చోట వాహనాలను వీడి, ఒక రమణీయమైన భూభాగంలో తన ఇచ్చవచ్చినట్లు నిలిచి, చతురంగబలాలను (ఏనుగులు, గుర్రాలు, రథాలు, సైనికులు) వారి వారికి అనువైన ప్రదేశాలలో నిలువమన్నాడు (7 1/2)
అథోపవిష్టం రాజానం పర్యంకే జ్వలనప్రభే ॥ 8
ఉపప్లుతం యథా సోమం రాహుణా రాత్రిసంక్షయే ।
ఆపై అగ్నిజ్వాలలవలె ప్రకాశిస్తున్న శయ్యపై కూర్చున్నాడు. నిశావసానవేళలో రాహుగ్రస్తుడైన చంద్రుడు కాంతిహీనుడైనట్లు దుర్యోధనుడు శోభనుకోల్పోయి ఉన్నాడు. (8 1/2)
ఉపాగమ్యాబ్రవీత్ కర్ణః దుర్యోధనమిదం తదా ॥ 9
దిష్ట్యా జీవసి గాంధారే దిష్ట్యా నః సంగమః పునః ।
దిష్ట్యా త్వయా జితాశ్చైవ గంధర్వాః కామరూపిణః ॥ 10
అప్పుడు కర్ణుడు దుర్యోధనుని సమీపించి ఇలా అన్నాడు. 'సుయోధనా! అదృష్టం వలన బ్రతికిపోయావు. దానివల్లనే మనం మరలా కలిశాం. భాగ్యవశాన కామరూపులయిన గంధర్వులను కూడా గెలవగలిగాం. (9,10)
దిష్ట్యా సమగ్రాన్ పశ్యామి భ్రాతౄం స్తే కురునందన ।
విజిగీఘాన్ రణే యుక్తాన్ నిర్జితారీన్మహారథాన్ ॥ 11
కురునందనా! అదృష్టవశాన నీ సోదరుల నందరినీ మరల చూడగలుగుతున్నా. వారు జయశీలురు, రణాసక్తులు, శత్రువులను ఓడించిన మహారథులు. (11)
అహం త్వభిద్రుతః సర్వైః గంధర్వైః పశ్యతస్తవ ।
నాశక్నువం స్థాపయితుం దీర్యమాణాం చ వాహినీమ్ ॥ 12
నీవు చూస్తుండగానే గంధర్వులందరూ నన్ను పరుగెత్తించారు. చెదరిపోయే సేనౌ కూడా నేను నిలువరించలేకపోయాను. (12)
శరక్షతాంగశ్చ భృశం వ్యపయాతోఽభిపీడితః ।
ఇదం త్వత్యద్భుతం మన్యే యద్ యుష్మానిహ భారత ॥ 13
అరిష్టానక్షతాంశ్చాపి సదారబలవాహనాన్ ।
విముక్తాన్ సంప్రపశ్యామి యుద్ధాత్ తస్మాదమానుషాత్ ॥ 14
బాణాల తాకిడితో తీవ్రంగా గాయపడి బాధతో పారిపోయాను. భారతా! ఇది చాలా అద్భుతంగా ఉన్నది. అమానుషమైన ఆ యుద్ధంలో గాయపడకుండ, నష్టపోకుండా అంతఃపురస్త్రీలతో, సేనలతో, వాహనాలతో విముక్తిపొందిన మిమ్ము చక్కగా చూడగలుగుతున్నాను. (13,14)
నైతస్య కర్తా లోకేఽస్మిన్ పుమాన్ భారత విద్యతే ।
యత్ కృతం తే మహారాజ సహ భ్రాతృభిరాహవే ॥ 15
భారతా! మహారాజా! నీ సోదరులతో కలిసి యుద్ధంలో నీవు ప్రదర్శించిన పరాక్రమం వంటి పరాక్రమాన్న్ ప్రదర్శించగలవాడు లోకంలో మరొకడు లేడు.' (15)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తు కర్ణేన రాజా దుర్యోధనస్తదా ।
ఉవాచ చాంగరాజానం బాష్పగద్గదయా గిరా ॥ 16
వైశంపాయనుడిలా అన్నాడు.
కర్ణుని మాటలు విని, దుర్యోధననరపతి బాష్పగద్గదమైన వాక్కుతో అంగరాజుతో ఇలా అన్నాడు. (16)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఘోషయాత్రాపర్వణి కర్ణదుర్యోధనసంవాదే సప్తచత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 247 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఘోషయాత్రా పర్వమను ఉపపర్వమున కర్ణదుర్యోధన సంవాదమను రెండు వందల నలువది యేడవ అధ్యాయము. (247)