248. రెండు వందల నలువది యెనిమిదవ అధ్యాయము

దుర్యోధనుడు తన పరాజయమును వివరించుట.

దుర్యోధన ఉవాచ
అజానతస్తే రాధేయ నాభ్యసూయామ్యహం వచః ।
జానాసి త్వం జితాన్ శత్రూన్ గంధర్వాంస్తేజసా మయా ॥ 1
దుర్యోధనుడిలా అన్నాడు.
రాధేయా! నీకు విషయమంతా తెలియదు. అందుకే ఇలా మాటాడుతున్నా నేను కోపించటం లేదు. నా పరాక్రమంతో నేను గంధర్వులను ఓడించిన విషయం నీకు తెలుసు. (1)
ఆయోధితాస్తు గంధర్వాః సుచిరం సోదరైర్మమ ।
మయా సహ మహాబాహో కృతశ్చోభయతః క్షయః ॥ 2
మహాబాహూ! నా సోదరులు నాతో కలిసి చాలాసేపు గంధర్వులతో పోరాడారు. ఇరువైపులా నష్టం జరిగింది. (2)
మాయాధికాస్త్వయుధ్యంత యదా శూరా వియద్గతాః ।
తదా నో న సమం యుద్ధమ్ అభవత్ ఖేచరైః సహ ॥ 3
అయితే మాయగలవారు కాబట్టి వారు అధికులు. ఆ గంధర్వవీరులు గగనచారులై యుద్ధం చేసినప్పుడే వారితో సమానంగా మేము యుద్ధం చేయలేకపోయాం. (3)
పరాజయం చ ప్రాప్తాః స్మః రణే బంధనమేవ చ ।
సభృత్యామాత్యపుత్రాశ్చ సదారబలవాహనాః ॥ 4
యుద్ధంలో ఓడిపోయాం. సేవకులతో, మంత్రులతో, పుత్రులతో, అంతఃపురకాంతలతో, సేనలతో, వాహనాలతో సహా బందీల మయ్యాం. (4)
ఉచ్చైరాకాశమార్గేణ హృతాః స్మస్తైః సుదుఃఖితాః ।
అథ నః సైనికాః కేచిద్ అమాత్యాశ్చ మహారథాః ॥ 5
ఉపగమ్యాబ్రువన్ దీనాః పాండవాన్ శరణప్రదాన్ ।
గంధర్వులు ఆకాశమార్గంలో మమ్ము తీసికొనిపోసాగారు. ఎంతో దుఃఖం కలిగింది. అప్పుడు మహారథులైన మా అమాత్యులు కొందరూ, మా సైనికులూ కలిసి దీనులై శరణప్రదాతలయిన పాండవులకడకు పోయి ఇలా పలికారు. (5 1/2)
ఏష దుర్యోధనో రాజా ధార్తరాష్ట్రః సహానుజః ॥ 6
సామాత్యదారో హ్రియతే గంధర్వైర్దివమాశ్రితైః ।
ఈ ధార్తరాష్ట్రుని - సుయోధన నరపతిని - సోదర - అమాత్య భార్యా సహితంగా గంధర్వులు అపహరించి ఆకాశమార్గాన వెళుతున్నారు. (6 1/2)
తం మోక్షయత భద్రం వః సహదారం నరాధిపమ్ ॥ 7
పరాభవో మా భవిష్యత్ కురుకాంతలకు ఎట్టిపరిస్థితిలోనూ పరాభవం జరుగకూడదు.(7 1/2)
ఏవముక్తే ధర్మాత్మా జ్యేష్ఠః పాండుసుతస్తదా ॥ 8
ప్రసాద్య పాండవాన్ సర్వాన్ ఆజ్ఞాపయత మోక్షణే ।
వారలా అడుగగానే పాండుకుమారులతో పెద్దవాడు, ధర్మాత్ముడైన ధర్మరాజు తన తమ్ములను అనునయించి, మమ్ము విడిపించమని ఆజ్ఞాపించాడు.( 8 1/2)
అథాగమ్య తముద్దేశం పాండవాః పురుషర్షభాః ॥ 9
సాంత్వపూర్వమయాచంత శక్తాః సంతో మహారథాః ।
అప్పుడు పురుషశ్రేష్ఠులు, మహారథులు ఐన పాండవులు ఆ ప్రదేశానికి వచ్చి, సామర్థ్యానికి లోటులేకపోయినా మంచిమాటలతోనే గంధర్వుల నర్థించారు. (9 1/2)
యదా చాస్మాన్ న ముముచుః గంధర్వాః సాంత్వితా అపి ॥ 10
(ఆకాశచారిణో వీరా నదంతో జలదా ఇవ ।)
తతోఽర్జునశ్చ భీమశ్చ యమజౌ చ బలోత్కటౌ ।
ముముచుః శరవర్షాణి గంధర్వాన్ ప్రత్యనేకశః ॥ 11
భీముడు, బలసంపన్నులైన నకుల సహదేవులు అసంఖ్యాకులైన ఆ గంధర్వుల మీద బాణాలవానలు కురిపించారు. (10,11)
అథ సర్వే రణం ముక్త్వా ప్రయాతాః ఖేచరా దినమ్ ।
అస్మానేవాభికర్షంతో దీనాన్ ముదితమానసాః ॥ 12
అయినా ఆ గంధర్వులంతా యుద్ధాన్ని మాని, దీనులయిన మమ్ములను లాగుతూ, గగనతలంపైకి ఎగిరారు. (12)
తతః సమంతాత్ పశ్యామః శరజాలేన వేష్టితమ్ ।
అమానుషాణి చాస్త్రాణి ప్రముంచంతం ధనంజయమ్ ॥ 13
ఆ సమయంలో నాలుగువైపుల బాణాల వల ఏర్పడింది. అర్జునుడు దివ్యాస్త్రాలను ప్రయోగిస్తూ కనిపించాడు. (13)
సమావృతా దిశో దృష్ట్వా పాండవేన శితైః శరైః ।
ధనంజయసఖాఽఽత్మానం దర్శయామాస వై తదా ॥ 14
అర్జునుని వాడిబాణాలు దిక్కుల నన్నింటినీ ఆవరించగా చూసి, అర్జునుని మిత్రుడు చిత్రసేనుడు ప్రత్యక్షమయ్యాడు. (14)
చిత్రసేనుడు, అర్జునుడు పరస్పరం కౌగిలించుకొని కుశలప్రశ్నలు వేసికొన్నారు. మా క్షేమాన్ని గూర్చి కూడా అడిగారు. (15)
తే సమేత్య తథాన్యోన్యం సన్నాహాన్ విప్రముచ్య చ ।
ఏకీభూతాస్తతో వీరాః గంధర్వాః సహ పాండవైః ।
అపూజయేతామన్యోన్యం చిత్రసేనధనంజయౌ ॥ 16
ఆ ఇద్దరూ కలిసికొని యుద్ధసన్నాహాలను వీడారు. పాండవులు, గంధర్వ వీరులు ఒక్కటైపోయారు. అర్జునచిత్రసేనులు ఒకరినొకరు ఆదరించుకొన్నారు. (16)
ఇతి శ్రీమహాభారతే వనపర్వణి ఘోషయాత్రాపర్వణి దుర్యోధనవాక్యే అష్టచత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 248 ॥
ఇది శ్రీమహాభారతమున వనపర్వమున ఘోషయాత్రా పర్వమను ఉపపర్వమున దుర్యోధనవాక్యమను రెండు వందల నలుబదియెనిమిదవ అధ్యాయము. (248)
(దాక్షిణాత్య అధికపాఠం 1/2 శ్లోకంతో కలిపి మొత్తం 16 1/2 శ్లోకాలు.)